శిరీష నిర్ఘాంతపోయింది. కాస్సేపు నోటమాట రాక నిలబడి పోయింది. కొన్ని క్షణాల తరవాత గొంతు పెగల్చుకుని అడిగింది. "ఏం?" ఎందుకని?"
ఆదిత్య ఏం మాట్లాడలేదు.
"చెప్పరా ఎందుకని? అతను నిన్నేం అన్నాడు?"
"నన్ననడానికి అతనెవరమ్మా?" సీరియస్ గా అడిగాడు.
ఖంగుతిన్నది శిరీష. అడిత్యేనా ఇలా మాట్లాడేది? వీడు పెద్దవాడై పోయాడా? వివేక్ మీదనా ద్వేషం నా మీదనా? అంటే వీడికి తనకీ, వివేక్ కీ ఉన్న అనుబంధం గురించి తెలిసిందా? అది డైజెస్ట్ చేసుకోలేక పోతున్నాడా?
శిరీష కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన ఇంట్లో తను స్వేచ్చగా ఉండడానికి ఈ క్షణం నుంచి తన కొడుకు తనకి రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నడా?
నో! జరక్కూడదు.... తను పూర్తిగా స్వేచ్చా జీవి... ఎంతో కష్టపడి తను నిర్మించుకున్న ఈ స్వేచ్చ ప్రపంచంలో తనని అరికట్టే వాళ్ళు ఎవరైనా తను క్షమించదు అంతే.
అందుకే ఖచ్చితంగా, కఠినంగా అంది. "చూడు అదీ కొన్ని విషయాలు నీకు చాలా అనవసరం అయినవి. నీకిప్పుడు నీ చదువు, నీ కెరియర్ తప్ప మరో విషయం ఆలోచించాల్సిన అవసరం లేదు. నా విషయంలో ఇంకోసారి జోక్యం చేసుకుంటే ఊరుకోను. వివేక్ రావడం నీ కిష్టం లేకపోతె నువ్వు అతనితో మాట్లాడకు నిన్ను నేను ఫోర్స్ చేయను అర్ధమైందా?"
విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఆదిత్య షాక్ తగినట్టు నిలబడిపోయాడు. అలాగా పోనీలే నీకిష్టం లేకపోతె రావద్దని చెప్తాలే అంటుందనుకున్నాడు కానీ శిరీష ఎదురు తిరగడం తనని శాసించడంతో కోపంతో వణికిపోయాడు.
అంటే వివేక్ తనకన్నా వాడే ఎక్కువన్న మాట అనుకున్నాడు. ఆరోజు నుంచీ ఇద్దరి మధ్యా పదిరోజులు మాటలు లేవు. ఆ పది రోజుకూ వివేక్ రాలేదు.
పదకొండో రోజు వచ్చాడు. రాగానే ఆదిత్యను ఆప్యాయంగా పలకరించాడు.
"రిజల్ట్ ఎప్పుడోస్తాయి అదీ!" అంటూ కుశలం అడుగుతూ మాటల్లో పెట్టడానికి ప్రయత్నించాడు కానీ , ఆదిత్య పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు.
ఆరోజు శిరీష బాగా ఏడ్చింది.
"వివేక్ నీకు తెలుసు. నా మనస్తత్వానికి ఎవరితో పొసగదు. మన మనసులు కలిసాయి. నీతో తప్ప నేనెవరితో స్నేహం చేయలేదు. వాడికోసం అన్నీ వదులుకున్నాను. కానీ నాకు మిగిలిన ఒకే ఒక్క ఆనందం నువ్వు నిన్ను వదులుకోమంటుంటే తట్టుకోలేక పోతున్నాను."
"చిన్నపిల్లలా ప్రవర్తించకు శిరీ.... వాడు చిన్నవాడు. ఆడోల్ సెన్స్ లో ఉన్నాడు. ఈ వయసులో వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడే వాడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వేం వర్రీ అవకు. నేను చూసుకుంటాగా." ఓదారుస్తూ అన్నాడు.
"నేనివాళ వాడికోసం నిన్ను వదులుకుంటే రేపు వాడి పెళ్ళయ్యాక నన్ను పట్టించుకుంటాడా? అప్పుడు నాకెంత ఒంటరితనం మిగుల్తుంది? నో...లేదు ....వాడి కోసం నేను చాలా వదులుకున్నాను. కానీ, నిన్ను మాత్రం వదులుకోను. అంతగా అయితే వాడిని హాస్టల్లో చేర్పిస్తాను." వెక్కుతూ అంది.
"ఒకే...ఒకే....చూద్దాం లే అవసరం అయితే అలాగే చేద్దాం. ప్లీజ్ ఏడవకు" కళ్ళు తుడుస్తూ ఆమెని దగ్గరాగా తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు.
తన గదిలోంచి అంతా చూస్తున్న ఆదిత్య పళ్ళు పటపటా కొరకడం అతనికే తెలియలేదు.
ఆ తరవాత శిరీష తన బాధ భానుతో కూడా పంచుకుంది.
"మగపిల్లలతో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియదు శిరీషా. అదే ఆడపిల్ల్లలైతే కొన్ని విషయాలు డిస్కస్ చేయడానికి సందేహిస్తారు. ప్రఖ్యకి నాకూ, ఉత్తెజ్ కి ఉన్న రిలేషన్ తెలుసు. షి నోస్ ఎవిరీధింగ్ కానీ షి నేవర్ క్వశ్చన్ మీ" అంది భానుప్రియ.
"వీడిలా ఎందుకు తయారవుతున్నాడో నాకర్ధం కావడం లేదు భానూ! నేను ముందే చెప్పాల్సిందంటావా?"
"ఏమని చెప్తావు?"
"ఏమో....?"
అదంతా ఆలోచించకు. రేపు కాలేజీలు తెరచి ఇంజనీరింగ్ చదువులో పడ్డాక ఏమీ పట్టించుకోడు. కాలేజీ, ఫ్రెండ్స్, అల్లరి, చదువు ....మెంటల్లీ హి విల్ బి వెరీ బేజీ.. ఈ సిల్లీ విషయాల గురించి ఆలోచించే టైం ఉండదు. ఏదో తెలసీ తెలియక వాగాడు. డోంట్ కేర్. అయినా మన బతుకులు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి కోసం త్యాగం చేయడంతోనే సరా! మనకంటూ కొన్ని ఇండివిడ్యువల్ టెస్ట్స్, ఇండివిడ్యువల్ ఐడియాస్ ఉండకూడదా?"
"నాకూ అదే అనిపిస్తుంది భానూ! అడదేప్పుడూ అటు తల్లి, తండ్రుల కోసమో, ఇటు మొగుడి కోసమో లేక పిల్లల కోసమో మాత్రమే బతకాలి కానీ, తనకోసం తానెప్పుడూ బతక్కూడదా?"
భానుప్రియ నిట్టూర్చింది. "నాకు మాత్రం ఏం తెలుసు శిరీ.. ఈ ప్రశ్నకి సమాధానం ఏ ఆడదానికీ తెలియదు. కానీ సమాధానం లేదని బతకకుండా ఉండకూడదు . బతుకుదాం. మనకోసం మనం మన ఇష్ట్టం వచ్చినట్టు బతుకుదాం." నిశ్చలంగా అంది.
అవును అలాగే బతకాలి అనుకుంది శిరీష.
ఇలా అవుతుండగానే .....రిజల్ట్ రావడం జరిగింది. తల్లులిద్దరూ ఆశించినట్టూ జరగలేదు. ఇద్దరికీ కూడా ఐఐటీ లో ర్యాంకు రాలేదు. ఎంసెట్ లో మాత్రం ఫరవాలేదు. ప్రఖ్య కి జె.ఎన్.టి.యూ లో ఆదిత్య కి మరో కాలేజీ లో సీటొచ్చింది.
శిరీష చాలా బాధపడింది. తానాశించిన విధంగా ఆదిత్య చదువులో ముందుకు పోవడం లేదు. అందుకు కారణం తనేనా? ఎవరికీ చెప్పుకోలేని ఆ బాధకి మనసులోనే బాగా కుమిలిపోయింది.
భాను మాత్రం ప్రఖ్యని ఎడాపెడా తిట్టేసింది. "నీకు వేరే విషయాల మీద కాన్ సేన్ ట్రేషన్ ఎక్కువైంది. అందుకే ఇంత పూర్ రిజల్ట్ " అంటూ మండిపడుతున్న తల్లితో మెల్లిగా అంది మళ్ళీ రాస్తాను మమ్మీ.
"ఏం అవసరం లేదు ఉద్దరించింది చాలు. ఎందులో సీటోస్తే అందులో చేరిపో బిటెక్ చదువు."
అది శాసనం దానికి తిరుగులేదు.
ఇంజనీరింగ్ లో చేరడం జరిగిపోయింది.
కనీసం ఇంజనీరింగ్ అయినా ఒకే కాలేజీ లో చేరాలన్న ప్రయత్నం కూడా ఫలించలేదు. ఒకళ్ళ కాలేజీ సికింద్రాబాద్ అయితే మరొకళ్ళది కూకట్ పల్లి తరచుగా కలుసుకోడం కూడా కుదరడం లేదు.
ఆదిత్య మనసులో సంఘర్షణ అలాగే ఉంది. అటు ప్రఖ్యతో శృంగారం అనుభవించాలన్న కోరికా తీరలేదు. అటు వివేక్ ని ఇంటికి రాకుండా చేయాలన్న పంతమూ నెరవేరలేదు.
ఈలోగా ఇంజనీరింగ్ స్టూడెంట్ గా పందొమ్మిదేళ్ళ వాడయాడు.
ఆరోజు ఆదిత్య పుట్టినరోజు.
శిరీష సెలబ్రేట్ చేయాలనుకుంది. ఖరీదైన రిస్టు వాచీ కొన్నది ఆదిత్య కి. ఆమెతో ముభావంగా ఉండడం చేత ఆదిత్య సెలబ్రేషన్ కి ఒప్పుకోలేదు. ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేస్తాను అన్నాడు.
శిరీష కి బాధనిపించింది. భానునీ, ప్రఖ్య ని, వివేక్ ని, ఆదిత్య స్నేహితులు ఓ నలుగురున్నారు వాళ్ళనీ పిలిచి ఇంట్లో కేక్ కట్ చేయించి డిన్నర్ ఏర్పాటు చేద్దామనుకుంది. ఆ విషయం తెలుసు ఆదిత్యకి. ఆరాబోయే అతిధులో వివేక్ ఉండడం ఇష్టం లేదు కాబట్టి అందుకు ఒప్పుకోలేదు.
మౌనంగా వేయి రూపాయలు ఇచ్చింది.
అవి తీసుకుని వెళ్ళిపోయాడు . ప్రఖ్య, అదీ కాలేజీ ఎగ్గొట్టారు.
"హాపీ బర్త్ డే అదీ!" అంటూ ప్రఖ్య ఆదిత్యకి సెల్ ఫోన్ ఇచ్చింది.
ఆదిత్య మొహం వికసించింది. "సెల్! థాంక్యూ ప్రఖ్యా... థాంక్స్ . నేనే మా అమ్మని సెల్ కొన్నిమ్మని అడగాలను కున్నాను." అన్నాడు.
ప్రఖ్య నవ్వింది.
"నీ దగ్గర డబ్బులెక్కడివి. ఇది కొనడానికి ' అడిగాడు.
"నా పాకెట్ మనీ తో కొన్నాను."
"అయ్యో! పాపం! సారీ...." అన్నాడు.
"ఎందుకు సారీ. నా ఫ్రెండ్ కి గిప్ట్ ఇవ్వకుండా ఎలా?" అంది నవ్వుతూ.
"అయితే నేను నీకు మంచి ట్రీట్ ఇస్తాను ధోలారీధనికి వెళ్దామా?' అన్నాడు.
"ఎంత డబ్బులున్నాయి నీ దగ్గర?"
"దౌజండ్."
"ధోలారీ ధనికి ఆ డబ్బులు సరిపోవు బాబూ! ఏదన్నా మంచి హోటల్ కి వెళ్ళి లంచ్ చేద్దాం . తరవాత మూవీకి వెడదాం." అంది.
ఆ ఆలోచన తనకి రానందుకు నెత్తి మీద మొట్టుకుంటూ "గుడ్ ఐడియా ప్రఖ్యా" అన్నాడు.
"కం...' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది.
వెనకాల ఎక్కి కూర్చున్నాడు. నేనూ త్వరలోనే బండి కొనుక్కోవాలి అనుకున్నాడు.
"అవునూ నీ దగ్గర డబ్బులేక్కడివి?' అడిగింది ప్రఖ్య నాంపల్లి లోని మంచి హోటల్ ముందు స్కూటీ ఆపుతూ.
"అమ్మ ఇచ్చింది.
"దౌజండ్....! ఇంక నువ్వు మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఏదన్నా ఎర్నింగ్ మార్గం చూసుకోవచ్చుగా."
"ఎర్నింగా? ఇప్పుడేగా మనం ఇంజనీరింగ్ లో జాయిన్ అయింది. అప్పుడే జాబ్ ఇవ్వమంటే ఎవరిస్తారు?" అన్నాడు హోటల్ లోపలికి నడుస్తూ.
"జాబ్ అంటే జాబ్ కాదు. మా కాలేజీ లో గర్ల్స్ కూడా పార్ట్ టైం చేసి ఎర్న్ చేస్తున్నారు. నువ్వు కూడా అలా చేస్తే బాగుంటుంది కదా!" అంది.
"ఏం చేయను?" సాలోచనగా అడిగాడు.
"ఏదన్నా...."
"ఒకే ఆలోచిద్దాం " అంటూ ఖాళీగా ఉన్న టేబిల్ దగ్గరకు నడిచాడు.
ఇద్దరూ నాన్, వెజిటబుల్ బిర్యానీ, ఐస్ క్రీం తిని, మిగిలిన రెండు వందల చిల్లర తో సినిమాకి వెళ్ళారు.
సినిమా హలో రష్ లేదు. కపుల్స్ సీటు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఒకళ్ళ నొకళ్ళు హత్తుకుంటూ.
