Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 20

            ఇంతేనా ఈ జీవితం

    "జానకీ!మంచి నీళ్ళీవ్వు " అంటూ లోపలికి వచ్చి నీరసంగా కుర్చీలో వాలాడు ఆనంద్.
    టి.వి లో సీరియల్ చూస్తున్న జానకి గభాల్న లేచి లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్ళు తెచ్చిచ్చింది.
    అయన తాగిందాకావుండి ఖాళీ గ్లాసు తీసుకుని రెండు క్షణాలు అయన వైపు చూసి మౌనంగా ఇక్కడి నుంచి కదిలి వంటగది లోకి వెళ్ళిపోయి కాఫీ కలపసాగింది జానకి.
    ఈమధ్య ప్రతిరోజూ ఆనంద్ అలాగే నీరసంగా వస్తున్నాడు. ఆవిషయం గమనిస్తున్నా ఏమి చేయలేని నిస్సహాయత.
    అరవై ఏళ్ళు వచ్చిందాకా సర్వీసు చేసి, భాద్యతలు పూర్తీ చేసుకున్నా ఇంకా అయన ఒక ప్రవైటు కంపెనీలో ఉద్యోగం చేయాల్సి రావడం విషాదం.ఇలాంటి విషాదం ఇంకోటి వుందా అనిపిస్తుంటుంది ఆవిడకి.
    కాఫీ కలిపి తీసుకొచ్చి "కాఫీ తీసుకోండి" అంది. ఆనంద్ కళ్ళు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు.
    ఆవిడ టీవి వాల్యూమ్ తగ్గించి కుర్చీ అయన దగ్గరగా జరుపుకుని కూర్చుంది అయన కళ్ళు వాల్చుకుని కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు.
    అయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారు. అని అడగాలనిపించినా అడగలేదు. కారణం ఆవిడకి తెలుసు కనుక.
    ఆయనైనా, అవిడైనా ఆలోచించేది ఒకటే. ఈ జీవితం ఇంతేనా? సమాధానం లేని ప్రశ్న అయినా ఆప్రశ్న వాళ్ళ గుండెల్లోంచి పదే పదే , ఓ బుల్లెట్ లా దూసుకు రావడం మాత్రం మానదు.
    ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి తిరిగి వెనక్కి వాలుతూ అన్నాడు "నీరసంగా వుంది జానకీ."
    జానక్కి బాధగా అనిపించింది. దుఖం కూడా వచ్చింది కానీ, ఏం మాట్లాడకుండా మౌనంగావుండిపోయింది.
    ఉద్యోగం మానేయండి అనాలనిపిస్తుంది. మానేసి ఏం చేయను? అప్పేలా తీర్చను అని అయన నవ్వే నవ్వు గుర్తొస్తోంది . ఆనవ్వు ఆవిడ చూడలేదు. చూసి సహించలేదు. నిజమే అప్పేలా తీరుతుంది?
    ఒకటి కాదు , రెండు కాదు పదిహేను లక్షలు.
    ఉన్న ఇద్దరాడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నది అయన ఆశయం. అందుకే ఇద్దరినీ బిటెక్ చదివించాడు.
    ఎం.ఎస్ చేస్తే కానీ అమెరికాలో మంచి జాబ్ రాదు. ఎం.ఎస్ చేస్తామంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక తీర్చుకునే కండిషన్ మీద బ్యాంకు ఋణం తీసుకుని మరీ అమెరికా పంపించాడు.
    ఎం.ఎస్ అయిపోయిన రెండేళ్ళు దాకా ఇద్దరికీ మంచి ఉద్యోగాలు దొరకలేదు. తండ్రిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి గా షూరిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడు. 
    ఈలోగా గ్రీన్ కార్డు వున్న కుర్రాడిని పెళ్ళి చేసుకుంటే అక్కడ సెటిల్ అవచ్చని ఆయనకి నచ్చచెప్పి వాళ్ళు ప్రేమించిన కుర్రాళ్ళ నే పెళ్ళి చేసుకుంటామంటే ఇద్దరికీ ఏడాది తేడాతో ఇంటి మీద లోన్ తీసుకుని ఘనంగా పెళ్ళి చేశాడు.
    అనుకున్నట్టే పెద్దమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య అనుకున్నాడు. ఆ పిల్ల కోసం చేసిన అప్పు తనే తీర్చుకుంటుంది లే అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తనది కంట్రాక్టుఉద్యోగం అనీ, క్లయింట్ కమిషన్ పోగా చాలా తక్కువ చేతికి వస్తుందని మంచి ఉద్యోగం వచ్చాక తీరుస్తాననీ అంది.
    మరికొంత కాలానికీ చిన్నమ్మాయి కి కూడా ఉద్యోగం దొరికింది. అది కూడా కాంటాక్ట్ ఉద్యోగమే. రావడంతో పెద్దమ్మాయి పాడిన పాటే పాడింది.
    ఆనంద్ కి రిటైర్ మెంట్ వయసు దగ్గరకు వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది. వాళ్ళ చదువు కోసం చేసిన అప్పు , ఇంటి మీద పెళ్ళిళ్ళ కు చేసిన అప్పు వడ్డీ కడుతున్నా ఎక్కడా తరుగుతున్న ఆనవాలు కనపడలేదు. ఐదేళ్ళు దాటినా ఎంత అప్పు తీసుకున్నాడో అంతా అలాగే కనిపిస్తోంది.
    రోజులు గడిచోపోతున్నా ఇద్దరిలో ఎవరూ కూడా వాళ్ళ చదువుల కోసం తీసుకున్న బ్యాంకు ఋణం గురించి, మాటవరసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవటం ఆనంద్ కి భాధకన్నా ఆశ్చర్యాన్ని కలుగజేయసాగింది. చూసి,చూసి తనే ఓసారి గుర్తు చేశాడు. "ఏమ్మా మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి గుర్తుందా? నేను వడ్డీ కడుతున్నాను ప్రతినెలా."
    "తీరుద్దాం నాన్నా, ఏంటో మా సంపాదనంతా ట్యాక్స్ లు కట్టడానికి క్రెడిట్ కార్డు కట్టడానికి సరిపోతోంది. జీతాలు సరిపోవడం లేదు. అందుకే ఇంకా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకోలేదు" అంది పెద్దమ్మాయి.
    దాదాపు చిన్న కూతురు కూడా అదే అంది. అవునేమో దేశం కాని దేశంలో వాళ్ళ సమస్య లేంటో నాకేం తెలుసు అనుకున్నాడు.
    సరేలే ముందు అప్పు తీర్చేస్తే తరువాతి సంగతి వాళ్ళే చూసుకుంటారు. లేకపోతే ఈ వడ్డీ చక్రవడ్డీ అయి అసలుని మించిపోయేలా వుంది అనుకుంటూ ఇల్లమ్మి వచ్చిన డబ్బుతో రెండు అప్పులూ తీర్చేశాడు. మరికొంత అప్పు మిగిలి వున్నా దాదాపు తీరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
    అప్పు తీరింది. అద్దె ఇంట్లో బతకాల్సి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మిగిలింది. అయినా కూతుళ్ళు తనకి ఇల్లు కొనిస్తారన్న ఆశ, నమ్మకం ఆయన్ని వదలలేదు. ఈలోగా రిటైర్ అయిపోయాడు.
    ఆ సందర్భంగా కూతుళ్ళు, అల్లుళ్ళు వచ్చారు అమెరికా నుంచి. ఆడంబరంగా పెద్ద ఎత్తున షష్టి పూర్తీ , రిటైర్ మెంట్ ఫంక్షన్ చేశారు తల్లుదండ్రులకి ఖరీదైన బట్టలు, బంగారు ఉంగరాలు కొనిచ్చారు.
    బంధుమిత్రు లంతా అదృష్టవంతుడివోయి పిల్లలు రత్నాలు అన్నారు. పొంగిపోయాడు. నా పిల్లలు నిజంగా రత్నాలు అనుకున్నాడు.
    పదిరోజుల్లో ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఇద్దరమ్మాయిలు తండ్రితో చిరాగ్గా అన్నారు. "ఇదేం ఇల్లు నాన్నా అసలు బాగోలేదు. పాత ఇల్లు. ఈ బాత్రూం లేంటి? ఈ పెచ్చులూడిపోతున్న గోడలేంటి? ఇలాంటి ఇంట్లో వుండడం ఏంటి అసహ్యంగా ఇల్లు మారండి. మంచి ప్లాట్ లోకి వెళ్ళండి."
    నిజమే. అమెరికా పిల్లలుండే ఇల్లు కాదు. అమెరికా పిల్లల తల్లితండ్రులుండే ఇల్లు అంతకన్నా కాదు అనుకున్నాడు. ఇంత బతుకు బతికీ ఇంటెనకాల చచ్చినట్టు గెజిటెడ్ ఆఫీసర్ గా రిటైరయి, పైగా పుట్టిన దగ్గర్నుంచి ఏనాడూ అద్దె ఇంట్లో ఉండని ఆనంద్ కి ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండడం నామోషీగా అనిపించింది. వెంటనే రిటైర్ మెంట్ బెనిఫిట్స్ లో ఋణశేషం పోగా మిగిలిన పాతిక లక్షలకి పెన్షన్ మీద మరో పదిహేడు లక్షలు అప్పు చేసి రెండూ కలిపి ఒక అపార్టు మెంటు తీసుకున్నాడు.
    ఫలానా అపార్టుమెంటు తీసుకున్నాను మీకు నచ్చిందా అంటూ పిల్లలిద్దరికీ బ్రోచర్స్, ఫోటోలు పంపించాడు.
    "చాలా మంచి పని చేస్తున్నావు నాన్నా తప్పకుండా తీసుకో" అన్నారిద్దరూ.
    "నెలకి ఇరవై వేలు ఇఎంఐ కట్టాలి ఎలా తీరుస్తారు?' అయన నిర్ణయానికి విస్తుపోతూ అడిగింది జానకి.
    "బంగారం లాంటి ఇద్దరాడపిల్లల్ని అమెరికాలో పెట్టుకుని ఈ అనుమానం ఏంటి పిచ్చిదానా?' అన్నాడు గర్వంగా.
    "అంటే వాళ్ళు కడతారని మీ ఆశా? వాళ్ళు సరే అన్నారా? వాళ్ళల్లో ఎవరు కడతారు? పెద్దదా? చిన్నదా? ఏమీ తెలుసుకోకుండా మీరింత సాహసం చేయడం బాగా లేదు. ముందు వాళ్ళతో మాట్లాడండి" అంది జానకి.
    "అబ్బా నీకన్నీ అనుమానాలే జానకీ.... ఉన్న ఇల్లు వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు తాలుకూ అప్పు తీర్చడానికే గా అమ్మేశాను. ఆ విషయం వాళ్ళకి తెలియదా? మనం అద్దె ఇంట్లో వుంటే వాళ్ళకి మాత్రం బాధగా వుండదా?" అన్నాడు ఎంతో నమ్మకంగా.
    "భాధ వుండడం వేరు, బాధ్యత తీసుకోవడం వేరు. నా మాటవిని రాత్రికి వాళ్ళిద్దరితో మాట్లాడండి"అంది ఖచ్చితంగా.
    ఆవిడ పోరు పడలేక ఆ రాత్రే ఫోన్ చేసి "మీ అమ్మ ఇట్లా అంటోంది మీ సమాధానం ఏంటమ్మా" అనడిగాడు పెద్దమ్మాయిని.
    "అదేంటి నాన్నా అసలా అనుమానం ఎందుకొచ్చింది అమ్మకి" అంది పెద్దమ్మాయి.
    చూశావా నా కూతురు అన్నట్టు గర్వంగా చూశాడు భార్య వైపు. మర్నాడు చిన్నమ్మాయి తో కూడా మాట్లాడి కన్ ఫర్మ్ చేసుకుని రెండు రోజుల్లోలోన్ కి అప్లయి చేయడం, ఉన్నదబ్బులో కొంత అడ్వాన్స్ ఇవ్వడం చేశాడు. త్వరలో నే ఇల్లు కొనడం, గృహప్రవేశం చేయడం జరిగింది. కూతుళ్ళకి, అల్లుళ్ళకి కొరియర్ లో ఫొటోలతో పాటు ఖరీదైన కానుకలు కూడా పంపించాడు.
    అప్పటికి బ్యాంక్ బ్యాలన్స్ లక్షా ముప్పై వేలుంది. నెలకి ముప్పై వేలు చిల్లర పెన్సన్ . మొదటి రెండు నెలలు ఇరవై వేల ఇ.ఎం.ఐ తనే కట్టాడు. లక్షా ముపై వేలు కాస్తా ఎనభై నాలుగు వేలకి చేరింది.
    మూడో నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు "ఒక నెల నువ్వు, ఒక నెల చెల్లాయి కడతారా? లేక ప్రతినెలా చెరిసగం కడతారా? నేను ఇప్పటికే రెండు నెలలు కట్టేశాను" అనడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS