Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 33

"నువ్వు చాలా తెలివయిన దానివి మంజూ! నీతో వాదించి గెలవడం మామూలు వాళ్ళవల్ల కాదు" అన్నాడు చలపతి నవ్వుతూ.
"అది తప్పే అయితే, డానికి బాధ్యులు మీరే! నోట్లో నాలుక లేని దానిని తెచ్చి, ఇలా తయారు చేశారు" అన్నది మంజరి కూడా నవ్వుతూ. "ఇన్నిటికీ నేను అసలు విషయం చెప్పనేలేదు. వాళ్ళేమో అక్కడ నానా బాధలు పడుతున్నారు. ఇక్కడ కొచ్చెయ్యాలను కుంటున్నారు. అనుకొంటున్నారంటే - నేనే వచ్చేయమన్నానను కొండి -మరి-మీ ఉద్దేశం చెబితే-"
"రానివ్వు మంజరీ తప్పేం?" అన్నాడు చలపతి.
మంజరి గట్టిగా నిట్టూర్చి "హమ్మయ్య! బతికిపోయాను" అని సోఫాలో చేరగిలబడిపోయింది.
"దీన్ని బట్టి చూస్తే. నేను కాదంటానేమోనని, నువ్వనుకొన్నావన్న మాట అవునా?" అన్నాడు చలపతి.
"అబ్బా? మీతో వేగడం కష్టమండీ! భగవంతుడు మిమ్మల్నెలా పుట్టించాడో గానీ నా కడుపులో ఆలోచనలు కూడా మీరు చెబుతుంటే ఎలా నండీ చావడం?" అన్నది   మంజరి.
ఈ మాటలకు చలపతి ఉబ్బి పోతాడని మంజరి అభిప్రాయం. కానీ చలపతి ఉబ్బిపోలేదు. ఈ మాటలు వెనక పనిచేసిన మనస్తత్వమేమిటో అతనికి క్షుణ్ణంగా తెలుసు.
అనుకొన్న వేళకు, రాజమణి, వసంతా వచ్చారు. స్టేషనుకు మంజరి వెళ్ళలేదు. గుర్తులన్నీ చెప్పి, చలపతిని పంపించింది. తీరా వారు వచ్చేవేళకు మంజరి ఇంట్లో కూడా లేదు. మొదలియార్ పిక్చర్ షూటింగ్ కెళ్ళింది. నాలుగంటల్లో అయిపోతుందనుకొన్న కాల్ షీట్, రాత్రి పదిగంటలదాకా పట్టింది. తమిళ హీరో రావడమే రెండు గంటలు  ఆలస్యంగా వచ్చాడు. వచ్చాక డబ్బివ్వందే సెట్ లోకి రానన్నాడు. ప్రొడక్షన్ మేనేజర్ ఆఫీసు కెళ్ళి చెక్ తీసుకొచ్చిందాకా అతనలాగే కూచున్నాడు గానీ కిమ్మనలేదు. అతన్ని రంగు వేసుకోమనే ధైర్యం ఎవరికీ లేకపోయింది.
"ఇదే నేనయితే, నలుగురూ నాలుగు మాటలు అనేసి ఉందురు. హీరో గనక కుక్కిన పేనులాగా పడున్నారు" అనుకొన్నది మంజరి.
పది గంటలకు ఆపసోపాలు పడుతూ ఇంటికొచ్చిందో లేదో కళ్యాణి నాలుగైదు దఫాలు ఫోను చేసిందనీ, రాగానే కబురు పంపమన్నదనీ చలపతి చెప్పాడు. పైకి వచ్చేసరికి రాజమణి, వసంతా సోఫాల్లో కూచుని ఉన్నారు. తాయారు వారి కల్లంత దూరంలో నిలబడి ఏవో కబుర్లు చెబుతోంది!
"ఏం అక్కాయ్, ప్రయాణంలో ఇబ్బంది లేదుగదా! ఏవమ్మా వసూ భోజనాలయ్యాయా!" అన్నది మంజరి.
"మీకోసం కళ్యాణమ్మగారు శానామాట్లు ఫోను చేసినండ్రి అమ్మాయిగారు!" అన్నది  తాయారు.
మంజరి సోఫాలో కూచుంటే తాయారొచ్చి, కాలిజోళ్ళు విప్పు దూరంగా ఉంచింది. వానిటి బాగ్ తీసి డ్రాయరు మీద పెట్టింది. ఫానుని నాలుగు మీద నుండి "ఆరు" మీదకు తిప్పింది. పొగలు చిమ్ముతున్న కాఫీ తెచ్చి అలానే నుంచుంది. ఇవన్నీ రాజమణి, వసంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలోనే మళ్ళా ఫోను మోగింది. తాయారు ట్రేసు బల్ల మీదుంచి రిసీవర్ అందుకొని 'హలో' అని మౌత్ పీస్ కు చెయ్యి అడ్డుపెట్టి "కళ్యాణమ్మగారండీ! మిమ్మల్ని పిలుస్తా వున్నారండీ అమ్మాయిగారు!" అన్నది.
"ఎందుకట?" అన్నది మంజరి.
"తెలీదండీ! ఏమని చెప్పమంటారు?"
మంజరి విసుగ్గా లేచి రిసీవర్ అందుకొన్నది.
నీ కోసం రెండు గంటలనుంచీ ట్రై చేస్తున్నాను. నువ్వు అందావు గాదు.....వెంటనే బయల్దేరు అన్నది కళ్యాణి.
"ఈపూట"
వాక్యం పూర్తిగాక ముందే కళ్యాణి అడ్డుకొన్నది "అదేమీ కాదమ్మాయ్! నీతో చాలా పనులున్నాయి. పది నిమిషాల్లో ఇక్కడికిరా. మిగతా విషయాలు చెబుతాను అర్జంట్..కారు పంపనా మరి!.....అలాగే...పంపుతున్నాను."
మంజరి విసుగ్గా రిసీవర్ పడేసింది.
"మళ్ళావస్తానమ్మా అక్కాయ్! అర్జెంటు పనిమీద పోతున్నాను....నా కోసం మీరు కనిపెట్టుకొని ఉండకండి. ఎప్పటికొస్తానో తెలీదు."
"ఎప్పుడు తిన్నావో ఏమిటో, కాస్త ఎంగిలి పడరాదుటే  మంజూ!" అన్నది రాజమణి.
"పది నిమిషాల్లో బయల్దేరాలి అక్కాయ్! ఈలోగా డ్రెస్ చేసుకోవడమే కాదు. బోజనానికి టైమేదీ? తాయారూ! చూడమ్మా" అన్నది మంజరి లోపలి గదిలో కెడుతూ.
రాజమణి, వసంతా వొకరి నొకరు చూసుకొన్నారు.
మంజరిని చూస్తూనే కల్యాణి కింది పెదవి కొరుక్కుంటూ కళ్ళెగరేసింది.
"మరీ అంత బిజీ అయితే ఎలాగమ్మా! స్టూడియోకు ఫోను చేస్తే నువ్వు సెట్ లో వున్నావనీ, కదపటానికి వీల్లేదని, అంటారు. మధ్యలో ఫోను చేస్తే నువ్వు కోప్పడతావంటారు. మరీ నువ్వేమో!" అన్నది కల్యాణి.....
మంజరి ఎదురుగా ఉన్న అద్దంలో ఇంకోసారి మేకప్ చేసుకొంది.
"ఇవ్వాళ ట్రిచ్చి నుండి రాజన్ వచ్చాడు మంజూ! వస్తూనే నిన్ను గురించి అడిగాడు. నువ్వు ఎవైలబుల్ కాదన్నాను. ఏవో షూటింగ్ గొడవల్లో ఉన్నదన్నాను. అతనేమన్నాడో తెలుసా అన్నది కల్యాణి.
"చెప్పు!" అన్నది మంజరి నవ్వి.
"ఈ సినిమా గొడవలు మానేసి అచ్చంగా తన ఊళ్ళో  ఉండిపోగూడదా అన్నాడు"
మంజరికి చటుక్కున వెంకటేశ్వర్లు జ్ఞాపకం వచ్చాడు. అప్పుడెప్పుడో అతను కూడా ఈ మాటే అన్నాడు. దానికి తనేం సమాధానం చెప్పిందీ జ్ఞాపకంలేదు - బహుశా 'సరే'నని ఉంటుంది. అలాగే ఇప్పుడీ రాజన్ కూడా అంటున్నాడు.
"ఏమిటమ్మా ఆలోచిస్తున్నావ్?" అన్నది కల్యాణి.
మంజరి "స్ప్" అన్నది.
"రాజన్ ఇంకో పది నిమిషాల్లో ఇక్కడికొస్తున్నాడు. మనల్నే హోటలుకు రమ్మన్నాడుగానీ, నేనొప్పుకోలేదు. ఈ రాత్రి అతని చేత మనం చాలా కమిట్ చేయించాలి. అతనికి ఊపిరి తిరగనివ్వకూడదు. బస్ అంతే!" అన్నది కల్యాణి.
"నువ్వేం చెయ్యమంటే అదే చేస్తాను..నాకంతకన్న ఇంకేమీ తెలీదు" అన్నది మంజరి నిరుత్సాహంగా.  
అలా ఉన్నావేమిటమ్మా ! నువ్విలా జోగులాడుతూ ఉంటే రాజన్ ఏమనుకొంటాడు?" అన్నది కల్యాణి.
"వాడేమనుకొన్నా నాకు ఇబ్బంది లేదు. వాణ్ని చాసి జడుసుకోవలసిన అవసరమేముందక్కా" అన్నది మంజరి. మెడ వో పక్కగా ఉంచి కళ్యాణిని చూస్తూ.
"నువ్వు పూర్వజన్మలో ఏ పూజ చేసుకొని పుట్టావో గానీ, మంజరీ - కోపంలో కూడా నువ్వు జగన్మోహనంగా ఉంటావమ్మా! ఈ రాత్రి రాజన్ పిచ్చి కుక్కయి పోవడం ఖాయం!" అన్నది కల్యాణి మంజరి సరసకు జరుగుతూ. "రాజన్ సంగతి నీకింకా తెలీదు మంజూ! అలాంటివారి ప్రాపకం ఉండటంలోని లాభాలు నీకిప్పుడు తెలీవు....నువ్వూ, నేనూ ఈ ఇండస్ట్రీలో ఉండటం డబ్బుకోసంగానీ, లోకానుద్దరించడానికి కాదు. అయినప్పుడు డబ్బున్న వాణ్ని నువ్వు అసహ్యించుకోవడం లో అర్ధం లేదు."
దూరంనుంచి కారేదో వచ్చి పోర్టికోలో ఆగిన చప్పుడయింది.
"అడుగో రాజన్ వస్తున్నాడు-బీ కేర్ ఫుల్" అన్నది కల్యాణి.
మంజరి వోసారి వొళ్ళు విరుచుకొని సోఫాలో సరిగా కూచుంది.
రాజన్ వచ్చాడు. వస్తూనే వారిని చూసి నవ్వాడు. కళ్యాణీ మంజరి లేచి నమస్కరించారు.
అతను కూచున్నాక, ఇద్దరూ అతనికి ఎదురుగా కూచున్నారు.
"ఓ షరతు మీదయితే మీతో మంజరి మాట్లాడుతుందిటయ  లేకపోతే మానేస్తుందిట!" అన్నది కల్యాణి నవ్వుతూ, మెల్లిగా మంజరికి సైగచేసి.
"ఏమిటది?" అన్నాడు రాజన్.
అతను మాట్లాడేటప్పుడు, బంగారు పన్ను లైటు కాంతికి మెరవసాగింది.
మరేం లేదండీ! మీరో బ్రాంచిని మద్రాసులో ప్రారంభించి, మీరిక్కణ్నే ఉండిపోవాలట. ఇలా పిట్ట బెదిరినట్లుగా ఎప్పుడో రావడం, పోవడం ఆవిడకు బాగాలేదట" అన్నది కళ్యాణి.
"ఈజిట్?" అన్నాడు రాజన్.
"యస్" అన్నది మంజరి.
"అదిగో చూశావా! నీ షరతును నేనొప్పుకోక ముందే నాతో మాట్లాడేశావు" అని నవ్వాడు రాజన్.
కళ్యాణి నవ్వడమే కాదు "హియర్" "హియర్" అంటూ చప్పట్లు కూడా చరిచింది. మంజరి బుంగమూతి పెట్టి రాజన్ మీద చిన్న దెబ్బకొట్టింది.
"మీరలా అంటారనే, మీరంటే నాకు కోపం. అసలు మాట్లాడకూడదనుకొన్నాను కానీ మిమ్మల్ని చూశాక ఆ సంగతే మరచిపోయాను."
"ఇప్పుడే వస్తాను. అంటూ కళ్యాణి లోపలికెళ్ళిపోయింది."
రాజన్, ముందుకు వంగి మంజరి చెయ్యిపట్టుకొని  లాగాడు. ఆ వూపుకు అతని పక్కనే వచ్చి పడింది మంజరి.
"ఇంతకాలం ఏమయి పోయారుట? నేనున్నాననైనా నీకు జ్ఞాపకం రాలేదా?" అన్నది మంజరి.
రాజన్ ఆమె భుజాలమీద చేతులు వేసి తనకేసి తిప్పుకొన్నాడు.
"అబ్బా మీరలా చూడకండిబాబూ!" అని తల దించేసుకొంది  మంజరి.
రాజన్, ఆమె ముఖాన్ని పైకెత్తాడు, మంజరి కళ్ళు మూసుకొంది. అతనామెను మెత్తగా ముద్దు పెట్టుకొన్నాడు.
"ప్లీజ్! వన్ మినిట్!" అన్నది కళ్యాణి.
మంజరి గానీ, రాజన్ గానీ ఉలిక్కి పడలేదు సరిగదా, కనీసం సిగ్గయినా పడలేదు.
ట్రేలో రెండు నల్లటి సీసాలు, మరో నాలుగు సోడాలు ఉన్నాయి. గుమగుమలాడుతున్న కూర, ఇంకో సాసర్ లో ఇన్ని జీడిపప్పులూ ఉన్నాయి. కళ్యాణి మూడు గ్లాసుల్లోకి వంపి, మిగతా ఖాళీ లను సోడాలతో నింపేసింది. ముగ్గురూ గ్లాసులందుకొని, వొకదాన్ని కింకొకటి తాకించారు. కళ్యాణి తనగ్లాసుని పైకెత్తి ఫర్ ది హెల్తాఫ్ మిష్టర్ రాజన్ అన్నది.
"డిటో" అన్నది.
రాజన్ మీ ఇద్దరి ఆరోగ్యం కోసం అంటూ గ్లాసును ఖాళీ చేశాడు.
దాదాపు పదకొండున్నరయింది. రేడియో గ్రామ్ లోంచి, సన్నగా, మధురంగా, ఏదో సంగీతం వినిపిస్తోంది. రాజన్ గట్టిగా సిగరెట్ లాగి మంజరి ముఖం మీదికి పొగ వదిలాడు. మంజరి అతని సిగరెట్ ను లాక్కుని కాల్చసాగింది. కళ్యాణి అతనికి వెనక వైపున చేరి, మంజరికి సైగ చేసింది. గ్రహించానన్నట్లుగా మంజరి కూడా కన్ను మలిపింది.
"నిజంగా మీకు సిగ్గు లేదండీ!" అన్నది కళ్యాణి వ్యవహారాన్ని ప్రారంభిస్తూ.
"వాట్!" అన్నాడు రాజన్ చాలా తాపీగా.
"ఊరంతా నేమో, మేం మీ మనుషుల మనుకొంటుంటే, మీరేమో ఇలా నిమ్మకు నీరెత్తి నట్టుంటారాయె!" అన్నది కళ్యాణి.
"ఏమయింది?" అన్నాడు రాజన్.
దానికి  కళ్యాణి సమాధానం చెప్పలేదు. మంజరికేసి తిరిగి "చూడు మంజూ! నిన్ననో, మొన్ననో ఎవరో ఆటో మొబైల్స్ కంపనీవారు నీకోసం వచ్చారు గదా! కారేమన్నా బేరం చేస్తున్నావా?" అన్నది.
"ఊఁ" అన్నది మంజరి.
"నువ్వేమీ తొందర పడకు అంతగా అవసరమయితే అందాకా వీరు కారు వాడుకో. తరువాత చూసుకొందాం.
కొనదలచుకున్న దేదో మంచిదే కొనాలి గానీ, ఏదోరకం కొనకు. సరేనా" అన్నది కళ్యాణి. తరువాత రాజన్ కేసి తిరిగి "మీరంటే ఇన్ ఫ్యూయన్స్ చేసి, అయిదు నిమిషాల్లో కొత్త కారు తెచ్చుకోగలరు. మంజరి కామాత్రం  హెల్ప్ చెయ్యకూడదూ"
"వారేమనుకొన్నా సరే! ఆ కారు నేను తీసేసుకొంటాను అక్కాయ్! రాతలూ, కోతలూ తరువాత చూసుకోవచ్చు. ఆయన మనతో ఉన్నా లేకపోయినా కనీసం వారికారన్నా మనతో ఉంటుంది" అన్నది మంజరి.
"హావిట్! ఐ హావ్ నో అబ్జెక్షన్!" అన్నాడు రాజన్ మత్తుతో జోగులాడుతూ.
మంజరి 'హమ్మయ్య' అనుకొంది.
కళ్యాణి అతనికి ఎదురుగా వచ్చి హత్తుకొని వదిలేసింది.
"అలా ఉన్నావేం మంజూ! ఇలాంటప్పుడు, ఎందుకమ్మా దిగులు?......ఐసీ....అదన్నమాట సంగతి. నేనింకా విషయమే మరచిపోయాను సుమా? అయినా నీదంతా సోద్యంగాకపోతే అలా వాయిదాల మీద ఇల్లు తీసుకోమని నీకెవరు చెప్పారు మంజూ! పోనీ మాటమాత్రమన్నా నాతో అనలేకపోయావా? కావాలంటే రాజన్ గారి నడిగి వాడి డబ్బు ముఖాన గిరాటేసి ఉందును. ఇప్పటికి రెండు ఇన్ స్టాల్మెంట్సు  పేచేశావు గదూ?" అన్నది కళ్యాణి కన్నుమలుపుతూ.
కళ్యాణి సాహసం చూసి, అంతమైకంలోనూ, మంజరి కొయ్యబారి పోయింది. కళ్యాణి పోల్చి చూస్తే తనంత అర్భకురాలు,,తనకు మనుషులతో మాట్లాడటమూ రాదు వాళ్ళతో పనులు చేయించుకోవడమూ రాదు.
"డోన్ట్ వర్రీ డార్లింగ్  ఐ విల్ సెటిల్ గ మాటర్!" అన్నాడు రాజన్. "అనే నేనూ  చెప్పాను. అయినా మంజరి వినిపించుకోదు. దాని భయం దానిదీ! అమ్మాయీ, నువ్విక నిశ్చింతగా ఉండు. ఆ గొడవలన్నీ రాజన్ గారే చూసుకొంటారు....ఆయన రానప్పుడేమో ఎప్పుడొస్తాడు  ఎప్పుడొస్తాడు? అని నా ప్రాణాలు తోడేస్తుంటావ్! తీరా మనిషొచ్చాకనేమో ఏవో దిక్కుమాలిన కబుర్లన్నీ పెట్టుక్కూచుంటావు" అని కోప్పడింది కళ్యాణి.
మంజరి లేచి నిలబడింది. రాజన్ లేచాడు. కళ్యాణి లేచింది. ముగ్గురూ ఇంకో పెద్దగదిలో ప్రవేశించారు. తలుపులు మూసుకొన్నాయి.
ఉదయం రాజన్ కారుమీదనే ఇంటికొచ్చింది మంజరి. ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. జుట్టంతా రేగిపోయింది. దిద్దిన కనురెప్పల రంగు, వికారంగా ముఖమంతా చెదిరిపోయింది. ఆవిడ నోరు విప్పితే, పుల్లని వాసన వేస్తోంది. చలపతి కారు చూచాడుగానీ, ఏమీ అనలేదు. రాజమణి, వసంతా ఏదో మాట్లాడబోయారు. తాయారు వారిని వారించి మంజరి సరాసరి తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొంది. ఆమెను పలకరించడానిగ్గానీ, కనీసం లేవడానిగ్గానీ ఎవ్వరూ సాహసించలేదు.....
మధ్యాహ్నాన్ని కల్లా మిగతా పనులుకూడా పూర్తి చేసింది కళ్యాణి. తను మంజరికి కారు అమ్మినట్లు అందుగ్గానుఆవిడ ఇవ్వవలసిన డబ్బంతా తనకు ముట్టినట్లు రాజన్ ఒక రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చాడు. కళ్యాణి సెక్రటరీ, చలపతికి ఫోను చేస్తూ "ఇంకేమన్నా కావాలేమో ఆలోచించి చెప్పమని, మా అమ్మగారు అంటున్నారు. సాయంత్రంలోగా చెప్పాలట....మీకు తెలీకపోతే, ఇంకెవరినన్నా కనుక్కోమన్నారు..మీ అమ్మగారేం చేస్తున్నదీ చెప్పమన్నారు..." అన్నాడు.
"మా అమ్మగారా?" అని క్షణమాగాడు చలపతి అతని పెదవులు కోపంతో అదురుతున్నాయి.
"అవునండీ! అమ్మాయిగారేం చేస్తున్నదీ మా అమ్మగారు కనుక్కోమంటున్నారు!" అన్నాడు కళ్యాణి కార్యదర్శి.
"గొడ్డులాగా నిద్రపోతోంది!" అని ఫోన్ పెట్టేశాడు చలపతి.
ఆ మరుక్షణంలోనే అతను కొయ్యబారిపోయాడు. మెట్లమీద మంజరి నిలబడి ఉండి. ఆవిడీ మాటలన్నీ విన్నది.
చలపతి కేమీ తోచలేదు. ముచ్చెమటలు పోశాయి. భయంతో అతని గొంతు పొడారి పోయింది.
మంజరి తాపీగా మెట్లుదిగి, అతని బల్ల దగ్గర కొచ్చింది. ఆమె ముఖంలో కోపంగానీ, అసహ్యంగానీ లేదు.
"మంచి డ్రైవర్ను మాట్లాడండి. చాలా మంచివాడు కావాలి. ఎప్పుడూ ఇక్కడే ఉండాలి. అతనికి మనమే ఫ్రీ క్వార్టర్సు ఎరేంజ్ చేద్దాం" అన్నది మంజరి.
"అలాగే!" అన్నాడు చలపతి.
"ఎప్పుడో కాదు సాయంత్రంలోగా మాట్లాడాలి."       
మెట్లెక్కబోయిందల్లా ఆగి, వెనక్కు తిరిగి ఏదో అనబోయింది మంజరి. కొంపలంటుకున్నాయనుకొన్నాడు చలపతి.
"మరేం లేదు. ఆ సంగతే ఇంకోసారి చెబుదామనీ!" అంటూ పైకెళ్ళిపోయింది మంజరి!
చలపతి స్థిమితంగా కుర్చీలో కూచోలేకపోయాడు.
ఈ సంఘటన ఇంతటితో సమసిపోదనీ, దీని తాలూకు ఫలితాలు ఎప్పుడో ఒకప్పుడు తను అనుభవించక తప్పదనీ చలపతి నిశ్చయించుకొన్నాడు. అతనీ నిర్ణయానికి వచ్చేందుకు తగినన్ని కారణాలు కూడా అతనిదగ్గరున్నాయి. ఒకటేమిటంటే -మంజరిని గురించి అతనికి బాగా తెలుసు. ఇంకెవరికి తెలియనన్ని విషయాలు కూడా తనకు తెలుసుననుకొనేవాడు చలపతి. తనకు జరిగిన ఉపకారాపకారాల్లో దేన్నీ మంజరి మరిచిపోదని చలపతి నమ్మకం. అనేక వందలసార్లు,రామచంద్రాన్ని గురించీ, మాధవరావు గురించీ, మాట్లాడటం తన అనుభవంలో ఉన్నదే! వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా మంజరికి వొరగపెట్టిందేమీ లేదు. వాళ్ళకో మంచి అమ్మాయి కావాలి. మంజరికో ఉపాది కావాలి. అదృష్టవశాత్తు ఇవి రెండూ సమకూడాయి. మరి వాళ్ళు  ఈమెను గురించి ఇన్ని సార్లనుకొంటున్నారో లేదో, ఆ భగవంతుడికే తెలియాలి. ఈవిడ మాత్రం సమయం వచ్చినప్పుడల్లా వాళ్ళను ఆకాశానికెత్తుతూ వుంటుంది. పగ విషయంలో కూడా మంజరి తీసిపోయిందేమీ కాదు. జయా ఫిలింస్ వారితో ఆదిలోనే ఏర్పడ్డ వివాదమప్పుడు ఆ కంపెనీ మీద మంజరి కారాలూ, మిరియాలూ నూరింది. సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తానని కూడా అన్నది. అయితే ఇంతవరకూ అలా జరగని మాట నిజమే! కానీ అదును దొరికినప్పుడు మంజరి అన్నంతపనీ చెయ్యకుండా ఊరుకొంటుందా? ఊరుకొంటుందని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు.
ఇటీవల తన గ్రహాలు బాగా వక్రించాయని చలపతి ఏనాడో గ్రహించాడు. మంజరిని గురించి అతని అంచనాలన్నీ రైటవుతూ వచ్చాయి. అయితే అనుకొన్న దానికన్నా చాలా త్వరగా డాని ఫలితాలు కనిపించడమే చిత్రం! ఏదో వోకనాడు తనకూ, మంజరికీ మధ్య రవ రవలు పొడచూపక మానవనీ, ఆనాడు తన నెత్తిన తడి గుడ్డవేసుకొని చక్కాపోవలసి వస్తుందనీ తను అనుకొంటూనే వున్నాడు. కానీ ఆ గడువు ఇంకా చాలా దూరాన్నున్నదని అనుకొంటూ వచ్చాడు. గమ్మత్తేమిటంటే - ఆ గడువు ఇహ ముందెప్పుడో రావడం కాదు - ఇప్పటికే వచ్చింది. ప్రస్తుతం శంకరయ్య తనలాంటి వాళ్ళ మీదనే సవారి చేస్తున్నాడు. మంజరి ధోరణి చూస్తుంటే ఏ క్షణాన భగ్గుమని పేలుతుందో తెలీకుండా వుంది. అప్పుడప్పుడు తన అండదండలింకా వదలదని అనిపించినా, వదిలినా నష్టంలేదని మంజరి గ్రహిస్తే తన గతేంకావాలిక? తన యిష్టప్రకారం మంజరి వుండటంలేదన్న బాధ మినహాయిస్తే - ఆ కాస్తా తను వదులుకొంటే తనకన్నా సుఖజీవి మరోడు వుండడు. పెద్ద పెద్ద తారల ప్రాపకం కావాలంటే మాటలా?
ఇన్నిటికీ యీ యింట్లో తన స్థానమేమిటో ఇంకా నిర్ధారణ కాలేదు. తనకు నిజంగా మంజరి ఏమవుతుందో తేలాలి. ఇదివరకు సరేసరి - ఇప్పుడలా కాదుగదా చచ్చి? తను పూర్తిగా కిందనే వుండి పోతున్నాడు. ఎప్పుడోగానీ మంజరితో మాట్లాడే అవకాశమే  దొరకడం లేదు. ఆకాస్సేపయినా కస్సు బస్సు లాడుకోవడమో ఒకరినొకరు మాటలతో చీల్చుకోవడమో తప్ప, సౌమ్యమన్నదే లుప్తమై పోయింది. ఒకప్పుడు తనేం చెబితే అది చేసిన మంజరి - ఇప్పుడు ఆవిడ చెప్పినదాన్ని తను చెయ్యాలిసొస్తుంది. అంటే పాత్రల తారతమ్యాలు మారి పోయాయన్నమాట! తనిప్పుడు - గుమస్తాగిరి వెలగపెడుతున్నాడే తప్ప, మంజరి మీద తనకెలాంటి పట్టూ లేకుండా పోయింది. తిరిగి తానెప్పటికైనా జారిపోయిన పగ్గాలను చేజిక్కించుకో గలిగితే, మంజరిని ముప్పుతిప్పలు బెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిగానీ వదలడు.
ఈ నిర్ణయానికొచ్చాక చలపతిలో కొత్త ఉత్సాహమేదో పొటమరించింది. తను కూడా మంజరినే అంటి పెట్టుకొని వుండాలని సమయం వచ్చినప్పుడు చావు దెబ్బ తీసి మరీ చెక్కెయ్యాలనీ అనుకొన్నాడు. విరోధం మీద సాధించలేని అనేక ఘన కార్యాలు హితవుతో సాధించవచ్చునన్నది చలపతి అనుభవ పూర్వకంగా గ్రహించిన సత్యం!
ఎంత చిరాగ్గా వున్నా, చెప్పిన పని చెయ్యకపోతే, మరీ ప్రమాదం గనక, ఆ సాయంత్రానికల్లా చలపతి ఓ డ్రైవర్ని మాట్లాడాడు. మంజరి చెప్పిన షరతులన్నీ  వివరించాడు. జీతం దగ్గర కొచ్చేసరికి చలపతికి దుర్బుద్ది పుట్టింది. అతను డ్రైవరుతో బేరాలు సాగించాడు.
"అబ్బాయీ ఇదీ సంగతి. బంగారం లాంటి ఉద్యోగం ఫస్టుక్లాసయిన ఫ్రీక్వార్టర్స్ కూడా ఇస్తాను. నీకేం కావాలో చెప్పు" అన్నాడు చలపతి.
డ్రైవరు కాలాంతకుడు, ఇలాంటి వారిని కట్టుకుపోయినంత మందిని చూశాడు.
"మీరేమిచ్చినా నూరు నేనిప్పుడే తెచ్చుకొంటున్నాను. అంతకు మొగ్గుతే నాతో మాట్లాడండి ఆలోచిస్తాను. ఏమీ లాభం లేనప్పుడు నేను మాత్రం చేసే ఉద్యోగం వదులుకొని ఎందుకు రావాలట?" అన్నాడతను.
నూటపాతిక దగ్గర ఖరారు పడ్డాడు చలపతి. అలా చేసినందుగ్గాను, మొదటి నెల జీతం  తను పుచ్చుకొంటానని కూడా అన్నాడు. ఈ మాట మంజరితో అన్నప్పుడు ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది.
"అంత జీతంతో కుదర్చమనా మీతో అన్నది?" అని కూడా అన్నది.
"అతను చాలా మంచివాడు మంజూ! అవన్నీ బయట వాగేస్తే కొంపలంటుకుపోతాయి. అదీగాక -అతని హస్తవాసి కూడా మంచిది. అతనొచ్చాకనే "లత" కు  బోలెడంత డిమాండు పెరిగింది. లోగడ అతను పనిచేసిన కంపెనీలు, అతనున్నంత కాలం ఝంఝామారుతంగా వుండేవి. అతను పోవడంతో బూజు పట్టి పోయాయి. నేనివన్నీ ఆలోచించే ఓ పది రూపాయలు పోయినా మా బాగేనని అతన్ని కుదిర్చాను" అని సంజాయిషీ చెప్పుకొన్నాడు చలపతి.
మంజరి ఔనని కాదనీ చెప్పలేదు. నిశ్శబ్ధంగా పైకెళ్ళిపోయింది.

                                      *    *    *    *
మొదలియార్ గారి తమిళ పిక్చర్లో కొంత భాగం అయింది. పది పాటలదాకా రికార్డు చేశారు. అందులో రెండు పాటలు మంజరి పాత్ర పాడవలసినవీ ఉన్నాయి. వాటిని మార్పించి వసంత చేత పాడించాలని మంజరి అభిప్రాయం. అసలా షరతుమీదనే తను తక్కువ మొత్తానికి వొప్పుకోంది  కూడానూ. లేకపోతే ఇంకో అయిదు వేలన్నా ఆ కంపెనీ నుండి మంజరి పిండి ఉండేది.
మొదలియార్ కి ప్రపోజల్ ఇష్టం లేదు. ఇప్పటికే అతగాడు ఒక్క పాటమీదా మూడు, నాలుగు వేలదాకా తగలేశాడు. అందులో రెంటిని కాన్సిల్ చేసి మళ్ళా రికార్డు  చెయ్యమంటే, తడిసి మోపవుతుంది. అందుకని మంజరితో చాలా సున్నితంగా వ్యవహరించాడు.
"నేనన్నదేమో కరెక్టే, తప్పకుండా తీసుకొందాం. అయితే ఇప్పుడు కాదు. ఈ పిక్చర్ వెంటనే నేనింకోటి ప్రారంభిస్తున్నాను. అందులో ఆయమ్మకు తప్పకుండా మనం చాన్సిద్దాం" అన్నాడు మొదలియార్.
మంజరి అలా వీల్లేదన్నది.
"అయితే నన్నిప్పుడేగంగలో దూకమంటావమ్మా? అన్నాడతను."
"నాకు గంగ సంగతి తెలీదు. గోదావరి సంగతీ తెలీదు. మీరన్న మాటేదో మీరు నిలబెట్టుకోవాలని మాత్రమే నేనంటున్నాను. వసంత పాడలేనప్పుడు మీరేమన్నా నేనొప్పుకొంటాను. దివ్యంగా పాడేదాన్ని పట్టుకొని, మీరు కాదు కూడదంటే చిర్రెత్తుకొస్తుంది" అని మంజరి అది కోపమో, హాస్యమో తేలకుండా.
పోనీ కోరస్ సాంగ్ వొకటుంది అందులో ఛాన్స్ యిద్దాం" అని రాజీకి దిగాడు మొదలియార్.
అతను మెత్తబడటాన్ని మంజరి గ్రహించింది. తనో మెట్టు దిగవలసిన అవసరం లేదనుకొంది. కోరస్ సాంగులో వసంత పాడదనీ, సోలోకావాలనీ పేచీ వేసింది. మొదలియార్ వొప్పుకోకుండానే వెళ్ళిపోయాడు.
"పోన్లే అక్కాయ్! నా గురించి నువ్వంత శ్రమపడకు. అది ఎప్పటిక్కావాలో అప్పటికవుతుంది గానీ మనం తొందరపడితే పొద్దుగూకదు" అన్నది వసంత.
మంజరికి సిద్దాంతంలో బొత్తిగా విశ్వాసం లేదు.
"కూకుతుంది" అన్నది మంజరి కింది పెదవిని సున్నితంగా కొరుకుతూ. "ఇక్కడి మనుషులు వేరు. ఇక్కడి రోగాలు వేరు. ఏ జబ్బు కే మందు వెయ్యాలో నాకు తెలుసు."
వసంత యింకేదో అనబోయింది. రాజమణి సైగ చెయ్యడంతో అనకుండానే ఆగిపోయింది.
మంజరి వేసిన మందేమిటో మరో నాలుగు రోజుల తర్వాత గానీ తేలలేదు. మొదలియార్ కాల్ షీట్ కుదుర్చుకొని, ప్రొడక్షన్ మేనేజర్ చేత మంజరికి కబురు చేశాడు.
"నేను రానులేండి!" అన్నది మంజరి చాలా తాపీగా
ప్రొ.మే.గుండెల్లో నిజంగానే రైళ్ళు పరుగెత్తాయి.
పోన్లేగానండీ! మీరలా ఉన్నారేమిటి? ఏదో నలిగినట్లు కనిపిస్తున్నారు. చూడండమ్మాయి గారూ , ఈ సినిమా లైనుంది చూశారూ- అబ్బో అబ్బో మాగమ్మత్తయిందిలెండి....మీలాంటి వారికి తీరిక దొరకడమంటే మరి మాటలా?
అన్నాడతను తన మామూలు ధోరణిలో.
మంజరి వింటూ కూచుంది.
ప్రొ.మే.మళ్లీ సాగించాడు.
"అవునుగానండీ అమ్మాయిగారూ! నేనో రసహ్యం చెబుతాను ఎక్కడా అనకుండా వుంటారా? అబ్బెబ్బే ! మీరలాంటి వారని కాదనుకోండి. మీ విషయం నాకు తెలుసుననుకోండమ్మాయిగారూ! ఈ ఫీల్డులో కొంతమంది ఉన్నారండీ, ఉత్త హోప్ లేస్ ఫెలోస్, ఇలా వినడం అలా ఇంకోరికి ఉప్పు అందించెయ్యడమూను, ఓ ముక్కన్నా కడుపులో ఇముడ్చుకోలేరు. మొదట్లో నేనూ తెలీక ఓసారి  గోతిలో పడిపోయాను. పీక కాస్తా ఎగిరిపోతుందనుకొన్నాను. కానీ ఆ తిరుపతి వెంకన్న దయవల్ల తప్పిపోయింది. ఏదోలెండి. నాసొద ఎప్పుడూ వున్నదేననుకోండి. మీరు మాత్రం అమ్మాయిగారూ , నేను చెప్పానని కాదు గానీ, ఓ మంచి డాక్టరుని కన్సల్టు చేసి చూడండి.ఠాలా ఠోలీరకం కాదు సుమండీ!
నాకు సుందర్రావని ఓ డాక్టరు తెలుసు. చాలా మంచివాళ్ళండి, మనవాళ్ళందరూ ఆయన దగ్గరే మందుచ్చుకొంటూంటారు. మీకు తెలిసే   వుంటుందనుకొంటాను. కాదంటే ఓసారి వెళదామంటే వెళదాం" అన్నాడు.
"చూద్దాం" అన్నది మంజరి మామూలుగా.
 ప్రొ.మే.అప్పటికీ ఊరుకోలేదు. ఊరుకొంటే అతను ప్రొ.మే.యే కాదు.
"అబ్బో అబ్బో! వింటున్న మాకే పళ్ళు పులిసి పోతున్నాయనుకోండి. మా ప్రొడ్యూసర్ గారు అస్తమానం మీగురించే అంటూంటారు." అన్నాడు ప్రొ.మే.
ఈసారి మంజరి తన బింకాన్ని వదల్లేదు.
"మీరు కాఫీ తాగారా?....పోన్లెండి ఇంకోసారి పుచ్చుకోండి" అని బెల్ నొక్కింది మంజరి.
"నో నో మేడమ్ థ్యాంక్స్" అన్నాడు ప్రొ.మే.
అదేం? మీ ప్రొడ్యూసర్ కాఫీ కూడా తాగొద్దంటాడా?"
ఈలోగా రెండు కప్పుల్తో వసంత కాఫీ పట్టుకొచ్చింది. టేబుల్ మీద కప్పులుంచి ప్రొ.మే. కేసి తిరిగి "నమస్తే" అన్నది వసంత.
"మా చెల్లెలు వసంత. బాగా పాడుతుంది. వీరు...." అని పరిచయం చేసింది మంజరి.
"మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషమండీ! అక్క ఎప్పుడూ మీగురించే అంటుంది" అని కలిపింది వసంత.
తన శిక్షణ వృధా పోలేదనుకొంది మంజరి. కానీ దానికింకా లౌక్యం తెలీదనికూడా అనుకొంది. తెలిసిందయితే ప్రొ.మే.గాడితో అలా అనదు. ఓ తార ప్రొ.మే.ను గురించి అస్తమానం అనడమేమిటి దాని తలకాయ.
"పట్టుకెళ్ళమ్మా!"
వసంత ఇక్కడ ఉండకూడదని అర్ధం చేసుకొని వెళ్ళిపోయింది.
"ఆఁ.చెప్పండి. మీ ప్రొడ్యూసరు తిడుతున్నారనా అన్నారు?" అని అందించింది  మంజరి.
"శివ శివా ..అలా అన్నవారు పురుగులపడి, చూసే దిక్కు లేకుండా పోతారండీ అమ్మాయిగారూ! మీరంటే ఎంత అభిమానమో వారికి! ఏ మాటొచ్చినా ముందుగా మీ పేరే చెబుతారు. మీరట -అందరి లాంటి వారు కారట. ఓసారి డైరెక్టరు చెబితే, అక్షరాలా అలానే చేస్తారట, ఎక్కువ టేక్సు తీసుకోరట, డైలాగ్స్ ఫర్ ఫెక్టుగా అంటారట..మిమ్మల్ని హీరోయిన్ గా ఉంచి ఓ సోషల్ తీద్దామని ఆయన ఉద్దేశం. స్టోరీ కూడా రాయిస్తున్నారు. మాంచి డాన్సులు నాలుగైదు ఉంచేస్తున్నారు....అమ్మమ్మా  ఆయనకు నచ్చడమంటే మాటలు కాదండీ! మహా మహా వాళ్ళే తలక్రిందులయి పోతుంటారు. ఏమనుకోన్నారో!" అన్నాడు ప్రొ.మే.
మంజరి కళ్ళు మూసుకొంది. ఆమె పెదవులమీద సన్నని చిరునవ్వు వెలిగి అంతలోనే మాయమయి పోయింది. తరవాత పది నిమిషాలగ్గానీ, మళ్ళీ మామూలు స్థాయికి రాలేదు. మెల్లగా  కళ్ళు తెరిచి సోఫాలో సర్దుకు కూచుంది.
"మీకీపూట పనేమీ లేకపోతే, నాతో భోజనానికుండిపోకూడదూ?" అన్నది మంజరి.
"భోజనమే!ఇక్కడా? డొక్క వాలికలై పోతుందండీ అమ్మాయి గారూ! ఇవ్వాళ చచ్చినంత పనుంది. అదంతా అలా ఉంచేసి, నేను మీతో కబుర్లాడుతూ కూచున్నాను. ఇహ చివాట్లు తప్పవనుకోండి....మరి - బయల్దేరుతున్నారుగా?" అన్నాడు ప్రొ.మే.
"అలా దారికిరారా బిడ్డా" అనుకొంది మంజరి.
"లేదు బాబూ! నేనీపూట రాలేను. నన్ను క్షమించాలి" అన్నది మంజరి చాలా  వినయంగా.
"నన్ను చంపేశారండీ అమ్మాయిగారూ! వారేవస్తానంటే అవసరం లేదని, నేనిలా వచ్చాను. ఈ సరికి అందరూ వచ్చే ఉంటారు. మేకప్ కూడా జరుగుతూ ఉంటుంది."
"మరేం చెయ్యనండీ! ఏవో దిక్కుమాలిన కబుర్లలో పడిపోయాం....వెరీ సారీ సార్....మరి వెళ్ళి రాకూడదూ?" అన్నది మంజరి. ఎంతో నొచ్చుకుంటూ.
ప్రొ.మే.ఆలోచించి అటూ ఇటూ చూసి "అమ్మాయిగారూ! ఇవ్వాళ మీకేమన్నా పేచేస్తామన్నారా ప్రొడ్యూసర్ గారు" నిన్ననే పాతిక వేలకు డ్రాప్టు తెప్పించారు లెండి. బ్యాంకులో వేశాం కావాలంటే మీ ఎకౌంటుకు చెక్కు పుచ్చేసుకోవచ్చు. లేదా క్యాషే కావాలంటే - మీరలా స్టూడియోకు పదండి. ఈలోగా నేను మనీ డ్రా చేసి మరీవస్తాను. పోనీ నేనలా బ్యాంకీకేవెళ్ళిరానా ఏమిటి?" అన్నాడు ప్రొ.మే.
"అదేం కాదండీ! హెల్త్ బావోలేదు" అన్నది మంజరి.
"ఓసి దొమ్మరిముండా! కంపనాకట్టెనా కాలకుండా ఉన్నావే అనుకొన్నాడు ప్రొ.మే.
"అలానండీ పాపం! ఏదో వీలుచూసుకొని అలా ఓసారి వచ్చి పోగూడదూ? ఒకటే షాట్ మిగిలిపోయిందండీ! మళ్ళా అందరూ దొరకటం కష్టం. ఎలాగన్నా వోపిక చేసుకొందురూ! ఇవి చేతులు కావనుకోండి......"
"నన్నంతసేపు అడక్కర్లేదు. నా విషయం తెలిసికూడా మీరిలా అనడం మరీగోరం. నేనేదో కడుపులో ఉంచుకొని ఇలా అంటున్నానని మీరనుకొంటే, అంతకన్నా అన్యాయం మరోటి ఉండబోదు.....మీమనస్సు కష్టపెట్టానేమో మన్నించ మంటున్నాను" అన్నది మంజరి.
ప్రొ.మే. కోపం కట్టలుతెంచుకొంది. తనెంత పోరుకాడినా కార్యం సాఫల్యం కాలేదు. ఇన్నేళ్ళ తన అనుభవమంతా మట్టిలో కలిసిపోయింది. ఈ అఘాయిత్యం తప్పించడం ముందు తను ఎందుకూ పనికిరాడని తేలిపోయింది.
"అయితే మరి సెలవు" అంటూ అతను వెళ్ళిపోయాడు.
అతనొచ్చిన కారు కదిలాక, మంజరి విరగబడినవ్వింది.
"ఈ పూట వెళ్ళవా అమ్మాయ్?" అన్నది రాజమణి.
"ప్చ్"
"అతనేదో కాళ్ళా వేళ్ళా  పడుతున్నాడు గదుటే పాపం!" అన్నది రాజమణి.
"అవసరం తీరేదాకా అలానే పడుతుంటారు అక్కాయ్! వీళ్ళను చీల్చి ఎండేసినా పాపంలేదు." అన్నది మంజరి.
అరగంటలో గానే మొదలియార్ వచ్చాడు. అతనిముఖం చూస్తే, అతనెంత చిరాగ్గా ఉన్నాడో ఇట్టే తెలిసిపోయింది.
"నమస్కారమమ్మాయ్! ఒళ్ళు సరిలేదన్నావుటగా!" అన్నాడు మొదలియార్ కుడుటపడుతూ.
"మరేనండీ! ఈ దిక్కుమాలిన ట్రబుల్ కూడా ఇప్పుడే రావాలా? మీ కేమాత్రం అవకాశమున్నా ఈ కాల్ షీట్ కాన్సిల్ చేసుకోకూడదూ?" అన్నది మంజరి.
అందువల్ల ప్రొడ్యూసరు, ఎన్నివేలు నష్టపోవలసి వస్తుందో మంజరికి తెలీకకాదు. తెలిస్తే ఆవిడా మాటలన్నది.
"నేనందుకోసం రాలేదు. మీ వసంతను టెస్టుకు తీసుకు పోదామని వచ్చాను. మీరంతగా పాటికి పదిసార్లు చెబుతున్నప్పుడు కాదనడం నాకే అసహ్యంగా ఉంది.! ఇదంతా పెద్ద రిస్కే ననుకోండి. అయినా ఎక్స్ పెరిమెంట్ చేదామనే డిసైడు చేశాను. మీరైనా పాట బాగా లేకపోతే తీసుకోమనరు గదా!" అన్నాడు మొదలియార్.
"నేను మొద్దునైతేతప్ప" అన్నది మంజరి.
ఇద్దరూ నవ్వారు.
"మరి -వసంతను పంపుతారా? మీరు కూడా వస్తేరండి. నన్నడిగితే మీరు దగ్గర ఉండటం చాలా అవసరం. అంతమంది కొత్త వాళ్ళ మధ్య ఆ పిల్లను పాడమనడమూ, ఆమె పాడడమూ కూడా సబబుగాదు. మరి బయల్దేరదాం" అన్నాడు మొదలియార్.
"అలా లొంగిరా బిడ్డా" అనుకొంది మంజరి.
"వన్ మినిట్! వసంతను కేకేసుకొస్తాను" అంటూ లోపలికొచ్చింది మంజరి.
"యూ ఆర్ లక్కీ గరల్ వసూ! కాళ్ళబేరానికొచ్చాడు. నీచేత పాడిస్తానన్నాడు, నువ్వు �


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS