అనుచిత వ్యాఖ్యలకు మద్దతుగా పిల్ వేస్తారా? జర్నలిస్టు విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం

పిల్ ఉద్దేశాలను విస్మరించి రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పి. విజయబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రూ.50 వేలు జరిమానా విధించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ విజయబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు స్వీకరించిన సందర్భంలోనే అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారంటూ వ్యాఖ్యానించిన కోర్టు..  ఈ రోజు విచారణ సందర్భంగా మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అసలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏయే సందర్భాలలో దాఖలు చేయాలో వివరిస్తూ రాజకీయ దురుద్దేశంతో పిల్ దాఖలు చేసిన విజయబాబుకు రూ. 50 వేలు జరిమానా విధించింది. నెల రోజులలోగా ఆ జరిమానాను లీగల్ సర్వీసెస్ అథారిటీలో చెల్లించాలని ఆదేశించింది. ఆ సోమ్మును అంధులు, బధిరుల సంక్షేమం కోసం వినియోగించాలని లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. విజయబాబు పిల్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విజయబాబు తన పిటిషన్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్నవారిపై చర్యలు తీసుకోవల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టే వారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని పేర్కొన్న కోర్టు, అటువంటి వారి కోసం పిల్ వేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది సమాజంలో అణగారిన వర్గాలు కోర్టులను ఆశ్రయించేందుకు తగినంత ఆర్థిక స్థోమత లేని వారి కోసం వేయాలని, అటువంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ఉద్దేశాలతో వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అభ్యంతరకర భాష వాడుతున్నారని , ఈ వ్యాఖ్యలు సమాజంలో నిజాయితీగా, చట్టబద్ధంగా ఉండేవారిని కించపరిచే విధంగా ఉన్నాయనీ వ్యాఖ్యనించిన హైకోర్టు అటువంటి వారికి మద్దతుగా ప్రజా ప్రయోజనవ్యాజ్యం ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాన్ని ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవడాన్ని చట్టం అంగీకరించదని స్పష్టం చేసింది.  సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు నేరమేనని విస్ఫష్టంగా పేర్కొంది.