"నిజం కావచ్చు. నేను మాత్రం వీటికి దూరంగా వుంటున్నాను. కనీసం వుంటున్నానని నా నమ్మకం...పోతే చంద్రాన్ని నేను రికమెండ్ చెయ్యడానికి వేరే కారణమున్నది. అదేమిటో నేను చెప్పడం కన్నా, ఆ పెద్దమనిషి రాసిన ఉత్తరాన్ని నువ్వు చూడటమే మంచిది! అతను నాకు బాగా తెలుసు చంద్రసేఖర శాస్త్రిగారని చిలకలపూడిలో వొకాయనున్నారు. నాకు కూచిపూడి నాట్యం నేర్పిన జ్వాలాపతి లింగశాస్త్రి గారి తమ్ముడాయన. వారి దగ్గరనుండి ఈ "చంద్రం" ఒక ఉత్తరం పట్టుకొచ్చాడు. జ్వాలాపతి లింగశాస్త్రిగారు నాకు తండ్రులవంటివారు శర్మగారూ? రాయిలాంటి నన్ను తీర్చి దిద్దారు. ఈనాటి నా ఔన్నత్యానికి వారే ముఖ్యకారకులు. వారేది అడిగినా నేను కాదన్ను. నాకున్న ఆస్తిపాస్తులన్నీ విడిచి పెట్టి సన్యాసం తీసుకోమని వారంటే, నిస్సంకోచంగా నేనందుకు సిద్దపడతాను" అన్నది మంజరి సన్నగా నిట్టూరుస్తూ. "మనుషుల్లో ఎంత గొప్పవారుంటారో మనం ఊహించలేం శర్మగారూ! నేనిక్కడ స్థిరపడిన తరువాత, జ్వాలాపతి లింగశాస్త్రిగారికి ఐదు వేల రూపాయల డ్రాప్టు పంపించాడొకసారి. దాన్ని తిప్పి పంపుతూ ఆయన రెండు లైన్లు రాశాడు. నేను డబ్బుకోసం నీకు నాట్యం నేర్పలేదు,. నాకన్నా పేదవారికోసం ఈ మొత్తం ఖర్చు చెయ్యి అన్నారాయన. అలాంటివారి పాదదూళిని నెత్తిన....."
"నేన్నిన్ను అపార్ధం చేసుకొన్నాను మేడమ్, చంద్రం బ్రాహ్మణేతరుడన్న కారణంతోనే, మీరు వేషాలిప్పించారని, ఇంతకాలంగా నేను గట్టిగా నమ్మాను....మనస్సులో వున్నదంతా మీ ముందు కుమ్మరించాను. పొరబాటు నాదే!" అన్నాడు శర్మ.
"నాదీ పొరబాటే శర్మగారూ! ఇంతకాలం గా నా ఇంటికి మీ రెందుకు రావడంలేదో, నేను మాత్రం కనుక్కొన్నానా? లేదే! అయితే - జరిగిందేమిటంటే, మనింట్లోవారిని ప్రతి రోజూ మనం స్నానం చేశారా? అన్నం తిన్నారా? - ఆరోగ్యం బావుందా?" అని అడుగుతూ కూచోము, అదే పరాయివారైతే -కాస్త దూరపు బంధువులైతే, పాటికి పదిసార్లు పరామర్సిస్తాం. నా ఖర్మ కాలిపోతే నేను మిమ్మల్ని పరాయివాళ్ళకింద చూడటం మానేసి చాలా రోజులయింది. మీరిది గమనించి సర్దుకుపోవాలి గానీ, బయటివారికి జరిగినట్లు మర్యాదలు జరగడంలేదని గునిస్తే లాభం లేదు."
శర్మ పలకలేదు. అతనికేసి కనుచివర్లనుంచి చూసి కింది పెదవి కొరుక్కున్నది మంజరి.
"ఇంకోసారి కాఫీ-"
"నో థాంక్స్?" అన్నాడు శర్మ.
ఇద్దరూ కౌంటర్ దగ్గరికొచ్చారు. శర్మ ముందుగా బిల్ పే చేశాడు.
మంజరి పలకలేదు.
కారెక్కాక, డోర్ వేస్తూ "అలాచేశారేం శర్మగారూ!" అన్నది మంజరి స్టీరింగ్ ముందు సర్దుకు కూచుంటూ.
"ఏది - ఓ - బిల్ విషయమా?" అని శర్మకూడా నవ్వాడు. "నాదంతా చాలా చిత్రమైన వ్యవహారం మేడమ్! పట్టుమని పది రూపాయలు, ఏనాడూ నా దగ్గరుండవు. కానీ, దేనికీ నేను ఇబ్బంది పడను... నా జాతకం అలాంటిది! ఎవరో ఏజెంట్ నిన్ననే తొంభై రెండు రూపాయలు పంపించాడు....ఇతరులకు కాఫీ ఇప్పించే అవకాశం నా కెప్పుడోగాని దొరకదు. అంచాత - "అని అర్ధాంతరంగా ఆగిపోయాడు శర్మ.
అయిదారు నిమిషాలపాటు ఎవ్వరూ పలకలేదు. మంజరి వస్తున్న నవ్వును ఆపుకొంటూ, ఓ విషయం అడుగుతాను. నిజం చెప్పండి శర్మాజీ" అన్నది.
"ఏమి"టన్నట్లు కళ్ళేగరేశాడు శర్మ.
"మీరు చాలావిషయాలు బయట పడకుండా దాచగలరు కదండీ?"
"కాదా!" అన్నాడు శర్మ.
"అబద్దం, మీరు చప్పున తేలరు. వసంతకూడా మీకు తగ్గదే! అది కూడా నా ముందు వంగి వంగి వేషాలు వేస్తున్నది. చాలా కాలం దాకా మీ చనువు సంగతి నాకు తెలీదు. మొన్న నేనో సందర్భంలో మాట్లాడుతుంటే, మా రాజమణి అక్కయ్య, ఈ రహస్యం కాస్తా బయట పెట్టింది. ఆ పిచ్చిదేమో - నాకీ సంగతి తెలిసీ ఆమోదించి ఊరుకొన్నానని అనుకొంటున్నదిట. అందుకని నేను బయట పడ్డాను గానీ, లేకపోతే, నోరెత్తకనే పోదునని అదిగోలపెట్టింది....నిజమేనా శర్మాజీ?" అన్నది మంజరి.
"నాకేం తెలీదు" అన్నాడు శర్మ.
"నువ్వు భయపడుతున్నావనుకొంటాను శర్మాజీ! నా మనస్సు నింకా నువ్వర్ధం చేసుకోలేదు. వసంతను ఈ లైనులోకి దించడం నిజంగా నాకిష్టంలేదు. మా రాజమణి నా ప్రాణాలు నిలువునా తోడేస్తుంది. అదీగాక - వసంత చాలా అధ్బుతంగా పాడుతుంది. దానిశక్తి సామర్ధ్యాలు, అలా వంటగదిలోనూ పడగ్గదిలోనూ నశించి పోవడం నాకు బాగనిపించలేదు. వసంత ఏం చెయ్యగలదో నేను ప్రపంచానికి చూపించాను. దానికిక పెళ్ళిచేసి, ఏదో ఇంత ఇద్దామనుకొంటున్నాను" అన్నది మంజరి.
శర్మ, అటూ ఇటూ మసలి కూచున్నాడు.
"నాకెందుకో ఈరోజున, మనస్సు చాలా తేలిక పడినట్లనిపిస్తోంది శర్మగారూ! మీతో నాసొదంతా వెళ్ళబోసుకోవాలని పిస్తోంది. మీకేమీ పనిలేకపోతే - ఆఁ హ - అలాకాదు - ఏమన్నా సరే? ఈ పూట నాతో గడిపేయాలి" అన్నది మంజరి -
కారు పోర్టికోలో ఆగింది చలపతి సీట్లోలేడు.
ఇద్దరూ మంజరి ప్రొవేట్ రూంలోకొచ్చారు.
"కాఫీ -"
"వొద్దండీ!" అన్నాడు శర్మ.
"పోనీ, ఎనీ అదర్ డ్రింక్?"
"నో థాంక్స్"
"అయితే కాఫీ తాగండి!"
అయిదారు నిమిషాలకల్లా ఓ పెద్ద వెండి పళ్ళెంలో రెండు కప్పుల కాఫీ తెచ్చి బల్లమీద పెట్టింది తాయారు.
"నమస్కారం బాబయ్యగారూ! ఈ నడుమ మీరు అవుపియ్యనే అవుపియ్య కుంటిరి!" అని పరామర్శ చేసింది తాయారు.
"అయ్య ఊళ్ళో లేడులేవే తాయారూ!" అని సమాధానం చెప్పింది మంజరి.
"నేనూ, అదుగట్టనే అనుకొన్నాను లేరి. ఊల్లుంటే, రాకుండూరుకుంటారూ?"
తాయారు వెళ్ళాక, "ఇలా చాలామంది నన్ను అడుగుతున్నారు శర్మాజీ! వీరందరికీ సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను " అన్నది మంజరి.
శర్మ ఓ గుక్కతాగి, సిగరెట్ అంటించి, మరో గుక్కలో కప్పును ఖాళీచేశాడు.
"నాకొక్కసారి, ఏ రైలుకిందనో పడి ముక్కలు ముక్కలయి పోవాలనిపిస్తుంది శర్మగారూ!"
"ఏం తక్కువయి మేడమ్?" అన్నాడు శర్మ. చిటికెనవేలితో సిగరెట్ నుసి రాల్పుతూ.
"ఏం తక్కువయిందో - నాకు స్పష్టంగా తెలుసు. కానీ, నాకు తెలిసిందాన్ని నేను మాటల్లో పెట్టలేక పోతున్నాను. ఆశక్తి నాకొచ్చినప్పుడు ముందుగా నేను చెప్పుకొనేది మీతోనే" అని ఓ నిముషం సేపు ఆగింది మంజరి.
శర్మ అలానే ఆమెకేసి చూస్తున్నాడు.
"వసంత - వోకరకంగా నాకేమీ కాదు. కానీ, అది నాకు చెల్లెలు, నాకు కూతురు, నాకు వారసురాలు. పూర్వజన్మలో దానికి నేనో, నాకదో, ఎంతోకొంత బాకీ ఉన్నాం. ఈ జన్మలో ఆ రుణవిముక్తి కోసం ఇలా కలిసిపోయామనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక రాజమణి సంగతి సరేసరి! భగవంతుడు నాకో వరంగా రాజమణిని ప్రసాదించాడని నా నమ్మకం. మేం ముగ్గురం అంతగా కలిసి మెలిసి పోయాం....మీ దగ్గర నేను దాచుకోవలసిందేమీ లేదు శర్మ గారూ! వసంతను వోయింటిదాన్ని చేదామనీ, అది బిడ్డల నెట్టుకొని తిరుగుతుంటే కళ్ళారా చూదామనీ, నాకు చాలా కాలంగా ఉన్నది. వసంత, సినిమాలకు పని కొచ్చే మనిషికాదు. వాడెవడో మ్యూజిక్ డైరెక్టర్, దాని చెయ్యి పుచ్చుకు గీరాడుట. అది నలుగురిలోనూ, వాణ్ని ఎడాపెడా పెట్టిందట. నా ముఖంచూసి, వసంతను అతగాడేమీ అనలేకపోయాడనుకోండి! ఇలాంటి పిచ్చికొయ్య, ఈ ఫీల్డులో పైకొస్తుందంటారా మరి! ఒక్కనాటికి నేన్నమ్మను...నా సంగతి వేరు. ఇష్టమున్నా లేకపోయినా, ఊ కూపంలోంచి బయటపడలేను. ఆయువున్నంతకాలం ఇందులోనే చావాలి. మరో తరుణోపాయం లేదు. మరి - మీ అభిప్రాయమేమిటో చెప్పండి" అన్నది మంజరి.
"ఏ విషయంలో?" అన్నాడు శర్మ.
"వసంతకు పెళ్ళి-"
"తప్పకుండా చెయ్యండి!" అన్నాడు శర్మ. కాళ్ళూపుతూ.
"వసంతను చేసుకోవడానికి, కో అంటే కోటిమంది దూకుతారు. దాన్ని మూడేసిసార్లు బంగారంతో తూచగలిగినవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్థులూ వస్తారు. కానీ దానికీ వ్యవహారాలేమీ నచ్చినట్లు కనిపించడంలేదు శర్మాజీ! మా రాజమణి నడిగితే, అది మీపేరు చెబుతున్నది. నాతోకన్నా మారాజక్కతో వసంతకు చనువు జాస్తి గదా మరి! రాజక్కయ్యామాట అన్నదంటే అది నిజమే అయివుండాలే!"
కాసేపు విని, శర్మ సన్నగా నవ్వాడు.
"!మీకైనా కులాల పట్టింపులున్నాయనుకోను.... అయినా, మా దరిద్రాన్ని చూసి, మిమ్మల్ని దూరంగా తోసిన మీ కులం మీ దగ్గరున్న డబ్బును చూసి, దగ్గరకు జరుగుతుంది శర్మగారూ! ఈరోజుల్లో కులం లేకపోయినా బ్రతకొచ్చుగానీ, డబ్బులేకపోతే బ్రతకలేరు. నాకేపాటి ఆస్తి పాస్తులున్నాయో మీకు తెలిసిందే! పెళ్ళి సమయంలో సగం వసంతకు దాని భర్తకూ కలిపి రాసిస్తాను. నా తదనంతరం మిగిలిన సగం, వసంత పిల్లలకుగానీ, అప్పటికి పిల్లలు లేకపోతే, సగంలో సగం ఓ అనాధశరణాలయానికి, మిగిలిన భాగం ఏదన్నా విద్యాలయానికి రాసిపడేస్తాను. ఏ కారణం చేతనన్నా వసంతా, దాని భర్తా విడిపోవలసి వస్తే వారికిచ్చిన ఆస్తిలో చెరిసగం, పంచుకొని విడిపోవాలన్న షరతుకూడా చేరుస్తాను."
"మీరలా ఇప్పుడె అంపకాలు చేస్తున్నారేమిటి?" అన్నాడు శర్మ.
"ఏం లేదు శర్మాజీ, అన్ని రోజులూ మనవిగావు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే ముద్దూ ముచ్చటా తీర్చుకోవాలనిపించింది.... ఇవ్వాలికూడా. ఈ స్థితిలో మనం ఉన్నాం. రేపిదే వేళకు ఏం జరుగుతుందో మనం ఊహించలేం, మీరుండక పోవచ్చు. హఠాత్తుగా గుండె పోటోచ్చి నేనే దాటిపోవచ్చు. ఏ భూకంపమో వొచ్చి, ఈ భవనమంతా నాశనం కావచ్చు. చెప్పలేం!" అన్నది మంజరి......
తలుపుకొద్దిగా తెరచి, ఎవరో లోపలకు తొంగిచూసి, ఠక్కున తలుపు మళ్లా కదనొక్కారు.
"ఎవరది?"
తలుపు వెనక గాజులు కదిలిన చప్పుడయింది.
"రావమ్మా వసూ! ఇక్కడ పరాయి వారెవ్వరూ లేరు."
వసంత తలవంచుకొని లోపలికొచ్చింది. శర్మ కేసి తిరిగి ఏది అనబోయి, మానేసి "నమస్కారం" అని కూచున్నది.
"నా ప్రాణాలు, ఈ శర్మకోసం నిలువునా తోడేశావు వసంతా. అదేదో కధలో చెబుతారే - ఫలానా రాజ కుమారుడు, సప్త సముద్రాల కవతల, కాకులు దూరని కారడవుల్లో, చీమలు దూరని చిట్టడవుల్లో, ఊడల మర్రితొర్రలో గండభేరుండ ప....అక్ష తర్వాత జ్ఞాపకం లేదు నాకు- అక్కడిదాకా వెళ్ళి తీసుకొచ్చాను" అన్నది మంజరి.
వసంత, అక్కకేసి వొ సారి చూసి, సర్మవేపు తిరిగి నవ్వి తలొంచుకున్నది.
"ఈ మధ్య ఇటుకేసిరావడమే లేదు...." అన్నది వసంత బెరుకుగా.
"దాదాపు అయిదారు నెలలనుండి ఈ పుణ్య పురుషుడు మనింటికి రావడంలేదు వసూ! ఎందుకు రావడంలేదంటే పలకడు. అదేమిటయ్యా అంటే, "ఆ కారణాలుమీకు చెప్పేవి కాదులెండి" అన్నాడు. సరే ఆ పనేమిటో మా అమ్మాయే చూసుకొంటుందని, నిన్ను పిలిపించాను. పిల్లా ఇదీ సంగతి. నానా చేరాలూ పడి, ఈయన్ను పట్టుకొచ్చి నీకప్పగించాను. మళ్లీ పారిపొయ్యాడంటే, వెదుక్కు రావడం నా వాళ్ళ కాదు. కాళ్ళకు సంకెళ్ళే వేస్తావో, గదిలో బెట్టి తాళాలే బిగిస్తావో నీయిష్టం" అన్నది మంజరి.
శర్మ ముఖం విప్పారింది. అతని కళ్ళు వింత కాంతితో మిలమిలలాడసాగాయి. సిగ్గుతో పెదవులు తడిచేసికొంటున్నాడు.
"అలాగే - అంత అమాయకంగా ముఖం పెట్టే, మా వసంతను మైదుచేసి ఉంటారు శర్మాజీ మీరు....మా పిచ్చిదేమన్నా అనుకొని పోతుందని గానీ, లేకపోతే, ఆ రెండు బుగ్గలూ అలా పిండేసి బూరెలొండి పెట్టేదాన్ని."
"బూరెలొండటం నాకూ చాతవుతుంది" అన్నాది వసంత.
"అంటే - బుగ్గలు పిండటం కూడా నన్నమాట" అన్నది మంజరి నవ్వుతూ.
శర్మ అప్రయత్నంగా తన చెంపలను అరచేతుల్లో దాచుకొన్నాడు.
"శర్మగారు ఇక్కడే భోంచేస్తారు కేసూ! ఇవ్వాళేదో సినిమాకు పోతానన్నావు కదూ! టైముంటే మాటినీకి వెళ్ళండి...నీకారింకా రిపేరయి రాలేదనుకుంటాను. క్రిజ్లర్ నాకుంచు, ప్లిమత్ నువ్వు పట్టుకుపొ....శర్మగారు ఫ్యూరీ వెజిటేరియన్ - అదేదో చూసి."
వసంత లేచి నిలబడింది. శర్మ ఇంకా కూచునే ఉన్నాడు.
'రండి' అన్నట్టు సైగ చేసింది వసంత.
మంజరి తనను గమనిస్తున్నదీ లేనిదీ వోసారి చూశాడు శర్మ. ఆవిడేదో పేపరు చాడువుకొంతున్నది. శర్మ మెల్లగా లేచి, నాలుగడుగులు వేశాడు. వసంత అతనికి తగిలేంత దగ్గరగా వచ్చి "నన్ను మరచి పోయారా?" అన్నది మెల్లిగా.
శర్మ ఆవిడ ముంజేయి పట్టుకొని మెత్తగా నొక్కాడు.
వసంత బుంగమూతి పెట్టి విదిలించి పారేసింది!
"కోపమా?" అన్నాడు శర్మ ఆవిడ చెవులో.
"ఊఁ ఫోదురూ.....పాపమనీ, నేను చెప్పాను."
అన్నదే గానీ, శర్మ చెయ్యి పట్టుకొని, గబగబా ఆ గదిలోంచి బయటికి లాక్కుపోయింది.
వారు పోయాక, పోరి పోరి నవ్వింది మంజరి. ఒక దశలో, ఆవిడకు గుండెలు డెక్కు పడతాయని కూడా అనిపించింది. కిందికి ఫోను చేసి, చలపతిని పిలిచింది. అతను వస్తూనే నేలనంటి సలాములు చేసుకొంటూ వచ్చాడు. మంజరికి, అల్లంత దూరంలో చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
"ఏమిటీ అభినయమంతా?" అన్నది మంజరి, కాస్త ఆశ్చర్య పడ్డట్లు ముఖంపెట్టి.
"నా అసమర్ధతను ఇంకోసారి నీముందు వొప్పు కుంటున్నాను మంజూ! ఈ ప్రపంచంలో , ఇకముందు కూడా నీకు అసాధ్యమన్నది లేనేలేదు. నీ ముఖం చూడక పోవడమే కాదు, నువ్వున్న వీధిలోకి కూడా అడుగు పెట్టనన్నాడు శర్మ. అంతగా అవసరమొస్తే, ఏ బండికిందనో పడి చూస్తానుగానీ, మంజరిని చూడటమనేది మాత్రం అబద్దమని స్పష్టంగా చెప్పాడు."
"నాతోనూ చెప్పాడు" అన్నది మంజరి.
"చెప్పినవాడు ఎలా వచ్చాడుట మరి?" అన్నాడు చలపతి.
"ఆ సంగతి సర్మనే అడుగు" అన్నది మంజరి.
చలపతి ఓ నిముషం ఆలోచించి తల ఆడ్డంగా తిప్పాడు.
"లాభంలేదు శర్మగారి నడిగినా, అతను చెప్పాడు., చెప్పలేడు. ఎందుకంటే, ఎక్కడినుండి తన పట్టుదల, ప్రతిజ్ఞ, బీటలు తీశాయో, అతనిప్పుడు గుర్తించలేడు. అతనొక్క మాయా ప్రపంచంలో నుంచి నిద్రపుచ్చి ఉంటావు. ఏమంటాడు ఇన్నిటికీ?"
"నిద్ర పుచ్చానంటున్నావు గదా! అతన్ని మేలుకోనివ్వు మరి!" అన్నది మంజరి. "ఇప్పుడె అతనూ, వసంతా అలా వెళ్ళారు. బహుశా సినిమాకు గానీ ఏమన్నా పోతారేమో నాకు తెలీదు."
"మన ప్లానంతా చెప్పావా?" అన్నాడు చలపతి ఆతృతగా!
"మన ప్లానా? అంటే?" అని క్షణం ఆలోచించి, అప్పుడే ఆలోచన వచ్చినదాని లాగా, భుజాలు కుదుపుకొన్నది మంజరి. "నువ్వన్ని చోట్లా ఇలానే అంటున్నావా చలపతీ!"
ఇందులో ఉన్న తప్పేమిటో చలపతికి తట్టలేదు. వెర్రి ముఖం వేసుకొని మంజరివైపు చూశాడు.
"ఇది మన ప్లానుకాదు. నీ ప్లాను. అంటే! నా అంతట నేను ఫారిన్ టూర్ కోసం ప్రయత్నిస్తున్నానని తెలియకూడదు" అన్నది మంజరి.
"ఇలాంటి భారీయత్నాలు, ఇంకో కంటివాడికి తెలియకుండా దాచడం అసంభవం!" అన్నాడు చలపతి.
"నీకెలా అర్ధమవుతుందో నాకు తెలీడంలేదు చలపతీ!" అని నిట్టూర్చింది మంజరి. చేసేది - నీవూ, ఆ శర్మగాడూ, కలిసి చేయండి. నీకు సాయంగా ఉండాలనేగదా, వాణ్ని పనిమాలా తీసుకొచ్చి ఇక్కడ పడేసింది! రంగంమీద నేనెక్కడా కనిపించకూడదు. .... ఇదేదో నాకు తెలియకుండా, అంతా ఎవరెవరో కలిసి, ఏర్పాటు చేసినట్లు, నేను కాదనలేక, ఇందుకు వొప్పేసుకొన్నట్లూ, బయటి వారికి బోధపడాలి. ఇంతేగానీ -అ ఆ దగ్గనుండి
హక్షలవరకూ, అన్నీ నేనే స్వయంగా చేసుకొన్నానని తెలిస్తే అప్పుదింత గ్లామర్ ఉండదు."
"అవును" అన్నాడు చలపతి.
"మనకిక ఎక్కువ టైం లేదు. పని త్వరగా ప్రారంభించాలి.....అరె....అదేమిటి చలపతీ! ఏమిటలా చూస్తున్నావ్?" అన్నది మంజరి నవ్వుతూ.
"నేను ఎంతదాచుకొందామన్నా దాచుకోలేక పోయాను మంజూ? ఈ రోజున నువ్వెంత అందంగా ఉన్నావంటే అలా నీ వేపు చూస్తూ, ప్రాణాలు వొదిలేయాలనిపిస్తోంది." అన్నాడు చలపతి.
ఏమనుకొన్నదో ఏమోగానీ, మంజరి లేచి, అతని దగ్గరగా వచ్చి చెయ్యి ముద్దు పెట్టుకొన్నది.
"అతిచనువు వల్లనేమో, నేను మీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. అది తలుచుకొని ఆ తరువాత నేనెంతకాలం గుండెలు చచ్చిపోయేలాగా ఏడ్చానో ఆ భగవంతుడికి తెలుసు.... అమ్మా.... ఇప్పుడు కాదు... నన్నొదులు...." అన్నది మంజరి.
చలపతి బుసలుకొడుతూ ఆమె చేతిని విడిచిపెట్టాడు.
26
రెండు మూడు రోజులపాటు శర్మగారు అయిపూ ఆనామాలు లేడు. వసంత కూడా పత్తాలేకుండా పోయింది.
"వాళ్ళేమయ్యారు?" అని మంజరి అడగనూలేదు. రాజమణి సమాధానం చెప్పనూలేదు.
ఇది ముందుగా ఇద్దరూ అనుకొని చేసిందే!
ఎప్పటికప్పుడు వసంత నుండి సమాచారం అందుతూనే వుంది. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని, మంజరి తగిన సూచనలు పంపుతూనే వుంది.
ఒకసారి వసంత మాట్లాడుతూ మాట్లాడుతూ వారూ నేనూ ఇప్పుడె పోట్లాడుకున్నాం. ఆయన అలిగి అలా వెళ్ళిపోయారు." అన్నది ఫోన్ లో.
మంజరికి ప్రాణాలు పోయినంత పనైంది. ఆవిడ ముఖంలో గోతి గాటుకు నెత్తురు చుక్కలేదు. పొడారిపోయిన పెదవులను, మెల్లగా స్వాధీనంలోకి తెచ్చుకొని.
"అదేం వసూ! ఎందుకలా చేశావమ్మా?" అని మాత్రం అనగలిగింది మంజరి.
"నేనెంత రాజీపడదామన్నా ఆయన తనపట్టుదలే నెగ్గాలని కూచున్నాడు. నేను వల్లకాదంటే కాదన్నాను...."
మంజరి సన్నగా నిట్టూర్చి, కుర్చీకి చేరగిలి పడిపోయింది. ఆవిడ కళ్ళు నీటితో నిండి పోయాయి. తనెన్నో ఆలోచించి, ఎంతదూరం ఆలోచించి, శర్మను పిలుచుకొచ్చింది. వసంతను తోడు చేసి, రవంత "సేద" దీర్చమన్నది. ఈ పిచ్చిముండ అంకెకొస్తున్న మనిషిని అదిరించి దూరం వెళ్ళగొట్టింది! మళ్లా ఆ గొడ్డును కళ్ళంలోకి లాక్కు రావడమంటే మాటలా?
"అసలేం జరిగింది వసూ! ఎందుకలా తొందర పడ్డావమ్మా! నేనన్ని సంగతులూ నీతో ముందుగా చెప్పానుగదా! చేతులారా నోటిదగ్గర కొచ్చిన ఫలితాన్ని మట్టిపాలు ___"
అవతల నుండి వసంత నవ్వు వినిపించి మరీ మండిపోయింది మంజరి.
"ఎందుకలా బెంబేలు పడిపోతావక్కా! శర్మను ఎంతగా వంగదీశానంటే - ఇంతకు ముందే వాడు నా శాండిల్స్ పట్టుకెళ్ళి పాలిష్ చేయించుకొన్నాడు."
"మరి -?" అన్నది మంజరి.
"వచ్చే మాసంలో మంచి లగ్నాలున్నాయి గదా! మేం పెళ్ళిచేసుకోబోతున్నాం. రిజిస్టర్ మారేజ్ కి ఆయన వొప్పుకోలేదు. నాకంత కన్నా ఇష్టంలేదు. మామూలు పెళ్ళే చేసుకొంటాం. ఆడయార్ లో ఉన్న బిల్డింగ్ కింద నిన్నడిగి తీసుకొని అందులో మా కాపురం పెడతామన్న మాట. వారేమో, ఇప్పటి పత్రికను వారపత్రికగా మార్చేసి, నడుపుతారు. నేను వారికి అన్ని విషయములలోనూ సహధర్మ చారిణిగా ప్రవర్తించి, భారత నారీ ప్రపంచమునకు ఆదర్శ మహిళనై....అదుగో వారొస్తున్నారు. పెట్టేయనా?" అన్నది వసంత.
"ఇద్దరు వోసారి రండి" అన్నది మంజరి.
ఆమె తలంతా నాదులో నిండిపోయింది. కణతలు కటకటలాడిపోతున్నాయి. శరీరం, ఎముక ఎముక మధ్యనా, సన్నని, నొప్పితో విలవిల లాడుతోంది ఎంత ఆపుకొందామన్న ఆగకుండా, ఉప్పని నీరు నోట ఊరుతున్నది.
చిహ్నాల పర్యవసానం తనకు తెలుసు. అప్పుడెప్పుడో తనకిలాగే జరిగితే - కళ్యాణి దగ్గరుండి తనకు చికిత్స చేయించింది. ఇప్పుడు మళ్లా ఆ ఉపద్రవం దాపరించింది. దీన్ని తను ఆదిలోనే తెంచుకోవాలి. తీరా నెత్తిమీద కొచ్చాక తను చేయగలిగిందేమీ లేదు. డాక్టర్నడిగితే అవే బిళ్ళలు వాడమంటాడు. తను వాడుతూనే ఉంది- కానీ -ఫలితమేదీ మరి?
దీనికి తోడు, చలపతి గాడు, మరీ రెచ్చిపోతున్నాడు. అదను చూచి నొక్కిపారేసే తుచ్చగుణమంటే ఏమిటో, అదెలా మనుషుల్ని రాక్షసులకింద మారుస్తుందో ఈ చలపతిని చూస్తే బోధపడుతుంది. మొన్న మొన్నటివరకూ తను కూచోమన్నా కూచోవడానికి భయపడ్డ మనిషి - కళ్యాణి చావడంతో దగ్గరకు జరిగాడు. తనే జరగనిచ్చింది. ఈ అంతర్జాతీయ ఫిలిం ఉత్సవాల గొడవతో, వాడికిక పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వాడి సాయం లేకుండా, తనీపోటీలో గెలవడం అసంభవం! చలపతిని సాయం చెయ్యమనడమంటే వాడడిగిన రతులన్నింటికీ వొప్పుకోవడమన్న మాటే!
"ఎవరది? అన్నది మంజరి. తలుపుదగ్గర అడుగుల చప్పుడు విని."
"నేనే!" అంటూ లోపలికొచ్చాడు చలపతి. "అలా ఉన్నావేమిటి" అని పలకరించాడు మంజరిని.
"ఎలా?"
"బాగా డస్సినట్టు కనిపిస్తున్నావేం?"
మంజరి నవ్వింది.
"ఎందుకు డస్సిపోయిందీ నీకు తెలీదా? లేకపోతే, నా నోటి మీదుగా చెప్పించాలనా?" అన్నది మంజరి.
చలపతి, ఆమె ప్రక్కనే కూచున్నాడు. మంజరి అతని భుజం మీద తల ఆనించింది!
"ఈ గొడవలన్నీ వొదులుకొని, మనుషుల్లేని ఏ మహారణ్యం లోకో వెళ్ళిపోదామని ఉంది చలపతీ!" అన్నది మంజరి.
"పద, నేనూ వస్తాను" అన్నాడు చలపతి, ఆమె ముంగురుల్ని మెల్లిగా ప్రక్కలకు సర్దుతూ.
"వొద్దు బాబూ వొద్దు. అక్కడా మీరే అయితే -నేనసలు అక్కడ దాకా పోవడం మాత్రం ఎందుకట?" అన్నదావిడ ఆవలిస్తూ.
"నిద్ర చాల్లే దనుకొంటాను... పోనీ నువ్వు కాస్సేపు కళ్ళు మూసుకో నేను మళ్లా వస్తాను. పెద్దగా చూడవలసిన ఉత్తరాలు కూడా లేవు."
"సగం నిద్రను నువ్వు పాడు చేశావు. ....మిగతా సగం నిద్రనూ, జ్ఞాపకాలు పాడుచేశాయి. .... నువ్వు వెళ్ళబోకు, ఒంటరిగా ఉండేదుకు మరీ భయం గా ఉన్నది. మనుషులు మధ్యనయితే, ఏదో ధోరణిలో పడి, కొట్టుకుపోతాం" అన్నది మంజరి.
"ఇలాంటి దానివి, మనుషుల్లేని మహారణ్యాల్లో ఎలా ఉంటావమ్మా?"
"ఉండను. ఉండలేను చలపతీ!" అన్నది మంజరి. తన బరువంతా అతనిమీద ఆన్చుతూ. "అలా ఉండలేనన్న సంగతి నీకూ తెలుసు. అందుకే నువ్వు వొస్తానన్నావు...." అని క్షణకాలమాగి, "నా గురించి నీకన్ని సంగతులూ తెలుసుగదూ చలపతీ?" అన్నదావిడ.
చలపతి పలుకలేదు.
ఆవిడ తలను గుండెల కత్తుకొని 'పిచ్చిపిల్లా' అనుకొన్నాడు లోపల.
మంజరి కళ్ళు మూసుకొనే ఉంది.
"నాటకాల్లో, అందిన వేషాలన్నీ వేస్తూ రంగులన్నా కడుక్కోకుండా, పరదాల చాటున నిద్రపోయిన సందర్భాలున్నాయి -ఈ రోజున ఎంత హీనంగా చూసుకొన్నా - లక్షలకు సరిపడా ఉన్నది నాకు. ఈ మధ్య కాలంలోని ప్రయాణమంతా, నీ భుజాలెక్కి చేశాను.... నువ్వే లేకపోతే, ఏమయి ఉందునో ఊహించడానికే భయమేస్తోంది చలపతీ!"
"నేనున్నాను గదా!" లేకపోతే "అన్న ప్రశ్నకే అవకాశం లేదు. అయినా ఇంకో సంగతి కూడా ఉన్నది మంజూ! ఒకరి అదృష్టానికి ఇంకొకరెప్పుడూ కర్తలు కారు. నువ్వు పైకిరాగలిగిన మనిషివి. తప్పకుండా పైకి పోతావు. నేను గాకపోతే, ఇంకో పుల్లాయెవడో వస్తాడు అంతే!" అన్నాడు చలపతి.
మంజరి చాలాసేపు మాట్లాడలేదు.
"నేను - నాకు- ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంటుందంటావా చలపతీ!" అన్నది మంజరి మెల్లిగా.
"తప్పకుండా వెడతావు. నేను నిన్ననే పరబ్రహ్మశాస్త్రిగారిని కలుసుకొన్నాను. మన ప్రయత్నాలేమవుతాయని అడిగాను.
"ఏమన్నారు?" అన్నది మంజరి. కళ్ళుమూసుకునే?
"ఆయనగారు పక్కా రెండు గంటలసేపు చక్రాలు వేసి చూశారు మంజూ! భవిష్యత్తు స్పష్టంగా తేలడంలేదనీ, ప్రయత్నం వల్లకార్యం సానుకూల పడవచ్చుననీ చెప్పారు. తిరుపతి వెంకన్నకూ, సాయిబాబాకు, మ్రొక్కుకోమన్నాడు. పూజదగ్గర కుంకుమ,, అక్షితలు నీకిమ్మని పొట్లం గట్టిచ్చాడు!"
"ఒకపని ఏదో వొక వొడ్డున పడితే తప్ప, అటూ ఇటూ కాకుండా ఉంటే నాకు మహా చిరాకు. కప్పల తక్కెడ తంతు నాకు బొత్తిగా గిట్టదు చలపతీ! ఆ అవకాశం వస్తే సరే - రాదని స్పష్టంగా తేలినా సంతోషమే! కానీ ఇలా మధ్యలో ఇరుక్కొని మల్లాగుల్లాలు పడటమంటే నాకు అరికాలు మంట నెత్తికెక్కుతుంది!"
"అసలు మనమింకా ఏ ప్రయత్నమూ చెయ్యనే లేదు" అన్నాడు చలపతి.
"నీ ముఖం!" అనుకొన్నది మంజరి. "ఏనాడో ప్రారంభమయిందిరా నా చిన్ని తండ్రీ! ఇదంతా అందులోని భాగమేరా నాయనా!" అనుకొన్నదావిడ.
"అవును, ఇంకా ప్రారంభం కాలేదు. ఏమవుతుందోనని నేనెంత బెంగపడుతున్నానో చలపతీ!"
చలపతి ఏదో అనబోయాడు. తలుపు తీసుకొని వసంతా, శర్మా వచ్చారు. మంజరి చప్పున అల్లంత దూరాన జరిగి కూచున్నది.
"ఏం శర్మాజీ అలా ఉన్నారేం?" అని కుశలమడిగింది మంజరి.
"మీ వసంత నన్ను తినేస్తోంది మేడమ్. తినడమంటే - అక్షరాలా తి-న-డ-మే-! ఇలాంటి దయ్యాన్ని నా మెడకు అంటగట్టడం కన్నా అన్యాయం మరొకటుండదు" అన్నాడు శర్మ.
'అయితే నీకు తగిన శిక్షే ఎన్నిక చేశానంటావు' అన్నది మంజరి.
వసంత అటూ ఇటూ చూసి, శర్మను మోచేత్తో సున్నితంగా పొడిచింది. శర్మ ఇంకోసారి మతి పోగొట్టుకొన్నాడు.
చలపతి - పదినిమిషాలకన్నా వాతావరణాన్ని మార్చేశాడు.
"చెప్పండి?" అన్నాడు శర్మ.
"ఇందులో వొకళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకొకళ్ళు చేసేవాళ్ళూ అంటూలేదు. ఇదివరకు సంగతి ఏమయినా, ఇప్పుడి దొక కుటుంబ సమస్య కిందకు వొచ్చింది. మనం మంజరిని విదేశాలకు పంపించగలమా? లేదా? అనేది ఇప్పుడు ముఖ్యం!" అన్నాడు చలపతి.
శర్మ చాలాసేపు ఆలోచించి, "చెయ్యమనుకొంటాను" అన్నాడు.
"ఎలా?" అన్నాడు చలపతి.
"ఏ దేశం వెళ్ళాలనుకొంటున్నాయో, ఆ దేశపు రాయబార కార్యాలయంతో మనకు మంచి సంబంధాలుండాలి. వారు మన పేరున తమ ప్రభుత్వానికి సిఫారస్ చేయాలి" అన్నాడు శర్మ.
"చేసినా - ఆ గవర్నమెంటు వొప్పుకోలేదనుకోండి" అన్నది మంజరి.
"అలా జరగదు మేడమ్! ఎక్కడో వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఒక దేశ ప్రభుత్వానికి మనల్ని గురించి తెలుసుకోవడానికున్న మార్గం తన రాయబారు కార్యాలయం పంపిన రిపోర్టే. ఆ రిపోర్టు సరిగ్గా లేనప్పుడు తప్ప, ఆ దేశం ప్రపోజల్ ను కాదనదు. సరిగ్గా లేకపోవడమన్న ప్రసక్తి కూడా ఉండదనుకొంటాను. వారికి నిజంగా ఇష్టమయితే, మన పేరు పంపుతారు. లేకపోతే మానేస్తారు" అన్నాడు శర్మ.
"మన కా వ్యవహారాలన్నీ తెలియవే!" అన్నాడు చలపతి.
"తెలియవలసిన అవసరం లేదు. మంజరి గారికి బొ,బొంబాయి లోని, ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు చాలామంది తెలుసు. ఫిలిం ఫైనాన్సార్ చాలామందికి రాజకీయ నాయకులతో పరిచయాలుంటాయి. కాస్త పేరు ప్రతిష్టలున్న పార్లమెంటు మెంబర్లను పట్టుకొని పని జరుపుకోవచ్చు, లేదా - చాలా దేశాల తాలూకు కాన్సులేట్లు మద్రాసులో కూడా ఉన్నాయి. ఇక్కడి కాన్సులేట్ జనరల్ ద్వారా ప్రయత్నం చేయవచ్చు."
మంజరి ముఖం విప్పారింది.
"ఇక్కడివాళ్ళు మీకెవరన్నా తెలుసా శర్మాజీ?" అన్నది మంజరి మామూలుగా.
"తెలుసుననుకోండి, అయితే ఆ పరిచయాలు ఇలాంటి పనులు సాధించడానికి చాలవు మేడమ్! ఇలాంటి వ్యవహారాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. విషయం అతి రహస్యంగా ఉంచడం కాదు. మన ప్రతి అడుగునూ, ఆచి తూచి వేయాలి. ఎక్కడ బెసికినా మొత్తం వ్యవహారం కుప్పకూలి పోతుంది. అందుకని - మీరు ప్రయత్నించండి" అన్నాడు శర్మ.
"ఓ సారి కాన్సులేట్ జనరల్ ఇంటికిపోయి వద్దాం. కొంత వరకూ -"
"సరే! ఏదో ఆలోచిద్దాం!" అన్నాడు శర్మ. వాక్యాన్ని మధ్యలోనే తుంచివేస్తూ.
ఓ క్షణం శర్మకేసి చూసి, తల పంకించింది మంజరి.
"ఏం వసూ! నీకిదంతా అడివి మేళంలాగా ఉన్నది గదూ -"
"మరే!" అన్నది వసంత.
"వేళయిందిగదా! అన్నానికి లేవరాదా?" అన్నది మంజరి చలపతికేసి చూస్తూ.
అతను లేచాడు. వసంతా లేచి నిలబడింది.
"నా కిప్పుడవసరం లేదు, నేను తరువాత చేస్తాను" అన్నాడు శర్మ.
వారు వెళ్ళిపోయాక.
"చెప్పండి!" అన్నది మంజరి.
"ఇవన్నీ డొంక తిరుగుడు వ్యవహారాలు మేడమ్. ఇంతలో తేలేవి పెట్టేవి గావు. మనం సిన్సియర్ గా చేయదలచు కొన్నప్పుడు ఇంతకన్నా దగ్గరదోవ ఉన్నదేమో చూడాలి" అన్నాడు శర్మ.
"అదేదో నాకు తెలియదు. దీని బరువూ, భారమూ మీ మీద పెడుతున్నాను శర్మగారూ! గెలిచినా వోడినా మీరే బాధ్యులు." అన్నది మంజరి.
శర్మ కాస్సేపు ఆలోచించాడు. కింది పెదవి కొరుక్కుంటూ అతని కళ్ళిపుడు కాంతితో నిండిపోయాయి.
"భగవంతుని మీద బారం వేసి ఇంకోపని చేదాం... ఇంత కన్నా మంచి పని నాకు తోచటం లేదు..." అన్నాడు శర్మ. సిగరెట్ పెదవుల మధ్యనుంచుకొని.
మంజరి లైటర్ తో అతని సిగరెట్ వెలిగించింది!
"ఏమిటంటే -"
అని ప్రారంభించాడు శర్మ.
మంజరి గడ్డంకింద రెండు చేతులు పెట్టుకొని వినసాగింది.
"దేశ దేశాలనుండి వచ్చే ప్రతినిధులకు వసతి సౌకర్యాలు చాలా భారీ ఎత్తున ఉండాలి. అందరికీ ఒకచోట వసతులు చూపించడం సాధ్యమయ్యే పనికాదు....మనం పోదలుచుకున్న దేశం తాలూకు ప్రతినిధి వర్గానికి మనింట్లో ఆతిధ్యమిద్దాం. అలా చెయ్యడానికి ముందు - మనం ఇక్కడి కాన్సులేటు జనరల్ ను కూడా సంప్రదించాలి. అవసరమయితే ఆ వారంరోజులు అతను కూడా మనతో బాటే వుంటాడు. ఈలోగా మనం అతన్ని కలుసుకొని మాట్లాడుదాం. మరోసారి బొంబాయి నుండి ఎవరెవరు వస్తున్నారో కనుక్కోండి. ప్రెస్ వారితో మనకు చాలా పనులున్నాయి. ప్రెస్
కరస్పాండెంట్సుకు మనం - హోస్తుగా వుండగలిగితే - ఇంకా బావుండును. కానీ, అది సాధ్యమవుతుందనుకోను. మనం ఈ ఉద్దేశంతో ఈ పనులన్నీ చేస్తున్నామని ఇంకెవ్వరికీ తెలియకూడదు. చాలా పనులు పూర్తయిందాకా ఇంకో ప్రాణికి తెలియకపోవడం అవసరం. మీకు ఈ సంగుతులన్నీ తెలియనివి గావు" అన్నాడు శర్మ.
మంజరి లేచి నిలబడింది. శర్మా లేచాడు. ఆవిడ రెండడుగుల్లో శర్మను కలుసుకొని, అతని చెంపలను అరచేతులతో రాసి, మెటికలు విరుచుకొన్నది. ఎనిమిది వేళ్ళూ చిటపటమంటూ విరిగాయి. అలానే అతని తలను దగ్గరకు తీసుకొని, 'ఢిక్కీ' ఇచ్చింది మంజరి.
"నిన్ను చూస్తే అమాంతం కొరుక్కుతిందామనిపిస్తున్నది శర్మా! ఇంత చిన్న తలకాయలో ఇన్ని ఆలోచన లెలా పుడుతున్నాయో నాకు బోధపడకుండా ఉన్నది. ఇన్ని రోజులనుంచి నాకీ వ్యవహారం శుద్ద అయోమయంగా ఉన్నది. ఓ దారీ డొంకా కనిపించింది కాదు. నేను బొంబాయి పోలేను. ఢిల్లీ అంతకన్నా పోలేను. మనం చెయ్యగలిగిందేదో ఇక్కడే ఉండి చేద్దాం....సాయంత్రం కాన్సులేటు జనరల్ ను కలుసుకుందామా?" అన్నది మంజరి.
"ముందుగా అడిగి చూడాలి. వాళ్ళకు లక్ష పనులుంటాయి."
"అయితే చూడు మరి!"
శర్మ ఫోను చేసి కనుక్కొన్నాడు.
"ఈరోజు తీరదన్నాడు. రేపు ఉదయం ఇంటి దగ్గర కలుసుకోమన్నాడు."
"ఎక్కువ టైం లేదు" అని చప్పరించేసింది మంజరి.
"ఈలోగా మనకేమీ పనిలేనట్లు మాట్లాడతారేం మేడమ్! నా పత్రికకు మేటర్ రాసి ప్రెస్ లో పడేస్తాను. మిగతా వాళ్ళను కూడా కలుసుకొంటాను. మీరు శ్రీనివాసన్ కు ఫోను చేసి, అరేంజి మెంట్స్ ఎలా జరుగుతున్నాయో కన
