Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 30

ఆరు మాసాల్లో పూర్తవుతుందను కొన్న జయా ఫిలింస్ వారి సాంఘిక చిత్రం ఇంకో నాలుగు నెల్లకుగానీ పూర్తి కాలేదు. మూడు రీళ్ళ తీశాక, ప్రసాద్ ప్రోద్బలం మీద, ఆ కధనంతా మార్చవేశాడు  రచయిత. మొదటి వెన్షన్ ప్రకారం మంజరి పాత్రకు చెప్పుకోతగినంత ప్రాముఖ్యమేమీ లేదు. అది పూర్తిగా ఎక్ స్ట్రా కారెక్టర్ కాదన్న  మాటేగానీ ఆ పాత్రకు కధతో పెద్దప్రమేయం కూడా లేదు. మంజరిని ఆవేషంలో చూడటానికి ప్రసాద్ ఇష్టపడలేక పోయాడు. అక్కడ నుండైనా కధను మార్చుదామనుకొంటే, అప్పటికే మూడురీళ్ళ పిక్చర్ కయారయి కూచుంది. అందుకని, ఆ మెగటివ్ ను కాస్తా మూలపజేసి, మళ్ళా హరివోం అంటూ ప్రారంభించారు. ఈసారి ఎన్నుకొన్న కధకూ, మొదటిదానికి ఎక్కడా పోలికల్లేవు ఈ రెండవ వెర్షన్ లో మంజరి వేషం సెకండ్ హీరోయిన్ కు దీటైనటువంటిది. హీరో, హీరోయిన్ ల కధ సుఖాంతమయితే, మంజరి పాత్ర విషాదంగా ముగిసి పోతుంది. తను చిన్నతనం నుండీ, మనసా వాచా గాడంగా ప్రేమించిన హీరోను మంజరి పాత్ర తన స్నేహితురాలి కోసం త్యాగం చేస్తుంది. సినిమాభాషలో ఇది గొప్ప సెంటిమెంట్ కింద లెక్క.
"కధ చాలా పకడ్బందీగా ఉంది. నీకు కట్టుకుపోయినంత సింపతీ వస్తుందనుకో!" అన్నాడు చలపతి మంజరితో.
కధను ఈ పంపిణిమీద మలచడంలో, చలపతి హస్తకౌశలం కూడా చాలా ఉంది. అతని రోజూ పనిమాలా కవిగారింటి కెళ్లి, మంజరికి ఇంపార్టెన్సీ  వచ్చేలాగా సన్నివేశాలను పేనడం ప్రారంభించాడు. ఒక దశలో, మంజరినే హీరోయిన్ గా చేస్తే బావుంటుందన్న ఆలోచనకూడా చలపతి కొచ్చింది. కానీ - అంత సాహసానికి ప్రసాద్ సిద్దపడలేకపోయాడు.
ఇప్పటికే కంపెనీ, కళ్యాణికి బోలెడంత డబ్బిచ్చింది. దాన్ని వొదులుకోవడంలో అర్ధంలేదు. అదీగాక-బాగా పేరున్న స్టార్! ఫక్తు ఆవిడకోసం పిక్చరు చూసేజనం చాలా మంది ఉన్నారు. పైగా మెహతా కావాలని, కళ్యాణి పేరు మనకు సబ్జెక్టు చేశాడు. ఆయన జబ్బు రెండు లకారాలైనా కంపెని ఖర్చు చేసింది. చిన్న వేషానికి కళ్యాణి వొప్పుకోవడమన్న ప్రశ్నే లేదనుకోండి. -అది వొప్పుకొన్నా అన్ని వేలు పుచ్చుకొంటున్న దానిచేత మనం చిన్న వేషం వేయించడం మాత్రం ఏం సబబు? రెండో వెర్షన్ ప్రకారం మంజరి కారెక్టర్ కూడా మంచిదే! హీరోయిన్ కు లేని గ్లామర్ ఈ కారెక్టరుకుంది. ఈ పిక్చరిలా పోనివ్వండి. రిజల్టు చూశాక, బావుంటే నెస్ట్ పిక్చర్ కు మంజరే మన హీరోయిన్ " అన్నాడు ప్రసాద్.
చలపతికి ఇంకేమానడానికి అవకాసం లేకపోయింది. ఈ విషయమంతా మంజరికి చెప్పినప్పుడు ఆవిడ సంతోషించక పోగా చలపతిని ముక్క చీవాట్లు వేసింది.
ఇలాంటిపనులు నాకు తెలీకుండా మీరెప్పుడూ చెయ్యకండి కళ్యాణి మనస్సు  బాధపడే పక్షంలో, నేనసలు ఏ వేషమూ వెయ్యను అని ఖచ్చితంగా చెప్పేసింది మంజరి.
"నన్నుద్దరించడానికి వేషాలేస్తున్నావా?" అన్నాడు చలపతి.
"కానేకాదు. నా ఉద్దరింపుకోసమే వేస్తున్నాను. కనుకనే నేనింత గట్టిగా చెప్పాలిసొచ్చింది. నేనే స్వయంగా కాదంటున్నప్పుడు మీరెందుకు పట్టుకు పాకులాడుతున్నారో బోధపడదు. మన మీ విషయమై సాగతీసి మాట్లాడుకోవడం మానేద్దాం" అన్నది మంజరి.
చలపతి ఇంకేమీ అనలేదు.ఇటీవల వారిద్దరి మధ్య గల సంబంధాలు రవంత చెడిపోయినట్లు అనిపిస్తుంది. అయితే ఈ మాటలను చలపతిగానీ, మంజరిగానీ వొప్పుకోలేదు. మూడో ప్రాణి ఎదుట వారింతవరకూ బయటపడని మాట నిజమే! కానీ, ఏక్షణాన ఈ అగ్ని పర్వతం పేలినా పేలవచ్చు.
మంజరి తన పట్టునుండి తన పంజరంలో ఉండదని చలపతి అనుమానించసాగాడు. అతని అనుమానాలకు ఆధారాలున్నాయి. చలపతి వద్దంటున్నా వినకుండా మంజరి రెండు దపాలు రాజమణికి చాలా పెద్దమొత్తాలు పంపించింది. ఆ రోజున వారిద్దరూ, శత్రువుల కన్నా హీనంగా పోట్లాడుకొన్నారు.
"ఇది ణాడబ్బు దాన్ని ణా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకొనే హక్కు నాకుంది. నేనైనా దుబారా చెయ్యపోవడం లేదు. తాగి తందనాలాడటం లేదు. మా అక్కయ్య ఇబ్బందుల్లో ఉండి పంపమన్నది పంపుతున్నాను. ఇందులో మీరు రుంజుకోడానికి కారణమేమీ లేదు అన్నది." మంజరి.
"ఏదో వొకరోజున నీ నోట ఈమాట వస్తుందని నాకు తెలుసు. డబ్బు నీదన్నమాట నిజమే! దాన్ని నువ్వు దుబారా చెయ్యడంలేదన్న మాట నిజమే! అవసరమైతే మీ అక్కకు రెండు మూడు వందలు పంపించు. నేను కాదనను. వేలకు వేలు పంపి నువ్వేమయి పోదామని? ఖర్మకాలి ఈ పిక్చర్ కాస్తా ప్లాపై కూచుంటే నీ ముఖం చూసే వాడే ఉండడు. అప్పుడు మన తిండికైనా గడవాలిగదా! కాస్తంత ముందు జాగ్రత్తపడమన్నాను గానీ, మీ వాళ్ళను కాల్చుకుతినమని నేనంటానా? అయినా  రాజమణి నీకేమాత్రం రక్తబంధువో నాకు తెలీని సంగతా?" అన్నాడు చలపతి.
"రక్త బంధువు కానిమాట నిజమేగానీ, మీకన్నా నాకది చాలా దగ్గర చుట్టం" అన్నది మంజరి.
"అయితే నీ ఇష్టం వచ్చినట్లు తగలదు. నాకేమీ తెలీదు" అని తాత్కాలికంగా అస్త్ర సన్యాసం చేశాడు చలపతి.
ఇహ చలపతి ఈ ఇంట్లో కాలుపెట్టడని తాయారు అనుకొంది గానీ మంజరి అనుకోలేదు. చలపతి వ్యక్తిత్వానికున్న విలువ లేపాటివో మంజరికి క్షుణ్ణంగా తెలుసు ఆ రోజు వస్తాడని మంజరి కూడా అనుకోలేదు గానీ, మొన్నటి సాయంత్రంలోగా అతను రాక మానడని ఆవిడనుకొన్నది. అయినా చలపతి సాయంత్రానికే వచ్చి పాతిక రూపాయలు అడిగి పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మంజరి తమలో తను నవ్వుకొంది.
కళ్యాణి ప్రోద్బలంమీదనే మంజరి కోడంబాకంనుండి త్యాగరాయ నగర్ కు మకాం మార్చింది. అద్దెకింద నెలకు రెండువందల పైచిలుకు ఖర్చయి పోతుంది. ఇవన్నీ  ఆలోచించి, కొంతకాలం దాకా తన ఇంట్లోనే ఉంటానన్నది మంజరి! ఆదాయానికి, ఖర్చులకూ పొంతన లేకపోతే ఉడ్డుకుడిచి చావాలసొస్తుందన్నది.
"అందుకని నువ్వు పిసినారి బతుకు బతుకుతావా? అవసరాలకు క్రమంగా పెంచుకొంటూ పోవాలి. ఆ మేరకు ఆదాయాన్ని కూడా సాధించాలి. డబ్బు పంపడం చాతకానివాళ్ళు అవసరాలను కుదించుకొంటారు. వాళ్ళు మంచాన్ని బట్టి కాళ్ళు ముడుచుకొనే మనుషులు. మనం కాళ్ళను బట్టి మంచాలను మార్చుకొనే మనుషులం. అది తేడా!" అన్నది కళ్యాణి.
"అయినా ఆయన్నడిగి చూస్తాను " అని వొ మాట అడ్డం వేసింది మంజరి.
"ఆయనెవరు? ఓహో చలపతినా?" అని ఫక్కున నవ్వింది కళ్యాణి. "వాణ్నడిగితే ఏదీ కాదంటాడు. అవన్నీ నువ్వు వినకు, అసలు నువ్వింతకాలం ఆ గుహలో ఉండటమే ణా కాశ్చర్యంగా  ఉంది. మన విలువ మన పరిసరాలను బట్టి కూడా మారుతుంటుంది. మంజూ! బ్రహ్మాండమైన పాలెస్ లో ఉండు, పదిమంది పనివాళ్ళను పెట్టుకో, రెండు కార్లు కొనెయ్. అందాకా అణుకువగా పడివుంటే, ఆ చలపతి గాడికో కారు పడెయ్. బ్యూటిఫుల్ ఫర్నీచర్ పర్చేస్ చెయ్యి" నువ్వు వెళ్ళనవసరం లేదు ఏ కంపెనీ వాడయినా రెక్కలు కట్టుకొని వాలతాడు. కనీసం రెండు ఫోన్లయినా ఉండాలి. పోతే-"
మంజరి ఫక్కున నవ్వింది.
"ణా మాటలు నీకు నచ్చలేదు గదూ!" అన్నది కళ్యాణి.
"అందుక్కాదు. ఈ పూట నేకు మోతాదు మించింది. అందుకూ నేనవ్వింది. సరే మళ్ళా కలుద్దాం."
త్యాగరాయనగర్ వచ్చిందాకా కళ్యాణి వదల్లేదు. ఇల్లు కూడా తన సెక్రటరి చేత కళ్యాణి ఫిక్స్ చేయించింది. ప్రసాదూ, మంజరీ వెళ్ళి ఆ ఇంటిక్కావలసిన ఫర్నీచర్ పట్టుకొచ్చారు. వేయిరూపాయల వ్యయంతో, చలపతి నేలంతా తివాచీ లతో కప్పేశాడు. మంజరిమేడ మీద ఐదు గదులూ తనకింద ఉంచుకొన్నది. పనివాళ్ళు, చలపతి కింది అంతస్తులో ఉంటున్నారు. చలపతి తనుకూడా పైనే ఉంటానన్నాడు. మంజరి దాన్ని పడనివ్వలేదు.
"పైనేమిటి కిందేమిటండీ? డానికి మధ్య మైళ్ళదూరం ఉన్నట్లు మాట్లాడతారేం? కింద బోలెడంత సామానుంది. దాన్నంతా పనివాళ్ళ పరం చేసి మనం పైన కులుకుతూ కూచుందామంటారా?" అన్నది మంజరి.
"అదన్నమాట సంగతి. అయితే చెప్పావు కాదేం? అవును సుమా? నువ్వన్నదీ రైటే బోలెడంత డబ్బుపోసి కొన్నాం, చేతులు దాటాక ఏమనుకొన్నా ప్రయోజనం లేదు" అన్నాడు చలపతి.
జయా ఫిలింస్ వారి పిక్చర్ ఇక కొద్ది రోజుల్లో రిలీజవుతుందనగా, పబ్లిసిటీ కాంపైన్ ప్రారంభమయింది. ఈలోగా మంజరి మరొక సారి మెహతాను కలుసుకొంది. వాల్ పోస్టర్సులో తన పేరు వెయ్యడమే చాలదనీ, తన బొమ్మకూడా ఉండాలనీ మంజరి పట్టుపట్టింది. పనిలో పనిగా కళ్యాణి చేతకూడా చెప్పించింది.
"పిక్చర్ బాగా పోవాలంటే ఏదో వొ విడ్డూరం ఉండాలిగదా మరి! జయా ఫిలింస్ వారి పిక్చర్ లో 'మంజరి' నటించడం విడ్డూరం! అందాలతార మంజరి" అని బోల్డ్ లెటర్ స్లో వేయించండి. సెక్స్ గా ఉన్న ఓ స్టిల్ కూడా తగిలించండి. జనం జేబులు ఖాళీచేసి మీ పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా ముట్టిచెబుతుంది" అని సలహా ఇచ్చింది  కళ్యాణి.
ఈమాత్రం మెహతాకి  కూడా తెలుసు. అతను మట్టిలో నుండి బంగారం పోగుచేసే మనిషి. ప్రొడ్యూసర్ల ఖర్చుమీద అతను బ్రహ్మాండమైన వాల్ పోస్టర్లు తయారుచేయించాడు. ప్రముఖ తారాగణం పేర్లకిందుగా మంజరిపేరూ. బొమ్మ వేయించాడు. పత్రికా ప్రకటనల్లో కూడా మంజరి పేరు చేర్చారు. పత్రికలు, సినిమావార్తలు ప్రచురించి నప్పుడల్లా  మంజరి పేరును అచ్చు వేస్తూనే ఉన్నాయి.
చలపతి ఈ పత్రికలన్నీ పోగుచేసి మంజరికి చూపెడుతూ ఉండేవాడు. మొదట్లో ఎంతో ఆసక్తిగా మంజరి వాటిని చూసిందిగానీ, ఇప్పుడా తీరుబాటే లేదు. చలపతి సలహామీద అరవ, హిందీ భాషలూ, కళ్యాణి సలహాననుసరించి డాన్సు పాఠాలూ మంజరి నేర్చుకొంటోంది. ఆవిడకు సరిగ్గా నాట్యం రాని కారణాన, డాన్సులుండవలసిన రెండు సీక్వెన్సుల్లో ఇంకెవరినో పెట్టి షూట్ చేయవలసివచ్చింది. జయా ఫిలింస్ వారు పత్రికా ప్రతినిధులకు, నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు. ఆ తరువాత పిక్చర్ ను చూపించారు. సినిమా ప్రపంచంలోని హేమాహేమీ లందరూ  వచ్చినప్పుడు ఎవరెవరితో ఏ యే స్థాయిల్లో మాట్లాడాలో, ఎవరికి వంగి నమస్కరించాలో, ఎవరికి తలవంచితే సరిపోతుందో. చిరునవ్వుతోనూ, 'ఓ' అనడంతోనూ సరిపెట్టవలసిన వారెవరో - చలపతి పైన వైనంగా మంజరికి బోధించాడు.
"ప్రొడ్యూసర్లు కూచునేచోట మన మనుష్యలు కొందర్ని ఏర్పాటు చేశాను. నువ్వొచ్చినప్పుడల్లా వారు నిన్ను గురించి నాలుగు ముక్కలంటుటారన్నమాట! సందర్బాన్ని బట్టి చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం కూడా చేస్తారు. వారికేదో మనం తరవాత ముట్టచెబుదాం. పనిలో పనిగా మనం పేపరువాళ్ళకు రేపో పార్టీ ఇద్దామా?" అన్నాడు చలపతి.
"అవసరమంటారా?"
"తప్పకుండానూ! నువ్వు తప్ప ఈ పిక్చర్ లో మిగతా వాళ్ళందరూ పాతవాళ్ళే! వాళ్ళకు పబ్లిసిటీ అవసరం లేదు. నీకే కావాలి. వరుసగా నాలుగు పేపర్లు నువ్వెందుకు పనికిరావని రాస్తే, మట్టి కొట్టుకుపోతావు. మెహతా కాదు గదా వాడి బాబు కూడా నీకిక వేషమిప్పించలేడు. తరువాత నీ ఇష్టం!"
"ణా ఇష్టమేమిటండీ  నా బొంద, అవసరమనుకొంటే అలానే చేదాం" అన్నది మంజరి.
షో ప్రారంభమయింది. టైటిల్స్ లో తన పేరు చూశాక మంజరి శరీరం జలదరించినట్లయింది. హఠాత్తుగా  ఆవిడకు రాజమణి, వసంత జ్ఞాపకం వచ్చారు. వాళ్ళిద్దర్నీ  రేపే ఈ సినిమా చూడవలసిందిగా జాబు రాయాలనుకొన్నది మంజరి!
మంజరి గడ్డితట్టను చంకన బెట్టుకొని, గట్లమీదుగా చెంగు చెంగున పాత పాడుకొంటూ రావడంతో సినిమా ప్రారంభమయింది.
"రావేర మా యింటికి   
రాదురా నా కంటికి
మామయ్యా!
మనసు కాజేశావు
వయసు దోసేశావు
దొంగోలె నా యెనక
తొంగిసూత్తుండావ?
రావేరమా యింటికి    
ఒంటిగ నిదుర
రాదురా నా కంటికీ"
ఈపాట అయిందాకా సీత - మంజరి వేషం పేరు - ఇంటికి రాదు. ఈలోగా రెండు కొండలూ, ఒక నదీ, ఒక పూలవనమూ, ఓ గొర్రెలమందా, ఓ కొంగలగుంపూ, సీత దాటేస్తుంది. ఒంటిగ నిదురా రాదురా, నాకంటికి,
 అన్నప్పుడూ, మనసు కాజేశావు, వయసు దోసేశావు' అన్నప్పుడూ సీత చూపించిన వయ్యారం బ్రహ్మాండంగా ఉంది.
కామెరామేన్ ఈ రెండు సందర్బాలనూ క్లోజప్ లో తీశాడు. చలపతి ఏర్పాటు చేసిన మనుషులు హాలు దద్దరిల్లిపోయే లాగా చప్పట్లు చరిచారు. తప్పకుండా పైకొస్తుంది-'వెరీ డే రైట్ ఫ్యూచరన్న ఆర్టిస్టు - మార్వొలెస్  ఎక్ప్రేషన్ - 'బ్యూటిఫుల్ యంగ్ చామ్' లాంటి మాటలు అందరికి వినపడేంత నిశ్శబ్ధంగా అనుకొన్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్, రచయిత కూడా మంజరి నటన చూసి సంతోషించారు.
"వండర్ ఫుల్ డిస్కవరీ మిష్టర్ ప్రసాద్" అన్నారెవరో జయా ఫిలింస్ పార్ట్నర్ని.
"ఆ క్రెడిట్ నాదికాదు, మూర్తిగారిది వారే నాకీ ఆర్టిస్టును ఇంట్రొడ్యూస్  చేశారు." అన్నాడు ప్రసాద్.
ఈ మాటలన్నీ చలపతి వింటూనే ఉన్నాడు. కార్యక్రమాన్ని ప్లాను ప్రకారం  నడిపిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్య మంజరిని చూస్తూనే ఉన్నాడు.
నిజంగా మంజరి ఈ ప్రపంచంలో లేదు. కదులుతున్న తన బొమ్మను చూసుకొని మంజరి మనస్పూర్తిగా ఆనందించింది. లోగడ ఓ పిక్చర్ లో చిన్న వేషం వేసిన మాట నిజమేగానీ, దానికట్టే ప్రాముఖ్యంలేదు. తానుగా చెప్పుకుంటే తప్పు ఆ వేషం ఎవరికీ గుర్తు రాదుకూడానూ. ఇదిలాకాదు, మొత్తం కధ తన చుట్టూ తిరుగుతుంది. ఓ రకంగా తనే హీరోయిన్, షూట్ చేసేటప్పుడు ఏ ఘట్టం ఎక్కడొస్తుందో, ఎలా వస్తుందో ఆవిడకు తెలీదు. ఏకో సెట్టుమీద తన నవ్వూ, తన ఏడుపూ షూట్ చేశారు. తను సరిగ్గా ఏడ్వలేక పెయినప్ డ్ ను  శంకరంగారు ఉపయోగించిన టెక్నిక్ జ్ఞప్తికొచ్చింది మంజరికి!
అప్పటికి ఆయన చాలాసార్లు వోప్పిగ్గా చెప్పాడు. డైలాగ్స్ కూడా నేర్పించాడు. అయినా మంజరి శోకాన్ని చూపించలేకపోయింది. శంకరం మండిపోయాడు. చేతిలో ఉన్న కాగితాలను విసిరి మంజరి ముఖంమీద కొట్టాడు.
"నువ్వు గొడ్డు కాసుకోవలసిన మనిషివి, మా ఖర్మ కాలి సినిమాల్లో కొచ్చావు. నాలుగు మాటలనడం చేతకాని పక్షివి, వేషం వేయాలనుకోవడం దేనికీ, ఇలా మా దుంపతెంపడం దేనికీ? ఎవడి బాబుగాడి సొమ్ముందనిక్కడ నీ మీద రాఫింలి ఖర్చు చేయడానికి, ఛా పొ. నీ ముఖం చూపెట్టమాకు,, నీకు వేషం లేదు. నీలెక్క చూచుకొని పట్టుకెళ్ళు. పొ ముందు" అన్నాడు శంకరం కొట్టడానికి చెయ్యియెత్తుతూ.
మంజరి ముందుగా కొయ్యబారిపోయింది. కళ్ళింత చేసుకొని శంకరం గార్ని చూసింది. చుట్టూ ఉన్నవారూ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. అవమానంతో ఆమె గుండెలు మండి పోయాయి. రెండు చేతుల్లోనూ ముఖం దాచుకొని భోరుమని ఏడుస్తూ కుప్పకూలిపోయింది మంజరి.
రెండు మూడు నిమిషాలు గడిచాయి. గోళ్ళు మని నవ్వులూ, ఆ వెంటనే చప్పట్లూ వినిపించాయి. మంజరి తలెత్తి చూసింది. శంకరంగారూ ఆవిడపక్కనే  కూచునిఉన్నారు.
"వెరీ నైస్ చాలా బాగా వచ్చింది" అన్నారాయన.
అప్పటికి మంజరికి బోధపడలేదు, ఆవిడ శంకరంగార్ని చూడలేక తల దించేసుకొన్నది.
"చూడమ్మా! ఇప్పుడు నువ్వేడ్చినంత నాచురల్ ఇందాకనే ఏడ్చుంటే  నే నిన్ని మాటలు అనే వాణ్ని కాదు. నీ చేత సహజంగా ఏడ్పించడానికిఇదొక టెక్నిక్, అంతేగానీ నిన్నేదో అన్నానని బాధపడకు. చాలా గొప్పగా వచ్చిందీ సీను. రేపు నువ్వే చూస్తావుగా!" అని ఓదార్చాడాయన.
ఇంకోసారి హీరో మంజరికి వెనగ్గా వచ్చి నడుంచుట్టూ చేతులు వేసి, దగ్గరగా లాక్కుని వొళ్ళో కూచోబెట్టుకొని ముఖాన్ని తనవేపు తిప్పుకొని ముద్దెట్టుకోబోతాడు. ఇక్కడ కూడా మంజరి చాలా పేచీలు పెట్టింది.
వీటిలో ఏ పనీ ఆవిడకు కొత్తగాక పోయినా, దయ్యాల్లాంటి లైట్ల ముందు  అంతమంది మనుషుల ఎదుట, అలా హీరో వొళ్ళో కూచోడానికి వొప్పుకోలేదు. అప్పుడూ ఇంతే జరిగింది.
ఈ సంఘటనలన్నీ సినిమా చూస్తున్నంత సేపూ మంజరికి జ్ఞాపకం రాసాగాయి. ఒకచోట - మమజ్రి వొంగుని ఆవుకు మేతవేస్తుంటుంది. అప్పుడు తీసిన క్లోజప్ లో ముఖం, గొంతుతో బాటుగా ఆ దిగువభాగాలు కూడా కనిపించాయి. దాన్ని చూసి మంజరి సిగ్గుపడింది....
తనూ, హీరో ఉయ్యాల లూగుతున్నప్పుడు ఎక్కడా ఒక్క పిట్టన్నాలేదు. సినిమాలో అందుకు విరుద్దంగా వున్నది. ఇక్కడ మమజ్రి హీరో ఉయ్యాలలూగుతుంటే ఇంకోచోట రెండు పిట్టలు ఓ చెట్టుకొమ్మ మీద కూచుని ముక్కుకుముక్కు ఆనించుకొంటాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి?
సినిమా అయిపోయింది. చాలామంది ఆమె చుట్టూ చేరి అభినందించ సాగారు. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు "తమిళ్ తెరిమా?" అని కూడా అడిగారు. వారికి అరవంలోనే సమాధానం చెప్పింది మంజరి.
ఇందులో తన ప్రగ్నేమీ లేదనీ, శంకరంగారు, ప్రసాద్ గారు, కవిగారు, మూర్తిగారు కలిసి తననిలా తీర్చిదిద్దారని, చలపతిగారు తనకు దేవుడులాంటివారనీ, వీరందరి ఆశీర్వచన ఫలితంగానే తనీ మాత్రమైనా ధైర్యంగా చేయగలిగాననీ, మంజరి తనను అభినందించడానికొచ్చినవారిముందు చెప్పింది.
మంజరిని మూడ్స్ లోకి తెచ్చి వదిలేశాడు చలపతి. దాదాపు పది నిమిషాలపాటు, ఆవిడ ధోరణిని గమనించాక, చలపతికి పర్వాలేదనిపించింది. కానీ ఇప్పుడో చిక్కు వచ్చిపడింది. తమకా కారు లేదు. ఇంతమంది చూస్తుండగా టాక్సీలో వెళ్ళడమంటే ప్రెస్టేజీ వుండదు. ఇంకోరి కారులో వెళ్ళడమూ బావ్యంకాదు. ఏమిటి చెయ్యడం?
చలపతి ఏమీ తోచక ఉడ్డుకుడిచి పోతున్నాడు. అంతమంది మధ్య అశాంతితో కుతకుత లాడిపోతున్నవాడు అతనొక్కడేమో ననిపిస్తోంది. మంజరి తనచుట్టూవున్న వారితో   ఆచితూచి మాట్లాడుతోంది. ఇతర డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కనిపించినప్పుడు అతి వినయంగా వంగీ వంగనట్లు నంది నమస్కారాలు చేస్తోంది. ఇన్ని చేస్తూనే చలపతి కేసి సిగ్నల్స్ కోసం చూస్తుంది. మంజరి నెట్టుకు రాగలదన్న నమ్మకం అతగాడికి పూర్తిగా వుంది. అంచాతే ఆవిణ్ను  వొంటరిగా వొదిలి ఇవతల కొచ్చాడు. మంజరి ఏమవుతుందన్న బెడద అతని కిప్పుడు లేదు. పరువు పోకుండా ఇంటికి చేరడమెలాగన్నదే సమస్య.                

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS