సీబీఐను తప్పుపట్టలేని కాంగ్రెస్ నిస్సహాయ స్థితి

 

కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతోంది. ఇక్కడ రోజుకొక మంత్రిపేరు సీబీఐ చార్జ్ షీటులోకి ఎక్కుతుంటే, అక్కడ రోజుకొక కాంగ్రెస్ నేత పేరు వికీలీక్స్ బయటపెడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధినేతలు డిల్లీ వెళ్లి మొరపెట్టుకోవడం చూస్తే రోలోచ్చి మద్దెలతో మొర పెట్టుకొన్నట్లుంది. సబితా ఇంద్రారెడ్డి వేరే పదవిలో ఉండి ఉంటే, పరిస్థితి బహుశః ఇంత తీవ్రంగా కనబడేది కాదేమో! కానీ, ఆమె నేర నియంత్రణ చేయవలసిన హోంశాఖకి మంత్రిగా ఉండటం వలననే, అదికూడా ఆమెపై సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేయడంతో ఆమె చాలా అవమానకరమయిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

 

ఇక, ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ స్వయంగా ఆమెపై నేరారోపణలు చేయడంతో ఆ ఆరోపణలను కానీ, అవి చేసిన సీబీఐను గానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టలేని నిస్సహాయ స్థితిలో ఉంది. సీబీఐను గనుక తప్పు పడితే, జగన్ మోహన్ రెడ్డి వ్యవహారంలోనూ దానిని తప్పు పట్టవలసి ఉంటుంది. అలాగని దైర్యంగా సీబీఐను సమర్దించి తమ మంత్రిని జైలుకు పంపలేని నిస్సహాయ స్థితిలో ఉందికాంగ్రెస్ పార్టీ.  గానీ, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మీద, అతని సోదరుడు సంజయ్ గాంధీ మీద వికీలీక్స్ చేసిన తీవ్ర ఆరోపణలను మాత్రం “నాలుగు డాలర్లు విసిరేస్తే ఇటువంటి ఎన్ని లీక్సయినా పుట్టించవచ్చు” అంటూ కాంగ్రెస్ పార్టీ వికీలీక్స్ చేసిన ఆరోపణలను గడ్డిపోచాలా తీసి పారేయగలిగింది.

 

ఒకప్పుడు ఇటువంటి ఆరోపణలు వస్తే కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశంలో అన్ని పార్టీలకు భయం ఉండేది. కానీ, మారిన సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో ఎంత పెద్ద ఆరోపణలు, అవినీతి భాగోతాలు బయటపడినప్పటికీ ఎవరూ కూడా ఇప్పుడు భయపడటం లేదు, సరికదా ఎదురుదాడి కూడా చేయగలుగుతున్నారు. ఇదెలా ఉందంటే కొన్నిరోగాలు యాంటీ బయాటిక్స్ ని తట్టుకొనే శక్తిని పెంచుకొన్నాక మామూలు డోసులో మందులు వాడితే అవి తగ్గవు. అప్పుడు మరింత ఎక్కువ మోతాదులో మరింత ఎక్కువ శక్తి గల యాంటీబయాటిక్స్ వాడవలసి వచ్చినట్లే, నానాటికి పెరుగుతున్న అవినీతి రోగాలు కూడా సమాజాన్ని తట్టుకొని నిలడగలుగుతున్నాయి. ఈ అవినీతి రోగాలకి కూడా మరింత కటినమయిన శిక్షలు అమలు చేయగలిగితే తప్ప ఇవి కూడా తగ్గవు.