ఆళ్వార్ పేటలో ఉన్న ఇల్లు మంజరి బేరం చేసినమాట నిజమే? అది రాజంపేట జమీందారు గారిధైన మాట నిజమే? కొంత అడ్వాన్సు ఇచ్చినమాట నిజమే! కానీ ఇంకా రిజిష్టరు కాలేదు. నాలుగు మాసాల్లోగా పూర్తి డబ్బు ఇచ్చేటట్లూ, ఇల్లు రిజిష్టరు చేసుకొనేటట్టు ఎగ్రిమెంటు రాయించుకొన్నది మంజరి. నిజానికయితే, డబ్బుకోసం అన్ని రోజులపాటు ఆగనవసరంలేదుకూడా. పిక్చర్లో మిగిలిన డబ్బే బోలెడంత ఉన్నది, దాంతో అలాంటి బిల్డింగులు అరడజనుకొని పారేయొచ్చుకానీ, ఉన్న డబ్బంతా బయటపెట్టడానికి లేదు 'ఇంత డబ్బు నేకెక్కడి'దని రేపు ఇన్ కంటాక్సు వాళ్ళడిగితే ఏం చెప్పాలి? పిక్చర్ ద్వారా యాభై వేలకన్నా లాభం మిగలలేదని ఎకౌంట్సు చెబుతున్నాయి. అప్పటికీ, అమాంబాపతు ఖర్చులన్నీ ఇబ్బడికి ముబ్బడిగా రాయించింది. పదిరూపాయలిచ్చిన వాడిచేత వందరూపాయలకు వోచర్ తీసుకొంది, పాతికరూపాయలిచ్చిన జూనియర్ ఆర్టిస్టుచేత రెండు వందలకు రసీదు తీసుకొంది. వసంతకు, కళ్యాణికి, రాజమణికి, తాయారుకు, వేలకువేలు యిచ్చినట్లురాసింది. రక రకాల మనుషుల పేర రక రకాల ఖర్చులు రాసింది. ఈ విషయంలో ఆడిటర్సు అద్భుతమైన చాకచక్యం చూపించారు. వారు ఆదాయాన్ని వీలయినంత వరకూ తగ్గించారు. ఖర్చులను, గరిష్ట ప్రమాణానికి పెంచారు. అయినా యాభైవేలకు దమ్మిడీ తగ్గకుండా ఉంది. ఇదిగాక, ఇతర పిక్చర్ల వల్ల వచ్చిన ఆదాయం వేరే ఉంది. అదీ ఇదీ కలిపితే, ఓ లకారం దాటటం ఖాయం అంటే - ఇందులో చాలా భాగం మంజరి పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలన్న మాట.
"చచ్చీ చెడీ మనం సంపాదించడమేగానీ, అందువల్ల సుఖమేమీలేదక్కా?" అన్నది మంజరి ఒకసారి.
"నిజమే గానీ ఒక దశ దాటాక సంపాదించకుండా ఉండటమనేది మన చేతుల్లో ఉండదు మంజూ! వద్దనుకొంటున్నా డబ్బు పోగుపడిపోతూ ఉంటుంది. 'నా వల్లకాదోయ్ బాబూ' అంటున్నా ప్రొడ్యూసర్లు వినిపించుకోకుండా మన ముందు ఎగ్రిమెంట్లు పారేస్తారు. మన షరతులు కన్నింటికి వొప్పుకొంటారు. అడిగినంత డబ్బూ ఇచ్చేస్తారు. మనం వినకపోతే మనకు దగ్గర వాళ్ళచేత చెప్పిస్తారు. మనమీద వత్తిడి తీసుకొస్తారు వినక తప్పేదేముందిట?" అన్నది కళ్యాణి.
"అదీ నిజమే!" అన్నది మంజరి.
"అందుకనే మనం ఇంకా ఇంకా ఖర్చులు పెంచుకోవాలి. నా మాటవిని రాజంపేట రాజాగారి బిల్డింగ్ కొనెయ్! నా దగ్గరే గనక డబ్బుంటే ఈ క్షణాన నేను కొనేసి ఉందును" అని సలహా ఇచ్చింది కళ్యాణి.
ఆ సలహా విన్నాకనే మంజరి ఈ కొనుగోలుకు సిద్దపడింది.
సరిగ్గా ఆ రోజుల్లోనే గిండీలో గుర్రాలు పరుగెత్తుతున్నాయి. మద్రాసు నగరంలోని సగభాగం గిండీ దగ్గరకు చేరింది. గుర్రప్పందాలను గురించి మంజరి వినడమేగానీ, ఎప్పుడూ చూడలేదు. ఆవిడకు చూడాలని కూడా లేదు. కానీ కళ్యాణికి రేసెస్ అంటే వల్లమాలిన మోజు.
నువ్వొక్కసారి రారాదా! నచ్చకపోతే మనం మధ్యలోనే వచ్చేద్దాం. అక్కడ మనవాళ్ళు చాలామంది ఉంటారు. లక్షలమీద టర్నోవరు జరుగుతుంది. మనం తిరిగి వచ్చేలోగా నాలుగుసార్లు లక్షాధికారమయి, ఇంకో నాలుగు సార్లు శుద్ద పాపర్లమయిపోతాం. ఆఖరుసారి మనమేమయితే, అదే ఆ రోజుకు ఖాయమన్న మాట! చాలా థ్రిల్లింగా ఉంటుంది మంజూ! అని కళ్యాణి ప్రోత్సహించింది.
మంజరి బలవంతాన 'సరే'నన్నది దోవలో వీరిద్దరూ 'మంగళదాస్'లో బైనాక్యులర్స్ కొన్నారు. మంజరి కారు షాపు బయట ఆగడం చూసి, ఓ పెద్ద గుంపు ఆ కారు చుట్టూ పోగుపడింది. షాపులో వున్న ఇతర కన్స్యూమర్లు, 'మంజరి, మంజరి' అని గుసగుస లాడటం మంజరి విన్నది. వాళ్ళూ కారేక్కడం చాలా కష్టమయింది. ఎక్కాక కారు కదలడానికి ఇంకో పది నిమిషాలు టైం పట్టింది. అప్పటికైనా ట్రాఫిక్ పోలీసు జోక్యం కలగచేసుకోకతప్పలేదు.
కళ్యాణి నవ్విందిగానీ మంజరి మాత్రం చికాకు పడింది.
మన మొఖాన కోతులుగానీ ఆడుతున్నాయా ఏమిటక్కాయ్! అలా ఈగలుముసిరినట్టు ముసురుతారేం?" అని విసుక్కొంది మంజరి.
కళ్యాణి ఏదో అనబోయి, ఇంకేదో జ్ఞాపకం వచ్చి ఆగిపోయింది.
మంజరికి గుర్రప్పందాలు నచ్చాయి. నచ్చడమంటే, అవి జరుగుతున్నంత కాలమూ, ఆవిడ వాటికి హాజరయింది. చిత్రమేమిటంటే, మొట్టమొదటి రోజున తను అనుభవించిన 'మజా' చివరిదాకా అనుభవించగలిగిందామె. దానికి త్రాగు 'కైపు' వంటి ఆవేశం కూడా మంజరిని పూనింది. ముందు సరదాగా ప్రారంభించిన పందెం, వారంరోజులకల్లా అలవాటు కింద మారిపోయి, ఇంకో వారానికి వ్యసనంగా తయారయింది. ఏ గుర్రం లోగడ ఎన్నిసార్లు గెలిచిందో, దేనిపేరేమిటో, దేనిమీద ఏజాకీ రైడ్ చేస్తాడో, మంజరి చాలా డబ్బు నష్టపోయింది. కళ్యాణి వద్దంటున్నా వినకుండా, వేలకు వేలు పందాలు కాసింది. ఓడిపోయినందుకు దిగజారడంపోయి, రెట్టింపు ఉత్సాహంతో మంజరి పందాలు కాసింది.
"నీతో ప్రతిదానికీ చచ్చిన చావుగ ఉన్నది మంజూ! అతివృష్టి అనావృష్టి తప్ప మధ్యే మార్గంలేకపోతే ఎలా?" అని కోప్పడింది కళ్యాణి.
"నా తీరే అంత!" అని సమాధానం చెప్పింది మంజరి. "బ్రతికితే అగ్నిగోళాలుగా బ్రతకాలి, లేదా బూడిదలాగా, చప్పగా, చల్లారిపోవాలి. నసుగుడు బేరం నావల్లకాదు."
"నిన్నా రేసెస్ కు తీసుకువెళ్ళకపోయినా బాగుండిపోను" అని గొణిగింది కళ్యాణి.
"తీసుకెడితే ఏమయిందిట? కొంపలారిపోయినట్లు మాట్లాడతావేమిటక్కాయ్? రెండుచేతులా సంపాదించాను. నాలుగు చేతులా ఖర్చుచేశాను. ఇంకా ఇంకా సంపాదించగలను. ఖర్చుచెయ్యనూ గలను. రూపాయని చూసి జడుసుకోవడం నాకెప్పుడూ ఇష్టంలేదు. డబ్బును చూసి మనం భయపడుతున్నంత కాలమూ, అది మనల్ని బెదిరిస్తూనే ఉంటుంది. దాన్ని మనం కాలుతో తన్నేయాలి. అప్పుడే మన కాళ్ళ దగ్గర కొస్తుంది!" అన్నది మంజరి.
"ఓసి రాలుగాయీ!" అనుకొన్నది కళ్యాణి.
మంజరికి - జయాపిక్చర్ ద్వారా లభించిన లాభంలో ఎక్కువ భాగం గుర్రప్పందాలు తినేశాయి. వాటి ఆసరా చూసుకొనే ఆవిడ రాజంపేట రాజాగారిలా బిల్డింగుకు ఎడ్వాన్సు ఇచ్చింది. ఇప్పుడు డబ్బులేదు. ఈ కారణంతో, చేసిన బేరం కాన్సిల్ చేసుకోవడం కన్నా, ముక్కు మూసుకొని, ఏ మురుగుగుంటలోనన్నా పడిచావడం నయం ఫలానా ఆర్టిస్టు, ఫలానా బిల్దింగుకు బేరం చేసి కూడా కొనలేకపోయిందన్న వాడుకన్నా, చావడమే మంచిది! కానీ, వోటమిని వొప్పుకోవడానిక్కూడా మంజరి సిద్దంగా లేదు. ఇంకోసారి రాజన్ ను అడిగి చూడమని వసంత సలహా ఇచ్చింది. అదికూడా మంజరికి నచ్చలేదు. రాజన్ ఇప్పటికే చాలా ఇచ్చాడు. కళ్యాణి మాటల్లో చెప్పాలంటే, ఆవిడ మొత్తం ఇంత కాలంలోనూ పిండిన దానికి నాలుగు రెట్లెక్కువగా తను వసూలుచేసింది. పిక్చరు కోసమని అతనిచ్చిన డబ్బులో చిల్లీకానీ చెల్లువేసింది లేదు. మళ్లా ఏమొహం పెట్టుకుని అతన్నడుగుతుంది? రాజన్ బంగారు బాతులాంటివాడు. రోజుకో గుడ్డు చొప్పున తీసుకోవాలేగానీ, కోయకూడదు.
మంజరి పడుతున్న మధన వసంతకూ, రాజమణికీ తెలుసు. అయినా వాళ్ళు అందులో జోక్యం చేసుకోలేదు. వసంత రెండు మూడుసార్లు, ఏదో సలహా ఇద్దామని ఊగులాడిందిగానీ రాజమణి ఆ ప్రయత్నాన్ని పడగొట్టింది.
"మంగమ్మ ఉక్కు ముక్కలాంటిది. దాసిబుద్ది పాదరసంలాగా పనిచేస్తుంది. దానికి మనసలహాలు అనవసరం" అన్నది రాజమణి.
మంజరి ఈ ఆర్ధిక సంక్షోభం నుండి తప్పుకోవడానికి రక రకాల మార్గాలు ఆలోచించింది. మెహతాకు ఫోన్ చేసి, కొత్తకంపెనీలేమయినా వస్తే, తనను రికమెండ్ చేయమన్నది. కిశోర్ ను కలుసుకొని, 'నీ మిత్రునిచేత ఇంకో పిక్చర్ తీయించరాదా?' అని సూచించింది. కానీ జవాబులు అంత ప్రోత్సాహకరంగా లేవు. దీనికి తోడుగా ఆరోగ్యం కూడా అంతబాగా ఉండటంలేదు. ఏమి తిన్నా వాంతులవుతున్నాయి. నోటినిండా నీరూరుతున్నది. ముందుగా - తను డాక్టర్ని కలుసుకోవాలి. తనబోటి వారికి ఇలాంటి వ్యవహారాలు బొత్తిగా పనికిరావు. ఇవన్నీ సాధ్యమైనంత తొందరలో తెల్చుకోవాలనీ, కొంతకాలంపాటు మరో వ్యాపకమేదీ లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవాలనీ, మంజరి నిశ్చయం చేసుకొంది. కానీ, ఏ విశ్రాంతి తీసుకోవాలన్నా ముందీ సమస్యలన్నీ తీరాలిగాదా!
"బాగానే ఉంది వరస. పిచ్చికుదిరితేనే గానీ పెళ్లికాదు పెళ్ళయితేనేగానీ పిచ్చికుదరదు, ఏదిముందు?" అనుకొన్నది మంజరి.
అదృష్టవశాత్తూ ఒకరోజున శంకరం పిళ్లే పనిమాలా మంజరి ఇంటికొచ్చాడు. ఆమెతో అరగంటసేపు మాట్లాడిన తరువాత, "సాయంత్రం మీరోసారి మా ఆఫీసుకు రండి, మీతో మాట్లాడాలి" అన్నాడు పిళ్లె.
"సరే" అన్నది మంజరి.
అతను వెళ్ళాకగానీ పిళ్లేనుగురించి ఆలోచించలేదు మంజరి. అంతకు ముందు పిళ్ళేను చాలాసార్లు గిండీలో చూసింది మంజరి. అతను చాలామంది ఆర్టిస్టులతో చనువుగా మాట్లాడుతుండటం మంజరి చూసింది. వారిలో కొందరికి, పిళ్లె, నోట్లబొత్తులు అందించి, చిన్న చిన్న కాగితాల మీద వారి సంతకాలు తీసుకోవడం ఆవిడ గమనించింది. 'ఎవరితనని' మంజరి అడిగినప్పుడు, కళ్యాణి పక పకా నవ్వి ఊరుకుంది. కాదు కూడదు చెప్పమని బలవంతం చేసింది మంజరి. 'తీరిగ్గా చెబుతాను' అని తప్పుకొన్నది కళ్యాణి. ఆ తరువాత కళ్యాణి చెప్పనూ లేదు; తను అడగనూలేదు.
పిళ్లేపోయిన అరగంట తరువాత కళ్యాణి ఫోను చేసింది, ఎలా ఉన్నావంటూ.
"బాగానే ఉన్నాను" అన్నది మంజరి.
"నువ్వెలా ఉన్నదీ నాకు తెలుసు మంజూ! ఇప్పుడె పిళ్లే నాకు ఫోను చేశాడు. నీ సమస్యలన్నీ అతను తీర్చగలదు. నిన్ను సాయంత్రం రమ్మన్నాట్టగా! వెళ్ళు" అన్నది కళ్యాణి.
"ఎందుకట?" అన్నది మంజరి.
"నువ్వదహలేదా?" అన్నది కళ్యాణి.
"లేదు ఎందుకో రమ్మన్నాడు, నేను 'సరే' నన్నాను. అంతే జరిగింది. ఇదేదో పద్మవ్యూహంలాగా ఉన్నదక్కాయ్! నా నుండి నువ్వేదో దాచిపెడుతున్నావ్! అవునా?"
"ఏమీ లేదు. ఇప్పుడిప్పుడే నన్నేమీ అడక్కు" అని ఫోను చేసి చూసిందిగానీ, ఫలితం లేకపోయింది.
"అయితే నేనే వస్తానుండు" అన్నది మంజరి.
* * * *
శంకరం పిళ్లే మద్రాసు వచ్చి పది పదిహేను సంవత్సరాలవుతుంది. మొదట్లో ఏదో ఉద్యోగం చేసుకొందామనే వచ్చాడు. సినిమా వ్యాపారంలో కాలు బెట్టాలన్న తలంపు అతనికప్పట్లో లేదు. పిళ్లేకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం పాటు ఏదో హోటల్లో క్లీనర్ గా పనిచేశాడు. తరువాత మూడేళ్ళ పాటు ఓ స్టూడియోలో "బోయ్"గా పనిచేశాడు. అప్పుడే అతనికి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పరిచయమయింది. ఆ తరువాత ఓ పెద్ద నటిదగ్గర పనికి కుదిరాడు పనంటే మరేంలేదు - ఎప్పుడూ ఆమెను అంటిపెట్టుకొని ఉండేవాడు. ఆమెకు ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో పిళ్లేకు తెలుసు. అవన్నీ అతను ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. "అమ్మాయిగారు" ఎవరితో మాట్లాడుతుంటే, పిళ్లేవారితోనే స్నేహం చేసేవాడు. వారికి నచ్చే మాటలు చెబుతుండేవాడు. అమ్మాయిగారు వాడి విశ్వాసానికి ఎంతో మురిసిపోయేది. తనకు మర్యాద జరక్కపోయినా బాధపడదు గానీ, పిళ్లేను చిన్న చూపు చూస్తే వొప్పుకొనేది కాదు. "అమ్మాయిగారిని" గురించి ఏసమాచారం కావాలన్నా పిళ్లేను సంప్రదించవలసిందే! వాడు, కాదన్న తరవాత "అమ్మాయిగారు" ఔననటం జరగదు. వాడు "జే" అన్న తరువాత, ఆవిడ కాదనడం కూడా జరగదు. అందువల్ల అమ్మాయిగారి దర్శనం చేసుకోదలచిన వారంతా, ముందుగా పిళ్లేను దర్శించే వారు. వాడు ఫలానా రోజున, ఫలానా టైముకు రమ్మన్నాడంటే దానికి ఢోకాలేదు.
అమ్మాయిగారి అంగరక్షకుడుగా పిళ్లే అయిదేళ్ళు పనిచేశాడు. ఈలోగా అతని దగ్గర చాలా డబ్బు పోగుపడ్డది. దీంతో ఏదన్నా వ్యాపారం చేద్దామనుకొన్నాడు. దాని మీది లాభంతో పెళ్ళి చేసుకొందామని, జీవితంలో సుఖపడదామనీ పిళ్లే సంకల్పించుకొన్నాడు. తన ఉద్దేశాన్ని అమ్మాయిగారికి చెప్పినప్పుడు, ఆమె కళ్ళ నీళ్ళ పర్యంతమయింది.
"ఏదో వ్యాపారం పెట్టుకొని పైకి రావాలంటున్నావు. బాగానే ఉంది. అందులో వచ్చే లాభాలేవో నేనే ఇస్తాను. ఇక్కడే ఉండిపో" అన్నది అమ్మాయిగారు.
"కాదులెండి నేను వెడతాను, మరి నాకు శలవిప్పించండి!" అన్నాడు పిళ్లే.
తాను చెప్పడమే కాకుండా, ఇతరులచేత కూడా చెప్పించింది అమ్మాయిగారు. అయినా పిళ్లే వినలేదు. వెళ్ళేటప్పుడు వాడికో అయిదువేల రూపాయలిప్పించింది అమ్మాయిగారు.
పిళ్లే ఆ డబ్బుతో చిన్న హోటలు ప్రారంభించాడు. నమ్మకంగా పని చేసేవాళ్ళను అయిదారుగుర్ని పెట్టుకొన్నాడు. తను కాష్ దగ్గర ఉంటూ కూడా, రష్ గా ఉన్నప్పుడు సప్లయి చేసేవాడు. సినిమాజనం తెలుసుగనక, వారి ఖాతాలన్నీ రాబట్టాడు. ప్రొడక్షన్ మేనేజర్లను మంచిచేసుకొని, ఆయా కంపెనీలకు తనదగ్గర ఖాతాలు పెట్టించాడు. అర్ధరాత్రప్పుడు ఉడుకు ఇడ్లీ సాంబారు కావాలన్నా, మసాలాదోశ కావాలన్నా పిళ్లే దగ్గర దొరికేవి. చాలా స్టూడియోలకు అతని మనుషులు, పలహారాలు చేరవేస్తూ ఉండేవారు. రెండేళ్ళల్లో పిళ్లే చాలా గడించాడు. అతను ప్రక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్ అద్దెకు తీసుకొని లాడ్జింగ్ కూడా ప్రారంభించాడు. అతని హోటల్లో దిగినవారికి "సమస్తసౌకర్యాలూ" సమకూర్చడంలో పిళ్లే ఏనాడూ, తన నిస్సహాయతను వ్యక్తం చేయలేదు. రకరకాల మనుషులతో అతని లాడ్జింగ్ ఏ వేళ చూచినా కళకళలాడుతూ ఉండేది.
అటు రెస్టారెంటును, ఇటు లాడ్జింగ్ ను ఒక్క చేతిమీదుగా నిర్వహించడం పిళ్లే కు కష్టమయిపోయింది. నెలకు ఇంత మొత్తం తనకిచ్చే పంపిణీమీద, రెస్టారెంటును "లీజ్"కిచ్చాడు. లాడ్జింగ్ ను బాగా అభివృద్ధిచేశాడు.
ఇంకో రెండేళ్లు గడిచాయి.
ఓ శుభముహూర్తాన పిళ్లే లాడ్జింగ్ బోర్డును మార్పించి, అదేచోట "పిళ్లే పిక్చర్ ప్రైవేటు లిమిటెడ్" అనే బోర్డును తగిలించాడు.
"నేను పిక్చర్స్ తీయను కానీ, తీసేవారికి ఫైనాన్స్ చేస్తాను. వారికి ఆర్టిస్టులను మాట్లాడిపెడతాను. ఆర్టిస్టులకు వర్కు చూపెడతాను, డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం లేదు. మంచి పిక్చర్ నాచేతికొస్తే, పంపిణీ చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు" అన్నాడు పిళ్లే.
ఈ వ్యాపారంలో అతనెంతగా రాణించాడంటే అతనికి పోటీ అంటూ ఎవ్వరూ మిగల్లేదు. చాలామందికి అతను డబ్బు పెట్టుబడి పెడుతూ ఉండేవాడు. తిరిగి నెమ్మదిమీద జమ కట్టుకుంటూ ఉండేవాడు. క్రమక్రమంగా అతని వ్యాపారం వేలనుండి లక్షలకు పెరిగింది. బొంబాయినుండి, మద్రాసుకు వచ్చే మార్వాడీలు అతని ఆతిధ్యం పొందకుండా పోవడమంటూ జరగదు. వారిలో కొందరికి పిళ్లే దగ్గర ఖాతాలు కూడా ఉన్నాయి. తనఖాతాదారుల్ని అన్ని విధాలా సంతృప్తి పరచడంలో అతనికతనేసాటి. పిళ్లే దగ్గర చాలా రకాల ఫోటోలున్నాయి. ఒక్కో వ్యక్తి ఏడ్రెస్ లో ఎలా ఉండేదీ ఏ మేకప్ లో ఎలా ఉండేదీ తెలుసుకోవాలంటే, అతని దగ్గరున్న ఆల్బం చూస్తే చాలు. ఫోటో చూసి నిర్ణయించుకోలేని వారికి పిళ్లే - మనుషుల్ని రప్పించి మరీ సాయపడుతుండేవాడు. ఆయా వ్యక్తుల ఎత్తు, రంగు, లావు, బరువు, వగైరా వివరాలు కూడా అతని దగ్గర సిద్దంగా ఉండేవి. ఎవరెవరికి ఏయే భాషలు తెలుసునో, ఎవరెవరు ఏయే తరహా డాన్సులు, చెయ్యగలరో, లోగడ ఉన్న అనుభవమేమిటో, కూడా పిళ్లే తడుముకోకుండా చెప్పగలిగేవాడు.
ఈ వ్యాపారం వల్ల పిళ్ళే సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. అనేకమంది కులీన వ్యక్తులతో అతనికి సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. చిత్రరంగంలోని చెప్పుకో దగిన వ్యక్తులెందరో అతనికి బాగా చేరువయ్యాయి. ఎడా పెడా డబ్బు పోగుచేసుకోవడమేకాదు - పరిశ్రమ మీద గట్టి పలుకుబడిని కూడా సంపాదించాడు.
* * * *
ఈ సంగతులన్నీ మంజరికి తెలిశాక ఆవిడ ఆశ్చర్యపోలేదు. పిళ్ళేను మనస్పూర్తిగా అభినందించింది.
"అలాంటి మనుషులంటే నాకు చాలా ఇష్టం కళ్యాణీ! చట్టులో మొలిచి, ఆ చట్టును బద్దలు కొట్టుకొని మహావృక్షంగా రూపొందడం మంటే ఏమిటో నాకు తెలుసు. మనం తప్పకుండా అతన్ని కలుసుకొందాం" అన్నది మంజరి.
"మనమని నన్ను కూడా కలపకు, నువ్వొక దానివే వెళ్ళాలి" అన్నది కళ్యాణి.
"అలా కుదరదు నువ్వురావాలిసిందే!" అని మంజరి పట్టుపట్టింది.
ఆ విషయమై మంజరి అట్టేతలచలేదు. కళ్యాణి చెప్పిన ఆధారాల సాయంతో, ఆవిడొక రకమైన బొమ్మను ఊహించింది. తీరా శంకరం పిళ్ళేను కలుసుకొన్న తరవాత, ఆవిడ బొమ్మ పూర్తిగా చెదిరిపోయింది. అతని ఆఫీసు - పిళ్ళేపిక్చర్సు ప్రైవేట్ లిమిటెడ్ -దేవేంద్ర లోకముగా వున్నది. శంకరం పిళ్ళే ఆవిణ్ను చూస్తూనే విశాలంగా నవ్వాడు. సాదరంగా ఆహ్వానించాడు. ఎవరూ చెప్పకుండానే బోయ్ ఓ ట్రేలో రెండు కాఫీలు పట్టుకొచ్చి వెళ్ళిపోయాడు. ఓ గుక్క తాగి సిగరెట్ అంటించి మంజరి క్కూడా ఓ సిగరెట్ ఆఫర్ చేశాడు పిళ్ళె.
"నో థ్యాంక్స్" అన్నది మంజరి." మీరు తాగారా? అదేమిటి? కళ్యాణి నాతో అబద్దం చెప్పదే!" అన్నాడు పిళ్ళె చాపిన చేతిని అలాగే ఉంచి.
"తాగనని కాదు - ఇప్పుడెందుకా అని గాని-"
"ఇవ్వాళ మీకు షూటింగేమీ లేదుగదూ? మరేం లేదు - మీతో కొంచెం వివరంగా మాట్లాడుదామనుకొన్నాను" అన్నాడు పిళ్ళె.
"లే"దన్నది మంజరి.
ఆవిడ ఆఖరి గుక్క పీల్చేసి, కప్పును సాసర్ లో వుంచేసింది. మెల్లగా సిగరెట్ ను పెదాలమధ్య చేర్చింది. పిళ్ళె లైటర్ తో, ఆవిడ సిగరెట్ ను అంటించాడు.
"రండి లోపలికి వెడదాం" అన్నాడు పిళ్ళె.
ఓ పెద్దహాలు దాటాక - ఇంకో అందమైన చిన్నగదిలోకి వచ్చారిద్దరూ! ఆ గదిలో ఓ మూలంగా స్ప్రింగ్ మాట్రెస్
వుంది. ఇంకోపక్క సిల్కు దిళ్ళ కుర్చీలున్నాయి. పిళ్ళె పక్కమీద కూచున్నాడు. మంజరి అతనికెదురుగా కుర్చీలో కూచున్నది.
"మీరు డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. మీకేమన్నా కావలిస్తే నా దగ్గిర తీసుకోవచ్చు. అలా నాదగ్గర వాడుకొంటున్న వాళ్ళు చాలామంది వున్నారు. వారందరి పేర్లూ బహిరంగ పరచడం నాకిష్టం లేదు. వృత్తిరీత్యా అది ధర్మం కూడా కాదు" అన్నాడు పిళ్ళె.
"కళ్యాణి చెప్పిందా?" అన్నది మంజరి.
పిళ్లె నవ్వాడు.
"నేనన్నది అబద్దమయితే అబద్దమని చెప్పండి. అంతేగానీ వివరాలక్కూడదు. పేర్లు బయటపెట్టడం నా కిష్టం లేదని - నే నింతకుముందే చెప్పాను. అలాగే -యింకో షరతును కూడా మీరు పాటించాలి....అదే చెబుతాను. ఇక్కడి సంగతులేవీ ఇంకొకరితో అనకూడదు. వారు మీకెంత ఆప్తులైన సరే! ఇక్కడికి మీ రాకపోకలన్నీ చాలా గోప్యంగా వుండాలి. అందుక్కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకొంటాను. మీరేం వింటున్నట్లు లేదు" అన్నాడు పిళ్లే, మంజరి పరధ్యానాన్ని గమనించి.
"నేనా? అదేం? వినకపోవడం కాదు గానీ, నాకిప్పుడో పదివేలు కావాలి, ఇస్తారా?"
"వెళ్ళేప్పుడు తీసుకెళ్ళండి. ఆ మొత్తం చాలకపోతే నాకు కబురు పెట్టండి. ఎంతకావాలో పంపిస్తాను" అన్నాడు పిళ్లే.
మంజరి ఆఖరి గుక్క పీల్చి సిగరెట్ ను యాష్ ట్రేలో పడేసింది.
"సేఠ్ కిషన్ దాస్ చందూలాల్ పేరు మీరు వినే వుంటారు. అతనికి బొంబాయిలోనూ, అహ్మదాబాద్ లోనూ, అయిదారు గుడ్డల మిల్లులున్నాయి. పెద్ద బాంకరు. ఫారెన్ తో వ్యాపారం చేస్తూవుంటాడు. అతను నాఖాతాదారు. నిన్ననే బాంబే నుండి వచ్చాడు రాత్రి నీ సినిమా చూశాడు. ఇంకో అరగంటలోపుగా ఇక్కడికి వస్తున్నాడు. అతని రూపాయి విలువ దమ్మిడీకన్నా తక్కువగా వుంటుంది" అన్నాడు పిళ్లే.
"పేరు విన్నాను. బొమ్మను కూడా చూశానేమో జ్ఞాపకం లేదు" అన్నది మంజరి.
"అతనేవో చిక్కులవల్ల రెండేళ్ళ నుండీ నా ఎకౌంట్ సెటిల్ చెయ్యలేదు. అయినా నేనడగను. కిందటి సారొచ్చినప్పుడు మొత్తం పేచేశాడు. నేను మాత్రం పార్టీలను ఆపిందిలేదు. ఎప్పటికప్పుడు, నిక్కచ్చిగా ఇచ్చేస్తూ వుంటాను. కొందరు వోపర్ డ్రా కూడా చేశారు. మళ్ళా ఎప్పుడోవచ్చి చెల్లుగట్టిపోతూవుంటారు. నా షరతులు అంగీకరించినంత కాలం, ఆ పద్దు లలానే నడుస్తూనే వుంటాయి. నిర్ణయించుకొన్న మొత్తాన్ని అదనంగా వచ్చిన డబ్బుతో నాకు నిమిత్తం లేదు. అయితే, నా పార్టీలకు కష్టం కలిగే లాగా కానీ, నా ఖాతాదారులు నొచ్చుకొనేలాగా కానీ ప్రవర్తించకూడదు. వారేది కోరితే దాన్ని నెరవేర్చాలి. అందుకు మీ కిష్టమయితే - మీరు కావాలనుకొన్నప్పుడు కావలసినంత మొత్తం నా నుండి తీసుకోవచ్చు. అదీగాక-"
ఫోన్ మోగింది.
"వన్ మినిట్" అంటూ పిళ్లే ఓ క్షణం విని, "ఉండమను వస్తున్నాను" అని రిసీవర్ పెట్టేశాడు.
"నేనిప్పుడే వస్తాను ఎవరో నాకోసం వచ్చారు."
పిళ్లే వెళ్ళిపోయాడు. ఆ గదిలో, సిలాసదృశ్యమైన నిశ్శబ్దంలో వుండడానికి మంజరికి భయం వేసింది. పదిహేను వేలిచ్చి పంపించాను. ఇదివరకే ఏమాత్రమో రావాలి. అదీ యిదీ కలిపి సర్దేస్తానన్నారు చూదాం - టైమయింది. చందాలాల్ వచ్చాడు. మన మిక్కడే కలుసుకుందాం" అంటూ బటన్ నొక్కాడు.
మరో నిమిషానికల్లా పొడుగ్గా, సన్నగా, ఖరీదైన సూట్ లో వున్న ఓ వ్యక్తి లోపలికొచ్చాడు.
"మిస్టర్ చందూలాల్" అని పరిచయం చేశాడు పిళ్లె.
మంజరి విశాల నేత్రాలు - మరింతగా విప్పారాయి. ఆవిడ యింతకు ముందుదాకా ఊహిస్తున్న మనిషికి - పెద్దబొర్ర, బొడ్డు కిందికి పంచె, ఒదులు లాల్చీ, చెమ్కీటోపీ, బంగారపు పళ్ళు, మొనతేలిన చెప్పులు ఉన్నాయి. ఈ చందూలాల్ దొరబాబులాగా వున్నాడు. దొరల్లాగే మంచినీళ్ళ ప్రాయంగా ఇంగ్లీషు మాట్లాడేస్తున్నాడు. చాలా కొద్దిమాటలు తప్ప మిగతావన్నీ మంజరికి అర్ధమయ్యాయి.
పది నిమిషాలయ్యాక-
"నేను పోతున్నాను" అన్నాడు పిళ్లే.
మంజరి చెప్పేది వినకుండానే అతను తలుపులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఓ క్షణం అలానే నిలబడిపోయింది మంజరి. చల్లగా వొణుకుతున్న వేళ్ళు ఆవిడ మెడ పక్కగా పాకాయి వినీ వినపడకుండా నిట్టూర్చి పక్కకు తిరిగింది. చందూలాల్ తోడేల్లాగా పళ్ళు బయటపెట్టి నవ్వుతున్నాడు. ఆ నవ్వు కూడా తోడేలు గురకలాగా వుంది. అతని ముఖమంతా రక్తం చిమ్మి ఎర్రబడిపోయింది. కళ్ళు నిప్పుకణికళ్ళా మెరిసిపోతున్నాయి. అతని వేళ్ళు, క్రమక్రమంగా మెడచుట్టూ బిగుసుకుంటున్నాయి. కళ్ళముందు పచ్చని రంగులు పాదుకాడుతున్నాయి. ఊపిరి తిరగడం లేదు. ఉక్కిరి బిక్కిరయిపోతూ వుంది. బలవంతాన అతని చేతుల్ని బట్టి వెనక్కుతోసింది. చందూలాల్ కళ్ళు మరింత క్రూరంగా మెరుస్తున్నాయి.
"అమ్మా!" అంటూ అరచి కళ్ళు మూసుకొంది మంజరి.
చందూలాల్ పకపకలాడుతూ చేతులు వదిలేశాడు. ఆవిడ తేరుకొనే సరికి అతనో సోఫాలో కూచుని వున్నాడు. ఇంతకు ముందు తను చూసిన తోడేలు లక్షణాలేమీ లేవు. చాలా మామూలుగా, కులాసాగా నవ్వుతున్నాడు.
అతనో గ్లాసును కొద్దిగా మూచూసి మంజరకిచ్చాడు. ఆవిడ దాన్ని ఖాళీ చేసింది. ఆ తరవాత చందూలాల్ కోరిన కోరిక ఆవిడకు చాలా విడ్డూరంగా తోచింది.
అతగాడు మంజరిని జుట్టు విరబోసుకోమన్నాడు. అందమైన జాకెట్ ణు పీలికలు పీలికలు చేసుకోమన్నాడు. చీర కూడా చింపుకోమన్నాడు. పిచ్చికేకలు వేస్తూ గదంతా తిరగమన్నాడు. తనకు చప్పున దొరకవద్దనీ, ఒకవేళ దొరికినా కొట్టి, రక్కి తప్పించుకోమనీ అడిగాడు. అలాగ తను ఆపమన్నదాకా చేయమన్నాడు.
"నెవర్" అన్నది మంజరి కొంచెం కోపంగానే.
"యు షుడ్ డు యిట్!" అన్నాడు చందూలాల్.
అతను రెండు చేతులూ పైకెత్తి, ఓ అడుగు ముందుకు వేశాడు. అతని ముఖంలోకి తిరిగి తోడేలు లక్షణాలొస్తున్నాయి. పళ్ళికిలిస్తూ గిట్టకరుచుకొంటున్నాడు. ఉన్నబలమంతా చేతుల్లోకి పుంజుకొంటున్నట్లుగా మూలుగుతున్నాడు.
మరొక్కసారి తను "కా"చాంటే చావు తప్పదనుకొంది మంజరి. ప్రాణాలకోసమైనా పారిపోదామనుకొంది. కానీ ఎక్కడికి పోతుంది? బలమైన గోడలు ఆవిడకు నిస్సహాయను చేశాయి. వెనక నుండి చందూలాల్ వేట కుక్కలా తరుముకొస్తున్నాడు. అతనికి అందకుండా మంజరి తప్పుకొంటున్నది. ఆవిడ బుద్దిపూర్వకంగా చెయ్యని పనిని చందూలాల్ బలవంతాన చేశాడు. ఆవిడ జుట్టు ఊడి, భుజాలనిండా కప్పింది. జాకెట్ పీలికలు పీలికలయింది. ఒక దశలో మంజరి ఎదురు తిరిగి, అతని చేతిని వోపికకొద్దీ మెలితిప్పింది. ఎదుర్రొమ్మున కొట్టి, సోఫాలోకి కూలదోసింది. చందూలాల్ కళ్ళు మూసుకొన్నాడు. ఆయాసం తగ్గాక పక పకా నవ్వుతూ "వెరీగుడ్ వెరీగుడ్, ఐ యామ్ వెరీ హాపీ నౌ" అన్నాడు.
ఆ మాటలంటున్నప్పుడు, మళ్లా వెనకటి 'దొరబాబు' లాంటి చందూలాలే అతను!
ఉదయం పోయేటప్పుడు-
"నువ్వెప్పుడన్నా బొంబాయి రారాదా?" అన్నాడు చందూలాల్.
"రాను" అన్నది మంజరి ముక్తసరిగా.
"అయితే నేనే నీకోసం మద్రాసొస్తాను" అంటూ అతను వెళ్ళిపోయాడు.
"మీరిప్పుడు పదివేలు పట్టుకెడతాగా?" అన్నాడు పిళ్లె, డ్రాయిరు సొరుగులాగుతూ.
"పదివేలా? నాకు పది దమ్మిడీలు కూడా వొద్దు" అంటూ మంజరి కార్లో కూచున్నది.
డ్రైవర్ మంజరిని, ఎగా దిగా చూసి, ఏదో అనబోయి, గుటకతోపాటుగా ఆ మాటను మింగేసి, ఇగ్నీషన్ కీ తిప్పాడు.
మంజరి అనుకొన్నవేమీ జరగలేదు. ఆవిడ ఇంట్లో లేనప్పుడు, పిళ్లే వచ్చి వంద, వందరూపాయల నోట్లనూ రాజమణి కిచ్చిపోయాడు. ఆ డబ్బు పుచ్చుకొన్నందుకుగ్గాను, రాజమణి పీకను మంజరి నులిమేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ మంజరి అలాంటి పాడుపనేమీ చెయ్యలేదు సరిగదా, డబ్బును తీసుకొంటూ "ఇంకేమన్నా అన్నాడా?" అని కూడా అడిగింది.
జరిగిందేమిటంటే - పిళ్లేతో అంత మొండిగా మాట్లాడినందుకు, ఆ తరువాత మంజరి చాలా విచారించింది. ఒక దశలో, అతన్ని మన్నించమని అడుగుదామని కూడా అనుకొన్నది. ఆ అవసరం లేకుండానే, పిళ్లే రాజీకి వచ్చాడు. ఒకసారి ఆవిణ్ణు పట్టుకెళ్ళి, రకరకాల భంగిమల్లో, రకరకాల దుస్తుల్లో ఫోటోలు తీయించాడు పిళ్లే.
"అందరి మనస్తత్వమూ వొక్కలాగా ఉండదు. ఎవరికెలా నచ్చితే అలా!" అన్నాడతను.
ఈ సూత్రంతో మంజరి పూర్తిగా ఏకీభవించింది.
"ఇంకోసారి వీడి గుమ్మం తొక్కను" అని మంజరి ప్రతిజ్ఞ చేసిందో లేదో తెలీదుగానీ, చేసే ఉంటే - ఆ మాటను ఆవిడ నిలబెట్టుకోలేదనడం మాత్రం ఖాయం.
ఎందుకంటే, ఆ తరువాత చాలాసార్లు మంజరి పిళ్లే పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసుకు వెళ్ళింది. వరసగా కొన్ని రాత్రులకు రాత్రులు అక్కడే ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందువల్ల మంజరి బీరువాలు బంగారంతో నిండిపోవడమేకాదు, ఆవిడకు చాలామంది గొప్పవారు కూడా పరిచయమయ్యారు. ఆ పరిచయాల వల్ల మంజరి, కనీ వినీ ఎరుగని అద్భుతాలనెన్నింటినో సాధించింది! కొందరిచేత ఫిలింకంపెనీలకు అప్పులు పెట్టించింది. ఇందరిచేత స్వయంగా సినిమాలు తీయించి అందులో తను వేషాలేసింది. ఆ సినిమాలు నాలుగు రాళ్ళు తెచ్చాయో లేదో మంజరి కనవసరం. తనకు రావలసింది చెప్తాగా వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం.
ఒకసారి పిళ్లే ఒక మంచి "ఆఫర్" తీసుకొచ్చాడు.
అదేదో నది మీద వంతెన కట్టడానికి నిశ్చయించారు. నాలుగైదు కంపెనీలు తమ కొటేషన్లు పంపించాయి, ఈ కంపెనీలన్నీ మంచివే! లోగడ యిటువంటి పనులు చాలా చేసినవే. వీటిమధ్య పోటీ పెరిగింది. ఒక కంపెనీవారు పిళ్లేను సంప్రదించారు. అతగాడు మంజరికోసం వచ్చాడు.
"ఇందులో నేను చెయ్యగలిగిందేమీకనిపించడం లేదు" అన్నది మంజరి.
"అలాకాదు నువ్వు చెయ్యగలవు. చేస్తావన్న నమ్మకం కూడా నాకున్నది. ఇందుకు సంబంధించిన వ్యక్తి ఎల్లుండి డిల్లీ నుండి వస్తున్నాడు. అతను "యస్" అంటే చాలు. పనయిపోయినట్లే లెక్క. ఆ వొక్కముక్క అతనిచేత అనిపించడం -నీకేమీ కష్టం కాదని నా నమ్మకం" అన్నాడు పిళ్లే.
"చూదాం!" అన్నది మంజరి.
"అలా తేల్చి పారేయకు. అవతలివారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకూచున్నారు. వారికేదన్నా నేను ధారకం పోయాలా అఖ్కర్లేదా?" అన్నాడు పిళ్లే.
"మరి -ఆపని నావల్లవుతుందో కాదో ఎలా చెప్పనయ్యా బాబూ!" అన్నది మంజరి.
పిళ్లే ఇంకేమీ మాట్లాడలేదు.
పై కలా అన్నదేగానీ, దీని వ్యవహారమేదో చూడాలన్న పట్టుదల మంజరిక్కూడా కలిగింది. తనెన్నో - అసాధ్య మనుకొన్న వాటిని సాధించింది. ఇది మాత్రం ఎందుక్కాదుట?
"ప్రయత్నిద్దాం. అయితే వాళ్ళు ముందుగా కొంచెం ఖర్చులు భరించాలి. పనయితే సరేసరి. లేకపోతే యీ ఖర్చులు నష్టపోవలసివస్తుంది" అన్నది మంజరి.
"అలాగే!" అన్నాడు పిళ్లే.
మంజరి ఓ గుక్క పుచ్చుకొని, సిగరెట్ అంటించి, చిటికవేసి మసిరాల్పేసింది.
"మరేంలేదు ఎల్లుండి మనమో కొత్త సినిమాను తీస్తున్నాం, దానికాయన ప్రారంభోత్సవం చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఓ పార్టీ జరుగుతుంది. ఆయన చీఫ్ గెస్టు."
"వెరీగుడ్, గో ఎ హెడ్" అన్నాడు పిళ్లే.
అన్నీ సక్రమంగానే జరిగాయి. టీపార్టీ అయ్యాక, ఆ పెద్ద మనిషిని తన కారుమీద యింటికి తీసుకొచ్చింది మంజరి.
"మీకు చాలా శ్రమ కలిగించాను. నన్ను మన్నించాలి....ఈ పూట మీరు నా గెస్టు."
ఉదయమే పిళ్లేకు రింగ్ చేసి "సక్సెస్" అని బద్దకంగా ఫోను పెట్టేసి, తిరిగి కళ్ళు మూసుకొని పడుకొంది మంజరి.
* * * *
