"అయితే ఎందు కిక్కడ ఉండాలి? బయటికి పో! ఇల్లు ఖాళీ చెయ్" అంది అత్తయ్య.
"ఖాళీ చేస్తాను , మధ్యాహ్నమే వెడతాను."
తిట్టుకుంటూ అత్తయ్య వెళ్ళిపోయింది.
రాధ కేమీ తోచలేదు. ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికని వెళ్ళాలి? ఎలా జీవించడం ? పిచ్చిదానిలా కూర్చుంది.
ఆ తరవాత కొంతసేపటికి లోపలికి వెళ్ళింది. తన గుడ్డల్ని ఒక సంచీ లో వేసుకుని బయటికి వచ్చింది. ఆలోచిస్తూ కొంచెం సేపు నిలబడింది. తరవాత గబగబా వీధి వాకిట్లో కి వచ్చి నడక సాగించింది.
"ఎక్కడో మరో చోట ఉంటె సరిపోదూ' అన్నది ఆమె మనస్సు.
"ఎక్కడుండటం ?'
'ఈ ఊళ్ళో నే ఎక్కడో మరో చోట......'
ఆమెకు ఒక పచారీ కొట్టు యజమాని కొంచెం తెలుసు. అయన వయసు మళ్ళిన వాడు. ఆప్యాయంగా ఆమెను పలకరించే వాడు. సరాసరి అయన కొట్టుకి వెళ్ళింది.
కొట్టు వాకిట్లో ఆమె నిలబడిందో లేదో కొట్టు యజమాని వంగి ఆమెను ఆహ్వానించాడు.
"ఇంట్లో అత్తయ్యతో ఉండలేక పోతున్నాను. అద్దెకు చోటు దొరికితే బాగుండును" అంది రాధ.
కొట్టు యజమాని ఆలోచించాడు. ఆ తరువాత "రా అమ్మా, రా" అంటూ ఆమెను లోపలికి తీసుకు వెళ్లాడు. కొట్టు వెనకాల సామాన్ల గది ఒకటి ఉంది. ఇద్దరూ అందులోకి వెళ్ళారు.
"దీన్ని ఖాళీ చేసి ఇస్తాను. నువ్విక్కడే ఉండవచ్చు. రావడానికి, పోవడానికి వెనకనే దోవ ఉంది" అన్నాడు కొట్టు యజమాని.
రాధ కిది తృప్తి కరంగా తోచింది. "అద్దె ఎంత?' అని అడిగింది.
కొట్టు యజమాని బిగ్గరగా నవ్వాడు. "అదంతా ఎందుకమ్మా? నువ్వు హాయిగా ఉండు. నువ్విక్కడ పార్వతి కంటే సంతోషంగా ఉండవచ్చు."
రాదా మణి కి కొంచెం ఆశ్చర్యం కలిగింది.
"అద్దె ఎంతో ఖచ్చితంగా చెప్పండి."
"నువ్వు అద్దె ఇవ్వాలా? కొట్టే నీదనుకో, అవును" అంటూ బిగ్గరగా నవ్వాడు కొట్టు యజమాని.
రాధ ఉలికిపడింది. ఆమె కంతా అర్ధమయింది. అసహ్యంగా అయన వైపు చూసింది. తరవాత మళ్లీ నడక సాగించింది.
వీధుల్లో వెడుతుంటే ఆమెకు ఏడుపు వచ్చింది. ఈ ప్రపంచంలో తనకు దిక్కెవ్వరూ లేరని పించింది. అంతా శూన్యంగా కనిపించింది. ఇంతమంది మనుష్యులున్న సమాజంలో తనకు చోటు లేదని తెలుసుకుంది. లోపల బాధ బయలుదేరింది. దానితో పాటు కోపమూ వచ్చింది.
అరగంట సేపు ఎక్కడెక్కడో తిరిగి చివరికి అత్తయ్య ఇంటికే వచ్చింది రాధ. భయపడుతూ లోపలికి వెళ్ళింది. ఆమెను చూడడం తరువాయి కోపంతో లేచింది అత్తయ్య.
"అత్తయ్యా! నిన్ను బతిమాలుకుంటున్నాను. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటాను. ఆ తరవాత నేను వెళ్లి పోతాను " అంది రాధ.
"అదంతా ఏం ఉడకడు. ఈ ఇంట్లో నువ్వు ఒక్క అడుగైనా పెట్టడానికి వీల్లేదు." అని గర్జించింది అత్తయ్య.
"అత్తయ్యా! నిన్ను వేడుకుంటున్నాను. నన్ను బతకనివ్వు! అత్తయ్యా, నన్ను బతకనివ్వు!" అంటూ ఆమె పాదాలు తాకి నమస్కరించింది రాధ.
అత్తయ్య కింకా కోపం వచ్చింది. "వెడతావా , లేదా?' అంటూ రాధ మెడ పుచ్చుకుని బయటికి తోయ్యసాగింది. రాధ పట్టు విడిపించు కుంది. ఆమెకు కోపం వచ్చింది. అయినా, అత్తయ్య ఆమెను విడిచి పెట్టలేదు. వెంటనే రాధ అలమర వద్దకు వెళ్లి అక్కడున్న క్లోరో ఫారం తీసుకుంది. దానితో పత్తిని తడిపి, అత్తయ్య ముక్కుకు సూటిగా చూపింది. ఆ వాసన చూసిన కొంతసేపటి కల్లా అత్తయ్య కు మైకం వచ్చింది. అప్పుడామెను ఆమె వాటాలోకి ఈడ్చుకు వెళ్ళింది రాధ.
గంట సేపయింది.
ఒక మూల కూర్చుని రాధ ఏడుస్తుంది.
చప్పుడు వినిపించింది. తెలివి వచ్చిన అత్తయ్య లేచి వస్తోంది.
"ఏమే! నాకు మైకం మందిచ్చావా? నిన్ను...." అంటూ పళ్ళు కొరికింది. సరిగ్గా ఆ సమయానికి బయటికి వెళ్ళిన ఆ ఇద్దరు మనుషులూ వీధి తలుపు తెరుచుకుని లోపలికి వచ్చారు. వాళ్ళను చూసింది అత్తయ్య. "ఇది ఇల్లు ఖాళీ చెయ్యదు. మనం చెప్పిన వినడు. ఉమ్...." అని వాళ్ళ నుద్దేశించి పలికింది. చేత్తో సైగ చేసింది. వాళ్ళలో ఒకడు రాధను సమీపించాడు.
భయపడిపోయింది రాధ. అతని వంక చూసింది. అతను ముందుకు వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. అతని పట్టుని విడిపించుకుని రాధ పరుగెత్తింది. అతనూ ఆమెను అనుసరించాడు.
వాడూ వాడి చూపులూ ఆమెను కలవర పెట్టాయి. ఒక మూలగా నుంచున్న రాధ ఇక తప్పించు కోలే ననుకుంది. ఆమె కంటికి అక్కడున్న ఒక గొడ్డలి కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని అతని మీదికి విసిరింది. అతను ఒక్క ఎగురు ఎగిరి తప్పించు కున్నాడు. ఆ గొడ్డలి అత్తయ్య నుదుటి కి తగిలి కింద పడింది. "అయ్యో" అని అరుస్తూ అత్తయ్య నేలకు ఒరిగింది. ఆ ఇద్దరూ మనుషులూ బయపడి పోయి పరిగెత్తుకు వెళ్ళారు.
అత్తయ్య కొంచెం సేపు యాతన పడింది. ఆ తరవాత మరణించింది.
ఆమె కళ్ళు దించుకు పోవడం చూసి, రాధ భయపడింది. కొన్ని క్షణాలలోనే అత్తయ్య కన్ను మూసింది.
రాధకు భయమూ, దిగులూ కలిగాయి. ఏం చెయ్యాలో తోచలేదు. కొంచెం సేపు ఆలోచనలో పడింది.
తరవాత గబగబా పనులు చేయడం మొదలు పెట్టింది.
గొడ్డలి ని కడిగింది. దాన్ని తెచ్చిన యింటి వాళ్లకు ఒప్ప జెప్పింది. తరవాత అత్తయ్య మృత దేహాన్ని , ఒక మంచం కిందికి నెట్టింది. అత్తయ్య ఇంట్లోంచి కొన్ని గిన్నెలు తీసుకుంది. వాటిని మూట కట్టుకుని బయటికి వచ్చింది. వీధి తలుపు కి తాళం వేసి సరాసరి రైల్వే స్టేషన్ కి దారి తీసింది.
రైలేక్కింది. అయితే ఎక్కడికి వెడుతున్నది ఆమెకు తెలియలేదు. ఆడవాళ్ళ పెట్టెలో కూర్చుంది. పెట్టెలో చంద్ర అనే అమ్మాయితో మాట్లాడడం మొదలు పెట్టింది.
కొద్ది సేపటికే వాళ్ళిద్దరూ కలిసి మెలిసి పోయారు. భర్త పెట్టిన కష్టాలు పడలేక చంద్ర తన పుట్టింటికి బయలుదేరింది. తాను పడుతున్న అవస్థ నంతా తెలియజేసింది.
ఇద్దరూ ఆలోచించారు. చంద్ర వాళ్ళ ఊరికే రాధ వెళ్లాలని ఖాయం చేయబడింది. ఇద్దరూ మిడ్ వైఫ్ వృత్తిని కొనసాగించాలని అనుకున్నారు.
చంద్ర వాళ్ళ ఊరు వచ్చింది. ఇద్దరూ అక్కడ దిగారు. తన కోసం ఒక గది అద్దెకు తీసుకుంది రాధ.
ఆ ఊరికి వచ్చి మూడు రోజు లయి ఉంటుంది. రాధ మనస్సుని దిగులు ఆవహించింది. ఒకరోజు ఉదయం తలుపు కొట్టిన చప్పుడయింది. లేచి వెళ్లి తలుపు తెరిచింది. పోలీసులు నిలబడి ఉన్నారు. వాళ్లతో పాటు అత్తయ్య భర్త కూడా -- రాధ మామయ్య -- ఉన్నాడు.
అత్తయ్య చనిపోయిన విషయాన్ని ఆమె ఇంటికి వెళ్ళిన ఒక పిల్లవాడు కనిపెట్టడం జరిగింది. అతనే పోలీసు లకు ఈ విషయం తెలియ జేశాడు. వెంటనే పోలీసు వారు గాలించడం మొదలు పెట్టారు. మూడు రోజుల కల్లా రాధ ను వెతుక్కుంటూ వచ్చారు.
పోలీసుల్ని చూడగానే వెలవెల పోయింది రాధ. జరిగినదంతా చెప్పింది. కేసు కోర్టుకి వెళ్ళింది. కోర్టులో తన వాజ్మూలాన్ని మార్చి వేసింది రాధ. తాను హత్య చెయ్యలేదని వాదించింది. హత్య జరిగిన ఆరోజున తాను ఊళ్ళో లేనని చెప్పింది.
విచారణ జరిగిన తరవాత రాదా మణి కి మరణ శిక్ష విధించారు.
కేసు అప్పీలు కు వెళ్ళింది. పై కోర్టు వారు కూడా రాధ మరణ శిక్ష ను ఖాయం చేశారు. ఆమె కేసుని పునః పరిశీలించ డానికి ప్రభుత్వం వారు అంగీకరించలేదు.
చివరికి తనను కనికరించ వలసిందిగా రాష్ట్రపతి కి అర్జీ పెట్టుకుంది.
చాలా రిమైండర్లు వెళ్ళిన తరవాత ఆమె పెట్టుకున్న అర్జీకి రాష్ట్రపతి వద్ద నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వం వారికి వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జైలు కి తంతి మూలంగా తెలియ జేసింది, "రాధా మణి ని ఉరి తియ్య కూడదు" అన్నదే ఆ బదులు.
ఆమె మరణ శిక్షను తగ్గించి, యావజ్జీవ శిక్షగా మార్చబడిందనే విషయాన్ని ఆమెకు తెలియ జేశారు. అయితే ఈ లోపుగా రాదా మణిలో ఒక మార్పు కనిపించింది. మరణ శిక్ష వల్ల కలిగిన భయం వల్లనో, మరే కారణం వల్లనో గాని ఆమెకు మతి చలించింది!
పాతికేళ్ళ రాధా మణి ఇప్పుడు మనో వ్యాధి తో జైలు లో ఉంది. డాక్టర్లు ఆమెను పరీక్షించారు. ఈ వ్యాధి కారణం ఆమెకు త్వరలోనే విడుదల లభించవచ్చు. విడుదల అయిన తరువాత ఆమె జీవితం ఎలా రూపొందుతుందో, ఎవరు చూశారు?
* * *
