Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 32

   
  "అమ్మాయీ! నీ వ్యవహారం నాకేమీ నచ్చలేదు. అతనేమిటో నువ్వు స్పష్టంగా తేల్చుకోవాలి. ఈ ముసుగులో గుద్దులాటలు అట్టేకాలం సాగవు. అతన్ని "ఆయ"నంటావా, ఈ ఆడవాళ్ళ పన్లు చెప్పకు. సెక్రటరీ అంటావా, ఇంత చనువు ఇవ్వకు.." అన్నది కళ్యాణి.
"పోన్లే అక్కా! నువ్వు ప్రతిదానికీ-" అని విషయాన్ని తేల్చివేసింది మంజరి.
"అలా జారిపోకు మంజరీ! మనం ఎప్పుడో వొకప్పుడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకోక తప్పదు. అదేదో త్వరగా తేల్చుకోమనే నేనంటున్నది. ఆ తరువాత నీ ఇష్టం!"
"ఏం చేస్తే బావుంటుందో నువ్వే చెప్పాలక్కయ్యా! ఆ విషయం మనం నిర్ణయించుకొందాం గానీ, ఈ పూట హడావిడిగా అధనం వేయి రూపాయలన్నా అయ్యుంటాయి. మనవాడు ఇంకేవో చెక్కులంటున్నాడు. ఉన్నదంతా అయిపోతే ఏమిటి చేయడమో తోచకుండా ఉంది. లేనిపోనిది ఇదోటి నెత్తి మీదికి తెచ్చి పెట్టాడు మా వాడు" అన్నది మంజరి.
"ఈ డబ్బు వృధాకాదు. దీనికి ఇబ్బడి ముబ్బడిగా నీకు పబ్లిసిటీ వస్తుంది. దాన్ని గురించి నువ్వేమీ దిగులు పడకు. ఇక డబ్బుసంగతి ఇందాక ఎవరో మొదలియార్ అన్నావు గదూ! అతన్ని కూడా నువ్వూ పార్టీకి పిలిచి ఉండాల్సింది. సమయానికి నాకూ జ్ఞాపకంరాలేదు పోన్లే గానీ, రేపో పని చెయ్యి. మీవాన్ని ఉదయమే మొదలియార్ దగ్గరకు పంపించు. అతనిని పిలిచుకురమ్మను. నువ్వే స్వయంగా మాట్లాడు. ఎగ్రిమెంట్ మీద సంతకం చేసి ఎడ్వాన్సు పుచ్చుకో.. రేపో రెండు వేలు నీపేర బాంకులో క్రెడిట్ చేయిస్తాను. తరవాత చూసుకొందాం అన్నది కళ్యాణి.
"మీ రుణం తీర్చుకోలేనక్కా!" అన్నది మంజరి సజల నేత్రాలతో.
కళ్యాణి నవ్వి, మంజరి బుగ్గలు పుణికి వెళ్ళిపోయింది.
మొదలియార్ రానూవచ్చాడు. ఎడ్వాన్సు ఇవ్వనూ ఇచ్చాడు. కానీ, ఎగ్రిమెంటులో ఇరవై వేలని రాసి ఉంది.
"ఇలా చేశారేం? అన్నది మంజరి నవ్వుతూ. పదివేలకే గీసి గీసి బేరం చేశారు గదా, అమాంతం ఇరవై వేలివ్వడానికి ప్రాణమెలా వొప్పిందబ్బా?"
"మీకు తెలియందేమీ లేదండి! ప్రొడక్షన్ ఖర్చులు అపరిమితంగా పెరిగిపోయాయి. బ్లాక్ మనీ ఎడ్జెస్టు చేసుకోలేక చస్తున్నాం. అంచాత మీలాంటి వారినుండి రసీదులు తీసుకోవాల్సి వస్తోంది." అన్నాడు మొదలియార్.
మంజరి అయిదువేలు తీసుకొని పదిహేను వేలకు రసీదిచ్చింది.
పత్రికలవారిమీద మంజరి ఖర్చు చేసిన డబ్బు మాంఛి లాభాలను తెచ్చి పెట్టింది. తనను గురించి రాసిన పత్రికలన్నిటికీ మంజరి జయావారికి ఫోన్ చేసి ఎడ్వర్ టైజ్ మెంట్లు ఇప్పించింది. వారు కూడా ఈ అదునులోనే తమపబ్బం గడుపుకొన్నారు. సినిమా కధ రాసిన కవితోనే నాలుగైదు రకాలుగా 'చిత్రసమీక్షలు' రాయించి ఎడ్వర్ టైజ్ మెంట్ బ్లాకులతో సహా ఆ కాపీలు కూడా ఇచ్చారు. కొంధరా సమీక్షలనే యదా తధంగా వేశారు. ఇంకొంతమంది భాష! మాత్రం మార్చి పిక్చారును ఆకాశానికెత్తుతూ సమీక్షించారు. ఒక పత్రికవారు, ఆ పిక్చర్ మీద వేసిన ప్రత్యేక సంచికకైన ఖర్చు యావత్తు, అణా పైసలతో సహా జయావారు ఇచ్చేశారు. ఏవో రెండు మూడు పత్రికలూ మాత్రం, ఉత్తమాధ్యమంగా రాశాయి. అందులోనూ, ఓ పత్రిక, ఆ పిక్చర్ నూ మంజరినీ, తూర్పారబట్టి వదిలేసింది. జయా వారు చాలా బాధపడ్డారు. ఆ పత్రికను మంజరి కూడా చూసింది. వెంటనే మెహతాకు ఫోను చేసి ఆ విషయమేదో కనుక్కోమన్నది. ఎందుకైనా మంచిదని, కళ్యాణి చేత కూడా ఫోను చేయించింది. ఇరవై నాలుగ్గంటల్లోగా కావలసిన పనులన్నీ పూర్తయ్యాయి. మెహతా అన్ని కంపెనీలకూ ఫోను చేసి, ఆ పత్రిక విషయం జ్ఞాపకముంచుకోమన్నాడు. ఆ వొక్క వాఖ్యమూ చాలు, ఆ పత్రిక నడుంవిరిగి కూలిపోవడానికి! చివరకు జరిగింది కూడా అదే! దరిమిలా ఆ పత్రికకు ఏ సినిమా కంపెనీ కూడా ప్రకటనను ఇవ్వనేలేదు.
జయా వారి పిక్చర్ కు మంచి కలెక్షన్లే వచ్చాయి. కానీ కంపెనీ వాటాకు వచ్చిందట్టేలేదు. ఎందుకంటే మెహతా ముందుగా తను ఇన్వెస్టు చేసిందంతా పిండుకొన్నాడు. అతను పెట్టిన ఖర్చులన్నీ కలిపి తడిసి మోపెడయ్యాయి. ధియేటర్లలో జనం పలుచబడుతున్న వేళకు ప్రొడ్యూసర్లకు, తమ పెట్టుబడిలో పదోవంతు రాలేదు అప్పటికి ఖర్చుకు జంకకుండా ఎ.బి.క్లాసు సెంటర్లలో ఏజెంట్లను పెట్టి బాగా కాన్వాసు చేయించారు. ఆ సినిమాలోని పాటలపోటీని ప్రారంభించారు. అందులొ ఉన్న తప్పులను ఎత్తి చూపిన వారికి, వేయి రూపాయల నగదు బహుమతులిస్తామని ప్రకటించారు. ఈ ఊపుతో, ఇంకో వారం పదిరోజులు గడిచాయేగానీ, అంతకు మించి వొరిగిందేమీలేదు.
ఈ సంక్షోభంనుండి ఆ కంపెనీని ఉద్దరించినవాడు మెహతా అతను ప్రొడ్యూసర్లను పిలిచి తన సలహా చెప్పాడు.
"మనం అర్ధ శతదినోత్సవాలనూ, సంయుక్త శతదినోత్సవాలనూ జరపాలి. ఆ ఉత్సవాలకు యాక్టర్లనూ, టెక్నీషియన్లనూ పిలవాలి....రైటే! ఇంకా డబ్బు ఖర్చవుతుంది. కానీ, ఈ దెబ్బతో ఈ వారా, ఆ వారా కొట్టుకొస్తుంది. ఇంతకంటే ఇంకో తరుణోపాయం లేదు. ఈ విషయం ముందుగా మనం పత్రికల కివ్వాలి. ధియేటర్ల దగ్గర పదిరోజులు ముందుగా పబ్లిసిటీ ఇవ్వాలి. ఇలా చేస్తే బావుంటుందని నా ఉద్దేశం." అని సలహా ఇచ్చాడు మెహతా.
జయా ఫిలింస్ తరపున ప్రసాద్ ఇందుకు వొప్పుకున్నాడు అయితే ఈ పని కూడా అనుకొన్నంత సాఫీగా జరగలేదు. టాప్ రాంక్ తారలందరూ ఎడతెగని షూటింగుల్లో మునిగి తేలుతున్నారు. రోజుకు ఇరవయ్ గంటలు పని చేసినా వారికి పిక్చర్లు తెమలడం లేదు. అలాంటివారు వారం పదిరోజులు, పనిమానుకొని రావడం మాటలు కాదు.
జయా ఫిలింస్ వారడిగితే వచ్చేవారు కాదేమోగానీ, మెహతా ఫోన్ చేశాక. వీలుపడదనే ధార్యం ఎవరికీ లేకపోయింది. లోపల తిట్టుకొంటున్నా పైకి మాత్రం అందరూ సంతోషంగా వొప్పుకొన్నారు. ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించుకొన్నాక ప్రసాద్ వచ్చి, ఈ విషయాన్ని మంజరికి తెలియచేశాడు.
"వరసగా వారం రోజులు, మొదలియార్ కు కాల్ షీట్సిచ్చాను నేనిలా వచ్చేస్తే బావుంటుందా?" అన్నది మంజరి.
"నువ్వు లేకుండా నేను తెలుగు దేశానికెళ్ళడం అసంభవం! స్టేజీమీద నువ్వు కనిపించకపోతే జనం ఊరుకోరు. నువ్వు రావాలి" అన్నాడు ప్రసాద్.
"నా ఇబ్బందిని మీరు గమనించకపోతే ఎలా?" అన్నది మంజరి.
"నిన్ను గురించి జనం ఏమనుకొనేదీ తెలుసుకోవాలని ఉంటే ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. నిన్ను పదిరోజులూ ఉండమనడం లేదుకదా. ఫస్టు నెల్లూరు, సెకండ్ తెనాలి, ధరుడు గుంటూరు పోనీ నువ్వు గుంటూరు ఉత్సవాలకు వచ్చెయ్యి చాలు ఆ వొక్కరోజూ ఉండి మర్నాడు బయల్దేరవచ్చు, అవసరమయితే మొదలియార్ తో నేను చెబుతాను" అన్నాడు ప్రసాద్.
"అతనొప్పుకుంటాడనుకోను."
"సరేనంటేనే రారాదా!" అప్పుడు నీకేమీ అభ్యంతరం ఉండదుగదా అన్నాడతను.
"లేదు"
ప్రసాద్ అప్పటికప్పుడే ఏదో నంబర్ డయల్ చేసి మీరో రెండు రోజులు మొదలియార్ కిచ్చిన కాల్ షీట్సు కాన్సిల్ చేయాలండీ. ధరుడు, ఫోర్తు చాలు....మంజరిని మేం గుంటూరు తీసుకెడుతున్నాం. తను రాననడం బావుండదేమోనని భయపడుతోంది. మీరు నాగురించి - ప్లీజ్ -ఈ హెల్పు చేయండి -అలాగే -నేను మంజరి గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను! ఎ సంగతి పదినిమిషాల్లో నాకు ఒ.కె. ధాంక్స్ అని రిసీవర్ పెట్టేశాడు.
"ఎవరికేమిటి?" అన్నది మంజరి.
"చెబుతాను గానీ, నువ్వీలోగా నాకో మంచి కాఫీ తెప్పించాలి నా ప్లాను ఫెయిలయితే తట్టుకోవడానికీ, సక్సెసయితే సంతోషించడానికీ, దమ్ముకావాలి గదామరి" అన్నాడు ప్రసాద్.
అతను కాఫీతాగడం కాకముందే ఫోన్ మోగింది.
"మీదే ననుకొంటాను చూడండి!" అన్నది మంజరి.
"కాయా పండా మంజరీ? భగవంతుడి దయవల్ల పండేననుకొందాం" అంటూ రిసీవర్ తీశాడు ప్రసాద్.
రు నిమిషంలోనే అతని ముఖం విప్పారింది.
"చాలా థాంక్సండీ! మీకు శ్రమ కలిగించినందుకు మన్నించాలి"
అతను ఉత్సాహంగా చిటికె వేసి, సిగరెట్ పొగను సుతారంగీ మంజరి ముఖం మీదికి ఊదాడు.
మంజరి "ఉఫ్" మంటూ దాన్ని చెల్లా చెదురు చేసింది.
మీ హీరోకు ఫోను చేశాను మంజూ! అతనికి హఠాత్తుగా మూడు నాలుగు తేదీల్లో సుస్తీ చేసింది. అంచాత మొదలియార్ గారికిచ్చిన కాల్ షీట్లు కాన్సిల్. ఆ రెండు రోజులూ నువ్వు బెజవాడ గుంటూరు రావచ్చు సరేనా?"
మంజరి రిచ్చపడింది!
ఇదా సూతనానుభవం ఇదే కారణం, తను చెబితే మొదలియార్ వొప్పుకొన్నాడు. ఆ రానన్నది హీరో గనక, నోరు మూసుకొని ఊరుకొన్నాడు.
ఈ ప్రయాణం నిజంగా కళ్యాణి కిష్టంలేదు. ఆవిడకు చాలా పనులున్నాయి. అదీగాక, ట్రిచ్చినుండి రాజన్ తనొస్తున్నాడని ఫోను చేశాడు. ఆవేళకు తను లేకపోవడం బావుండదు. అలాగని, మెహతాకు మాత్రం తను నొప్పికలిగించడం క్షేమంకాదు, అందుకు రాజన్ కు రావద్దని కబురు పెట్టింది కళ్యాణి. మంజరికూడా ఒకటే మోత సతపోరుతోంది. తను వెళ్ళకపోతే, మంజరి కూడా వెళ్ళదు. అందరూ పోతున్నప్పుడు తను పోక పోతే, కొక్కరించినట్లుంటుంది. సగం కారణంతోనే కళ్యాణి వొప్పుకొంది.
ఈ విషయాలన్నీ ముందుగానే వసంతకు జాబు రాసింది మంజరి.
"నన్ను తప్పకుండా కలుసుకోండి అక్కను కూడా తీసుకురా ఎక్కడుండేదీ రాయనవసరం లేదనుకొంటాను" అని ముగించింది ఉత్తరాన్ని.
ఆ ఉత్తరం రాశాకా, పోస్టు చేశాకా కూడా మంజరి మనస్సు గిల గిల లాడుతూనే వుంది. వాళ్ళు తనను కలుసుకోవడం కాదు. తనే వాళ్ళను కలుసుకోవాలి. కానీ టైమేదీ? ప్రసాద్ చెప్పిన ప్రోగ్రాం ప్రకారం, తనకు క్షణం తీరిక ఉండదు. నిజం కూడా అంతే!
రాత్రి 10 గంటల దాకా షూటింగులో ఉండి, ఆదరా బాదరా రంగులు కడిగేసుకుని, మేకప్ చేసుకొని కార్లో పడేసరికే పన్నెండయింది. మధ్యలో, నెల్లూర్లో గావును, పది నిమిషాలు ఆగారు పీచు పీచు తెల్లవారుతుండగా గుంటూరు కొచ్చారు. ఊరి బైట నుండీ, ఊళ్లోని హడావిడి తెలిసిపోతోంది. రోడ్డుకడ్డంగా పెద్ద బానర్ మీద, "సినీ కళాకారులకు గుంటూరు ప్రజల స్వాగతం" అన్న అక్షరాలు -చెమ్కీ అక్షరాలు కనిపించాయి. కాస్తలో పలికొచ్చే సరికి చెట్లకూ, ఎలక్ట్రిక్ స్తంభాలకూ, గోడలకూ, సుస్వాగతం కాగితాలూ, సినిమాపోస్టర్లూ కనిపించాయి. వాటిమీద తన బొమ్మను చూసుకొని ముగ్దురాలయింది మంజరి. ఆవిడ బద్దకమంతా చేత్తో తీసేసినట్లుగా వొదిలిపోయింది.
"అడుగో ప్రసాద్!" అన్నది కళ్యాణి. ప్రసాద్ కారు తమ కారుకు ఎదురుగా వస్తోంది.
"ఏమిటి హడావిడి?" అన్నది మంజరి.
"అప్పుడే ఏమయింది మంజూ! ఇవ్వాళ రేపూ, మనం తోపతోప అయిపోతామనుకో. జనం, నిజంగా మన్ని చంపేస్తారు."
"ప్రయాణం బాగా జరిగింది గదా!" అన్నాడు ప్రసాదు తన కారును, బాగా దగ్గరికి కొస్తూ, "ఊఁ  పదండి త్వరగా ఇంకా ఎవ్వరూ మేలుకోలేదు. ఆలస్యమయిందంటే, మన్ని ఇక్కడే చుట్టేస్తారు."
గుంటూరు బజార్లను చూస్తుంటే మంజరి రక్తంలోకి కొత్త శక్తులేవో ప్రవేశించినట్లయింది. అమాంతంగా కార్లోంచి దూకి, వీధుల వెంట పరుగెత్తాలనిపించింది. చిన్నతనం నుండి తనకు తెలిసిన వారినీ, తను తెలిసినవారినీ, కలుసుకోవాలనీ, వారికి ఊపిరి తిరక్కుండా కబుర్లు చెప్పాలనీ అనుకొంది. కారు జిన్నా చౌక్ దగ్గరకొచ్చే సరికి మంజరి ఆగలేక పోయింది. ఆ పక్క సందుల్లోనే రాజమణి వసంత ఉన్నారు. ఒక్కసారి వాళ్ళను చూస్తే, తనిలా హఠాత్తుగా వారి ముందు, కనపడితే ఎలా ఉంటుంది?
"వన్ మినిట్ ప్లీజ్ ఇప్పుడే వస్తాను. "అన్నది మంజరి.
కారు అప్పటికే ఆంజనేయస్వామి గుడి, గుండా గ్రౌండ్స్ దాటేసింది. మరో అయిదారు నిమిషాల కల్లా అరండల్ పేటలోని ఒ పెద్ద మేడ ముందాగింది. అప్పటికే ఆ మేడ దగ్గర జనం ఉన్నారు. కొంతమంది చుట్టుప్రక్కల మేడల మీంచీ, ఇంకొందరు, చెట్లమీంచీ ఆమేడ కేసి సినిమావాళ్ళున్న మేడ కేసి చూస్తున్నారు.
"ఊఁ త్వరగా పదండి" అని తొందర పెట్టాడు ప్రసాదు.
ముందుగా కళ్యాణి, ఈ వెనుక మంజరీ దిగారు. కళ్యాణిని చూస్తూనే జనం "ఓ" అని గోలకేతతారు. మంజరిని చూసి "ఒంటినిదురా రాదూరా నా కంటికి" అని ఎవడో పాడాడు. ఆ పాట జయా ఫిలింస్ వారి పిక్చర్లోది. సినిమాలో మంజరి వేషం పాడేపాట అది.
పది గంటలకల్లా, యాక్టర్లూ, టెక్నీషియన్లూ కారుల్లో బయలుదేరారు. విడిది దగ్గర పోలీసులే గనక లేకపోతే వాళ్ళు కార్లెక్కడం కూడా అసంభవమయ్యేది. దోవ పొడుగునా జనం గుంపులు గుంపులుగా చేరిపోయారు. ధియేటర్ దగ్గర సరే సారి.
మంజరి కొద్దిగా తలబయటికి పెట్టి చూసింది. కనుచూపు ఆనినంత మేరా, ఒకటే జనం! పోలీసులు, తోసుకొస్తున్న జనాన్ని ఆపలేక సతమతమవుతున్నారు. తాబేలు నడకలతో కార్లు హాల్లోకి వచ్చాయి. పిక్చరింకా అరగంట దాకా ఉంటుంది. కానీ, కార్ల చప్పుడు విన్నాక అందరూ గొల్లుమని లేచారు.
ఆ జన సముద్రంలో ఈదుకొంటూ స్టేజీ దగ్గర కెళ్ళడమే బ్రహ్మప్రళయమయింది. హాలంతా సిగరెట్ల పొగతో, చెమట వాసనతో నిండిపోయింది. హాలు యజమాని మైకులో ఎన్నిసార్లు "విజ్ఞప్తి" చేసినా మణగలేదు. ఆఖరికో నటుడు లేచి అందర్నీ స్థిమితంగా కూచోమన్నాడు. అన్న పావుగంటగ్గానీ రద్దీ తగ్గిందికాదు. అందరూ లాంఛనంగా ఏదో మాట్లాడారు. కళ్యాణి ఆ సినిమాలోని డైలాగ్సే నాలుగు చెప్పింది. మంజరి కేమి చెయ్యడానికి పాలుపోలేదు.
"నన్నేం చెయ్యమంటావక్కా" అన్నది మంజరి.
 "ఏమిచెయ్యొద్దు. ఒక్క నమస్కారం చేసి కూచో. చాలు" అన్నది కళ్యాణి.
తనవంతు వచ్చినప్పుడు ఆపనే చేసింది మంజరి. కానీ అందరికీ ఊరుకొన్నట్లుగా,నమస్కారంతో ఈసారి జనం తృప్తిపడలేదు. ఈ సినిమాలో మంజరి పాడినపాటలు పాడమనీ, ఆవిడ చేసిన (ధనుకొంటున్న) రెండు డాన్సులూ చెయ్యమనీ, ప్రేక్షకులడిగారు. ఆ పాటలు తను పాడలేదనీ, ఆ డాన్సులు కూడా తనవి గావనీ, తను కేవలం మూమెంట్స్ ఇస్తే, లాంగ్ షాట్ లో ఇంకెవరి డాన్సునో ఘాట్ చేశారనీ మంజరి ఎలా చెబుతుంది? చెప్పి ఆ గ్లామర్ ను ఎలా చంపుకొంటుంది.?
"ఊరుకొంటే లాభంలేదు, నీకు సుస్తీగా ఉందిగనక పాడలేమనీ, డ్యాన్సు చెయ్యలేననీ చెప్పు" అన్నది కల్యాణి.
 విధిలేక రెండోసారి లేచి నిలబడింది మంజరి!
"నా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞురాలిని. గతవారం రోజులుగా నా ఆరోగ్యం సరిగ్గాలేదు. జయా ఫిలింస్ వారు నా పుట్టింట్లో ఈ ఉత్సవాలను జరుపుతున్నారన్న ఉత్సాహంతో వచ్చాను. ఇంకోసారి నేను తప్పకుండా ఇక్కడి కొచ్చి మీరుకోరిన పాటలు పాడతాను. ప్రస్తుతం నన్ను మన్నించాలి" అని కూచున్నది మంజరి.
జనం ఇంకోసారి, ఈలలు వేసి చప్పట్లు చరిచి, తమ ఉత్సాహాన్ని తెలియ పరచారు. మళ్లా జనసముద్రాన్ని ఈదుకొంటూ కార్లు బయలుదేరాయి.
"ఈ పంపిణీమీద, నాలుగు ఆటలకూ మనం రావలసిందేనా?" అన్నది మంజరి.
"ఆఁ"
"నేనిక రాలేనమ్మా!" అన్నది మంజరి.
"చెంబెడు నీళ్లకే ఉల్కిపడితే, కాగెడు నీళ్ళేవరు పోసుకుంటారే తల్లీ! ఇప్పుడే ఏమయిందీ? ఈ రాత్రిలోగా ఎన్ని గండకత్తేరాలొస్తాయో చూడు ఇంకే బలవంతమూలేకుండా మనం సుఖంగా మద్రాసు చేరితే అదే పదివేలు."
మంజరికి బలవంతం ఏమిటో చప్పున అర్ధంకాలేదు.
"అవి కూడానా అక్కా?" అన్నది మంజరి.
"ఆహా! ఎవడో తొక్కాయ్, వంద రూపాయల నోట్ల కట్టలు పంపించి, పార్టీకి రమ్మంటాడు. మానేస్తావా? ఒకసారి నేను విశాఖపట్నం వెళ్ళాను మంజూ. ఏదో హోటల్లో దిగాను పగలల్లా ఇలాంటి వ్యవహారాలతో సరిపోయింది. శరీరమంతా విరగ్గొట్టినట్లయింది. తల చిట చిట లాడి పోతోంది. వచ్చిన వాళ్ళమీద చిరాకు పడ్డానికి లేదు. నవ్వుతూ మాయగా మాట్లాడి పంపేయాలి. అలాగనే చచ్చాను. రాత్రి పదిగంటలకు రూముకొచ్చి, స్నానం చేశాను అన్నం తెచ్చే సర్వర్ తలుపు చేర్ల వేశాడు. వాడి చేతిలో పెద్ద చాకు ఉంది. నేనేమాత్రం అరచినా, వాడో నేనో చావ్వలసి వచ్చేది. వాడి సాహసం చూశాక, పోన్లేపాపం, అనిపించింది మంజూ! అదుగో చూశావా! సంతకాల వేటగాళ్ళు ఎలా తయారయ్యారో?"
విడిది దగ్గర చాలామంది, చిన్న చిన్న పుస్తకాలు పట్టుకు నిలబడ్డారు. వారందరికీ, ఆటోగ్రాపులు కావలి, కొందరు చేశారు. వాళ్ళు చేస్తుండగా ఇంకొందరు,లోపలకు జారుకొన్నారు. మంజరి వెంటా అయిదారుగురు పడ్డారు వారి పుస్తకాల్లో సంతకం చెయ్యక తప్పలేదు. అలా సంతకం చేస్తున్నప్పుడు, మంజరి శరీరం రోమాంచితమయింది. సగర్వంగా వారికేసి చూసి, పుస్తకాలిచ్చి వేసింది! ఒకరు పుస్తకం అందుకొంటూ, ఆ వంకతో మంజరి వేళ్ళను, గట్టిగా నొక్కాడు.
"ఈ సంఘటన వాడి జనమంతా చెప్పుకొంటాడు" అనుకొన్నది మంజరి, తనలో తను నవ్వుకొంటూ,
ఆవిడ ప్రాణమంతా వసంతకోసం, రాజమణి కోసం కొట్టుకు లాడి పోతున్నది. ఏదో విధంగా సందు చేసుకొని, ఓ అరగంట వెళ్ళొస్తానన్నది గానీ, కళ్యాణి వొప్పుకోలేదు.
"వాళ్ళను చూడటమే ప్రధానమైతే, నువ్వే వెళ్ళక్కర్లేదు. మనం కారు పంపి పిలిపిద్దాం. అడ్రస్ చెప్పు" అన్నది కళ్యాణి.
"అక్కయ్య ఏమన్నా అనుకొంటుందేమోనని భయంగా ఉంది!" అన్నది మంజరి.
"నువ్వక్కడికెడితే తిరిగిరావేమోనని నాకు భయంగానే ఉంది. నీకింకా తెలీదు మంజూ! పెద్దదాన్ని నామాట వినరాదా? కాదూ కూడదు పోతానంటే ప్రసాద్ తో చెప్పి వెళ్ళు, నాకేమీ అభ్యంతరం లేదు" అన్నది కళ్యాణి.
మంజరి వెడతానని మళ్లా అనలేదు. కళ్యాణే స్వయంగా కారు పంపించింది.
"మన ఖర్మంగాలి, నాలుగు కొట్లుతిరిగి నచ్చినచీర కొనుక్కొనే అవకాశం లేదు. సాయంత్రంపూట అలా షికారుకెల్లడానికి లేదు. సరదాగా ఏ నాటకానికన్నా, సినిమాకన్నా, సర్కస్ కన్నా, వెళ్లడానికి లేదు. నిమిషంలో మనచుట్టూ జన సముద్రం ఏర్పడి పోతుంది. ఈ బాధలు ముందుముందుగానీ, నీకు అనుభవంలోకి రావు. ఈ బ్రతుకో జైలు శిక్షనుకో మంజూ!"
ప్రసాద్ అప్పటికే తొందరపడి పోతున్నాడు. ఎవరో టుబాకో మర్చంట్ టీ పార్టీ ఇస్తున్నాట్ట. అందర్నీ బయల్దేర మంటున్నాడు.
"ఊఁ లె మరి. డ్రెస్ మార్చుకో, ఆ ఐబ్రౌ చెదిరిపోయింది. సరిగ్గా దిద్దుకో,. లిప్ స్టిక్ ఇంకోసారి....వస్తార్లేవమ్మా తల్లీ! చూద్దువుగాని గదా! దేనికయినా అంత ఆరాటం పనికిరాదమ్మాయ్" అన్నది కళ్యాణి.
మంజరి పైకేమీ అనలేదుగానీ, లోలోపల చాలా నొచ్చుకొంది. కళ్యానికే గనక రాజమణిలాంటి మనిషి ఎంత మంచిదో తెలీకపోవడం వల్లనే కళ్యాణి ఇలా అన్నదని కూడా మంజరి సరిపెట్టుకొంది.
ప్రతీక్షణం సుదీర్ఘంగాసాగి సంవత్సరంలాగా అనిపిస్తోంది రాజమణి, వసంతా ఏ క్షణాన వచ్చినా రావచ్చు గనక, ఇప్పుడు క్షణాల విలువేమిటో మంజరికి తెలిసివచ్చింది. ఏ కారు హారన్ విన్నా అందులొ రాజమణి, వసంతలు వస్తున్నారనే మంజరి అనుకోసాగింది. క్షణాలు, నిమిషాలు గడిచి పోతున్నాయే గానీ, వారికోసం వెళ్ళిన కారు మాత్రం తిరిగిరాలేదు. ఇవతల, కళ్యాణి, అర్ధం ముందు కూచుని, మేకప్ చేసుకొంటూ ఉంది. పెదవులకు మరోసారి లిప్ స్టిక్ తగిలించింది. కనుబొమ్మలు తీర్చి దిద్దింది. ముంగురుల ముఖంమీద పడేలా సర్దుకొంది. బ్రాసరీస్ మార్చి, కొత్తవి ఇంకొంచెం పెద్దవి వేసుకొంది. వాని టీ బాగ్ లో అవీ ఇవీ కుక్కి సిద్దం చేసింది.
ప్రసాద్ హడావిడిగా తిరుగుతున్నాడు. అతనికి బొత్తిగా తీరుబాటు లేకుండా ఉంది. పరుగులాంటి నడకలోనే మాట్లాడేస్తున్నాడు. మధ్య మధ్య ఎవరితోనో గుసగుస లాడేస్తున్నాడు.
"నువ్వింకా ఇలానే ఉన్నావేం మంజూ?" అన్నది కళ్యాణి.
"ఏం చెయ్యనక్కా?" అన్నది మంజరి.
"మరీ అంత మొండితనం పనికిరాదమ్మాయ్! వెళ్ళిన కారు రావాలిగదా! ఈలోగా నువ్వెంత అంగలార్చినా లాభం లేదు....ముందు నువ్వూ డ్రెస్ చేసుకో, ఈ లోపుగా కారేగనక వస్తే-"
 "నా మనస్సేమీ బావోలేదక్కాయ్" అన్నది మంజరి.
"అందుకని, నువ్వీ పిచ్చక్కమ్మ వేషంతో పార్టీ కొస్తానంటావా?" అని కోప్పడింది కళ్యాణి. "మనలాగా - అందం మనీద బతికే వాళ్ళకు మేకప్ ఎంత అవసరమో, నీకు తెలీదు. నిన్ను మీ వాళ్ళతో కలిపిగానీ, నేను నీ వూరు నించి కదలను సరా? ముందు లోపలికి పద....నిన్నీ వేషంలో చూస్తే -"
అరగంటలో మేకప్ పూర్తి చేసుకొని, ఆదరా బాదరా బయలు దేరారు. అప్పటికి గానీ, కళ్యాణి పంపిన కారు రాలేదు. అందులొ రాజమణి వసంతా ఉన్నారు. వారిని చూస్తూనే మంజరి ప్రాణం లేచివచ్చింది. డోర్ తీసుకొని, ఓ కాలు కింద పెట్టిందోలేదో, ఓ కుదుపు కుదిపి బయలు దేరింది. మంజరి కొయ్యబారిపోయింది. రాజమణి, వసంతా రయ్యిన పోతున్న ఆ కారుకేసి, కళ్ళింత చేసుకొని చూశారు.
ముందు కళ్ళొత్తుకో, మేకప్ చెరిగి పోగలదు జాగ్రత్త, అని హెచ్చరించింది కళ్యాణి.
 మంజరి కళ్ళొత్తుకొంది.
"తీరా చూస్తే ఈ పార్టీ నీకోసమే జరుగుతున్న దనుకొంటానమ్మాయ్? నువ్వీ వూరు దానివేమో, అందులొ కాస్త పేరు తెచ్చిన సినిమాకూడా ఇదేనేమో, గుంటూరు వాళ్ళు నీ కోసం పడిచస్తున్నారు. నువ్వు తెలివైన దానివైతే, ఈ మోజును అద్భుతంగా కాష్ చేసుకోవచ్చు" అన్నది కళ్యాణి.
ఈసారి కూడా మంజరి పలుకలేదు.
"నువ్వు మంచి మూడ్స్ లోకి రాకపోతే, ప్రోగ్రామంతా అభాసవుతుంది. చాలా సరదాగా ఉండాలి. ఒక సారేం జరిగిందంటే మంజూ-------"
అంటూ కళ్యాణి, తన పూర్వపు అనుభవాలేవో చెప్పసాగింది, మంజరి మనస్సునిండా ఆ అనుభవాల తాలూకు వాతావరణం నిండిపోయింది. ఆవిడ తాత్కాలికంగా రాజమణినీ వసంతనూ మరిచిపోగలిగింది. మధ్య మధ్య "అదేమిటి?" - "ఇదేమిటి?" "అలా ఎందుకు జరిగింది?" -అంటూ ప్రశ్నలు వేసింది మంజరి. అసలా ప్రశ్నలు వేయాలనే కళ్యాణి కూడా అలాంటి "కధలు చెప్పింది."
పార్టీ  దగ్గరకూడా చాలామంది జనం పోగయ్యారు. పార్టీ ఇస్తున్న పెద్దమనిషి నానా హంగామా చేస్తున్నాడు. అయన మంజరిని చూస్తూనే నవ్వాడు. మంజరి కూడా నవ్వింది. అతన్నెప్పుడో చూశాననుకొంది మంజరి. కానీ ఎక్కడ చూసిందీ, ఎప్పుడు చూసిందీ జ్ఞాపకం రాలేదు.
"నన్ను మరచి పోయావనుకుంటాను" అన్నాడా పెద్దమనిషి మంజరికి అల్లంత దూరంలోకొచ్చి.
"ఎంతమాట? కులాసాగా ఉన్నారా?" అన్నది మంజరి నవ్వుతూ.
కానీ ఎంత గింజుకుచచ్చినా అతనెవరో జ్ఞాపకం రావడం లేదు. నాటకాల్లో చేరాకనో, చేరకముందో, ఎప్పుడో తన కోసం ఉంటాడనుకొంది మంజరి. ఇంతలో ఇంకెవరో హలో అంటూ పలకరించారు.
అతను హార్మోనిస్టు నాటక సమాజంలో జీతంమీద పనిచేస్తూ ఉండేవాడు.
"ఇప్పుడేం చేస్తున్నారు?" అన్నది మంజరి.
సైకిల్ రిపేర్లు చేస్తున్నాను. ఏదో గడచిపోతావుంది. అన్నాడతను మీకోసమని పదిసార్లయినా పిక్చర్ చూస్తుంటాను. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారండీ! మీకిలాంటి ఫ్యూచరున్నదని నా కెప్పుడో తెలుసు. మీరు రేపుకూడా  ఉంటే నాకో పది నిమిషాలు టైమివ్వండి. మీతో నా పర్సనల్ విషయాలు మాట్లాడాలి.
"దట్సాల్ రైట్; కానీ, రేపు నేనుండను, మీరు చెప్పదలచుకొన్నదేమయినా ఉంటే ఫరవాలేదు ఇప్పుడే చెప్పండి. నేనీ రాత్రే వెళ్లిపోవాలి. అవతల నాలుగైదు పిక్చర్లు సగంలో ఉన్నాయి. బ్రహ్మప్రళయంమీద గానీ రాలేకపోయాను" అన్నది మంజరి.
"మరేం లేదండీ! నా సంగతి మీకు తెలియంది కాదు. పొట్ట కోసం గతిలేక సైకిల్ రిపేర్లు చేసుకొంటున్నాను. మీరే కంపెనీలోనన్నా నాకు కాస్త ఫుటింగ్ ఏర్పాటు చేయిస్తే, మీ కాళ్ళముందు పడుంటాను. మీరు చెబితే వింటారని నాకు తెలుసు,. నాకోసం కాకపోయినా, నా పిల్లల్ని చూసయినా, మీరీ ఉపకారం చేయాలి"
తనకున్న పరపతే మాత్రమో చెప్పడం మంజరి కిష్టం లేకపోయింది. తనో గొప్ప వ్యక్తిగా అవతలివాడు మాట్లాడుతుంటే కాదనడమెందుకుట?
"అలాగే! తప్పకుండా చూస్తాను. నాకీ విషయాలన్నీ జ్ఞాపకం ఉండవు....రేపే మీరో ఉత్తరం రాయండి, అవకాశం రాగానే మీకు తెలియపరుస్తాను" అన్నది మంజరి.
"అలా కాదండీ! మీరు తప్పకుండా చూడాలి" అన్నాడతను ప్రాధేయ పడుతూ, "కనీసం మీ పర్సనల్ సెక్రటరీగా నన్నా, నన్ను వేసుకోక తప్పదు."
"చూద్దాం ఇప్పుడు చలపతిని -మీకు తెలుసుగా - మన ఉత్తరం రాయండి. నేను చేయగలిగిందేదో చేస్తాను" అన్నది మంజరి.
అతన్ని చూడంగానే జ్ఞాపకం వొచ్చిన వో సంఘటన, అతను వెళ్ళగానే సంపూర్ణ రూపం ధరించింది. ఈ హార్మోనిస్టే, తొలి సారిగా ఉద్యోగం చేసినప్పుడు, ఎవ్వరూ లేని సమయంలో, తనను బలవంతం చేశాడు. తానిప్పుడు రామచంద్రం పాపకంలో ఉన్నది.
అతనికి తెలిస్తే బావుండదన్న ఉద్దేశంతో, తను వీణ్ని కాదన్నది. ఆ మర్నాటి నుండి వీడు తనమీద యాగీలు ప్రారంభించాడు. తనగొంతు బావుండదనీ, తనకు పాడటం రాదనీ, నసపెట్టాడు, రామచంద్రం ఏదో విధంగా దాన్ని సర్దేసాడు గనక సరిపోయింది. లేకపోతే, తనకా కంపెనీ నుండి ఉద్వాసన జరిగేదే! దరిమిలా కూడా ఇతనికీ, తనకూ మంచి సంబంధాలేమీ లేవు నాటకం అభాసవుతుందనికూడా ఆలోచించకుండా ఈ వెధవ తన సీనొచ్చినప్పుడల్లా వికృతంగా వాయించేవాడు. తన డైలాగ్స్ వినిపించకుండా 'బోఁ య్' మణి హార్మోనియం తొక్కేవాడు, ఆ డైలాగ్స్ పెద్దగా అనడానికి లేదు, మెల్లగా అందామంటే -అసలు తననేదేమిటో జనానికి వినిపించదాయే! అలా ప్రాణాలు తోడాడీ వెధవ. ఇప్పుడు వీడికి తను సహాయం చేయాలి!
"ఏమిటా ఆలోచనలు? పద----"అంటూ కళ్యాణి వచ్చింది.
వీరిద్దరిచుట్టూ చాలామంది పోగుపడ్డారు. వారిలో చాలా ముఖాలు మంజరికి పరిచితమైనవే! అయితే వారి పేర్లు గానీ, ఇతర వివరాలు గానీ, ఆమెకు జ్ఞాపకం లేవు.
పార్టీకి ముందు, ఇందాకటి పెద్దమనిషి లేచి ముక్తసరిగా మాట్టాడాడు.
"జయా ఫిలింస్ వారి చిత్రం అద్భుతంగా ఉన్నదనడం కన్నా నేనింకేమీ అనలేకపోతున్నాను. అందులోనూ, మంజరి నటన ఇంకా బాగావుంది మంజరి మన గుంటూరు మనిషి కావడం మనకెంతో గర్వకారణం. ఈ తార, ఇంకా ఉజ్వలమైన వేషాలు వేసి, మన పట్నానికి మంచి కీర్తిని తీసుకు రాగలదని నేనాశిస్తున్నాను" అన్నాడాయన.
ఆ తరువాత ఎవరెవరో మాట్లాడారు. పార్టీ హాయిగా జరిగిపోయింది. అంతసేపూ అతను కళ్యానితో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
"సిగరెట్ కాల్చనా?" అన్నది మంజరి మెల్లగా కళ్యానితో.
"కొంప ముంచేశావు పో,. అలాంటి పాడుపని ఎప్పుడూ చెయ్యకు., అందులోనూ పదిమంది మధ్యా మనం అసలే అలాంటివి చెయ్యకూడదు......అవును గానీ, మంజూ ఆ వెంకటరత్నం నువ్వంటే పడి చస్తున్నాడే!" అన్నది కళ్యాణి.
ఆ పేరు విన్నాకగానీ మంజరి అతన్ని గుర్తు తెచ్చుకోలేక పోయింది. తను, నాటకాల్లో వేషాలేస్తున్న రోజుల్లో అతనోసారి నాగమణి ఇంటికొచ్చాడు. పదో పదిహేనో ఇచ్చినట్లు జ్ఞాపకం తన కాపూట వొంట్లో బావోలేదు. ఆ మాటే అంటే నాగమణి తను కొట్టి మరీ గదిలోకి తోసింది......
"పెద్ద వ్యాపారస్థుడు చేతిలో ఉండటం ఎందుకైనా మంచిది రేపు ఇతనే వో పిక్చర్ని ప్రొడ్యూస్ చేయవచ్చు.లేదా పిక్చర్ కన్నా ఫైనాన్స్ చేయవచ్చు తరవాత నీ ఇష్టం!"
"నువ్వసాధ్యురాలివక్కా!" అని నవ్వేసింది మంజరి.
మొదటి ఆట ఇంటర్వెల్ లో నటీనటులందరూ స్టేజీమీద కనిపించారు. అందరూ విడిది గృహానికి వచ్చారు గానీ, మంజరి మాత్రం రాలేదు. ఆవిడ వెంకటరత్నం కార్లో వెళ్ళిపోయింది. ఆ పోకపోక, తిరిగి రెండో ఆట ఇంటర్వల్ కు గానీ కనిపించలేదు. ఈసారీ ఆమె వెంట వెంకటరత్నం ఉన్నాడు. అతను చాలా చనువుగా మంజరితో మాట్లాడటం చూసి, కళ్యాణి నవ్వుకొన్నది.
ఒంటిగంటగ్గానీ మంజరికీ కాస్త ఊపిరి పీల్చుకొనే వ్యవధి దొరికింది కాదు. ఆవిడ ఇస్సురంటూ, కారుదిగి మెట్లెక్కుతున్నది. మెట్ల ప్రక్కగా చీకట్లో నుంచి ఎవరో 'మంజూ!' అని పిలిచారు. మంజరి చరాలున వెనక్కు తిరిగింది. ఈలోగా, రాజమణీ, వసంతా కూడా మెట్లదగ్గర కొచ్చారు. మంజరి ఒక్క దూకులో రాజమణిని కలుసుకొని, అమాంతం కౌగిలించుకొంది, ఎముకలు గట్టిగా, తగిలాయి చేతులకు.
"ఇలా అయిపోయావేం అక్కాయ్!" అన్నది మంజరి రాజమణి ముఖాన్ని వేళ్ళతో తడుముతూ.
వసంత కళ్ళు మిలమిలలాడిపోతున్నాయి.
"అప్పన్నించీ ఇక్కడే ఉన్నాం మంజూ! నువ్వెప్పుడోస్తావో తెలీదాయే! నిన్ను చూడాలని ప్రాణాలు పీకాయనుకో, మంజూ....ఏవేమో చెప్పాలనుకొన్నాను." అన్నది రాజమణి."మాట్లాడుకొందాం"
"నిన్ను చూశాక, ఏమి చెప్పడానికి మిగల్లేదు" అన్నది రాజమణి.
"ఏం వసూ బాగున్నావా?" అన్నది మంజరి కళ్ళేగరేస్తూ.
"ఆఁ" అని వసంత సంగహంగా.
"మీరు రావడం చూశాను. కానీ, ఊపిరి తీసుకోడానికైనా తీరిక లేకపోయిందక్కా! చూస్తున్నావు గదా!" అన్నది మంజరి.
రాజమణి, ఆప్యాయతనంతా కళ్ళలో ప్రొదిచేసుకొని మంజరిని చూస్తుంది.
"నువ్వున్న సినిమా పదిసార్లయినా చూసి ఉంటుంది వసంత!" అన్నది రాజమణి.
"ఎలా ఉందమ్మా?"
 వసంత నవ్వి వూరుకొంది.
ఆ రాత్రల్లా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, రాజమణి, తన ఆరోగ్యం గురించీ వ్యాపారం గురించి వసంతను గురించీ చెప్పుకొచ్చింది.
"ఆ సాధక బాధకాలేవో, మంజరిక్కూడా తెలుసు,. వసంత కోసం మంజరి, డబ్బు తక్కువ తీసుకొని, వో పిక్చర్ లో బుక్కయింది. అయినా మీరింకా ఇక్క డెందుకమ్మా!" మద్రాసు వచ్చేయండి....ఏదో చూదాం అన్నది కళ్యాణి.
మంజరీ అయిదు వంద రూపాయల నోట్లు రాజమణి కిస్తూ "ఏమన్నా సర్దుబాటుంటే చేసుకురండి! రెండు మూడు రోజుల్లో బయలుదేరతానంటే, నేను స్టేషనుకు వస్తాను. పోనీ మీ రెప్పుడు బయలు దేరేదీ, ఏబండి కొస్తున్నదీ, వైర్ చేయండి" అన్నది.
"ఇహమేం బయల్దేరాలమ్మా మళ్లా తెల్లారి నప్పన్నుంచి గొడవలు! అదీగాక అవతల ప్రొడ్యూసర్లు, ఊరుకోరు" అన్నది కళ్యాణి.
ప్రసాద్ కు ఆరాత్రి నిద్రేలేదు రెండు గంటలదాకా, వాళ్ళతోనూ, వీళ్ళతోనూ మాటలు సరిపోయాయి. నాలుగింటిదాకా, కళ్యాణి ప్రయాణానికి ఏర్పాటు చేయడంతో సరిపోయింది.
"అయితే నువ్వు బెజవాడ రావట్లేదా!" అన్నాడు ప్రసాదు.
"చూస్తూనే మీరలా అంటే ఎలాసార్? నన్నిబ్బంది పెట్టాలని కాకపోతే ఏమిటా ప్రశ్న?" అన్నది మంజరి నవ్వుతూ.
"నా నెక్స్ట్ పిక్చరులో నువ్వలా నవ్వకపోతే, నే నూరుకోను మంజరీ!" అన్నాడు ప్రసాద్.                
                                                                  15
తీరా మద్రాసు వచ్చాక గానీ, తను అడగదల్చుకొన్నదేదో అడగలేదు మంజరి., నిజానికి తనకింకోరోజు వ్యవధి ఉంది. తను బెజవాడ వెళ్ళనూ వచ్చు, అక్కడి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి, వేళకు మద్రాసు రానూవచ్చు. అయినా కల్యాణి ఏదో కొంపలంటుకు పోతున్నట్టు హడావిడి పడిపోయింది. తనకో నిమిషం వ్యవధి యిచ్చింది కాదు. తను రాజమణితోనూ వసంతతోనూ, మనస్సువిప్పి మాట్లాడుకొన్నది మాత్రం ఏముందీ? ఏదో లాంఛన ప్రాయంగా అడిగిందే తప్ప. తన మాటల్లో ఆప్యాయత కొరవడిందని మంజరి భావించింది. వెంట ఉండి కల్యాణి నస పెట్టకపోయినట్లయితే. తను ఏదో సమయంలో రాజమణి యింటి�


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS