Previous Page Next Page 
కాగితపు పల్లకి పేజి 9


    చలపతి పళ్ళు పటపటా పిండుకున్నాడు. "మీరంతా శనిలాగా దాపురించారు నాకు. నేను గౌరవంతో, పరువుతో బ్రతకటం మీకు ఇష్టం లేదు. నన్నుఈ బురద లోకే లాగాలని చూస్తున్నారు మీరంతా అన్నాడు.
    రాఘవులికి ఇక ఇతనితో వాదించి  ప్రయోజనం లేదనిపించింది. అతను పూర్తిగా తన పరిసరాలను అపార్ధం చేసుకున్నాడు. ఈ అపొహ తీర్చటం ఇప్పట్లో చాలా కష్టం. కాలక్రమంలో ఈ అపోహ తీరవలసిందే గాని ఇప్పట్లో అతను మనస్సు మరల్చు కోలేడు.
    "ఇక్కడికి వచ్చాం అని ఎవరికి తెలియదు గదా. కొంపతీసి ఎవ్వరికీ చెప్పలేదుగా"
    "అందరికీ తెలుసు . ఇందులో కొత్తేముంది. చలపతయ్య ప్లస్ సుస్తీ అంటే కేరాఫ్ లిల్లమ్మ లేదా చలపతయ్య మైనస్ మనీ అంటే కేరాఫ్ లిల్లమ్మ అని ఈ ఊళ్ళో అందరికీ తెలిసినదేగా.
    "చంపేశావు. ఒకవేళ అన్నయ్య గనక వస్తే ఆయన్ని ఇక్కడకు పంపుతారేమో."
    "అదా బాబు మీ అసలు భయం. ఏం ఫర్వాలేదు నేను యిప్పుడే వెళ్ళి అలాంటి పొరపాటు జరక్కుండా జాగ్రత్త పడతా సరా"
    "బ్రతికించావు. ముందాపని చేసిరా" చలపతి కాస్త కుదుట పడ్డట్టు తేలిగ్గా నిట్టూర్చాడు.
    రాఘవులు లేవబోతూ "చిన్న వాడ్నో , పెద్ద వాడ్నో చెబుతున్నా నా మాట కాస్త వినండి. ఇక ఎలాగూ మీరు ఇక్కడికి మునుపటి లా వచ్చేది లేదు గనుక ఈ నాలుగు రోజులయినా ఆమె మానస్సు కష్ట పెట్టకండి. ఆమెను చులకనగా చూడకండి. తెలిసిందా? ఆమెకు మీరంటే అసూయ అనుకున్నా ఆమెకు మీరంటే అభిమానం మాత్రం ఉంది. కేవలం అవసరమే కాదు అన్నాడు.
    చలపతి ముక్కు ఎగ పీల్చి "నాకు తెలుసు లేరా రాఘవులూ , ఎవ్వరి తత్వాలు ఎలాంటివో" అన్నాడు.
    రాఘవులు లిల్లమ్మ తో చెప్పి హాలు దగ్గరకు వెళ్ళాడు.
    లిల్లమ్మ జావా కాచి తెచ్చింది.
    చలపతి ఆమె చేతిలో గ్లాసు తీసుకుని గడగడా తాగేశాడు. మునుపటి లా ఎలాంటి మారాం చెయ్యలేదు. తను తాగనని మొరాయించటం ఆమె పదిసార్లు బ్రతిమలాడం , చిలిపి కజ్జాలు తగాయిదాలు, సముదాయింపులు ఏమీ లేకుండా గుట్టు చప్పుడు చెయ్యకుండా గడగడా తాగేశాడు.
    లిల్లమ్మ "అబ్బాయిగారూ చాలా బుద్ది మంతులయ్యారే ఇవాళ" అంది. అయినా ఈ కవ్వింపు అంతగా పని చెయ్యలేదు. చలపతి దుప్పటి మీది కంటా లాక్కుని అటువైపుగా తిరిగి పడుకున్నాడు.
    ఆమె ఉడుకులాం వెయ్యటానికి పక్కనే కూర్చుంది. గడియారం పది గంటలు చూపెడుతోంది. ఊరు ఊరంతా నిద్రపోయింది.
    చలపతి ఇక చాలు నన్నట్టుగా చెయ్యి అడ్డం పెట్టాడు. ఆమె అప్పటి కింకా భోజనం చేసినట్టు లేదు. అతనికా స్పురణ వచ్చింది. ఆమె తన కోసరం అంతగా నిద్రాహారాలు మాని సేవ చేయడం అతనికి ఇష్టంగా లేదు.
    లిల్లమ్మ ఆపుచేసి "ఇంకా జ్వరం తీవ్రంగా ఉంది, వెయ్యనివ్వండి." అంది.
    "ఫర్వాలేదు." నువ్వు భోజనం చేశావా"
    "లేదు. కాసేపాగి తింటాను. ఇప్పుడు నా "భోజనానికి కేం తొందర లెండి." ఉడుకులాం వెయ్యనివ్వండి" అందామె.
    అతను ముఖం పక్కకు తిప్పేశాడు అయిష్టంగా.
    ఆమెకు అంతవరకూ అణచుకున్న దుఃఖం ఆగలేదు. ఇవాళ చలపతి ప్రవర్తన చాలా విరుద్దంగా ఉంది. అతని అంతర్యం ఆమెకు స్పష్టంగా అర్ధం అవుతూనే ఉంది. కన్నీరు బొటబొటా కారిపోయింది. అపుకోవాలని ఆమె ప్రయత్నించలేదు. ఆమె అంతవరకూ చూపిన నిగ్రహం కట్టలు తెగిపోయింది. కన్నీరు తుడుచుకుంటే చీర చెరుగు అంతా తడిసి ముద్దయి పోయింది. చలపతి చాలా మారిపోయాడు. మంచిదే. కాని అతను తన గురించి అపోహలో ఉన్నాడు. తానేదో అతను బాగుపడటం ఇష్టం లేక ఓ యింటి వాడవుతుంటే ఆసూయ పడుతున్నానని అతని అభిప్రాయం కాబోలు. అతని కిలాంటి అభిప్రాయం కలగకుండా తాను ఎలాంటి ఆకర్షణ లేని విధంగా సాదా అయిన పాత చీర కట్టుకుంది సరిగ్గా తల కూడా దువ్వుకోలేదు. అతడ్ని ఆకర్షించటానికి తాను ఏమీ చెయ్యలేదు. అయినా అతను తన్ని అర్ధం చేసుకోలేదు.
    చలపతి సన్నగా దగ్గుతున్నాడు.
    రాఘవులు అతని అభిప్రాయంతో నిమిత్తం లేకుండా చలపతిని ఇక్కడకు తీసుకు వచ్చాడు అని ఇప్పుడు అర్ధం అయింది లిల్లమ్మకు. చలపతికి ఇక్కడకు రావటం కాని, తనతో సంబంధం పెట్టుకోవటం కాని అతనికి ఇష్టం లేదు. ఇప్పుడతను చాలా పై స్థాయి లో -- అంటే- తనలాంటి చెడిపోయిన వాళ్లతో సంబంధం లేకుండా చాలా దూరంగా మసలాలని అనుకుంటున్నాడు. రాఘవులు కప్పి పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు గాని లిల్లమ్మ కు అతని మాటల్లోంచి, చలపతి ప్రవర్తన లోంచి అతని అంతర్యం స్పష్టంగా అర్ధం అవుతూనే ఉంది. లిల్లమ్మ కు ఒక్కసారి పట్టుకొమ్మ విరిగి క్రిందికి ఎక్కడికో కృంగి పోతున్నట్టునూ అనిపించింది. అతను పెళ్ళి చేసుకుని సుఖ పదాలని పిల్లాపాపలతో హాయిగా జీవించాలని తాను కోరుకుంది. అతను చెడి పోవాలని తానెప్పుడూ కోరనే లేదు. అయితే అతని ప్రవర్తన ఆమెలో కష్టంగా ఉంది. అతను తన్ని అర్ధం చేసుకోలేక పోయినందుకు కష్టంగా ఉంది. మనస్సు విరక్తి చేసుకోవాలని ప్రయత్నించింది. అతను తనతో తెగతెంపులు చేసుకోవాలనే అనుకుంటున్నాడు. తనెంత ఉన్నతంగా జీవించాలని అనుకున్నా తనకా స్థానం ఇవ్వడానికి అతను అంగీకరించటం లేదు. చలపతిలో కలిగిన ఈ పరివర్తన తో తన స్థితి ఏమిటో లిల్లమ్మ కు ఇప్పుడు మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు ఓ వ్యక్తీ తన జీవితంలో ప్రవేశించి తన ప్రాణధనాదులను పూర్తిగా అపహరించాలని చూశాడు. దైవ వశాత్తూ ఆ ప్రమాదం తప్పి ఆ తర్వాత జీవితం   ఇంకా పతనం కాకుండాలోకం బలహీనతకు తాను బలి కాకుండా చలపతి తన్ని ఆదుకున్నాడు. సరిగ్గా అలాంటి అదనులో చలపతి తన జీవితంలోకి ప్రవేశించాడు. మానసికంగా శాంతి పొందటమే కాకుండా ఎంతో పెద్ద మనస్సుతో నలుగురి లోనూ గౌరవంగా బ్రతికించి అంతవరకూ గడిపిన జీవితం అంతా ఓ పీడకల గా మర్చిపోయింది. కాని ఈనాడు తన స్థితి ఏవిటో చలపతి తన ప్రవర్తన ద్వారా ముఖం మీద కొట్టినట్టుగా చెప్పాడు. ఎంతో ఉన్నత శిఖరాన్నుంచి గడగడా కిందకు దొర్లి పోతున్నట్టుగా అనిపించిందామెకు.
    చలపతి ఒసారి బాధగా మూలిగాడు.
    లిల్లమ్మ చప్పున కన్నీరు తుడుచుకుని నిర్లిప్తంగానే వచ్చి మంచం వార కూర్చుంది. అతని వంటి మీద చెయ్యి వేసి చూసింది. చలపతికి జ్వరం బాగా పెరిగింది కాబోలు తల అటూ ఇటూ ఊపుతున్నాడు. అతని పెదవులు వణుకుతున్నాయి.
    ఆమె గుండెలు దడదడ మంటున్నాయి.  మళ్ళీ రాఘవులు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ధైర్యం వచ్చింది.
    "రాఘవుల్ని పంపించేశారేం?"
    "హాలు దగ్గరకు వెళ్ళి రమ్మన్నాను."
    "మళ్ళీ వస్తాడా?"
    "ఆ"
    లిల్లమ్మ కు కాస్త ధైర్యం వచ్చింది. అతని నుదుటి మీద ఉడుకులాం వేసింది.
    గడియారం ముల్లులు తిరిగిపోతూనే ఉన్నాయి. ఓసారి ఆమె కిటికీ వరకూ వెళ్ళి బయటకు వీధి లోకి చూసింది. వీధంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది.
    చలపతి ఆమె కంగారు పడుతుందని గమనించి "నాకేం భయం లేదు తగ్గిపోతుంది. రెండు రోజుల్లో తగ్గిపోతుంది." అన్నాడు.
    లిల్లమ్మ అతని మాటలకు కాస్త ధైర్యం తెచ్చుకుని వచ్చి స్టూలు మీద కూర్చుంది.
    చలపతి జ్వర తీవ్రతతో కొద్దిగా ఒణుకుతున్నాడు. అతని పెదిమలు కదుల్తున్నాయి.
    అతనింకా ఏమైనా చెబుతాడేమోనని ఆమె ఎదురు చూసింది. అతనింక మాట్లాడలేదు. రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను." అని అతను చెబుతున్నట్టుగా ఆమెకు అనిపించింది. ఎంతయినా ఆడవాళ్ళు ఆడవాళ్ళే. మొగవాళ్ళ ధోరణి వేరు. వాళ్ళు మనస్సు అర్పించుతారు సరికదా ఆడవాళ్ళు అభిమానాన్ని అపార్ధం చేసుకుంటారు కూడాను."
    కాసేపు పొయిం తర్వాత రాఘవులు తలుపు కొట్టిన చప్పుడు విని ఆలోచనల్లోంచి తెప్పరిల్లి లిల్లమ్మ వెళ్ళి తలుపు తీసింది.
    రాఘవులు అవతల గదిలో చాప పరుచుకుని పడుకున్నాడు. చలపతి ఇది గమనించాడు.
    రాఘవులు "మీరు కాసేపు కునుకు తీయ్యండమ్మా అయ్యగారికి నేను ఉడుకులాం వేస్తాను" అన్నాడు.
    చలపతి కూడా 'అవును , నువ్విక నిద్ర పో. రాఘవులు వస్తాడు అన్నాడు.
    'అలాగే అంది ఆమె కాదంటే అతనేం అపార్ధం చేసుకుంటాడోనని.
    రాఘవులు స్టూలు మీద కూర్చున్న తర్వాత గాని చలపతికి మనశ్శాంతి ఏర్పడలేదు. అతను వచ్చిం తర్వాత లిల్లమ్మ వంట గదిలోకి వెళ్ళి పడుకుంది.
    రాఘవులు మర్యాదకయితే అన్నాడు గాని తీరా సేవ చేయ్యావలసి వచ్చేసరికి అతనికి ప్రాణ సంకటం అయింది. చలపతికి మంచి నిద్ర ముంచుకు వస్తుంది. కళ్ళు బరువెక్కి వాలి పోయాయి. ఓ అర్ధగంట సేపు అలా కూర్చున్నాడు.
    చలపతి కళ్ళు తెరిచేసరికి రాఘవులు నిద్ర బరువుతో తూలుతూ అపుకుంటున్నాడు. చలపతి అతని మీద చెయ్యి వెయ్యటం తో రాఘవులు ఉలికిపడి సరిగ్గా కూర్చుని కళ్ళు నలుపుకున్నాడు.
    "చాలు రాఘవులు వెళ్ళి పడుకో."
    రాఘవులు ఓ అయిదు నిమిషాలు అలా కూర్చుని వెళ్ళి నిద్రపోయాడు.
    చలపతికి జ్వర తీవ్రత మీద ఉడుకులాం తగుల్తుంటే చల్లగా ఉంది. హాయిగా అనిపిస్తుంది. అది వేస్తున్నంత సేపూ జ్వరం తగ్గుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఓ అరగంట పోయేసరికి తల తిప్పటం మొదలయ్యింది. కళ్ళు మంటలు ఆరంభం అయింది. అయినా అతను అలాగే పడుకున్నాడు.
    బయట గదిలో రాఘవులు గుర్రు పెట్టి నిద్ర పోయాడు. అ గుర్రుకి లిల్లమ్మ కు మెలుకువ వచ్చింది. గదిలోకి వచ్చి చూస్తె చలపతి జ్వర తీవ్రతతో కొద్దిగా మూలుగుతున్నాడు. రాఘవులు అవతల గదిలో నిద్రపోతున్నాడు. ఆమెకు మనస్సు ఒప్పలేదు. చలపతి ఒంటి మీద చెయ్యి వేసి చూచింది. జ్వరం అలాగే ఉంది. ఆమెకు తన మానాన తాను వెళ్ళి నిద్రపోవాలని అనిపించలేదు. అక్కడే కూర్చుని ఉడుకులాం వేసింది. చల్లని ఆ స్పర్శ తగిలేసరికి చలపతికి మెలుకువ వచ్చింది. కళ్ళు తెరిచిచూస్తే లిల్లమ్మ ఆవులిస్తూ పక్కనే కూర్చుని ఉంది.
    అతనికి ఆమె ధోరణి దుస్సహసంగా ఉంది. అయిష్టత అతను దాచుకోకుండా వున్నాడు. అదీ ఆమెకు తెలుసు ఇదంతా రాఘవులు చేసిన పని.
    ఆమెకు రాఘవులు మీద కోపం వచ్చింది. ఇష్టం లేని చోటుకి తెలిసి కూడా అతనెందుకు తీసుకురావాలి.
    "డాక్టరు గారు ఇది వెయ్యమన్నారు.రాఘవులు నిద్ర ఆపుకోలేక పోతున్నాడు. అందుకు నేను వస్తున్నాను. ఈ ఒక్క పూట ఓర్చుకోండి. రెండు రోజులు ఓపిక పడితే తగ్గిపోతుంది." అంది లిల్లమ్మ.
    "ఓర్చుకోండి" అన్నమాట ఆమె ఒత్తి ఒత్తి పలికింది. చలపతికి ఆమె తన అంతర్యం గ్రహించు కున్నాదని తెలుసుకున్నాడు. అలా ఆమె తెలుసుకోవాలనే అతని అభిప్రాయం.
    రాఘవులికి ఓసారి మెలుకువ వచ్చి చూసేసరికి లిల్లమ్మ ఓపిగ్గా కూర్చుని ఉడుకులాం వేస్తుంది. అతనికి అక్కడికి గడియారం కనిపిస్తుంది. టైం ఒంటి గంటయింది.  

                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS