నేను 'నేను' కాను

రావు మేస్టారు రిక్షాలో వెడుతూ ఆగి బిగ్గరగా కేకేశారు-- "శోభనా చలం! ఏవోయ్!" అని.
అతను వెనక్కి తిరిగి చూసి, "నమస్కారం , మేష్టారూ !" అంటూ రిక్షా దగ్గరికి వెళ్లాడు.
"ఎందాకా?' అన్నారు మేస్టారూ.
"హోటలు కి....పిండా కూటికి" అన్నాడతను.
"ఛ ఛ! అవెం మాటలోయ్!....రిక్షా ఎక్కు నీకివాళ పెళ్లి భోజనం పెట్టిస్తా."
శోభనా చలానికి నోరూరింది. హోటలు తిండి తినీ తినీ నోరు చచ్చి పోయింది. పెళ్లి భోజనం అనేసరికి ఏవేవో గుర్తు కొచ్చాయి.
"ఎవరి పెళ్లి, మేస్టారూ?' అంటూనే అట్టే మొహమాట పడకుండా రిక్షా ఎక్కేశాడు.
"వస్తున్నా" అన్నారు మేస్టారూ మామూలుగా.
క్లాసులో ఎవరైనా స్టూడెంటు లేచి ఏదైనా ప్రశ్న వేస్తె మేస్టారూ అలాగే అంటారు. అంటే తాపీగా జేబులోంచి సనాసావు పొట్లం తీసి ఊడదీసి , ఎంచుకుని అర్ధరూపాయ బిళ్ళంత పెద్ద పీట వక్కని బల్ల మీద పెట్టి, జాగ్రత్తగా పొట్లం కట్టి జేబులో పెట్టేసుకుని , వక్కని మధ్యగా ఒక్కసారి గట్టిగా ఊది, నోట్లో కి ఎగారేసుకుని , నాలుకతో దాన్ని కుడి బుగ్గకి తోసి, అప్పుడు -- "ఆ! ఏంటీ అన్నావ్?' అంటారు.
మళ్లీ అప్పుడు ప్రశ్న వెయ్యాలి. ఇక అయన ఆ ప్రశ్నకి జవాబు చెప్పటం మొదలు పెడితే చుట్టూ పట్టుల ఉండే నూరు ప్రశ్నలకి జవాబులు వచ్చేస్తాయి.
"ఎనీ డౌట్?' అని అయన అడిగితె నూట ఒకటో ప్రశ్న అడగగల తెలివి గలవాడు హైస్కూలు మొత్తం మీద ఉండడు. అయన బోధన విధానం అలాంటిది!
ఇప్పుడు రిక్షాలో కూడా మేస్టారు తను మామూలు కార్యక్రమం అంతా క్రమంగా కానిస్తుంటే శోభనా చలం చిరునవ్వుతో చూస్తూ ఉండి పోయాడు.
పక్క బుగ్గకి వెళ్లాక "ఆ! ఏవిటీ అన్నావ్?' అన్నారు.
ఆ ప్రశ్న వినేసరికి శోభనా చలానికి నవ్వు పైకి వచ్చేసింది. "మేస్టారూ! నేనిందాక అడిగిన ప్రశ్న మీకు నిజంగానే గుర్తు లేదా?' అన్నాడు.
మేస్టారు గొల్లున నవ్వేశారు. "భలే వాదివోయ్! మరి ఈ ప్రశ్న క్లాసులో ఎప్పుడూ వెయ్యలేదే?' అనడిగారు.
"అప్పట్లో మీ స్టూడెంటు గా నాకు చాలా భయం ఉండేదండి."
"మరిప్పుడో?'
"ఇప్పుడు....నిజం చెప్పాలంటే భయం పూర్తిగా పోయి, దాని స్థానంలో భక్తీ ఆక్రమించు కుందండి" అన్నాడు అణకువగా శోభనాచలం.
"భయం లో కూడా కొంత భక్తీ లేకపోలేదు" అని మేస్టారింకా ఏమో చెప్పబోయారు.
అయన చెప్పేది వినాలని అతనికీ ఉంది. కానీ తానిప్పుడు ఎవరి పెళ్ళికి వేడుతున్నాడో తనకి తెలియదు. అది తెలుసు కోవాలి.
"ఇంతకీ పెళ్ళేవరిదో..." అంటుండగా "అది చెప్పను" అన్నారు మేస్టారు అది సస్పెన్స్ అన్నట్టు! "నీకు తెలిసిన వాడే! చూస్తె నీకే తెలిస్తుందిగా? పద. తినబోతూ రుచులెందుకు?"
శోభనా చలానికి చిత్రంగా ఉంది. ఎవరి పెళ్ళికి వేడుతున్నాడో తనకి తెలియనే తెలియదు. అయితే అతని కిప్పటికే బాగా ఆకలి వేస్తుంది. పెళ్లి భోజనం అనగానే ఆశపడి అనాలోచితంగా రిక్షా ఎక్కేశాడు. పెళ్లి ఎప్పుడో, భోజనా లేప్పటికి ఏర్పాటు అవుతాయో ఏమీ అర్ధం కాకుండా ఉంది.
"మేస్టారూ! భోజనాలు ఎప్పటి కౌతాయో ఏమో, కాస్త టిఫినేదైనా తిని కాఫీ తాగి వెడదాం" అన్నాడు.
"అబ్బెబ్బే! అంత అవసరమేమీ లేదు. భోజనాలు ఈసరికి సిద్దమై ఉంటాయి. ముహూర్త మైనా ఇంకా ఇరవై నిమిషాలే ఉంది. మనం త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు సప్లయర్ చేతికి మన జుట్టు అందిస్తే పెళ్ళికి వెళ్ళనే లేము."
శోభనా చలానికి సంతోషం వేసింది! రిక్షా దిగటం , విస్తరి ముందు కూర్చోవటం, పది నిమిషాల్లో సుష్టుగా భోజనం చేసి పెళ్లి ముహూర్తానికి అందుకోవటం!
వాహనయోగం, సుఖ భోజన ప్రాప్తి, శుభకార్యాలలో పాల్గొనటం-- ఇవీ ఈ వేళ తన దినఫలాలు!
"ఈ ఏటితో బి.ఎస్. సి, అయి పోతుంది కదూ నీకు?"
"అవునండి. వచ్చే ఏటికి పొలాల నన్నీ హలాల దున్నీ........."
"ఏం? ఉద్యోగం చెయ్యవా?"
"జీవనానికి సరిపడా సొంత భూములున్న వాళ్ళు కూడా ఉద్యోగాలకు ఎగబడితే వాటినే ఆధారం చేసుకు బతక వలసినా వాళ్ళేమై పోతారు చెప్పండి?"
"సభాష్
!" అంటూ మేస్టారు శిష్యుడి భుజం తట్టారు. "నాకు నచ్చావోయ్! అయితే ఒక పని చెయ్యి" అంటూ వక్కని పటుక్కున కొరికారు. "పెద్ద పీటీ మహా రుచిగా ఉందోయ్! నీకు అలవాటు లేదు గాని!"
"అవునండి. అలవాటు లేదు."
"నాకు తెలుసు కదుటోయ్! అయినా ఈ అలవాటు ఏమంత మంచిది కాదులే! అయితే నీకు సిగరెట్ల అలవాటుందను కుంటా?"
"కొద్దిగా' అంటూ నసిగాడు శిష్యుడు.
"అయితే మరి కాల్చు కోవే? ఫరవాలేదు, కాల్చు" అని నవ్వేశారు. "నేనంటే భయం లేదుగా? ఉత్త భక్తే గా !ఫరవాలేదు."
శోభనాచలం కూడా నవ్వాడు. "మా నాన్నగారన్నా నాకు భయం లేదండి. అయినా అయన ముందు కూడా ఎన్నడూ కాల్చను."
"కాల్చక పొతే బుర్ర పని చెయ్యదు. మంచి ఆలోచనలు రావు. పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అప్పుడు ఎదుటి వారి మాటలు వినాలన్నా, చేష్టలు చూడాలన్నా విసుగ్గా ఉంటుంది. కొండో'కచో కోసం రావటం కూడా కద్దు. అందుకని నా మేలు కోసం కాల్చమంటూన్నాను. అంతేగాని ఆ సిగరెట్టు కాలిస్తే నీకేదో ఆరోగ్యం పెరుగుతుందని, బలం వస్తుందనీ కాదు."
ఇద్దరూ నవ్వుకున్నారు.
శోభనా చలం జేబులోంచి సిగరెట్టు పెట్టె, అగ్గి పెట్టె తీశాడు గాని కాల్చలేదు-- బహుశా భక్తీ లో కూడా ఉండే కొంత భయం వల్ల కావచ్చు!
"ఇందాకా మీరేదో చెప్పబోయారు...."
"అవును, చెప్పబోయాను కదూ..... ఏం లేదు. బి.ఎస్. సి కాగానే వెంటనే పెళ్లి చేసుకో! మరో ముఖ్య విషయమేమంటే పల్లెటూరంటే ముచ్చట పడే అమ్మాయినే చేసుకో."
"మా వాళ్ళేదో ఆ ఆలోచనలోనే ఉన్నట్టున్నారండి."
"శుభం!" అంటూ ముందుకు చూసి, "ఆ! అదేగా కన్యకాపరమేశ్వరి సత్రం? ఆపవోయ్ రిక్షా!" అన్నారు.
మేస్టారు రిక్షా కి డబ్బు లిచ్చేశారు. అతన్ని వెంట బెట్టుకుని సరాసరి వంట వసారా లోకి వెళ్ళారు. పెళ్ళివారు అట్టే మంది లేరు. సందడి చాలా తక్కువగా ఉంది.
"సీతం పిన్నీ!....ఏమేవ్, సీతం పిన్నీ!....చూడూ, ఇదుగో , ఇతను నా ప్రియ శిష్యుడు. అన్ని విధాలా యోగ్యుడు. చక్కగా భోజనం పెట్టు. మొహమాట పడతాడేమో జాగ్రత్తగా వడ్డించు....తరవాత ఆ పెళ్లి అయ్యే హల్లో కి తీసుకొచ్చి దిగబెట్టు . ఏం'! అన్నారు మేస్టారు ఒక పూర్వ సువాసినితో.
"అంత చేప్పాలిత్రా , వెంకులూ, నాకు తెలీదూ? నువ్వు తొందరగా వెళ్లు. అవతల హడావుడి పడుతున్నారు." అందామె.
"ఇదుగో....వెడుతుంటే! కూర్చోవోయ్! కూర్చో! సిగ్గుపడకు. పడి సరిగ్గా తినక 'ఆ హోటలు కి పోయి తిన్నా బాగుండేది' అని మనస్సు లో నువ్వే మారుమూలగా అనుకున్నా నేనోప్పను. మరి నేను హల్లో ఉంటానూ" అంటూ వెళ్ళిపోయారు మేస్టారు.
"కూర్చో నాయనా!" అంటూ ముసలమ్మ మర్యాద మొదలు పెట్టింది.
శోభనాచలం సిగ్గు పడలేదు. ఇంట్లో అమ్మ చేతి మీదుగా అన్నం తిని మున్నెల్లయింది. ఆప్యాయత కొసం, రుచి కోసం హృదయమూ, జిహ్వా గొల్లు మంటున్నాయి. ముసలమ్మ చేతి చలవ వల్ల, మేస్టారి పుణ్యమా అని ఆ రెండూ ఈ వేళ దొరికాయి. సుష్టుగా భోజనం చేశాడు.
"పద, నాయనా, హాల్లోకి" అని ముసలమ్మదారి తీసింది. వివాహ మంటపం గా ఉపయోగించు కునేందుకు హాలు మధ్యగా శాశ్వతంగా ఏర్పాటు చేయబడిన వేదిక మీద నుంచి మంత్రాలు వినవస్తున్నాయి. ఎదురుగా నిల్చుని వధూవరులను చూశాడు శోభనా చలం.
'మేస్టారూ! ఎంత పని చేశారు!' అనుకున్నాడు వెంటనే! నిజంగా మేస్టారు ఎంత చిత్రమైన వ్యక్తీ! ఈ రహస్యం తన కెందుకు చెప్పలేదు? చెప్పలేక పోయి ఉంటారు! దేశంలో అయన కెంతో మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళలో కొందరు ఇష్టులున్నారు. తనంటే మేస్టారి కి మొదటి నుంచీ ఇష్టమే! రోడ్డు మీద కనిపిస్తే కనీసం అరగంటైనా తనతో మాట్లాడకుందా వెళ్లరు. అయన తనకి వరసగా రెండేళ్ళు క్లాసు టీచరు. తానెప్పుడూ ఇంగ్లీషు లో ఫస్టు. అందుకని తనంటే ఆయనకి ఇష్టం. క్లాసులో వక్కలు అయిపోతే వెంటనే తననే పంపేవారు.
ఈవేళ తను యాదృచ్చికంగా కలిశాడు. లేకపోతె తానీ పెళ్ళికి వచ్చి ఉండేవాడు కాడు. కాదు....మేస్టారు తన రూముకే బయలు దేరినట్టున్నారు. స్కూలు నుంచి ఈ సత్రానికి రావడానికి తన గది ఉన్న వీధి మీదుగా రావలసిన పని లేదు. మేస్టారు తన కోసమే వచ్చారు.
శోభనాచలం హృదయం ఆర్ద్ర మైంది! అలాగే కూర్చుండి పోయాడు. మేస్టారు అతని వంక చూసి నవ్వితే అతనూ నవ్వాడు.
చుట్టూ చూశాడు. పట్టుమని పది మంది కూడా లేరు. ఐదారుగురు ఆడవాళ్ళు దూరంగా కూర్చున్నారు. మంత్రాలు అట్టే సేపు సాగలేదు. సూత్రధారణ అయిపొయింది. దండల మార్పిడి అయింది. ఉంగరాల మార్పిడి అయింది. మేళాలు ;లేవు. తలంబ్రాలు లేవు. మంగళ హారతులు లేవు. అంతలో పెళ్లి అయిపొయింది. అంతా అక్షతలు జల్లారు. శోభనాచలం తన చేతిలోని అక్షతల్ని జేబులో వేసుకున్నాడు.
"భోజనం చెయ్యని వారెవరైనా ఉంటె దయచేసి వెంటనే రావాలి" అనే కేకేశాడోక ముసలాయన.
ఓ పండు ముత్తయిదువా, మరో పదహరేళ్ళ పిల్లా పెళ్లి కూతుర్ని చెరో చెయ్యి పట్టుకుని లోపలకు నడిపించు కెళ్ళారు.
భోజనాలు కాని వాళ్ళు లోపలకు వెడుతున్నారు. అయిన వాళ్ళు మేస్టారి కి నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నారు. శోభనా చలం కూడా ఆయనకు దగ్గిరగా వెళ్లాడు.
"వస్తాను, మేస్టారూ!" అన్నాడు వినిపించీ వినిపించ నట్టు.
అయితే, ఆయనకి వినిపించింది. "వస్తున్నానుండవోయ్! కలిసే వెడదాం. నిన్ను నీ రూము దగ్గిర దింపి నేనలా స్కూలు కు వెడతాను.... ధర్డ్ బెల్లు కింకా ఇరవై నిమిషా లుంది!" అన్నారాయన.
శోభనాచలానికి మతి పోయింది. ఏం మేస్తారో, ఏం లోకమో! ఈ పూట స్కూలుకి వెడతారా?
మేస్టారు లోపలికి వెళ్లి అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చారు. గురు శిష్యులు రిక్షాలో తిరుగు ముఖం పట్టారు!
ఆయనతో ఏం మాట్లాడాలో తోచలేదు శోభనా చలానికి!
"ఎలా ఉంది?' అని అడిగారాయన.
శోభనా చలం గతుక్కుమన్నాడు. ఏమిటి ఎలా ఉంది? పెళ్లా? పెళ్లి కూతురా? తన పంక్చువాలిటీ యా? భోజనమా? ఏమిటి?
శిష్యుడు సీరియస్ నెస్ ని భరించలేక అన్నాడు. "సేమ్యాలో పంచదార కొద్దిగా తక్కువైందండి. ఇకపోతే , భోజనమంతా నిక్షేపంగా ఉంది."
మేస్టారు పకపకా నవ్వేశారు.
"తికమక పెడదామనే అలా అడిగానూ , తట్టుకున్నావ్! వెరీ గుడ్!"
"మరి మీరదిగిందేవి టండి?"
"పెళ్ళీ....పెళ్లి కూతురు....." అన్నారు. అయన స్వరంలో ఏమీ ప్రత్యేకత ధ్వనించలేదు.
"దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం వారి విధి నిబంధనలకు అనుకూలంగా పెళ్లి చాలా పొదుపుగా జరిగిందండి. ఇకపోతే పెళ్లి కూతుర్ని నేను లోగడే ఎరుగున్నాను. చాలా యోగ్యురాలు....." అని శోభనా చలం అంటుండగా "ఎలా ఎరుగున్నావ్? అసలు మీ ఊరా?' అన్నారు. మేస్టారి స్వరం ఈ సారి కూడా చాలా సహజం గానే ఉంది.
అయన స్వరంలో ఏదో ప్రత్యేకత ధ్వనించాలని ఆశించిన శోభనా చలం నిరాశ పడ్డాడు. అయితే మేస్టారి స్వభావం తన స్వరం మీదా, వాడే పదాల మీదా అయన కున్న అధికారం అతన్ని అలరించాయి.
"రెండేళ్ళ క్రితం-- రెండేళ్ళు వాళ్ళింట్లో గది అద్దెకు తీసుకుని ఉన్నానండి. ఆ రోజుల్లో నాకామే మాటలూ, పాటలూ, తెలివి తేటలూ బాగా పరిచయం. ఆమె మీద నాకు చాలా గొప్ప అభిప్రాయం కలిగి వివాహం చేసుకోవాలను కున్నాను. పిల్ల పెళ్లి కాదేమోననే నిరాశతో కుంగి పోతున్న ఆమె తలిదండ్రు లతో నేనా మాట చెప్పి వాళ్ళలో ఆశను సృష్టించలేదు. ముందుగా పరిస్థితి అంతా చెప్పి "పెళ్లి చేసుకో మంటారా?" అని మా నాన్నగారిని అడిగాను. అయన ఒప్పుకోలేదు. మా అమ్మ కూడా ససేమిరా అంది. ఈ ప్రయత్నానికి ముందుగానే అమెతోనూ, ఆమె తలిదంరుల తోనూ లేనిపోని కాని మాటలు చెప్పి ఆశలు కల్పించనందుకు నన్ను నేను అభినందించు కుంటూ అంతటితో ఆ అభిప్రాయానికి స్వస్తి చెప్పి ఇల్లు మార్చాను. చిన్న వాడ్నీ, అన్నిటికీ ఇంకా తలిదండ్రుల మీద ఆధారపడి ఉన్న వాడ్నీ ఏదో ఆదర్శామనో, ఆశయమ నో పెద్ద కబుర్లు చెప్పి నాతో పాటు మరో ప్రాణి కూడా జీవితమంతా బాధ పడవలసిన దుస్థితిని కొని తెచ్చుకో లేదు. అందుకు నాకెప్పుడూ విచారిం కలగాలేదు. పై పెచ్చు సంతోషిస్తుంటా ను కూడా!...ఇక ఇప్పుడా సంతోషం...వెయ్యి రెట్లు అయింది. మేస్టారూ!" అంటూ శోభనాచలం ఇంకా ఏమో చెప్పబోయాడు.
సావధానంగా వింటున్న మేస్టారు ఇక అపమన్నట్లు చెయ్యి ఊపారు. మేస్టారి కి పొగడ్త లంటే ఇష్టం ఉండదు. "వెరీగుడ్! నాకు నచ్చావోయ్! నిజం చెప్పావు. నీ హృదయం చాలా గొప్పది...ఇక నే చెప్పేది విను. నేనీ పూట పాఠాలు చెప్పడానికి స్కూలు కి పరిగెత్తటం లేదు. నా ఉద్యోగానికి రాజీనామా పడేశాను మాట్లాడాలని కమిటీ వారు ఈ పూట రమ్మన్నారు. అందుకని వెడుతున్నాను.....నా వయస్సెంతో తెలుసా> నలభై నాలుగు' నేనసలు పెళ్లి చేసుకుంటానని కానీ, ఇలా చేసుకుంటానని కానీ ఎన్నడూ అనుకోలేదు. అయితే పెళ్లి ఇంత నిరాడంబరంగా నూ జరగాలనేది నాకు నచ్చే విషయం. అది వేరే సంగతి. ఆ అమ్మాయిలో నిన్నే గుణాలు ఆకర్శించాయో , అవే నన్నూ ఆకర్షించాయి. ఆకర్షించాయనటం కంటే హృదయానికి హత్తుకున్నాయనటం బాగుంటుంది....నాకేదో తినడానికి ఉంది. అంతవరకూ లోటు లేదు. ఇంతవరకూ నేను స్వేచ్చగా జీవించాను. సుఖం కోసం జీవించాను. నా కోసం నేను జీవించాను. నాకు లభించే సుఖాల్లో మొట్ట మొదటిది ఇతరులకు అర్ధమయ్యే ట్టు చక్కగా భోధించాననే తృప్తి వల్ల కలిగే సుఖం. పాఠం సరిగా అర్ధమైన స్టూడెంటు ముఖం కంటే నాకు సంతోషం కలిగించేది మరేదీ లేదు. కానీ నా కిక ఆ అవసరం లేదు. నేనిక నా సుఖం కోసం జీవించదలుచుకో లేదు. నేను 'నేను' గా జీవించాలని ఆశించటం లేదు. ఆమె కోసం జీవిస్తాను. నీ వన్నట్టు ఆమె మాటలు, ఆమె పాటలు, ఆమె తెలివి తేటలు నన్ను ఆకట్టు కున్నాయి. ఇవన్నీ ఇలా వ్యర్ధం కావలసిందేనా? అనే ప్రశ్న నన్నేన్నాల్లో వేధించింది. చివరికో నిర్ణయాని కొచ్చాను-- ఆమె కోసం జీవించాలని! ప్రకృతి ఆమెకు లోపింప జేసిన ఆ ....కన్నులు.... ఆ కన్నులుగా నేను జీవించాలని! అందువల్లనే నేనిప్పుడు 'నేను' కాను. ఆమెకు కొత్తగా వికసించిన కన్నులను! ఇక ఈవేళ నుంచీ ఆమె అన్డురాలు కాదు...కాదు....!' మేస్టారి స్వరంలో ఈసారి ధ్వనించిన దృడత్వానికి చకితుడై నాడు శోభనా చలం. తలెత్తి అయన ముఖంలోకి చూశాడు.
కానీ అయన అప్పటికే మామూలుగా నవ్వుతూ, "అవును....నేను మనిషిని కానోయ్! నా భార్య దృష్టి ని!" అన్నాడు.
* * *
