సాయంత్రం రాఘవులు హాలుకి వచ్చే సరికి తనగదిలో చలపతి మడత మంచం మీద పడుకుని ఉన్నాడు. అతనిలో చలనం లేదు. నిద్రపోతున్నాడేమో అనుకున్నాడు రాఘవులు. చలపతి వైపు నించి సన్నగా మూలుగు వినిపించింది.
రాఘవులు దగ్గరకు వెళ్ళి మీద చెయ్యి వేసి చూశాడు. ఒళ్ళు కాలిపోతోంది. చెక్కిలి మంటల పేలిపోతూంది జ్వరం. ముఖం నిగారించి వున్నది.
"చలపతయ్య 'అని పిల్చాడు రాఘవులు.
చలపతి ఉలకలేదు, పలకలేదు. ఇంకా మూలుగుతూనే ఉన్నాడు.
రాఘవులు చలపతిని అటూ ఇటూ కదిపాడు. మళ్ళీ గట్టిగా ఓసారి పిల్చాడు.
చలపతి కొద్దిగా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసేశాడు.
తిరిగి అతను కళ్ళు తెరిచేసరికి మంచం వారగా లిల్లమ్మ కూర్చుని తన నుదుటి మీద ఉడుకులాం వేస్తోంది. చలపతి కళ్ళు గట్టిగా మూసుకుని ఓసారి తెరిచాడు. తాను భ్రాంతి లో లేడు. లిల్లమ్మ ఎదురుగ్గా కూచుంది. అతనికి సిగ్గు వేసింది. రాఘవులు మీద కోపం ముంచుకు వచ్చింది. వాడి చేసిన పనే ఇది. అతను ముఖం పక్కకు తిప్పుకుని కళ్ళు మూసుకున్నాడు.
బయటినుంచీ బూట్ల టకటకలు రాఘవులు గొంతు వినిపించాయి.
"లిల్లిమ్మ గారూ డాక్టరు గారొచ్చారు." అంటున్నాడు రాఘవులు.
డాక్టరు తనను పరీక్ష చేస్తున్నాడు. "ఫర్వాలేదు. జ్వరం త్వరలోనే తగ్గిపోతుంది." అని ఆయనేదో మందు రాసిచ్చాడు.
లిల్లమ్మ ఆ మందు తీసుకు రమ్మని రాఘవులుకి పురమాయిస్తోంది.
చలపతి గట్టిగా పీల్చి రాఘవుల్ని ఆపాలని కళ్ళు బలవంతాన తెరిచి 'రాఘవులూ" అన్నాడు. కానీ అప్పటికే రాఘవులు వెళ్ళిపోయాడు. లిల్లమ్మ వీధి గుమ్మం తలుపు మూసి వెనక్కి వచ్చింది. ఆమె తన గొంతు వినిపించుకున్నట్టు లేదు.
చలపతి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
తన నుదుటి మీద మళ్ళీ చల్లటి ఉడుకులాం గుడ్డ ఆమె చల్లని వెళ్ళు తగిలాయి. "ఏమండోయ్ మిమ్మల్నే" అంది లిల్లమ్మ.
చలపతికి కళ్ళు తెరవాలని లేదు. మాట్లాడకుండా వూరుకున్నాడు.
ఆమె ముందుకు వంగి చెవి దగ్గర ముఖం పెట్టి "మిమ్మల్నే నండి" అంది.
చలపతి కళ్ళు తెరిచి కిటికీ వేపు చూస్తుండి పోయాడు.
"అక్కడే ముంది. ఇటు చూడండి" అంది లిల్లమ్మ.
చలపతి అటువైపే చూస్తున్నాడు.
"అబ్బోస్ కోపం కాబోలు."
తనకి ఇష్టం లేని పని చేసినందుకు రాఘవులి మీద అతనికి పీక మొయ్య కోపంగా ఉంది.
"నిన్ననగా వచ్చారటగా ఊళ్ళోకి."
చలపతి ఉలకలేదు, పలకలేదు."
"పోనీలెండి. నాతొ మాట్టడటం ఇష్టం లేకపోతె మాట్లాడ వద్దులెండి. " అంటూ లిల్లమ్మ గ్లాసు నీళ్ళలో రెండు ఉడుకులాం చుక్కలు వేసింది.
చలపతి కళ్ళు తెరిచి జేబులోంచి రెండు పది రూపాయల నోట్లు తీసి ఆమె ముందు ఉంచాడు. అంతకంటే ఆమెకేమీ సమాధానం చెప్పలేదు.
"ఎండుకవి?" అంది లిల్లమ్మ.
"ఉండని ఖర్చుకి ఉంటుంది" అన్నాడు చలపతి.
లిల్లమ్మ అవి తీసుకోలేదు. ఆ నోట్లు అతని జేబులోనే కుక్కింది. అతను వద్దని వారించినా వినిపించుకోకుండా. అతని ముఖం చికాగ్గా ఉంది.
చలపతి ముఖం చిట్లించి "చెప్పిన మాట విను" అన్నాడు.
"చెప్పిన మాట వినటానికి నేనేమీ కట్టుకున్న పెళ్ళాన్ని కానండోయ్ . అలా వినేవాళ్ళు ఎలాగూ వస్తారుగా. వాళ్ళ మీద మీ అధారిటీ చేలాయించండి."
చలపతి ఓసారి ముక్కు ఎగ పీల్చాడు.
అతనికి కొంచెం జ్వర తీవ్రత తగ్గింది. కాస్త తేలిగ్గా యిటు పడుకున్నవాడు అటు ఒత్తి గిల్లాడు. లిల్లమ్మ కాస్త చిన్నబోయింది.
చలపతి ఆ దిశ నుంచి మరో మారు ముక్కు ఎగ పీల్చాడు. అతను కళ్ళు తెరుచుకునే వున్నాడు. ఆమె మనసులో కష్టాన్ని ముఖం మీదకు కనబడకుండా దాచుకునేందుకు ప్రయత్నించింది. ఎంతో గుండె భారంతో నిగ్రహించుకుంది.
ఎదుట వున్న వ్యక్తీ ముప్పయి సంవత్సరాల వాడుగా గాక మూడేళ్ళ పసి వాడుగా ఆమె కంటికి కనిపించాడు. ఆమె పెదాల మీదికి సన్న నవ్వు వచ్చింది.
బయట వీధిలో ఉండి ఉండి ఓ రిక్షా, ఓ కారు దూసుకుపోయిన చప్పుడు మినహా అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంటి మొగలో నున్న కిళ్ళీ దుకాణం దగ్గర చేరిన వాళ్ళ సంభాషణలు వినిపిస్తున్నాయి.
చలపతి గదంతా ఒకసారి కలయజూశాడు. గోడలన్నీ చూశాడు. ఎక్కడివక్కడ చాలా శ్రద్దగా సర్ది నట్టుగా వున్నాయి. ఆ గది నిండా ఎక్కడ పడితే అక్కడ లిల్లమ్మ చీరలు, జాకెట్లూ ఆమె తాలూకు ఇతర వస్తువులు అడ్డదిడ్డంగా పడి వుండేవి. అలాంటిది యిప్పుడా గది అంతా చాలా నీటుగా అందంగా సర్ది వుంది. ఆ గదిలో ఆమె తాలుకూ ఒక్క చీర గాని, రవిక గాని కనబడలేదు.
తన మంచం మీద వేసిన దుప్పటి తెల్లగా మల్లె పువ్వులాగా ఉంది. తనకి అలా నీటుగా ఎక్కడి వక్కడ సర్ది వుండటం ఇష్టం అని , ఆమె తన్ని ఆకర్షించటానికి అలా చేసింది కాబోలు. ఆ గదిలో ప్రతి చిన్న ప్రదేశం అదే చెబుతున్నట్టు అతనికి అనిపించింది.
అయితే ఆమె మాత్రం చాలా సాదా చీరకట్టుకుంది. తలయినా సరిగ్గా దువ్వుకోలేదు. ముడి వేసుకుందేమో వెంట్రుకలు గాలికి ఊడిపోయి ముఖం మీదకు పడుతున్నాయి. ఆమె ముఖం జిడ్డు డుతూ ఉంది. ఇదివరకైతే ఆమె చాలా ముస్తాబు చేసుకుని తనకోసరం ఎదురు చూస్తున్నట్టుగా కనబడేది.
చలపతికి ఆమె ధోరణి అర్ధం కాలేదు. "తానేమీ కట్టుకున్న పెళ్ళాం కానని ఇప్పుడేగా అంది. తాను జ్వరంతో ఉంటె ఆమె అలంకరించుకోవటానికి ఇష్టం లేక అనుకుందుకు. చలపతికి రాఘవులు అన్న మాటలే స్పురణకు వచ్చాయి. ఆమెకు కట్టుకున్న భార్య లాగ ఉండాలని అలా వుంటే తాను ఆమెను ఎక్కువగా గౌరవిస్తానని ఆదరిస్తానని ఆమె ఎత్తు కావచ్చు. సందర్భోచితంగా ఆమె ఇలా ప్రవర్తిస్తుందేమో?
మందులు తీసుకుని రాఘవులు వచ్చాడు.
"డాక్టరు గారు ఇంకేమైనా చెప్పారా?" అంది లిల్లమ్మ.
"జ్వరం తగ్గడానికి నాలుగయిదు రోజులు పడుతుందన్నారు. ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా చూడమన్నారు." అంటున్నాడు రాఘవులు.
చలపతి జేబులోంచి పది రూపాయల నోటు తీసి రాఘవులికి ఇచ్చాడు. రాఘవులు తీసుకోబోతుంటే "ఎందుకు ఇచ్చేయి రాఘవులు" అంది.
"ఉండనీ" అంటూ చలపతి ఒత్తిడి చేశాడు.
లిల్లమ్మ కోపంగా "సరే తీసుకో రాఘవులు. ఈ మందులకి ఎంతయిందో అది నాకు ఇవ్వు" అంది.
రాఘవులు ఆ నోటు లిల్లమ్మ చేతిలో వుంచాడు. ఆమె పెదాలు బిగపట్టుకుని ఆ నోటు తీసుకుని కొంగుకు ముడి వేసుకుంది.
కుంపటి రాజేయ్యటానికి జావా కాచటానికి ఆమె వంట గదిలోకి వెళ్ళింది.
రాఘవులు స్టూలు మీద కూర్చున్నాడు.
చలపతి కోపంగా చూసి "ఎందుకు తీసుకు వచ్చావు ఇక్కడికి" అన్నాడు మెల్లగా.
రాఘవులు స్టూలు దగ్గరగా లాక్కుని "అక్కడే ఉంటె ఈ చాకిరీ అంతా ఎవరు చేస్తారు మీకు" అన్నాడు.
'ఎందుకీ హడావుడి హంగామా. నాలుగు అనాసిన్ మాత్రలు మింగి కళ్ళు మూసుకుని పడుకుంటే లంఖణం పరమ ఔషధం అన్నారు. తగ్గకేం చేస్తుంది." అన్నాడు మెల్లగా.
రాఘవులు ఈ మాటలు ఆమెకు వినిపిస్తాయే మోనని వెళ్ళి తలుపులు దగ్గరగా వేశాడు.
లిల్లమ్మ అవతల గదిలో పొయ్యి రాజేస్తుంది.

ఆమెకు అవతల గదిలో మాటలు కొద్దిగా వినబడుతున్నాయి. అయినా ఆ మాటలు ఆమె వినదల్చుకోలేదు. రాఘవులు దగ్గరగా వేసిన తలుపుల్ని ఆమె ఇంకా దగ్గరగా లాగి అవతల గడియ వేసేసింది.
రాఘవులు ముఖం బాధగా పెట్టి "ఇప్పుడెం కొంప మునిగి పోలేదు లేవయ్యా" అన్నాడు.
చలపతి అభిమానం దెబ్బతిన్న స్వరంతో "నీకు తల తిక్క ఎక్కువయింది. నీకు తోచినట్టు చేస్తున్నావు." అన్నాడు కోపంగా.
ఆమె ఇంతగా ఆదరిస్తున్నా ఆమె అభిమానాన్ని తృణీకరించటంలో చలపతి ఇంత నిర్మోహమాటంగా ప్రవర్తించటం రాఘవులికి చాలా బాధగా ఉంది.
'అక్కడే ఉంటె జ్వరం ఇంకా పెరిగి పోతుంది. అయినా లిల్లమ్మంటే ఇంకా మీ కోపం చల్లారలేదా? ఆమెను మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు. చలపతయ్య."
