"మీకు తెలియనిది చెప్పొద్దు. తెలిసిందే చెప్పండి.."
"ఏం చెప్పాలి?"
కిల్లర్ వివరించసాగాడు.
రామావతారానికి పెళ్ళికి పూర్వం రమణ్కుమార్ అనే యువకుడితో పరిచయముంది. రమణ్ కుమార్ ఆమెను మోసంచేశాడు. ఆమెకు పెళ్ళయినా అతడామెను వదలకుండా బెదిరించి అనుభవిస్తున్నాడు. రామావతారం అందుకు మానసికంగా సిద్దపడిలేడు. కానీ తన కాపురం నిలబెట్టుకోవడంకోసం ఆమె యిష్టంలేని పనిచేస్తోంది. అయితే యే రహస్యమైనా ఎన్నాళ్ళో దాగదు.
రామావతారం ఇంటికి రామన్ కుమార్ వచ్చిపోతున్న విషయం శంభునాధ్ గమనించాడు. వాళ్ళమీద నిఘా వేశాడు. వాళ్ళ సంభాషణను వినడమే కాక పాకెట్ కాసెట్టే రికార్డర్లో రికార్డుచేశాడు. అటుపైనుంచీ శంభునాధ్ రామావతారం వెంటబడ్డాడు. తనకు లొంగక పోతే ఆమె భర్తకు నిజం చెప్పేస్తానన్నాడు.
రామావతారం లొంగలేదు. తనలాంటిదాన్ని కాదని వేడుకుంది. రమణ్ కుమార్ ని తనకో పీడలా దాపురించాడని వాపోయింది. తన అసహాయత నాధారంగా తీసుకొని వేశ్యగా మార్చవద్దని కోరింది. శంభునాధ్ కరగలేదు.
చివరికామె ఒకరోజున అతణ్ణి సాయంత్రం రమ్మనమని చెప్పింది. అతడు వెళ్ళాడు. గదిలో ఆమె పడుకుని వుంది-దుప్పటి కప్పుకొని. దుప్పటి తీసిచూస్తే ఆమె శవముంది!
శంభునాధ్ భయపడ్డాడు. బయటకు వద్దామంటే ఎవరో తలుపులు వేసి బయట్నుంచి గడియపెట్టారు.
"అప్పుడు మీరు వెళ్ళారు. శంభునాధ్ తప్పించుకోవడమే కాక పోలీసులకు ఫోన్ చేశాడు కూడా...." అన్నాడు కిల్లర్.
నేను కిల్లర్ చెప్పేది వింటున్నాను. అంటే ఇతడు మొత్తం నా గురించిన కథంతా తెలుసుకున్నాడన్న మాట!
"ఇప్పుడింతకీ మీరు నాకు చేయాల్సిన సాయమల్లా రామావతారం పూర్వ పరిచయమున్న ప్రేమికుడు రమణ్ కుమార్ మీరేనని! మీరు కాదన్నా శంభునాధ్ టేప్ రికార్డరు ఔనని ఋజువు చేస్తుంది. అవునంటే హంతకుడు మీరు కాదని తేలిపోతుంది...."
"హంతకుడెవరు?"
"ముందు మీరు చెప్పండి. రామావతారం విషయంలో మీరు గతంలో చెప్పిందంతా అబద్దం ఆమెను మీరు బ్లాక్ మెయిల్ చేసి ఇష్టంలేని పనికి ఒప్పించారు. అవునా?"
"అవును-...." అన్నాను తలవంచుకుని.
"రామావతారాన్ని ఆమె భర్త చంపాడు. శంభునాధ్ తనింటికి రాకపోకలు చేస్తూండడం గమనించి నిఘావేసి అతడోరోజున మొత్తం కధ తెలుసుకొని-భార్యను నిలదీసి పూర్తినిజం తెలుసుకుని-"వాళ్ళిద్దరినీ రాత్రి ఏడుగంటలకు రమ్మని చెప్పు అందరిముందూ ఈ సమస్యకు పరిష్కారం చెబుతాను-" అన్నాడు భార్యతో.
ఆ రోజతడాఫీసుకు వెళ్ళినట్లే వెళ్ళి దొడ్డిదారిన తిరిగి వచ్చాడు. చివరిసారిగా భార్యతో అన్ని సుఖాలూ పొందాడు. తర్వాత ఆమెను ఒక్కసారి కళ్ళు మూసుకో మన్నాడు. బాకుతో గుండెల్లో పొడిచి-అరవకుండా నోరు మూశాడు. శంభునాధ్ ని గదిలో యిరికించి తను వెళ్ళిపోయాడు.
అన్నాళ్ళూ మామూలుగా వుంటూ ఉన్నట్లుండి భార్య పోయిన రోజునే ఊరి ప్రయాణం పెట్టుకోవడం చాలా రోజులవరకూ తిరిగిరాకపోవడం తనమీద అనుమానానికి దారితీస్తుందని గ్రహించలేకపోయాడు. ఎందుకంటే అతడు ప్రొఫెషనల్ మర్దరర్ కాదు. ఆవేశం అతణ్ణి హత్యకు పురిగొల్పింది. హత్యచేశాక అతడు పశ్చత్తాపపడ్డాడు. తిరిగి రాగానే నేనూ, పోలీసులూ ప్రశ్నలు వేసి దబాయించేసరికి నిజం ఒప్పుకోని యేడుస్తూ కూర్చున్నాడు. ఈ కేసులోంచే మీరు బయటపడ్డారు-" అన్నాడు కిల్లర్.
"థాంక్స్!" అన్నాను అప్రయత్నంగా. కానీ ఎందుకో నాకు సంతోషంగాలేదు. రాధవైపు చూశాను. ఆమె అప్పుడే లేచి లోపలకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఆమె చేతిలో నోట్లకట్టలున్నాయి. వందరూపాయల నోట్లకట్టలు.....రెండు.....అంటే మొత్తం యిరవైవేలు.....
కిల్లర్ డబ్బు అందుకుని-"థాంక్స్!" అన్నాడు.
"నా భర్తను రక్షించారు. మీ మేలు మరిచిపోలేను" అంది రాధ.
కిల్లర్ మాట్లాడలేదు. తమాషాగా నవ్వి ఓసారి చేయి వూపి వెళ్ళిపోయాడు.
రాధ నావైపు తిరిగింది. రమ్మన్నట్లు నావైపు చూసి ముందుకు నడిచింది. నేనామెననుసరించాను.
ఇద్దరం వెళ్ళి మంచంమీద పడుకున్నాం పక్కపక్కగా.
"తప్పుచేశాను రాధా - నన్ను క్షమించు....." అన్నాను.
"మీరు నా నుంచి చాలా దాచారు....."
"ఇంకెప్పుడూ ఏమీ దాచను...."
"థాంక్స్ ఫర్ ది ప్రామిస్...." అంది రాధ ఆమె మనోహరంగా నవ్వి-"ఒక్కసారి కళ్ళు మూసుకోండి" అంది.
ఆమెను సంతృప్తిపరచడంకోసం యేం చెప్పినా చేయాలి. కళ్ళుమూసుకున్నాను.
"కళ్ళు తెరవండి!" అంది రాధ.
తెరిచాను.
రాధ చేతులు వెనక్కి వున్నాయి. ఆమె ముఖం ఎర్రబడి వుంది.
"ఏ తప్పునైనా నేను క్షమించగలను. సహృదయంతో అర్ధం చేసుకోగలను. పరిస్థితుల ప్రభావంవల్ల స్త్రీ ఆకర్షణకు లోనుకావడం పురుషుడికి సహజం. కానీ మీరు రామావతారం జీవితంతో ఆడుకున్నారు. ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె హత్యకు మీరే కారణం. ఆమె భర్తను మీరే హంతకుణ్ణి చేశారు...."
"అవును రాధా! ఇంతవరకూ నేను చేసినవన్నీ తప్పులే! నేను రాక్షసుణ్ణి కానీ నువ్వు దేవతవి. నీ సాహచర్యంలో నా రాక్షసత్వం పోతుంది.." అన్నాను.
"నేను దేవతనే కావచ్చు-కానీ రాక్షసుడి సహచారిణిగా చాలాకాలం బ్రతికాను. అది నాలో రాక్షసత్వాన్ని నింపదా?" అంది రాధ.
ఆమె మాటల కర్ధం తెలిసేలోగా-ఆమె రెండు చేతులూ ముందుకు వచ్చాయి. ఆ చేతుల్లో కత్తి వుంది. నేను కదిలేలోగా ఆ కత్తి నా గుండెల్లో దిగబడింది.
కెవ్వుమని అరిచాను.
"నిన్ను ప్రేమించడం జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పునిప్పుడే సవరించుకున్నాను. నాకిప్పుడే సంతోషంగా వుంది....." అంటూ నవ్వుతోంది రాధ.
నన్ను రక్షించడానికి కిల్లర్ ని నియమించిన రాధ, మరో స్త్రీతో నేను అనుభవం పంచుకున్నా సహిస్తానన్న ప్రేమమూర్తి రాధ..తనే నన్ను అంతంచేసింది...
ఇంకా ఏమో అనిపించేలోగా నా కళ్ళు మూతలు పడ్డాయి.
-:అయిపోయింది:-
