ఎంతో మంచి హంతకుడు!?
"సమాజంలో నాకున్న పలుకుబడి గురించి నీకు బాగా తెలుసుకదూ-శేఖర్!" అన్నాడతను.
"తెలుసును సార్! నిరుద్యోగిగా మూడేళ్ళుగా రోడ్లు మీద తిరుగుతున్న నాకో దారి చూపించారు. అందుకు మీ పలుకుబడి ఒక్కటేకాదు, మంచితనం కూడా కారణమని నమ్ముతున్నాను-" అన్నాడు శేఖర్.
"నీ వద్ద దాపరికం దేనికి? నా పద్దతులు నీకు తెలుసు. అవి మంచివికావనీ నీకు తెలుసు...." అని అతనేదో అనబోతూండగా శేఖర్ మధ్యలో అందుకున్నాడు.
"మంచిచెడ్డలెంచడానికి నేనెంతవాడిని సార్! సాటి మనిషికి సాయపడాలనుకునే ప్రతివాడూ మంచివాడేనని నా అభిప్రాయం. స్వరాజ్యం తీసుకురావడానికి మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోసు భిన్నమార్గాలనుసరించారు. ఎవరి పద్ధతి మంచిదీ అన్న విషయం నేను ఆలోచించను. మొదటి పద్దతిలో అసంఖ్యాకంగా భారతీయులు హింసించబడ్డారు. రెండవ పద్దతిలో బ్రిటీష్ వారు హింసించబడ్డారు. హింస ప్రతిఫలంగా రెండు పద్ధతులలోనూ వచ్చింది-" అన్నాడు శేఖర్.
"చాలా సంతోషం శేఖర్! ఈ నీ అభిప్రాయం ఆధారంగా నాకు సాయపడాలని నిన్ను కోరితే తప్పు పట్టవు కదూ!"
శేఖర్ ఉలిక్కిపడ్డాడు. ఒక్క నిమిషంలో తమాయించుకుని-"సార్! నేను బోసుకు వ్యతిరేకిని కాక పోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఉండివుంటే గాంధీగారి ఉద్యమంలోనే పనిచేసి ఉండేవాన్ని-" అన్నాడు.
"ఎందుకని?"
"నావల్ల రక్తపాతం జరగడం నాకిష్టముండదు...."
అతను నవ్వి-"మిష్టర్ శేఖర్..ఈ ఫోటో చూడు..." అన్నాడు.
శేఖర్ ఆ ఫోటో చూశాడు. అందులో ఓ యువతీ ఉన్నది. ఎంతో అందంగా చిరునవ్వులు చిందిస్తున్నది. చూడగానే మరోఆరి చూడాలనిపిస్తున్నది. శేఖర్ ఆ ఫోటోవంక మళ్ళీ మళ్ళీ చూశాడు.
"ఈమె అయినింటి ఆడపడుచు. నీకంటే చిన్నది. ఇంటర్మీడియేట్ వరకూ చదువుకున్నది. అన్ని విధాలా నీకు తగినది. ఈమెను పెళ్ళిచేసుకోమని అంటే-అది నాకు సాయం చేయడం అయితే ఒప్పుకుంటావా, లేదా?"
శేఖర్ కు క్షణం మాటరాలేదు.."ఇదంతా ఎందుకు?" అన్నాడు కాసేపాగి.
అతడు శేఖర్ వైపే చూస్తూ అభిమానంగా నవ్వాడు. "నేను నీకు అన్యాయం తలపెట్టానని భ్రమపడకు. నాకీ యువతిపై ప్రత్యేకాభిమానమేమీలేదు. ఆమె ఆపదలో చిక్కుకోబోతున్నది. అదీ నా కారణంగా! ఆమెను రక్షించడానికి మిగిలినది ఒక్కటే మార్గం! అది నువ్వు ఆమెను వివాహం చేసుకోవటం! మీరిద్దరూ ఆదర్శదంపతులుగా కలకాలం వర్ధిల్లగలరని నా ఆశ...."
"మా యిద్దరినుంచీ మీరేదైనా ఆశిస్తున్నారా?" అన్నాడు శేఖర్.
"మీ యిద్దరి సంగతి అటుంచు. ఈ వివాహం జరిగితే ఆపైన నీనుంచి కూడా ఏమీ ఆశించను...." అన్నాడతను.
విషయమేమిటో శేఖర్ కు అర్ధంకాలేదు. పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. అలాంటి విషయంలో ఇతడిమాట విని యెవరో అమ్మాయిని పెళ్ళాడితే ఎలా?
అసలా అమ్మాయి యెవరో....జీవితంలో యెవరి చేతనైనా మోసగించబడిందేమో...అతడి దుర్మార్గం గురించి తనకు బాగా తెలుసు. కక్షకడితే అతఃడికి దయాదాక్షిణ్యాలుండవు. ఎలాంటి ఘోరానికైనా వెనుదీయడు. వచ్చినంతకాలం వాడుకుని పెళ్ళి జరిపిస్తానని హామీ యిచ్చాడేమో! ఇందుకు తనకంటే వెర్రి వెధవ యెవరూ దొరకలేదేమో! అయినా - ఇలాంటి ఊహదృష్టిలో ఉంచుకునే ఇతడు తనవంటి వారికి సాయపడుతూంటాడేమో!
"ఆ అమ్మాయి యెవరివల్లనైనా చెడిపోయిందా?" ఈ ప్రశ్న అడగడానికి శేఖర్ కాస్త ధైర్యం చేశాడు.
అతను నవ్వాడు-"మిష్టర్ శేఖర్ నువ్వు తెలివైన వాడివి కావచ్చు. కానీ నీ ఆలోచనా శక్తి నా విషయంలో సహకరించదు. పిచ్చిపిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. వాళ్ళది నిప్పులాంటి కుటుంబం. ఆ పిల్ల నిప్పు. కాకపోతే ఆమెను సురేష్ ప్రేమిస్తాడా?"
"సురేష్ యెవరు?" అప్రయత్నంగా అడిగాడు శేఖర్.
"చెయిర్మన్ గారబ్బాయి...." అన్నాడతడు- "సురేష్ ఆమెను ప్రేమించాడు. కానీ కట్నం లేకుండా పెళ్ళిచేసుకుంటానన్నాడు. సంబంధం యించుమించు నిశ్చయమైపోయింది. రెండు నెలల్లో వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా కావచ్చు....."
"అయితే ఇంక నేను చేయిగలిగిందేముంది?"
"ఈ పెళ్ళి చెడగొట్ట్టాలి. సురేష్ బదులు నువ్వు ఆమెను పెళ్ళి చేసుకోవాలి. ఇదీ నేను నిన్ను కోరేది!"
శేఖర్ దీనికి మరింత భయపడ్డాడు. ఆ అమ్మాయికి చెయిర్మన్ గారబ్బాయి సంబంధం కుదిరితే తన పని ఇంకా కష్టమవుతుంది. పెళ్ళిళ్ళు చెడగొట్టడం తనవల్ల నెలా అవుతుంది?....ఈ సంగతే శేఖర్ అతడికి చెప్పాడు.
"నువ్వు యధాశక్తి ప్రయత్నించు ఆపైన భగవంతుడో నేనో నీకు సహకరించడం జరుగుతుంది" అన్నాడతడు.
"యధాశక్తి అంటే?" అన్నాడు శేఖర్.
"నువ్వామెను ఆకర్షించు. ఆ ఆకర్షణను ప్రేమగా మార్చు, ఆ ప్రేమ పెళ్ళిగా రూపొందేలా చేయి. అది నీ వైపునుంచి చేయాల్సిన యత్నం..."
"ఆమె నిప్పు అన్నారు. నిప్పంటే నాకు భయం."
"పరుల కొంపలు అంటించాలనుకునేవారే నిప్పుకు భయపడతారు. తన ఇంటి దీపం వెలిగించాలనుకునేవాడు నిప్పుకు భయపడడు...."
శేఖర్ కి ఏమనాలో తెలియలేదు. ఇంకా మాట్లాడితే అతడికి కోపంవస్తుందని భయపడి-"ఆమె పేరు, చిరునామా చెప్పండి సార్!" అన్నాడు.
"ఆమె పేరు పద్మిని!" అన్నాడతడు. మిగతా వివరాలు అతడు చెబుతూంటే శేఖర్ నోట్ చేసుకున్నాడు.
2
ఆమె చేతిలోని సిగరెట్ తో తన కెదురుగా వున్న యువతిని సమీపించి-"మీ తియ్యని పేరేమిటో నేను తెలుసుకోవచ్చా?" అనడిగింది.
"నా పేరు పద్మిని. మీ పేరు?" అందా యువతి.
"నా పేరు మానస....మీ దగ్గర అగ్గిపెట్టె ఉందా?"
"ఎందుకు?" అంది పద్మిని.
"ఇందుకు!" అంటూ మానస సిగరెట్ నొకసారి గాలిలో ఆడించి చూపింది.
"మీరు సిగరెట్ కాలుస్తారా?" పద్మిని మరింత ఆశ్చర్యపడింది.
"ఈమధ్యనే అలవాటయింది. అలవాటయ్యాక అనిపిస్తోంది-అసలు సిగరెట్ అవసరం మగాడికంటే ఆడదానికే యెక్కువని!" అన్నదామె.
"ఎందుకని?"
"మగాడు సర్వ స్వతంత్రుడు. అయినా అతఃడికి సమస్యలున్నాయి. అతడి సమస్యలు అతడు తెచ్చిపెట్టుకున్నవి. కానీ ఆడదాని సమస్యలు కేవలం మగాడి కారణంగానే వస్తాయి. ఆడదానికి సమస్యలు వద్దన్నా తప్పవు. ఒక్క సిగరెట్ కాల్చానంటే-పావుగంటసేపు మనసుకెంతో ఉల్లాసంగా ఉంటుంది...."
