Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 29

వారం రోజులనుకొన్న కాంప్, రెండు వారాలదాకా దేకింది. పార్ట్నర్  ఈ రెండు వారాలూ మంచినీళ్ళుగా డబ్బు ఖర్చు పెట్టేశాడు. మంజరి కూడా చాలా కులాసాగా ఈ రెండు వారాలు గడిపేసింది. మొదటిరాత్రి పదకొండు గంటలకల్లా, రాజీ కుదిరిపోయింది. రెండు మూడు రాత్రులు దాన్ని మరింత కట్టుదిట్టం చేసుకొంది మంజరి. మిగతా రోజుల్లో అతగాడే ఆవిడ కొంగుపట్టుకొని వెళ్ళాడ పడసాగాడు. మగవాడి  బలహీనత లేమిటో ఎప్పుడు వాటిని లాభసాటిగా వాడుకోవాలో మంజరికి క్షుణ్ణంగా తెలుసు. అనేక వందలసార్లు ఆవిడా అవకాశాలను ఉపయోగపెట్టుకొని లాభించింది. అపారమైన ఆ అనుభవం ఆవిడ కిప్పుడు ఉపయోగపడింది. సాధారణ వ్యక్తులు చచ్చీచెడీ గానీ చేయలేని పనులను, మంజరి సులువుగా చేయగలగడానికి అనుభవాలే కారణం అనేక సందర్భాల్లో మంజరి మనుషుల్ని క్రూరంగా ద్వేషించిన మాట నిజమే! తను అసహ్యించుకొంటున్న వాడికే తన శరీరాన్ని అర్పించిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. కానీ అందువల్ల మంచి ఫలితాలు కలుగుతున్నప్పుడు ఆ పనులు చెడ్డపనులని, మంజరి కూడా అనుకోలేక పోయింది.
పార్ట్నర్ ధోరణి తెలిసిందాకా, మంజరి భయపడింది. మనిషిలో లోతుల్ని ఇట్టే  పసిగట్టగల ఆవిడ అనుభవం "ఈ పార్ట్నర్ కూడా బలాదూరే సుమా!" అని అప్పుడే చెప్పేసింది. మరో 24గంటల్లో వీణ్ని నేను కుక్కను చేసి వదిలిపెట్టక పోతే నా పేరు మంగమ్మే  కాదు. అని ప్రతిజ్ఞచేసిందావిడ. నిజానికంత టైం కూడా అవసరపడలేదు. ఈలోగానే విజయం మంజరిని వరించింది. బెంగుళూరు రావడం అన్నది కేవలం నిమిత్తమాత్రమే! ఓ కొత్త సిటీని చూశానన్న సంతృప్తి తప్ప ప్రత్యేకంగా మంజరికి వరిగిందేమీ లేదు. ఇహ పార్ట్నర్ తో రాజీ మాట - ఈ దిక్కుమాలిన బోడి రాజీకోసం  పనిమాలా బెంగుళూరే రానవసరం లేదు. అరగంట సేపు ఏకాంతం దొరికితే, ఎక్కడయినా దాన్ని మంజరి సాధించి ఉండేది.
ఎగ్రిమెంటు చించి పారేస్తానన్న పెద్దమనిషి ఆమాట అన్న 24 గంటల తరవాత, మంజరికి చీరల కింద  పదిహేను వందలరూపాయలు ఖర్చు చేశాడు. ఈ 24 గంతల్లోనూ అతను మంజరిని ఆర్టిస్టుగా చూడటం మానేశాడు. ఆవిణ్ను తన వెంట తిప్పుకోవడంలో అతను పొందే ఆనందాన్ని చూసి, మంజరి  ఎంతగానో నవ్వుకొంది. లోగడ రామచంద్రం , మాధవరావులు, ఈ మధ్య చలపతి ఆ దరిమిలా వెంకటేశ్వర్లు, ఇప్పుడు ఈ పార్ట్నర్ వీళ్ళందరూ తమచేయి పట్టుకొని, వీధుల్లో సగర్వంగా నడిచినవాళ్ళే! వీళ్ళందరికీ, తను పూర్తిగా వాళ్ళ మనిషేనన్న భ్రమను, తను కలిగించి ఉండకపోతే, వారింతపని చేసి ఉంటారా? ఒక్కనాటికి అలా జరిగి ఉండదని మంజరికి తెలుసు.
"ఏడ్చిపోతాడని ఊరుకొన్నాను. గానీ వీణ్ని పూర్తిగా పిండేయడం రోజుల్లో పని" అనుకొన్నది మంజరి.
బెంగుళూరులో చూడవలసినవన్నీ చూశాక "మనం ఎప్పుడు పోతున్నాం" అన్నది మంజరి. పార్ట్నర్ చొక్కా గుండీలను సుతారంగా తిప్పుతూ.
"ఏం? విసుగెత్తిందా?" అన్నాడా ప్రేమికుడు, మంజరి బుగ్గలు అంతకన్నా సుతారంగా నొక్కుతూ.
"నాకా?" అన్నది మంజరి. అతనికి మరికొంచెం దగ్గరగా జరుగుతూ "మీరిలా నాతో  ఉన్నంతకాలం, నాకు ప్రపంచంతో పట్టదు....అవును గానీ, అన్ని రోజులనుండీ , ఆఫీసుకొస్తున్నాను గదా, ఒక్కసారి కూడా నన్ను పలకరించారు కాదేం?"
"నువ్వు ముభావంగానే ఉన్నావుగా?" అన్నాడతను.
"మీరిలాంటి వారని తెలిస్తే, ఎప్పుడో కొరుక్కుతినేసి ఉందును.....అబ్బా! అలా నాకేసి చూడకండి బాబూ! మీకు పుణ్యముంటుంది" అన్నది మంజరి అతని కళ్ళను రెండు చేతులతోను మూస్తూ.
ఆ మానవుడు పూర్తిగా కరిగిపోయాడు......
మంజరి ఇంటికొచ్చేసరికి చలపతి లుంగీ కట్టుకొని, కట్ బనీను వేసుకొని, వరండాలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతనోసారి మంజరికేసి చూసి, ఏదో అనబోయి మానుకొన్నాడు. డ్రైవరు రెండు పెద్ద పెద్ద ట్రంకులు  తెచ్చి వరండాలో పెట్టి నిలబడ్డాడు. మంజరి అతనికో పది రూపాయల నోట్టిచ్చింది. వాడు మిలిటరీ శాల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
ఒకప్పుడు జయా ఫిలింస్  వారు మాట్లాడుతారేమోనని భయపడిన మంజరి, ఇప్పుడు చలపతి మాట్లాడనందుకు భయపడసాగింది. చలపతి తనను కొడతాడనీ, తిడతాడనీ  కాదు. అంతకు మించిన మాట లంటాడని ఆవిడ భయం. అదేదో త్వరగా   తేలితే బావుండునని మంజరి అనుకొంది. కానీ చలపతి పైకి తేలలేదు. అతను చుట్టూ జరుగుతున్న దేమీ గమనించనట్లుగా వీటి నన్నింటికీ అతీతంగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాడు. మంజరి స్నానం చేసి బట్టలు మార్చుకొచ్చింది. చలపతి ఇంకా వరండాలోనే ఉండిపోయాడు. ముందుగా ఎలా పలుకరించాలో మంజరికి తోచలేదు. ఓ క్షణం పాటు ఆలోచించి
"ఓ సారిలా వస్తారా?" అన్నది మంజరి.
చలపతి వచ్చి నిలుచున్నాడు.
అతను వచ్చాక, ఏం మాట్లాడటమన్న ప్రశ్న మళ్ళా ఎదురయింది.
"అలా ఉన్నారేం? వొంట్లో బావుండలేదా?" అన్నది మంజరి.
"లేకేం? దుక్కలా ఉన్నాను" అన్నాడు చలపతి.
"అంతకోపం దేనికండి? నేనడిగిందేమిటి? మీరు చెప్పిందేమిటి?" అన్నది మంజరి.
"ఒడ్డెక్కిన  మనిషివి, కనీసం వొడ్డెక్కాననుకొంటున్న మనిషివి. ఇప్పుడు నువ్వేమన్నా చెల్లుతుంది."
"నేను మాత్రం ఏమైనా ఎందుకంటాను? నా కళ్ళకేమీ పొరలు కమ్మలేదనీ, నువ్వు మామూలు మనిషి వెననీ, ఎదుటి వారి కనిపించాలి. పోనీ నీమాటే నిజమనుకొన్నా, పొరలు కమ్మడం క్షణాల మీద జరుగుతుంది. కాని అవి విడిపోవడానికి కొంతకాలం పడుతుంది. నువ్వనవసరంగా బుకాయిస్తున్నావు గానీ, నీకు మామూలు పొరలు గావు -బాగా దళసరి పొరలు కమ్ముకొన్నాయి. ఈ గొడవకేం గానీ, నన్ను పిలిచిందెందుకుట?" అన్నాడు   చలపతి.
ఈ మాటల బాణాలు మంజరిని గాయపరిచి, స్పృహ తప్పేటట్లు చేస్తాయని చలపతి భావించి ఉంటే, అది పూర్తిగా భ్రమ అని చెప్పాలి. మంజరికి గాయాలయితే తగిలాయి గానీ, ఆవిడ శోషోచ్చి పడిపోలేదు. వాటిని తట్టుకొని నిలబడింది.
"మీ కోపమంతా తీర్చుకోడానికి నేనొక్కదాన్నే కనిపించడం నా దురదృష్టం. అసలీ గొడవంతా ఏమిటండీ బాబో? ఏదన్నా తప్పుంటే చెప్పరాదా, నేను కాదన్నానా?" అన్నది మంజరి, వచ్చే ధోరణి కనపరుస్తూ.
చలపతి రాజీపడటానికి సిద్ధంగాలేడు.
"చూశావా, నేనన్నమాటను క్షణాలమీద రుజువు చేశాను అన్నాడు చలపతి పళ్ళు గిట్టకరుచుకుంటూ. "నీకు పొరలు కప్పిన మాట - మాంచి మందమైన పొరలు కమ్మినమాట నిజమే రుజువు చేశావు. నాకు కోపమున్న దనుకోవడం మొదటి తప్పు. నువ్వేదో తప్పుచేశావను కోవడం రెండో తప్పు. నేను అనవసరమైన గొడవలు రేపుతున్నావనడం మూడో తప్పు. పొరలు కమ్మిన వాళ్ళకుండే లక్షణాలన్నీ నీకిప్పుడున్నాయి. పైగా నేనేదో నిన్ను బాధపెడుతున్నట్లు మాట్లాడుతావేం?"
మంజరి కోపం తారామండలానికి లేచింది. ఆవిడ చలపతిని దులపవలసిన నాలుగు మాటలూ దులిపేసింది.
"ఒకళ్ళ నొకళ్ళం  పోషిస్తున్నదేమీ లేదు. ఎవరి బతుకులు వారు బతుకుతున్నప్పుడు. వొకరి నొకరు ఇలా పీడించడంలో అర్ధం మీకిష్టం లేక పోతే చెప్పండి. నేను వెళ్ళిపోతాను" అన్నది మంజరి.
    ఆ గొంతులో దైన్యంగానీ, విచారంగానీ లేదు. ఆ క్షణం చలపతి పొమ్మనడమే జరిగితే, అందుకు తాను సిద్దంగా ఉన్నానని కూడా మంజరి తెలియ చేసింది. చలపతి ఓ నిమిషంపాటు కళ్ళు మూసుకొని ఆలోచించి తోడేలు నవ్వినట్లుగా నవ్వాడు. అతనికి అంతో ఇంతో ఎర్రబడ్డాయికూడా.
"అంటే నీ ఉద్దేశం నాకు బోధపడలేదు మంజరీ!" అన్నాడు చలపతి.
"ఇంట్లో నుంచి పోతానని నన్ను బెదిరించవలసిన అవసరం లేదే లేకపోతే నన్నే పొమ్మని చెప్పడానికి దొక మార్గమా? నేను పోవలసిన టైం వొకటుందిగానీ, అదింతతొందరగా దగ్గరపడుతుందనుకోలేదు. నేనిప్పుడు ఈ కొంప విడిచిపెట్టడానిక్కూడా  సిద్దంగానే ఉన్నాను. కానీ అందువల్ల నువ్వు కొన్ని ఇబ్బందులు పడాలిసొస్తుంది. పనిమానేస్తున్నాను. నేనిక్కడుండటం నీకంత యిష్టం కానిపక్షంలో నేనెప్పుడైనా వెడతాను."
"నన్ను ప్రాణాలతోనే కాల్చేస్తున్నారండీ బాబూ మీరు! చిటికలో పోయేదానికి బ్రహ్మాండంచేసి కూచుంటున్నారెందుకో నాకు అర్ధంకాదు. ఏ మాటన్నా తప్పే అయితే ఏ దూకనండీ బాబూ?" అన్నది మంజరి.
మంజరి ధోరణిలో వచ్చిన మార్పును చలపతి కూడా గ్రహించాడు. ఆవిడ ఇదివరకు మంజరికాదని అతనికి తెలుసు గాని, ఇంత మండిపడుతుందని మాత్రం ఊహించలేకపోయాడు. అయినా తెగిందాకా లాగడం అతని స్వభావానికే విరుద్దం.
"వేడి తగ్గిందా?" అన్నాడు చలపతి సన్నగా నవ్వుతూ. "నా కసలు వేడంటూ ఉంటేగదా తగ్గడానికి,. వారంరోజులు ఊళ్ళో  లేకపోయే సరికి ఎవరికి వేడెక్కిందో ఎవరికి పైత్యం ఎక్కిందో కనిపిస్తూనే ఉంది" అన్నది మంజరి.
రాం బాణం లాంటి ఈ చివరివాక్యం చలపతిని చిత్తుచేసి పారేశాడు. అతను పగలబడి నవ్వుతూ, మంజరి భుజంమీద చెయ్యి వేశాడు.
"ఆఁ పోదురూ! ఈ మాత్రం లయలు నాకూ తెలుసు" అన్నది మంజరి అతని చేతిని విసురుగా తీసేస్తూ.
చలపతి చేయి తీసేశాడు. ఆ తరువాత ఏం జరిగేదీ తెలిసిన మంజరి అందుకు సిద్దంగా ఉంది.
అది గాదమ్మడూ! నిన్ను చూడకుండా నేనింత కాలం ఉంటానని ఎలా అనుకొన్నావమ్మా? పోనీ, ఇదీ విషయమని నాకు ఉత్తరమన్నా రాశావు గాదేం? నీ కోసమని ఎన్ని చోట్లకు వెళ్ళను? ఎంత మందికి ఫోను చేయను? ఆఖరికి జయా ఫిలింస్ లో కనుక్కొంటే తెలిసింది "హమ్మయ్య" అనుకొని గుండె దిటవు చేసుకొన్నాను. అవును గానీ బెంగుళూరెలా ఉంది? నువ్విదే మొదటిసారిగా చూడ్డం కదూ?"
మంజరి పలకలేదు. ముఖం ముడుచుకొని మూతిని సున్నాలాగా తిప్పి, మంచం మీద పడుకొంది.
"పలకవేం?" అన్నాడు చలపతి తానుకూడా మంచం మీద కూచుంటూ.
మంజరి లేవబోయింది. చలపతి ఆవిడ లేవకుండా అదిమి పెడుతూ, "ఎందుకమ్మా అంత కోపం? నువ్వు ఉత్తరమన్నా రాశావు కాదని తప్పితే నీ మీద నా కెందుకమ్మా కోపం" అన్నాడు.
అప్పటికీ మంజరి పలుకలేదు.
"ఇలాంటి ఫోజులు రెండు మూడుంటే ఆ పిక్చర్ సెంచరి కొడుతుందనుకో మంజరీ! ఇప్పుడు నాకేమనిపిస్తున్నదంటే-"
"సిగ్గు లేకపోతే సరి! అన్నది మంజరి.
"దిక్కు మాలిన సిగ్గు లేకపోతే పీడాబోయిరి గానీ,. నాకు బెంగుళూరునించి ఏం తెచ్చావో చూడనీ!" అన్నాడు చలపతి.
అతను అనడం ఆ మాటలే అన్నా అతని చూపులు అంత చూడటం కోసం తారట్లాడుతున్నాయి.
విషయాన్ని వెంటనే పసిగట్టేసిందావిడ.
"హమ్మయ్య అయ్యగారు అయిసయిపోయాడు" అనుకొంది మంజరి.
వెండి సిగరెట్ కేసూ తెచ్చింది మంజరి. ఇవన్నీ కొనాలని ఆవిడ ముందుగా అనుకోలేదు. షాపులో కెళ్ళాక కూడా కొందామనుకోలేదు. పార్ట్నర్ దగ్గర ఇంకా పచ్చనోట్లు మిగిలి వుండటాన్ని చూసి ఈ రూపంగా వాటిని సద్వినియోగం చేసింది మంజరి. అనవసరంగా కొన్న ఆ వస్తువులు, ఆ అదునులో ఆవిణ్ను అదుముకొన్నాయి.
ఇవి ఎందుక్కొన్నావని గానీ, డబ్బెక్కడదని గానీ, చలపతి అడగనూ లేదు. మంజరి చెప్పనూలేదు. ఒకవేళ చలపతి అడగడమే జరిగితే, నిజం చెప్పేద్దామని, అప్పుడతని ముఖమెలా ఉంటుందో చూద్దామని మంజరి అనుకొంది. కానీ చలపతి ఆ అవకాశాన్ని మంజరి కివ్వనే లేదు.....
"మంచి లొకేషన్స్ దొరికాయా?" అన్నాడు చలపతి. వాచీని తిప్పి తిప్పి చూస్తూ వాచీ బాగానే ఉంది సుమా మంజరీ! బహుశా ఇది నీ సెలక్షన్ అనుకొంటాను. ఏ మాత్రం అయిందేమిటి?"
"మార్కెట్ రేటు చాలా ఉందనుకోండి. ఇది స్మగుల్ద్ వాచీ అట. అందుచేత మూడు వందల చిల్లరెంతో అయింది....నేనేమో మీకోసం ఇలా పాకులాడుతూ ఉంటాను. మీరేమో నిష్కారణంగా నామీద ఖస్సు బస్సు మంటారు." అన్నది మంజరి.
"ఈ పంపిణీమీద నన్నెంత కాలం సాధిస్తావు మంజరీ?" అన్నాడతను నవ్వుతూ.
"జన్మకు సిగ్గు లేకపోతే సరి" అనుకొన్నది మంజరి.
చలపతి ఏదో పనున్నదంటూ  వెళ్ళిపోయిన గంటకల్లా ఓ అందమైన కారు వాకిటిముందు ఆగింది. ఆ కారును తనెక్కడో చూసింది. కానీ ఎక్కడ చూసిందీ, ఎప్పుడు చూసిందీ మంజరికి జ్ఞాపకం రాలేదు. మద్రాసు వచ్చాక తనిలాంటి కార్లు కట్టుకు పోయినన్ని చూసిందాయె! ఎన్నని జ్ఞాపకముంటాయిగనక?
అంతలోనే డ్రైవర్ అల్లంతదూరం నుండే వంగి వంగి దణ్ణాలు పెడుతూ వచ్చి మంజరికో చిన్న కవరందించాడు.
"ఏమిటది?" అన్నది మంజరి.
పోస్టుమాన్ నుండి తప్ప, విడిగా ఉత్తరాలండుకోవడం మంజరికిదే మొదటిసారి.
"అమ్మగారు పంపించారమ్మా!" అన్నాడు డ్రైవరు.
ఉత్తరం విప్పిచూసిందాకా దాన్ని కళ్యాణి రాసి ఉంటుందని మంజరి ఊహించలేక పోయింది.
"నీతో చాలా పనుంది. ఎన్నో విషయాలు మాట్లాడాలి. సాయంత్రం కారు పంపిస్తాను. తప్పకుండా రావాలి. బహుశా రాత్రల్లా నువ్వు ఇక్కడే ఉండిపోవలసి వస్తుందేమో! మీ ఆయనతో ఈ రాత్రి రాననే చెప్పు. తియ్యని ముద్దులతో - నీ
కళ్యాణి.
ఉత్తరాన్ని మరోసారి చదువుకొంది మంజరి. ఎందుకు రమ్మన్నది అందులో ఏమీ లేదు.
"అమ్మగారికి వొంట్లో బావోలేదా?" అన్నది మంజరి.
ఏం చెబితే ఏం చిక్కువస్తుందో తెలిసిన డ్రైవర్ "తెలీదమ్మా! నేను డ్యూటీ మీదకు రాగానే ఈ కవరిచ్చారు. నాకు తెలియదండీ!" అన్నాడతను.
"సరే! అలాగేనని చెప్పు" అన్నది మంజరి.
డ్రైవర్ సలాంకొట్టి పోయాడు.
ఇహ మంజరి సుఖంగా కుర్చీలో కూచోలేక పోయింది. ఇంకోసారి మరోసారి ఉత్తరం చదివింది. అక్షరాలన్నీ గొగ్గురు గొగ్గురుగా ఉన్నాయి. సంతకం దిద్దినట్లుగా కూడా ఉంది. ఆరోగ్యం బాగోలేదని మంజరి శంకించ సాగింది. కానీ అదే నిజమయితే, తనను వెంటనే రమ్మంటుందిగానీ, సాయంత్రందాకా ఆగమని ఎందుకంటుంది. తనతో ఏవో విషయాలు మాట్లాడాలని కూడా రాసింది. కొంపదీసి యీ బెంగుళూరు ప్రయాణం కళ్యాణికి తెలిసిపోయిందేమో నని మంజరి భయపడింది. ఖర్మకాలి కళ్యాణి తనను నిలదీసి అడిగితే, ఏం చెప్పాలిసిందీ  మంజరికి తోచలేదు.
ఇన్నుళ్ళలాగా ఆలోచనలు ఆమెను ముసురు కొన్నాయి. ఆమె తనూ తొలిసారిగా మెహతా ఆఫీసులో కలుసుకోవడం, ఇద్దరూ కలిసి అతగాణ్ని  ఆటలు పట్టించడం, ఆ రాత్రి తను కళ్యాణి యింట్లో గడపడం, కళ్యాణి చెప్పిన గత చరిత్రా - ఇవన్నీ- సినిమా  పరిబాషలో రీల్సులాగా ఆమె బాధపడింది. దురదృష్ట మేమిటంటే, ఏదో ఒకటి రెండు సార్లు తప్పితే, తనకు కళ్యాణి అసలు జ్ఞాపకమే రాకపోయింది.
సాయంత్రానికి ముందుగానే, మంజరి మేకప్ చేసుకొంది. మేకప్ లేకుండా అసలు అడుగు బైటకు పెట్టడానికి వీల్లేదన్నాడు  చలపతి. సినిమా స్టారన్న తరువాత గ్లామర్ పెంచుకోవాలి గానీ చంపుకో కూడదన్నాడు. తారల బతుకంతా గ్లామర్ మీదనే  ఆధారపడి ఉందన్న అసలు రహస్యాన్ని కూడా చలపతి చెప్పేశాడు.
మేకప్ పూర్తికావడానికి దాదాపు గంటన్నరకు పైగా పట్టింది. బెంగుళూరునుంచి తెచ్చిన చీర, జాకెట్ వేసుకొంది. నిలువుటద్దం ముందు నిలబడి ఒక్కసారి ఆపాదమస్తకం చూసుకొన్నది మంజరి. ఆమె సౌందర్యం ఆమెనే ముగ్దురాలిని చేసింది. ఈ అందమైన శరీరం ప్రక్కగా చలపతిని, వెంకటేశ్వర్లును, మెహతాను, పార్ట్నర్ ను ఊహించుకొని చూసింది. ఎవ్వరూ సరిపోలేదు. సుతారంగా కింది పెదవి కొరుక్కుంటూ, తన బొమ్మకు తనే కన్ను గీటింది మంజరి! అప్రయత్నంగా మంజరి పెదవులమీద మెరుపులాంటి చిరునవ్వు వెలిగి అక్కడే ఇంకిపోయింది. తాయారు రాకపోతే, ఇంకెంత సేపు అలా చాస్తూ ఉండేదో ఆమెకే తెలీదు.
"ఇయ్యాల దేవకన్యలాగా ఉన్నారండీ అమ్మాయిగోరూ!" అన్నది తాయారు.
మంజరి చెక్కిళ్ళు రవంత గండరించాయి.
"నిజంగానుటే తాయారూ?"
"నన్ను సంపుకున్నట్టుండి అమ్మాయిగోరూ! అప్సరసవోలె ఉన్నరండీ! ఇక జనం మీ ఎనకాతల-"
ఎవరో నెత్తిమీద పెతీమని బాదినట్టు ఆగిపోయింది తాయారు. దానికి  మనుషుల బలహీనతలు తెలుసు. అందులోనూ అట్టడుగు బతుకు బతుకుతున్న మనిషేమో, ఆ బలహీనతలు మరింత స్పష్టంగా తయారుకు అవగాహనవుతాయి.
"అమ్మాయిగారూ! యాడికెల్లినా  మీ ఊసే ననుకోండి! మీ అంత సక్కంది ఈ సినిమా స్టారుల్లో లేరటండి! మీ గొంతుకూడా మా పసందుగా ఉంటదంటండీ! మీరు డైలాగులు అంటా ఉంటంటే పైన పోయే పక్షులు కూడా ఆలకిత్తాయంటండీ! ఇంకో యాడాదిపోతే మీరు యాకంగా బొంబాయి పట్నానికే మకాం ఎత్తేత్తారంటండి అమ్మాయిగారు!"
మంజరి చాలా హాయిగా నవ్వేసింది.
"ఎవరన్నారే ఇవన్నీ నీతో?"
"ఓరనే దేముంది అమ్మాయిగారూ! నేనేడ కెళ్ళినా మీ వూసే యినపడతా వుంటదనుకోండి! మా దొరసానమ్మగారు బొంబాయి ఎల్లకపోతే, ఇంకీ పట్నంలో ఎల్లేవాళ్ళే లేరని నేనంటావుంటనుండీ!"
"ఒసినీ అసాధ్యం పాడుగానూ?" అన్నది మంజరి, దానిమాటలను ఔనని గానీ, కాదనిగానీ, తేల్చకుండా "ఉండవే నేనెప్పుడన్నా మన కంపెనీలో కనుక్కొంటాను చిన్న వేషమేదన్నా దొరికితే వేద్దువుగానీ! పాపం లోగడ నన్ను నోరారా అడగను కూడా అడిగావు" అన్నది మంజరి.
"అదీ మీకాడ నైతేనే యాత్తానండి! ఇంకోదాందెగ్గిర యాసం కట్టమంటే, నావల్ల కాదండీ! మీ పాదాల్ని నమ్ముకోనున్నా. సినిమాలో కూడా మీ అడుగంటే ఉండాల్నుండి" అని ఓ చిన్న షరతు కూడా పెట్టింది తాయారు.
మంజరి ఏదో అనబోయింది. కళ్యాణి కారువచ్చి వాకిట్లో ఆగింది.
"నేనేదో పనిమీద పోతున్నానే తాయారు! అయ్యగారొస్తే నేనీ రాత్రి రానని చెప్పు."
"సరేనండమ్మాయిగారూ" అన్నది తాయారు.
మంజరి కారెక్కింది. ఓ చిన్న ఊగు ఊగి కారు బయలు దేరింది. కోడంబాకం గేటు దగ్గర కొచ్చే సరికి అది కాస్తా మూసిఉంది. అటూ ఇటూ చాలా కార్లున్నాయి. తమకు ముందున్న ఓ కారు చుట్టూ చాలా మంది మూగారు, కొంతమంది ఈలలు వేస్తున్నారు. ఇంకొంత మంది చప్పట్లు చరుస్తున్నారు. కొన్ని గొంతులు "వేలైక్కారి - వేలైక్కారి" అంటున్నాయి.
"ఏమిటదీ?" అన్నది మంజరి.
"ఎ.బి.సి.5473 కారండీ!" అన్నాడు డ్రైవర్.
మంజరి కేమీ బోధపడలేదు. ఆ సంగతి తెలిసినవాడల్లే డ్రైవరు "సరసగారి కారండీ అది!" అన్నాడు.
ఆ పేరు మంజరికి చాలా పరిమితమయింది. అగ్రశ్రేణి తారా గణంలో సరసకూడా వొకత్తె. ఒకసారి రావు కార్లో పోతుంటే మంజరి ఆవిణ్ను చూసింది. ఆ చుట్టూ మూగిన వారందరూ ఆమె ఫాన్సు! చలపతిరావును ఎప్పుడో అన్నాడు, సరసను చూడటం కోసం, ఆవిడ ఇంటిముందు గంటలకొద్దీ జనం నిలబడిపోతారన్నాడు. భగవంతుని దయవల్ల, తనకూ నాలుగు పిక్చర్లు చిక్కి అందులో మంచి వేషాలు దొరికితే, తనకారు పోతున్నప్పుడు కూడా జనం ఇలాగే మూగుతారు. బహుశా ఇంతకన్నా ఎక్కువ మందే తన్ను చూడ్డానికి, ముసిరినా ముసురొచ్చు. సరసకు మంచి పేరయితే ఉందిగానీ.....   
కారు పోర్టికోలో ఆగదమూ, డ్రైవర్ తలుపు తీయడమూ కూడా మంజరి గ్రహించే స్థితిలో లేదు. ఆవిడ ఆలోచనలన్నీ వేలాది ఫాన్సుమీదా, వారు రాసే ఉత్తరాలమీదా, శతదినోత్సవాల  కెళ్ళినప్పుడు, తన ఆటోగ్రాఫుల కోసం విరగతొక్కుకుచచ్చే జనం మీదా ఉన్నాయి.
"హలో"
మంజరి బుర్రంతా క్షణకాలం మొద్దుబారిపోయింది. ఆవిడ చుట్టూ చూసి ఎదురుగా ఉన్న కళ్యాణిని పలకరించబోయి, నవ్వి ఊరుకుంది.
"హలో! ఎలా ఉన్నావమ్మా?" అన్నది కళ్యాణి.
"వెరీ వెల్" అన్నది మంజరి.          
ఇద్దరూ మేడమీద కొచ్చారు. ఎదురు బొదురుగా  కూచున్నారు.
"ఏమన్నా తింటావా?" అన్నది కళ్యాణి.
"వొద్దు"
"పోనీ, ఏ డ్రింకన్నా తాగుతావా?"
"వొద్దక్కా" అన్నది మంజరి.
"అలా వీల్లేదే చెల్లమ్మా! రెండు డ్రింక్సు తెప్పిస్తాను, అందులో లైట్ గా అబ్బే చాలా లైట్ గా -కలపమని చెబుతాను. లాభంలేదు మంజూ! నువ్విలా తల తిప్పితే వూరికినే దాన్ని గాను. ప్లీజ్ నాకోసమన్నా."
"తరువాత చూద్దాం" అన్నది మంజరి.
"దట్సాల్" అన్నది కళ్యాణి. "ఈ మధ్య నీ దర్శనమే లేదేమిటమ్మా? రెండు మూడుసార్లు నువ్వుంటే ఎంత బావుంటుందా అనుకొన్నాను నీ కోసం వద్దామన్నా అడ్రస్ తెలీదాయే. జయా ఫిలింస్ లో అడిగితే చెప్పారు" అన్నది కళ్యాణి.
మంజరి గుండె గతుక్కు మన్నది. జయా ఫిలింస్ లో కళ్యాణికి ఏం చెప్పారు? తన ఎడ్రసా? తనిలా బెంగుళూరు వెళ్ళినట్లూ?
"నువ్వు తప్పకుండా పైకొస్తావ్ మంజూ! భగవంతుడు మా కెవ్వరికీ లేని గొప్పవరం నీకిచ్చాడు. నీ అందం ముందు మేమంతా బలాదూర్ అనుకో" అన్నది కళ్యాణి నవ్వుతూ.
"ఏమిటక్కా  నీ చాదస్తం."
"నేనూ ఆడదాన్నయి పోయానుగానీ మంజూ! లేకపోతే నిన్నీ పాటికి నిలువునా కొరుక్కుతినేసి ఉందును."
మంజరి సిగ్గు పడింది.
కళ్యాణి తనుకూడా మంజరి పక్కనే కూచుని, ఆవిణ్ను తనకేసి తిప్పుకొంది.
"కొన్ని విషయాల్లో మద్రాసుకన్నా బెంగుళూరు చాలా బావుంటుంది మంజూ! ఏమీ తోచనప్పుడు నేనిలా వెళ్ళొస్తుంటాను. ఆ పార్ట్నర్ అతని పేరు ప్రసాద్ గదూ?"
"ఊఁ" అన్నది మంజరి.
"పిసినారి కూడా.....ఎంత బావుంటాయి మంజూ నీ కళ్ళు? మంచి సీక్వెన్సులో ఆ కళ్ళకు రెండు క్లోజప్ లిస్తే జనం చచ్చి వూరుకొంటారనుకో" అన్నది కళ్యాణి.
"నీ ఉత్తరం చూసి నీ వొంట్లో బావోలేదేమో ననుకొన్నాను." అన్నది మంజరి.
"నిజంగా బావోలేదు మంజూ! నిన్నా, ఇవ్వాళా ఉన్న కాల్ షీట్స్ అన్నీ కాన్సిల్ చేసేశాను డాక్టర్ ఎక్కడికి కదలొద్దనీ, బెడ్ రెస్టు తీసుకోమని చెప్పాడు. ఈ ప్రొడ్యూసర్లేమో ప్రాణాలు తోడేస్తున్నారు. ఒకాయన ఇంతకు ముందుదాకా ఇక్కడే ఉన్నాడు. ఓ అరగంట ఇలా వచ్చి అలా వెళ్ళమంటాడు. ఈ చిన్న సీనూ తీసేస్తే ఈ సెట్ తో పనయిపోతుందంటాడు. వెధవగోల ఇంకో వారందాకా మాట్లాడొద్దని వచ్చేశాను. అయినా మళ్ళా పొద్దునే తయారవుతాడు, ప్రాణాలు కొరుక్కుతినేస్తాడు. రోజుకు ఇరవై గంటలు పనిచేసినా తరగడం లేదు మంజూ!" అన్నది కళ్యాణి!
మంజరి కిదంతా చిత్రంగా తోచింది. వేషాలు దొరక్క నానా బాధలూ పడేవాళ్ళు పడుతుంటే, కొంతమంది వేషాలు వెయ్యలేక తీరుబాటులేకా చచ్చిపోతున్నారు.
"నువ్విక్కడ లేవు, ఏదో ఆలోచిస్తున్నావు" అన్నది కళ్యాణి.
"లేదు లేదు" అన్నది మంజరి సర్దుకొంటూ.
బుకాయించకమ్మా పిల్లా! కొంపదీసి ప్రసాద్ గానీ జ్ఞాపకం రాలేదు కదా?
"లేదు" అన్నది మంజరి నవ్వి.
"తరువాత నువ్వే వొప్పుకొంటావుగానీ, ముఖ్యంగా నీక్కొన్ని సలహా లిద్దామని పిలిపించాను. అసలు వొంట్లో బావుంటే నేనే వద్దామనుకొన్నాను. డాక్టరేమో కదలకూడదన్నాడాయె, అదీగాక అడుగు బయటపెడితే  జనం చుట్టేస్తారాయె.
ఈ బాదరబందీ పడలేక నిన్నే పిలిపించాను. నీకీ రాత్రి ప్రోగ్రామేమీ లేదుగా?" అన్నది కళ్యాణి. "ప్రోగ్రాం" అన్న పదం వచ్చినప్పుడు ఒక కన్ను సగం మూసి నవ్వుతూ.
మంజరి కూడా నవ్వి "ఊఁహూ" అన్నది.
"డాక్టర్ వద్దన్నాడుగానీ, నేను మాత్రం సిగరెట్ కాల్చకుండా ఉండలేకపోతున్నా నమ్మాయ్! ఎవరన్నా ఫ్రీగా మాట్లాడే వారుంటే ఆ ధ్యాసలోపడి కాస్సేపన్నా  మరచిపోవచ్చు. మధ్యాహ్నం వొద్దు వొద్దనుకొంటూనే, అయిదారు సిగరెట్లు కాల్చేశాను. ఆయా చూసి దాచేసింది. కుర్రాణ్ణి పంపించి మరో పాకెట్ తెప్పించాను....నీ బ్రాండ్ ఇదేనా?"
మంజిర ఆశ్చర్యంగా కళ్యాణికేసి చూసింది, కళ్యాణి సిగరెట్లు కాలుస్తుందని, ఆవిడ కింతవరకూ తెలీదు.
"అదేమిటి మంజూ? అలా చూస్తావేం? నువ్వసలు స్మోక్ చెయ్యవా ఏం ఖర్మం?"
తను అంతగా దిమ్మరపోయినట్లు కనిపించి ఉండకూడదని మంజరి అనుకొనే వేళకే పరిస్థితి చేయిదాటి పోయింది.
"ఆఖరికి మంచి సిగరెట్ కూడా కాల్చుకోకపోతే ఈ సంపాదనంతా ఎందుకమ్మా తగలెయ్యనా? ఇష్టమొచ్చింది ఇష్ట మొచ్చినంత తినే ప్రాప్తం మనకెటు గూడీ లేదనుకో కనీసం, ఆ     వార మిగతావాటిల్లో నన్నా పూడ్చుకోకపోతే ఎలా?...
ఇదివరకు నీకీ అలవాటు లేకపోయింది. ఈక్షణం నండన్నా ప్రారంభించు ఇంద....ఈ బ్రాండ్ చాలా మంచిది మంజూ! ప్రతి నెలా నేను రెండు మూడు టిన్నులు తెప్పిస్తుంటాను. చాలా మైల్ గా ఉంటాయి. లంగ్సల్ కేమీ దెబ్బ తగలదు అన్నది " కళ్యాణి.
మంజరి తనకొద్దంటే  వొద్దన్నది.
"ఇవ్వాళంటే నువ్వు కాల్చనన్నా నేనూరుకోను గానీ, ఇంకోరైతే   ఊరుకొంటారా? నువ్వు తప్పకుండా సిగరెట్ కాల్చి తీరవలసిన సందర్బాలు బోలెడొస్తాయి. అప్పుడు దేబెముఖం వేసుకొని దిక్కులు చూడనన్నా చూడాలి. లేదా ఆ నిమిషం నుండే కొత్తగా ప్రారంభించనన్నా ప్రారంభించాలి. ఆ గొడవలేవో అప్పుడు పడటంకన్నా, ముందుగానే వాటన్నింటికి మనం అలవాటుపడి ఉండటం మంచిది. మాటవరసకు మన ప్రసాదే సిగరెట్ కాల్చమన్నాడనుకో, నువ్వుకాదంటావా? అనవు. అనకూడదు కూడానూ! సొసైటీలో మూవ్ అవుతున్నప్పుడు అందరికన్నా ఓ అడుగు ముందుండాలిగానీ, వొకర్ని చూసి నేర్చుకొనే స్థితిలో మనముండకూడదు. మనం వొకళ్ళకు  నేర్పేటట్టుగా  ఉండాలి. కాబట్టి డియర్! ప్లీజ్ ట్రై" అన్నది కళ్యాణి సిగరెట్ ను మంజరికిస్తూ.
మంజరి సిగరెట్ తీసుకొంది. చూపుడువేలు బొటనవేలు కలిపి వాటి మధ్యన సిగరెట్ ను ఇరికించింది.
"నో నో అలాకాదు" అన్నది పకపకలాడుతూ కళ్యాణి మరీ చుట్టను పట్టుకొన్నట్టు పట్టుకోకు, అలా సుతారంగా మధ్య వేలికి చూపుడు వేలికి మయంగా సిగరెట్టుఉండాలి.
ఊఁ......గో (ఆ )న్ ఇంద లైటర్."
"మంజరి కాస్సేపు సిగరెట్ కేసిచూసి, నోట పెట్టుకోబోయి చప్పున తీసేస్తూ ఏమిటోనక్కా! నాకు సిగ్గుగా ఉంది" అన్నది.
"సినిమా దైలాగ్సును కాస్సేపన్నా మరచిపోదాం మంజూ! ముందు నువ్వు కానివ్వు. తరువాత మాట్లాడుకొందాం" అని కళ్యాణి తొందర చేసింది.
మంజరికిక తప్పలేదు. అయిష్టంగానే సిగరెట్ ను వెలిగించింది. పొగ ముక్కూ, నోట కమ్ముకొని మంజరి ఉక్కిరి బిక్కిరయింది. డానికి తోడుగా ఉమ్మి తడికి సిగరెట్ నాని పైకాగితం విడిలిపోవడంతో నాలుక నిండా పొగాకు నలుసులు అతుక్కున్నాయి. మంజరి సిగరెట్ ను మూలకు విసిరేసి పుక్కిలించింది.
"నువ్వేమన్నా అనుకో అక్కా! ఈపని మాత్రం నా వల్లకాడు." అన్నది మంజరి.
కళ్యాణి సన్నగా నవ్వింది.
"పిచ్చిదానా! మనం చేసిన పనులన్నీ మనవల్ల అయ్యేవేనా? మొదట్లో నేనైనా ఇలాగే ఉక్కిరి బిక్కిరయ్యాను. రెండు మూడు రోజులకల్లా అదే అలవాటయిపోయింది. ఒక్కసారి నేనూ సరసాపందాలు పెట్టుకొని కాల్చం. నాకన్నా అదే రెండు సిగరెట్లు ఎక్కువ వూదేసింది.
"అసలీ అలవాటు నీకెందుకయిందక్కా?" అన్నది మంజరి.
"ఏదో పిక్చర్ లొ నా వేషం సిగరెట్ కాల్చవలసి వచ్చింది. ఎన్ని టేక్ లు తీసినా నాచురల్ గా రాలేదు. అందుకని పనిమాలా రెండు మూడు రోజులు అద్దంముందు కూచుని ప్రాక్టీస్ చేశాను. ఆఖరికి అలవాటయి పోయింది. ఈఅలవాటు నాకు బాగా అచ్చొచ్చింది. మంజూ? మనదగ్గరి కొస్తుంటారే "ఫ్రెండ్స్"-వాళ్ళు మన చేత సిగరెట్ కాల్చిందాకా వదలరు. కష్టమెర్స్ ను  డిసప్పాయింట్ చేసి మనం బావుకొనేదేమీ లేదు గనక -వారి కన్నా మిక్కిలిగా మనం కాల్చేస్తుంటాం."
మంజరి ఏదో అనబోయింది. ఫోన్ మోగడంతో అదేదో అనలేదు. కళ్యాణి విసుక్కుంటూ వెళ్ళి రిసీవర్ అందుకొని రెండు నిమిషాలు ఊఁకొట్టి ఇస్సురంటూవచ్చి కూచుంది. ఆవిడ ముఖం ఇప్పుడుత్సాహంగా లేదు. సోఫాలో జారగిలబడి కళ్ళు  మూసుకొంది. రెండు కణతలూ  గట్టిగా నొక్కుకొంది.
"ఏమయిందక్కా?" అన్నది మంజరి ఆదుర్దాగా.
కళ్యాణి పెదవి విరిచి ఏమీ లేదన్నది.
"నేనమ్మను నువ్వేదో దాచిపెడుతున్నావు.....పోనీ ఆరోగ్యం బావోలేకపోతే  పడుకొందాం పద! ఈ కబుర్లు ఎప్పుడైనా చెప్పుకొందాం....
"అదేంకాదు మంజూ!" అన్నది కళ్యాణి నిట్టూరుస్తూ.
"నేను చేయగలిగిందేమైనా ఉంటే చెప్పు అక్కా! నీకోసం తప్పకుండా దాన్ని చేస్తాను" అన్నది మంజరి.
"నిజంగానా మంజూ?"
"నీతోడు" అన్నది మంజరి.
కళ్యాణి అమాంతం మంజరిని కౌగిలించుకొని ముద్దుతో ముంచెత్తింది.
"నేవ్వెంత మంచిదానివి మంజూ! భగవంతుడు నా చెల్లెల్ని తీసుకెళ్ళినందుకు తిట్టానుగానీ అంతకన్నా మంచి చెల్లెల్నిస్తాడనుకోలేదు" అన్నది కళ్యాణి.
"నాతో చెప్పడానికింత బాధపడటమెందుకక్కా!"
కళ్యాణి రెండు మూడు నిమిషాలపాటు మౌనంగా ఉండిపోయింది.
"ఊఁ"అన్నది మంజరి చెప్పమన్నట్లుగా.
"ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తోచకుండా ఉన్నది మంజూ! తీరా చెప్పాక అక్కయ్య ఇలా అన్నదేమిటా అని నువ్వు అనుకొని పోతావేమోనని భయపడుతున్నాను."
"భగవంతుడి సాక్షిగా నేనలా ఎప్పటికీ అనుకోను. నా మనస్సింకా నీకు తెలీదు అక్కా! కావాలంటే నా చర్మం వొలిచి నీచేత పెడతాను సరా?" అన్నది మంజరి.
కళ్యాణి చేయి చాపింది, మంజరి ఆ చేతిమీద తన చేతినుంచింది.
"ఏమిటంటే మంజూ....పోన్లే అమ్మాయ్ ఈ గొడవ లొదిలేద్దాం. ఇంకేమన్నా చెప్పు" అన్నది కళ్యాణి.
ఈసారి మంజరి కళ్ళల్లో నీటిదజీరలు మొసులెత్తాయి. కళ్యాణి సున్నితంగా వాటిని తుడిచేసి, మంజరి కళ్ళను ముద్దుపెట్టుకొంది.
"నిజంగా నేనిటువంటి విషయాలు నీతో అనకూడదు. కానీ తప్పని సరైంది. నువ్వేమనుకొన్నా సరేనని చెబుతున్నాను అన్నది కళ్యాణి సన్నగా నిట్టూర్చి!"
"రాజన్ అని నాకు తెలిసిన కోటేశ్వరుడొకాయనున్నాడు మంజూ! ట్రిచ్ లొ ఆయనకు చాలా వ్యాపారాలున్నాయి. దాదాపు వంద లారీలు నడుపుతుంటాడు. అతను నాకు చాలా రోజుల నుండీ తెలుసు, చాలాసార్లు నన్ను ట్రిచ్ కూడా తీసుకెళ్ళాడు. ఇందాకనే వచ్చాట్ల నన్ను హోటల్ కు రమ్మని ఫోను చేశాడు. నా ఆరోగ్యం బావుంటే,ఏ గొడవాలేకపోను....ఇతన్నీ డిసప్పాయింట్ చేయడం నాకిష్టం లేదు. నా 'బ్లూ మెర్కూరీ' కారు అతనే ప్రెజెంట్ చేశాడు. నాకోసం చాలా వేలు తగలేశాడు. ఆరుమాసాల తరవాత. ఇవ్వాళ్ళొచ్చి  ఫోన్ చేశాడు. ఏం చెయ్యడానికి నాకు తోచకుండా ఉంది!" అన్నది కళ్యాణి.
మంజరికి విషయమంతా అవగాహనయింది. కానీ తను మాత్రం ఏమని చెబుతుంది గనకా!
"నీతో కులాసాగా గడువుదామని నిన్ను పిలిపిస్తే మధ్యలో ఇదో తంటసం తగులుకొన్నదాయె చచ్చి.. డాక్టరేమో  అసలు కాలన్నా కడపకూడదంటాడు, నన్నడిగితే మనబోటి వాళ్ళకు ఆరోగ్యం చెడిపోవడమంటూ జరక్కూడదు మంజూ! ఇప్పుడు చూడు ఎలాంటి గండకత్తెర వచ్చి పడిందో నామీద గౌరవంతో నువ్వు మాట దక్కిస్తావనుకో మంజూ! నువ్వు లేకపోతే నాగతేం గానా అని?"
మంజరి కళ్ళు మూస


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS