"ఇప్పటికయినా, కలగలేదని కాదు. మనమేదో ముఖ్యమైన సంగతిని దాచి పెడుతున్నామని, సుందరంగారి అభిప్రాయం, అది నిజం కూడాను. కానీ నిజం చెప్పేసి దోవనపోయే తద్దినాన్ని నెత్తిమీదికి తెచ్చుకోవడానికి మనమెప్పుడూ సిద్దంగా లేము."
"అవును" అన్నది మంజరి.
ఓ నిమిషం ఆగి ఏదో అడగబోయి ఠక్కున ఆగిపోయిందావిడ.
"ఏమిటి?" అన్నాడు చలపతి.
"కళ్యాణి హత్యకు గురించి, మీకు ముందే తెలుసునన్నారు గదా! పోనీ మాట మాత్రమన్నా నాతో అనలేదేం చలపతీ?" అన్నది మంజరి.
"తెలుసునంటే అన్ని సంగతులూ తు చా తప్పకుండా తెలుసునని కానేకాదు. కళ్యాణికి సహజ మరణం కాదనీ, ఎవరో వొకరు హత్యచేస్తారనీ నాకు చాలా కాలం కిందటనే తెలుసు. కానీ అదింత త్వరగా జరుగుతుందని నేననుకోలేదు. కళ్యాణి మీద నాకు ఎలాంటి సానుభూతీ లేదుగానీ, కనీసం నీ మెహర్భానీ కోసమయినా ఈ సంగతి ముందుగా నీకు నేను చెప్పి ఉండవలసింది."
దురదృష్టవశాత్తూ నేను పరధ్యానంగా ఉన్నాను. అతను కనిపించాడుగానీ, నేనే గుర్తుపట్టలేకపోయాను. మనస్సులో ఏదో మూల సన్నని అనుమానం మెదులుతూనే ఉన్నది. అయినా మనిషిని పోలిన మనుషులుంటారనుకొన్నాను. నేను సరిగ్గా అంచనా వేయనందువల్ల ఈ ఘోరం జరిగిపోయింది. ఇన్నిటికీ కళ్యాణికి ఈ భూమ్మీద గింజలు లేవు దాటిపోయింది. అని నిట్టూర్చాడు చలపతిరావు.
మంజరి నిలువుగా చలించిపోయింది. రక్తమంతా వోడ్చుకుపోయిన దానిలా నీరసంగా సోఫాలో పడుకొన్నది. ఒక చెయ్యి ముఖంమీదుగా రెండవప్రక్కకు వేసుకొన్నది. మరో చెయ్యి కిందికి వేళ్ళాడుతున్నది.
"ఇన్ని సంగతులు తెలిసి కూడా తెలియనట్లుగా నువ్వెలా ఊరుకో గలిగిందీ నాకు అర్ధం కావడంలేదు చలపతీ" అన్నది మంజరి.
"చెబుతాను, నువ్వు లేచికూచో" అన్నాడు చలపతి. "తాయారును పిలిపించి, ఈ చండాలమంతా సర్ధించుముందు. దీన్నిలా చూస్తూ నువ్వు స్థిమితంగా ఉండలేవు."
'అబ్బ! చచ్చిపోతే బావుండుబాబూ' అని విసుక్కుంది మంజరి. నాకు నీరసంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్లనిపిస్తుంది. దాన్ని పిలిచి వీటిని తీయమని చెప్పు.
'ప్చ్' అని పెదవి విరిచాడు చలపతి. "ఆ అదృష్టం నాకు లేదు. నేను వాళ్ళను పిలవను. పిలిచినా వాళ్ళురారు, వచ్చినా నేను చెప్పిన పనిచెయ్యరు. ఈ ఇంట్లో నా మాటకేపాటి విలువున్నదో నాకు తెలుసు కనక నువ్వేపిలిచి, నువ్వే వాటిని సర్దించు."
సమయం చూచుకొని చలపతి తనను కుమలపొడుస్తున్నాడని మంజరి ఇట్టే గ్రహించింది. అంత నీరసంలోనూ, ఆవిడకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. రక్తం వేడెక్కి ఘురీ వేగంతో పరుగులెత్తినట్టనిపించింది. చివాలున లేచి కూర్చున్నది. ఆమె కళ్ళు ఎర్రగా ఉండటం చలపతి గమనించి నవ్వుకొన్నాడు. ఆ నవ్వును చూసి మంజరి మరీ రేగిపోయింది.
"నేనన్నది అబద్దమా?" అన్నాడు చలపతి.
"ఆఁ"
"చూద్దాం" అని బెల్ నొక్కాడు.
"తయారొస్తుంది. నువ్వలానే చూస్తూ ఉండు ఏం జరుగుతుందో"
తాయారు వచ్చి, మంజరి వేపు తిరిగింది.
"ఈ గ్లాసులూ, సోడాలూ సీసా పట్టుకెళ్ళు తాయారు!" అన్నాడు చలపతి.
తాయారు ఆమాటలేమీ విన్నట్లులేదు. మంజరి ఏమంటుందా- అన్నట్లు ఆమె వేపే చూస్తూ నిలుచుంది.
"తీసికెళ్ళవే!" నాకు పట్టుకురా, అన్నది మంజరి.
"నాకు టీ!" అన్నాడు చలపతి. తాయారు వెళ్ళాక-
'ఇదీ వ్యవహారం!' అన్నాడు చలపతి.
ఈ ధోరణిని మార్చాలనుకొన్నది మంజరి.
"వ్యవహారం సరే! నువ్వసలు సంగతి దాటేస్తున్నావు" అన్నది మంజరి.
"ఏదది?"
"ఈ విషయాలన్నీ ముందుగా తెలిసికూడా నాతో చెప్పకుండా దాచుకో గలగడానికి-"
"అదా?" అని నవ్వాడు చలపతి. 'నేనో సిగరెట్ కాల్చుకుంటాను. నువ్వూ అంటించు' అని సిగరెట్ ముట్టించి, గుప్పుమని పొగవదిలాడు చలపతి. "ఇంకో రెండు మూడు వారాలపాటు, నీ ఎదుట నేనిలా సిగరెట్ ను ధైర్యంగా కాల్చగలను మంజరీ! తరవాత మళ్ళామామూలయిపోతుంది. కళ్యాణి గొడవలు కొలిక్కివస్తాయి. నా సలహాలుగానీ, సహాయంగానీ అప్పుడంతగా అవసరం ఉండదు. పోనీ, ఈ నాలుగు రోజులన్నా వైభోగం వెలగబెడదామనుకొని సిగరెట్ కాలుస్తున్నాను."
మంజరి గుండెల్లో మందుగని బద్దలయినట్లనిపించింది. అయినా పైకి పొంగలేదు. చాలా మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, 'ఊఁచెప్పు' అన్నది మంజరి.
చలపతి నిట్టూర్చాడు.
"కళ్యాణి నీకీ సంగతులన్నీ చెప్పే ఉంటుందనుకొన్నాను."
"చెప్పలేదు."
"అని నాకిప్పుడు తెలుసు. మీ ఇద్దరి మమేకమూ చూసిన వారెవ్వరూ అలా అనుకోరు, నీకు చెప్పకుండా కళ్యాణి దాచుకొన్నదేమీ లేదన్న విశ్వాసం నీకూ ఉన్నది. ఆ విశ్వాసాన్ని చెదరగొట్టడం నా అభిమతంకాదు. కళ్యాణి తన సంగతులన్నీ నీకు చెప్పినా చెప్పకపోయినా, నాకొచ్చే నష్టమేమీ లేదు. కానీ చెప్పదనీ, చెప్పిఉండదనీ నాకు గట్టిగా తెలుసు."
"ఏం మనుషులో బాబూ? నాకు పిచ్చెక్కిపోతున్నది!" అన్నది మంజరి. తలను గట్టిగా నొక్కుకుంటూ.
ఈమాట చలపతి మీద అమోఘంగా పనిచేసింది. కళ్యాణి పట్ల మంజరికి గల విశ్వాసం దిగజారుతున్నదని అతను గమనించాడు రెట్టించిన ఉత్సాహంతో చెప్పుకుపోసాగాడు.
"నేను సుందరంగారితో అన్న మాటలన్నీ అబద్దాలుకావు. కళ్యాణికి సంబందించినంత వరకూ మనకు ప్రమాదం కలగని మేరకు -నేను నిజమే చెప్పాను. కళ్యాణి మద్రాసులో అడుగుపెట్టేనాటికి, నువ్వాపేరుకూడా వినిఉండవనుకుంటాను, అప్పటినుండి నాకావిడ తెలుసు. తెలుసునంటే - అలా ఇలా కాదు; చాలా గట్టిగానే తెలుసు. ఆవిడతో కొన్ని రాత్రులు నేను గడిపానంటే నువ్వు నమ్మవు. నేనేకాదు - నాకన్నా అధములు, ఆవిణ్ను అనుభవించారు. కొన్ని మాసాలపాటు కళ్యాణి శరీరం అమ్ముకొనే జీవించింది...."
"మరి మీరిద్దరూ - ఎప్పుడూ - అంత పరిచయం ఉన్న వారిలాగా ఉండరేం?" అన్నది మంజరి.
"ఉండలేదు. అలా ఉండటం కూడా సాధ్యంకాదనుకొంటాను. ఎందుకంటే - ఈ పదేళ్ళలోనూ, మా ఇద్దరి పరిస్థితులూ మారాయి. కళ్యాణి తారాపదాని కెగబ్రాకింది. డబ్బున్న పురుగులు ఆమె చుట్టూ తిరగసాగాయి. లక్షలు పిండి, లక్షలు ఖర్చుచేసింది. ఆమె రూపాయికి కానీ నిలవ వున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేనలా కాదే! అప్పటికీ ఇప్పటికీ - నేను దిగజారిపోయాను. నీదగ్గర ఊడిగం చేసుకొంటూ, పొట్ట పోసుకుంటున్నాను. అలాంటి వాడిమీద గౌరవం ఉండవలసిన పనిలేదు. పైగా అంతో ఇంతో కసి కూడా వుంటుంది. కళ్యాణి పగ ఎలాంటిదో నాకు తెలుసు. నామీద కసితో, నన్ను అవమానించాలన్న ఉద్దేశంతోనే ఆవిడ నీతో స్నేహం చేసింది. మీరిద్దరూ కలిసి నేను కుళ్లిపోయే మాటలన్నారు. నా వ్యక్తిత్వం ధ్వంసమయిపోయేలాగా ప్రవర్తించారు. ఏమాత్రం అవకాశం దొరికినా, నన్ను అవమానించడానికే కళ్యాణి ప్రవర్తించేది" ఒకప్పుడు - తను దిక్కూ మొక్కూ లేకుండా ఉన్నప్పుడు - ఓ పదిపారేసి ఆవిడతో ఓ రాత్రల్లా నేనున్నాను. అదీ కాకిలాగా పొడుస్తూ ఉండేది. మానాభిమానాలు వొదులుకొన్న ముండమోపిని గనక, ఇవన్నీ దిగమింగుకొన్నాను-....నా అసమర్ధత కళ్యాణికి తెలుసు. ఆ బలహీనతకు ఆవిడ ఎక్స్ ప్లాయిడ్ చేసింది. నేను చచ్చినట్లు ఊరుకున్నాను. సరే! చనిపోయిన మనిషిని గురించి దూషణగా అనకూడదనుకో.....జరిగిందిదీ!' అన్నాడు చలపతి.
మంజరికి గతమంతా ఛటుక్కున జ్ఞాపకం వచ్చింది. అనేకసార్లు చలపతిని గురించి కళ్యాణి తనతో మాట్లాడింది. ఈ ఇంట్లో అతని స్థానమేమిటో ముందు నిర్ణయించమన్నది. మీ చలపతికి మినిమమ్ మేనర్స్ కూడా తెలీవే అంటూ కంప్లెయింట్ చేసింది. ఆఖరికి రాత్రికూడా చలపతిమీద కట్టుకుపోయినన్ని కొండాలు చెప్పింది. వసంతకూ తనకూ మధ్య తంపులు పెడుతున్నాడనీ, తన్ని తగలేయమనీ, శతకోటి చెప్పుకొచ్చింది. ఇదంతా చలపతిమీది కసితోనే చేసిందా? లేక తను బాగుపడాలన్న ఉద్దేశంతో చెప్పిందా? తన పగతీర్చుకోవడం కోసం చలపతిమీద ఇవన్నీ కళ్యాణి కల్పించి చెప్పిందో లేదో తనిప్పుడు రుజువు చేసుకోలేదు. ఒకవేళ కళ్యాణి లేదన్న ధైర్యంతో చలపతే ఇదంతా పోగుచేసి చెబుతున్నాడేమో తనకు తెలీదు. ఇందులో ఏది నిజమన్నది- ఆ పరమేశ్వరునికే తెలియాలి?
"నువ్వీ మాటలనేవరకూ కళ్యాణి చాలా యోగ్యురాలనుకొన్నాడు చలపతీ!" అన్నది మంజరి.
"యోగ్యురాలే! నేను కాదనడం లేదు. నాకామె నచ్చనంతమాత్రాన నేననను. కళ్యాణయినా అసహజంగా ప్రవర్తించిందనడం న్యాయంకాదు. చిన్నప్పుడు నిన్నష్ట కష్టాలు పెట్టినవారిపుడు నీ దగ్గరకొస్తే నువ్వు వారిని గౌరవించవలసిన అవసరం లేదు. పైగా చిత్రహింసలు పెట్టడం కూడా సబబేనంటాను. దురదృష్టవశాత్తూ నేను రేపు గొప్పవాణ్నయిపోయాననుకో- నాదగ్గర లక్షలు చేరాయనుకో. చిన్నప్పుడు నన్నవమానించినవారెదురైతే పగతీర్చుకొని తీరతానుగానీ మానను. అది మానవ స్వభావం. ఆ సంగతి నాకు తెలుసు గనకనే నేను కళ్యాణిని తప్పుపట్టడం లేదు. కేవలం ఒక వార్తకింద గతించిన సంగతులన్నీ నీకు చెప్పుకొచ్చాను; అదీ సమయం వచ్చింది గనక!" అన్నాడు చలపతి.
"ఆవిడకొక చెల్లెలుండాలిగదా! ఆవిడెలాంటిదీ" అన్నది మంజరి.
చలపతి కళ్ళు చికిలించి మంజరికేసి చూశాడు. తరవాత అదోలానవ్వి సిగరెట్ అంటించాడు.
"ఆవిణ్ను గురించి నీకేమీ తెలీదా? తెలిసే వుండాలే! కళ్యాణి మాటలప్రకారం ఆవిడ చెల్లెలు అచ్చం నాలాగా ఉంటుంది - ఏదో జబ్బొచ్చి చనిపోయింది. ఆ దశలో కళ్యాణి చాలా పేదతనం అనుభవిస్తూ ఉందట-"
చలపతి ఫక్కున నవ్వాడు.
"ఎలాంటివారైనా నమ్మదగిన కథ మంజరీ ఇది, నాకు తెలిసినంతలో కళ్యాణికి చెల్లెలంటూ లేదు."
"అరె!"
"నువ్వునమ్మినా నమ్మకపోయినా యధార్ధమిదే!" అన్నాడు చలపతి.
"కళ్యాణికి నాకూ, ఇంత గాఢ స్నేహం ఏర్పడడానికి - నేను- ఆ చెల్లెలాగా ఉండడమే ముఖ్యకారణం. మరి-నువ్వేమో ఆవిడకు చెల్లెలేలేదంటుంటివి."
"లేదు మంజరీ!" అన్నాడు చలపతి నీరసంగా. ఏదోరకంగా కళ్యాణి నీతోస్నేహం కలపాలి, నామీద పగతీర్చుకోవాలి. అంటే - తను చెప్పినవన్నీ నువ్వు నమ్మాలి నమ్మాలంటే మీ ఇద్దరి మధ్యా అరమలికలేమీ ఉండనంత సన్నిహితత్వం ఏర్పడాలి. అలాంటి సన్నిహితత్త్వం గాలిలోంచి పుట్టుకురాదు. దానికి వాస్తవిక ప్రపంచంలో గట్టి ఆధారంవుండాలి. ఆ ఆధారమే చెల్లెలు. ఎవరయినా సులభంగా నమ్మదగిన అంశమది. అందుకనే - నేనింతకు ముందొకసారి అన్నాను - ప్రతివారికీ తమతోబాటే నశించిపోవలసిన రహస్యాలు కొన్నుంటాయి అని. బహుశా కళ్యాణికి మధుమేహమున్న సంగతి నీకు తెలీదు; ఆవిడ రోజుకొకసారి తనకు తానే ఇంజెక్టు చేసుకుంటుందని కూడా నీకు తెలీదు. నాకా సంగతులన్నీ తెలుసు.
"ఇదంతా ఇంద్రజాలం లాగా ఉన్నదిగదూ?" అన్నది మంజరి.
మంజరి పెదవులు తడుపుకొన్నది.
"బహుశా రెండు మూడు రోజుల్లో నాకు పిచ్చెక్కుతుందనుకొంటాను. అలా జరిగినా బావుండి పోను చలపతీ! ఈ కల్మశమంతా సమూలంగా అడుగున పడిపోతుంది.
అప్పుడెంత హాయిగా ఉంటుందో?" అన్నది మంజరి.
"ఎంతహాయిగా ఉన్నా, మనం దాన్ని అనుభవించలేం" అన్నాడు చలపతి నవ్వుతూ. "ఇంత సుఖాన్ని నేననుభవిస్తున్నానన్న స్పృహ ఉన్నప్పుడే మనం ఆనందించగలం.స్పృహ తప్పేంతగా సుఖపడటం - ఉన్నా లేకపోయినా వొకటే!"
"నీ మాటలు నాకీపూట అర్ధంకావటంలేదు చలపతీ! అవునుగానీ - కళ్యాణి దేవూరో చెప్పావుగాదేం?"
"పోనీద్దూ" అన్నాడు చలపతి.
"కాదు కూడదు చెప్పవలసిందే" అన్నది మంజరి.
చలపతి ఇంకో సిగరెట్ అంటించాడు. ఆ పొగతోనే అగ్గిపుల్లను ఆర్పి, యాష్ ట్రేలో పడేశాడు. అనవసరంగా పొడిదగ్గు దగ్గి చెప్పనారంభించాడు.
అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఓ మోతుబరి ఆ సామీ వున్నాడు. ఆ ఆసామీకి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు పకీరయ్య. అతగాణ్ని అక్షరాలా అందలాల్లో ఉంచేపెంచారు. కిందికి దించితే పాడయిపోతాడన్న భయంతో అసలుదించడమే మానేశారు. బళ్ళోకి పంపితే మేష్టరు కోప్పడతారేమోనని, ఇంట్లోనే బడి పెట్టించారు. అబ్బాయికి అక్షరాలు రానందుగ్గాను ఇంటిల్లిపాదీ కలసి అక్షరాలను రాల్చిపోశారు. వొదిల్తే - వీధిలో ఆడుకొంటాడేమోనని అదీ మామూలు పిళ్లకాయల్తో వీధితలుపుకు అస్తమానం గడియవేసి ఉంచాను. పదహారేళ్ళబ్బాయికి తెలిసిన ప్రపంచం చాలా పరిమితమయింది. జీతగాళ్ళు చెంబుతో నీళ్ళు పట్టుకొస్తే తప్ప ఊరిబయటకు పోగూడదనీ, ఎవరితోనూ విశేషంగా మాట్లాడకూడదనీ, లోకమంతా మోసగాళ్ళమయమనీ, ఎవర్నీ నమ్మకూడదనీ, తుచ్ఛ సుఖాలకు లోబడరాదనీ - అన్నీ ఒకటో నెంబరు బుద్ధులు అబ్బాయికి నూరిపోశారు.
పకీరయ్యకు పెళ్ళయింది. పెళ్ళాం పేరు కన్నమ్మ, ఆవిడ పచ్చగా ఉంటుంది. అందంగా ఉంటుంది. పెళ్ళికూతురు ముస్తాబులో కన్నమ్మను చూసినవారు "కుందన బొమ్మ" అన్నారు.
కన్నమ్మ కాపరానికొచ్చిన ఆరుమాసాలకే పెద్దవారు గతించిపోయారు. లంకంతకొంపకు కన్నమ్మే ఆడదిక్కయింది. అబ్బాయిగారేమో అమాయకులయిరి. అంచాత అన్ని పనులూ చూసి పెట్టడానికి అబ్బాయిగారి మేనమామగారొచ్చారు. ఈ మేనమామగారు చాలా అసాధ్యులు. మట్టిలోంచి మాణిక్యాలు తీయగలిగినవారు. అబ్బాయిగారు చవటేశ్వర్రావుగారన్న విషయంవారికెప్పుడో తెలుసు.
"వాడిది అచ్చంగా మా బావపోలిక" అనేవారు ఆయనగారు.
మూడేళ్ళుకాలేదు. అబ్బాయిగారు ఆస్తంతా హరించిపోయింది. పాపం మాటలు ఎవర్నిగురించీ అనకూడదు. సొమ్మంతా మేనమామగారే దోవచూపినవారయినారు. తన చేతవాటు తనం బయటపడకుండా ఉండటంకోసమని మేనమామగారు అబ్బాయిగారికి 'కొత్త ప్రపంచం'తో పరిచయం కలిగించారు. రెండు మూడు మాసాలపాటు హమేష అబ్బాయిగారి వెంట వారుండిపోయారు. హోటల్సూ, అందులోని గదులూ పరిచయం చేశారు. రకరకాల క్లబ్బులకు తీసుకెళ్ళారు. అక్కడ నిరాఘాటంగా సాగుతున్న 'సాంస్కృతిక కార్యక్రమాలు" లో అబ్బాయిగార్ని ప్రవేశపెట్టారు. స్వయంగా మెరక వీధులకు తీసుకెళ్ళారు. 'ప్రబోధపానీయం' వాడటం నేర్పారు, ముక్కాట నేర్పారు.
మానవుడు 'అభివృద్ధి చెందాలంటే - నిజానికిన్ని యోగ్యతలు ఉండవలసిన అవసరం లేనేలేదు. వీటిలో ఏ వొకటి రెండున్నా చాలు. అలాంటిది - అన్ని యోగ్యతలూ ఒక్కచోటనే రాసిపట్టాయంటే శరవేగంతో అభివృద్ధి జరుగుతుందన్నమాటే!'
వాస్తవానికి అలా జరిగింది. అబ్బాయిగారు పట్టుకుపోతున్నారు. మేనమామగారు దాటవేసేది దాటవేస్తున్నారు. 'ఇదేమి'టని ఎవరన్నా అడిగితే మామయ్యగారు 'కర్మం' అంటూ నెత్తిబాదుకొనేవారు.
"నేను దాటవేశాను గనకనే ఆ మాత్రమన్నా దక్కింది. లేకపోతే మొత్తం తుడిచి పెట్టుకుపోయేదే!" అన్నారాయన.
అదీ నిజమేమరి!
ఈ మూడేళ్ళలోనూ అబ్బాయిగారు అనేక విషయాల్లో రాటుదేలారు. 'ముక్కాట'లో తాలూకా మొత్తానికి సవాల్. రాజు, రాణీ, రెండు పొడులూ ఉంటే చాలు చెక్క వొంచేశాడన్నమాటే! ఏ వీధిలో ఏ కొంప ఉన్నదో, ఏ కొంపలో ఏ బాపతుజనం ఉన్నారో అబ్బాయిగారికి క్షుణ్ణంగా తెలుసు. అయిదారు వేలు ఖర్చుబెట్టి ఇద్దరమ్మాయిలకు 'కన్నెరికం' కూడా పెట్టారువారు.
మూడేళ్ళయ్యేసరికి అమ్మడానికేమీ మిగల్లేదు. మామయ్యగారు అప్పటికే వెళ్ళిపోయారు. బాకీలకింద ఇల్లుకూడా పోయింది.
"ఇప్పుడేం చేదాం?" అన్నది కన్నమ్మ.
"టౌనుకు పోదామే!" అన్నాడు పకీరయ్య.
"అయితే పద!" అన్నది కన్నమ్మ.
ఇద్దరూ బస్తీకొచ్చారు.
పదిహేనురోజుల్లో చేతిలో ఉన్న ఆఖరు రూపాయ కూడా ఖర్చయిపోయింది. అంతకు ముందు ఇంద్రుడవనీ, చంద్రుడవనీ, ఆకాశానికెత్తిన వారెవ్వరూ ఇప్పుడు కనిపించడంలేదు. కనిపించినా పలకరించడం లేదు. ఒకప్పుడు తనదగ్గర వందలకు వందలు వాడుకొన్నవాళ్ళెవరూ ఇప్పుడు చేబదులు కూడా ఇవ్వలేకపోతున్నారు.
కన్నమ్మ పస్తులు చేసింది!
పకీరయ్య పస్తులు చేశాడు.
జ్ఞానోదయం కలగడానికింతకన్నా మంచి అవకాశం ఇంకోటి ఉండడు. కన్నమ్మకు జ్ఞానోదయమయింది. పకీరయ్య ఇంకా మాయాజాలంలో పడి కొట్టుకొంటున్నాడు. అతనికీ 'కొత్తప్రపంచం'మీద రోజురోజుకూ మోజు పెరుగుతున్నదే తప్ప తరగడంలేదు. సర్వశక్తులతోటి ఈ ప్రపంచంలోని సుఖాన్నంతా అనుభవంలోనికి తెచ్చుకోవాలని తహతహలాడిపోయాడు. అందుకు డబ్బు కావలసివస్తే - దాన్ని సులభమార్గంలో సంపాదించడానిగ్గూడా పకీరయ్య సిద్దపడ్డాడు. అనేక సంవత్సరాల పాటు బలవంతంగా అణచివేయబడిన కోరికలెన్నో ఈ మూడేళ్ళలో పడగలు విప్పి బుసలుకొట్టాయి. ఆ విషజ్వాలలకు పకీరయ్య జీవితం కమిలిపోయింది పాపం!
అతనికి ఇంటి సంగతి పట్టేది కాదు. ఎప్పుడోగానీ ఇంటికి వచ్చేవాడుకూడా కాదు. ఆ ఉన్న కొద్ది గంటలయినా మత్తులో ఏదో గొణుగుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు కన్నమ్మను కమ్చీ తీసుకుబాదేవాడు. రక్తం పడేట్టుగుద్దేవాడు. సలసలామరుగుతున్న నీటిని తొడలమీద పోసేవాడు. ఒకసారి బొటనవేలి గోరుకు పిన్నీసు దిగబొడిచాడు.
ఇవన్నీ ఎందుకు చేసేవాడో కన్నమ్మకు తెలిసేది కాదు. తొలిరోజుల్లో - తెలియక 'నేనేం చేశానని ఇలా కొట్టడం?' అన్నది. ఆ మాట అన్నదుకు ఒక రాత్రల్లా వానలో ఆవిణ్ను నించోబెట్టాడు. వాన నీటితో ఎర్రని చారగా నెత్తురు పారడం చూసిగానీ కొట్టడం ఆపలేదు. బాహ్య జీవితంలో ఎదురైనా భయంకరమైన అపజయాలను అసంతృప్తిని తట్టుకోలేక ఆ కసిని ఇంకో విధంగా తీర్చుకొనే మార్గం లేక - కన్నమ్మనిలా చావగొడుతుండేవాడతను.
'ఇలా ఎంతకాలం భరిస్తావమ్మా!' అన్నాడు రామిరెడ్డి ఒకసారి.
అతను కన్నమ్మ ఇంటి కెదురుగా ఉన్నాడు. మద్రాసులో ఆయనకు ఉల్లిపాయల వ్యాపారం ఉంది.
'మరేం చెయ్యను?' అన్నది కన్నమ్మ.
'నేను చెప్పినట్లు చేస్తావా?' అన్నాడు రామిరెడ్డి.
'ఓ' అన్నది కన్నమ్మ.
ఓ శుభముహూర్తాన రామిరెడ్డి కారులో మద్రాసుకొచ్చి పడింది కన్నమ్మ.
'నేను నెలకు పదిహేను రోజులైనా ఇక్కడ ఉంటాను. మనకీ ఇల్లు సరిపోతుందిగదూ?' అన్నాడు రామిరెడ్డి.
వంటగదిగాక రెండు గదులూ వరండా ఉన్నాయి. ఇంట్లోనే నీళ్ళపంపూ, ఇంటి పక్కన సరుకుల కొట్టూ ఉన్నాయి. నెలకు నాలుగు రూపాయల జీతంమీద రెడ్డిగారో పనిమనిషిని కూడా మాట్లాడారు.
'మీరు లేనప్పుడు వొంటరిగా ఈ ఇంట్లో ఉండలేను' అన్నది కన్నమ్మ.
'నా బుజ్జిగదే!' అన్నాడు రామిరెడ్డి, ఆమెను దగ్గరగా తీసుకొని.
ఆయన ఏడాది పాటు - అన్నమాట మీద నిలబడ్డాడు. మరీ తూచినట్లుగా - పదిహేనురోజులు కాకపోయినా, కాస్త అటూ ఇటూగా రెడ్డిగారు రావడమూ, పోయేప్పుడు అంతో ఇంతో ఇచ్చి పోవడమూ - సులక్షణంగానే ఉంది.
ఈ పంపిణీ మీద పది కాలాలపాటు జరిగితే, ఆంధ్రసినీ పరిశ్రమ చరిత్ర ఇంకోరకంగా ఉండేది. రెండో ఏడు సగబడ అయ్యే వేళకు రామిరెడ్డిగారు దాదాపుగా రావడం మానేశారు. ఇటువంటి ప్రమాదాన్ని తానెప్పుడయినా ఎదుర్కోవలసి ఉంటుందని కన్నమ్మ గ్రహించింది. అయినా ఆవిడ తొందరపడలేదు. రెడ్డి కోసం చాలా కాలంపాటు ఎదురుచూసింది. అమ్మడానికి వీలయిన వాటిని అమ్ముకొని తిన్నది. అలాంటివేమీ లేనప్పుడు పస్తులు చేసింది. అనేకసార్లు రెడ్డిగారి ఉల్లిపాయలకొట్టుకెళ్ళి విచారించింది. ఆయనగారింకా రాలేదనో, వచ్చిపోయాడనో, ఇంకా నెలదాకా వచ్చేఅవకాశాలు లేవనో గుమ్మస్తాలు చెప్పేవారు. తన పేరూ, అడ్రసూ రాసిచ్చి వచ్సిపోయానని చెప్పండి బాబూ!' అని కూడా ప్రాధేయపడింది. అయినా రెడ్డిగారు మళ్లా కన్నమ్మ ఇంటికి రాలేదు.
ఈ పరిణామం కన్నమ్మ ముందుగానే ఊహించింది. డానికి విరుగుడు కూడా ఆవిడ ఆలోచించి అట్టిపెట్టింది. అందమైన ఆడదానికి - అందులోనూ వయస్సులో ఉన్న అందమైన దానికి - మంచి 'రేటు' పలుకుతుందని ఆవిడకు తెలుసు. తొలిసారిగా పాతికరూపాయలు తీసుకొని, మూడో మనిషికి వొళ్ళప్పగించిన రాత్రి కన్నమ్మ గుండెలువిసిగిపోయేలాగా ఏడ్చింది. ఆ డబ్బును అగ్గిపుల్ల గీసి తగలెడదామా అని కూడా అనుకొన్నది. కానీ రెండు మాసాల యింటద్దె, రెండొందలు దాటిన చిల్లరపద్దు, చాకలి బాకీ- వీటిల్లో ఏ వొకదాన్ని తీర్చడానికీ ఈ పాతిక చాలవే! కోపంతో తను వీటిని తగలేసిబావుకొనేదేమిటి?
కన్నమ్మ ఈ వృత్తిలో ఎంత బాగా రాణించిందంటే - ఒకసారి రామిరెడ్డిగారొస్తే "మీరు రాత్రల్లా ఉంటారా? వెంటనే పోతారా?" అని నిగ్గదీసి అడిగి, అతని దగ్గర డబ్బు వసూలు చేసింది.
అంతవరకూ కన్నమ్మకు సినిమాలను గురించి ఎలాంటి అభిప్రాయమూలేదు. కాకపోతే సరసుడెవడన్నా ఆమెను బలవంతం చేస్తే అతనితోబాటు సినిమాకెళ్లేది. వాడు బాగున్నదంటే తనూ బాగున్నదనేది, వాడు "ధూత్" అంటే తను కూడా "ఛఛ" అనేది బస్!
ఒకసారో ఎక్ స్ట్రా సప్లయిరు కన్నమ్మనికలిశాడు. ఆవిడ వడ్డూ పొడుగూ చూశాడు. పలకరించి చూశాడు. మాట స్వచ్చంగా అంటున్నదీ లేనిదీ గమనించాడు.
"సినిమాల్లో వేషం వేస్తావా?" అన్నాడు గళ్ళలుంగీవాడు.
"ఓ" అన్నది కన్నమ్మ.
"ఏం కావాలి?" అన్నాడు గళ్ళలుంగీవాడు. బొటనవేలికి చూపుడువేలు తాకుతూ.
"ఏమిస్తావ్?" అన్నది కన్నమ్మ కళ్ళు టపటపలాడిస్తూ.
"ఓ గంతపని. రెండు దైలాగ్సు ఉన్నాయి. పాతికిస్తాను" అన్నాడు గళ్ళలుంగీవాడు.
"సరేపద!" అన్నది కన్నమ్మ.
బస్పెక్కాక-
"నీ పేరేమిటి?" అన్నాడు గళ్ళలుంగీ, ఆమెను రాచుకుంటూ.
"కన్నమ్మ!"
"అబ్బే" అని చప్పరించాడు గళ్ళలుంగీ, కాసేపు గిరజాల దువ్వుకుని ఫకాలుమని నవ్వాడు వాడు.
"ఏందది?" అన్నది కన్నమ్మ. అతన్ని ఇంకాస్త వొత్తుకుంటూ.
"ఏం లేదులే!" అన్నాడతను.
ఆ సంగతి అప్పుడు చెప్పలేదతను. ఆరు మాసాల తరువాత చెప్పాడు.
"నీపేరు కళ్యాణి. ఎవరన్నా అడిగితే అలానే చెప్పు."
"అదేం?" అన్నది కన్నమ్మ.
"నీ అసలు పేరు చెబితే నీకిక్కడ మంచి నీళ్ళు కూడా పుట్టవు."
"అట్టాగా" అన్నది కన్నమ్మ, వురఫ్ కళ్యాణి.
ఆ క్షణం నుండి ఆవిడ కళ్యాణిగా మారిపోయింది. ఈ పేరు జ్ఞాపకం ఉండటంకోసం తనలో తను చాలాసార్లు గొణుక్కుంది. ఇంతచెప్పినా సమయం వచ్చేసరికి పేరుకాస్తా మరిచిపోనేపోయింది.
గళ్ళలుంగీవాడు, ఆమెను స్టూడియోలోకి తీసుకెళ్ళి ఓ చెట్టు క్రిందకూచోమన్నాడు. వెళ్ళి ప్రొడక్షన్ మేనేజర్ను తీసుకొచ్చాడు. ఈ ప్రొడక్షన్ మేనేజరుకూ, గళ్ళలుంగీకి చాలా కాలం నుండీ దోస్తీ వుంది. ప్రొ.మే. ఏ కంపెనీలో వున్నా గళ్ళలుంగీని కనిపెట్టి వుంటాడు. అందుగ్గాను గళ్ళలుంగీ, ప్రొ.మే. కావలసిన సరుకును సరఫరా చేస్తూ వుంటాడు.
"ఎలావుంది?" అన్నాడు గళ్ళలుంగీ, మీసాలు మునిపంటితో కొరుకుతూ.
ప్రొ.మే.ముఖంలో సంతోషం కనిపించింది, గళ్ళలుంగీ పొంగిపోయాడు.
"బాగానే ఉందనుకో-" అని ఆగిపోయాడు ప్రొ.మే.
"కలర్ సరేనోయ్-"
"అన్నీ ఒకటో నెంబరు సార్!" చిలక కొరకని కాయ. గిరువుగారికి అర్పిస్తున్నాను.... క్రిందటిసారికూడా గురువుగారు తక్కువ చూపు చూశారు. ఆవారా, ఈవారా ఈ దఫా చూపించారు" అన్నాడు గళ్ళలుంగీ.
ప్రొ.మే.నవ్వాడు.
"పంపించు చూద్దాం."
గళ్ళలుంగీ కన్నమ్మ వురఫ్ కళ్యాణి దగ్గరకొచ్చాడు.
"ఎప్పుడు యాసాలెయ్యటం?" అన్నది కళ్యాణి.
"ఇప్పుడే!" అన్నాడు గళ్ళలుంగీ.
"మరిపదా" అన్నది కళ్యాణి.
"దామరీ!" అన్నాడు గళ్ళలుంగీ.
మధ్యలో అసలు విషయం కాస్తా చెప్పేశాడు గళ్ళలుంగీ!
"నువ్వందరితోటి మంచిగా వుండాలి. ఎవరు ఏం చెప్పినా 'సరే' నంటూ వుండాలి. అప్పుడే పైకొస్తావు. ఈ పెద్ద పెద్ద స్టార్లందరూ అట్లా పైకొచ్చినోళ్లే" అన్నాడు గళ్ళలుంగీ.
"ఓహో!" అన్నది కళ్యాణి.
"వాళ్ళకు మల్లే నీకూ పైకి రావాలని ఉందా!"
"ఉంది!"
"పెద్ద పెద్ద మేడలూ తోటలూ కావాలా?"
"కావాలి"
"కార్లు కావాలా?"
"కావాలి!"
"నౌకర్లూ, చాకర్లూ కావాలా?"
"కావాలి!"
"బంకుల్లో డబ్బు, బీరువాల్లో నగలూ-"
"కావాలి!"
"ఆటకు అరవై వేలు-"
"కావాలి!"
"అయితే చెప్పినట్లు వింటావా?"
"వింటా"
"అయితే విను" అంటూ ప్రొ.మే. సంగతి చెప్పాడు గళ్ళలుంగీ.
"ఓస్ ఇంతేగదా!" అనుకొన్నది కళ్యాణి.
మేకప్ రూమ్ లోగుండా, పెద్ద పెద్ద అడవుల బొమ్మలున్న తడికెల వెనక్కు తీసుకెళ్ళాడు గళ్ళలుంగీ.
అక్కడ కూచుని బీడీ కాలుస్తున్నాడు ప్రొ.మే.
"అరుగో ఆయనే దొరగారు! ఈ కంపెనీ మొత్తం ఆయనగారి చిటికెన యేలి చుట్టూ తిరుగుద్ది" అన్నాడు గళ్ళలుంగీ.
"నిజమే!" నన్నట్లు చూశాడు ప్రొ.మే.
నమ్మినట్టే చూసింది కళ్యాణి.
పదినిమిషాల తరవాత కళ్యాణి కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ వచ్చింది.
ప్రొ.మే. నవ్వుకుంటూ వచ్చాడు. అందాకా బీడీకాలుస్తున్న గళ్ళలుంగీ ఆఖరు దమ్ములాగి, బీడీని అవతల పారేశాడు.
"చెప్పండి!" అన్నాడు గళ్ళలుంగీ.
"చెప్పమను!" అన్నది కళ్యాణి.
