అవినీతి అనకొండ వల్లభనేని వంశీ.. అరెస్టుకు రంగం సిద్ధం..!
posted on Nov 28, 2024 3:03PM
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్దమైందా? అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. గన్నవరం తెలుగుదేశంకార్యాలయంపై దాడి కేసుతోపాటు.. నియోజకవర్గంలో అవినీతి అక్రమాల కేసుల్లో ఇప్పటికే వంశీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా మరికొన్ని కేసుల విచారణ సమయంలో వాటిలో కూడా వల్లభనేని వంశీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో త్వరలో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వంశీ ప్రోద్భలంతో తెలుగుదేశం నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారు. దీనికితోడు చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబంపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ లెక్క తేల్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో నియోజకవర్గంలో వంశీ, ఆయన అనుచరుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో గత ప్రభుత్వ హయాంలో వంశీ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూలంకషంగా దర్యాప్తు జరుగుతోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ విజయం సాధించాడు. వైసీపీ అధికారంలోకి రావడంతో కొద్దిరోజులకే ఆయన వైసీపీకి అనుకూలంగా మారాడు. వైసీపీ అండతో వంశీ నియోజకవర్గంలో పెద్దెత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ జరపగా నియోజకవర్గంలో వంశీ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో వల్లభనేని వంశీ.. తన వద్ద పనిచేసే డ్రైవర్లు, కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండంతగా విస్తరించి కొండలన్నీ పిండి చేశారు. గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలిసింది. సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేశారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు పెద్దెత్తున మోసాలకు సైతం పాల్పడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్నట్లు, వంశీ కనుసన్నల్లోనే ఆయన ప్రధాన అనుచరుల మోసాల పర్వం కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం అంజయ్య .. గన్నవరం సమీపంలో చంద్రికా అయోధ్య భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం చేసిన కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు నాలుగు కోట్ల రూపాయలను గుర్రం అంజయ్య ఎగ్గొట్టారు. ఆస్తులను విక్రయించి.. నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్లు రామ్మోహనరావు, సతీష్‌లను వంశీ ప్రధాన అనుచరుడు మోసం చేశారని , కాంట్రాక్టర్లు నగదు చెల్లించినా తమకు గుర్రం అంజయ్య సొమ్ములు ఎగ్గొట్టారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తాము తమకు రావాల్సిన సొమ్ము కోసం డిమాండ్ చేస్తే తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోట చెప్పుకో మంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గన్నవరంలోని చంద్రికా అయోధ్య గృహ సముదాయం ఎదుట బుధవారం భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు.ఇదిలా ఉంటే.. తెలుగుదేశం నేతపై దాడి కేసులో గుర్రం అంజయ్య ముద్దాయిగా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా పోలీసులు ఈ ఘటనపైనా కూపీ లాగుతున్నారు. ఈ మోసంలో వంశీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తానికి వైసీపీ హయాంలో అధికార మదంతో విర్రవీగిన వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై చట్టపరంగా చర్యలకు రంగం సిద్ధమౌతోంది. అధికారం అండతో మంచీ చెడూ లేకుండా విర్రవీగి చేసిన అన్యాయాలు, అకృత్యాలకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి తలెత్తింది.