జ్వరంతో వున్న రెండు రోజులూ చలపతికి ముళ్ళ మీద ఉన్నట్లే వున్నది. ఆమె సేవలు పొందక తప్పలేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా సహించాడు. జ్వరం మూడో నాటికి పూర్తిగా తగ్గింది. ఒకరోజు పద్యం పుచ్చుకున్నాడు. రెండో పధ్యం తీసుకోకుండానే బిచాణా ఎత్తేయ్యాలని అనుకున్నాడు చలపతి.
రాఘవులు అభ్యంతర పెట్టాడు, " ఇంకొక్క రోజు ఆగండయ్యా. ఇంకొక్క రోజు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పట్నించీ హోటలు మెతుకులు తింటే మళ్ళీ జ్వరం తిరగబెడుతుంది. బాగా నీరసంగా" ఉన్నారు కూడా.
"ఏంరా అమ్మగారు అలా చెప్పమన్నారా?"
"ఛా ఎందుకండి ఆమె మీద మీకింత అనుమానం. నేనే అంటున్నా బాగా నీరసంగా వున్నారు..... ఇంకోరోజు ఆగితే ఏం పోయింది? నిన్నేమీ కొరుక్కు తినేయ్యదుగా లిల్లమ్మ"
"ఇక ఇక్కడ వుండకూడదు రాఘవులు, అన్నయ్య వస్తాడు నాకోసరం....
'అవునవును ఇప్పుడు స్టేటస్ పెరిగింది కదూ. అన్నయ్య గారు వస్తే ఇక్కడకు కబురు వస్తుంది. ఆ ఏర్పాటు నేను చేశాను...."
"రాఘవులూ ఇక నేను ఇక్కడ వుండకూడదు. ఏదో బుద్ది గడ్డి తిని ఇన్నాళ్ళూ ఇలాంటి చోటుల్లో తిరిగాను. ఇక తిరక్కూడదు. నువ్వేమన్నా అనుకో మనుషులు ఒక్కొక్కప్పుడు ఖర్మ కాలి పోయి ఇరుగు పొరుగు వల్ల చెడిపోవచ్చు. అలాగే ఎల్లకాలమూ చెడిపోవాలంటే ఎలా? ఇక గౌరవంగా బ్రతక్కూడదా?"
"అయ్యగారూ తప్పకుండా గౌరవంగా బ్రతకాల్సిందే. ఇలాంటి చోటులకి ఇక మీరు రాకూడదు. మీ స్టేటస్ కి ఇలాంటి చోట్లు పనికి రావు." అన్నాడు రాఘవులు.
ఇంతలో లిల్లమ్మ వచ్చింది. ఆమె రావటం గమనించి రాఘవులు పక్కకి తప్పుకున్నాడు. అతను వరండా లోకి పోయి నిలబడ్డాడు.
"ఇక నేను వెళ్తున్నాను.' అన్నాడు చలపతి.
"ఇంకొక్క రోజు అగరాదూ నీరసంగా ఉన్నారు గదా అంది.
చలపతి ఒప్పుకోలేదు. ఆమె మరి రోక్కించలేదు. వీధి గుమ్మం వరకూ ఆమె సాగనంపింది. రాఘవులు ఆమె చేతిలో సంచి తీసుకున్నాడు.
చలపతి నీరసంగానే బండి వరకూ నడిచాడు.
లిల్లమ్మ అలాగే నిలబడింది.
చలపతి రిక్షా లో ఎక్కి వెళ్ళిపోయాడు. అతను ఇటు వేపు చూడనైనా చూడలేదు. రాఘవులు మాత్రం అస్తమానూ ఇటు చూస్తూనే ఉన్నాడు.
రిక్షా సందు మలుపు తిరిగే వరకూ అక్కడే నిలబడి బండి కనుమరుగవగానే లోపలికి వెళ్ళిపోయింది.
6
పెళ్ళి హడావుడిగా జరిగిపోతుంది. రాఘవులు పెళ్ళి నాడే వచ్చాడు. చలపతయ్య వైపు బంధు బలగం కంటే ఆడపెళ్ళి వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. రంగనాధం ఆమె ఇద్దరు చెల్లెళ్ళు సకుటుంబంగా తరలి వచ్చారు. ఊళ్ళో పెద్దలు కూడా చాలామంది వచ్చారు.
రాజశేఖరం అదే అన్నాడు. "అసలే నీకు స్వతజాభిమానం ఎక్కువ. ఇక్కడ చూస్తె నా బలం బొత్తిగా పల్చగా వుంది. నీ బలం చూస్తె వానర బలం లా కనిపిస్తుంది. కాస్త ఈ రెండు రోజులూ నువ్వటు చెరకు. నీకు చేతులెత్తి మొక్కుతాను."
సుభద్రమ్మ మూతి విరుచుకుని "అదేం కుదరదు "నేను అటువైపే ఉంటాను" అంది.
చలపతి అప్పుడు అక్కడే ఉన్నాడు. "నేనున్నాను. మా అన్నయ్య వంద మంది పెట్టు. మన బంటు రాఘవులు ఉన్నాడు. ఎవరైనా నోరు మెదిపితే ఉండ చుట్టినట్టుగా చుట్టేసి విసిరి అవతల పారేస్తా" అన్నాడు.
సుభద్రమ్మ "బాబ్బాబు అంతపని మాత్రం చెయ్యకు. నేను ఏదైనా గొడవ లోస్తే సర్దుతానుగా" అంది.
రంగనాధం ఒకటి రెండు సందర్భాలు కొంచెం బలం మీద ఏదో నసగబోయాడు గాని చలపతి ముఖం వాచేలాగా ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చాడు.
పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి పందిరి నిండా జనం తొక్కిసలాట పడుతున్నారు. పిల్లలు గోణగోణ గొడవ చేస్తున్నారు.....రాజశేఖరం "ఇక్కడ అంతా ఆడపెళ్ళి వారేనండి మొగ పెళ్లివారంటూ ఉన్నదల్లా పెళ్ళి కొడుకు ఒక్కడే. అంటున్నాడు.
అన్నగారి భయానికి చలపతి నవ్వుకున్నాడు.
ఇంతలో ఎవరో పెళ్లి కూతురు అన్నగారి దగ్గర జేరి చెవులో మెల్లగా అన్నాడు "ఏవిటి రంగనాధం తెలిసే ఒప్పుకున్నావా ఈ సంబంధానికి" అని ఆతగాడు అప్పుడే ఊరు నించి దిగబడ్డాడు.
రంగనాధం అయోమయంగా "అంటే?" అన్నాడు.
"ఇతగాడు ఎవరనీ నీ ఉద్దేశం? ఇతగాడు చెడిపోయిన పోరంబోకు. తాగుడు, అలవాటుంది వ్యభిచారిస్తాడు. వీడికో ముండ కూడా ఉంది. వీడి మీద పోలీసు కేసులు నా తలమీద వెంట్రుకలన్నీ వున్నాయి. ఖూనీ కేసులున్నాయి వీడి మీద. నీ చెల్లెలు ఇలాంటి వాడి చేతుల్లోనా పెట్టడం. ఇప్పటికైనా మించి పోయింది లేదు ఆపెయ్యి. నే తెస్తాను ఇంతకంటే మంచి సంబంధం.... అమ్మాయికేం స్కూలు ఫైనలు పాసయ్యింది ఏదైనా ఉద్యోగం చేసుకునైనా సంపాదించు కుంటుంది...."
రంగనాధం కోపంగా అరుపులు మొదలు పెట్టాడు. రాజశేఖరం అతని ధోరణి ని అపు చెయ్యాలని చూశాడు గాని అతను బ్రతిమిలాడు తున్న కొద్దీ రంగనాధం రెచ్చిపోయాడు. అతని బావమరుదులు చెల్లెళ్ళూ అతనికి వత్తాసు వచ్చారు. రాజశేఖరం ఒక్కడూ సమాధానం చెప్పలేక తల పట్టుకుని వాళ్ళ మధ్య నించి మెదలక వచ్చి అరుగు మీద చతికిల పడ్డాడు.
ఈ గొడవలో పెళ్ళి ఆగిపోయింది. పురోహితుడు నివ్వెరపోయి చూస్తున్నాడు.
రంగనాధం రాజషేఖరాన్ని వదలకుండా మీది మీది కొచ్చి రెట్టిస్తున్నాడు. "మోసం చేస్తావా? నా చెల్లెలు పెళ్ళి కాకపొతే అలాగే ఉండి పోతుంది. ఏదైనా ఉద్యోగం చేసుకునైనా బ్రతుకుతుంది. ఈ త్రాగుబోతుని, వ్యభిచారిని కట్టుకొని అదేం సుఖపడుతుంది. నాతో మాట మాత్రం చెప్పకుండా మీరంతా కలిసి దాని గొంతు కోయ్యాలని చూస్తారా?" అన్నాడు.
ఈ గొడవలో రాధమ్మ తల్లికి ఫిట్స్ వచ్చింది. ఆమె ఒంటి మీద స్మారకం లేకుండా పడి పోయింది. ఆమె కూతుళ్ళు ఇతర బంధువులు ఆమె చుట్టూ చేరారు.
రాజశేఖరం మీది మీదికి రంగనాధం అతని బావామరుదులు చుట్టేసి దబాయిస్తుంటే చలపతి చూస్తూ ఊరుకోలేక పోయాడు. చర్రుమని దూసుకుపోయి రంగనాదాన్ని మెడ కాలరు పట్టుకుని వెనక్కి ఓ లాగు లాగాడు. రంగనాధం ఆ ఊపికి వెనక్కి పోయి చాపల మీద చతికిల బడ్డాడు.
అతని బావామరుదులు ఈ ధోరణి కి కాస్త జంకి వెనక్కి తగ్గారు. రంగనాధం చలపతి విసురుకి నడుం బెణికి చట్టున లేవలేక పోయాడు. అతని బావామరుదులు పెళ్ళాల ముందు పరువు పోగొట్టుకోనటం ఇష్టం లేక రంగనాదాన్ని సాయం పట్టి పందిట్లోంచి గదిలోకి తీసుకుపోయారు.
చలపతి అన్నగారితో "ఏవిటీ గొడవ అన్నయ్యా. ముందే వాళ్ళకు చెప్పక పోయావు. ఇష్టం అయితేనే ఒప్పుకునేవారు." అన్నాడు.
రాధ తల్లి వారగా కన్నీరు కారుస్తూ కూర్చుంది.
రాజశేఖరం దగ్గరికి సుభద్రమ్మ వచ్చి "అలా చూస్తూ కూర్చుంటారేమండి. వెళ్ళి నచ్చ చెప్పండి" అంది.
చలపతి "ఏవిటి నచ్చ చెప్పేది. ఇష్టం లేకపోతె మానేయ్యమను. నాకేం నష్టం లేదు" అన్నాడు.
రాజశేఖరం ఈ గొడవకి బాగా చికాకు పడ్డాడు . సుభద్రమ్మ అక్కడ మరిది గారు లేకుండా వుంటే తన వాళ్ళను వెనకేసు కొచ్చి భర్తను విసుక్కునేది.
రాజషేఖరాన్ని తీసుకుని సుభద్రమ్మ లోపలికి వెళ్ళింది. రంగనాధం కుర్చీలో కూర్చుని ఇంకా ఉద్రేకంగా బావామరుదులు, చెల్లెళ్ళ దగ్గర అరుస్తున్నాడు. సుభద్రమ్మ ను రాజశేఖరాన్ని చూడగానే అతని ధోరణి ఇంకా హెచ్చిపోయింది.
"నీక్కూడా కూతుళ్ళున్నారు. ఇలాంటి సంబంధాలు చెయ్యగలరా?" అన్నాడు రంగనాధం.
అతని బావమరుదులు వత్తాసు పలికారు.
రాజశేఖరం "నువ్వు తొందర పడుతున్నావు రంగనాధం. ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే ఎవరికి నష్టం? వాడు వెళ్ళిపోతానంటున్నాడు. ఏదో కాస్త వ్యసనాలున్నాయని పూర్తిగా చేడిపోయినట్టే. అలా మాట్లాడితే ఎలా? బాగా ఆలోచించు. నా మాట విని ఇక గొడవ చెయ్యకేం. అన్నాడు.


రంగనాధం ఒప్పుకోలేదు. "ఇక ఈ సంబంధం చెయ్యను." అన్నాడు.
"తెలిసి తెలిసి ఆమె జీవితం గోతిలోకి తోసెయ్యలెం" అన్నారు అతని బావమరుదులు.
"సరే అయితే ఓ పని చేద్దాం. పోనీ అందుకైనా ఒప్పుకో. రాధమ్మ కి ఎలా ఇష్టం అయితే అలా చేద్దాం. ఆమె అంతా విందిగా" అన్నాడు రాజశేఖరం.
సుభద్రమ్మ 'అలా చేస్తే బాగుంటుంది" అంది.
అంతా రాధమ్మ దగ్గరకు వెళ్ళారు. ఆమె తల్లి పక్కగా కన్నీరు తుడుచుకుంటూ కూర్చుని ఉంది. పెద్దావిడ కింకా బాగా స్పృహ రాలేదు.
రంగనాధం ఆమెని అడిగాడు. "విన్నావుగా రాధా. ఇప్పుడు చెప్పు. నీకు యిష్టమయితేనే ఈ పెళ్ళి జరిపిస్తాను. ఇష్టం లేకపోతె ఆపేస్తాను. అతడ్ని గురించి విన్నావుగా నాకు తెలియకే ఈ సంబంధం నిశ్చయం చేశాను" అన్నాడు.
రాధమ్మ అసలు ఎందుకు ఇంత గొడవ చేశావు నువ్వు?" అంది.
రంగనాధం కొంచెం కంగారు పడ్డా "నీ మంచి కోసరమే" అన్నాడు.
"అయితే ఈ సంబంధం నాకు యిష్టమే" అందామె.
రంగనాధం కొంత చిన్న బుచ్చుకున్నా 'అయితే సరే నీ యిష్టం" అన్నాడు.
కాని చలపతి అభ్యంతరం లేవదీశాడు. ఇంత గొడవ జరిగిం తర్వాత ఈ సంబంధం చేసుకోవాలని ఉందా? " అంటూ రాఘవుల్ని తన బట్టలు సర్దమని పురమాయోస్తున్నాడు.
రాజశేఖరం అతడ్ని బ్రతిమిలాడి సుభద్రమ్మ చేత చెప్పించినా చలపతి ఒప్పుకోలేదు. కొసకి రంగనాధం అతని రెండు చేతులూ పట్టుకుని క్షమాపణ చెప్పుకున్న తర్వాత వెళ్ళి పెళ్ళి పీటల మీద కూర్చున్నాడు చలపతి. అప్పటికే పెళ్ళి కూతురు ముఖం కందిపోయి ఉంది.
సుభద్రమ్మ తన వాళ్ళకి భర్త తన దగ్గర కూడా మరిది గురించిన వివరాలేమీ చెయ్యలేదని ఆసలు అయన క్కూడా అంతగా తెలియదని ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితమే అతడి మానాన అతడ్ని వదిలేశారని చెప్పి తాము నిర్దోషులమని రుజువు చేసుకుంటుంది.
