నాకు గొంతు పెగల్లేదు.
"సమాధానం గురించి మీరాలోచిస్తున్నట్లున్నారు. నిజం చెప్పాలా, అబద్దం చెప్పాలా అన్న ఆలోచన అది! మీరు నిజం చెప్పడానికి సహకరించే ఓ సమాచారం చెబుతాను. అక్కడ తలదిండు క్రింద రెండు పొడవాటి వెంట్రుకలు దొరికాయి. వాటిని కెమికల్ ఎనాలిసిస్ కు పంపడం జరిగింది. వాటిలోని భాస్వరం ఎమౌంట్ ని బట్టి అవి స్త్రీ వెంట్రుకలని తేలింది....."
"అబద్దం-గురుబక్ష్ సింగ్ ఆడది కాదు...."
కిల్లర్ శాంతంగా -"అయిదడుగుల ఒక అంగుళం ఎత్తయిన నాజూకైన సర్దార్జీతో హోటల్ ఉడ్ లాండ్స్ గదిలో మంచంమీద ఏకాంతంగా చనువుగా గడిపారన్న వార్త పత్రికలకెక్కితే-హంతకుడిగా ఉరికంబమెక్కె ముందే అవమానం మిమ్మల్ని చంపేస్తుంది...."
నేను మాట్లాడలేదు.
"గురుబక్ష్ సింగ్ స్త్రీ అనడంలో సందేహం లేదు. పోలీసులు ఫోన్ చేయగానే ఆమె తన స్త్రీ వేషాన్ని ధరించి పురుష దుస్తులు సూట్ కేసులో వదిలి-మిగతా వన్నీ యే చేతిసంచీలోనో వేసుకొని వెళ్ళిపోయుంటుంది. ఆ సమయంలో భుజానికి వ్రేలాడే చేతిసంచీతో ఓ అందమైన యువతి హోటల్లోంచి బయటకు వెళ్ళడం కొందరు చూశారు. ఆమే గురుబక్ష్ సింగ్ అయుంటుందని యెవరూ ఊహించలేదు. కానీ గదిలో ఆమె పాదాల గుర్తులున్నాయి. ఒక్క పై కోటు మినహాయిస్తే ఆమె ధరించిన పాంటు, షర్టు స్త్రీలవని తెలుస్తూనే వున్నాయి. మీరామె వివరాలు చెబితే మీకు నేను హంతకుడి వివరాలు చెబుతాను. నా ఊహ నిజమయితే తప్ప అది బయటపెట్టను. నా ఊహ నిజమో కాదో తెలుసుకోవాలంటే-మీరు గురుబక్ష్ సింగ్ వివరాలు చెప్పాలి...."
అప్పుడు నేను రోజా వివరాలు చెప్పకుండా ఆమె గురించి చెప్పాను.
"అంటే నేననుకున్నది నిజమేనన్నమాట!" అన్నాడు కిల్లర్.
"ఏమనుకున్నారు మీరు?"
"మీ శీలం మంచిది కాదని...."
నేను దెబ్బతిని-"హంతకుడి గురించి చెబుతానన్నారు!" అన్నాను.
"ఒక యువతి వివాహమైనాక మీకోసం భర్తను మోసంచేసి-మారువేషంలో యింత సాహసంచేసి వస్తుందంటే నమ్మడం కష్టం. మీరామెను దేనికో బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకొని వుండాలి...."
"కాలేజీ రోజుల్నుంచీ ఆమే నా వెంటబడింది. నేనామె జోలికి వెళ్ళలేదు-...." అన్నాను ఉక్రోషంగా.
"అంటే అప్పుడుగానీ యిప్పుడుగానీ ఆమె మిమ్మల్ని రేప్ చేసిందా?"
ఈ ప్రశ్నకు తెల్లబోయి-అంటే?" అన్నాను.
"ఆమె ప్రేమకు మీ సహకారంకూడా వున్నదని నా భావం..." అని ఆగి-"ఇంత చెప్పి ఆమె పేరు, చిరునామా మాకివ్వలేరా?" అన్నాడు కిల్లర్.
"ఆమె కన్యాయం చేయలేను...." అన్నాను.
"ఇట్సాల్రైట్ -ఈమాత్రం చెప్పారు చాలు..." అని వెళ్ళిపోయాడు కిల్లర్.
7
"ఇది చూడండి-" అంది రాధ.
అది ఆ రోజు దినపత్రిక. అందులో రెండో పేజీలో రోజా ఫోటో వుంది.
రామావతారం హత్యకేసులో గురుబక్ష్ సింగ్ వ్యవహారానికి సంబంధించిన కొత్త నిజాన్ని కనుగొని డిటెక్టివ్ కిల్లర్ పత్రికలవారికి తెలియబరిచాడు. అతడి పరిశోధనా వివరాలందులో వున్నాయి.
అతడు నేను చదువుకున్న కాలేజీకి వెళ్ళి అక్కడ పరిశోధన కొనసాగించాడు. నా టైములో నాకు పరిచయస్థులైన ఆడపిల్ల లెందరో, వారిలో భాగ్యవంతులెందరో అందులో చదువుకొనసాగుతూండగానే యెవరికి వివాహమయిందో కనుక్కునేఆరికి రోజా పేరు బయటపడింది. అతడామె చిరునామా సాధించడమేగాక కలుసుకున్నాక నిజం చెప్పకపోతే ఆమెను బలవంతంగా మా ఊరు తీసుకొచ్చి హోటల్ ఉడ్ లాండ్స్ లోని వారందరికీ ఆమెను గురుబక్ష్ సింగ్ వేషంలో చూపుతానని బెదిరించాడు. ఆమె నిజంచెప్పేసి రహస్యం కాపాడమని వేడుకుంది.
అదిప్పుడు పేపర్లో వచ్చింది.
"మీరు నాతో చాలా అబద్దాలు చెప్పారు...." అంది రాధ నిట్టూర్చి.
నేనేదో అనేలోగా కిల్లర్ మా యింటికి వచ్చాడు. నన్ను చూస్తూనే-"మీరు చెప్పకపోయినా రోజా గురించి తెలుసుకున్నాను. కావాలనుకుంటే రోజా గురించి మీచేతనే చెప్పించేవాణ్ణి కానీ నాశక్తి సామర్ధ్యాలు మీకు తెలియడం మంచిదనిపించి అలా చేశాను. ఇప్పుడు మీరు ఈ కేసులో మాకు చెప్పకుండా దాచిపెట్టిన మొత్తం రహస్యాలన్నీ బయటపెట్టి సహకరించడం మీకే మంచిది...." అన్నాడు.
"నేను దాచిపెట్టింది ఒకేఒక్క రహస్యం అది మీరు కనుక్కోవడమేకాక బట్టబయలుకూడా చేశారు" అన్నాను.
"మరి రహస్యం కనుక్కునేదెందుకు?"
"రోజా జీవితం ఏమవుతుందో ఆలోచించారా?"
"జీవితాన్ని నిలబెట్టుకోవడం-రహస్యాన్ని దాచడంలో కాదు. రహస్యం అవసరం లేకపోవడంలో వుంది-"అని-"రోజా చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకుంది. అందుకు మీ ప్రోత్సాహమూ వుంది కాబట్టి ఆమెపై జాలివుంటే మీరు మీ భార్యను వదిలి రోజా తోనే కాపురం పెట్టండి-" అన్నాడు కిల్లర్.
"అలా ఎలా కుదురుతుంది?"
"హత్య చేసినవాడు ఉరికంబానికి సిద్దపడక తప్పదు" అని-"రామావతారం పడకగది నానుకుని వున్న బాత్రూంలో మీవికాక మరొకరి వేలిముద్రలున్నాయన్నానుగదా-అవి యెవరివో తెలుసుకున్నాను...." అన్నాడు కిల్లర్.
"ఎవరివి?" అంది రాధ.
"అతడి పేరు శంభునాథ్. నిరుద్యోగి. ఆ వీధి మొత్తానికి తీరుబడివున్న మగాళ్ళు నలుగురున్నారు. ఎంక్వయిరీకి వెళ్ళినట్లు వెళ్ళి ఆ నలుగురివీ వేలిముద్రలు సంపాదించాను. అందులో శంభునాథ్ వేలిముద్రలు మాక్కావలసినవని తేలిపోయింది...."
"అసలతడా వీధిలోనే వుంటాడని యెలా ఊహించారు?"
"రామావతారానికి మగాళ్ళ పిచ్చి వుందని తెలిసింది గదా ఆమె తన వలను విసురుతూనే ఉండివుండాలి. ఆమె ఎవరిమీద వలను విసురుతుందీ అంటే చెప్పడం కష్టం పెళ్ళికాని వాళ్ళనూ, ఏ పనీలేకుండా తీరుబడిగా వున్నవాళ్ళనూ అయితే ఆమెకు సేఫ్ ఆ కోణంలో ఆలోచించి అది ఫలించకపోతే మరో ఆలోచన చేద్దామనుకున్నాను. అదృష్టవశాత్తూ - ఫస్టు బెట్టే క్లిక్కయింది-" అన్నాడు కిల్లర్.
"ఈ కిల్లర్ దేవాంతకుడు-" అనుకున్నాను. నేనిచ్చిన తప్పుడు సమాచారంతో అతడు సరైన మనిషిని పట్టుకున్నాడు. అతడి విజయం కాకతాళీయమా లేక రామావతారం నిజంగానే బరితెగించిందా?-"అంటే ఆ రామావతారం నన్నేకాక చాలామందిని సాధిస్తోందన్నమాట...." అన్నాను.
"దాన్ని సాధించడమనే అంటారు. అనగా సహకరించే వాళ్ళను సాధించడం...." అని నవ్వాడు కిల్లర్.
"శంభునాధ్ నేరం ఒప్పుకున్నాడా?" అంది రాధ.
"ఒప్పుకునేందుకతడు నేరంచేస్తే కదా!" అన్నాడు కిల్లర్.
"మరెవరు చేశారు?"
"మీ శ్రీవారే చెప్పాలి..."
"నిజంగా నాకేమీ తెలియదు...." అన్నాను. కిల్లర్ వ్యవహారంచూస్తే-అతడు నేను హంతకుడినని నాచేతే ఒప్పించేలాగున్నాడు.
