Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 39

ఆమె తరువాత ఉపన్యసించినవారు, మంజరి దాన గుణంతోబాటుగా ఆమె వినయాన్ని గురించి కూడా ముచ్చటించారు.
మంజరి నేరుగా బొంబాయి పోలేదు. మధ్యలో హైదరాబాదులో రెండు రోజులబాటు ఆగింది. శర్మగారి అంతకు వారం రోజులు ముందుగానే హైదరాబాదు వచ్చి, సన్మానోత్సవసన్నాహాలన్నీ చేశారు. ఇందుక్కావలసిన ఖర్చుల క్రింద, పదిహేను వేల రూపాయలకటిక రొఖ్ఖం ఇచ్చి పంపించింది మంజరి.
"స్టేట్ కాపిటల్ లో సన్మానం చేస్యిన్చుకోవడం ఓ ఫాషనైపోయిందాయే. నలుగురూపోయిన దోవనే మనమూపోదాం. తప్పేదేముంది?" అన్నది మంజరి.
మట్టిలో నుండి మాణిక్యాలను వెతికి తీసే ప్రతిభాశాలి శర్మ. దానికి తోడు, మంజరి తరిఫీదు అతన్ని రాటు తేల్చింది. అంతకు ముందు ముక్కు మొహమూ ఎరగకపోయినా, వారం రోజుల్లో శర్మగారు, "సినీజన ప్రేమిక సంఘాలు" అయిదారింటిని ఏర్పాటు చేశాడు. వారిచేత సన్మాన పత్రాలు, పూలదండలు, నినాదాలు - ఈ తతంగమంతా చేయించాడు.
"జరిగేదేదో పకడ్బందీగా జరగాలి, డబ్బుకోసం వెనక్కు తీయకు. అలాగైతేనే చూడు, లేకపోతే మనం మానుకొందాం!" అని ముందుగానే మంజరి హెచ్చరించింది.
"నేను టేకప్ చేసిన ఏపనీ ఫెయిల్ కాలేదు; కాదు కూడాను మీరే చూస్తారుగా?" అని భరవాసా ఇచ్చాడు శర్మ.
ఆయనగారు ఊహించిన దానికన్నా ఎక్కువే చేశాడు. ముందుగా అనుకొన్న దాని ప్రకారమయితే, ఊరేగింపు ప్రోగ్రాం లేదు. శర్మగారు అది కూడా పెట్టించాడు. కిరాయి మనుషులు చాలామంది ఊరేగింపులో పాల్గొనడమేకాదు; నినాదాలు చేయడమేకాదు; ప్రతి ఫర్లాంగుకు, ఓ డజను పూలదండలు మంజరికి సమర్పించారు.
మంజరి వీటన్నింటికి సముచిత రీతిని సమాధానమిచ్చింది. ఆవిడకు బాక్సాఫీసు సూత్రాలు బాగా తెలుసు. అవే సూత్రాలను మంజరి ఉపన్యాసాలకు కూడా అన్వయించింది. ఏ సభలో, ఏరకం ఉపన్యాసాలు బాగా రాణిస్తాయో మంజరి అనుభవ పూర్వకంగా గ్రహించింది. ప్రతిపదేసి నిమిషాలకూజనం చప్పట్లు కొట్టగల ధోరణిలో ఉపన్యసించడాన్ని మంజరి అభ్యాసం చేసింది!
నేనేదో కాలేజీకి ఉదారంగా లక్షపైచిలుకు విరాళమిచ్చానని ఉపన్యాసకులంటున్నారు. అది నా విధిగా భావించి నేను చేశాను" అని ఉపన్యాసం చివర ఓ ముక్క చేర్చింది మంజరి.
                                                      *    *    *    *
కాలేజీ ఫంక్షన్సు సందర్భంగా తాను బొంబాయిలో చాలా బిజీగా ఉన్నానని మంజరి ప్రకటించిననాటికి, ఆవిడ ప్రయత్నాలొక రూపానికి రాలేదు. సేఠ్ కిషన్ దాస్ చందూలాల్ కు మంజరి రెండు ఉత్తరాలు రాసింది. లేదా నన్నెప్పుడు బొంబాయి రమ్మంటారో రాయండి!" అన్నది మంజరి. దానికి జవాబుగా చందూలాలే మద్రాసు వచ్చాడు.
మంజరి ఈసారి పిళ్ళేను తొలగించింది, చందూలాల్ ను మీనం బాకం నుండి నేరుగా తన ఇంటికే తీసుకొచ్చింది.
"మీ రెవరో తేలకముందు, పిళ్లే అవసరమయ్యాడు. ఇప్పుడెందుకట? మీలాంటి వార్ని పరిచయం చేసినందుకు నిజంగా అతనికి నాధన్యవాదాలర్పించాలి" అన్నది మంజరి.
చందూలాల్ విశాలంగా నవ్వాడు ఆ దరిమిలా అతనున్న వారంరోజులూ మంజరీ మేన్షన్స్ లోనే మకాం చేశాడు. ఈలోగా, మంజరీ వసంతా కలిసి, చందూలాల్ ను ఇంకో మనిషినిచేసి పారేశారు.
నాకీ మద్రాసుమీద మొహం మొత్తింది సేఠ్ జీ! బాంబేవచ్చేదామనుకొంటున్నాను" అన్నది మంజరి.
"అయితేరా!" అన్నాడు చందూలాల్.
"వచ్చి ఏం చెయ్యను మరి? మీకు చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లూ తెలుసు. ఏదన్నా హిందీ పిక్చర్లో వర్క్ చేదామనుకొంటున్నాను అది మీకిష్టమైతేనే సుమా! మీరు కాదుకూడదంటే మానేస్తాను" అన్నది మంజరి.
చందూలాల్ తనతోబాటు మంజరిని కూడా తీసుకొచ్చాడు బొంబాయికి. ఆ మహా నగరాన్ని చూస్తూనే మంజరి ఆశ్చర్యపోయింది. గుంటూరుకూ మద్రాసుకూ మధ్యగల అంతరం కన్నా, బొంబాయి-మద్రాసుల మధ్యగల భేదం ఎక్కువనుకొన్నది మంజరి ఆవిడకయితే, పది రోజులపాటు, బొంబాయంత తిరిగి చూడాలనిపించింది. కానీ బలవంతాన ఆ కోరికను అణచివేసుకొంది మంజరి. తను మామూలు మనిషయితే ఫర్వాలేదు. హిందీ ఇండస్ట్రీలో పాదం పెట్టాలన్న సత్సంకల్పంతో ఇక్కడికొచ్చింది. తనకు మద్రాసులో ఉన్న కీర్తి ప్రతిష్టలేవీ ఇక్కడ చెలామణి కావు. అయితే- తను రాణించడానికి అవే మెట్లుగా ఉపయోగించాలి. అయినప్పుడు- తను జులాయిగా తిరిగితే లాభ మేముందీ? తను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
మూడోరోజున, ఎవరో తలుపుకొడితే "మంజరి యన్" అంటూ తలుపుతీసింది. ఎదురుగా "లాలారాం" చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యారు. ఓ క్షణంపాటు మంజరి నిర్విన్నురాలయింది. తన ఆశ్చర్యాన్ని కప్పి పెట్టుకొంటూ లాలారాంను ఆహ్వానించింది మంజరి.
"జ్ఞాపకం పెట్టుకొని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు" అని కూడా అన్నది.
"నేనింకా మీకు గుర్తుండడం నా అదృష్టం" అన్నాడు లాలారాం.
వెయిటర్ రెండు టీ తెచ్చిపెట్టిపోయాడు.
నిన్న సాయంత్రం మీరు, సేఠ్ కిషన్ దాస్, జూలో ఉండగా చూశాను. మీరిక్కడికొస్తున్నట్లుగా నాకు రాయనుకూడా లేదేం? నేనూ వచ్చి కలుసుకొనే వాణ్నిగా!" అన్నాడు లాలారాం.
దానికేదో సమాధానం చెప్పింది మంజరి.
తరవాత లాలారాం ఈ మధ్య విడుదలైన మంజరి పిక్చర్ల మీద తన అభిప్రాయం ప్రకటించాడు.
"మీరింకా ఆ మద్రాసులోనే ఎందుకండీ పోతారో నాకు అర్ధంకాదు. మిమ్మల్ని హిందీ ఫీల్డులో కూడా పరిచయం చేదామనుకొంటున్నాను. అయితే, పిక్చర్ ఫినిష్ అయిందాకా మీరు బాంబేలోనే ఉండాలి... మద్రాసులో మీకెన్ని పిక్చర్లున్నాయేమిటి?" అన్నాడు లాలారాం.
"ముప్పై రెండున్నాయి" అని కోసింది మంజరి.
"మరి మీరు బోంబేకెలావస్తారు?" అన్నాడు లాలారాం.
"అందులో చాలా పిక్చర్లు ఫినిషింగ్ స్టేజీలో ఉన్నాయి. మిగిలిన వాటిల్లో నేనున్న సీన్సు ముందుగా పూర్తిచేసుకోమంటాను" అన్నది మంజరి.
లాలారాం ఆలోచించి "సరే" అన్నాడు.
"నా దగ్గర కధ రెడీగా ఉంది. ఓ డాన్సర్ లైఫ్. దిక్కులేని కుటుంబంలో పుట్టి, అతనికిష్టమైన వాతావరణంలో పెరుగుతుంది. రకరకాల ఉద్యోగాలు చేస్తుంది. ఆఖరికి ఓ దొంగల ముఠాలో చేరిపోతుంది. దొంగలు - తమదోపిడికి ఆమె నొక సాధనంగా చేసుకొంటారు. ఆ దొంగల ముఠాను పట్టుకొనే ప్రయత్నంలో పోలీసులు ఆమెను పాచికగా వాడుకొంటారు. ఈ రెండువర్గాల మధ్యా ఆవిడ నలిగిపోతుంది. స్థూలంగా ఇదీ కధ. ఇందులో నువ్వు హీరోయిన్ వు. ఇద్దరు హీరోలు - దొంగల నాయకుడు - పోలీసు అధికారి. డాన్సర్ దొంగల నాయకున్ని ప్రేమిస్తుంది. కానీ అతని దౌష్ట్యానికి బలయిపోతున్న ప్రజల దీనావస్థను చూచి ఆమె చలించిపోతుంది. అతనెంత చెప్పినా వినడు. ప్రజల పట్ల తన కర్తవ్యం, తన వ్యక్తిగత సుఖం- ఈ రెండింటి మధ్యా సంఘర్షణ ఎక్కువభాగం, ఎల్లోరా, అజంతాల్లో షూట్ చేస్తాను. కంప్లీట్ కలర్ పిక్చర్" అన్నాడు లాలారాం.
మంజరి పళ్ళు పులిసిపోయాయి.
"చాలా థాంక్సండీ!" అన్నది మంజరి. లాలారాం తలపంకించాడు.
"ఎంత హీనంగా చూసుకొన్నా ఇరవై లక్షలుకావాలి. నేనంత పెట్టలేను. మంచి ఫైనాన్సర్ ను చూస్తున్నాను. ఏదోలాగా పిక్చర్ తగలేయడం నాకిష్టం లేదు... ఇంకో సంగతేమిటంటే- ఇక్కడ చాలా మంది - నా పిక్చర్ లో కారుచవగ్గా వేషాలేస్తామంటున్నారు. కొందరు ఎదురు డబ్బిస్తామని కూడా అన్నారు. నేను వొప్పుకోలేదనుకో! నాకయినా మొత్తం డబ్బు అవసరంలేదు. ముందు సగందాకా పెట్టుబడికావాలి. తతిమ్మాది అవసరాన్నిబట్టి సర్దుతూ ఉండాలి. కిషన్ దాస్ ను మరోసారి హెచ్చరించి చూడండి! అతనొప్పుకొంటే, మీరు నా పిక్చర్లో హీరోయినయినట్టే లెఖ్ఖ" అన్నాడు లాలారాం.
అతని అభిప్రాయమేమిటో, మంజరికి అరిటిపండోలచి చేతబెట్టినట్లుగా అవగాహమయింది.
"ఏమంటారు?" అన్నాడు లాలారాం.
మంజరి తొందరపడదలచుకొనలేదు.
"చూదాం. మళ్లా కలుస్తారుగా?" అని విషయాన్ని ఎటూ తేల్చకుండా నానవేసింది మంజరి!
డైరెక్టర్ లాలారాం ఆ తరవాత యింకో గంటదాకా ఈ సినిమాసంగతులన్నీ మార్చి మార్చి చెప్పుకొచ్చాడు. నిజానికి సంభాషణ మంజరికేమీ రుచించలేదు. అలాగని దాన్ని బయటికి అనడానికీలేదు. చాలా శాంతంగా అతని వాగుడు భరించడమే కాకుండా, మధ్య "ఓహో - "ఆఁహా" - "ఐసీ" - "దట్స్ గుడ్" లాంటి పదాలను గూడా, సమయానుకూలంగా ప్రయోగించింది.
మంజరిని ఏదోవిధంగా, తన పిక్చర్లో వాడుకోవాలన్న సదభిప్రాయం లాలారాంగారికి కలిగినట్లే, అతన్ని అడ్డం పెట్టుకొని ఉత్తరాదికి కూడా యెగబాకాలని మంజరికి కలిగింది. అయితే లాలారాం, తన నటనను మాత్రమేకాక - తననుండి ఫైనాన్స్ ను కూడా ఆశిస్తున్నాడని మంజరి ఆదిలోనే గ్రహించింది. ఈ తరహా ధోరణి ఆవిడకు కొత్తదేమీకాదు- అవునుగానీ ఈ విషయమై అటో ఇటో తేల్చి చెప్పడానికి ఆవిడ సిద్దంగా లేదు. కావాలంటే తను మద్రాసులోనే ఆమాత్రం పెట్టుబడిని పుట్టంచగలదు. అవసరమైతే తనే భరించగలదుకూడాను. కానీ యిపుడది ప్రశ్నకానే కాదు. తనో చిల్లికానీ పెట్టకుండా ఈ రంగంలోనికి రావాలి. అందుకేమన్నా మార్గమున్నదా - లేదా - అన్నదే ప్రశ్న. తనే డబ్బు పెట్టుకునే పక్షంలో - బొంబాయి రావడంకూడా దండగే! తను హాయిగా మద్రాసులోనే ఉండి, తనక్కావల్సిన విధంగా కధ రాయించుకొని ఓ హిందీ పిక్చర్నే ప్రొడ్యూస్ చేసివుండేదీ! ఇపుడెన్ని హిందీ సినిమాలు మద్రాసులో తయారవుతున్నాయిగాదు? ఎంతమంది సౌతిండియా ప్రొడ్యూసర్లు- బొంబాయి వచ్చి సినిమాలు తీస్తున్నారు కాదు?
లాలారాం మాట్లాడుతున్నప్పుడే మంజరికీ ఆలోచనలన్నీ వచ్చాయి. అందుకే ఆవిడ "ఔ"ననీ "కా"దనీ తేల్చకుండా విషయాన్ని మాగబెట్టింది.
లాలారాం కూడా అమీ తుమీ తేల్చమనలేదు, ఆలోచించమనీ ఇటువంటి అవకాశం ఎప్పుడోగానీ రాదనీ మాత్రం అన్నాడు.
"మళ్ళా మనం కలుసుకొంటున్నాం గదా! ఈ లోగా నా డెసిషన్ చెప్పేస్తాను" అన్నది మంజరి.
"ఈ విషయం ఇలా ఉంచండి! పోతే - మీరిక్కడికొచ్చినట్లు ఇక్కడి ఆర్టిస్టులకు తెలిసింది. వారిని మీరు పరిచయం చేసుకోవడం మంచిది. అలా కాదు - వారే మిమ్మల్ని పరిచయం చేసుకోవాలనుకొంటున్నారు. రెండు మూడు రోజుల్లో పార్టీ ఏర్పాటు చేదాం...ఇంద...ఇదీ నా ఫోన్ నెంబరు" వస్తాను అంటూ లాలారాం వెళ్ళిపోయాడు.
ఈ వ్యవహారాన్ని సేట్ కిషన్ దాస్ చందూలాల్ తో చెప్పేప్పుడు మంజరి ప్రదర్శించిన నైపుణ్యం అద్వితీయమైనది. తనకాగొడవలంటే యిష్టమేమీలేదంటూనే, ఆ పిక్చరుకు డబ్బుపెట్టుబడి పెట్టడంలో గల లాభాలను గురించి విపులంగా చర్చించింది మంజరి.
"నువ్వు గట్టిగా కావాలంటే డబ్బివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. వాడడిగిన మొత్తం నాకో లెక్కలోనిది కూడా కాదు. కానీ దానివల్ల నీ కొరిగేదేమిటో నాకు తెలీకుండా వున్నది." అన్నాడు చందూలాల్.
"నాకు హీరోయిన్ వేషమిస్తానన్నాడు" అనాలి మంజరి.
కానీ--
ఆవిడలా అనలేదు. ఆ మాట తన నోటినుండి వచ్చాక, తన విలువ సగానికిసగం పడిపోయిందనడంలో సందేహం లేదనుకొన్నది మంజరి.
సమాధానంగా నవ్వి ఊరుకొంది.
చందూలాల్ ఓసారి నిశితంగా మంజరికేసి చూసి సిగరెట్ అంటించాడు.
"నాలో ఓ బలహీనత వుంది సేఠ్ జీ! ప్రతిదాన్నీ నేను డబ్బుకు ముడేట్టి చూడలేను. ఇందువల్ల జీవితంలో నేనెన్ని యిబ్బందులు పడ్డానో లెఖ్కలేదు. అయినా నాకు జ్ఞానోదయం కలగకుండా వుంది మీరన్నమాటా నిజమే! నిజంగా ఈ లాలారాంగాడికి మీరు ఫైనాన్సు చేయడం వల్ల, ఉపయోగమేమిటంటారు?" అన్నది మంజరి.
చందూలాల్ ఆవిడ ధోరణికి విస్తుపోయాడు. తను ఏ ప్రశ్నకు జవాబు కావాలనుకున్నాడో, అదే తనకు యెదురయినిలుస్తుందని అతనూహించను కూడాలేదు.
"ఏదో, మాట వరసకడిగాను. ఆ డబ్బు నాకు తిరిగి రాకపోయినా ఫర్వాలేదు. నువ్వు రికమెండ్ చేశావు గనక, నేనొప్పుకొంటున్నాను. పోనీ లాలారాం నీకేదన్నా మంచి వేషమిస్తాడేమో అడక్కపోయావా?"
"అడుగుదామనుకొన్నాను" అన్నది మంజరి సడన్ గా వాక్యాన్ని ఆపేసి,
"ఊఁ"
"నేనింకా సినిమాల్లో పనిచేయడం మీ కిష్టమో కాదో నాకు తెలిదాయే. మీ అభిప్రాయం తెలుసుకొందే, నేనెలా అడగనండీ! తీరా అదిగాక, అతను "సరే" నన్నాడనుకోండి - మీరు "వీల్లే" దన్నారనుకోండి - అప్పుడు నేను వెర్రిబాగులదాన్ని కావలసి వుంటుంది. ఈ కిటుకంతా లేకుండా మిమ్మల్నడిగే చేదామనుకొన్నాను.""థాంక్స్" అన్నాడు చందూలాల్.
అప్పటికప్పుడే అతని కళ్ళల్లోకి తోడేలు చూపులు రావడం చూసి, మంజరి నిశ్శబ్దంగా నిట్టూర్చింది.
                                                      *    *    *    *
చందూలాల్ ఈ కలర్ పిక్చర్ కు ఫైనాన్స్ చెయ్యడానికి ముందు చిన్న "మతలబు" జరిగింది. అతను చాలా కాలంనుండీ, ఓ లైసెన్స్ కోసం ప్రత్నిస్తున్నాడు. చతుర్విధోపాయాలు ప్రయోగించినా, ఆ వ్యవహారం తేలడం లేదు. రాజకీయంగా అతను ఆ శాఖోద్యోగులమీద వల్లమాలిన వత్తిడి తీసుకువచ్చాడు. భారీగా విరాళాలిచ్చాడు. వారికి సన్మానాలు చేశాడు. పార్టీలిచ్చాడు. కానీ, యెక్కడో యేదో అడ్డుకొంటోంది. దాన్ని తొలగించడం అతని వశం కావడం లేదు. ఆ లైసెన్స్ వస్తే - కోట్ల మీద వ్యాపారం జరుగుతుంది. లక్షదాది లాభాలు - అలా - వచ్చి దూకుతాయి, కానీ ఏం లాభం? రోజు రోజుకూ ఈ విషయం లోతుకు దిగజారిపోతున్నదే తప్ప, పైకి వచ్చే సూచన లేవీ కనిపించడంలేదు.
సరిగ్గా ఈ సమయంలోనే అతను మంజరిని గురించి విన్నాడు. ఉన్నతోద్యోగ వర్గాల్లో ఆమెకున్న పలుకుబడి అతన్ని విభ్రాంతున్ని చేసింది. తన వ్యవహారాన్ని పరిష్కరించగలిగిన వ్యక్తి మంజరి మాత్రమేనని అతను గ్రహించాడు. ఈ పని పూర్తవడానికి అతనెంత ఖర్చయినా చేసేందుకు సిద్దపడ్డాడు.
తెలివైన పెట్టుబడిదారుడు ఖర్చులు చూసి జడుసుకోడు. తక్షణ లాభాలకోసం కూడా ఆసపడడు. ఒక్కోసారి చేసిన ఖర్చులో వీసపాలు కూడా తిరిగిరాకపోవచ్చు. అలాంటి దేశంలో కాళ్లారజాపి చతికిలబడడు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెడతాడు. సంచులు విప్పి ధనాన్ని వెధజల్లుతాడు. ఈ వెరసి మొత్తానికి అనేక రెట్లు తనకు వస్తుందని అతనికి రూడిగా తెలుసు.
చందూలాల్ తెలివైన పెట్టుబడిదారు అనడంలో సందేహంలేదు. అసలు విషయం చెప్పకుండానే మంజరిమీద బోలెడంత కాంక్షలను రేకొలిపాడు. ఆ అగ్నిజ్వాలలు మంజరిని నిలువుగా దహించివేశాయి.
తొలి రోజుల్లో మంజరి ఇంతదూరం ఆలోచించలేదు. రాను రాను చందూలాల్ ధోరణిని ఆవిడా అవగాహన చేసుకొన్నది. తన ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడని తేలిపోయినప్పుడు, ఆవిడ రవంత బాధపడింది. తను సాధారణంగా మోసపోదనీ, తన "పట్టు" నుండి విడిపించుకోవడం ఒకంతట సాధ్యంకాదనీ- ఆవిడకో గర్వం వుండేది. ఇప్పుడది మొనబోయింది. చందూలాల్ తనకు చిక్కడం కాదు; తనే అతని చేతిలో చిక్కిపోయింది. తనకు తెలీకుండానే అతనికి కావలసిన పనులన్నీ చేసి పెడుతున్నది.
అయితే మంజరి నిరాశపడి క్రుంగిపోలేదు. ఇదీ ఒకందుకు మంచిదే ననుకొన్నది. తనిక మద్రాసులో వుండి సాధించవలసింది కూడా ఆమెకేమీ కనిపించలేదు. దాదాపుగా ఏడెనిమిదేళ్ళ పాటు మొత్తం పరిశ్రమను ఉక్కిరి బిక్కిరి చేసి పారేసింది. తన మాటను శిలా శాసనం కింద మార్చేసింది. "సినిమాకు ముడిఫిలిం ఎంత అవసరమో, మంజరీ అంతే అవసరం" అన్నపేరు సంపాదించింది. తను హతమార్చాలనుకొన్నవారిని, నామరూపాలు లేకుండా చేసింది. పైకి తేవాలనుకున్నా వారిని అలా - లేపి- తారా మండలంలో నిలబెట్టింది. తన ఇంటి గడపల్లో వందల మందిని పడిగాపులు పడేట్టు చేసింది. తనకోసం - వేలకు వేలు గుమ్మ రిస్తామన్న వారి ముఖాలమీద - పగలబడి నవ్వింది.
అయినా తృప్తిపడలేదు. ఇంకా ఇంకా ఏదో సాధించాలన్న తపన ఆవిన్ను స్థిమితంగా వుండనివ్వలేదు. తను ఉత్తర భారత సినీ పరిశ్రమలో కూడా కాలుమోపాలనీ ఇక్కడ సాధించిన విజయాలకు రెట్టింపు - అక్కడ సాధించాలనీ కలలుగన్నది. ఆ స్వప్నాలను నిజం చేసుకోవడానికి చందాలాల్ ను ఎందుకువాడుకో కూడదనుకొన్నది.
తనెంతో తెలివిగా మంజరిని వుపయోగించుకొంటున్నాననుకొన్నాడు చందూలాల్. అతనిలాగే అనుకోనిచ్చింది మంజరి. ఆ భ్రమలో అతనున్నప్పుడే తన పనులను చక్కబెట్టుకోవాలను కొన్నది. 'ఇదుగో - అదుగో' అంటూనే అతనికి జోలపాటలుపాడింది. అతని చేత లాలారాం పిక్చరుకు కావలసిన పెట్టుబడినంతా పెట్టించింది. తను స్థిరంగా నిలబడలేక పోతున్నాననీ, మంజరి తనను గుప్పిటలో బిగించి వేస్తున్నదని చందూలాల్ గ్రహించేసరికి సమయం మించిపోయింది. అప్పటికే అతను అయిదారు లక్షలు, యీ చిత్రం మీద పెట్టాడు. మధ్యలో ఆగితే - మొత్తం డబ్బు గల్లంతవుతుంది. పూర్తి కావడానికి మరింత సొమ్మయినా పెట్టాలి. చందూలాల్ తెలివైన పెట్టుబడి దారుడు కనక అతను చిత్రాన్ని పూర్తిచేయడానికే నిశ్చయించాడు.
ఈలోగా అతననేకసార్లు మంజరిని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా కదిపిచూచాడు. ఒకసారి ఢిల్లీ వెడదామనీ, ఆ లైసెన్స్ సంగతేమిటో తేల్చుకొందామనీ, అతనంటూనే వున్నాడు. ఆమె 'సరే సరే' నని అంటూనే వున్నది.
చందూలాల్ ను తన్ని తగలేయడం వో లెక్కలోదికాదు. ఓ శుభముహూర్తాన, ఆ 'ప్రియమైన చవట'ను వదిలించుకుని విమానమెక్కడం ఓ నిమిషంపని. అనేకసార్లు, ఆవిడ తిరిగి మద్రాసే వెళ్ళిపోదామని కూడా అనుకొన్నది. కానీ అపజయాన్నంగీకరించడానికి ఆవిడమనస్సు సిద్దంగా లేదు. తను బొంబాయిలో దమ్మిడీకి కూడా చెల్లు బడికాలేదనీ, "పొలో" మంటూ కొంపచేరుకొన్నదనీ, మొత్తం పరిశ్రమకోడైకూస్తుంది. ఆ అవమానం భరించడం కన్నా చావడమేనయం. అదీగాక- అప్పుడు తనకంత డిమాండ్ కూడా ఉండకపోవచ్చు. కొత్త వాళ్లెందరో ఈ రంగంలోకి రావాలని విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. వారిలో చాలా మంది - ఇప్పుడున్నవారి కన్న అన్ని విషయాల్లోనూ ఉన్నత శ్రేణికి చెందినవారున్నారు. ఆపోటీని తట్టుకొని నిలబడగలగాలి.
దీనికితోడు బొంబాయి వాతావరణం పొగలూ సెగలూ ఎగచిమ్ముతున్నది, దక్షిణాది తారలందరూ హిందీ రంగాన్ని ఆక్రమిస్తున్నారని, కానీ ఉత్తరాది ఆర్టిస్టులకు, దక్షిణాన బుకింగ్ లే ఉండవనీ, పత్రికలు తరుచుగా వ్యాసాలు రాస్తున్నాయి. బొంబాయి ప్రొడ్యూసర్లు సౌతిండియన్ ఆర్టిస్టుల మీద మోజు తగ్గించుకోవడం అవసరమనీ, ఆ మాత్రం రూపు రేఖలున్నవారు ఇక్కడా ఉన్నారనీ, కొన్ని పత్రికలు హెచ్చరికలు కూడా చేస్తున్నాయి.
ఇటువంటి వాతావరణంలో ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలి. తను వొంటరిగా లేననీ, తన వెనక సర్వ విధాలా సమర్ధులైన వారున్నారనీ, పరిశ్రమకు తెలియాలి. అప్పుదింత ఉదృతంగా దుమ్మూ దూగరా, తనమీదికి రాదు. సగం- అందుకే- మంజరి- అన్నింటిని మౌనంగా భరిస్తూ వచ్చింది.
నర్తకి జీవిత కధ ప్రధాన ఇతివృత్తంగా గల ఈ చిత్రంలో, మంజరి కధానాయిక. ఈ పాత్రకు న్యాయం చేకూర్చడానికి మంజరి అహోరాత్రులు శ్రమించింది. నాట్యంలోని లలిత లలితాలైన భంగిమలను అభినయించడం కోసం, ఆవిడ తీసుకొన్న శ్రద్ద అనన్యమైనది. తనుంటున్న మేడలోని ఒక గదిని పూర్తిగా అద్దాలతో నింపివేసింది. ఆ గదిలో గంటలకు గంటలు, నృత్యాన్ని అభినయించేది. ప్రతి చిన్న కదలికనూ, ప్రతి స్వల్ప సంచలనాన్నీ దీక్షతో అభ్యసించేది. నాట్యాచార్యుడెప్పుడన్నా పాలు మాలితే తనే అతన్ని ఉత్సాహపరిచేది. తీవ్రమైన ఆమె పట్టుదలను చూసి, నాట్యాచార్యుడే ఒక్కోసారి రిచ్చపడేవాడు.
హిందీ ఉచ్ఛారణ మరో తల నొప్పిగా తయారయింది. మాడ్యులేషన్ సరే - కానీ - ఆ అనడంలో సరళత ఉండేది కాదు. పట్టి పట్టి మాట్లాడుతున్నట్టే ఉండేది. ముక్కుతో అనవలసిన మాటలో, సగం మాత్రమే ఉచ్ఛరించవలసిన మాటలూ - ఊది పలకవలసిన పలుకుబడులూ - ఆవిడ నాళ్ళూ నరాలూ కొరికేశాయి. టేప్ రికార్డర్ సహాయంతో, మంజరి తన ఉచ్ఛారణను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేది. ఒక పదాన్ని వందసార్లన్న సందర్భాలూ కూడా లేకపోలేదు.
ఈ తరహా శ్రమ మరిచిపోయి ఆవిడ చాలా సంవత్సరాలయింది. అలిసిపోయి, రవంత జారగిలబడగానే, తన తొలిరోజులు మనసులో మెదిలేవి. అప్పుడూ తనిలాగే డైలాగ్సును రిహార్సల్స్ చేస్తూ ఉండేది.
బొంబాయిలో నేను, "అ అ"ల నుండి నాచదువు ప్రారంభిస్తున్నాను అనుకొనేది మంజరి.
సంవత్సరంలో పూర్తవుతుందనుకొన్న ఈ పిక్చరు ఇంకో ఏడాదికి పైగా దేకింది. ఇందుకు సగం కారణం తానేనని మంజరి నిష్పేచీగా వొప్పుకొంది.
ఆవిడ పూర్తిగా బొంబాయిలోనే ఉండి పోవడానికి లేదు. తను పనిచేస్తున్న పిక్చర్లు మద్రాసులో చాలా ఉన్నాయి. అలాగని - ఆ పిక్చరును కాదనడం మంజరికి బొత్తిగా ఇష్టంలేదు.
ఈపిక్చరు సగంలో ఉన్నప్పుడే బొంబాయి నిర్మాతలు ఆమెను బుక్ చేయడానికి ముందుకొచ్చారు.
వారందరికీ మంజరి; సవినయంగా ఒకే వొక సమాధానం చెప్పేది---
"నన్ను మన్నించండి" మద్రాసులో నాకు ఊపిరి తిరగనన్ని పిక్చర్లున్నాయి. వాటినోదారి పట్టించిగానీ, నేను మీకు మాటివ్వలేను.
                                             *    *    *    *
వంద తెలుగు సినిమాలు తెచ్చిపెట్టలేని కీర్తిని, ఈ వొక్క హిందీ పిక్చరు తెచ్చి పెట్టింది మంజరికి.
"ఇందుకోసం నేనుపడిన శ్రమను తలుచుకొంటే భయంవేస్తుందిప్పుడు గొడ్డులాగా పనిచెయ్యడమంటే ఏమిటో అప్పుడే, నేనర్ధం చేసుకొన్నాను. అమానుషమైన శక్తులేవో నన్ను నడిపించి ఉండకపోతే ఈ పని నాకు సాధ్యమయ్యేది కాదు" అన్నది మంజరి.
ఫిలిం జర్నలిస్టులు ఆమె బొంబాయి అనుభవాలను గురించి రకరకాల ప్రశ్నలు వేశారు.
"మన చిత్రాల్లో కన్నా, బొంబాయి వాటిల్లో ఫారెన్ ఇన్ ఫ్లూయన్స్ ఎక్కువగా ఉంటుందనుకొంటాను. వాటిని చూసి "ఇదీ భారతీయ సంఘం" అనుకోవడానికి లేదు. సంగీతంలో కూడా హాలీవుడ్ అనుకరణ హెచ్చుగా ఉంటుంది. అయినా బొంబాయికి నేను చాలా కొత్తదాన్ని, నా అభిప్రాయాలు సరైనవో కావో, నేనిప్పుడేమి చెప్పలేను" అన్నది మంజరి.
"ఏ ఆర్టిస్టుల్లోటాలెంట్ బాగా ఉంటుందంటారు?" అన్నాడొక జర్నలిస్టు.
మంజరి - క్షణకాలం ఆలోచించి సన్నగా నవ్వింది.
"మరీనన్నింత నిగ్గదీసి అడక్కండి. టాలెంట్ ఉన్నవారు అన్ని చోట్లా ఉన్నారు. ఏ భావమూ పలకని మొఖాలు ఎక్కడైనా ఉంటాయి" అన్నదావిడ చాలా తెలివిగా తప్పుకొంటూ.
"హిందీ ప్రొడ్యూసర్లు ఇచ్చినంత డబ్బు మనవాళ్ళివ్వక పోవడానికి - మీరనుకొంటున్న కారణాలేమిటి?" అన్నాడతనే!
"ఆపిక్చర్ల కొచ్చినంత రాబడి మన కొస్తున్నదంటారా? నే విన్నదేమిటంటే - ఎంత తుక్కు హిందీ పిక్చరయినా డబ్బు చేసుకొంటుంది. కనీసం పెట్టుబడి డబ్బుకయినా ఢోకా ఉండదు కానీ తెలుగు ఫీల్డు అలా కాదు. 'ఎ' క్లాసు సెంటర్సులో అధమ పక్షం పదివారాలు ఆడితేగానీ పెట్టుబడిరాదు. ఇవన్నీ మీకు తెలియనివిగావు," అన్నదావిడ.
"మీరిక బొంబాయిలోనే స్థిరపడదలచుకొన్నారా? అన్నాడింకో జర్నలిస్టు."
"మీరు అచ్చువెయ్యనంటే చెబుతాను," అన్నది మంజరి నవ్వుతూ.
అందరూ 'చెప్ప'మన్నారు.
"ఆ ఫీల్డులో నాకున్న స్థానమెలాంటిదో ఇంకా తేలలేదు. మీరడిగిన దానికి 'జే'నన్నాననుకోండి; నాకిక్కడున్న పిక్చర్లన్నీ పోతాయి. "కా" దన్నాననుకోండి; నాకు బోంబేలో చెల్లుబడిలేదంటారు. కాబట్టి బాబూ అలాంటి ప్రశ్నలు నన్నడక్కండి" అన్నది మంజరి.
ఓ మనిషి గౌరవాగౌరవాలు అతని బాంక్ బాలన్సును బట్టి నిర్ణయించినట్లే ఒక పిక్చర్ మంచి చెడ్డలు, అది వసూలు చేసిన డబ్బును బట్టి నిర్ణయించవలసి ఉంటుంది.
ఈ దృష్ట్యా - మంజరి తొలిగా నటించిన ఈ హిందీ చిత్రం ఉత్తమోత్తమమైనదనడంలో సందేహం లేదు. సెన్సార్ బోర్డువారు అదృష్టవశాత్తూ దానికి "ఎ" సర్టిఫికెట్టిచ్చారు. బాక్సాఫీసు బద్దలు కావడానికి అదొక్కటి చాలు.
చాలా పత్రికలు చిత్రంలో కధ బొత్తిగా లేదని రాసిన మాట నిజమే! కానీ మంజరి బాగా లేదన్న పత్రికొక్కటీ లేదు. అన్ని రకాల జనానికీ నచ్చాలన్న అభిప్రాయంతో, అందులో అన్ని రకాల నాట్యాలనూ గుత్తళం కింద అమర్చిపారేశారు. ఏ భాగానికాభాగం, ఎంత బావున్నదో - అన్నిటినీ కలుపుకొని చూసినప్పుడు అంత వెకిలిగానూ ఉన్నది. మంజరి డాన్సులే లేకపోతే, చిత్రం ఇన్ని రోజులు నడిచేది కాదు.
మద్రాసులో విడుదలయినప్పుడు, మంజరి సకుటుంబంగా వెళ్ళి చిత్రాన్ని చూసింది.
"నిన్ను చూస్తుంటే నాకొక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది మంజూ! నువ్వుగానీ శాపం పొందిన దేవతవేమోనానుకొంటాను అప్పుడప్పుడు" అన్నది కళ్యాణి మధ్యలో.
మంజరి ముందుకు వంగి, కళ్యాణి చెంపలను పెదవులతో తాకింది మెత్తగా.
"నువ్వీ మద్రాసులో ఉండటం బాగోలేదు మంజూ! నీకిది తగిన స్థలంకూడా కాదు. నామాట విని బొంబాయికి వెళ్ళిపో" అన్నది కళ్యాణి.
'రానివ్వాలి గదా?' అన్నది మంజరి.
కళ్యాణి అప్పటికి ఊరుకొని, తరవాత, దానికి సమాధానం చెప్పింది.
"రానివ్వదు. కానీ మనం వెడదాం. అదంతే?"
"నా మీద నీకింత అభిమానమెందుకు కళ్యాణి?" అన్నది మంజరి ఆర్ద్రంగా.
"ఎందుకా? అవును. ఎందుకని మంజూ?" మంజరి పలకలేదు.
ఆవిడకేవేవో జ్ఞాపకాలొచ్చాయి. తను వెడుతున్నాననీ, మీరు పిక్చర్ చూసిరండనీ, మిగతావారితో చెప్పి బయలుదేరింది.
"నేను వస్తున్నాను, "అన్నది కళ్యాణి.
ఇంటిదాకా ఎవరూ పలకలేదు.
"నీకీపూట ఏం కులాసాగా లేదనుకుంటాను. రేపోకసారి వస్తాను మంజూ! నీతో వో అరగంట మాట్లాడాలి" అన్నది కళ్యాణి.
నాక్కూడా ఏదో బెంగగా ఉన్నదక్కా. అంతమంది జనంలో ఉన్నా వొంటరిగా ఉన్నాన్న ఫీలింగ్ తో గిజగిజలాడిపోయాను. నన్నుక్కిరి బిక్కిరి చేసే కబుర్లేవన్నా చెప్పు" అన్నది మంజరి.
"అలాంటివేమీ నాదగ్గర లేవమ్మా!" అన్నది కళ్యాణి.
కానీ--
అంతకు మించినవే చెప్పింది.
"మనుషులంటే నాకు పరమసహ్యం వేస్తోంది మంజూ! ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలీదు, ఎందుకలా నిమిషాలమీది మారిపోతారో అంతకన్నా తెలీదు. నాకు అధికారం లేదుగానీ ఉంటే - వీరందర్నీ కట్టగట్టి ఊబిలోకి దించేద్డును మంజూ!" అన్నది కళ్యాణి.
"అలాగే చేద్దాం," అన్నది మంజరి తాపీగా.
"మనిషి మనిషిగా కాకుండా - కొన్ని కుక్క లక్షణాలలో వుంటే ఎంత బావుండునో అనుకొంటాను.....ఈ చలపతిగాడు నీకేమన్నా అవుతాడా మంజూ?"
"ఏమవుతానంటున్నాడు?" అన్నది మంజరి నవ్వి.
"నిన్నేదో ఉద్దరించేశానంటున్నాడు. తను లేకపోతే నువ్వనే దానివే వుండవట. నీకోసం తను చాలా చాలా త్యాగం చేశాట్ట. తను గానీ తలుచుకుంటే నిన్ను మట్టిచేసిపారేయడం చిటికలోపనిట. ఈ వాగుడంతా నువ్వెలా సహిస్తున్నాడో యెందుకు సహిస్తున్నాడో నాకు తెలీదు. వాణ్ని పంపెయ్యరాదూ?"
"అలాగే పంపుదాం!"
"వాడెంతదాకా వచ్చాడంటే - నీకూ వసంతకూ మధ్యకూడా తంపులు పెట్టాడు. ఆవిడకేవో పిక్చర్లోస్తే నువ్వుపాడుచేశావట, నీకన్నా వసంత పైకి రావటం నీకిష్టంలేదట, బొంబాయి నుండి వసంత పాటలకోసం, ఏదో కంపెనీవారు అడిగితే, నువ్వు కాదన్నావట. వీడేవో ఉత్తరాలు కూడా చూపి వారిని నమ్మించాడు అన్నది కళ్యాణి."
"పోన్లే అక్కాయ్! వాడిగుణం అలాంటిదీ!" అన్నది మంజరి.
"నేను వాణ్ననడం కాదు. మనవాళ్ళనంటున్నాను. చెప్పే వాడేదో చెబుతాడు- నమ్మడానికి మనకైనా బుద్ది ఉండాలి కదా!" అన్నది కళ్యాణి.
"ఉండాలి, కానీ లేదు" అన్నది మంజరి.
కళ్యాణి సోఫామీద ఒక్క చరుపు చరిచింది.
"మరీనువ్విలా మన్నుదిన్న పింజేరులా అయిపోతున్నావేమిటి మంజూ! కాస్తన్నా చురుకుదనం లేకపోతే యెలా?" అన్నది కళ్యాణి.
"మనుషుల్ని గురించి మనమేమనుకోవడానికి లేదక్కా" అన్నది మంజరి. రాజమణిగానీ, వసంతగానీ నా దగ్గర వుంటారనుకోను. ఉండాలని కూడా నేననుకోవడంలేదు, వసంతకు మంచి బుకింగ్స్ ఉన్నాయి. ఇకది- బాగానే నెట్టుకొస్తుందనుకొంటాను.
కళ్యాణి ఏమీ అనలేదు.
"మనం బాంబే పోదాం రారాదూ?" అన్నది మంజరి.
"నేనెందుకే, నీకు బరువూ?"
"అలాకాదు, అక్కడ పిక్చర్లో పనిచెయ్యడం ఓ కొత్త అనుభవం! అడుగడుగునా - ఎన్నో చిక్కులోస్తుంటాయి. ఒక్కోసారి ఊపిరి సలపదు. ఆ పద్మవ్యూహంలో ఇరుక్కొని, గిజ గిజలాడిపోయి, బయటపడ్డప్పుడుండే ఆనందం - చాలా గొప్పగా వుంటుంది కళ్యాణి!" అన్నది మంజరి.
"ఒకసారి చాలా చిత్రమైన సంఘటన జరిగింది. ఔట్ డోర్ షూటింగ్ నుండి తిరిగొస్తున్నాం. మా యూనిట్ తో సంబంధంలేని మొఖం నాకు దోవలో కనిపించింది. నేనంతగా పట్టించుకోలేదు. అదే రాత్రి పదకొండింటికి అతను నాగది కొచ్చాడు. ఎందుకో చాలా భయమేసింది. ఎవ్వరూ లేరని రూడిచేసుకొన్నాక, అతనో చిన్న పని చేసి పెట్టమన్నాడు. ఎంత డబ్బయినాయిస్తానన్నాడు."
"చందూలాల్ గాడి మోస్తరుగా - వీడూ ఇంకేమన్నా - "అని నవ్వింది కళ్యాణి.
"అబ్బే కాదు" అంటూ ప్రారంభించింది మంజరి. ఫలానా వాడు నీకు తెలుసుగదా అన్నాడు. వీడెందుకడుగుతున్నదీ నాకు అర్ధంకాక తెలీదన్నాను. వాడో క్షణం ఆలోచించి, నేనబద్దమాడుతున్నాననీ, అన్నీ విషయాలూ తనకు తెలుసుననీ అన్నాడు. గమ్మత్తేమిటంటే, ఆ ఫలానా వాడు, ఎప్పుడెప్పుడు నా దగ్గర కొచ్చిందీ యే సమయంలో ఏ నంబరు కార్లో వచ్చిందీ కూడా వాడు చెప్పాడు.... సరే ఏమిటన్నాను. ఫలానావాడి నడిగి యీ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోమన్నాడు. కావాలని అడిగినట్లుండకూడదనీ, మాటవరసకు అడిగినట్లుగా ఉండాలనీ, ఖచ్చితమైన జవాబులు మాత్రం కావాలనీ అన్నాడు. వారం రోజుల్లో మళ్లా వస్తానన్నాడు. ఎడ్వాన్స్ గా ఉంచమని యిన్నినోట్లు యిచ్చాడు. నేను వద్దంటుండగానే వాడెళ్ళిపోయాడు. చాలా సేపటిదాకా నాకిదంతా కలేమోననిపించింది. కానీ, బల్లమీద నోట్లు కనిపిస్తుంటే నమ్మకపోవడమెలా? మూడో రోజున పేపరు చదువుతుంటే, అదేదో దేశానికి చెందిన ఏజెంట్లు నలుగురు చిక్కారనీ, మిగతావారికోసం పోలీసులు వెడుతున్నారనీ ఉంది."
"వాడు మళ్లా నీక్కనిపించాడా?" అన్నది కళ్యాణి కళ్ళింత చేసుకొని.
"లేదు వాడొస్తే ఆ డబ్బు పారేద్దామని చాలా రోజులు చూచాను. కానీ రాలేదు. చివరికి అగ్గిపుల్లగీసి వాటిని అంటించేశాను" అన్నది మంజరి.
"బాగానేవుంది మేళం! ఇలాంటి పాడు గొడవల్లో నువ్వు చిక్కుకోకమ్మా!" అన్నది కళ్యాణి.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS