Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 34

                                                      16
మంజరి కీపూట  మనస్సూ శరీరమూ కూడా బావోలేదు. నిన్నటి సంఘటన పదే పదే జ్ఞాపకం వచ్చి ఆమె చికాకు  పడసాగింది. తనెంత తెలివిగా వ్యవహరించాలనుకొందో  అంతకన్నా తెలివిగా మొదలియార్ వ్యవహరించాడు. వసంత విషయం తేలిందాకా తను కాల్ షీట్ కెళ్ళగూడదనుకొంది. కానీ వెళ్ళక తప్పలేదు. వసంత విషయం ఏమయిందీ  తెలీదు. ఈ గొడవలు కాక మధ్యలో కిశోర్ ఇంకో బెడద తెచ్చిపెట్టాడు. అదో తలనొప్పి వ్యవహారం. ఇవన్నీ తనెందుకు తెచ్చి పెట్టుకొంటుందో తెలీదు. ఓక్షణం కంటారా  నిద్రపోవడానికి లేదు. ఓ గంట సేపు ప్రాణానికి హాయిగా ఉండేందుకు లేదు ఎందుకొచ్చిన లాయలాసా ఇదంతా?
ఈ ప్రశ్నకు మంజరి ఏమని సమాధానం చెప్పుకొనేదో తెలీదు గానీ, ఇంతలో కిందినుండి చలపతి ఫోను చేశాడు.
"ఏమిటి?" అన్నది మంజరి విసుగ్గా.
"శర్మ - శర్మగారు -వచ్చారు....అదే 'కొరడా' పత్రిక ఎడిటర్.....అలాగే"
మరునిమిషానికల్లా  తోలుసంచీ పట్టుకొని, పెదాలమధ్య సిగరెట్ పొగలు రాజుతూండగా శర్మగారు పైకొచ్చారు.
ఏదో విషయం లేనిదే శర్మ రాదనీ మంజరికి తెలుసు. వాడికి డబ్బవసరం కలిగినప్పుడల్లా, ఇలా వచ్చిపోతూ వుంటాడు. పడి పరకా ఇస్తే పుచ్చుకోడు. వందకు తక్కువ పుచ్చుకోవడం తన డిగ్నిటీకి భంగమంటాడు. అదయినా అప్పుగాఅడుగుతాడుగానీ, ఉత్తిగా ఇవ్వమనడు. ఆ అప్పు మళ్ళా తీర్చేది గాదు. అయినా సినిమా తారల డబ్బు చేతినుండి దాటాక, తిరిగిరావడమంటూ ఎప్పుడు జరిగింది గనక?
"నమస్కారం శర్మాజీ దయచేయండి. ఈమధ్య బొత్తిగా దర్శనాలే  కరువయ్యాయి" అన్నది మంజరి నవ్వుతూ.
శర్మగారు ఏమీ మాట్లాడలేదు. తోలుసంచీ ప్రక్కకుర్చీలో పడేసి, తనో కుర్చీలో కూచుని, కాలుమీద కాలువేసుకొని గట్టిగా సిగరెట్ పేల్చి ఒక్కసారిగా పొగవదిలేశాడు.
ఈ వికారపు చేష్టలు మంజరికి గిట్టవు. అయినా తన అయిష్టాన్ని లోలోపలే అణచుకొని, పైకి మాత్రం కులాసాగా నవ్వింది.      
"శర్మాజీ! నేనో విషయమడుగుతాను, నిజం చెబుతారా" అన్నది మంజరి.
"తప్పకుండా?"
"రోజుకెన్ని సిగరెట్లు కాలుస్తారండీ మీరు! ఈ పంపిణీ మీద ఎంతకాలం_"
శర్మ తాపీగా నవ్వాడు.
అతని ధోరణి చూస్తుంటే, ఏదో విశేషం చెప్పడానికొచ్చిన వాడికిమల్లే ఉన్నది. కానీ "తైలం" పడందే మాట పెగలదు. వాడడక్కముందే తనంతట తనే 'తైలం' మాట ఎత్తడం బావుంటుందా? అయినా చూద్దామనుకొంది మంజర. పత్రికెలాపోతుంది శర్మాజీ?" అన్నది మంజరి రెందు కప్పుల కాఫీ తెమ్మని వసంతకు పురమాయిస్తూ.
"అలాగే గెంటుకొంటూ వస్తున్నానండీ! ఎంత గింజుకుచచ్చినా నాలుగువేలు దాటటం లేదు. రావలసిన బాకీలు అయిదారు వేలదాకా ఉన్నాయి. కానీ ఒక్కరూపాయి వసూలు కాదు. అలాగని పత్రిక ఆపటానికి వీల్లేదు" అన్నాడు శర్మ.
"అంతదాకా బాకీలెందుకు పెంచుకుంటారండీ?  ఎప్పటికప్పుడు వసూళ్లు చేసుకోరాదా?" అన్నది మంజరి.
"అదో గొడవతల్లీ! సినిమా పత్రికలకయినా అట్టే మంది చందాదారు లుండరు. విడి అమ్మకాల మీదనే ఆధారపడి ఉండాలి. అంటే -ఏజెంట్ల దయా దాక్షిణ్యాల మీద పత్రిక బ్రతుకుతూ ఉంటుందన్న మాట. పోన్లెండి -ఈ క్షోభ ఎప్పుడూ ఉండేదే!" అన్నాడు  శర్మ.
వసంత తెచ్చిన  కాఫీని మంజరీ శర్మ పుచ్చుకొన్నారు. వసంతను శర్మకు పరిచయం చెయ్యలేదు మంజరి.
వసంత వయ్యారాలొలకబోస్తూ "నమస్తే" అన్నది.
శర్మ కూడా ప్రతి నమస్కారం చేశాడు.  
చెప్పండి శర్మాజీ! ఈ పూట నామనస్సేమీ బావోలేదు. మీరింకో అరగంట సేపు రాకపోతే, నేనే కబురు
పెట్టేదాన్ని" అన్నది మంజరి.
"ఆఁ పోనిద్దురూ!" తేల్చేశాడు శర్మ.
కాదుకూడదు చెప్పాల్సిందే నన్నది మంజరి. వసంతకూడా చెప్పి తీరాలన్నది.
"ఏముందండీ చెప్పేందుకు, ఈ ఏజెంట్లు ఎక్కడెక్కడో ఉంటారు. చాలామంది డిపాజిట్లు కట్టరు. అమ్మినడబ్బు పంపుతా మంటారు. తమకు ఫలానా ఫలానా పత్రికలు వస్తున్నాయని, ఎవ్వరికి తాము డిపాజిట్ కట్టలేదనీ, కనుక మీరు కూడా ఈ జాబు అందగానే ఇన్ని కాఫీలు ఫలానా రైల్వేస్టేషనుకు పంపమని రాశారు. పత్రిక సేల్సు పెరుగుతుంది గదాని, కాఫీలు పంపుతాం, రెందు వారాలయ్యాక డబ్బు పంపమని ఉత్తరాలు రాస్తాం, పంపవలసిన డబ్బులో కొంత పంపుతూ, ఈసారి ఇంకో యాభై కాపీలు అదనంగా పంపమంటారు. ఇలాగే దాదాపు ఏజెంట్లందరూ రాస్తారు. ఈసారి ఇంకో వెయ్యి కాపీలు ఎక్కువ స్ట్రైక్ చేయించుతాం. వాళ్ళడిగిన కాపీలు పంపుతాం. మూడోసారి -పంపవలసిన డబ్బు పంపడు. రెండు వందల కాపీలు కావాలంటాడు. పత్రిక హాట్ కేకులాగా అమ్ముడవు తోందంటాడు. జులై నాటికి అయిదొందలకాపీలదాకా సేల్సు పెంచుతానంటాడు. ఊళ్ళో అన్ని చోట్ల పత్రికలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాననీ, పత్రికలతో బాటుగా వాల్ పోస్టర్లు కూడా పంపుతే ఇంకా అమ్మకాలు పెరుగుతాయనీ, మనకు సలహా యిస్తాడు. సబ్ ఏజెంట్ల నుండి ఇంకా వసూళ్ళు కాని కారణంగా డబ్బు పంపలేక పోయాననీ, అందగానే టి.యం.వో  ద్వారా పంపుతాననీ అంటాడు మళ్ళీ వాడికి రెండొందల కాపీలు పంపుతాం."
"పోనీ పంపడం మానెయ్యరాదూ?" అన్నది మంజరి.
"అలా వీలు పడదు లెండి!" అన్నాడు శర్మ తాపీగా.
"ఎందు చేతనుట?"
"ఏజెంట్ల నుండి ఉత్తరాలు వచ్చేసరికి ఇక్కడ ఫారాలు అచ్చవుతూ ఉంటాయి. పత్రిక తయారయ్యే నాటికి - డబ్బు పంపమని ఏజెంట్లు కాపీలు పంపమను కోండి -ముప్పావలా వంతు కాపీలు మిగిలిపోతాయి. వాటిని మణగుల  లెక్కన తూకానికమ్మితే, రెందు పూటల భోజనానిక్కూడా రాదు. ఏజెంటు మీద బాకీ ఉండటమే మంచిదనుకొని, మళ్ళా పంపుతా ఉంటాం. ఇలాగ సంవత్సరం గడిచే సరికి, ఒక్కొక్క ఏజెంటు అయిదారు వందల బాకీ తేల్తాడు. మనం అక్కడి నుండి ఎన్ని ఉత్తరాలు రాసినా డబ్బు పంపడు. వసూళ్ళు కోసం మనిషిని పంపామనుకోండి - వాడెంత ఇచ్చాడో వీడెంత ఖర్చు చేసుకొన్నాడో లెక్క తేలదు. నేనే వొకసారి టూర్ బయలు దేరాను. ఖర్చులక్కూడా వసూలు చేసుకోలేకపోయాను. గట్టిగా అడిగితే అసలు నువ్వు ఫలానా పత్రిక వాడివన్న గ్యారంటీ ఏమిటన్నాడో ఏజెంటు. రాజమండ్రి ఏజెంటు, తనకింత వరకూ మీ పత్రిక రాలేదన్నాడు. తన పేరుగల వాళ్ళు రాజమండ్రిలో చాలా మంది ఉన్నారనీ, వారెవరన్నా  పార్శిళ్ళు  తీసుకొంటున్నారేమో  తనకు తెలీదనీ, పత్రిక మాత్రం తను అప్పుడప్పుడు చూస్తున్న మాట నిజమేననీ, ఇక నుండీ తనకు ఏజెన్సీ ఇచ్చే పక్షంలో, రెగ్యులర్ గా డబ్బు పంపుతా అన్నాడు. వాణ్ని ఏం చేసేటట్లు చెప్పండి! వీడి తాతలాంటివాడు అనకాపల్లిలో ఉన్నాడు. నా పత్రిక మొదలెట్టి నప్పట్నించీ వాడికి కాపీలు పంపుతున్నాను. ఎర్రని ఏగానీ జమ పడలేదు. ఖమ్మం ఏజెంటుకు రాస్తే -వాడు స్టేట్ మెంట్ పంపించాడు. దాని ప్రకారం ఆ ఏజెంటుకు నేను రు 112-00 లు బాకీ ఉన్నాను....ఇహ చెక్కులు పంపించే మహానుభావులున్నారు. వాళ్ళు పెట్టే బాధలు వర్ణనాతీతం!"
మంజరి నవ్వాగింది కాదు. పకపకా నవ్వుతూ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది శర్మగారూ ప్రొసీడ్" అన్నది మంజరి.
శర్మ మరో సిగరెట్ వెలిగించాడు.
"ఇంకోసారి కాఫీ తెప్పించనా?"
"నో ప్లీజ్ ధ్యాంక్స్" అన్నాడు శర్మ.
"ఊఁ.....చెక్కులు పంపేవాళ్ళు -" అని అందించింది మంజరి.
"మీరు బోరెత్తి పోతారేమోనని నా భయం!" అన్నాడు శర్మ నవ్వుతూ.
"నో నో.....యు ప్రొసీడ్"
"చిత్తూరులో "అజీజ్" అని వో ఏజెంటున్నాడు. రెందు వందల రూపాయలకు చెక్కు పంపుతూ, నాలుగు వందల కాపీలు ఫలానా స్టేషనుకు పంపమనీ, రాయలసీమ  మొత్తానికి తనకే ఏజన్సీ ఇచ్చే పక్షంలో రెందు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని రాశాడు. అయితే కమీషను 25% కాక  331/3 % కావాలన్నాడు. రెందు వేల రూపాయలంటే - మట్టుకు నాకు అదో పెద్ద మొత్తమే! ఆ డబ్బు పెట్టి ఏకంగా ఓ వంద రీములు న్యూస్ ప్రింటుకొని పడేస్తే, కాగితం బెడద వొదుల్తుంది  గదా అనుకొన్నాను. వెంటనే "అజీజ్" ను రాయలసీమకు సోల్ ఏజెంటుగా ఖాయపరుస్తూ వైరిచ్చాను. ఇటు- వాడడిగినన్ని కాపీలు పంపించాను. పత్రికలు అమ్ముకొని తినేశాడు. వారం రోజులకల్లా, చెక్కు తిరిగి నా దగ్గర కొచ్చింది. ఇదేమిటని "అజీజ్" కు ఉత్తరం రాస్తే జవాబు లేదు. ఇది జరిగిన నెల రోజుల కల్లా అహ్మద్ అని ఇంకో ఏజెంటు నాకు రాస్తూ పత్రిక ఏజన్సీని తనకివ్వమన్నాడు. "అజీజ్" ఉత్తదొంగ వెధవనీ, చాలా మంది పత్రికల వాళ్ళను ఇలానే మోసం చేశాడనీ, తను మాత్రం 25% కమీషనుపోగా మిగిలిన డబ్బును ప్రతినెలా 25వ  తేదీ దాటకుండా పంపుతాననీ, కాపీలు పంపమని రాశాడు. ఇప్పటికి నా పత్రికకు "అహ్మద్" ఏజెంటుగా ఉంటున్నాడు. చిత్రమేమిటంటే మేడమ్ ఈ అహ్మదు ఆ అజీజు కూడా వొక్కడే! ఇలాంటి వాళ్ళను పెట్టుకొని పత్రికను నడపడమంటే, ఎలా ఉంటుందో మీరు చెప్పండి!" అన్నాడు శర్మ.
మంజరి వచ్చే నవ్వును ఆపుకొంటూ "పోనీ ఎడ్వర్ టైజ్ మెంట్లు బాగా వస్తే చాలదూ?" అన్నది.
"చిన్న చిన్న పత్రికలు బతుకుతున్నాయంటే, ఎడ్వర్ టైజ్ మెంట్లు రెవెర్ యూ వల్లనేననుకోండి. కానీ అవి మాత్రం సులభంగా దొరుకుతున్నాయంటారా? సర్క్యులేషన్  బాగా ఉంటే తప్ప ప్రకటనలు రావు. సర్క్యులేషన్ ఉండాలంటే ఏజెంట్లమీద ఆదారపడక తప్పదు. బిజినెస్ ఫరమ్సు సాధారణంగా చిన్న పత్రికల కివ్వవు. సినిమా ప్రకటనలు కావాలంటే, ఏ ప్రొడ్యూసరో, డిస్ట్రిబ్యూటరో, యాక్టరో  రికమెండ్ చేయాలి. తీరా ఎడ్వర్ టైజ్ మెంటు వేశాక  డబ్బుకోసం కనీసం పాతికసార్లయినా తిరగాల్సి ఉంటుంది. పదే పదే తిరగందే వసూళ్ళు కావు. తిరిగామనుకోండి - రెండోసారి ఎడ్వర్ టైజ్ మెంటు ఇవ్వరు. ప్రెస్ బిల్లు ఇవ్వందే పత్రికరాదు. ఇవ్వడానికి డబ్బుండదు. ఇక పత్రికవాళ్ళు ఏ గంగలో దూకాలో మీరు చెప్పండి!" అన్నాడు శర్మ.
ఈసారి మంజరి నవ్వలేదు.
రెందు మూడు నిమిషాలదాకా అందరూ, మౌనంగా ఉండిపోయారు.
"అసలే మీ మనస్సు బావోలేదంటున్నారు. అనవసరంగా వాగి మీకు చికాకు కలిగించానేమో! అసలీ గొడవంతా ఎందుకొచ్చిందండీ!" అన్నాడు శర్మ.
ఎందుకొచ్చిందో  మంజరి చెప్పలేదు.
"మీకో చిన్నవార్త చెబుదాం గదాని వచ్చాను. మాటల సందట్లో ఇంకేదో గొడవలో పడిపోయాం....మీకు చేతనయితే మధ్యాహ్నంలోగా దీనికి రెమడీ ఆలోచించండి లేదా మొదలియార్ పిక్చరుకు  మీరిక ఆశ వొదులుకోవలసి ఉంటుంది!" అన్నాడు శర్మ తాపీగా.
మంజరి ఉలికిపడింది. ఆవిడ ముఖం గండరించి పోయింది. కళ్ళల్లో చావుభయం కన్పించింది శర్మకు. వసంత వోసారి అక్క ముఖంకేసి చూసి చల్లగా లోపలికెళ్ళిపోయింది.
"ఏమిటది?" అన్నది మంజరి మెల్లగా.
"నేనిప్పుడే మొదలియార్ కంపెనీకి వెళ్ళొస్తున్నాను. అతనే ప్రొద్దుట పిలిపించాడు. మిమ్మల్ని తన పిక్చరులో నుంచి తొలగించానన్నాడు. ఈ  విషయం పత్రికలో వేయమని కూడా చెప్పాడు" అన్నాడు శర్మ.
"అదేమిటంటే? ఎందుకనిట?" అన్నది మంజరి పొడారిపోయిన గొంతుతో.
"అతనేవో కారణాలు చెప్పాడనుకోండి. అవన్నీ మీదగ్గరనడం పత్రిక ధర్మం కాదు. మీ క్షేమాన్ని కోరేవాణ్ని  గనక, ముందుగా చెప్పాను. మీరేం చేస్తారో చేసుకోండి!" అన్నాడు శర్మ.
ఎంత ఆలోచించిన మంజరికి కారణం తోచింది కాదు. తోచిన కారణాలు సరైనవో  కావో కూడా మంజరి తేల్చుకోలేక పోయింది. మొదలియార్ తన నెందుకు తీసివేసింది తెలిస్తే తప్ప, తను సరైన యాక్షన్ తీసుకోదు. ఆకారణాలు శర్మకు తెలుసు. అవి  తనిప్పుడు బయట పెట్టించాలి.
"శర్మాజీ! నా విషయం మీకు తెలుసు. నాకు మీరూ మీకు నేనూ కొత్తవాళ్ళం కాదు. మీరునాకు లోగడ చేసిన సహాయాలేమిటో, నాకూ మీకూ, ఆ భగవంతుడికి, తప్ప మరోకంటివాడికి తెలీదు. మొదలియార్ పిక్చర్ పోయినందుకు నాకు బాధలేదు గానీ ఈ ఫీల్డులో నాకిక మంచినీళ్ళు కూడా పుట్టవు, నా క్షేమాన్ని కోరేవారు గనక, దయచేసి అతనలా ఎందుకు చేసిందీ చెప్పండి, మళ్ళా మీరన్నట్టుగా నేనెక్కడ అనను, కారణం  తెలీందే నేను మాత్రం ఏం చెయ్యను చెప్పండి?" అన్నది మంజరి.
"నన్ను మీరు చాలా డెలికేట్ సిట్యుయేషన్ లో, పెడుతున్నారండి! అన్నాడు శర్మ మీరుగానీ నిన్న ఏమైనా
ట్రబులిచ్చారా?....ఇచ్చారని అతనంటున్నాడు  మిగతా పిక్చర్లో మీరు ఉండరు" అన్నాడు శర్మ.
"అదెలా శర్మాజీ! త్రూవౌట్ పిక్చరున్నానే!" అన్నది మంజరీ.
శర్మ బాధగా నవ్వాడు.
"ఉన్నమాట నిజమే ననుకోండి. కానీ, ఇక్కడ్నుంచీ కధ మారిపోతుంది. మీరే కారు యాక్సిడెంటు లోనో పోయినట్టు ఓ చిన్న ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఇహప్పుడు మీరుండాల్సిన అవసరమేముంది?" అన్నాడు శర్మ.
"పోనీ దానికైనా నేను కావాలి గదా!" అన్నది మంజరి ఆశగా.
ఆ మాత్రం అవకాశముంటే ఎలాగో, మొదలియార్ తో రాజీ చేసుకోవచ్చునని మంజరి అభిప్రాయ పడింది.
"లాభంలేదు మాడమ్! ఓ డమ్మీని  పెట్టి  లాంగ్ షాట్ లో యాక్సిడెంట్ సీను షూట్ చేశారనుకోండి. అప్పుడు మాటేమిటి? వస్తూ వస్తూ కవి దగ్గరకు కూడా వెళ్ళాను. మొదలియార్ రాత్రేవచ్చి కధను మార్చమని చెప్పాట్ట. అతను కూచుని, కధంతా మళ్ళా తిరగరాస్తున్నాడు. ఇహ - మీకు ఆ కంపెనీకి రుణం తీరింది" అన్నాడు శర్మ.
మంజరి బింకమంతా దిగజారిపోయింది. వస్తున్న కన్నీళ్ళను బలవంతాన ఆపుకొంటూ "నన్నేం చెయ్యమంటారు శర్మాజీ?" అన్నది మంజరి.
"అదేదో మీరే ఆలోచించాలి. ఏదో వొకమార్గం కనిపించకపోదు. నేను సాయంత్రం వస్తాను. నేనూ ఆలోచిస్తాను" అన్నాడు శర్మ.
అతను వెళ్ళాక చలపతిని పైకి పిలిపించింది మంజరి. విషయమంతా చెప్పి "ఇప్పుడేం చేదామంటారు!" అన్నది.
తనకసినంతా తీర్చుకోవడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ చలపతికి దొరకదు. అతనా అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నాడు.
"అంతా అయిపోయాక నన్నడిగితే ఏం చెప్పను మంజూ క్షమించాలి - మిమ్మల్నిప్పుడు మంజరిగారూ అనాలిగా" అన్నాడు చలపతి.
మంజరి కళ్ళు మూసుకొని సన్నగా నిట్టూర్చింది.
"నేనంటే మీకింత కోపం ఉండటానికి నేనేదో చెయ్యరాని పని చేసి ఉండాలి. అదేదో విప్పి చెప్పరాదా నన్నిలా చిత్రహింస పెట్టకుండా" అన్నది మంజరి.
"అమ్మమ్మా! మీరలా అనకూడదు. నేను మీ మోచేతి కింద నీళ్ళు త్రాగి బ్రతుకుతున్నవాణ్ని మీ సెక్రటరీని, మిమ్మల్ని నేను హింస పెడుతున్నాననడం, మీకే నామోషి. మీరా మాట అననూ కూడదు-నేను విననూ కూడదు" అన్నాడు చలపతి.
"మాటల్తో మనిషిని చంపటమంటే ఏమిటో మీదగ్గరే నేర్చుకోవాలండీ! అసలే గుండెపగిలి నేను కుమిలి పోతుంటే, మీరు మీద రాళ్ళు రువ్వుతున్నారు. ఇంతకన్నా మరోసమయం మీకు దొరక్కపోవడం నా ఖర్మ!" అన్నది మంజరి.
"మీరేమన్నా అనుకోండి. మరి నాకు సెలవిప్పిస్తే కిందికి వెళతాను."
"అందుగ్గాదుగదా మిమ్మల్ని పిలిచింది. మీరేమన్నా ఉపాయం చెబుతారేమోనని పిలిపించాను. మీ నా మధ్య రవరవలే మన్నా ఉంటే, అవి మనిద్దరం సర్దుకోవాలి. మూడో వాడెవడో వచ్చి మననెత్తిన  దుమ్ము చిమ్ముతుంటే, మీరు మౌనంగా ఉండటం భావ్యం కాదు." అన్నాడు చలపతి.
"నేనింత మెత్తగా చెప్పినా మీరు వినిపించుకోవడం లేదేమిటండీ?" అన్నది మంజరి.
"వసంతనుగానీ, రాజమణినిగానీ సలహా అడక్కపోయావా అన్నాడు చలపతి."
"వాళ్ళమీద నాకా నమ్మకం లేదు. ఉన్నవాళ్ళ నడిగితే మాటలతో, చంపుతున్నారుగానీ, సాయం చేయడం లేదు" అన్నది మంజరి.
"నే పోతున్నాను" అన్నాడు చలపతి.
"మీరేమీ_"
"లేదండి! నాకాశక్తిలేదు. నేను కేవలం మీ పెర్సనల్ సెక్రటరీని ఇలాంటి వ్యవహారాల్లో పెర్సనల్ సెక్రటరీలు జోక్యం కలిగించుకోరు. కలిగించుకోకూడదు కూడాను."
 మంజరి కోపం మిన్ను ముట్టిపోయింది. పోతున్న చలపతిని ఇలారమ్మంది.
"చెప్పండి నాకు చెముడేమీ  లేదు. ఇక్కడున్నా వినిపిస్తుంది" అన్నాడు చలపతి మెట్టుమీద నిలబడి.
"నేను దగ్గరగా రమ్మంటున్నాను, రావాలి. అంతేగానీ దిక్కు మాలిన ప్రశ్నలన్నీ వేయకు" అన్నది మంజరి పెద్దగా.
చలపతి అక్కణ్నుంచి కదల్లేదు.
 "నీకు ఓ నిమిషం టైమిస్తున్నాను. ఇక్కడకు రావడమో, సరాసరి వీధిలోకి వెళ్ళిపోవడమో నిర్ణయించుకో" అన్నది మంజరి కింది పెదవి కొరుక్కుంటూ.
 చలపతి కొన్ని క్షణాలు అలానే నిలబడ్డాడు. తరువాత అడుగులో అడుగు వేసుకుంటూ మంజరి దాపులో కొచ్చి నిలుచున్నాడు.
"నువ్వు నా పెర్సనల్ సెక్రటరీననీ, ఏ సెక్రటరీ కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదనీ అన్నావు. నువ్వు సెక్రటరీవి కాకుండా నాకు తాళిగట్టిన మొగుడివైనా ఏమీ చెయ్యలేవు. నువ్వింత పనికిమాలిన వాడివని నాకెప్పుడో తెలుసు. ఈమాట అడగడానికే నిన్ను పిలిపించాను. నువ్విక వెళ్ళవచ్చు" అన్నది మంజరి.
చలపతి నిశ్శబ్ధంగా కిందికి వెళ్ళిపోయాడు.
మంజరి సోఫాలో కూలబడి పోయింది. రెందు కణతలూ  పట్టుకొని కళ్ళు మూసుకుంది. ఆవిడ కనురెప్పల మాటున నీటి బిందువులు కీరాడాయి. సన్నగా నిట్టూరుస్తూ ఏదో నెంబరుకు ఫోను చేసింది.
"పోనీ వచ్చాక, నాకు ఫోను చెయ్యమని చెప్పండి.....ధాంక్స్" అన్నది మంజరి.
లోపలినుండి వెక్కిళ్ళు వినబడితే "ఎవరిది" అన్నది మంజరి.
"వసంతమ్మాయిగారు ఏడుస్తున్నారండీ!" అన్నది తాయారు.
"ఇలా రమ్మను"
చెంగుతో కళ్ళొత్తుకుంటూ వసంత వచ్చింది.
"నా మూలంగా ఎన్ని చిక్కు లొచ్చిపడ్డాయక్కా. నాఖర్మాన నేను పోతాను. నన్ను తిరిగి గుంటూరు పంపించే సెయ్యి" అన్నది వసంత భోరుమని ఏడుస్తూ.
మంజరి సున్నితంగా వసంతను కావలించుకొని, అంతకన్నా సున్నితంగా  నవ్వేసింది.
"పిచ్చిదానా! దీనికేనా ఏడవడం? ఇంతలో ఏమయిందనీ, నువ్వు గుంటూరు వెళ్ళడం? నా సంగతి నీకింకా తెలీదమ్మాయ్. ఇటు సూర్యుడు అటు పొడిచినా సరే, కావాలనుకొన్న పనేదో అయిపోవాలి. భయపడి పారిపోతే అది మనల్ని తరుముతూనే ఉంటుంది. అన్నీ నేను చూస్తాను. అన్నీ  సక్రమంగా  అవుతాయి.....నువ్వూరుకో. అదో  ఫోన్ మోగుతోంది.
మంజరి మౌత్ పీసుకు చెయ్యడ్డు పెట్టి దగ్గి గొంతు సరిచేసుకొంది.
"మీరేనా?" మీకోసమని-"
"చెప్పు!" అన్నాడు అవతలి కొసనించి కిశోర్.
"మీరిప్పుడే నిద్రలేచారా?....అవును బాబూ! నేనులేచి పట్టుమని పట్టుమని పదినిమిషాలు కూడా కాలేదు.మెలుకువస్తే తియ్యని కలలు కరిగిపోతాయేమోనని  అలాగే పడుకొన్నాను....నాటీబాయ్.....
ఏమిటామాటలు?....మరేంలేదు. రాత్రి మీరిచ్చిన పార్టీకి బదులుగా ఇవ్వాళ నేనే మీకివ్వాలనుకొంటున్నాను....అదేం కుదరదు, రాత్రల్లా నాతో ఉండిపోవలసిందే! నిన్నంటే, కొత్త గనక మిమ్మల్ని విడిచి వచ్చానుగానీ - ఏమో చెప్పలేను....మొత్తమే కొరుక్కుతినేస్తానేమో, ఇప్పుడెలా చెప్పను? ఊఁహు.....ఎవ్వరూ లేరు. నేనొక్కదాన్నే ఉన్నాను....అదా? చంపేశారండీ బాబూ!....అందుకే -బదులుకు బదులు తీర్చుకొందామనే మిమ్మల్ని రమ్మంటూంట థాంక్స్! వెరీగుడ్ వెరీగుడ్....అవునుగానీ కిశోర్! నీ ఫ్రెండన్నావే ఎవరో? మొదలియార్ కు ఫైనాన్స్ చేస్తున్నాడన్నావు గదా. అతనూ నువ్వూ ఈ పూట మా ఇంటికి బోజనానికి రావాలి....పార్టీ మనిద్దరదీని....లేదు డియర్? దానికి దీనికీ పోటీలేదు....అబ్బబ్బా! ఎంత చిలిపివాడి వోయ్ నువ్వు....మీకోసం వెయిట్ చేస్తుంటాను ఛీరియో" అంటూ ఫోను పెట్టేసింది మంజరి. తాయారును పిలిచి ఇద్దరు గెస్టలొస్తున్నారని వంట చెయ్యమనీ చెప్పింది....
అనుకొన్న వేళకు కిశోర్ తన స్నేహితుణ్ని  వెంట బెట్టుకొచ్చాడు. మంజరి భోజనాల ఏర్పాటు బ్రహ్మాండంగా చేసింది. తను మధ్య కూచుంది. అటూ ఇటూ కిశోర్ ఫైనాన్సరూ కూచున్నారు. వసంత వడ్డన చేసింది.
భోజనాలయ్యాక మెల్లగా రంగంలోకి దింపింది మంజరి.
"మా కిశోర్ చెప్పిందాకా మీరే మొదలియార్ కు ఫైనాన్స్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలీదు....అతను మీకు చాలా కాలం నుండీ తెలుసా?" అన్నది మంజరి.
"లేదు ఈ మధ్యనే ఎవరో పరిచయం చేశారు. నెగిటివ్ రైట్సు నేను రాయించుకొని డబ్బిస్తున్నాను" అన్నాడతను!
"మరేం లేదుగానీ, సహాయం చెయ్యడానికయినా, మనిషిలో యోగ్యత లుండాలనుకొంటాను. మీ మొదలియార్ గారి ధోరణి చూస్తుంటే నాకలా అనిపించడం లేదు" అన్నది మంజరి.
"ఏం జరిగిందేమిటి?" అన్నాడు కిశోర్ విలవిలలాడిపోతూ.
"ఏం జరిగినా మీరున్నారు గనక ఫర్వాలేదనుకోండి. నాకంటే మీరు తెలిసు. మీ మనిషిని గనక, అతనేమన్నా అంటే అదుపులో వుంచుతారు. కానీ మన పిక్చర్లో వున్నవారందరికి మీరు తెలుసా? వారందర్నీ యీ మొదలియార్ నానా బాధలూ పెడుతుంటే చూస్తూ వూరుకోవలసిందేనా?" అన్నది మంజరి.
"ఏం బ్రదర్! మీ మొదలియార్ వ్యవహారం బాగా ముదిరినట్టుందే?" అన్నాడు కిశోర్ చిరుకోపంగా.
"అదేదో మీకు తెలియాలి. నేనెవర్నిట  అనడానికి? డబ్బు తీసుకొని వేషం వేస్తున్నదాన్ని. అదైనా వీల్లేకుండా పోయింది. నన్ను పిక్చర్లోంచి తీసేశానంటూ కబురు పంపించారు. అవసరమయితే కధ కూడా మారుస్తానన్నాడు. హేమా హేమీల్లాంటి మీరిద్దరూ ఉండగానే, అతనలా బిహేవ్ చెయ్యడం న్యాయమని మీరనుకొంటే నాకేమీ అభ్యంతరం లేదు....నాకీ పిక్చర్ కాకపోతే, మరోటి వస్తుంది. అదికాదు ప్రశ్న. మీ ప్రేస్టేజీ మీ డిగ్నిటీ ఏ గంగలో కలిసి పోయాయని?"
"వాటీజ్ దిస్ నాన్సెన్స్?" అన్నాడు కిశోర్.
"ఐ విల్ సీ" ఫైనాన్షియర్.
"నిన్న నాకు వొంట్లో బావోలేదు. షూటింగ్ కెళ్ళడానికి  ఓ అరగంట ఆలస్యమయితే అయిందేమో! ఇంతోసి దానికి తీసేస్తే తీసెయ్యమనండి. కధ కూడా మార్చుకోమనండి. వారేం చేసినా మట్టిగొట్టుకు పోయేది మీరుగానీ, వాడుకాదు. డబ్బు మీదా? పెత్తనం మొదలియార్ దా? నేనేమో మీ మనిషినా? వాడేమో నన్ను పిక్చర్లోంచి తీసేస్తాడా? ఎందుకిన్ని గొడవలు రేపుకుంటాడో నాకు భోధపడదు." అన్నది మంజరి చిర చిర లాడిపోతూ.
"నువ్వాపిక్చర్లో లేకపోతే మా ఫ్రెండ్ ఒక్క దమ్మిడీయివ్వడు? సరేనా?" అన్నాడు కిశోర్.
"అంతదాకా దేనికి లెండి, అసలు జరిగిందిది - మా చెల్లిని చూశారుగా, వసంతను బాగా పాడుతుంది. వీలుపడితే ఒకటి రెండు పాటలు పాడించమన్నాను. సరేనన్నాడు. పనిమాలా గుంటూరు నుండి పిలిపించాను. తీరా వచ్చాక, గ్రూప్ సాంగ్ పాడిస్తానంటాడు. ఇంకేవో అంటాడు. అతనిష్ట ప్రకారం పోతే డబ్బాలు నాలుగోనాటికి  తిరిగిరావడం ఖాయం. బాగా వుండేవాళ్ళను తీసుకోవాలి గానీ, డబ్బెవడిదో గదాని మనకిష్టమైన వాళ్ళను తీసుకొంటే ఎలా?" అన్నది మంజరి.
"నాకీ గొడవలేవీ తెలియవు. అతన్ని పిలిపించి కనుక్కొంటాను. మీరు పిక్చర్లో లేకపోతే నా డబ్బు నాకిచ్చెయ్యమంటాను. ఆ పిక్చర్ సోలో ప్రొడ్యూసర్ను  నేను గానీ వాడు కాదే! వసంత సంగతంటారా? ఆ పిల్ల బాగా పాడేపక్షంలో ఈపిక్చర్లో నే ఛాన్సిద్దాం...." అన్నాడు కిశోర్ ఫ్రెండ్.
"భోజనానికి పిల్చి ఇవన్నీ చెప్పిందేమిట్రా భగవంతుడా అనుకోరు గదా?" అన్నది మంజరి.
నెవర్. మీరిలా అనడమే మేలయింది. లేకపోతే ఈ లోపలి గూడు పుఠానీ నాకు తెలిసేది కాదు. చాలా థాంక్స్....మళ్ళా కలుసుకొందాం. అంటూ ఫైనాన్షియర్ లేచాడు.
కిశోర్ కూడా కుర్చీలో కదిలాడు లేవడానికి, మంజరి ఆగమన్నట్టుగా,అతని చేతిని నొక్కింది.
ఫ్రెండ్ వెళ్ళిందాకా ఆగి, కిశోర్ చేతిని గట్టిగా నొక్కుతూ రాత్రికి - అన్నది మంజరి మెల్లిగా.
"ముందీ మొదలియార్ గాడి వ్యవహారం తేలనీ చెబుతాను" అన్నాడు కిశోర్.
"తేల్చుకొనే రండి. కానీ ఏ వేళకయినా మీరు రావాలి సుమా! మీకోసం వొళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తుంటాను."
"వొళ్ళంతా ఏం చేసుకొనీ!" అన్నాడు కిశోర్ నవ్వుతూ.
అతని చూపులు మంజరి భుజాలమధ్య తారట్లాడుతున్నాయి.
"ఎంత కొంటె కోనంగివోయ్ నువ్వు....అలా చూడకు....నేను తట్టుకోలేను"
కిశోర్ ఇంకోసారి మంజరినీ ఆపాదమస్తకం చూశాడు. అతని కళ్ళల్లోకి తోడేలు దృష్టి వచ్చింది.
"నేనెక్కడికి పారిపోవడం లేదు. పన్నెండు గంటల రాత్రి వుంది" అంటూ అతన్ని సాగనంపింది మంజరి.

                                                                          17
నిజంగా దెబ్బకు దయ్యం వదులుతుందో లేదో మనకు తెలీదుగానీ, మంజరి వేసిన ఎదురెత్తుకు మొదలియార్ చిత్తు చిత్తయి పోయాడు. మంజరంటే మామూలు ఆర్టిస్టనీ ఆవిణ్ను  కోతినాడించినట్లు ఆడించవచ్చుననీ అతను భావించి ఉండాలి. ఆ భ్రమ విడిలిపోవడానికి ఎక్కువ టైం అవసరం లేకపోయింది. కిశోర్ స్నేహితుడు మొదలియార్ కు ఫైనాన్స్ చేస్తున్నాయన - సరాసరిగా మొదలియార్ ను తన దగ్గరకు పిలిపించుకొని, తనిక ఈ పిక్చరుకు డబ్బు పెట్ట బోవడం లేదనీ, తను చెల్లించిందంతా జమ కట్టిగానీ షూటింగు ప్రారంభించడానికి వీల్లేదని అన్నాడు.
మొదలియార్ కి తెర వెనక భాగవతం తెలీదు. అతను మూర్చ పోయినంత పనిచేసి "ఎందుకని?" అన్నాడు తడబడుతూ.
"నువ్వూ నేనూ రాసుకొన్న ఎగ్రిమెంట్ ఉంది. అందులో ఉన్న నిబంధనల్ని నువ్వు కాదనే పక్షంలో, నీకు నేను చిల్లిగవ్వ కూడా ఇవ్వనవసరం లేదు. నువ్వు ప్రారంభంలో  చూపించిన కధ వేరు. దాన్నలానే తీస్తానన్నప్పుడే నీకు నేను డబ్బివ్వాలి. మధ్యలో నీఇష్ట మొచ్చినట్లు మార్పులు చేసుకొంటూ పోతానంటే కుదరదు. నువ్వు దమ్మిడీ కూడా పెట్టలేదు గనక -నష్టం వచ్చినా నేకేం ఫర్వాలేదు. కానీ లక్షలు పెడుతున్నవాణ్ని నాసంగతేమిటని?" అన్నాడతను.
మొదలియార్ తన్ను తాను సమర్ధించుకోడానికి వ్యర్ధ ప్రయత్నాలు చేశాడు. ఇంకెవరినన్నా పట్టుకొని, అతని డబ్బు అతనికిద్దామని కూడా అనుకొన్నాడు. ఆమాటే తన పెట్టుబడిదారు క్కూడా చెప్పాడు.
"అలాగే! నువ్వేంచేసినా నా కిష్టమే! నిన్ను నేను డబ్బేకక్కమనలేదు. కధ మార్చగూడదనీ ఆర్టిస్టులతో యాగీ పెట్టుకోవద్దని మాత్రమే నేనన్నాను. ఈ పని చేయడం ఇష్టంలేని వాడికి డబ్బు కుమ్మే పాటి సంస్కారం నాకులేదు." అని తెగేసి చెప్పాడతను.
మొదలియార్ వొకపూటల్లా మంచి డిస్టిబ్యూటర్ కోసం గాలించాడు. ఈలోగా కిశోర్, నాలుగు కంపెనీలకు ఫోను చేశారు. ఒకటి రెండు కంపెనీల దగ్గర "నాన్నగారు చెప్పారు" అని కూడా అన్నాడు. మొదలియార్ ఎక్కడకు వెళ్ళినా చుక్కెదురయింది. అతను దిగులుపడలేదు. అవమానమనీ అనుకోలేదు. సరాసరి మంజరి దగ్గరికొచ్చి మునుపటికన్నా వినయంగా వ్యవహరించాడు.
"చూడమ్మాయీ! నేనేమో ననుకొన్నానుగానీ, మంచి రిజల్ట్సు వచ్చాయి. వసంత పాటలు మ్యూజిక్ డైరెక్టర్ ఓ.కే. చేశాడు. నీపాటలన్నీ వసంత చేత పాడించడం బావుంటుందని కూడా అతనన్నాడు....ఏదీ వసంత? నన్ను కంగ్రాట్యులేట్ చెయ్యనివ్వు" అన్నాడు మొదలియార్.
"నీరోగం కుదిరింది కదా నాన్నా" అనుకొన్నది మంజరి. పైకి మాత్రం  "చాలా థ్యాంక్సండీ! వసంత కలకాలం మీకు రుణపడి ఉంటుంది" అన్నది.
"వసంత అనే నేపధ్యగాయని, తారాపదంలో ప్రవేశించింది.   
                                            *    *    *    *
జయావరి పిక్చరు బాగా పోయినమాట నిజమేగాని, ప్రొడ్యూసరు వంతు కొచ్చిందాట్టే లేదు. మెహతా మాయాజాలం వల్ల కలెక్షన్ లన్నీ అతని కార్యాలయానికి చేరి, ఉత్తి స్టేట్ మెంట్లు మాత్రం ప్రసాద్ చేతికొచ్చాయి. వాటి ప్రకారం అతనికీ, అతని  పార్ట్నర్లకీ కలిపి, పదిహేను వేల పైచిల్లరగా వచ్చాయి. ఈ డబ్బుతో పిక్చరు తీయడం మాట దేవుడెరుగు ఆర్టిస్టులకు ఎడ్వాన్సు లివ్వడానికే చాలదు. పోనీ, ఈ దుకాణం కట్టేసి సొంత ఊళ్ళో  కెడదామని ఒక భాగస్థుడన్నాడు గానీ ప్రసాద్ దానికొప్పుకోలేదు.
"మనం నష్టపడితే నువ్వన్నపనే మంచిది గానీ, పిక్చరు బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటరు మింగేశాడు. ఈ సారి మనం డిస్ట్రిబ్యూటరు  మీద ఆదారపడకూడదు. సొంతంగా బొమ్మతీయాలి. అప్పుడు ఖర్చులు పోగా మిగిలిందంతా కంపెనీకే వుంటుంది" అన్నాడు ప్రసాద్.
"నిజమే గానీ, ఈ ఇండస్ట్రీ ని నమ్ముకొని, మిగతా పొలం నేను అమ్మను" అన్నాడు భాగస్థుడు.
"అలా జరక్కుండా చూదాం" అన్నాడు ప్రసాదు.
ఆ ప్రయత్నంలో తొట్టతొలిగా అతను మంజరిని కలుసుకున్నాడు.
"రండి" అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది మంజరి.
ఆవిడ ధోరణి చూశారా..లోగడ లాగా "చనువు"గా మాట్లాడలేక పోయాడు ప్రసాద్.
"నేను నీతో వో ముఖ్యమైన పనివుండి వచ్చాను." అంటూ ప్రారంభించాడు ప్రసాదు.
"చెప్పండి"
"నీ సాయం తప్పకుండా ఉంటుందనుకొంటున్నాను." అన్నాడు ప్రసాదు వో సిగరెట్టంటించుకొంటూ. "నా పిక్చరు మంచి లాభాలే తెచ్చినా, నాకు రావలసిన భాగం న్యాయంగా నాకు రాలేదు. నా పెట్టుబడి కూడా చాలా భాగం చెల్లాచెదరయిపోయింది. మళ్ళా నేను కొత్త పిక్చరు ప్రారంభించాలను కొంటున్నాను."
"వెరీ హ్యాపీ న్యూస్, తప్పకుండా స్టార్ట్ చెయ్యండి. నావల్ల మీకేం సాయం  కావాలన్నా చేస్తాను" అన్నది మంజరి.
"థ్యాంక్స్" అంటూ ప్రారంభించాడు ప్రసాద్. "ఈసారి నేను డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడదలుచుకోలేదు. నేనే స్వయంగా ప్రొడ్యూస్ చేదామనుకొంటున్నాను. నా దగ్గరున్న కాపీటల్  చాలా కొద్ది, మీరందరూ కో ఆపరేట్ చేస్తే నా పిక్చరు పూర్తవుతుంది."
మంజరి "వింటున్నాను" అన్నది తాపీగా.
"నేను పెద్దగా అడ్వాన్సులు కూడా ఇచ్చుకోలేదు. మీరు ఎవర్ని సజెస్టు చేస్తే వారినే తీసుకొంటాను. మిగతా సపోర్టింగ్ కారెక్టర్సుకు కూడా మీరే సెలక్టు చేయండి."
"నేను సరేననుకోండి - మిగతా వారు ముందుగా డబ్బు తీసుకోకుండా వస్తారా? ఆ నమ్మకం నాకులేదు" అన్నది మంజరి.
"నాకూ లేదనుకోండి. కానీ, మీరన్నారన్న ధైర్యంతో, ఈ స్కీం ప్రారంభించాను. నేననుకొన్న దేమిటంటే, ముందు కొద్దిగా ఎడ్వాన్సులిచ్చి ఎగ్రిమెంట్స్ రాసుకొందాం. నాకు రేటు తగ్గించాల్సిన అవసరం కూడా లేదు. పిక్చరు తెలుగు టామిల్, రెండు వెర్షన్లు తీస్తున్నాను. రెండింటిలోనూ ఒకే కాస్టింగ్, అందుకని - సిటీ రైట్స్ ఇంకెవరికో
ఇవ్వకుండా మీకే ఇస్తాను. ఎగ్రిమెంటులో ఉన్న మొత్తం తీరేదాకా, కలెక్షన్ లన్నీ మీరు తీసుకోండి. ఆ తరువాత వసూలు అయిన డబ్బు చెరిసగం తీసుకుందాం. అలాగే హీరోకు సౌత్ లో ఉన్న రెండు టౌన్లు  ఇచ్చేస్తాను. మిగతా ఆర్టిస్టుల సంగతే ఆలోచించాలి" అన్నాడు ప్రసాద్.
మంజరి ఈ పద్ధతి బొత్తిగా కొత్తదికాదు! లో�


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS