Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 28

"మనం  మధ్యాహ్నం ఓసారి డైరెక్టర్ గార్ని కలుసుకొందాం. వారు నాకు తెలుసుకో. ఇలాంటి సందర్ ఊళ్ళో మగవారి మాటల కన్నా, లేడీ ఆర్టిస్టుల మాటకు  ఎక్కువ విలువ ఉంటుంది. అయితే ఆ విజయం నువ్వు అప్రోచ్ కావడంలో, ఎదుటివారిని కన్విన్స్ చేయడంలో ఉంది. డైరెక్టరే ఫైనల్ అధారిటీ కాదు - ఈ రోజుల్లో ప్రొడ్యూసరే అన్నీ చూసుకొంటున్నాడు. అయినా ఓసారి ప్రయత్నిద్దాం. ఒక్కమాట మాత్రం నిజం మంజరీ! మనమేదోవిధంగా ఈ క్యారెక్టర్ ఎలాట్ మెంట్ ను మార్చుకోకపోతే నీ ఫ్యూచరంతా పాడయిపోవడం ఖాయం. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం వ్యవహారం నడపాలె, అన్నాడు చలపతి.
అదృష్టవశాత్తూ డైరెక్టర్ శంకరంగారు ఇంట్లోనే ఉన్నాడు. మంజరినీ, చలపతినీ చూసి ఆయన చాలా ఆదరించాడు.
"ఇప్పుడో ముఖ్యమైన పనిమీద మీదగ్గకొచ్చాం, మీరు కాస్త మార్జిన్ మాకు చూపెడ్తే మీరూ, మేమూకూడా బాగుపడవచ్చునన్నాడు చలపతి.
శంకరం అదేమిటో చెప్పమన్నాడు.
"ఆ మధ్య వెంకటేశ్వర్లుగారనే ప్రొడ్యూసర్ గారు నవకళా చిత్రాలయ సంస్థను స్థాపించిన సంగతి మీకు తెలిసిందే! భాగస్థుల  పేచీవల్ల ఆ కన్సరన్ మూసివేశారు. మళ్ళా కొత్త బ్యానర్ తో, శ్రీరామూ పిక్చర్స్ అనుకోండి - సోషల్ తీదామనుకొంటున్నారు. ఆయన మాకు తెలుసు. మరోవారంలో వచ్చేస్తున్నాడు. నిన్ననే యాభైవేలు బాంక్ చేశాం. వచ్చేప్పుడు ఇంకో లకారం పట్టుకొస్తున్నాడు. ఈలోగా నన్ను అన్ని ఏర్పాట్లు చేయించమన్నాడు. సరే చాతనైందేదో  చేస్తున్నాననుకోండి....మీరు బిజీ డైరెక్టరని నాకు తెలిసినా ఈ పిక్చర్ బరువుకూడా మీ మీద ఉంచుదామనుకొంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి!" అన్నాడు చలపతి.
ఈ గొడవలన్నీ శంకరంగారికి  ఇది వరకే  తెలుసు గనక, ఆయన అన్నింటికీ ఊఁ కొట్టేశాడు. చివరి వాక్యానికి మాత్రం అభ్యంతరం చెప్పాడు.
"నాకిప్పటికే నాలుగైదు పిక్చర్లున్నాయి. అదీగాక మంచి కధ లేందే నేను టేకప్ చేయను. మీరిచ్చే డబ్బు ముఖ్యం కాదు. మీ పిక్చర్ ముఖ్యం నాకు. ఓ అణాకానీ సినిమాకు నేను డైరెక్టర్నని  చెప్పుకొని యాభైవేలు సంపాదించడంకన్నా, ఓ సక్సెస్ ఫుల్ పిక్చర్లో పనిచేసి పాతిక పుచ్చుకోడం మంచిదనుకొనే బాపతు మనిషిని" అన్నాడు శంకరం.
"అవునండీ! అంచాతే నేను మీదాకా వచ్చాను. మీ దగ్గరే మన్నా కదుంటే సరేననుకోండి. లేదా ఓ నెలరోజులు మనమలా కలకత్తా వెళ్ళొద్దాం. ఓ బాక్సాఫీస్ హిట్ బెంగాల్ పిక్చర్ స్టోరీని కొనేదాం. లేదంటారా ఓ మరాటీ పిక్చర్ స్టోరీని పుచ్చుకోవచ్చు. ఏం చేస్తే బావుంటుందో కూడా మీరే ఆలోచించాలి. ఆ భారమంతా మీదేననుకోండి. అయితే మీకేం కావాలో చెబుతే ఈ రోజు నెవరికి ఫోన్ చేస్తాను" అన్నాడు చలపతి.
"తొందరేంముంది. లెండి వార్ని రానివ్వండి!" అన్నాడు శంకరం.
"అలా అనకండిబాబూ! నేనిక్కడ గోళ్ళు గిల్లుకొంటూ కూచున్నానని మావాడనుకోకూడదు గదా! మీ టెరమ్స్  అండ్ కండిషన్స్ నాకు చెప్పకండి, ఒక్క ఫిగర్ చెవినేయండి చాలు."
శంకరం చాలా సేపు గొణిగాడు గానీ చలపతి వదల్లేదు.
"అందరిదగ్గరా నలభై తీసుకొంటున్న సంగతి మీకు తెలుసు గదా!" అన్నాడు శంకరం.
"అన్ని కంపెనీల సంగతి వేరు, నా సంగతి వేరూ నండీ! నేనంత ఇచ్చుకోలేను. పాతిక్కు సెటిల్ చేయించండి. పిక్చర్ సక్సెస్ కావడమే జరిగితే - అందులో ఢోకా లేదనుకోండి - మీ రన్నంత  మొత్తమూ, మీరిందు కొప్పుకొన్నట్లు ఫోన్  చేస్తున్నాను" అన్నాడు చలపతి.
శంకరం అడికాదనీ, ఇది కాదనీ నే చెప్పేది వినమనీ, అబ్బే మరీ తక్కువనీ అంటున్నాం, చలపతి విననంటే విననని చెవులు మూసుకొన్నాడు.
"ఇహ మీరేమన్నా నాకు వినిపించదని  ముందే చెప్పాను. మీరిందుకు వొప్పేసుకొన్నారు. బస్, అంతే! ఏం మంజరీ! మరి వెళదాంలే" అన్నాడు చలపతి లేచి నిలబడి.
మంజరి లేవలేదు. సన్నగా నవ్వింది.
"ఏమ్మా! ఏమిటి సంగతి?" అన్నాడు శంకరం.
చలపతి కూడా కూచుండిపోయాడు.
మంజరి ఇంకోసారి నవ్వి, చలపతి కేసి తిరిగి తలదించుకున్నది.
 "అసలు సంగతేమిటో చెప్పాలమ్మాయీ! ఇలా నీలోనువ్వు ....ఒహో! ఆ విషయమేనా?" అన్నాడు చలపతి.
"ఊఁ" అన్నది మంజరి, మరీ సిగ్గుపడుతూ, నేలచూపులు చూస్తూ.
"ఏమిటీ?" అన్నాడు డైరెక్టర్.
"ఆఁ నా తలకాయ. అదేనండీ! జయా ఫిలింస్ వారి పిక్చర్ లో ఈవిడ కిచ్చిన కారెక్టర్ నచ్చలేదట. దీన్ని మార్చి ఇంకేదన్నా ఇవ్వమని అడుగుతానన్నది. ఆ ముక్క నేనే చేబుతానంటే విన్నదికాదు. తను స్వయంగా బయలుదేరి వచ్చింది" అన్నాడు చలపతి. మంజరి వైపు చూసి నవ్వుతూ "సరే ఇహపద. బాబయ్యగారితో చెప్పావుగదా! ఆ గొడవేదో ఆయనగారే చూసుకొంటారు , లేమరి"
శంకరం ఇరుకులో పడిపోయినట్లు కనిపించాడు.
క్యారక్టర్లన్నీ పంచటం అయిపోయిందమ్మా! ప్రయత్నించినా ఏమాత్రం ఉపయోగపడుతుందో చెప్పలేను. అయినా ఆ క్యారెక్టర్ మరీ అంత తీసికట్టు కాదేమోనని పిస్తుంది. ఏదైనా జయా వారికి అట్టే సెన్స్ ఉన్నట్టు లేదు బ్రదర్, వజ్రం ముక్కలాంటి ఆర్టిస్టు చేత్తుల్లో ఉంటే  బ్రహ్మాండంగా ఎక్స్ ప్లాయిట్ చేయవచ్చుగదా - అలాంటి కారెక్టరివ్వడమేమిటండీ నాబొంద" అని విసుక్కొన్నాడు శంకరం కూడా.
చలపతి డైరెక్టర్ గారు చూడకుండా మంజరికి కన్ను మలిపాడు.
"అదే బాబయ్యా నా బాధ, ముందుగా ఈ అనింపార్టెంట్ రోల్ లో కనిపిస్తే, నాకు ఫ్యూచరేముంటుంది చెప్పండి? మీరు కలగచేసుకొంటే తప్పకుండా లాభిస్తుందని నాకు నమ్మకం. దయచేసి మీరెలాగైనా నాకీ ఉపకారం చేయాలి." అని కళ్ళనీళ్ళ  పర్యంతమయింది మంజరి.
చలపతి ముగ్ధుడైపోయాడు. మమజ్రి ఇంత అద్భుతంగా నటిస్తుందని అతనూ అనుకోలేదు.
"ఓసి పిచ్చిదానా! నువ్విన్నిసార్లు చెప్పకు శంకరంగారు మాటంటే తిరిగిపోయే మనిషికాదు. ఆయన చూస్తానంటే, చేస్తాననే అర్ధం. ఇహ పోదాంపద."
శంకరం గారు ఏం చెప్పడానికి అవకాశమివ్వకుండా నే మంజరీ, చలపతి సెలవు పుచ్చుకొని బయటకొచ్చేశారు.
"థ్యాంక్స్  మంజరీ! అదీ పద్ధతి" అని అభినందిచాడు చలపతి.
"పనవుతుందంటారా?" అన్నది మంజరి.
"కాదు. కాదని నాకు ముందే తెలుసు, ఈ రోజుల్లో డైరెక్టర్ల మాటవినే ప్రొడ్యూసరెవరమ్మా  నీ పిచ్చి గానీ!"
"అయితే ఈ గొడవంతా దేనికండీ?" అన్నది మంజరి.
"కనీసం మనవాడు అడ్డుపుల్ల వేయకుండా ఉంటే చాలు. ఒక మనిషి మరో  మనిషికి ఉపకారం చేయలేకపోవచ్చు గానీ అపకారం చేయగలడు కనీసం దాన్ని వుండి మనం తప్పుకొన్నా తప్పుకొన్నట్టే" అన్నాడు చలపతి.
పోతున్న టాక్సీని పిలిచి, ఇద్దరూ ఎక్కారు.
"మన మొక్కసారి రావుగార్ని కలుసుకొందామంటారా?" అన్నది మంజరి.
"ఎందుకట? ఈ పనిమీదనే?"
"ఊఁ"
"లాభంలేదు ఆయన చెయ్యగలడు గానీ, చెయ్యడు. నా అనుమానం మూర్తిగారి మీది కోపమంతా నీ మీద తీర్చుకుంటున్నాడేమో నని. బహుశా ఈ క్యారెక్టరు నీకివ్వమని ఆయనే చెప్పిఉంటాడని కూడా నేననుమానిస్తున్నాను."
మంజరి నిట్టూర్చింది.
"నువ్వలా బెంబేలు పడకు మంజరీ! ఇంతలో కొంపమునిగిందేమీ లేదు మనమోసారి మెహతాను కలుసుకొంటే బావుంటుందను కొంటాను. ఇప్పుడు నువ్వు శంకరంతో  చెప్పినదాంట్లో పదోవంతు మెహతా చెవినవేసినా చాలు. ఆయన మనకు తెలిసినవాడే గదా!" అన్నాడు చలపతి.
మిగతా విషయమంతా మంజరికి గ్రాహ్యమయిపోయింది.
ముందుగా ఫోన్ చేసి, ఆ తరువాత మెహతా రమ్మన్నవేళకు ఆయన ఆఫీసుకు వెళ్ళింది మంజరి. రాత్రి తొమ్మిది గంటలు దాటిందేమో, ఆఫీసంతా నిర్జీవంగా ఉన్నది, ఒకరిద్దరు పనివారు తప్ప ఎవ్వరూ లేరు.
"వణక్కం అమ్మా!" అన్నాడు కుర్రాడు.
"వణక్కం వణక్కం" అన్నది మంజరి.
"ఆయన మీదదావున్నాడు. ఇంకో అమ్మతో రహస్యం మాట్లాడుతా ఉండురు. మీ రీడనే కూసోండిమా! నానుదా సొల్లుదును" అన్నాడు వాడు.
పది నిమిషాలకల్లా వాడు నవ్వుకొంటూ వచ్చి, మంజరిని మేడమీదికి చేర్చాడు. మెహతా వరండాలో పెద్ద సోఫాలో కూచుని ఉన్నాడు. ఎదురుగా బల్లమీద సీసాలూ, గ్లాసులు ఉన్నాయి.
"రా" అన్నట్టు తలతోనే సైగచేశాడు మెహతా.
మంజరి కళ్ళు "ఇంకో అమ్మ" కోసం వెదుకుతున్నాయి.
"నీ ఎగ్రిమెంట్ గొడవలన్నీ తీరిపోయాయా?" అన్నాడు మెహతా.
"ఆఁ" అన్నది మంజరి.
మెహతా ఓ గ్లాసును నింపి సగం తాను తాగి బల్లమీద పెట్టాడు. మెగతా సగాన్ని మంజరి పుచ్చుకొన్నది.
"మీ దయవల్ల అన్నీ సక్రమంగా అయినాయండీ! ఇప్పుడింకో పనిమీద వచ్చాను. మీరు దాచకుండా చెబుతానంటే  అడుగుతాను" అన్నది మంజరి.
మెహతా ఏదో అనబోయాడు లోపలినుండి గాజుల చప్పుడయింది. మంజరి గుండెలు ఘల్లుమన్నాయి.
"ఇలానా ఫర్వాలేదు." అన్నాడు మెహతా, లోపలికి వినబడేలాగా.
ఓ నిముషంపాటు నిశ్శబ్దం. ఆ తరువాత మెత్తని అడుగుల చప్పుడు....తలుపు వెనకనుండి ఓ అందమైన ఆకారం వరండాలో కొచ్చింది.
మంజరి శరీర మంతటా రక్తం ఎగసన చిమ్మింది! సోఫాలో స్థిమితంగా కూచోలేక పోయింది.
తనీ స్థితిలో కళ్యాణిని చూడగలనని మంజరి మాత్రం ఊహించినా ఇంత  దిమ్మరపాటు ఆవిడకు కలగకపోను.
కళ్యాణికూడా మంజరికేసి వోరగా చూసి నవ్వి నవ్వనట్లుగా నవ్వింది. మంజరి అక్కడున్నందుకు కళ్యాణికూడా కొంత ఇబ్బంది పడినట్లు కనిపించింది. కళ్యాణి నిలబడే ఉంది. తను ప్రక్కకు జరుగుతూ, చేత్తో సైగచేశాడు మెహతా. కాస్సేపు తటపటాయించి సన్నగా నిట్టూర్చి అతని పక్కనే కూచుంది మంజరి. ఇంకోపక్కగా  మరో కుర్చీని లాక్కొన్నది కళ్యాణి వారిద్దర్నీ పరస్పరం పరిచయం చేశాడు మెహతా.
కళ్యాణి బల్లమీద సీసాను మూడు గ్లాసుల్లోకి వొంపి, మంజరికి, మెహతాకు అందించాక తనుకూడా వొకటి తీసుకొంది. కళ్యాణి కీ గొడవ మామూలేనేమో! ఆవిడ చాలా సాదాగా మాట్లాడుతోంటే  మంజరి ముడుచుకు పోసాగింది. గ్లాసు బల్లమీద పెట్టి, కళ్యాణి బుగ్గలు పుణికాడు మెహతా. ఆవిడ 'అబ్బా' అని చిన్న కేకవేసి, వల్ల మాలిన బాధను అభినయించింది. కోపమూ, నవ్వూ కలగలిపి  చూసి, మూతిని సున్నాలాగా  ముడిచేసింది.
"మరిలా చేస్తుంటే నేనిక్కడ ఉండను బాబూ! బుద్ధిమంతుడైన పిల్లకాయలా వుండాలి" అన్నది  కళ్యాణి.
"ఉండను"
"అయితే"
కళ్యాణి లేచి మెహతా రెండు చెంపలూ సున్నితంగావాయించింది. ఆ మహాకాయుడు బ్రహ్మానందపడిపోయి మంజరిమీదికి వరిగిపోయాడు.
"ఇక్కడ మరీ చలిగా ఉంది" అన్నాడు మెహతా.
"వెళ్ళి దుప్పటి కప్పుకొని నిద్రపోండి. నేనూ మంజరీ వెడతాం" అన్నది కళ్యాణి.
"దట్సాల్" అన్నాడు మెహతా ఓ మూలుగు మూలిగి సోఫాలోంచి లేస్తూ మంజరిని చెయ్యి పట్టుకొన్నాడు కళ్యాణి వెనక నిలబడి నవ్వుతూ ఉంటే ప్లీజ్ అన్నాడు మెహతా.
"ఉఁహు నేను రాను" అన్నదేగానీ, వారివెనక తనూ గదిలో ప్రవేశించింది కళ్యాణి -
తెల్లవారుజామున మూడుగంటలకుగానీ, మంజరి తను వచ్చిన విషయం చెప్పలేకపోయింది. అదీ - కళ్యాణి తను గొడవ చెప్పుకొన్నాకనే ఆ ధైర్యమైనా ఆవిడకు కలిగింది.
కళ్యాణి ధోరణి చూస్తుంటే, తనీ రంగంలో ఎంత వెనకబడి ఉన్నదో మమజ్రికి తెలిసివచ్చింది. తను నిజంగా కళ్యాణికి కొత్త అయినా మెహతా మైకంలో పడినప్పుడు ఎన్నో సంగతులు మాట్లాడింది. ఆవిడతో మాట్లాడుతుంటే కత్తిమీద నడిచినట్లుగా ఉంటుంది. ఏమాత్రం ఎక్కడ పొరబాటు పడినా పాదాలు చీల్చుకు పోతాయి. అంత జాగ్రత్తగా అడుగులు వేయాలి.
మెహతా పొట్టమీద ఓ చిన్న పోటు పొడిచి పకపకా నవ్వింది కళ్యాణి.
"అవునుగానీ, రేపోసారి జయా వారికి ఫోన్ చెయ్యకూడదూ! నేనిక్కడున్నాను గదా, హీరోయిన్ గా చంద్రావతిని బుక్ చేస్తున్నారట ఎందుకు? నేను చచ్చాననే అనుకొన్నారా?" అన్నది కళ్యాణి.
మెహతా నవ్వి ఊరుకొన్నాడు.
"రేపు సాయంత్రానికి నాకా కంపెనీ నుండి ఏ వర్తమానమూ రాకపోతే రాత్రికి  మళ్ళా వస్తాను, ఈసారి  ఈపొట్టను కాస్తా చీల్చేసి మరీ వెడతాను." అన్నది  కళ్యాణి.
మెహతా వోసారి బొజ్జ నిమురుకొన్నాడు.
"నేను కింద ఉంటాను. మంజరిని తొరగా పంపు....ఏమోయ్, వేగిరం వచ్చేస్తావుగదూ! నువ్వు "మే మే" అంటూ కూచుంటే, ఇలా రాత్రల్లా నిన్ను తినేస్తూనే ఉంటాడు. ఏం మందు మప్పుతాడోగానీ, మహానుభావుడు.
మనల్ని కుక్కల్ని చేసి వదిలి పెట్టాడు మంజూ! ఇతనితో విరోధం పెట్టుకొని తెగతెంపులు చేసుకొందామన్నా  చేసుకోలేకుండా ఉన్నాం, మనల్ని కట్టేసుకొన్నాడు" అన్నది కళ్యాణి.
ఈమాటల ఫలితం అద్భుతంగా కనిపించింది మంజరికి. కళ్యాణి వెళ్ళాక మెహతా చెక్కిళ్ళ నోసారి చూసి "మీరొప్పుకోరుగానీ, ఆ రెండు బుగ్గలనూ చిదిమెయ్యాలనిపిస్తోంది  సుమా!" అన్నది మంజరి.
మెహతా నవ్వాడు.
"మీరలా నాలాంటి దాని మీద మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకండి బాబూ వారం రోజులనుండి, మీరే కళ్ళల్లో మెదులుతున్నారు. పదే పదే వస్తే" మీరు చులకనయి పోతానేమోనని భయం. ఏమయితే అదే అవుతుందని ఈ రోజున తెగించి వచ్చేశాను.....అన్నట్టు అసలు సంగతి చెప్పడమే మరచి పోయాను. జయా ఫిలింస్ వారితో రేపు కళ్యాణిని గురించి మాట్లాడేప్పుడు నావిషయం కూడా చెబుదురూ వాళ్ళునాకో దిక్కుమాలిన క్యారెక్టరిస్తున్నారు. మీదాన్ని గదా నన్నిలా అవమాన పరచడానికి వాళ్ళకెన్ని  గుండెలుండాయండీ!"
కిందినుండి హారన్ వినిపించింది.
అబ్బబ్బా ఈ కళ్యాణిది అన్నిటికి ఒకటే తొందర" అన్నది మంజరి విసుగ్గా. తరువాత మెహతా కేసి తిరిగి 'మాట' అన్నది. అతను దగ్గర కొచ్చాక ఒక్కసారి ఢీ కొట్టి ప్రాణాలన్నీ  ఇక్కడే వోదిలిపోతున్నాను. పోనీ ఓపని చెయ్యకూడదండీ! నన్ను మీ పెర్సనల్ సెక్రటరీగా వేసుకొంటే తీరిపోతుందిగదా, ఆపని-
మరోసారి హారన్ వినిపించింది.
"వస్తాను" అంటూ మంజరి ఆఖరిసారిగా, మెహతాను ఆలింగనం చేసుకొని గబగబా మెట్లుదిగి కిందికి వచ్చేసింది. పోర్టికోలో తనకోసం ఎదురుచూస్తూ ఉంది కళ్యాణి. ఆవిడకారు ఆ మసగ వెలుతురులో కూడా నీడలీనుతూ ఉంది. కళ్యాణి స్టీరింగ్ ముందు కూచున్నది. మంజరి ఆఖరు మెట్టుమీద నిలబడి వున్నది.
కమాన్ రావేం? అన్నది కళ్యాణి.
మంజరి నిశ్శబ్దంగా వచ్చి కళ్యాణి సరసనే కూచున్నది.
గేటుదాటి  రోడ్డుమీది కొచ్చాక "తలుపు సరిగ్గా పడలేదు మంజూ! ఓసారి లాగివెయ్యి" అన్నది కళ్యాణి.
నిర్మానుష్యమైన తారురోడ్డుమీద, లైట్లకాంతి కురికి ఇంకిపోతుంది. చల్లగాలి రయ్ మని  కారులోకి దూసుకు పడుతోంది.
"ఏమంటున్నాడు?" అన్నది కళ్యాణి ఎక్సిలేటర్ మీది కాలును మరింత నొక్కుతూ.
మంజరి ఏమీ అనలేదు.
కళ్యాణి ఫక్కున నవ్వింది.
"అలా బెరుకు పడతావేం మంజూ! ఇలాంటిచోట్ల అరమరికలు పనికిరావు. ఇదంతా నిజమని వాడూ అనుకోడు. మనకు అంతకన్నా లేదు. మొత్తానికి....అదేమిటి? అలా వున్నావేం?"
మంజరి ప్రాణాలన్నీ ఉగ్గబట్టుకొని తేపింది.
"మరేంలేదు, మోతాదు మించిందనుకొంటాను....నన్ను  మాయింటిదగ్గర దింపేయండి. వెళ్ళి హాయిగా నిద్రపోతే తప్ప లాభం లేదు" అన్నది మంజరి.
"ఇప్పుడేం నిద్రోయ్?" అన్నది కళ్యాణి నవ్వుతూ, "నువ్వింకా కొత్తదానివి గనక నీకు తెలీదుగానీ, ఈ ఫీల్డులో నిధ్రసంగతి సరే సరి - ఒక్కోసారి తిండి తినడానిక్కూడా టైం దొరకదు. అలా నేను షూటింగుల  కెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. కంటినిండా నిద్రపోయి ఎన్నిరోజులయిందో  గాని తలుచుకొంటే భయమేస్తుంది మంజూ! ముందు ఏదన్నా హోటల్ కెళ్ళి కాస్త తిందాం. ఆ తరువాత మా ఇంటికెళ్ళి కాస్సేపు కన్ను మూసుకొందాం" అన్నది కళ్యాణి.
"ఇప్పుడు నేనేమీ తినలేను."
"అయితే ఇంటికే పోదాం పద!" అని కాదును ఇంకో రోడ్డు పట్టించింది కళ్యాణి.
పావుగంట తరువాత ఓ పెద్ద మేడముందు కారాగింది. గుర్ఖా సలాంకొట్టి  గేటు తీశాడు. పోర్టికోలో కారాగంగానే, ఇంకెవరో వచ్చి, కారు తలుపు తీశారు. కళ్యాణి చకచకా మేడ మెట్లెక్కుతోంటే  మంజరి ఆవిడను అనుసరించింది చల్లగా హాయిగా ఉన్న ఆ గదిలో ఖరీదైన ఫర్నీచర్, ఎంతో అందంగా అమర్చి ఉన్నది.
"స్నానం చేస్తావా?" అన్నది కళ్యాణి.
"ఉఁహు"
"అయితే కూచో, ఇప్పుడే వస్తాను"
కళ్యాణి వెళ్ళిపోయిన వెంటనే, ఇంకెవరో వచ్చి మంజరి కాలి జోడు విప్పి తీసుకెళ్ళారు. ఇంకో మనిషి పొగలుగక్కుతున్న కాఫీ బల్లమీద పెట్టి వెళ్ళిపోయింది.
మంజరి దాన్ని ముట్టుకోలేదు. కళ్యాణికోసం ఎదురుచూస్తోంది  పావుగంటకల్లా కళ్యాణి ఇంగ్లీషు వాళ్ళ పంపిణిమీద గౌను వేసుకొని చడావులు టకటకలాడించుకొంటూ వచ్చింది.
"తాగలేదేం?"
"మరి మీరో?" అన్నది మంజరి.
ఇద్దరూ కాఫీ తాగారు.
"మరీ తూగులాడుతున్నావు, పద పడుకొందాం" అన్నది కళ్యాణి.
మంజరికి ఆ గదిలో మరో మంచం కనిపించలేదు.
"అలా చూస్తున్నావేం  మంజూ! మనిద్దరికీ ఈ మంచం సరిపోదా?" అన్నది  కళ్యాణి నవ్వుతూ ఈ రోజు నీదగ్గర పడుకోవాలనిపించిందోయ్. అందుకే ఇంటికి తీసుకొచ్చాను.
ముందు కళ్యాణి పడుకొని దిండ్లు సరి చేసుకొన్నది. ఆ తరువాత మంజరిని దగ్గరగా తీసుకొని ఓ చెయ్యి బుజంమీదుగా వీపు వైపుకు వెళ్ళాడేసి దగ్గరగా తీసుకొన్నది. కళ్యాణి మంజరి కళ్ళుమూసుకొన్నది గానీ నిద్రపోలేదు.
"నిద్రొస్తోందా?"
"లేదు" అన్నది మంజరి కళ్ళు తెరచి.
కళ్యాణి కళ్ళు నీటితో నిండి ఉన్నాయి.
"ఏమిటది?" అన్నది మంజరి.
"ఏమ్మా ఉండమ్మా మంజూ! నిన్ను చూస్తుంటే మా చెల్లెలు జ్ఞాపకానికొస్తోంది. మరేంలేదు."
"ఇప్పుడు-"
"లేదు చనిపోయింది. ఈ మాత్రం డబ్బు అప్పుడేగనక  నా దగ్గరుంటే దాని ప్రాణాన్ని రూపాయలు పోసి కొని వుందును. అప్పుడు నాకు ఒక్క పిక్చరు కూడా లేదు. వేషం ఇస్తామన్న వాళ్ళందరూ మొండిచేయి చూపించారు. రోజులు గడవడమే  అంతంతమాత్రంగా ఉన్నది. మా చెల్లెలి కేమో టైఫాయిడొచ్చింది....మంచి మందిచ్చి ఉంటే తప్పకుండా బతికేది. కేవలం నా దరిద్రం వల్లనే అది చనిపోయింది. రెండేళ్ళపాటు నాకు మతికూడా స్థిమితంగా లేదు. ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకొందామని, మద్రాసు నుంచి పారిపోదామని అనిపించింది. ఎవరన్నా చేరదీస్తే శాశ్వతంగా అతనితో ఉండిపోదామని కూడా అనుకొన్నాను. చాలామంది నా ముఖం స్క్రీనుకు పనికిరాదన్నారు. నా డైలాగ్స్ లో మాడ్యువేషన్ ఉండదన్నారు. నాజాతకం మంచిది కాదన్నారు....పట్టుమని ఆరేళ్ళు కాలేదు...కట్టుకుపోయినన్ని పిక్చర్లు వస్తున్నాయి. చంద్రావతిని ఈ రోజుల్లో సాయంచేయమని అడిగితే ఓ రూపాయి నోటిప్పించి పంపేసింది. ఈరోజున ఆవిడ కుడిచెయ్యయితే నేను ఎడమ చెయ్యిగా ఉన్నాను. ఆవిడ పాతిక తీసుకొంటున్నది. నేను పదిహేను, ఇరవైదాకా డిమాండ్ చేస్తున్నాను. దేనికైనా ఓర్పు కావాలమ్మా! రెండోది జాతకఫలం ఉండాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా మనకు పిక్చర్లో వేషం ఇప్పించగలరేగానీ దాన్ని  బాగా చేయడం మన చేత్తుల్లోనే ఉన్నది. ఉన్న క్యారక్టరు పాడుచేశామనుకో....బోరెత్తడం లేదుగదా మంజూ?" అన్నది కళ్యాణి.  
"పాపం"
"పడుకో పాపం! ఈ దిక్కుమాలిన సొదతో  నీకు నిద్ర లేకుండా చేశాను."
మంజరికి వొట్టు పెట్టినట్టుగా కునుకు రానేలేదు. తను ఇంటిదగ్గర బయలుదేరేప్పుడు కళ్యాణిని చూడవలసి వస్తుందని కూడా అనుకోలేదు. అటువంటిది ఈ క్షణాన తనావిడ సరసన పడుకొని ఉన్నది. కళ్యాణి నటించిన సినిమాలు తను చాలా చూసింది. లవ్ సీన్స్ లో ఎంతో అద్భుతంగా ఆవిడ నటిస్తుంది. సెక్సప్పీల్ రోల్స్ వేయడంలో ఎంతో అద్బుతంగా ఆవిణ్నుబీట్ చేసే ఆర్టిస్టే లేదు. ఆడవాళ్ళను కూడా సమ్మోహింపచేయగల కళ్యాణి హై సొసైటీ లేడీలాగా సినిమాల్లో కనిపించే కళ్యాణి లోలోపల ఎన్ని అగ్ని పర్వతాలు, ఎన్ని శూన్య ప్రదేశాలు, అగాధాలు, దాగొని ఉన్నాయో తలుచుకొని మంజరి విచాలితురాలయింది.

                                                          13
జరగవలసిన వన్నీ సక్రమంగా జరిగిపోయాయి. కళ్యాణి హీరోయిన్ కావడమే  కాదు, మంజరికి తను కోరుకొన్న వేషం కూడా దొరికింది.
ఫిలిం పరిశ్రమ మెహతా మకుటం లేని మహారాజని లోగడ మనం చెప్పుకొన్నాం. రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవలేనట్లే ఈ రాజు తలుచుకొంటే సినిమా రంగంలో కాని పనికూడా లేదు.
"మీ కధ నాకు నచ్చింది కానీ హీరోయిన్ ను మీరు కళ్యాణిని బుక్ చేస్తే  బావుంటుందనుకొంటాను. అందులోను అది హెవీ కారెక్టర్, కళ్యాణి తప్ప ఇంకోరు దాన్ని లీడ్ చేయలేరు" అన్నాడు మెహతా ఆ మొన్నాడు తనని కలుసుకోడానికొచ్చిన జయా ఫిలింస్ వారితో.
ప్రొడ్యూసర్ల ప్రాణాలు అన్నుబట్టాయి. వారేమాటా అనే లోగానే మెహతా తన రెండో నిర్ణయాన్ని కూడా బయట పెట్టేశాడు.
"నెలకు వేయి చొప్పున పుచ్చుకొనే ఆర్టిస్టు చేత రెండు వేల రూపాయల చాకిరీ తీసుకోకపోతే నువ్వు మంచి ప్రొడ్యూసరువు  కావన్నమాటే! ఆవిడకు, ఫలానా, కారెక్టరివ్వండి....మరి మీరు చెక్ రాయించనా?" అన్నాడు తను అవతలి వారు ఆలోచించడానికి కూడా అవకాశ మివ్వకుండానే!
అయినా జయావారు, ఆలోచించారు. తమ దగ్గర డబ్బులేక పోలేదు గానీ, ఆ మొత్తం ఓ పిక్చర్ తీయడానికి ఎంత మాత్రం చాలదు. అదీగాక.. ఈ బిజినెస్ మాగ్నెట్ ను కాదని ఈ ఫీల్డులో బ్రతకడం అసంభవం! వీడిక్కావలసిన విధంగా సినిమా తియ్యనన్నాతియ్యాలి. లేదా - అసలా ఆలోచనే మానుకోనన్నా మానుకోవాలి. వాళ్ళు సినిమా తియ్యడానికే నిస్చయించుకొని, చెక్కు తీసేసుకొన్నారు. మెహతా చెప్పినట్లుగా వాళ్ళిద్దరకూ  ఆయా వేషాలు కూడా ఇచ్చేశారు.
కళ్యాణి మీద జయావారికి అట్టే కోపం లేదు. ఆవిడ ఫస్టు రాంక్  హీరోయిన్ కాదన్న మాటేగానీ, వాళ్ళకేమాత్రం  తీసిపోయేది కాదు. మంచి వేషం దొరికి, మంచి డైరెక్టర్ చేతిలో పడితే కళ్యాణి ఆ కాస్త గనుపునూ దాటేయ గలుగుతుంది. కానీ, మంజరి మాటేమిటని? మంజరిని నెల జీతమ్మీద బుక్ చేయడమన్నది ఒక కారణమే అయినా, అంత కన్నా ముఖ్యమైనది మంజరి అందం. ముందు పైకి రాగల లక్షణాలున్న అమ్మాయి. ఆ పిల్ల చేత నాలుగైదు సెక్స్ ప్పీల్స్ డాన్సులు పెట్టిస్తే  దేశాన్ని దోచిపారేస్తుంది. దీనికి తోడుగా కొత్త ఆర్టిస్ట్ గనక కాల్ షీట్స్ దొరుకుతాయి. టైము కొస్తుంది....
అన్నిటికి పనికొస్తుంది. ఇవన్నీ వారు ఆలోచించాకనే నెలజీతం విషయం ప్రస్తావించారు. అయితే వారనుకొన్న దానికి వ్యతిరేకం జరిగింది. మంజరి సామాన్యురాలు కాదనీ, ఆవిడ వెనక మందీ మార్బలం ఉన్నదనీ ఆ మందికి సినిమా పరిశ్రమలో మాంచి పలుకుబడి ఉన్నదని తేలిపోయింది. ఇహ ముందెప్పుడోచేసుకోవలసిన పనులన్నీ ఆవిడ ముందుగానే చేసుకొన్నదంటే, ఆవిడపట్ల జాగ్రత్తగా ఉండడమే కాదు,, అంతేమిటో కూడా తేల్చుకోవాలి. సమయం వచ్చినప్పుడు అణిచిపారేయాలి కూడాను.
అయిదారు మాసాల తరవాత, అటువంటి సమయం రానే వచ్చింది. పోలీసు కుక్కకున్నంత గ్రహణశక్తి వున్న చలపతి, ఆ సమయాన్ని కనిపెట్టి మంజరిని ప్రోత్సహించాడు.
"నేననుకొన్నంతా అయింది. ఇప్పటి కప్పుడే ప్రొడ్యూసర్ల మధ్య కాంపిటేషన్  పెరుగుతోంది. జయాఫిలింస్ వారు నిన్నోటామిల్ పిక్చర్లో యాక్టు చేయమని అడగబోతున్నారు." అన్నాడు చలపతి.
"నిజంగానా?" అన్నది మంజరి, ఆ మాటలు నమ్మలే నన్నట్లుగా.
"నీకీ వార్త సంతోషంగా వుంది గదూ?" అన్నాడు చలపతి.
"మీకుమాత్రం సంతోషం కాదా? పట్టుమని పది మాసాలన్నా కాలేదు గదా, ఇప్పటికప్పుడే  ఆరవ పిక్చర్లో వేషం దొరకడమంటే మాటలేనుటండీ? నాకన్నా ముందునుంచీ ఈ ఫీల్డులో ఉన్న వాళ్ళున్నారు. వారికింకా తెలుసు పిక్చర్స్ లోనే మంచివేషాలు  దొరకడం లేదు. అంతదాకా దేనికి? మన కళ్యాణి సంగతే చూడండి!"
చలపతి నిట్టూర్చకపోతే  ఏమనేదో గానీ, అతని వాలకం చూసి, మాటను మధ్యలోనే ఆపేసింది మంజరి.
"తెలివితక్కువదాన్ని గనక, ఇదంతా నామంచికే అనుకొంటున్నాను. కాకపోతే మీరు చెప్పండి, నేను కాదంటేగదా?" అన్నది మంజరి.
"ఇది మంచికోసం కాదననుగానీ, ఇప్పుడు మాత్రం మంచిది కాదంటాను. ఎందుకంటే జయావారి ఎగ్రిమెంటులో నిన్ను వాళ్ళ ఫిలింస్ లో యాక్టు చేయడానికే  బుక్ చేశారు గానీ, ఇతర కంపెనీల వాళ్ళ పిక్చర్సులోకని కాదు. ఐనప్పుడు నువ్వా యితర కంపెనీల సినిమాల్లో వేషాలేయడం దేనికి? అందువల్ల నీకిచ్చే జీతం పెరుగుతుందా? అదీ లేదే!" అన్నాడు చలపతి.
చలపతి చెప్పదలచుకొన్నదాన్ని మంజరి ఏనాడో గ్రహించింది. ఈ కారణంగా జయా వారితో పేచీకి దిగడం మంజరికిష్టం లేదు. అసలు వేషాలు దొరక్క నానాగడ్డీ కరిచే వాళ్ళు కరుస్తుంటే  కాళ్ళ దగ్గరికొచ్చిన బుకింగ్సును కాదనడంలో అర్ధంలేదని మంజరి ఉద్దేశం. అయినా ఆవిడ చలపతి మాటకు ఎదురు చెప్పలేక పోయింది. అతని సలహామీద సినిమా వ్యవహారాల్లో ఆరితేరిన వొక అడ్వొకేట్ ను ఆ రోజునే సంప్రదించింది.
కేసంతా విన్నాక ఆ అడ్వొకేట్ తను యివ్వకూడని సలహా నొకదాన్నిచ్చాడు.
"మీరన్నది నిజమే! బ్రహ్మాండమైన పాయింట్సున్నాయి కోర్టు కెళితే మీరు గెలవడం కూడా ఖాయమే! కానీ, ఆ పని చెయ్యొద్దని నా సలహా! ఫలానా ఆర్టిస్టు పేచీ పెట్టి కోర్టుల కెక్కుతుందనీ తెలిశాక, మీకు బుకింగ్సు  దొరుకుతాయని నేననుకోను, మీ కీ వూళ్ళో మంచి నీళ్ళు కూడా పుట్టవు."
"ఆరవ పిక్చర్లో చాన్స్ రావడమే మీకు గొప్ప. ఒకటి రెండు పిక్చర్సుకు మీకు డబ్బు రాదనుకోండి, పీడాబోయిరి. కానీ ఆ తరువాత మీరు  "ల" కారాలమీద సంపాదిస్తారు. ముష్టి వేయిరూపాయలకోసం మేఉ ఫ్యూచరంతా పాడుచేసుకోవడానికి సిద్దపడితే కేసు గెలిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అయినా మనం తొందర పడకూడదు. జయావారు నా క్లయింట్సే! రేపు నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను." అని సర్దిపంపేశాడు.
జయా ఫిలింస్ వారికి ఈ ఆలోచన కలిగి చాలా రోజులయింది. నెలకు వేయి రూపాయలిస్తూ మూడేళ్ళపాటు ఎగ్రిమెంట్ చేయించుకున్న ఆర్టిస్టు, ఈ మూడేళ్ళపాటూ, తమ స్వాధీనంలో ఉంటుందని, ఆవిణ్ను ఎలా ఉపయోగించుకొన్నా, కాదనడానికి వీల్లేదని, వారి పాదన. మూడేళ్ళ కాలంలోనూ ఆవిడకు చెల్లించే 36వేల రూపాయలనూ, ఇంకో ప్రొడ్యూసర్ నుండి పిండేస్తే, తమ పిక్చర్సులో మంజరిని ఊరికే వాడుకోవచ్చునని వారనుకొన్నారు. మంజరి యాక్ట్ చేసిన రాషెన్ చూసి, ఒకరిద్దరు తెలుగు ప్రొడ్యూసర్లు, అరడజను మంది ఆరవ ప్రొడ్యూసర్లు ముగ్ధులయ్యారు. ఆవిణ్ని బుక్ చెయ్యడానికి చాలామంది సిద్దపడ్డారు కూడాను కానీ, ఇంకో మూడు సంవత్సరాల దాకా మంజరి ఇంకెవరి పిక్చరులోనూ యాక్ట్ చేయడానికి వీల్లేదు. అలా చేయాలంటే జయావారి అనుమతి కావాలి.
ఒక తమిళ ప్రొడ్యూసరు జయావారికి పదిహేను వేలివ్వడానికి అంగీకరించి మంజరి తన పిక్చర్లో యాక్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకొన్నాడు. దీనిమీద ఇంత గొడవ జరిగింది.
అడ్వొకేట్ అడిగిన ప్రశ్నలన్నింటికి జయావారు సమాధానాలు చెప్పుకొచ్చారు.
"అరవ పిక్చర్లో కూడా యాక్ట్ చేయాలని, పొరబాటున మేము ఎగ్రిమెంట్ లో మెన్షన్ చేయలేదు. రైటే ఆవిడ మామీద దావా వేయనూవచ్చు, మేం వోడిపోనూవచ్చు. కానీ ఆ టామిల్ పిక్చర్ కూడా మాదే! మేం దానికికూడా ప్రొడ్యూసర్లం. జయా ఫిలింస్ భాగస్థులందరికీ, ఆ టామిల్ పిక్చర్లో కూడా వాటాలున్నాయి. ఆవిడ యాక్ట్  చెయ్యనంటుందా? అన్నాడు భాగస్థుడు.
"అదేదో అరవ కంపెనీ ఆటగా! అందులో మీకు భాగాలుండుట  మేమిటండీ?" అన్నాడు అడ్వొకేటు.
"మహా బుద్ధిశాలియైన ఆ భాగస్థుడు  మందస్మిత వదనార విందుడయి ఇలా ప్రవచించాడు.
"మహానుభావా! మీరన్నది నిజమే! కోర్టు కెళ్ళక  ముందే నిజం! ఆ గడప ఎక్కాక నిజం చెబుతామా, ఏం చెబుతే గెలుస్తామో అవే చెబుతాం. మేం ఇప్పటికే చాలా   ఏర్పాట్లు చేసుకొన్నాం. మంజరి కోసం అవన్నీ మార్చడం అబద్దం. ఆవిణ్ను  నోరు మూసుకొని పనిచేయమనండీ, లేదా తనని పనిచేయించుకొంటాం. అరవ ప్రొడ్యూసరు నా ఫ్రెండే! అతన్ని నా కంపెనీ బానర్ మీదనే సినిమా తీయమంటాను. అప్పుడుకూడా వేషం వేయనంటుందా మంజరి? అరెస్టు చేయించి జైల్లో పెట్టిస్తానని చెప్పండి" అన్నాడు రెండో భాగస్థుడు.
మంజరిని చాటుగా పిలిపించి రాజీ ప్రతిపాదనలు చేశారు  అడ్వొకేటు.
"అమ్మాయీ! ఇదీ సంగతి, నువ్వు దావా వేయడం దేవుడికి తెలుసు. వీళ్ళే నీ మీద కోర్టు కెక్కబోతున్నారు. నువ్వు సరిగ్గా పని చేయడం లేదని, వేళకు రావడం లేదని, పేచీలు పెడుతున్నావనీ  నీమీద కంప్లెయింట్స్. ఎందుకొచ్చిన గొడవ ఇదంతా? ఆ చలపతి గాడికేం? చెబుతాడు. నీలాంటి వాళను లక్షమందిని చూశాడతను. నువ్వతనితో విరోధం పెట్టుకోవలసిన పని లేదు గానీ, అతనన్నదానికల్లా గంగిరెద్దు లాగా వొప్పుకోవలసిన అవసరం కూడా లేదు. నీసంపాదనమీద బ్రతుకుతున్నవాడి మాటను, నువ్వులెక్క చెయ్యకు, నేను ఎవ్వరికి నష్టం లేకుండా రాజీ చేస్తాను. నువ్వు వొప్పుకుంటావా?" అన్నాడు అడ్వొకేటు.
"చెప్పండి!" అన్నది మంజరి.
జయావారి పిక్చర్సులో వేషాలేసినందుకు,, కంపెనీ నీకు జీతమిస్తూనే ఉంది. అవిగాక వేరే కంపెనీల్లో నువ్వు పనిచేయవలసి వచ్చినప్పుడు, అందువల్ల వచ్చే డబ్బుతో సగం నువ్వు తీసుకో. మిగతా సగం కంపెనీ తీసుకొంటుంది. ఇందువల్ల నీకు అనేక లాభాలున్నాయి. కంపెనీతో నీకున్న సంబంధాలు మెరుగవుతాయి. మంచి మంచి  వేషాలు దొరుకుతాయి. తమ వాటా కోసం జయావారు, నీకు బుకింగ్సు  వెదికి పెడతారు. నీ రేటు కూడా పెంచుతారు. నీకు మంచి పబ్లిసిటీ యిస్తారు. ఇవన్నీ ఆలోచించుకొని, నీ అభిప్రాయం చెప్పు" అన్నాడు అడ్వొకేటు.
మంజరి ఎటూ తేల్చుకోలేక ఉక్కిరి బిక్కిరయి పోయింది. తనను సంప్రదించకుండా రాజీకి వొప్పుకున్నందుగ్గాను, చలపతి ఏమంటాడో నని  ఆవిడ భయపడింది. అయినా చివరికి రాజీకుదర్చమనీ, అందులో ఈ షరత్తులన్నీ  ఉండేలా చూడమనీ మంజరి ప్రాధేయపడింది.
"నా శక్తివంచన లేకుండా చూస్తాను. ఇందుకు జయావారు కూడా వొప్పుకోవాలి. ఇప్పుడా కంపెనీవారు నీ పేరు చెబితేనే మండిపోతున్నారు. రాజీకి, ముఖ్యంగా కావలసింది రెండు పార్టీల మధ్యా సహృద్భావం  ఉండటం. అదిప్పుడు లేదు....నువ్వో పని చెయ్యి, సరాసరి జయా ఫిలింస్  కెళ్లి, వారితో మాట్లాడు,. �


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS