Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 38

రమారమిగా నెలరోజుల నుండి మంజరి వర్క్ చేస్తున్న సినిమా కంపెనీలన్నీ ఈగలు తోలుకొంటున్నాయి. అనుకోని విధంగా ఆవిడ ఆరోగ్యం  దెబ్బతిన్నది. ఆపరేషన్ జరుగలేదన్న మాటే గానీ అంతకు మించిన హడావిడి చాలా అయింది. దాదాపు అన్ని సినిమా పత్రికలూ, ఆవిడ సుస్తీని గురించి సితార శీర్షికలతో ప్రకటించాయి. ఆవిడ సుస్తీ నుండి త్వరగా కోలు కోవాలని, అశేష జనం ఆశించారు, కొందరు మంజరికే స్వయంగా రాశారు కూడాను, అభిమానులకన్నా ప్రొడ్యూసర్లు ఆవిడ ఆరోగ్యం గురించి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించారు. అన్ని భాషల్లోనూ కలిపి ఇప్పుడామె యాక్ట్ చేస్తున్న పిక్చర్లు ఇరవై రెండు దాకా ఉన్నాయి. ఒకటి రెండు సెట్లమీద పని ఉన్న పిక్చర్లే పన్నెండుదాకా వున్నాయి. దురదృష్టవశాత్తు, ఆవిడ ఆటో ఇటో అయితే, ఈ నెగటివ్ లకు అగ్గిపుల్లయినా అంటించాలి. లేదా చచ్చినట్టు కధ మార్చుకొని, ఏదో విధంగా పూర్తయినా చెయ్యాలి. డాక్టర్ గారు "ఏమో ఫర్వాలేదని" హామీ యిస్తాడేగానీ, అసలు జబ్బేమిటో   మాత్రం చెప్పడు. ఆవిణ్ణు ఎవ్వరూ చూడకూడదనీ, అతిగా మాట్లాడించకూడదనీ, పూర్తిగా విశ్రాంతినివ్వాలనీ డాక్టర్ ప్రకటించాడు. ఒక్క రాజన్ ను కళ్యాణికి మాత్రం ఈ నిషేధం వర్తించదు.
"నీ ఆరోగ్యాన్ని గురించి, గంపలకొద్దీ ఉత్తరాలొస్తున్నాయే మంజూ!" అన్నది కళ్యాణి వొకసారి.
"రాసి పోసి అగ్గిపుల్ల అంటించు" అన్నది మంజరి విసుగ్గా.
"అలా కోపగించుకోకు మరి; నువ్వు అగ్గిపుల్ల అంటించినా, అంటించకపోయినా, వారికేదన్నా జవాబు రాయాలిగదా!" అన్నది కళ్యాణి.
"ఎన్నేళ్ళు పడుతుందో అక్కాయ్. ఈ జనానిక్కూడా మాతులుండవనుకొంటాను. లేకపోతే ఏమిటీ వేలాం వెర్రి?"
"హవ్వ" అని నోరు నొక్కేసుకొన్నది కళ్యాణి. "ఖర్మకాలి ఎక్కడన్నా అలా అనేవు  మంజూ! కొంప కూలిందన్నమాటే మనసులో యేమనుకున్నా, పైకి ఎంతో వినయంగా చెప్పాలి. విడి విడిగా జవాబులివ్వమని నేనూ అనను. అందరికీ కలిపి ఓ ప్రకటన పారెయ్" 'కులాసాగా ఉన్నాననీ, త్వరలోనే షూటింగుల్లో పాల్గొంటాననీ, తిరిగి సినిమా నటన ద్వారా ప్రేక్షక జనాన్ని సేవించే మహదవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాడనీ'- ఈ ధోరణిలో రాస్తే సరిపోతుంది'అని సలహా యిచ్చింది కళ్యాణి.
"పోనీ అలానే తగలెయ్!" అన్నది మంజరి చిరుకోపంగా.
కళ్యాణి పలకలేదు.
మంజరి పక్కకు తిరుగుతూంటే - కనురెప్పలు తడిసినట్లు కళ్యాణికి అనుమానమేసింది.
"ఎందుకమ్మడూ  ఆబెంగ?" అన్నది కళ్యాణి, మంజరి రెండు చెక్కిళ్ళను అరచేతులతో అదుముతూ.
మంజరి జవాబు చెప్పలేదు. కింది పెదవిని బిగబట్టి ఉద్వేగాన్ని అణుచుకొన్నది.
"రాజన్ ఏమన్నా అన్నాడా?"
"లేదు. ఆయనకు తండ్రిని కావాలన్న ఉబలాటం బాగా ఉండేదనుకొంటానక్కాయ్. నన్ను చూస్తూనే బిక్కచచ్చిపోయాడు.సినిమాల్లో దిక్కుమాలిన గెంతులన్నీ గెంతి ఇలా అయ్యావని కోప్పడ్డాడు. అసలు సంగతి అతనికింతవరకూ తెలీదు.
"ఇక ముందుకూడా తెలియకూడదు. తెలియవలసిన అవసరం కూడా లేదు" అన్నది కళ్యాణి.
"అవును ఆమాటకొస్తే ఏముంది మరి?" అన్నది మంజరి, ఏదో ఆలోచిస్తూ.
నెలరోజులన్నది, నెలా పదిహేనురోజులకు గానీ మంజరి పూర్తిగా కోలుకోలేదు. ఈలోగా ఆవిడ శరీరంలో వచ్చిన మార్పులు నిర్మాతల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించాయి. అంతకు ముందు రవంత బొద్దుగా, బంతిలాగా ఉండే మంజరి ఇప్పుడు సన్నబడిపోయింది. పెళ్ళిపీటలమీద,బంతి పువ్వులా ఉన్న హీరోయిన్,గర్భాదానం గదిలో సన్నజాజి మొగ్గల్లా ఉంటే ఎలా? కంటిన్యుటి దెబ్బతింటే ఇంకేమైనా ఉన్నదా మరి? మంజరి కాస్తంత వళ్ళు  చేయడం కోసం, ఇంకో అయిదారు వారాలదాకా నిర్మాతలు ఆగవలసి వచ్చింది. ఈలోగా ఆవిణ్ణు టానిక్కులు పుచ్చుకోమనీ, పండ్లరసం తాగమనీ నిర్మాతలు సలహా పూర్వకమైన వత్తిడిచేశారు. వాటన్నింటిని చిరు నవ్వుతో భరించడం వొక్కోసారి మంజరికి సాధ్యం కాకపోయేది.
"కనీసం - ఇష్టమైన తిండి తినడానిక్కూడా నోచుకోకపోతే, ఎందుకీ జన్మ? ఇదివరకేమో,లావు తగ్గాలని పధ్యమ్మెతుకులు తిన్నాను. ఇప్పుడు సన్నబడితే, కండపట్టాలని టానిక్కులు తాగుతున్నాను. ఎంత బానిస బ్రతుకో!" అని మంజరి  చాలా సార్లు విసుక్కొనేది.
కానీ తప్పేదేముంది కనకా?
నిజంగానే మంజరికి సుఖమనేది లేకుండాపోయింది. ఒక్క రోజున 20 గంటలపాటు స్టూడియోల్లో, ఆ దయ్యపు లైట్ల ముందు నిలబడి, అన్న మాటే పాతికసార్లని, చూసిన చూపే వందలసార్లు చూసి, ప్రాణం విసుగెత్తి ఇంటికి రాగానే, ఏదో కంపెనీ వాళ్ళు బిక్కముఖాలతో వాకిట్లో ఎదురయ్యేవారు. హీరో జపాను వెడుతున్నాడనీ, ఇంకో నెలదాకా రాడనీ, ఈ వొక్క కాల్ షీటు పూర్తయితే పిక్చర్ సెన్సార్ కు పంపించుకొంటామనీ గోలెత్తుతారు. వాళ్ళను కాదనడానికి నోరురాదు. పనిచేసే వోపికా ఉండదు. ఏదోవిధంగా తట్ట తగలేస్తే, పావలాయిచ్చి చూసేవాడు "ధూట్! ముండ, ఇక్కడ తగలేసిందిరా" అంటాడు. పత్రికలు అంత బిడిచి విడిచి పెడతాయి.
బాగా చెయ్యాలనీ, మంచి పేరు తెచ్చుకోవాలనీ, తనకూ ఉంటుంది. కానీ కొన్ని సినిమాల్లో -బాగా సంగతి దేవుడెరుగు-అసలు చెయ్యడానికే స్కోప్ వుండదు. అలాంటి వేషాలు వొప్పుకోకుండా ఉండేందుకూ వీలేదు. అడిగినంత డబ్బు కాళ్ళ ముందు  పడేస్తుంటే - కాదనడమెలా? పోనీ కాదన్నా ఊరుకొంటారా? ఏ హీరోచేతో, డిస్ట్రిబ్యూటరుచేతో, ఇంకా దగ్గరవాళ్ళ చేతో చెప్పిస్తారు. బాగా చెయ్యడానికి స్కోప్ వున్న పిక్చర్లుంటాయి. అప్పుడు వ్యవధానముందడు; ఇంకెక్కడో పనిచేసి పనిచేసి సొక్కిపోయి వున్నప్పుడు 'లవ్ సీన్'లో జాలిగా వుండమంటారు, ఉండవలసిందే! ఉండకపోతే జనం మళ్ళా దుమ్మెత్తిపోస్తారు.
తనుకారణం కాని తప్పులెన్నింటికో యీ రకమైన శిక్షలు అనుభవించవలసి వచ్చినందుకు మంజరి వొక్కోసారి మనస్పూర్తిగా ఖేదించేది. ఏదో ఓ కంపెనీవారు మార్నింగ్ కాల్ షీట్ అడుగుతారు. అదేరోజు ఇంకొకరు మధ్యాహ్నం నుండీ కాల్ షీట్ కావాలంటారు. ఈ ఉదయం కంపెనీవారు అనుకొన్నదాని కన్నా మూడుగంటలు ఆలస్యం చేస్తే ఆ రెండో కంపెనీవారు ఫలానా ఆర్టిస్టు ఫలానా టైముకు రాదని ప్రచారం చేస్తారు. వీళ్ళను మధ్యలో వదలడానికి లేదు, అవతలి వాళ్ళను డిసప్పాయింట్ చెయ్యడానికీ లేదు. ఈ గొడవలన్నిటితో నిన్న జరిగిందిదే! తను చచ్చీ రాత్రి పదిగంటలకు కొంపకొచ్చింది. ఎనిమిదింటి నుండీ ఇంకో కంపెనీవారు కాచుక్కూచున్నారు. వాళ్ళు కధ వినిపించి 'యస్' అనిపించుకోవడానికొచ్చారు. తనే వారినీ పూట రమ్మన్నది. పైగా మెహతా దీనికి డిస్ట్రిబ్యూటరు. కాదనడం ఎలా? కధ విని, తనకు తోచిన సలహాలు  చెప్పింది. ఫలానా వేషమయితేనే వేస్తానన్నది. ఆ రెండో వేషాన్ని భారతికి యిస్తానన్నారు వారు. దానికి  తను వొప్పుకోలేదు. ఏ రంగు పూసి కెమేరాముందు నించోబెట్టినా భారతి రాణిస్తుంది. దానిముందు తను ఎలా తెల్ల పోవలసిన ఖర్మ వచ్చింది? భారతి సరసనవుంటే జనం దాన్ని చూస్తారుగాని, తనను చూడరే! చేతులారా, ఈ తద్దినాన్ని నెత్తిమీదికి తెచ్చుకోవడం దేనికట? అందుకని ఉదయం మళ్ళా మెహతాకు ఫోను చేసి, భారతిని తొలగించవలసి వచ్చింది. ఈలోగా పిళ్లే డజను సార్లయినా ఫోన్ చేశాడు. తను వీలుపాడదంటే వొప్పుకోడు. బాంబేనుండి ఎవడో ఫిలిం ఫైనాన్సర్ వచ్చాడనీ రమ్మనమని గోల. తను పన్నెండింటికి పిళ్లే పిక్చర్సు ప్రైవేట్ లిమిటెడ్ కు వెళ్ళింది. వాడో పెద్ద వెధవ. అయిదింటికి అటునుండి అటే, మేకప్ సోము దగ్గరకెళ్ళి ఆరున్నరకల్లా స్టూడియోకు హాజరయింది. ఆ పోక పోక ఇప్పటిగ్గానీ తను యింటికి రాలేకపోయింది. మధ్యాహ్నం స్టూడియోలోనే శర్మ కలుసుకొని, ఇవ్వాళ రాత్రి వస్తాననీ ముఖ్యమైన సంగతేదో మాట్లాడాలనీ అన్నాడు. భగవంతుడు దయతలిస్తే, ఈ రోజుకు ఆఖరు విజిటర్ శర్మాజీ అవుతాడు?
మంజరి గడియారం కేసి చూసింది. 9 కావడానికింకా పదినిమిషాల టైముంది. పోనీ యీ పూటకు శర్మాజీని చూడటం మానేదామా అనుకొన్నది. కానీ ఏదో ముఖ్యమైన విషయమున్నదన్నాడు. అదేమిటంటే వచ్చి చెబుతానన్నాడు. తొమ్మిదింటికొస్తానన్న శర్మాజీ పావుతక్కువ పది గంటలగ్గానీ  రాలేదు.
"క్షమించాలండీ! బస్సు అందలేదు...." అన్నాడు శర్మ.
"నీ బొంద" అని లోపలనుకొన్నా "ఫర్వాలేదు శర్మాజీ! ఇంతలోకే మునిగిపోయిందేమిటిట? ఇలాంటిదేదో జరిగివుంటుందని, నేనూ అనుకొన్నాను" అన్నది మంజరి చిన్నగా నవ్వుతూ.
చేతిలో వున్న ఫైలును బల్లమీద పెట్టాడు శర్మ.
"ఇప్పటికి మీరు భోజనం చేశారో లేదో ముందుచెప్పండి" అన్నది మంజరి.
శర్మ అదేదో చెప్పకుండా, "మీకు తెలియకుండా నేనో పనిచేశాను. రేపు రుజువుకొస్తే, అది మీరే చేసినట్లు వొప్పుకోవాలి సొస్తుంది" అన్నాడు.
"అన్నాడు శర్మాజీ!" అన్నది మంజరి తాపీగా.
"మీరలా అంటారని నాకు తెలుసు. ఆ ధైర్యంతోనే నేనా పనిచేశాను!"
మంజరి ఫక్కున నవ్వింది.
"ఆ పని చేశాను. ఆపని చేశాను అంటారేగాని ఆ చేసిందేమిటో చెప్పరేమండీ బాబూ! కొంపదీసి మా వసంతను గానీ లవ్ చెయ్యలేదు గదా? అన్నది మంజరి పకపకలాడుతూ."
శర్మ కూడా నవ్వాడు.
"లాస్టుమంత్ రిలీజయిన పిక్చర్ వున్నది చూడండి - ఏదీ-" అన్నాడు శర్మ.
"ఏదీ?" అన్నది మంజరి ప్రశ్నార్ధకంగా.
"మీరు డ్యూయల్ రోల్ వేశారే-"
"ఐ సీ. అవును - ప్రవాళా ఫిలిమ్స్ వారిది. ఏం బావోలేదంటారా?" అన్నది మంజరి కళ్ళు చిట్లించి.
"కాదు మేడమ్? ఆ పిక్చర్లోని మీ రోల్ గురించి రేపు పత్రికల్లో ఒక ప్రకటన వస్తుంది" అన్నాడు శర్మ ఫైలు విప్పుతూ. ఇదిగో చదువు తాను వినండి - "ఆంధ్ర ప్రేక్షకలోకానికి నా హృదయపూర్వకమైన నమస్కృతులర్పిస్తున్నాను. ప్రవాళా ఫిలిమ్స్ వారి సాంఘిక చిత్రం 'తరుణీమణి' లోని నా ద్విపాత్రాభినయాన్ని అభినందిస్తూ మీరు వ్రాసిన లేఖలన్నింటినీ నేను ఆప్యాయంగా స్వీకరించాను. మీరు వ్రాసిన లేఖలన్నింటినీ అడిగారు. నా ప్రియతములైన ప్రేక్షకులను కలుసుకోవడానికి, వారితో ఇష్టా గోష్ఠి జరపడానికీ నేనెప్పుడూ సిద్దమే! మరి కొందరు సోదరులు, సోదరీమణులు నా ఆటోగ్రాపులున్న ఫోటోలు పంపమని వ్రాశారు. అవి తయారవుతున్నాయి. త్వరలోనే పంపుతానని మనవి చేస్తున్నాను. ఆ పాత్రలను అలా రూపొందించిన కవిగారికి, దర్శకులకూ, నా నటనను ప్రదర్శించడానికి అవకాశమిచ్చిన నిర్మాతలకూ, ఆదరించి ఆశీర్వదిస్తున్న మీకూ నేను సదా కృతజ్ఞురాలిని. మీరందరూ వ్యక్తిగతంగా  సమాధానలివ్వజాలని, నాఆశక్తతను మన్నించగోరుచున్నాను. ఇకముందు కూడా నేను తమ ఆదరాభిమానాలకు పాత్రురాలను కాగలనని ఆశిస్తున్నా-
                                                                                    మీ
                                                                                 మంజరి"
ఆగి,గుక్కతిప్పుకొని ఫైలు మదిచేసి, "ఇదీ ప్రకటన. రేపు ఉదయం అన్ని పత్రికల్లోనూ వచ్చేస్తూంది" అన్నాడు శర్మ.
మంజరి కళ్ళు మూసుకొనే "ఊఁ" అన్నది.
"మీతో చెప్పి వ్యవది కూడా లేకపోయింది మేడమ్! అవతలి 'సరోజ' కూడా యిలాంటి ప్రకటనే యివ్వబోతున్నట్లు తెలిసింది బహుశా ఎల్లుండి పత్రికల్లో వేయించాలని ఆవిడ అభిప్రాయమనుకొంటుంటే, మన మెందుకూరు కోవాలని పనిచేశాను" అని సంజాయిషీ చెప్పుకొన్నాడు శర్మ.
"నిజంగా ఆవేషం బావుందంటారా శర్మాజీ?" అన్నది మంజరి.
"అది వేరే విషయం మేడమ్! లేకున్నా జనానికి నచ్చింది కనుక బాగున్నట్లే లెక్క. ఒకవేళ జనానికి నచ్చలేదనుకో, అయినా మన మిలా ప్రకటన లిచ్చుకోవడంలో తప్పేముంది?" అన్నాడు శర్మ.
"రేపెవరన్నా - ఉత్తరాలు చూపించమన్నారనుకో-"
"అనరు. అంత ధైర్యం మనవాళ్ళకున్నదన్న నమ్మకం నాకు లేదు. ప్రేక్షకుల్లో ఆపాటి చైతన్యమే ఉంటే, ఈ పరిశ్రమ ఇంతకన్నా మంచి పిక్చర్లు తీసి ఉండేది. కనక మీరు నిర్భయంగా ఉండండి, ఏదన్నా వొస్తే నేను చూసుకొంటాను" అన్నాడు శర్మ.
"ఒక్కోసారి నిన్ను చూస్తుంటే అలాగే బుగ్గలు చిదిమేయాలనిపిస్తుంది శర్మ. ఇంత పలచని శరీరంలో ఆ ఉత్సాహం, ఆ ధైర్యం ఎక్కడున్నాయనిపిస్తుంది."
మంజరి వాడిన ఔషధం అమోఘంగా పనిచేసింది.
"మరో వారం రోజులయ్యాక, ఇంకో బాంబ్ షెల్ పేలుస్తాను  మేడమ్! మొత్తం ఇండస్ట్రీ గగ్గోలెత్తిపోతుందంటే నమ్ము. వచ్చే సంచికలో చిన్న "గాలప్ పోల్" పెడుతున్నాను. ఈ సంవత్సరపు ఉత్తమ నటుడు, ఉత్తమనటి, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయనీ గాయకులు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ రచయిత - ఇలాగే మిగతావీను, పాఠకులనే నిర్ణయించమంటాను. ఆ పై సంచికలో ఫలితాలు ప్ర్రకటిస్తాను. మూడు ఫలితాలు మాత్రం రిజర్వుడు. మిగతావి  పాటకుల నిర్ణయాను సారమే ప్రకటిస్తాను" అన్నాడు శర్మ సంతోషం కొద్దీ చిటికలు వేస్తూ. "ఉత్తమ నటి మంజరి - రిజర్వుడు; ఉత్తమ చిత్రం మీరు తీసింది, రిజర్వుడు. ఉత్తమ గాయని వసంత - రిజర్వుడు"
మంజరి ముఖం విప్పారించి. ఆవిడ కళ్ళు తళ తళ  మెరిశాయి.
"హారి పిడుగా! మీరెంతకైనా తెగిస్తారు శర్మాజీ! మీకున్న ధైర్యంలో నాలుగో వంతు నాకుంటే, ఎంత బావుండిపోను చెప్మా - అనుకొంటానప్పుడప్పుడూ! అయితే చూడండీ! రేపటి ప్రకటన కన్నా ఇది మరింత డేంజరస్ వ్యవహారం! మీతోటి వారెవరన్నా పాఠకులు నింపిన కూపన్లు చూపించమన్నారంటే, మీ గమ్మత్తు ఎగిరిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అసలీ పనికూడా నాకిష్టం లేదు శర్మాజీ! మీ ఉత్సాహాన్ని పాడుచేయడం ఇష్టం లేక 'సరే' ననడమే గానీ -పోనీ మానేస్తే నష్టమేమిటి సున్నితంగా నట్టునుబిగిస్తూ."
"ఆ సంగతి కూడా నేను ఆలోచించే ఉంచాను మేడమ్! అయిదువేల కాపీలు  స్ట్రయిక్ చేయిస్తున్నాను. రెండు వేలు మాత్రమే మార్కెట్ లో రిలీజ్ చేస్తాను. మిగిలిన మూడువేలూ మన దగ్గరే ఉంటాయి. ఆ కూపన్లలో మనక్కావలసిన పేర్లు రాసి, ఉంచేసుకుందాం. మపుజుల్ నుండి, అయిదొందలు మీ పేరు మీదరావా? పోనీ వందన్నారావా? ఖర్మకాలి ఒక్కటి కూడా రాలేదనుకొందాం మాట వరసకు, అయినా మించిపొయిందేమీలేదు. మూడు వేలమంది పాఠకులు మిమ్మల్నీ, వసంతనూ, మీ చిత్రాన్నీ ఉత్తమంగా నిర్ణయించిన తరువాత కాదనే పాటి చేవ ఎవరికుంటుంది మేడమ్?" అన్నాడు శర్మ.
"పద్ధతి బాగానే ఉంది శర్మాజీ! కానీ, నా అనుమానమేమిటంటే-"
"అలాంటి వాటి ప్రసక్తి నాదగ్గర తేకండి! మహా మహా దేశనాయకులే  ఇప్పుడీ దోవనడుస్తున్నారు, విజయాలను సాధిస్తున్నారు. వారే మనకు ఆదర్శం. ఆ పెద్దలు మెట్టిన మార్గాన్నే మనమూ అనుసరిస్తున్నాం. అందులో ఈషణ్మాత్రం కూడా దొసగలేదని, సవినయంగా మనవి చేస్తున్నాను.. ...బస్, ఇంకేమన్నా ఉంటే చెప్పండి" అన్నాడు శర్మ  కాళ్ళూపుతూ.
మంజరి రవంత సేపు శర్మకేసి చూసి తెక్కట్లాడుతూ నవ్వింది. మధ్యలో  ఏదో చెప్పబోయి కూడా - నవ్వువల్ల -చెప్పలేక ఆగిపోయింది. అతిగా నవ్వడం వల్లనేమో ఆమె కళ్ళు నీటితో నిండిపోయాయి. పమిటతో కళ్ళొత్తుకుంటూ--
"ఇకేదన్నా సంగతుంటే చెప్పమని అడిగాడు బాగానే ఉంది గానీ, తీరా చెప్పాక "ఈ పిచ్చిది ఇలా అన్నదేమిటా" అనుకోవు గదా శర్మాజీ?" అన్నది మంజరి.
"మిమ్మల్ని గురించి నేనిలా అణుకునేది మీకు తెలియదా?" అన్నాడు శర్మ పొడిపొడిగా.
"మరేం లేదు శర్మా!" అన్నది మంజరి, ఒక్కక్షణం గాలిపీల్చుకొందుకు ఆగుతూ, దురదృష్టవశాత్తూ నువ్వు నాకన్నా చిన్నవాడివైపోయావుగానీ లేకుంటే, ఎగరేసి నిన్ను పెళ్ళాడి ఉందును శర్మా?"
ఈ మాటలు శర్మ మీద ఎంత తీవ్రంగా పనిచేస్తాయో మంజరికి తెలుసు. అన్న తరువాత ఫలితం కోసం శర్మలోకి చూసింది మంజరి. అతగాడి చెక్కిళ్ళు ఆసరికే కెంపు రంగులద్దుకొన్నాయి. ముక్కు పుటాలు ఉబికించి క్రింది పెదవిని, పళ్ళమధ్య బిగించాడు. కళ్ళు నిండుగా మంజరిని ఆపాద మస్తకం చూసి, సన్నగా నిట్టూర్చాడు.
ఇంకొంచెం ఏడిపించి మరీ వదిలిపెడదామనిపించింది మంజరికి!
లేచి, రెండు చేతులు చాచి వొళ్ళు విరుచుకొన్నది. పలచని నైట్ గౌన్ మంజరి అందాన్ని దాచలేకపోతోంది. ఇంకోసారి ఆమె కేసి చూశాడు శర్మ. అతని కళ్ళల్లోని ఎర్రజీరలను మంజరి గుర్తించింది.
"ఓరి నాచిట్టి కన్నా! ఇక నువ్విక్కడ ఉండకూడదు. దయచెయ్యి" అనుకొన్నది మంజరి.
ఆవలింతను అభినయించి, నోటిముందు, సన్నగా చిటిక వేసుకొంటూ "చాలా ధ్యాంక్స్ శర్మగారూ! మళ్ళీ కలుసుకొందాం!" అంటూ, శర్మ చేతిని తన చేతిలోకి తీసుకొని మెత్తగా నొక్కిచూపుడు వేలుతో, అతని అరచేతిలో గోకి, వదిలేసింది మంజరి.
"ఇంకో రెండు రోజుల దాకా మనిషి - మనిషిగా ఉండడు. పూర్ ఫెల్లో" అనుకొన్నది మంజరి, మంచంమీద నడుమువాల్చుతూ.
శర్మకు నిద్ర పట్టిందో లేదో గాని, మంజరికి మాత్రం కంటిమీద కునుకురాలేదు. ఓ గ్లాసుడు మందు పుచ్చుకొని, అదీ చాలక రెండు నిద్ర మాత్రలు వేసుకొని కళ్ళు మూసుకొన్నది మంజరి!

                                           *    *    *    *
బెల్లమున్న చోట ఈగలు ముసురుతాయి, డబ్బున్నచోట మనుషులు ముసురుతారు. ఈ డబ్బు ఎలా వచ్చిందన్న ప్రశ్న ఆ మనుషులకు పట్టదు. డబ్బున్నదా లేదా అన్నదే ముఖ్యం.
మొదటినుండి పూలపాన్పుల మీద పెరిగిన వారికి ఈ సత్యం తెలీదు.
డబ్బు సంపాదించడంలో ఆనందముంటుందని మంజరి అనుభవ పూర్వకంగా గ్రహించింది. సంపాదన పెరుగుతున్న కొద్దీ ఆనందపు స్థాయి పెరగసాగింది. దీంతోపాటు ఇంకో దృక్పధం సైతం మంజరికి అలవాటయింది. తనకన్నా దిగువస్థాయిలో అసహ్యించుకోవడమూ, తనకన్నా పైగా వున్నవారిని చూచి అసూయపడటమూ మంజరికి అలవాటయింది. అప్పుడప్పుడు మంజరి కొన్ని  ప్రవచనాలను కూడా ఉద్ఘాటిస్తూ ఉండేది.
"సమాజం నిన్ను గౌరవించలేదని ఏడిచిపోవడంలో అర్ధంలేదు. గౌరవించదగిన అంశాలు నీలో వున్నాయో లేదో ముందుగా ఆలోచించుకో" అనేది మంజరి అనేకసార్లు.
"నా గురించి నీకు తెలుసు. నా చుట్టూ ఉన్నవారిని గురించి కూడా తెలుసు. నా దగ్గర ఏదో ఉన్నదని, నా మాటకు విలువ వున్నదనీ,పోతే ఇంతమంది మనుషులు నా చుట్టూ చేరతారన్న నమ్మకం నాకులేదు" అనేది అప్పుడప్పుడు.
"ధన సంపాదనలో ఆనందమేమీ లేదనేవారు నాకు అర్ధం కాకుండా ఉన్నారు. నామట్టుకు నేనా ఆనందాన్ని పుష్కలంగా అనుభవిస్తున్నాను."
ఆమెతో పనుండి వచ్చేవారందరూ, ఆమె గారన్న ప్రతి మాటకూ "ఓహో ఓహో" అనడం వలన అవన్నీ నిజమన్న గాఢవిశ్వాసం సైతం మంజరికి స్థిరపడిపోయింది.
అయితే ఈ అభిప్రాయాలను అందరిముందూ ఆవిడ ప్రకటించేది కాదు - పార్టీలతో వ్యవహరించేటప్పుడు చాలా సున్నితంగా డిప్లోమేటిక్ గా మాట్లాడేది. ఎదుటివారు నొచ్చుకోకుండా తనక్కావలసిన పనులను అతినేర్పుగా సాధించుకోవడాన్ని మంజరి మాస్టరీ చేసేసింది. తనదేనన్నా 'కా'దన్నప్పటికీ అవతలివారు బాధ పడకుండా అయ్యో పాపం! అనిపించి గానీ మరీ వదిలేదికాదు.
చాలామంది చాలా పేర్లతో ఆమె దగ్గరకు చందాలకోసం వస్తుండేవారు. వారందరికీ చేతులతో కాకుండా నోటితోనే లేదని చెప్పి పంపేస్తూ ఉండేదావిడ.
"మీ ఇబ్బందులు వింటుంటే గుండె చెరువయిపోతోంది బాబూ! కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. వారం రోజుల క్రిందటే ఎవరో ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చాడు. అతనికేదో ఇచ్చి పంపించాను...పేరా...జ్ఞాపకం లేదు. ఉన్నా నేను బయటపెట్టను...ఓ పనిచేయండి. సెక్రటరీకి మీ ఎడ్రసిచ్చి  వెళ్లండి. వీలున్నప్పుడు నేనే మీకేదన్నా పంపిస్తాను."
"పాపం! నామీద ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చారో మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. కానీ మిమ్మల్ని డిస్సప్పాయింట్ చేయక తప్పని సరైనందుకు చాలా బాధగావుంది. నన్ను మీరు మన్నించాలి."
"నిజం చెప్పాలంటే ఈ మేడలు, కార్లు, తోటలు, భూములు అన్నీ ప్రజలవే? వారిచ్చిన పావల కాసుల నుండీ నాకీ భాగం ముట్టింది. అవసరమయితే - ఇవన్నీ వారికోసం త్యాగం చేయగలను కూడా. కానీ ఆ దశ ఇంకా రాలేదనుకొంటాను. మీరు చెప్పిన విషయాన్ని గురించి నేనింకా ఆలోచించుకోవాలి....మరి నాకు సెలవు. కారు పంపిస్తున్నాను, మీరెక్కడ దిగేదీ అతనికి చెప్పండి"
ఈ ధోరణిలో మంజరి, ఒకరితో అనకుండా వందలమందికి సమాధానాలు చెప్పిపంపుతూ ఉండేది. కొన్నిసార్లు తప్పనిసరయి, అంతో ఇంతో విదపనుకూడా విదిపేది. అలాంటప్పుడు ఆవిడ మనస్సు చాలా భేదించేది.
"ఏదో ఇచ్చానని సంతృప్తిపడరు. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వనందుకు చాటు కెళ్ళి తిట్టుకుంటారు" అనేది మంజరి.
"నేను పిసినిగొట్టుదాన్ని కాదు. డబ్బంటే నాకు మొదటినుంచీ లక్ష్యం లేదు. కానీ వృధాగా ఖర్చు చేయడం నాకిష్టం లేదు. నేనిచ్చే ప్రతి దమ్మిడీకీ, అంతో ఇంతో ప్రతిఫలం లేనప్పుడు, నేనెందుకివ్వాలట? అనేది మంజరి."
 ఒకసారి పదిమంది పెద్దమనుషులు పనిమాలా మంజరి దగ్గరకొచ్చి, ఓ పెద్ద ఉత్తరం ఆవిడచేతికిచ్చారు.
"చెప్పండి!" అన్నది మంజరి చిరునవ్వు నవ్వుతూ.
"రామచంద్రంగారు మీకిమ్మని జాబు రాశారు, చూడండి!" అన్నాడొకాయన.
మంజరి ముఖం రవ్వంత ముడుచుకుపోయింది.
"ఈ ఉత్తరం రాయడానికి నేనెంత బాధ పడిందీ నువ్వూహిస్తే అదేచాలు. నా ప్రాణాలు తీసి  మరీ రాయించారు. ఇలాగా నిన్ను ఇబ్బందుల్లో పెట్టే హక్కు నాకేమీ లేదు. నీకిష్ట మయితే సహాయం చేయి నువ్వు చేయకపోయిన నేనేమీ అనుకోను. సహాయమే చేస్తే ముందుగా సంతోషించేది నేనే! మా ఆవిడపోయింది. నాకు జీవితం మీదనే విరక్తి కలిగిందంటాను...."
ఉత్తరం మడిచి బల్లమీద పడేసి, కళ్లొత్తుకొన్నది మంజరి.
"ఊఁ...చెప్పండి!" అన్నదావిడ పొడిపొడిగా.
కాస్సేపు వొకరి మొకాలొకరు చూచుకొన్నారు.
ఆఖరికి - ఓ పెద్దమనిషి గొంతు సరిచేసుకొన్నాడు.
"మా ఊళ్ళో  అయిదేళ్ళయింది, ఓ కాలేజీ నడుపుతున్నాం.ఊళ్ళో వాళ్ళు ఉచితంగా స్థలం ఇచ్చారు. పదిమందీ చందాలు వేసుకొని, పూరి పాకలు వేసి క్లాసులు నడుపుతున్నాం పక్క బిల్డింగ్ లేకపోతే, రికగ్నిషన్ రద్దు చేస్తామంటూ గవర్నమెంటు వారు వ్రాశారు. అప్పటికీ మాశక్తి కొద్ది తంటాలుపడుతున్నాం. అయినా పని పూర్తికాలేదు.... భార్యపోయినప్పటినుంచీ, రామచంద్రం మరీ వెర్రి వాడయిపోయాడు. వాడు తన ఆస్తినంతా కాలేజీకి యిచ్చేశాడు.... ఇంకా డబ్బు కావాలి. అధమం లక్ష రూపాయలైనా ఉంటే తప్ప పనిజరగదు...."
"లక్షరూపాయలా?" అన్నది మంజరి ఆశ్చర్యంగా.
"మరేనమ్మాయ్! మాకేమీ పాలుపోక మీ దగ్గరకొచ్చాం, అసలు రామచంద్రాన్నే రామ్మన్నాంగానీ, వాడు రానన్నాడు మావూరు నీకు కొత్తదేమీ కాదు....ఊరి వెలుపలున్న మామిడితోటలో కాలేజీ నడుస్తుంది...." అన్నాడాయన తుంపులు తుంపులుగా  మాట్లాడుతూ.
"నాకు మించిన భారం నానెత్తి నెత్తడం మీకూ భావ్యంకాదు బాబూ!" అన్నది మంజరి.
"ఇందుగ్గాను మేము మీకివ్వకలిగింది కూడా ఏమీలేదు. భవన దాత పేరును కాలేజీకి పెట్టదలుచుకున్నాం.
ఇందువల్ల మీకేదో వొరుగుతుందని కాదు. మీకు దేశంలో పేరు ప్రతిష్టలకు కొదవేమీ లేదు కూడాను. కానీ మీనుండి అలాంటి సహాయం పొందినందుకు కృతజ్ఞతగా మేమివ్వగలిగింది ఇదే?" అన్నాడాయన.
"అదికూడా నాకవసరం లేదు బాబూ! నాపేరు పెట్టకపోయినా నాకభ్యంతరం లేదు. నేను పేరుకోసం పాకులాడే మనిషిని కాను. అంతమొత్తం ఇవ్వగలనా లేనా అనే నేనాలోచిస్తున్నాను" అన్నది మంజరి.
ఆవిడ మెత్తబడటం చూసి నలుగురూ నాలుగువేపులా కమ్ముకొన్నారు. ఆవిడింకోమాట మాట్లాడకుండా వొప్పించేశారు.
"అయితే ఓపని చేదాం బాబూ! నేనో యాభైవేలిస్తాను మిగతాది-"
"ఇంకొకర్ని అడగమా? ఫలానా మంజరి దగ్గరకెళ్ళామనీ, ఆవిడ సగమిచ్చి తోకముడిస్తే, మిగతా సగంకోసం మీదగ్గరకొచ్చామనీ, మేం వాళ్ళతో చెప్పాలన్నమాట! అసలు కాలేజీ ఎత్తేసినా మాబాగే కానీ, ఈ పనిమాత్రం మా వల్లకాదు. మేం చెయ్యం" అన్నాడా పద్దమనిషి.
"నన్నిలా ఇరుకులో పెట్టడం భావ్యంకాదు బాబుగారు!" అన్నది మంజరి ఓక్షణం ఆలోచిస్తూ, "గుంటూరు, బెజవాడ, తెనాలి ఈ మూడుచోట్లా నేను డాన్స్ పెరఫారమెన్స్ ఇస్తాను. మీరు కాన్వాసు చేసి టిక్కెట్లమ్ము కోండి, ఖర్చులుపోను - మిగిలిందంతా నాపేరు మీదుగా కాలేజీ ఫండుకు క్రెడిట్ చేయించండి! ఇంతకన్నా పెగలడం నావల్లకాదు."
అరగంట చర్చల తరవాత అందరూ సరేనన్నారు.
"ఇదంతా సులభంగా అవుతుందని నేననుకోను. ఈ మూడు టౌనుల్లో ఉన్న పలుకుబడిగల పెద్దమనుషులందరూ మీకమిటీలో ఉండాలి. పెద్ద పెద్ద ఫరమ్సు నుండి బాగా డొనేషన్స్ పుచ్చుకోగలగాలి. ఆ గొడవలన్నీ మీరు చూసుకొంటేతప్ప - ఈ పధకం అనుకొన్నంత లాభం ఉండడు." అన్నది మంజరి.
"అలాగే" అన్నారు వారు.
మంజరి అప్పటికప్పుడు 50 వేలకు చెక్కు ఇస్తుందనుకొన్నారు. ఆవిడలా  ఇవ్వలేదు. తను నెలరోజుల్లోగా ఓ సారి అక్కడికొస్తాననీ అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకొందామనీ, చెప్పి పంపించేసింది.
ఈలోగా రామచంద్రం ఓ ఉత్తరం రాశాడు.
"మా వాళ్ళు అన్ని సంగతులూ చెప్పారు, చాలా సంతోషం. నీరాక కోసం మేం అందరం ఎదురుచూస్తుంటాం."

                                                19
ఆరు మాసాలలోగా, కాలేజీ పనులన్నీ పూర్తిచేయించింది మంజరి. అందుకోసం ఏర్పడిన కమిటీవారు, రాత్రింబవళ్ళు  పనిచేశారు. గుంటూరులో ఉన్న పొగాకు కంపెనీల యజమానులు తెనాలి, బెజవాడల్లో ఉన్న బియ్యం మరల యజమానులు ఆ కమిటీలో సభ్యలు. ఓ పెద్ద రాజకీయ నాయకుడు ఈ కమిటీకి గౌరవాధ్యక్షుడుగా ఉండేందుకు అంగీకరించాడు. పలుకుబడి కలిగిన ఈ పెద్దల కృషి వలన దాదాపుగా లక్ష రూపాయల  టిక్కెట్టు అమ్ముడయ్యాయి. న్యాయంగా అయితే, మంజరి చిల్లికానీ చేతి డబ్బు ఇవ్వనవసరం లేదు. కానీ -మంజరి అలా చెయ్యలేదు. తనిస్తానన్న యాభైవేల రూపాయలు కూడా ఇచ్చింది. కమిటీవారు "మంజరీ ఆర్ట్స్ కళాశాల" అని పేరు పెట్టడానికి ఏకగ్రీవంగా ఆమోదించారు.
కళాశాల భవన ప్రవేశ మహోత్సవాలకు హాజరు కావడం, మంజరికి బ్రహ్మ ప్రళయమయిపోయింది. ఆ రోజున జగజ్జెటిలవంటివారు బారులు బారులుగా నిలబడి ఆవిడకు స్వాగతం చెప్పారు. జనాన్ని అదుపులో ఉంచడానికి గుంటూరు నుండి అదనంగా ఉక్కు టోపీలు ధరించిన పోలీసులు రప్పించబడ్డారు. గ్రామంలోని వివిధ సంఘాలవారు సంయుక్తంగా మంజరికి సన్మానపత్రం సమర్పించారు. ఢిల్లీ నుండి వచ్చిన ఒక ఆంధ్రమంత్రి, భవన ప్రవేశ మహోత్సవాలను ప్రారంభించారు.
మంజరి ముక్తసరిగా మాట్లాడింది.
"ఈ సంతోషసమయంలో నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే - నా కిష్టంలేని పనులు చాలా జరిగాయిక్కడ, నేను వద్దన్నకొద్దీ కాలేజీకి నాపేరు పెట్టారు. ఒక దశలో - నేనీ వ్యవహారాల నుండి తప్పుకొందామని కూడా అనుకొన్నాను. కానీ ఆడినమాట తప్పడం నాకిష్టం లేదు...నేనేదో సహాయం చేశానని, ఉపన్యాసకులందరూ అన్నారు. నేను నిమిత్తమాత్రమేనని మనవి చేస్తున్నాను. నా దగ్గర పదిరూపాయలుండటమే నిజమయితే ఆ డబ్బు మీ అందరిదీని! మీ డబ్బును తిరిగి మీకే ఇవ్వడం నా కనీస ధర్మం. ఈ గ్రామం నాకు ఛా ఇష్టమయింది. ఇక్కడ నాకు ఇష్టమైన వ్యక్తులెందరో ఉన్నారు. రామచంద్రం, కోటేశ్వరరావు, మాధవరావుగారులు నేనిచ్చిన కానుక ఇది. మరినాకు సెలవు....క్షమించాలి ఇంకో చిన్నసంగతి ఉంది. గుంటూరు,తెనాలి, బెజవాడ పౌరులు  ప్రత్యేకంగా నన్ను సన్మానిస్తామంటూ వత్తిడి చేస్తున్నారు. ఈ సన్మానాలన్నా - సభలన్నా నాకు సరిపడవు. మీ అందరి ఆదరాభిమానాలుంటే అంతే చాలు. సన్మానాల పేరుతో, నా నెత్తిన మరింత భారాన్ని మోపడం మీకు భావ్యం కాదు. నన్ను మన్నించాలి. బొంబాయిలో, ఊపిరి తిరగని పనుల్లో ఉండి కూడా ఈ ఫంక్షన్ కి రాగలగడం నా అదృష్టం" అన్నది మంజరి.                                                    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS