Previous Page Next Page 
వాస్తవ గాధలు పేజి 10


                           ప్రేమా! వద్దు, వద్దు!

               
    సీత గంతులు వేస్తూ పరుగెత్తింది. మార్కెట్టు ముందర ఆమె మూర్తిని చూసింది.
    "మూర్తీ....." అని పిలిచింది. జారిపోతున్న పమిట కొంగును అదిమి పట్టుకుని పరుగెత్తింది.
    రోజుతూ రొప్పుతూ ఎదురుగా నించున్న సీతను చూసి నిర్ఘాంత పోయాడు మూర్తీ. ఆ మరుక్షణమే సంతోషం కొద్దీ ఆమె చేతులు పట్టుకున్నాడు.
    "సీతా! ఇక్కడి కేలా వచ్చావు సీతా!" ప్రేమ పూర్వకంగా అడిగాడు.
    సీత మాట్లాడలేక పోయింది. సంతోషమూ ఏడుపూ పొంగి వచ్చాయి. కళ్ళు గట్టిగా మూసుకుంది. లోపల ప్రశాంతతను పొందగలుగుతుంది.
    చివరికి ఆమె మాట్లాడింది. "మిమ్మల్ని విడిచి నేనుండ లేను, మూర్తీ! ఇది నిజం." ఆమె మాటల్లో ఉద్వేగం కనిపించింది.
    "రా, సీతా! ఇక్కడ ఒకటే జనం. పార్కు కి వెడదాం" అని మూర్తి పిలిచాడు. సీత అతన్ని అనుసరించింది.
    "ఈ ఊరికి ఎప్పుడొచ్చావ్, సీతా!"   
    "రెండు రోజులయింది ."
    "అయితే నన్ను ముందే ఎందుకు చూడలేదు?"
    "మీకెలాంటి ఇబ్బందీ కలిగించ కూడదని నా అభిప్రాయం. ఒక గదిని అద్దెకు తీసుకున్నాను. అక్కడే ఉంటున్నాను. నా కుట్టు మిషను తీసుకు వచ్చేశాను. చాలు! నాకు కావలసింది సంపాదించు కుంటాను. మీ దగ్గరలో ఉంటె చాలు. అదే నేను కోరే స్వర్గం!"
    భావోద్వేగం కొద్దీ మాట్లాడింది సీత. అలసట వల్ల ఆమె ముఖం కొంచెం నల్లబడింది.
    ప్రకాశం పార్కులో మచ్చుకైనా ఒక్క చెట్టు లేదు. వాళ్ళిద్దరూ ఒక బెంచీ మీద కూర్చున్నారు. అప్పుడు సూర్యుడస్తమించే వేళ.
    "ఎందుకు మూగనోము పట్టావు. సీతా!" అడిగాడు మూర్తి. సీత మౌనం వహించడం అతనికి నచ్చలేదు.
    "నేనేం మాట్లాడను? నా మనస్సు సంతోషంతో నిండిపోయింది. అవును...సంతోషం తో....చెబుతుంటేనే ఆమె కళ్ళ నుండి నీళ్ళు ఉబికి వచ్చాయి.
    ఆమె జీవితమంతా ఒక్కసారి కళ్ళకు కట్టినట్ల యింది. ప్రప్రధమంగా మూర్తిని చూసినప్పుడు ఆమె కిలాంటి భావాలే కలిగాయి.
    అప్పుడామెకు పదిహేనేళ్ళు ఉంటాయి. పట్టణం నుంచి గ్రామానికి వచ్చాడు మూర్తి. చొక్కాతోనే తిరిగేవాడు. మంచి ఎరుపు. కాటుక పెట్టుకున్నట్లు గా నల్లని కళ్ళు.
     అతన్ని మొదటిసారిగా చూసినప్పుడు ఆశ్చర్యంతో మునిగిపోయింది సీత. గ్రామంలోని పురుషులనే చూసిన సీతను మూర్తి అందం ఎంతగానో ఆకర్షించింది. మనస్సులో ఏదో కోరికతో ఆమె ఇంటి దారి పట్టింది.
    సీత ధనవంతుల ఇంటి బిడ్డ. చామన చాయగా ఉన్నా ఆకర్షణీయంగా ఉండేది. ధవంతుల ఇంట్లో పుట్టి పెరగడం వల్ల కలిగిన మృదుత్వం ఆమె సౌందర్యానికి మెరుగులు దిద్దింది.
    రెండవసారి మూర్తిని గుడిలో చూసింది. సీత. ఈ తడవ మూర్తి ఒక్క క్షణం జంకుతూ ఆమెను చూసి ఆ తరువాత చూపు మరల్చాడు . ఆమె మనస్సు తహతహ లాడింది.
    'పట్టణంలో నివసించిన ఆయనకు ఈ పల్లెటూరి పిల్ల నచ్చుతుందా? అనే ఆలోచన ఆమె మనస్సు నాక్రమించింది.
    రోజులు గడవను గడవను వాళ్లు చాలాసార్లు కలుసుకున్నారు. మూర్తి కూడా ఆమె వంక చూపులు నిలిపేవాడు. సీత మనస్సు సంతోషంతో నిండిపోయేది.
    గ్రామానికి వచ్చిన కొన్ని నెలలకు మూర్తి వాళ్ళ కుటుంబం సీత వాళ్ళ పక్కింటికి అద్దెకు వచ్చారు. అందువల్ల వాళ్ళ కెంతో వీలయింది కలుసుకునేందుకు. ఏదో ఒక నెపంతో వాళ్ళు దొడ్లో ఉన్న తోటలోకి వచ్చేవాళ్లు. అక్కడ కళ్ళతో మాట్లాడుకునే వారు.
    ఒక సంవత్సర మయేసరికి వాళ్లు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఒకరి ఇంటికి ఒకరు రాకపోకలు సాగించారు. ఎవరూ కనక లేకుంటే చాలాసేపు మాటల్లో మునిగిపోయేవారు.
    సీత మూర్తి మోహంలో పడిపోయింది. అతనే తన ప్రాణ మనుకుంది. అయితే అమెలొ ఇక తపన బయలుదేరింది. తన కోరికను తన తలి దండ్రులతో చెప్పడానికి ఆమె సాహసించ లేదు. అలా చెప్పడం తమ గ్రామపు కట్టుబాట్ల కు విరుద్దమైన విషయ మనుకుంది.
    సీత కంటే మూర్తి మహా భయస్థుడు కనక ఈ విషయంలో అతడూ ఏమీ చెయ్యలేకపోయాడు.
    ఇలా ఉండగా మూర్తి వాళ్ళ కుటుంబం ఆ గ్రామం విడిచి పెట్టవలసి వచ్చింది. మూర్తి తండ్రి వ్యాపారం చెయ్యాలనే ఉద్దేశంతో పట్టణానికి వెళ్ళదలచాడు.
    సీత మూర్తీ విచారంగా సెలవు తీసుకున్నారు. జీవితంలో ఏదో జారిపోయినట్టుగా సీతకు తోచింది. చాలా నెలల దాకా పిచ్చి పట్టిన దానిలా కూర్చుంది.
    ఎలాగో అయిదేళ్ళు గడిచాయి.
    వ్యాపారంలో నష్టం రావడం వల్ల మూర్తి తండ్రి మళ్ళీ ఆ గ్రామానికే తిరిగి వచ్చాడు. సీత వాళ్ళ పక్కింట్లో నే చేరారు.
    మూర్తిని చూసి సీత నిర్ఘాంత పోయింది. అయితే అప్పుడామే పాత సీత కాదు యువతి. ఆమె మనస్సులోనూ ఎన్నో మార్పులు. ఇన్ని మార్పు లేర్పడినా, ఒక్కటి మాత్రం మారలేదు. మూర్తిని గురించిన ఆలోచనే అది!
    కొంచెంగా మరిచిపోయిన, లేదా మరుగున పడిన అన్ని స్మృతులు ఒక్కసారిగా మేల్కొన్నాయి. మనస్సులోనే వరించిన వాణ్ణి భగవంతుడు తన వద్దకు చేర్చినట్లు ఆమె భావించింది. 'నేను పాత సీతను కాను, కొత్త సీతను! నా మనోభిప్రాయాన్ని నా తలిదండ్రులకు తెలియ జేసేందుకు జంకను' అనుకుంది సీత.
    ఆ గ్రామం చాలా మారిపోయింది.విద్యూద్దీపాలు వెలుగుతున్నాయి . ఒక సినిమాహలూ, హైస్కూలూ వెలిశాయి.
    ఊళ్ళో ఏర్పడిన మార్పులు సీతను ప్రభావితం చేశాయి. ఆమె కూడా మారిపోయింది.
    వచ్చిన రోజు నుంచే మూర్తి కీ, సీతకూ మళ్లీ సంబంధం ఏర్పడింది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
    ఆ తరవాత ఒక నెలకు మూర్తి తండ్రి మరణించాడు. మూర్తి తో పాటు సీత కూడా దుఃఖించింది. అతన్ని ఓదార్చింది సీత.
    పారలౌకిక క్రియలన్నీ ముగిసిన తరవాత ఒక రోజు ఉదయం మూర్తి ఇంటి ముందు ఒక బండి వచ్చి నిలిచింది. అందులోంచి ఒక యువతి దిగి, ఇంట్లోకి వెళ్ళింది. 'ఆమె ఎవరో మరి?' ఆలోచనలో పడింది సీత.
    ఆ మరునాడే ఆ విషయం బయట పడింది. ఆమె మూర్తి భార్య! పట్టణం లో ఉన్న రోజుల్లో అతనికి వివాహం జరిగింది. ఆ సంగతి వినగానే సీత నిర్ఘాంత పోయింది.
    "మీరంటే నాకెంత నమ్మకమని!" అని మూర్తిని కలుసుకున్నప్పుడు విలపించింది.
    "సీతా! వ్యాపారం కోసం మా నాన్నకు డబ్బు కావలసి వచ్చింది. నా కొచ్చే కట్నం డబ్బుని వాడుకుందా మనుకున్నాడు. మళ్లీ ఈ ఊరికి రావలసి వస్తుందనే ఉద్దేశం అప్పట్లో మాకు లేదు. వ్యాపారంలో తప్పకుండా లాభం వస్తుందనే అనుకున్నాం. ఒకవేళ ఇక్కడికి వచ్చినా, నీకు గాని, నాకు గాని మన పెళ్లి గురించి పెద్దవాళ్ళకు చెప్పే ధైర్యం లేదని అనుకున్నాను. మీరేమో ధనవంతులు! కనక మీ నాన్న మన పెళ్ళికి సమ్మతించడని అభిప్రాయ పడ్డాను. కనకనే నా వివాహం జరిగింది." అన్నాడు మూర్తి.
    ఆ రోజు నుంచీ ఆమె అతన్ని కాలుసుకోలేదు. లోపల ఏదో ద్వేషం బయలుదేరింది. 'నన్ను మరిచిపోయి అయన ఈ పని ఎలా చేశాడు?' అని బాధపడ సాగింది. ఒకనాటి రాత్రి సీత దొడ్లో కి వెళ్లి మెల్లగా తొంగి చూచింది. అలవాటు ప్రకారం మూర్తి తోటలో నిలబడి ఉన్నాడు. తనకోసమే అతను నిలబడి ఉన్నట్టు ఆమెకు తెలుసు.
    లోపలికి వెళ్ళిపోదామా అనుకుంది సీత. కాని అలా చెయ్యడానికి మనస్సు ఒప్పుకోలేదు. బయటికి వచ్చి నిలిచింది. ఆమెను చూచాడు మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS