"ఇందా!" అంటూ పావలా కాసుతీసి గళ్ళలుంగీ చేతిలో పడేసి 'కాఫీ తాగి రావోయ్!'అన్నాడు ప్రొ.మే.
అతని దయవల్ల కళ్యాణికి ఆ పిక్చరులో వేషం దొరికింది. వేషమంటే పెద్ద బ్రహ్మాండమేమీ కాదు. ఓ రాజుగారికి లేక లేక కొడుకుపుడతాడు. పుట్టాడంటే అందరూ సంతోషించవలసిందేగదా! ఆ చిన్నారి చిట్టితండ్రిని వుయ్యాల్లో పడుకోబెట్టి పాటలు పాడతారు. ఆగుంపులో కళ్యాణికూడా వుంది. ప్రొ.మే.కు ఇష్టమైన మనిషి గనక కవిగారు కళ్యాణికి రెండు మూడు డైలాగ్స్ కూడా ఇరికించారు.
పోతూ పోతూ వంద రూపాయల రశీదు మీద సంతకం చేసి యాభై రూపాయలు పుచ్చుకొన్నాడు గళ్ళలుంగీ.
"మళ్లా కనిపియ్యమంటారా?" అన్నది కళ్యాణి.
"నీ ఎడ్రసివ్వు, నేనే వస్తాను" అన్నాడు ప్రొ.మే.
గళ్ళలుంగీ బస్సెక్కబోతూ పాతిక రూపాయలు కళ్యాణి చేతిలో పెట్టాడు.
"ఇదేందీ" అన్నది కళ్యాణి.
"అంటే?" అన్నాడు గళ్ళలుంగీ.
"ఆనిటికీ కలిపి పాతికేనా?" అన్నది కళ్యాణి.
"పాతిక నువ్వే తీసుకొంటావా? అందులో ఆరుంబావులా నా కమిషనుంది. దాని మాటో?" అన్నాడు గళ్ళలుంగీ.
"కమీషనుమాటనువ్వు ముందు చెప్పలేదు" అని పేచీకొచ్చింది కళ్యాణి.
"ఊరికే చెయ్యడానికి నువ్వు నాచుట్టానివి కావు" అన్నాడు గళ్ళలుంగీ.
అంతటితో ఊరుకోలేదు. ఇంకో బాణం కూడా విసిరాడు.
'నువ్విలాంటి పీచీకోరువని తెలిస్తే, అసలు వేషమే యిప్పించకపోదునే!'
కళ్యాణి గుండె నిజంగానే గతుక్కుమన్నది.
'గమ్మత్తుకన్నా లేవయ్యా! ఈ కాస్తదానికేం ఏం ఉలిక్కిపడతావ్?' అన్నది కళ్యాణి.
అని పదిరూపాయలనోటు గళ్ళలుంగీమీదికి విసిరిపారేసింది. వాడు యింటిదాకా వచ్చాడు. ఆ రాత్రి ఆ యింట్లోనే వున్నాడు.
గళ్ళులుంగీని దాదాపుగా ఆరు మాసాలపాటు భరించింది కళ్యాణి. వాడు పగలల్లా పాండీ బజారులో తిరిగి, సాయంత్రానికి యింటికొచ్చేవాడు. వస్తూ వస్తూ ఏదన్నా పిక్చర్లో చిన్న వేషమన్నా తెచ్చేవాడు, లేదా కస్టమరినన్నా పట్టికొచ్చేవాడు. ఇవి రెండూ లేనిరోజున కళ్యాణి వాణ్ని రాచి రంపాన పెట్టేది.
వాణ్ని పూర్తిగా వదిలించుకోవడానికి సుమారు ఏడాదికిపైగా పట్టింది కళ్యాణికి. ఈలోగా ఆవిడ చాలా కంపెనీలతో పరిచయాలు ఏర్పాటు చేసుకొంది. ఆ పరిచయాలెలాంటివంటే, వారిలో చాలామంది కళ్యాణికోసం పడిచచ్చేవారు.
"శరీరసుఖమంటే ఏమిటో ఒక్క కళ్యాణి దగ్గరే తెలుస్తుంది!" అన్నాడొక ప్రముఖ రసికుడు ఆ రోజుల్లో.
కావాలన్నవారికి లేదనకుండా, శరీరం ఇచ్చింది. వారి ద్వారా తనక్కావలసిన పనులన్నీ చేయించుకొన్నది. తన శరీరం చూసి మగ వెధవలకు మతులుపోతాయనీ, తన ముఖం చూస్తున్నంతసేపూ వాళ్ళు పిచ్చికుక్కలకన్నా కనాకష్టంగా మారిపోతారానీ, కళ్యాణి అనుభవపూర్వకంగా గ్రహించింది. వారా తిక్కలో ఉన్నప్పుడు, మెడలు విరిచి చేయరాని పనులు చేయించింది.
కళ్యాణికి చాలా కాలంపాటు మంచి వేషాలు దొరకలేదు. దొరికినవైనా ఆవిడికిచ్చిన శరీరసుఖానికి కృతజ్ఞతా సూచకంగా ఇచ్చిన వేషాలేగానీ-అట్టే మంచివికావు. తనకు మంచివేషాలు - జనం మెచ్చుకొనే వేషాలు ఎందుకియ్యరో కొంతకాలం దాకా కళ్యాణికి తెలీదు.
"ఆవిడకు నటించడం చాతకాదు. చాతయిందల్లా -" అన్నారెవరో.
ఆ సత్యాన్ని అక్షరాలా వొప్పుకొన్నది.
"సినిమాను నేను అంటిపెట్టుకొని ఉండటానికి కారణాలు అందరికి తెలిసినవే! ఇంతకన్నా ఎక్కువ డబ్బిస్తే పరిశ్రమ ఏదన్నా ఉంటే, నేను వేషాలెయ్యడం మానేస్తాను" అన్నది కళ్యాణి.
ఆ దరిమిలా ఆవిడ రామిరెడ్డితో సంబంధాలేర్పరచుకొన్నది. అతనిచేత కంపెనీ పెట్టించింది. అతనికి తోడుగా ఇంకో పదిమంది భాగస్థులను కలిపింది. వారిలో వారికి తంపులు పెట్టింది. ఒకళ్ళు నొకళ్ళు నరుక్కుచచ్చేలా చేసింది. అందరికీ తనంటే సదభిప్రాయం ఉండేలా చూసుకొంది. ఉన్న పదిమందీ "కళ్యాణి నాసొత్తే" అనుకొనేలా చేసింది. వారు సినిమా అయితే తియ్యలేదుగానీ, కళ్యాణి ఆర్ధికపరిస్థితులు మాత్రం మెరుగయినాయి.
పదిమందినీ ఆకట్టుకొని, పదికంపెనీల్లో చిన్న వేషాలు తెచ్చుకొని, జీవితంలో రవంత స్థిరపడేనాటికి, ఇంకో బెడద కళ్యాణి మెడకు చుట్టుకొంది.
పోయాడనుకొన్న పకీరయ్య మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. అతను కన్నమ్మను చూసి -కళ్యాణి అన్న మార్పును పకీరయ్య గుర్తించనేలేదు - హర్షించాడు.
"చాలామంది కళ్యాణి, కళ్యాణి అంటుంటే ఎవరోననుకొనేవాణ్ని. నువ్వేనని నాకు మొన్నటిదాకా తెలీదు" అన్నాడు పకీరయ్య.
కళ్యాణి పలకలేదు.
"ఏదో సినిమా చూస్తున్నాం. అందులో నీ డాన్సుంది 'అదేరా కళ్యాణి' అన్నాడు రసూల్. నీముఖం చూస్తూనే నిన్నుగుర్తుపట్టాను. అంతమంది ఎదుటా నువ్వు నా భార్యవని చెప్పుకోలేదు....నువ్వు పైకొచ్చావ్, నేనింకా అట్టడుగునే ఉన్నాను" అన్నాడు పకీరయ్య.
కళ్యాణి ఏడుస్తుందనిగానీ, తనంటే జాలి పడుతుందని గానీ పకీరయ్య ఏనాడూ అనుకోలేదు. కళ్యాణి క్కూడా అలాంటి ఆలోచన కలగలేదు.
ఆవిడ పకీరయ్యతో మాట్లాడుతున్న సమయంలోనే అనేకమంది రావడం, వారితో పక్కగదుల్లోకి వెళ్ళి కళ్యాణి మాట్లాడిరావడం జరిగింది.
"వాళ్ళంతా ఎవరు?" అన్నాడు పకీరయ్య తాపీగా.
"నా స్నేహితులు, ఈ సినిమాల్లో ఉండేవాళ్ళు" అన్నది కళ్యాణి.
"వాళ్ళతో ఏం మాట్లాడావ్?" అన్నాడు పకీరయ్య.
"సినిమా సంగతులు!" అన్నది కళ్యాణి.
"అయితే నాముందే మాట్లాడకపోయావా? చాటుకెందుకెళ్ళావ్?" అన్నాడు పకీరయ్య.
"నువ్వా సంగతులన్నీ వినడం ఇష్టంలేక!" అన్నది కళ్యాణి. ఆమెక్కోపం వచ్చింది! "మాట్లాడవలసిందేమీ లేకపోతే నువ్వెళ్ళ రాదా? ఇంకా ఎంతసేపని కూచుంటావ్?" అనికూడా అన్నదామె.
"మరి పంపించు" అన్నాడు పకీరయ్య.
"అంటే?" అన్నది కళ్యాణి కళ్ళు చిట్లించి.
"అంతేనా....అన్నాడు పకీరయ్య 'డబ్బు' అన్నట్టు సైగచేస్తూ."
కళ్యాణికి కోపం తారామండలానికి లేచింది.
"నా దగ్గర చిల్లికానీకూడా లేదు, ఉన్నా నేనివ్వను. నువ్వెవడవని, నీకు డబ్బివ్వను? నీకూ నాకూ సంబంధమేమిటి?" అన్నది కళ్యాణి.
పకీరయ్య ఏమీ అనలేదు. అన్నీ శాంతంగా విన్నాడు. విని కళ్యాణికేసి చూశాడు. చూసి సన్నగా నవ్వాడు.
"నేను పదిరూపాయలడిగాను. పది పదులు వంద తిట్లు తిట్టావు. ఒకప్పుడైతే రోషం వచ్చేదేగానీ, నాకిప్పుడు కోపంగాని రోషంగాని లేవు. రూపాయముందు ఇంకేమీ పనికిరావని నాకు తెలుసుగనక నేను నోరు మూసుకొంటున్నాను."
"నువ్వుత్త వెధవ్వు?" అన్నది కళ్యాణి.
"నిజమే!" అన్నాడు పకీరయ్య.
అతనిలా మాటలన్నాక, పదిరూపాయలిచ్చి పంపించింది కళ్యాణి.
ఈపీడ ఇంతటితో వదలదని కళ్యాణికి తెలుసు. ఆవిడ పకీరయ్యకు నయానా భయానా చెప్పి చూసింది. ఇతరులచేత కూడా చెప్పించింది. తనకు డబ్బు కావలసినప్పుడల్లా కళ్యాణిమీద విరుచుకుపడుతుండేవాడు. దానికో సందర్భమని గానీ, సమయమనిగానీ ఉండేదికాదు. అర్ధరాత్రప్పుడూ, అపరాత్రప్పుడూ వచ్చేవాడు. షూటింగ్ జరుగుతున్నప్పుడూ, మేకప్ వేసుకొంటున్నప్పుడూ, కార్లో పోతున్నప్పుడు కూడా పకీరయ్య వెంటపడేవాడు.
"ఎవరతను?" అని చాలా మంది కళ్యాణిని అడిగారు.
"తెలిసినవాడు" అని చాలా మాత్రమే ఊరుకొనేది కళ్యాణి.
ఒకసారి పకీరయ్యతో గట్టిగా దెబ్బలాడింది కళ్యాణి.
"మాటి మాటికీ డబ్బు డబ్బంటూ నామీదకొస్తావేం? నా దగ్గర మాత్రం డబ్బెక్కడుంటుంది?" అన్నది కళ్యాణి.
"ఉంటుంది" అన్నాడు పకీరయ్య.
"నాదగ్గర లేదు" అని మొండికెత్తింది కళ్యాణి."రిజర్వు బాంకన్నా దివాలా ఎత్తుతుందిగానీ, సినిమావాళ్లు- ముఖ్యంగా ఫైల్లో ఉన్న సినిమావాళ్ళు డబ్బు లేదంటే నమ్మడమేనా? నేను పసివాణ్నని నివ్వనుకుంటే తప్ప ఇలా మాట్లాడవు" అన్నాడు పకీరయ్య.
"ఆడదాన్నిలా ప్రాధేయపడ్డానికి నీకు సిగ్గేవేయడంలేదా?"
"లేదు"
కళ్యాణి నిట్టూర్చింది.
"ఇంకెప్పుడూ ఇలారాకు. ఈసారి వచ్చావంటే మెడబెట్టి గెంటిస్తాను"
ఈ మనిషిని ఇంకెప్పుడూ రానీయవద్దని కాపలావాళ్ళతో చెప్పింది కళ్యాణి. పకీరయ్య ఆమెను స్టూడియోలో కలుసుకొన్నాడు.
"నీ యింటికి రావాలన్న వాంఛ నాకూలేదు. నాకు సరిపడా డబ్బివ్వాలేగానీ, ఎక్కడికి రమ్మన్నావస్తాను" అన్నాడు పకీరయ్య.
నలుగుర్లోపడి అల్లరిపాలు కావడం కళ్యాణి కిష్టంలేదు. అదీగాక ఆవిడ అప్పుడప్పుడే పైకొస్తున్న తార. తనను గురించి ఇటువంటి ప్రచారం జరగడం తన భవిష్యత్తు కేవిధంగానూ దోహదకారికాదు.
"నన్నిలా వేదించడం ధర్మంకాదు. నువ్వు నా శాంతాన్ని పరీక్ష పెడుతున్నావు. ఎప్పుడో వొకప్పుడు నాకు చిరాకెత్తుకొచ్చిందంటే, నిన్ను పదిమందిలోనూ తన్నేస్తాను" అన్నది కళ్యాణి.
పకీరయ్య పలకలేదు.
"ఏదన్నా పని చూపెడతాను చెయ్యరాదూ?" అన్నదామె. ఈపీడను ఎలాగయినా వొదిలించుకొందామని.
"చెయ్యను. అవతల నా పెళ్లాం సినిమాల్లో చేరి వేలకువేలు తెస్తూ ఉంటే, నేను పదికీ, పాతిక్కూ ఊడిగం చెయ్యనా? ఆ మాటలనడానికి నీకు సిగ్గెయ్యడం లేదా?" అన్నాడు పకీరయ్య.
"నేనెవరి భార్యను కానే!"
పకీరయ్య నవ్వాడు.
"పిచ్చిదానా! మన పెళ్ళినాటి శుభలేఖలున్నాయి. ఫోటోలున్నాయి. వాటిని నువ్వు మాయం చెయ్యలేవు. ఏ క్షణాన్నయినా, నువ్వు నా భార్యవని రుజువు చేసుకోగలను."
కళ్యాణి కుంగిపోయింది. పకీరయ్య చూడకుండా కళ్ళొత్తుకొంది.
"నీకో వెయ్యి రూపాయలిస్తాను, వదిలిపోతావా?" అన్నది కళ్యాణి.
'ప్రస్తుతానికి సరేనని వెయ్యి పుచ్చుకొన్నాననుకో, అవి అయిపోయాక మళ్లా నీ దగ్గర కొచ్చాననుకో, అప్పుడు నువ్వు చెయ్యగలిగిందేముంది చెప్పు? నా అవసరాలు యీ వెయ్యితో తీరుతాయని నువ్వుగానీ, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడుగానీ చెప్పలేడు. నువ్వో నేనో చచ్చిందాకా యిదిలా సాగవలసిందే!' అన్నాడు పకీరయ్య చల్లగా.
"నన్ను వొదిలించుకోవాలని చూడబాకు, నేనంత సులభంగా వొదిలేరకాన్ని కాదు....నాకు పాపపుణ్యాల మీదా, జాలిమీదా, ధర్మంమీదా నమ్మకాలు లేవు. వాటిని చూసి నన్ను లొంగతీసుకోగలుగుతాననుకోకు. కట్టుకుపోయినంత సంపాదిస్తున్నావు గదా, అందులో నూరోవంతు నాకోసం ఖర్చు చెయ్యడానికేం?... అది లాభంలేదు. నువ్వెంతిచ్చినా ఆ ఫోటోలివ్వను....నాకున్న తురుపుముక్కను ఆటను పాడు చేసుకొనేంత వెధవను గాను" అని స్పష్టంగా తేల్చి చెప్పాడు పకీరయ్య.
పకీరయ్య తన మొగుడని చెప్పుకోవడం కళ్యాణి కిష్టంలేదు. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఈ దిక్కుమాలిన రంగంలో 'గృహిణి' కన్నా 'కన్యకే' ఎక్కువ గిరాకీ ఉంటుంది. అదీగాక పకీరయ్యలాంటి అధమాధముణ్ని తన మొగుడని చెప్పుకొని, తనకున్న విలువను పాడుచేసుకోవడం కూడా కళ్యాణి కిష్టంలేదు.
ఏదోవిధంగా పకీరయ్యను వొదిలించుకోవాలని, కళ్యాణి చాలాకాలంపాటు ప్రయత్నించింది. ఆవిడ ప్రయత్నించిన కొద్దీ పకీరయ్య బిర్రబిగిసి పోసాగాడు.
"నేను నిన్ను వదలను, వదిలించుకోవాలని చూడకు" అని చాలాసార్లు పకీరయ్య తన మాజీ భార్యను హెచ్చరించాడు.
కొంతకాలంపాటు తన దగ్గరే వుండమన్నది. ఆ పనీ ఈ పని చెయ్యమన్నది. అన్నిటికీ 'సరే' ననేవాడు. ఏపనీ చేసేవాడుకాదు. 'ఇదేమి'టని అడిగితే 'ఖస్సు' మని లేచాడు. పదిమంది ఉన్నారని కూడా చూసేవాడు కాదు. తనను చూసి కళ్యాణి భయపడుతున్నదని పకీరయ్య ఏనాడో గ్రహించాడు. ఆభయాన్ని ఆసరా చేసుకొని తన పబ్బం గడుపుకోవాలని అతననుకొన్నాడు. ఇదెంతకాలం సాగుతుందన్న ప్రశ్న అతనికి తట్టలేదు. ఉట్రఉడియంగా వచ్చిన వైభోగం ఎంతకాలం ఉన్నా ఉన్నట్లే!
పకీరయ్య ఏమాత్రం జాగ్రత్తగా వున్నా కళ్యాణి ఏదోవిధంగా అతనితో సరిపెట్టుకొని పోగలిగేది. కానీ పకీరయ్య అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఎవరో పార్టీలు వచ్చినప్పుడు కళ్యాణి మీద అధికారం చెలాయించచూసేవాడు; పని మనుషులమీదా, నౌకర్లమీదా చచ్చేట్టు అరచేవాడు. చెడతాగి, రోడ్లమీద పడిపోయిన సందర్భాలు చాలా వున్నాయి.
"అతగాడెవరు?" అని చాలా మంది కళ్యాణిని అడిగారు.
ఒకరికి చెప్పిన సమాధానం ఇంకోరికి చెప్పకుండా కళ్యాణి సర్దుకొచ్చింది.
పకీరయ్యను హతమార్చాలని కళ్యాణి ప్రయత్నించిన సందర్భాలు చాలా వున్నాయి కానీ, అవేవీ ఫలించలేదు. కళ్యాణి వేసిన ప్రతి ఎత్తునూ అతను భగ్నం చేశాడు. పైగా ఆవిడ మెడకే అపాయాన్ని చుట్టిపడేసేవాడు.
"నన్నిలా ఎందుకు బాధిస్తున్నావు?" అన్నదొకసారి కళ్యాణి.
"ఆ సంగతి నీకే తెలియాలి!" అన్నాడు పకీరయ్య.
"నాకు తెలీదు" అన్నది కళ్యాణి.
పకీరయ్య అన్ని సంగతులూ మరికసారి చెప్పుకొచ్చాడు.
"పోనీ ఓపని చెయ్యి. నువ్వింకెక్కడన్నా వుండు, నెలకు రెండొందలో,మూడొందలో పంపుతాను. నువ్వీమద్రాసులో వుండి బావుకునేదేముంది గనక? ఇక్కడుంటే నువ్వు నాదగ్గరకు రాకామానవు, అల్లరి చెయ్యకా మానవు; అందువల్ల నా వృత్తి పాడయిపోతుంది. అదీ నీకే నష్టం! బాగా ఆలోచించుకో పకీరయ్యా! నా దగ్గర నాలుగు పిచ్చికలుంటేనే నీ కేదన్నా యివ్వగలను. నాకే బువ్వకు కటకటగా వుంటే యింకా నీకిచ్చేదేమిటి? చచ్చేదేమిటి? కాబట్టి -" అని సలహాయిచ్చింది కళ్యాణి.
ఏ బుద్దిన ఉన్నాడోగానీ పకీరయ్యకు ప్రతిపాదన నచ్చింది.
"అయితే నెల నెలా నాకు తప్పకుండా పంపుతావా?" అన్నాడు పకీరయ్య.
"ఆఁ" అన్నది కళ్యాణి.
"అయితే ఈరోజునే పోతున్నాను" అన్నాడు పకీరయ్య.
కళ్యాణి మనస్సు ఎగిరిగంతేసింది. అతనికి మూడొందల రూపాయలిస్తూ "ప్రస్తుతానికి యివి నీదగ్గరుంచుకో మళ్ళీ నెలాఖరుకు పంపుతాను. నాకయినా అట్టే పిక్చర్సు లేవు. కాస్త కనిపెట్టి ఖర్చులు పెడుతూవుండు" అన్నది.
"అలాగే" అన్నాడు పకీరయ్య.
కళ్యాణి ప్రాణానికిపుడు ఎంతో హాయిగా వున్నది. ఇంటికొస్తూనే ఏ గొడవలో తల దూర్చవలసివస్తుందో నన్నబెంగ ఆమెకిప్పుడు లేదు.
ఆవిడ తన కాలాన్నంత పరిశ్రమమీద కేంద్రీకరించింది. దొరికిన ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొంది. రకరకాల వ్యక్తులతో పరిచయాలు సంపాదించింది. అందుకోసం తన శరీరాన్ని వాడవలసివస్తే నిస్సంకోచంగా వాడిపారేసింది. ఓ గంటతేడాగా తండ్రీ కొడుకులతో ఒకే గదిలో, ఒకే ప్రక్కమీద కళ్యాణి గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఈ శ్రమలో చాలాభాగం ఫలించింది. కళ్యాణికి కాస్తంత మంచివేషాలు దొరకసాగాయి. ఆ వేషాలవల్ల వేలకువేలు దొరకని మాట నిజమేగానీ, వాటిని ఆధారం చేసుకొని లక్షలు సంపాదించవచ్చునని కళ్యాణికి తెలుసు. ఒక మామూలు ఆడది ఒక రాత్రికి సంపాదించే మొత్తానికి వందరెట్లు సంపాదన ఒక సినిమా తార ఒకే రాత్రికి సంపాదించడం కళ్యాణి చూస్తూనే ఉంది. అయినప్పుడు ఏదో విధంగా రెండు పిక్చర్సులో కాస్తంత మంచివేషాలు ముందుగా దొరకబుచ్చుకొంటే - ఆ తరవాత తనకసలు వేషాలు లేకపోయినా బాధలేదు. తనకయినా సినిమాల్లో వేషాలెయ్యాలని లేదు. తనకు కావలసినంత డబ్బు. ఆ డబ్బు -ఇంతకన్నా సులభంగా వొచ్చేమార్గమంటూ ఉంటే ఈ సినిమా లైను విడిచిపెట్టడానికి తనకేమీ అభ్యంతరం లేదు.
చిత్రరంగంలో సజావైన మార్గంకన్నా డొంక తిరుగుడు దోవకు ఎక్కువ విలువ ఉంటుంది. నువ్వెంత గొప్పవాడివైనా నీకక్కడ మంచినీళ్ళు పుట్టవు. నీకో ప్రొడ్యూసరో, డైరెక్టరో, డిస్ట్రిబ్యూటరో దగ్గరవాడయి ఉంటేచాలు. కనీసం ఒక హీరోగానీ, హీరోయిన్ గానీ, విలన్ గానీ, కమెడియన్ గానీ గట్టిగా రికమెండ్ చేసినా చాలు.
కళ్యాణికి లగువు బిగువులు మొదటగానే తెలుసు. అంచాతే ఆవిడ మార్గం సుగమంగా ఉంది.
కళ్యాణికో కొడుకున్నాడన్న సంగతి - ఇప్పటికీ తెలియని వారు చాలామంది ఉన్నారు. కొంతకాలం పాటు 'వాడు నాకొడుకే' అని చెప్పుకొన్నది కళ్యాణి. ఆ తరువాత 'వాడు మా అక్క కొడుకు' అనడం సాగించిందావిడ. కుర్రవాడికి అయిదో సంవత్సరం వచ్చినప్పట్నుంచీ 'మా తమ్ముడండీ!' అని వాణ్నేచూపించసాగింది కళ్యాణి. జనం ఇవన్నీ నిజమని నమ్మరా లేదా - అన్న ప్రశ్నకే తావులేదు. ఆవిడ ఎదుట ఏమీ అనేవారు కారు. చాటున ఏమనుకొనేవారో ఆమెకుతెలీదు.
ప్రతి చిన్న విషయాన్నీ తన అభివృద్దికి అనుకూలంగా ఎలా మార్చుకోవడమన్న ప్రశ్నకు కళ్యాణి జీవిత మొక పెద్ద జవాబు.
ఆడ తొలిసారిగా డాక్టర్ను కన్సల్టు చేసినప్పుడు "నువ్వు తల్లివి కాబోతున్నావు" అన్నాడతను.
కళ్యాణి గుండెలు - నిజంగా జారోపోయాయి. ఆవిడకు ముచ్చెమటలు పోశాయి.
"దీనికేదన్నా మార్గముంటే చెప్పండి! ఎంత ఖర్చయినా నిచ్చుకుంటాను." అన్నది కళ్యాణి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ.
ఆడాక్టరు రెండు చేతులూ ఎత్తి కళ్యాణికి నమస్కారం చేశాడు.
"మీరలా అంటేకాదు. ఇలాంటివి రావడం నా వృత్తికి ఎంత దెబ్బో మీరూ ఆలోచించాలి." అన్నది కళ్యాణి.
"నన్ను క్షమించాలి. నేనిందుకు అసమర్ధుణ్ని .... ఇప్పుడు ఎవ్వరుగానీ చెయ్యడానికేమీ లేదు, మీకు బ్రతకాలనిలేకపోతే తప్ప - ఇలాంటి సాహసానికి పూనుకోవద్దు" అని సలహా ఇచ్చాడతను.
అతని సలహాలను అంగీకరించినట్లే తలూపింది కళ్యాణి.
అతని కివ్వవలసిందేదో ఇచ్చింది. అలాంటి విషయాల్లో అనుభవమున్న ఇంకో డాక్టరును సంప్రదించింది, అతగాడు కూడా లాభంలేదన్నాడు. సమయం మించిపోయిందన్నాడు.
ఇంకోరైతే కుంగిపోయి ఉండేవారు. కళ్యాణి ధైర్యంతో నిలబడింది. ఆవిడో లిస్టురాసుకుని, అందులోంచి -తనకోసం వచ్చేవారెవరో గుర్తులు పెట్టుకొంది. వారందరికీ వరసగా ఫోను చేసి, తను తల్లిని కాబోతున్నాననీ, ఆ బిడ్డకు మీరే తండ్రులనీ ఫోనుచేసింది. సంతోషించినవారికన్నా, భయపడినవారే ఎక్కువ మంది. వీరందరికీ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి, పలుకుబడులున్నాయి. కళ్యాణి ఈ విధంగా పదిమందిలోనూ, ప్రచారం చేయడం ఇష్టంలేనివారు అంతో ఇంతో ఇచ్చి సర్దుకొన్నారు. మిగిలిన వారినుండి ఇంకో మార్గంలో కళ్యాణి డబ్బు పిండిపారేసింది!
"రాజన్ తో పరిచయమయ్యే నాటికి 'సునీల్ బాబు' కు అయిదేళ్ళు.
"వీడెవడు?" అన్నాడు రాజన్.
"మా తమ్ముడు" అన్నది కళ్యాణి.
"ఓహో" అన్నాడు రాజన్.
ఆ తరువాత అసలు సంగతి కాస్తా రాజన్ చెవినవేశారు. మొదట్లో రాజన్ నమ్మలేదు.
"కావలిస్తే మీరు నిగ్గతీసి అడగండి. అబద్దమయితే నన్ను చెప్పుచ్చుకుకొట్టండి!"
"అలాగే అన్నాడు రాజన్.
అతను కళ్యాణిని అడిగినప్పుడు ఆవిడ ఒప్పుకోలేదు సరిగదా, రాజన్ నే ముక్క చివాట్లు వేసింది.
"అసలు మీ మొగజాతే దౌర్భాగ్యపుజాతి. అందులోనూ వ్యాపారస్తులున్నారే సరేసరి! అదీగాక మనమిద్దరం శాస్త్రోక్తంగా పెళ్ళాడిన భార్యా భర్తలంకాము. నన్ను మీరెన్నయినా అడగొచ్చను. నేనేం చెప్పినా మీరు అబద్దమనీ అనొచ్చును" అన్నది కళ్యాణి.
"నువ్వు నిజం చెప్పాలేగానీ, నేనెందుకు కాదంటాను?" అన్నాడు రాజన్.
"కాదంటారు -నేను మీ పెళ్లాన్ని కాదుగా మరి!" అన్నది కళ్యాణి.
రాజన్ ఏదో అనబోయి - ఏమనుకొన్నాడోగానీ మళ్ళా ఆ మాటను మింగేశాడు.
"నాకో కొడుకున్నమాట నిజమే! వాడు పోయాడు. ఉన్నట్లయితే -" అని కళ్ళొత్తుకున్నది కళ్యాణి.
"నీ అక్క కొడుకని చెప్పావుటగా కొందరికి?"
"మా అమ్మ చనిపోయేనాటికి సునీల్ కు రెండేళ్ళు. అప్పణ్నుంచి వీడు మా అక్కదగ్గిరే పెరిగాడు. ఆమెనే 'అమ్మా' అని పిలిచేవాడు. అంతలోనే మావాడుపోయాడు. ఆ బెంగతో డీలా పడిపోకుండా ఉండేందుగ్గాను, మా అక్కా వీడూ చాలాకాలం యిక్కడే వున్నారు. వాడు నా కెంత మాలిమయ్యాడంటే నన్నే 'అమ్మ' ననుకొంటున్నాడు. అలానే పిలుస్తున్నాడు. అయిదేళ్ళ పసివెధవ ఎలా పిలిస్తేనేమని నేనూ పట్టించుకోవడం లేదు."
రాజన్ ఈమాట నమ్మాడో లేదో భగవంతుడికి తెలియాలి. అతను మాత్రం సునీల్ ప్రస్తావన మళ్ళా తీసుకురాలేదు.
సునీల్ ను ఇంకెక్కడన్నా ఉంచాలన్న ఆలోచన ఆ తరువాతగానీ కళ్యాణికి రాలేదు. ఈ వాతావరణంలో ఆ కుర్రవాడుండడానికి కళ్యాణి మనస్సు అంగీకరించలేదు. క్షుద్రమైన తన బ్రతుకును కొడుకు నుండి దాచుకోవాలనుకున్నది.
'నా దగ్గరకు పంపు. వాడూ నేనూ కలిసివుంటాం' అన్నాడు పకీరయ్య.
"ఆలోచిస్తాను" అని సర్దింది కళ్యాణి.
అన్నదేగానీ ఆవిడకా ఆలోచన లేదు. పకీరయ్య ఎంత నీచుడో తనకు తెలుసు. డబ్బుకోసం వాడు హత్యలు చేయమన్నా నిస్సంకోచంగా చేస్తాడు. అలాంటివాడి సంరక్షణలో తన కొడుకుండటం కన్నా తన దగ్గిర వుండటమే నయం! అదీకాక - తనకూ పకీరయ్యకూ ఉన్న సంబంధాలు మాత్రం ఏమిటి గనక? ఎప్పుడో తాళిగట్టాడు. పారిపోయాడు. తను రాజన్ తో చేసిన కాపురం నాలుగో వంతు పకీరయ్యతో చెయ్యలేదు. వాణ్ని నమ్ముకొని తన కొడుకును పంపడమంటే, అంతకన్నా అనుచితమైన కార్యమింకేదీ ఉండదు. పకీరయ్య దగ్గరకు సునీల్ ను పంపడం సంగతి దేముడెరుగు - కనీసం వాడికంట తనబిడ్డ పడటం కూడా తన కిష్టంలేదు.
ఉన్నట్లుండి ఓ రోజున సునీల్ ను వెంటతీసుకొని కళ్యాణి విమానమెక్కింది. నాలుగో రోజున వొంటరిగా తిరిగొచ్చింది.
"మీ తమ్ముడేడీ?" అన్నారెవరో.
"అక్కయ్య దగ్గరవొదిలొచ్చాను" అన్నది కళ్యాణి.
ఆ అక్కయ్యెవరో ఎక్కడుంటున్నదో ఎవ్వరికీ తెలీదు.
"ఎక్కడకెళ్ళావేమిటి? అన్నాడు రాజన్, కళ్యాణి తిరిగిరాగానే."
"సునీల్ ను మా అక్కదగ్గర దిగబెట్టి వచ్చాను" అన్న దావిడ.
"అదేం?"
"వాడిక్కడుండడం మీ కిష్టంలేదుగా! వాణ్ని చూస్తేనే పామును చూసినట్లుంటుందాయె మీకు. మీ మనస్సు కష్ట పెట్టడమెందుకని వాణ్ని పంపించాను"
రాజన్ ఇంకేమీ అనలేదు.
అతనితో ఇలా అన్నదేగానీ, నిజం అదికాదు. పకీరయ్యకు సునీల్ ను చూస్తే అరికాలిమంట నెత్తికెక్కుతూ ఉండేది. వచ్చినప్పుడల్లా ఆ కుర్రావాణ్ని రాచిరంపాన పెడుతూ ఉండేవాడు. రక్తం పడేటట్టు కొడుతూ ఉండేవాడు. ఒకసారి వాణ్ని మెట్లమీద నుండి తోశాడు. అందుగ్గాను సునీల్ నెలరోజులపాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది.
'వాడికింకా భూమ్మీద నూకలున్నాయి గనక సమయానికి నువ్వొచ్చావు. ఎప్పుడో వొకప్పుడు వాడి చావు నా చేతుల్లోనే ఉంది' అన్నాడు పకీరయ్య.
ఆ తరువాతనే కళ్యాణి తన కొడుకును ఎక్కడికో పంపేసింది!
* * * *
అని ముగించాడు చలపతి.
మంజరి నీరసంగా సోఫాలో లేచికూచున్నది.
ఊఁ తరవాత?" అన్నదావిడ.
"తరవాత కూడా ఏమీ లేదు. నన్నడిగితే కళ్యాణి చాలా దురదృష్టవంతురాలంటాను, ఆవిడకు కావలసినవేవో జీవితంలో లభించలేదు. అందుకోసం కళ్యాణి ఆత్మ ఎంతగా ఘోషించిందో నీకు తెలీదు; నాకు తెలుసు" అన్నాడు చలపతి.
"సునీల్ ఏమయ్యాడు?" అన్నది మంజి ఆదుర్దాగా.
ఏమవుతాడు మంజరీ! ఏం కావాలో అదే అయ్యాడు బొంబాయిలో అదేదో హాస్టల్లో ఉంచింది. అడిగినప్పుడల్లా డబ్బు పంపించింది. అల్లారు ముద్దుగా పెంచింది. వాడెండుకూ కొరగాని వాడయ్యాడు." అన్నాడు చలపతి.
మంజరి కన్నార్పకుండా అతనికేసి చూడసాగింది.
"ఏమిటో మంజరీ! ఈ డబ్బుమీది కాపీనంతో మనిషి చేసే అఘాయిత్యాలు చూస్తుంటే - గుండెలు బాదుకొని ఏడవాలనిపిస్తుంది. ఇంతగా దిగజారిపోయి, ఇన్ని బాధలు పడి సంపాదించిన డబ్బు -" చచ్చిన్నాడు వెంట వొస్తుందా - అదీ లేదు, మరెందుకిన్ని చండాలప్పనులు చేయడం? ఏమాశించి? తృప్తికరమైన జవాబు చెప్పుకోలేం! సాధారణంగా - సినిమాతారలు ఎక్కువగా సంపాదిస్తారనుకొంటారుగానీ అది నిజం కాదు. మీకన్నా ఎక్కువ సంపాదన పరులున్నారు. వాళ్ళు మీకన్నా బాగా నటిస్తారు. మీ కన్నా బాగా-"
"ఎవరు?" అన్నది మంజరి.
చలపతి అటూ ఇటూ చూసి 'గూఢచారులు' అన్నాడు. "సునీల్ చివరికి ఆముఠాలో చేరాడు. మన శత్రువులకు ఉపయోగపడే రహస్యాలను సేకరించి, వీరు ఎక్కువ డబ్బుకు అమ్ముతుంటారు. అదో వ్యాపారంగా -చేస్తున్నవారు చాలామంది ఉన్నారు."
మంజరి కళ్ళ భయంతో నిండిపోయింది.
"ఏమిటీ మంజరీ!" అన్నాడు చలపతి మంజరి భయపడటం గమనించి.
"ఏమో లేదుగానీ - నువ్వెప్పుడన్నా కళ్యాణి కొడుకును చూశావా?" అన్నది మంజరి.
"ఆఁ ఎర్రగా బొద్దుగా ఉంటాడు. ఎడం చెవి దగ్గరగా పెద్ద మచ్చ, మెట్లమీద పడినప్పుడు అయిన గాయం తాలూకుది" అంటున్నాడు చలపతి.
"కళ్ళు - పిల్లికళ్ళు గదూ?" అన్నది మంజరి.
ఆవిడ ముఖంలో గోటి గాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. పెదవులను నాలుకతో తడుపుకొంటోంది.
"అవును" అన్నాడు చలపతి తాపీగా "అతను నీకు తెలుసా మంజరీ!"
"లేదు, లేదు నాకు తెలీదు" అని అరచేతుల్లో ముఖం దాచుకొన్నది మంజరి.
చలపతికీ మాటల్లో విశ్వాసం కుదరలేదు. సునీల్ కుమార్ మంజరికి తెలుసుననీ, ఆవిడ కావాలనే అబద్ధమాడుతున్నదనీ చలపతి గ్రహించాడు.
"తెలియని దానికయితే అతని కళ్ళను గురించి నువ్వడిగే ఉండవు మంజరీ! ఈ దశలో కూడా నన్నెందుకు బుకాయిస్తున్నావో అర్ధంకాదు" అన్నాడు చలపతి.
"మీరలా ప్రతిదానికీ సాగదీస్తూ కూచుంటే నేను చెప్పలేను. అప్పుడెప్పుడో కళ్యాణీ నేనూ, ఓ స్టూడియోలో ఉండగా ఓ పిల్లి కళ్ళ కుర్రవాడొచ్చాడు. ఇప్పుడే వస్తానని కళ్యాణి ఆ కుర్రాణ్ని తీసుకొని వెళ్లిపోయింది. మీరా సంగతి చెబుతుంటేనూ - ఎందుకో ఈ సంఘటన జ్ఞాపకమొచ్చింది" అన్నది మంజరి.
