"ఓ పని చేయండి మేడమ్. టైటిల్స్ లో 'శర్మ పబ్లిసిటీ' అని వేయించండి. అంతే!" అన్నాడు శర్మ.
"అదేం?"
"ఈ కన్సరన్ నాదే! నేనీ క్షణం నుండే ఈ సంస్థను స్థాపించాను. దీనికి సోల్ ప్రొప్రయిటర్ను కూడా నేనే! ఏదో ఫలానా గన్నయ్య పబ్లిసిటీ ఇచ్చాడనటం వేరూనూ, ఒక సంస్థ పబ్లిసిటీ ఇచ్చిందనడం వేరూనూ! ఈ రెండవదాంట్లో వున్న డిగ్నిటీ మొదటి దాంట్లో లేదు. ఏమంటారు?" అన్నాడు శర్మ.
'ఓ.కె.'అన్నది మంజరి.
ఎడ్వర్ టైజు మెంట్సుకోసం చాలామంది మీ దగ్గరకొస్తారు. "శర్మ పబ్లిసిటీస్ ను కాంటాక్టు చేయ"మనండి, ఆయా పత్రికలస్థాయిని బట్టి, నేను బ్లాకులిస్తాను....మరో సంగతి, మనం రిలీజు చెయ్యడానికి ముందుగానే ప్రెష్ షో ఇద్దాం. ఊళ్ళో వున్న పత్రికలవాళ్ళనూ పొరుగు వాళ్ళనూ పిలుద్దాం. బొంబాయిలోని చాలా సినిమాపత్రికల తాలూకు కరస్పాండెంట్సు ఇక్కడున్నారు. వీరందరికీ మనం స్వయంగా ఇన్విటేషన్స్ ఇవ్వాలి.
"మనం - అని నన్ను కూడా కలపకండి, ఆ గొడవలేమో మీరే చూసుకోవాలి మరి!" అన్నది మంజరి.
"అదేలేండి. అలాగే! మరి - యీ పూటనే ఇన్విటేషన్ కార్డులకు ఆర్డరిస్తాను. పనిలో పనిగా ఓ యాభై బ్లాకులు కూడా వేరియస్ సైజుల్లో వేరియస్ ఇలస్ట్రేషన్సుతో తయారుచేద్దాం. మంత్లీస్ లో ఫోర్తు కవరు వేయమందాం. సెంట్రల్ స్ప్రెడ్ వేయించడం కూడా మంచిదే! ఫ్రంట్ కవర్స్ కు ట్రై కలర్ బ్లాకులు మనమే సప్లయ్ చేదాం."
"అలాగే కానివ్వండి శర్మాజీ!" అన్నది మంజరి ఆలోచిస్తూ, కామీ ఎంత ఆలోచించినా 'స్పెషల్స్' వేయిద్దాం. ఆ తరువాత ఇంకా కొన్ని వ్యవహారాలున్నాయనుకో మేడమ్! అవి మనం చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చెయ్యాలి. మన పిక్చర్లో రెండు మూడుచోట్ల హీరోయిన్ దేవాలయంలో కెళ్ళి పాటలుపాడుతుంది గదా!" అన్నాడు శర్మ.
"రెండు చోట్లేలెండి. మూడోసారి హీరోవెళ్ళి దేవుడిముందు ప్రాణాచారం పడతాడు."
"ఐసీ!" అన్నాడు శర్మ చిటికవేస్తూ. "మనకదేచాలు. ఆ సీన్సు వచ్చినప్పుడు, విజయవాడలో ఫలానా ఆవిడకు పూనకం వచ్చిందనీ, వైజాగ్ లో ఓ భక్తుడు ఆసీను రాగానే, కర్పూరం వెలిగించి టెంకాయలు కొడుతున్నాడనీ, గుంటూరులో ఒక ముదుసలి తన్మయురాలై పడిపోయిందనీ - ఇలాంటి వ్యవహారాలు శతకోటి వున్నాయి. అవన్నీ పిక్చర్ రన్నవుతున్నప్పటి మాటలు."
"నిజంగా అలా జరుగుతుందంటారా?" అన్నది మంజరి.
శర్మ నిట్టూర్చాడు.
"నువ్వెంత అమాయకురాలివి మేడమ్! జరిగేదేమిటమ్మా నా బొంద. ఇవన్నీ జరగాలా ఏమిటి? ఆమాటకొస్తే అసలు జరుగుతాయా? ఏగుడ్డూలేదు. పబ్లిసిటీలో ఇదోతంతు.ఈమందు కొన్ని సందర్బాల్లో అమోఘంగా పని చేస్తుంది. ఎంతవరకూ పని చేస్తున్నది మినహా మందును వాడే విధానం మీద ఆధారపడి వుంటుంది."
శర్మ మాటలు వింటున్నకొద్దీ మంజరిలో ఉత్సాహం పెరగసాగింది. శర్మ మామూలు మనిషేనన్న దిలాసా ఆవిడకేనాడూ లేదుగానీ, యింత ఉక్కుపిండమని కూడా తను అనుకోలేదు.
"మీరు నాకివన్నీ వైన వైనాలుగా చెప్పకండి. నేను మాటల మనిషిని కాను. చేతలదాన్ని, నాకు పని కావడం ముఖ్యం" అన్నది మంజరి.
"చూస్తారుగా!" అన్నాడు శర్మ. తను మాటలవాడే కాదనీ, చేతలవాడు కూడాననీ శర్మ రుజువు చేసుకొన్నాడు. అందమైన స్టిల్స్ అంతకన్నా అందంగా 'కంపోజ్' చేయించాడు. బ్లాకులు కూడా రెండురోజుల్లో తయారయివచ్చాయి.
ఈలోగా కళ్యాణి సలహామీద మంజరి ఇంకోపని చేసింది.
"మీది కొత్తకన్సరన్ గదా శర్మాజీ! దీని ప్రారంభోత్సవానికంటూ, మీ వాళ్ళు నలుగుర్నీ పిలిపించుకోరాదా? మన పిక్చర్ న్యూస్ స్టిల్సూ యివ్వరాదా?" అని సలహాయిచ్చింది మంజరి.
"అది బాగానే వుంటుంది గానీ, అప్పుడు ఊళ్ళోవున్న మిగతా కంపెనీలను కూడా పిలవాలి. అదంతా తడిసి మోపెడవుతుంది. ఖర్చులు మీరు భరిస్తారు సరేననుకో మేడమ, కానీ - నేనీ కన్సరన్ ను కంటిన్యూ చేయాలనుకొన్నప్పుడే, అలాటి మతలబు బావుంటుంది గానీ, లేకపోతే ఎందుకూ?" అన్నాడు శర్మ.
"ఓరి నిన్ను తగలెయ్య" అనుకొన్నది మంజరి.
"నా కేమన్నా వుంటే యీ పూట సర్దండి. ఆర్టిస్టుకు, బ్లాక్ మేకర్సుకూ పేచెయ్యాలి" అన్నాడు శర్మ.
మంజరి వెయ్యిరూపాయలకు చెక్కొకటి రాసి శర్మకిచ్చింది.
"శర్మా పబ్లిసిటీస్" ప్రారంభోత్సవం చాలా నిరాడంబరంగా జరిగింది.
"మన మందరం వొకే కోవలోని వాళ్ళం. చాలామంది చాలీ చాలని జీతాలతో బాధపడుతుంటే, మిగిలిన వాళ్ళం చావు బ్రతుకులతో స్వంత పత్రికలను లాక్కొస్తున్నాం. పత్రికల వాడు పబ్లిసిటీ సంస్థ పెట్టికోవడం యిదే మొదలనుకుంటాను. ఈ సంస్థనాదికాదు, మనందరిదీని. నాలుగు డబ్బులు మిగాలాలేగానీ, తలాకాస్తా తీసుకోవడానికి, నా కెప్పుడూ అభ్యంతరంలేదు. నేను ముఖ్యంగా జర్నలిస్టును, తరువాత పబ్లిసిటీ మనిషిని. నాతరపున వచ్చే ప్రకటనలతో బాటుగా, న్యూస్ గానీ, స్టిల్స్ గానీ వస్తే, అడుగున పడవేయకుండా చూడండి. నా కంతేచాలు" అన్నాడు శర్మ.
అప్పటికప్పుడే పది పత్రికలకు బ్లాకులు, న్యూస్ స్టిల్సు కూడా ఇచ్చాడు. 'ఈ సారి ట్రై కలర్ బ్లాకులు ఇస్తాను. ఒక నెల కవరు పేజీ బాధ తప్పినా తప్పినట్లే" అన్నాడు శర్మ. ఆ తరువాత ఒక్కొక్కరినే విడివిడిగా కలుసుకొని కూడా మాట్లాడాడు.
పత్రికలకు ప్రకటనలివ్వడంలో శర్మ వొకరితో మాట్లాడినట్టు ఇంకొకరితో మాట్లాడలేదు. 10 శాతం నుండి 50 శాతం కమీషను దాకా డిమాండు చేశాడు.
"టారిఫ్ లో రేట్లు పెంచుకోండి నేనేమీ కాదనను, కానీ నా కమీషనులో మాత్రం కోత పెట్టొద్దు" అని
స్పష్టంగా చెప్పాడు శర్మ.
అందువల్ల కొన్నిపత్రికలు, శర్మా పబ్లిసిటీ కోసమనికొత్తగా ఎడ్వర్ టైజ్ మెంటు టారిఫ్ లు ప్రింటు చేసుకోవలసివచ్చింది.
పబ్లిసిటీ ఉద్యమం నిర్విరామంగా మూడుమాసాలపాటు జరిగింది. అటు శర్మ, ఇటు ప్రసాదు కూడా కాలికి బలపముకట్టుకొని తిరిగారు. అట్టే పనిలేనిదల్లా ఒక్క చలపతికే! అతను కూడా ఒకటి రెండుసార్లు తనంత తానుగా కల్పించుకోబోయాడుగానీ, మంజరి గట్టిగా సమాధానం చెప్పింది.
"మా గొడవలేవో మేం పడుతున్నాం. మధ్యలో మమ్మల్ని డిస్టర్బు చెయ్యకు. ఇంకేదన్నా పనుంటే వెళ్ళి చూసుకో" అని సలహా యిచ్చింది మంజరి.
ఇంకో వారం రోజులకు పిక్చర్ రిలీజవుతుందనగా, మంజరి ప్రెస్ షో ఎరేంజిచేసింది.
"ఇంతకాలం మీరు చేసిందొక యెత్తు. యిప్పుడు చెయ్యవలసిందొక యెత్తు. రివ్యూలు బాగా రాకపోయాయంటే, నీ బుగ్గలు గిల్లి బూరెలొండిపెడతాను" అన్నది మంజరి నవ్వుతూ.
తరవాత ప్రసాదును పిలిచికేకలేసింది.
మీరిలా నిమ్మకు నీరెత్తినట్లు కూచుంటే లాభంలేదు. ప్రెస్ షోకయినా ఇతర్లురావచ్చు. ఊళ్ళో ఉన్న నలుగురు పెద్దలనూ కేకేసుకురండి. వారు నలుగురు మంచి మాటలంటే మనకు లాభమేగానీ నష్టంలేదు. మీ కెవ్వరూ మినిష్టర్లు తెలీదా? కనీసం మీకు తెలిసిన వాళ్ళల్లో మినిష్టర్ల నెరుగున్నవారెవ్వరూ లేరా?" అన్నది మంజరి.
"వెదికితే వుంటారు" అన్నాడు ప్రసాదు.
"మరి చూడండి. వారిని మనమే స్వయంగా ఆహ్వానిద్దాం. ఆయనగారిచేత చిన్న ఉపన్యాసం ఏర్పాటు చేయగలిగితే మరీ మంచిది. దాన్నే మనం పబ్లిసిటీలో వాడుకోవచ్చు....ఇలా ప్రతిదీ నేనే చెప్పాలంటే కుదరదు. మీరుకూడా ఆలోచించండి."
ప్రెస్ షో రోజున జరిగిన హడావిడి ఇంతా అంతా కాదు. మంజరి అక్షరాలా అప్సరసలా తయారయి వచ్చింది. కళ్యాణి సరేసరి. వసంత పులుకడిగిన ముత్యంలా మెరిసిపోతూ వుంది. రాజమణి సదస్సులకు గంధం అందిస్తూ వుంటే వసంత కర్పూరపు కడ్డీలు సరఫరా చేసింది. మంజరి, కళ్యాణి ఒక్కొక్కరికి విడి విడిగా నమస్కరించడంతో అలసిపోతున్నారు. శర్మ కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. చలపతి దూరంగా నిలబడితే మంజరి పిలిచిచీవాట్లు వేసింది.
"అలా పని తప్పుకుపోతారేం? మీరు మాపక్కనే ఉండండి!" అన్నది మంజరిలో గొంతుతో.
"నీ పక్కనా? నేనా? ఉండనా?" అన్నాడు చలపతి కసిగా.
"నువ్వేమీ మాట్లాడకు. ఈ కాస్సేపయినా నా వెంట ఉండు."
చలపతి, చేతులు రెండూ వెనక్కు పెట్టుకొని, మంజరి వెనక నిశ్శబ్దంగా నిలబడ్డాడు;
ఒకప్పుడు, ఈ థియేటర్లలోనే, ఈ ప్రసాదు పిక్చరే షో చేస్తున్నప్పుడు, మంజరి, చలపతి గుప్పిట్లో ఉన్నది. అతననమన్న మాటలన్నది. చెయ్యమన్నపని చేసింది. ఇప్పుడు అందుకు ఫక్తువ్యతిరేకం.
ఇంటర్వ్యూల్లో జీడిపప్పు,, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ సరఫరా అయ్యాయి.
"ఎలా ఉంది మూర్తిగారూ? మీ అభిప్రాయమేమిటి? ఆచార్లుగారూ? ఏమండీ! ఓ శాస్త్రిగారూ, మీరేమన్నదీ నాకూ కాస్తవినపడనీయండీ..."
ఈ ధోరణిలో మంజరి నలుగురి నుండీ అభిప్రాయాలు రాబట్టింది. అవన్నీ చలపతి నోట్ చేసుకొన్నాడు. తిరిగి పిక్చర్ ప్రారంభించడానికి ముందుగా - 'ప్రధాన అతిధి'గా వచ్చిన మంత్రిగారు, ఆ సినిమాను గురించి తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఉద్ఘాటించారు.
"సోదరీ సోదరులారా"అని ప్రారంభించారాయన "భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంగతి మీకందరకూ తెలిసిందే" అని మధ్యలో ఒకసారి జ్ఞాపకం కూడా చేశారు. "ఈనాడు ప్రజలకు అందుబాటులో ఉన్న వినోదసాధనం ఈ సినిమా వొక్కటేనన్న విశ్వాసం నాకు మనస్పూర్తిగా ఉన్నది. ఇందులోని సీనరీలు, మాటలు మరియు, పాటలు ఎంతో కమనీయంగా ఉన్నవి. ఈ సినిమాను ఆ సేతు శీతాచలపర్యంతం ఉన్నవారందరూ తప్పకుండా చూడాలని నేను కోరుతున్నాను. కొన్ని సందర్భాల్లో నన్ను నేనే మరచిపోయానని చెప్పడం అతిశయోక్తికాదు. ముఖ్యంగా, కధానాయిక ఉయ్యాలలూగుతున్నప్పుడు, పాడినపాట బహుమధురంగా ఉన్నది. ఇందులోని మరో విశేషం- స్నానాలసీను. సాహసోపేతమైన ఇలాంటి చిత్రాలు విరివిగా రావాలని నేను కోరుతున్నాను. జైహింద్!"
"మీకు చాలా శ్రమ ఇచ్చాం మన్నించాలి" అంటూ చేతులు జోడించింది మంజరి మంత్రిగారు పోతూంటే. పిక్చరు రిలీజవడానికి, కొంచెం ముందుగా, పత్రికలు సమీక్షలు ప్రకటించాయి. ఎక్కువ పత్రికలు - ఆ చిత్రాన్ని ఆకాశానికెత్తేశాయి. నాలుగైదు పత్రికలు, కధాసంగ్రహాన్ని మాత్రం ప్రకటించి ఊరుకొన్నాయి. ఒక పత్రిక ఆ పిక్చర్ని ఈకకు ఈక తోకకు తోక లాగిపారేసింది.
'పదిరూపాయలకోసం జేబు దొంగతనం చేసినవాన్ని పోలీసులు ఖైదు చేస్తున్నారు. తప్పుడుసాక్ష్యం చెబితే, మోసం చేస్తే ప్రభుత్వం శిక్షిస్తున్నది. దోపిడీ చేయడం మనశిక్షాస్మృతి ప్రకారం గొప్పనేరం అయినప్పుడు, ఈ పిక్చారును ఎలా విడుదల కానిచ్చింది ప్రభుత్వం. ఆశ్లీలార్ధం స్పురించేమాటలు పాటలు కోకొల్లలు. ఆడదాని అందం, ఇంత ఆచ్ఛాదనారహితంగా ఇంకేపిక్చరులోనూ చూపబడలేదు. ఉయ్యాలఊగే సీనులో, కధానాయిక, ఎత్తునుండి దిగువకు వచ్చేటప్పుడు కెమెరా ఎదురుగా ఉంచి క్లోజప్ తీయడమెందుకు?'
'ఇవిగోనండి పాలు' అని హీరోయిన్ అంటున్నప్పుడు, ఆ రొమ్మువిరుపులెందుకు? అప్పుడు గ్లాసు కనిపించదు. హీరోయిన్ భుజం, ఆ దిగువ భాగాలూ కన్పిస్తాయి. స్విమ్మింగ్ సీను మరీ ఘోరం. ఈ విధంగా - చెప్పుకొంటూపోతే, ఈ పత్రిక పేజీలన్నీ నిండిపోతాయి, అమాయకులైన ప్రజల్లోని క్షుద్రవాంఛలను రెచ్చగొట్టే ఇలాంటి సినిమాలను ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. అది - దాని కనీసబాధ్యత. పదిరూపాయల దోపిడీని సహించలేని ప్రభుత్వంవారు లక్షలాది రూపాయలను 'కళ' పేరుతో నిర్భయంగా దోచేస్తూ ఉంటే ఎలా ఊరుకోగలుగుతున్నారు? ఈ అరాచకానికి అంతం ఎప్పుడు?
ఈ విమర్శ చదివి మంజరి కుపితురాలయిపోయింది. శర్మరాగానే పత్రికను, మీదికి గిరాటెట్టి "ఏమిటది? ఎవరితను?" అన్నది మంజరి.
"ఓ పిచ్చి వెధవ, దీన్ని మనం లెక్కచెయ్యవలసిన అవసరం లేదు. అక్కడికి ఎన్నో విధాలుగా చెప్పిచూశాను. విన్నాడుకాదు. లోగడకూడా వీడిలాగే చేశాడు. మీకు జ్ఞాపకం ఉండే ఉండాలే! ప్రసాదుగారి పిక్చరు ప్రివ్యూ అయ్యాక---"
"ఓహో వాడేనా?" అన్నది మంజరి.
ఆవిన్నా ధోరణినుండి మార్చడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది.
* * * *
ఎవరి జాతకం కుళ్ళిందో చెప్పలేంగానీ, పిక్చరుమాత్రం బ్రహ్మాండంగా పోయింది. అనేక కేంద్రాల్లో కొద్ది 'పుష్'తో శతదినోత్సవాలు కూడా జరుపుకున్నది. ఈ ఉత్సవాలకు ప్రముఖతారాగణంతో బాటుగా, సాంకేతిక సిబ్బంది కూడా హాజరుకావడం వారికి వీరు, వీరికివారు వెండికప్పులు, నటరాజవిగ్రహాలు సమర్పించుకోవడం, కొన్నిచోట్ల ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నత ప్రభుత్వోద్యోగులు, యీ ఉత్సవాల్లో పాల్గొనడం, వారిని వీరూ, వీరిని వారూ పొగిడేసుకోవడం- అంతా, అక్షరాలా జరిగింది.
విశేషమేమిటంటే, యీ సారి వసంతకూడా యీ ఉత్సవాల్లో పాల్గొనడం. గుంటూరులో గావును- వసంత స్టేజీమీదకురాగానే, జనం గొల్లుమని అరిచారు. కొంతమంది ఫలానా సీనులోని ఫలానా పాటపాడి తీరాలని పట్టుపట్టారు, వసంతకు పాడక తప్పింది కాదు.
"ఎత్తనురా, ఎత్తనురా
కోడె వయసువాడా!
కళ్ళెత్తనురా, ఎత్తనురా
వయసు దోచువాడా!
అదమబోకు, గదమబోకు
అదరగొట్ట బొకురా
అబలనురా అందగాడ,
అలవగొట్ట తగదురా!
నాదగ్గర ఎర్రగులాబీ పూవుందీ
నీకిస్తే చిదిమి నలిపేస్తావూ!
ఎత్తను, నేనెత్తను
కళ్ళెత్తి చూడజాలనురా!
బిత్తరి చూపులవాడా
అత్తయ్యొస్తున్నదిరా!"
ఇదీపాట. రసిక జనుల హృదయాలను యీ పాట ఎంతగా ఆకట్టుకొన్నదంటే, కేవలం యీ పాటకోసమనీ, అప్పటి మంజరి అభినయం కోసమనీ పాతికి పదిసార్లు పిక్చర్ని చూసినవారున్నారు. ఇంతటి పాపులారిటీని పొందిన మరోపాట--
"మెడ దిగువన చలి చలి చలి
చలి చలీ, గిలి గిలీ
కళ్ళ దిగువ చల్చలా
కాళ్ళ దిగువ గల్గలా"
అనేది.
గత మాజీ అభ్యుదయకవి వసంతుడు రాసిన యీ పాట ఈత సీనులోనిది. మంజరి, ఆవిడ స్నేహితురాళ్ళు చెడ్డీలు కట్టుకొని కొలనులో ఈదుతూ, ఆచన్నీళ్ళు శరీరంలోని ఏ భాగానికి తగిలి, ఎలాంటి అను భూతులిస్తున్నదీ యిందులో వర్ణించారాయన. పిక్చరైజేషన్ బ్రహ్మాండంగా ఉన్నదనడంలో ఎలాంటి అనుమానమూలేదు. ఇన్ని వేలమంది - లక్షల మందికూడానేమో - ఎంతో ఆప్యాయంగా, అను నిత్యం పాడుకొనే యీ పాటల్లో ఏదో అశ్లీలంవున్నదనీ, వీటిని తీసివేయాలనీ ఏదో ఓ పత్రిక రాస్తే ఏమిటయిందిట? మట్టిగొట్టుకుపోయిందివాడుగానీ, పిక్చరు కాదే! బ్రతకడం తెలీని మనుషులు ఇలాంటి వెర్రి మొర్రి వేషాలు వేస్తే నామరూపాలు లేకుండాపోతారు.
ఆంధ్ర, తమిళ దేశాల్లోని ప్రధాన కేంద్రాలన్నింటా చిత్రం దిగ్విజయ యాత్ర చేసింది. డబ్బాలు సురక్షితంగా మద్రాసుచేరాయి. మంజరి తనకున్న కార్యక్రమాలన్నీ రాద్దుచేసుకొని, వారంరోజుల విశ్రాంతి కోసం ఊటీవెళ్ళిపోయింది. ప్రయాణానికి ముందు, తనను ఫలానా చోట కలుసుకోవలసిందని, రాజన్ కు ఫోనుకూడా చేసింది.
"నాలుగైదు లకారాలుమిగులుతాయా?" అని చాలామంది ప్రసాదును అడిగారు.
"న్యాయంగా అయితే మిగలవలసిందే! కానీ, మధ్యలో నేననుకొన్నప్లానులన్నీ తలక్రిందులయ్యాయి. ఆర్టిస్టులు - మంజరి ధర్మమా అంటూ చాలా కోఆపరేట్ చేశారు. సమయానికి నేను ఎక్స్పెక్టు చేసిన డబ్బు అందినట్లయితే, నా ఫేట్ ఇంకో రకంగా ఉండేది అలా జరగలేదు. స్టూడియోవాళ్ళు, డైరెక్టరూ టెక్నీషియన్లూ నన్ను డబ్బుకోసం వత్తిడిచేశారు. నేను ఏది కాదనుకొన్నానో, అదే చెయ్యవలసి వచ్చింది. మళ్లా ఓ డిస్ట్రిబ్యూటర్ను ఆశ్రయించాల్సివచ్చింది. ఆంధ్ర కన్నా టామిల్ ఏరియా ఎంతోనయం. ప్రతి చోటికీ నేను స్వయంగా వెళ్ళి ధియేటర్సును బుక్ చేసుకొన్నాను. ఒక్కొ జిల్లాకు ఒక్కో డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక్కడున్నారు. అందువల్ల కాంపిటేషన్ పెరిగి, నాకు నాలుగు డబ్బులు గిడతాయి. మనఖర్మం ఇంకోలా తగలడుతోందండీ! ఏ అయిదారు కంపెనీలో - మంచివి - మనకున్నాయి. వీళ్ళే మొత్తం ఇండస్ట్రీని మొనావలీ చేస్తున్నారు. వీళ్ళను కాదని పిక్చర్ ను ఎగ్జిబిట్ చేసే ధైర్యం థియేటరుకు లేదు. అలాచేస్తే డిస్ట్రిబ్యూటర్లు ఇంకో బొమ్మ నివ్వరేమోనని భయం.... సరే - ఈ గొడవలన్నీ మామూలేననుకోండి... ఏదీ - ఇంకా లెఖ్కలు తయారుకాలేదు. ఎంత హీనంగా చూసుకొన్నా మీరన్నంత కాకపోయినా, అందులో సగమైనా వుంటుందేమోననుకొంటున్నాను" అని మొత్తుకున్నాడు ప్రసాదు.
"మరి - నెక్ స్టు వెంచర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?" అన్నారు ఒకరు.
"తప్పకుండా ప్రారంభిస్తాను. మంజరి ఊటీనుండి రావాలి. వచ్చాక మేమిద్దరం కలిసి ఆలోచించుకోవాలి" అన్నాడు ప్రసాదు.
ప్రోగ్రాం ప్రకారం, వారానికి రావలసినదల్లా రెండువారాల కొచ్చింది మంజరి. ప్రసాదు వెళ్ళి కలుసుకొన్నాడు, వచ్చాను, ఈ రాకపోకలతో ఇంకోవారం గడిచిందే తప్ప మంజరిగానీ, ప్రసాదుగానీ ఎకౌంటు విషయమే ప్రస్తావించుకోలేదు. మంజరేమో ఎప్పుడూ ఏదో హడావుడిలో వుండిపోతోంది. ప్రసాదును చూచి 'హలో' అంటూ పలకరించి 'జస్టు వన్ మినిట్ వీరితో మాట్లాడుకొస్తాను' అంటూ అతన్ని పైకి పంపుతూనే వుంది. ఆవిడకంటే ఎలానైనా గడుస్తుంది. మరి తన సంగతేమిటనుకొన్నాడు ప్రసాదు. ఒకసారి ఆవిడ పనులు తీరిందాకా కూచున్నాడు. ఈపూట తేల్చివేసుకొందామని కూడా అనుకొన్నాడు.
'అరె! మీరింకా కూచునేవున్నారా? ఐ యామ్ సారీ ప్రసాద్!' అని ఎంతో నొచ్చుకొంది మంజరి. "పోనీ అంత అర్జంటయితే, ఆ మాట అనకపోయారా? నేను వచ్చేద్దునే!" అని కూడా అన్నది.
"మరేంలేదు మన ఎకౌంట్సు అలాగే వుండిపోయాయి" అన్నాడు ప్రసాదు.
"ఔను" అన్నది మంజరి ఏదో ఆలోచిస్తూ "మీకేమన్నా కావాలంటే పట్టుకెళ్ళండి. లెక్కలు తరవాత చూచుకొందాం - ప్రస్తుతానికి ఓ వెయ్యిచాలా?"
"వెయ్యా?" అన్నాడు ప్రసాదు.
మంజరి విరగబడి నవ్వింది.
"బ్యూటిఫుల్ ప్రసాద్! నువ్వెంచక్కా భావాలను ఎక్స్ ప్రెస్ చేస్తావోయ్. నీలాంటివారు - సరే తరవాత చెప్పుకొందాంగానీ రెండు చాలా? పోనీ మూడువేలకు చెక్కివ్వనా? వసూ! ఆ చెక్ బుక్ ఇలా పట్టుకురా!"
వసంత చెక్ బుక్ తెచ్చి మంజరి ముందు పెట్టింది. ప్రసాదుకు నమస్కారం చేసి వెళ్ళిపోయింది.
"నేను రెండువేలు, మూడువేలు అడగటం లేదు మంజరీ!" అన్నాడు ప్రసాదు.
"అంతకన్నా నీకెక్కువ వస్తుందనుకోను. రేపుదయంరారాదా చలపతి కూడా వుంటాడు. లెక్క చూచుకొని, నీ కెంత రావాలంటే అంతా పట్టుకు పోవచ్చుగా!" అన్నది మంజరి తాపీగా.
ప్రసాదుకు ముచ్చెమటలు పోశాయి. అతను ఆత్రంగా పెదవులు తడుపుకొంటున్నాడు.
"నేనీ మధ్యనే డిస్ట్రిబ్యూటర్ను కలుసుకొన్నాను. నువ్వొస్తే తప్ప లెక్క చెప్పనన్నాడు."
"అదేదో నేను చూసుకొంటాను ప్రసాద్. నీకు కావలసిందేదో ముందు పట్టుకెళ్ళు" అన్నది మంజరి.
"నాకు ఎకౌంట్ ప్రకారం డబ్బుకావాలి. అదే ఫైనల్ చెయ్యమంటున్నాను. నీకంటే పది పిక్చర్లున్నాయి గనక ఫర్వాలేదు. నేనలా కాదుమరి!" అన్నాడు ప్రసాదు.
"నువ్వనేదేమిటో నాకొక్కక్షరమూ బోధపడటంలే" దన్నది మంజరి.
"ఆమాట అనవలసినవాణ్ని నేనుగానీ, నువ్వుకాదు. నా పిక్చర్ డిస్ట్రిబ్యూట్ చేసినవాడు, నాకు లెక్క చెప్పటం ధర్మం. వాడు నిన్ను పిలుచుకురమ్మంటాడెం? అదే నాకు బోధపడకుండా వుంది" అన్నాడు ప్రసాద్.
"ఎవడో ఏదో అన్నదానికి నన్ను సమాధానం చెప్పమనడం ఏం ధర్మం ప్రసాద్? అతగాడు నన్ను రమ్మన్నందుకు, నువ్వెందుకు ఉలుక్కోవడం?" అన్నది మంజరి.
"నువ్వేదో అడ్డుపుల్లవెయ్యకపోతే వాడలా అంటాడా?"
"అడ్డుపుల్ల వెయ్యడమేముందీ ఇందులో? నా డబ్బును నేను జాగ్రత్త పరచుకోవడం తప్పుకాదే! నువ్వెన్నిసార్లు, ఎంతెంత యిచ్చిందీ నాకు జ్ఞాపకం వున్నది. నువ్వువాడుకొన్న మొత్తాలూ- పది అటూ ఇటుగా - చెప్పగలను. ఇవి పోను నీకు రావలసిందాన్ని పట్టుకెళ్ళమంటే - నీకు పిక్చర్ ఎకౌంటు మొత్తం కావాలంటావేం?" అన్నది మంజరి.
ప్రసాద్ ముఖంలో గోటిగాటుకు నెత్తురు బొట్టు లేకుండా పోయింది.
"అలా తెల్లపోతావెందుకు ప్రసాద్? మొత్తం ఖర్చునేనే పెట్టాను గదా! జీతాలు నాతాలుకూడా నేనే ఇచ్చాను. ఆ రసీదులన్నీ నా దగ్గరున్నాయి. రకం తిరగక అప్పుడప్పుడు నీదగ్గరబదులు పుచ్చుకొన్నమాట నిజమే! మహావుంటే ఇరవైవేలుండును. కాదూ కూడదంటే పాతిక వేలుండును. అంతేగానీ, ప్రొడక్షన్ ఖర్చు రెండు లక్షలూ నువ్వే పెట్టలేదుగా! స్టూడియోకు, టెక్నీషియన్ లకూ పేచేశాను. పబ్లిసిటీలో కూడా చాలా భాగం యిచ్చాను. మిగతాది ఈ క్షణాన పారేయమంటే పారేస్తాను. సరా?" అన్నది మంజరి.
"ఈ పిక్చర్ నాది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావ్?" అన్నాడు ప్రసాద్ పళ్ళు జిట్టకరచుకుంటూ.
మంజరి, మెత్తగా పక పకా నవ్వింది.
"నీ ఆరోగ్యమేమీ బావోలేదనుకొంటాను ప్రసాద్. అనవసరంగా స్ట్రెయిన్ కాకుండా వెళ్ళి రెస్టు తీసుకోరాదూ! నాకారుమీద పోదువుగాని, ఈలోగా డాక్టరుకు ఫోన్ చేస్తాను. అనవరసమయితే స్పెషల్ ట్రీట్ మెంట్ తీసుకొందువుగాని! సరా?" అన్నది మంజరి.
'నా డబ్బు సంగతేమిటి?' అన్నాడు ప్రసాద్ బిగ్గరగా. "నువ్వేదో మాయచేశావ్? నాకు రావలసిన డబ్బంతా మింగాలని చూస్తున్నావ్? ఆ పిక్చర్ నాది."
"పాతికవేలు చేబదులిచ్చినందుకే నువ్వు పిక్చర్ నాదంటున్నావే, మరి రెండులక్షలు పెట్టిందాన్ని నా మాటేమిటి ప్రసాద్? నువ్విచ్చిన డబ్బు నీపేర జమలేనప్పుడు బాధపడినా అందం చందం ఉన్నది. నీగోలమాత్రం నాకుకాదు సరిగదా, నన్ను పుట్టించిన బ్రహ్మక్కూడా అర్ధంకాదు."
'నా బానర్ మీద తీసింది నా పిక్చర్ కాక నీదేలా అవుతుంది?' అన్నాడు ప్రసాద్.
"జయాబానర్ మీద తీసినమాట నిజమే! అది నీ స్వంతమని మాత్రం ఎక్కడుంది ప్రసాద్? ప్రొడ్యూసర్ గా నీపేరు కూడా లేదే ఎక్కడా? నేను నాస్వంత డబ్బుతో, నీ బానర్ మీద పిక్చర్ తీసినంతమాత్రాన, లాభాలన్నీ నువ్వే లాక్కుపోతానంటే - అదెలా కుదురుతుంది? ఖర్చులన్నీ నేనే చెక్కిచ్చాను. ఆర్టిస్టులకు నేను పేచేశాను. ఇంతచేసిందాన్ని - నేనేమీ కాదంటావేం? అందుకే నీకు మతిపోయిందనడం. నామాటవిని - అరె అలా ఉద్రేకపడతావెందుకు ప్రసాద్! నీకు మినిమం మేనర్స్ కూడా తెలియవనుకోలేదుసుమా!" అన్నది మంజరి ఎంతో నిరుద్రేకంగా.
"ఇంతకాలం, నేనుపడిన శ్రమంతా--"
"అందరం శ్రమపడ్డాం ప్రసాద్! మిగతా అందరిలాగే నువ్వూ పనిచేశావ్. నీకష్టం ఉంచుకొనేంత నీచురాలని కాదు. అందరికన్నా అదనంగా నీకేమన్నా ఇద్దామనుకొంటున్నాను. స్వంతపనులు చేసినట్టు నాకు పనిచేసిపెట్టావ్. ఆకృతజ్ఞత నాకున్నది. నీలాగా, విశ్వాసంతో పనిచేసేవారు ఎందరో ఉండరు ప్రసాద్. ఆ విషయం నాకు తెలుసు..."
"ఓసి గుడిసేటిదాకా!" అంటూ ప్రసాద్ రెండుచేతులు పైకెత్తి లేచాడు.
క్షణంలో పక్కకు తప్పుకుంది మంజరి. ఈ హడావుడికి, వసంత, రాజామణి, తయారుకూడా వచ్చారు. సోఫాలో బోర్లపడిన ప్రసాద్ లేచి, పిడికిళ్ళు బిగిస్తూ, మంజరికేసి దూకబోయాడు. తాయారు గట్టిగా అతన్ని వాటేసుకొని, కేకలు పెట్టింది.
'నోర్ముయ్యవే పిచ్చిముండా, ఎందుకలా అరుస్తావ్?' అని తాయారును కోప్పడింది మంజరి. తరువాత మెల్లిగా, ప్రసాదుకేసి తిరిగి, ఓక్షణకాలం తదేకంగా చూసి, కింది పెదవి కొరుక్కున్నది. నువ్వు మర్యాదగా బయటికెడతావనుకొంటున్నాను. నిన్ను అరెస్టు చేయించడం నిమిషాల్లో పని. పూర్తిగా మతిచలించింది. నువ్వు పిచ్చివాడివి, అయినా పాపమని వదిలిపెడుతున్నాను. ఒకప్పుడు నీనుండి ఏదో చిన్న సాయంపొంది ఉండకపోయినట్లయితే, ఈ పాటికిదీంతో - "అని కాలిజోడు ముందుకు విడిచింది మంజరి, "దీంతో సమాధానం చెప్పి ఉందును. ఏ మూలనో, నన్నింకా ఆ పాపభీతి పట్టుకు పీడిస్తున్నది ప్రసాద్. వెళ్ళు వెళ్ళిపో. ఇహజన్మలో ఈ గడపతొక్కకు. నీకు రావలసిందేమయినా ఉంటే, నేనే లెక్కచూసి పంపిస్తాను.... తాయారూ! వాణ్ని రావలసిందేమయినా ఉంటే, నేనే లెక్కచూసి పంపిస్తాను... తాయారూ! వాణ్ని వదిలెయ్! ఇంట్లోకిరానివ్వొద్దని గుర్కాతో చెప్పు"
"అలాగే నండమ్మాయిగారూ!"
పోతున్న ప్రసాద్ కేసి ఆఖరిసారిగా చూసింది మంజరి. అతని కళ్ళల్లోని వెర్రిచూపులు ఆమెను విచలితం చేశాయి.
18
పగబట్టిన పాము కాటేయకుండా ఊరుకోదని మంజరికి తెలుసు. ప్రసాద్ సమయంకోసం కాచుకొని ఉంటాడనీ, అదనుచిక్కగానే మళ్లీ లేవకుండా తనను చావుదెబ్బ కొడతాడనీ ఆవిడ అనుకొంది. అంటే - ప్రసాద్ తనను ఏమీ చేసేందుకూ అవకాశం ఇవ్వకూడదన్నమాట! ఇదెలా సాధ్యం?
'పోనీ చలపతిని సలహా అడుగుదామా' అనుకొన్నదిగానీ, ఆపద్దతి అంత మంచిదని ఆవిడకే అనిపించలేదు. చలపతి తనకు ఇంటి శత్రువు. మేకతోలు కప్పుకొన్న పులిలాంటివాడు. అతగాడు తనకు సాయం చేయడం మాట దేవుడికి తెలుసు - ప్రసాద్ తో కలిసి తన కంఠానికి ఉరితీసుకు రాకపోతే అంతేచాలు.
ఎందుకయినా మంచిదని కళ్యాణిని సంప్రదించింది, మంజరి.
"నువ్వెందుకలా భయపడతావ్ మంజూ! ఇదేమంత కొత్త సంగతని, నువ్వలా అదురుకోవడం. మనలో చాలామంది ఇటువంటి వ్యవహారాలు నడిపినవారే! ఈ రోజున ఇండస్ట్రీలో నీ కున్న పలుకుబడి వేరు, నీ మాటకున్న విలువ వేరు. ఒకవేళ ప్రసాద్ వెళ్ళి పదిమందితో మొరెట్టుకున్నా, ఆ పదిమందీ నీకు సాయపడతారుగానీ, వాడితరపున మాట్లాడారు. నీకాభయం మవసరం లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు" అని సలహా ఇచ్చింది, కళ్యాణి.
కళ్యాణి అంతగా భరవాసాయిచ్చిన తరువాత న్యాయంగా అయితే మంజరి మెదలకుండా ఊరుకోవలసింది. కానీ ఆవిడిలా ఊరుకోలేదు. ఏదన్నా జరుగుతుందన్న భీతి ఆవిన్ను స్థిమితంగా కూచోనివ్వలేదు. కళ్యాణి అవసరం లేదంటున్నా వినకుండా రామస్వామి మొదలియార్ ను సంప్రదించింది.
"అసలేం జరిగింది?" అన్నాడు రామస్వామి మొదలియార్.
మంజరి చెప్పుకొచ్చింది.
"స్వంతగా పిక్చర్ తీద్దామనుకొన్నాను. పదిమంది ఆర్టిస్టులూ నాకు సాయం చేస్తామన్నారు. కొంతమంది, తరువాత డబ్బు తీసుకునే పద్దతిమీద పనిచేశారు, వీరందరికీ నేనే దరిమిలా డబ్బిచ్చాను. నా దగ్గర లేనప్పుడు నాకు తెలిసినవారినుండి అప్పు తీసుకొచ్చాను. అప్పుడే ప్రసాద్ గారు నా దగ్గర కొచ్చారు. ఇంకో బానర్ మీద పిక్చర్ తీయడం కన్న నా బానర్ మీదనే తీసుకోమన్నాడు. తనకు ప్రస్తుతం తగినంత పెట్టుబడి లేదనీ, డబ్బు రావడానికి ఇంతలో అవకాశంలేదనీ అన్నాడు. అందాకా కంపెనీ మూసేయడం కన్నా, ఎవరిదో వో పిక్చరు కంపెనీ పేరుమీదగా రావడమే మంచిదన్నాడు. నేనూ 'సరే' నన్నాను. ఆ దరిమిలా అతనో పాతికవేలు అప్పుగా నాకిచ్చాడు. నా కంపెనీలోనే పనిచేశాడు. తీరా పిక్చర్లో లాభాలొచ్చేటప్పటికి, పిక్చరుకు తానే ప్రొడ్యూసర్ ననీ, లాభాలన్నీ తనకే రావాలనీ పేచీపెడుతున్నాడు" అన్నది మంజరి.
'చాలా గట్టికేసు' అన్నాడు రామస్వామి మొదలియార్, తలపాగాతీసి బల్లమీద పెడుతూ, 'అతనుగానీ కోర్టుకెక్కాడా?'
"లేదు - లేదనుకుంటాను." అన్నది మంజరి.
"మీ తరపున వర్క్ చేస్తాను. గెలుపు పూచీనాది. అయిదు వేలకు దమ్మిడీ తక్కువయితే నావల్లకాదు" అన్నాడు రామస్వామి మొదలియార్.
మంజరి ఓ క్షణం ఆలోచించింది.
"సరేనండి! ఇంటికెళ్ళి డబ్బుపంపుతాను. ముందుగా ఏమాత్రం కావాలంటారు?"
"మూడువేలు పంపండి. గుమాస్తా కాయితాలిస్తాడు, వాటిమీద సంతకాలు చేసి మరీ వెళ్ళండి" అన్నాడు రామస్వామి మొదలియార్.
మంజరి అనవసరంగా భయపడిందిగానీ, కళ్యాణి చెప్పిందే నిజమయింది. ప్రసాద్ వారం రోజులపాటు పిచ్చికుక్కలా వారివెంటా, వీరి వెంటా తిరిగాడు. కనిపించిన ప్రతివాడితోనూ చెప్పుకొన్నాడు. సానుభూతయితే దక్కిందిగానీ, అంతకు మించిన లాభమేమీ కలుగలేదు. మంజరి ఉక్కుపిండంలాంటి అడ్వకేట్ ను పెట్టుకొన్నదనీ, ఆ మహానుభావుడు, బమ్మిని తిమ్మిని చేయగల సమర్ధుడనీ, కోర్టుకెక్కికూడా ఏమీ లాభంలేదనీ, చాలామంది ప్రసాద్ కు పిరికి మందు పోశారు.
"నన్ను అన్యాయం చేసింది. నా కళ్ళముందరే, నాడబ్బుతో కులుకుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. దాన్ని చంపిగానీ నేను మద్రాసు విడిచిపెట్టను" అనడం సాగించాడు ప్రసాదు.
"పిచ్చివాడా! నోటి కొచ్చినట్లు వాగకు. మంజరి నిన్నీక్షణాన అరెస్టు చేయించడం బ్రహ్మవిద్యకాదు. అనవసరంగా నీకు రావలసిన డబ్బు - ఆవిడ నీకిస్తానంటున్న డబ్బు - ఎందుకుపోగొట్టుకుంటావయ్యా! నువ్వు మనస్సును కాస్త శాంతపరుచుకోవాలి. ఈ రంగంలో కోపతాపాలకు తావులేదు" అని ఎవరో సలహా ఇచ్చారు.
మొదట్లో ఈ ప్రతిపాదనకు ప్రసాద్ వొప్పుకొని మాటనిజమేగానీ, ఆ తరువాత అంతకన్న చేసేదేమీ లేదు గనక, అతను మంజరితో రాజీకి వచ్చాడు 'అప్పు'గా ఇచ్చిన పాతికవేలూ, పిక్చర్లో పనిచేసినందుకు, నెలకు అయిదు వందల చొప్పున రావలసినసొమ్మూ కాక, ఇంకో అయిదువేలు అదనంగా ఇచ్చింది మంజరి. ఈ మధ్యలో అతను వాడుకొన్న మొత్తం అంతా రద్దుచేసింది కూడాను.
"మీరు చాలా ఉదారంగా ప్రవర్తించారమ్మా!" అన్నాడు మధ్యవర్తి.
మంజరి సన్నగా నవ్వి ఊరుకొంది.
ఈ గొడవలిలా పరిష్కారమవుతూండగానే రాజన్ డబ్బుకోసం ఉత్తరాలమీద ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు.
"నేను ఊపిరిపీల్చుకోడానిక్కూడా తెరిపిలేకుండా ఉంది. వీలయినంత డబ్బు వెంటనే పంపు" అని ఓ జాబులో రాశాడు రాజన్.
"ముందు మీరోసారి మద్రాసు రండి! మీతో చాలా విషయాలు మాట్లాడాలి. మీరక్కడా, నేనిక్కడా, మధ్యలో ఈ జాబులూ - ఈ పద్ధతి నాకు నచ్చలేదు" అని మంజరి జవాబు రాసింది.
మూడోరోజున రాజన్ వచ్చి ఫలానా చోట తాను దిగానని ఫోను చేశాడు మంజరికి.
"మంచిది నేనొస్తున్నాను" అని ఫోన్ పెట్టేసింది మంజరి.
తరువాత వసంతను పిలిచి "మనం ఇంకో గంటలో పార్టీకి పోతున్నాం, రెడీగా ఉండు" అన్నది మంజరి.
"ఇద్దరూ వచ్చారే" అన్నాడు రాజన్ చిరునవ్వు నవ్వుతూ.
"మరే!" అన్నది మంజరి చిరుకోపంగా.
లోపలి కొచ్చాక తలుపులు దగ్గరగా వేసి గడియ బిగించింది మంజరి.
"ఏమిటి సంగతి?" అన్నాడు రాజన్ సోఫాలో కూచుంటూ.
మంజరి అతని ప్రక్కనే కూచున్నది. వసంత అతనికి ఎదురుగా కూచున్నది.
"అవునుగానీ బాబూ! మందీ మాటకు బదులు చెప్పండి. మీకు డబ్బు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? ఎన్ని జాబులు రాసినా 'డబ్బో డబ్బో' అంటారుగానీ, నా గురించి అడగనన్నా అడగరేం? మీ డబ్బు కొచ్చిన ఇబ్బందేమీలేదు. ఎప్పుడు కావాలంటే, అప్పుడే దాన్ని కాష్ చేసుకోవచ్చు. నేను కొన్నదానికన్నా పదివేలు అదనంగా వస్తాయే తప్ప, నష్టం మాత్రం రాదూ. కా
