Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 9


    "మన అపరాధం శూన్యం. అది పోస్టు డిపార్ట్ మెన్ నడగాలి."
    "పంపించానంటావు. సరే! క్షమించాం! మరి ప్రస్తుతం తమరు......"
    "గుమాస్తా గిరీలే! నువ్వీ మధ్య బొంబాయిలో ఉన్నట్లు సమాచారం అందింది."
    "ఓ సంవత్సరం ఉన్నాలే! నువ్విక్కడికి ఎందుకు వచ్చినట్లు?"
    "రెండువందల రాళ్ళకోసం ఎంత దూరమైనా రావాలి."
    "ఇక్కడే ఉంటావా?"
    "ఆహా! డిపార్టు మెంటువారు నెత్తిన మొట్టి వేంచెయ్యమనేదాకా!"
    పెద్ద హోటల్ ముందు కారు ఆగింది.
    "చచాం, రేయ్, ఈ హోటల్ నీబోటి వేణు గోపాలురకేగాని, నాబోటి తిరిసమెత్తు విశ్వనాధులకు గాదురోయ్....."
    "వెధవ కపిత్వం. దిగు!"
    "ప్లీజ్! ఇప్పుడే శ్రీమతి చేతి కాఫీ...."
    "నువ్వు పెళ్ళయ్యాక పూర్తిగా చెడిపోయావు. అక్కయ్యతో చెప్పి నీ బుర్ర మేజర్ ఆపరేషన్ చేయి స్తాలే. దిగు."
    విశ్వం దిగక తప్పలేదు. వేణు మాటలు విశ్వానికి ఆర్తిని జ్ఞప్తికి తెచ్చినాయి. కాఫీ తాగుతుంటే, "వేణూ! ఆర్తి అక్కయ్య ఇక్కడే ఉందికదూ?" అనడిగాడు.
    "ఉంది."
    "బావ జాడేమైనా తెలిసిందా?"
    "లేదు. బ్రదర్, మొన్న నాన్న దేశం అంతా తిరిగి అయినా తీసుకువస్తాడని వెళ్ళాడు. నేను అక్కడే ఉంటున్నాను. అటే వెళ్దాం."
    బిల్ చెల్లించేసి వచ్చి కారులో కూర్చున్నారు. వేణు అన్నాడు: "సునీత కూడా ఇక్కడే ఉందిరా!"    
    "సునీత.....సునీత? ఎక్కడున్నది?"
    "సిటీలోనే!"
    "నువ్వు చూశావా? మాట్లాడావా? ఏం చేస్తూందిట?"
    "చెప్పుకో మరి!" కాసేపు సస్పెన్సు.
    "అబ్బబ్బ! త్వరగా చెప్పరా!"    
    "నేను రోజూ ఆమెతో మాట్లాడతాను!"
    "రియల్లీ?"
    "ఆమెతో మాట్లాడకపోతే మనకు ఒక్కరోజు గడవదు."
    "క్యా? మొహబ్బత్ సే?"
    "వెధవది! ఇంత క్లూ ఇచ్చినా కనుక్కోలేవు. ఆమె మా ఆఫీసు స్పెషల్ టైపిస్టు!"    
    "గుడ్ గాడ్!" నెత్తిని కొట్టుకున్నాడు విశ్వం.
    "నువ్విచ్చిన లెటర్ ఇచ్చాను. చదివింది!"
    "చివాట్లెన్ని జేబులో వేసుకున్నావు?"
    "పోరా పక్షీ! ఆ రోజులు కావు. పరమశాంతంగా థాంక్స్ చెప్పింది.
    "కొయ్! కొయ్! పరువు పోయినా మర్యాద కాపాడుకుంటున్నావు."
    "ఒట్టు బ్రదర్! అప్పుడు కారణాంతరాలవల్ల చదువు మానేసిందట. నువ్వు కనిపిస్తే మాఫ్ చెయ్యమని అడిగినట్లు చెప్పమన్నది."
    "జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉంటాను."
    "అలా చదువు మానెయ్యటమే మంచిదైందిట. నువ్వంటే ఇప్పుడు ఆమెకు ఎంతో గౌరవం. అప్పటి సునీత వేరు. అప్పుడామె అగ్నిజ్వాల. మాట్లాడిస్తే పలికేది కష్టం. ఇంకా ట్రై చేస్తే ఫైర్ అయ్యేది. ఇప్పుడు ప్రతిమాటకూ జవాబు. ఆ జవాబుల్లో ఎత్తి పొడుపులు. మాట్లాడి-పెదవి బిగబట్టి తీవ్రంగా చూస్తుంది. సమాధానాలివ్వటం కష్టం. ఎవరన్నా లెక్కలేదు. మనం ఎలా ఉంటే అలా ఉనుంది. కాస్త అధికారం ప్రదర్శించామా, నువ్వెంత, నీ ఉద్యోగమెంత అని రిజైన్ చేసినా చేస్తుంది. దీని బాబులాంటి ఉద్యోగం సంపాదించగలనన్న ధీమా ! ఆఫీసు విషయాల్లో ఆమె నాకన్నా సీనియరు. డబ్బుమీద వ్యామోహం లేదు. ఇంతకన్నా పెద్ద ఉద్యోగం కావాలన్న తపన కూడా లేదు. నా కెవ్వరిలోనూ కనిపించని పరిపూర్ణత ఆమెలో కన్పించింది. బ్రదర్!"
    "కథలు రాస్తున్నావేమిటి? కారెక్టర్ స్కెచ్ చేస్తున్నావు?"
    "అనుకోరాదూ!" వేణు మిర్రర్ ను ఇటు తిప్పి విశ్వాన్ని గమనిస్తూ మళ్ళీ అన్నాడు: "సునీత చాలా అందంగా ఉంటుంది కదూ?"
    "ఊఁ!"
    "కళ్ళు మీనాల్లా బావుంటాయి!"
    "ఊఁ!"
    "కోపం చాలా ఉన్నా, మంచి అమ్మాయి."
    "ఊఁ!"
    "అమ్మ, నాన్నా ఎవరూ లేరుట."
    "నీ వ్యవహారం ముదిరిందిట!"
    "కాదు, బ్రదర్! నేను చెప్పేదేదీ అబద్ధంకాదు."
    "నీకు పైత్యం ప్రకోపించటమూ అబద్ధం కాదు."
    "నీవలాగే అనుకో! మా పెళ్ళి జరిగిననాడు......"
    "చింతబరికెల్తో."
    "కాదోయ్ పక్షీ! నీలా గాంధర్వం కాకుండా, స్పెషల్ ఇన్విటేషన్స్ తో. చూస్తూ ఉండు!"
    కారు ఆగింది. రామదాసు వచ్చి గేటు తెరిచాడు, హారన్ విని. లోపలికి వెళ్ళాక ఇద్దరూ దిగి మెట్లెక్కారు. ఆర్తి ఇంట్లోనే ఉంది.
    విశ్వాన్ని చూసి, "ఎప్పుడు వచ్చావు, తమ్ముడూ? అంతా కులాసాయేనా?" అని అడిగింది ఆర్తి.
    "ఆఁ! ఆఁ! మీ ప్రాక్టీసు బాగా సాగుతున్నదా?"
    "ఏదో? ఇప్పుడెక్కడుంటున్నావు?"
    "ఇక ఇక్కడే, అక్కా! ట్రాన్స్ఫరయింది."
    "ఓ!"
    ఆ రోజు అక్కడే భోజనం చెయ్యమన్నాడు వేణు. ఆర్తికూడా అదే అన్నది. విశ్వం అక్కడే తిన్నాడు.
    ఆర్తికి - మాటల్లో విశ్వం పెళ్ళయిన సంగతి, అతనికొక కొడుకన్న సంగతి చెప్పాడు వేణు. వెళ్ళే ముందు కారులో వేణు, "రేపు ఆఫీసు వేళలో రారా! సునీతకు చూడవచ్చు" అంటే, వస్తానన్నాడు విశ్వం.

                               *    *    *

                                       7

    పిహెచ్ . డి. అయ్యాక కొత్తగా అప్పాయింట్ మెంట్. కాని మంచి లెక్చరర్. బాగా చదువుకున్న వాళ్ళకు, సాధారణంగా ఉండే పరధ్యానం కొద్దో గొప్పో ఉన్నది. ఏ విద్యార్ధి పేరేమిటో బాగా తెలుసు. నిన్న చెప్పిన దేమిటో, ఇవ్వాళ చెప్పవలసింది, రేపు చెప్పబోయేవి - అన్ని పాఠాలు బాగా తెలుసు. సబ్జెక్టులను అతను గుర్తుంచుకున్నంత బాగా మరెవరు గుర్తుంచుకోలేరు. ఏ సుబ్బారావేం చేస్తున్నాడో, ఏ అప్పారావు ఆడమ్మాయిలను చూసి ఇకిలిస్తున్నాడో పసికట్టగల సమర్ధుడు. ఒక మంచి లెక్చరర్ కు ఉండే లక్షణాలు అతనిలో ఉన్నాయి.
    వచ్చిన చిక్కు - ఆ లోకంనుండి దైనందిన జీవితంలోకి వస్తే, ఆ చురకుదనం అసలు ఉండదు. ఏదన్నా ఆలోచిస్తూ, బస్ స్టాఫ్ దగ్గిర నిలుచుంటే, ఎన్ని బస్సులు వెళ్ళిపోతున్నా అతనలాగే ఉండిపోతాడు. వచ్చిన రోజే హోటల్లో గది అద్దెకు తీసుకుని, అన్నం తిన్నాక, బస్ స్టాఫ్ దగ్గిరకి వెళ్ళి, ఏదో ఆలోచిస్తూ మధ్యాహ్నం దాకా అక్కడే కూర్చున్నాడు. గమ్మత్తు, తను పరధ్యానం మనిషినన్న సంగతి అతనికి తెలుసు.
    కొత్తగా ఇక్కడికి వచ్చాడాయెను. అసలే హైదరాబాదు - జంటనగరాల్లోనే ఇళ్ళు దొరకటం కష్టం. పైగా బ్రహ్మచారి కూడాను. అందులో ఇటు వంటి పనులు అతనికి బొత్తిగా అలవాటు లేదు. రెండు రోజులు అద్దె ఇంటికోసం తిరగ్గా, తిరగ్గా విసుగెత్తింది.
    ఆ సాయంత్రం తను తిరగ్గా మిగిలిన బజార్లు గాలిస్తున్నాడు. హఠాత్తుగా హిమాయత్ నగర్ లో 'టులెట్' బోర్డు ఒకటి కనబడింది. పోయిన ప్రాణం లేచివచ్చినట్లయింది. వరండాలో ఎవరో కూర్చుని ఉన్నారు. ఏదైతే అదయిందని గేటు తోసుకుని లోపలికి వచ్చాడు. ఎవరో లోపలికి వస్తూండటం చూసి, యాదగిరి వాలుకుర్చీలో సరిగా కూర్చుని, "ఎవరు? ఎవరు కావాలండీ?" అన్నాడు.
    "ఆఁ! నా పేరు నీలకంఠం. ఇక్కడ ఇల్లు అద్దెకు ఇస్తారని బోర్డు చూసి....."
    "ఓహో! అలా కూర్చోండి!" యాదగిరి మరో కుర్చీ చూపించాడు.
    ఇప్పుడు యాదగిరి, సునీత ఒక భాగంలోనే ఉంటున్నారు. యాదగిరి ఆమెనలా కోరాడు. సునీత ముందు సంశయించినా, "నా బిడ్డవు అయితే నువ్వు వేరుగా ఉంటావా, అమ్మా?" అన్నాక సరే నంది. రెండవ వాటాను మళ్ళీ ఎవరికైనా అద్దెకివ్వమని ఆమే చెప్పింది.
    నీలకంఠం తన మామూలు ధోరణిలో మాట్లాడాడు. మొదటి మాటల్లోనే నీలకంఠం ఎటువంటి మనిషో గ్రహించాడు, యాదగిరి, తదనుగుణంగానే అతని ప్రశ్న లన్నిటికీ సమాధానాలిచ్చి, సందేహాలన్నీ తీర్చాడు. ముఫ్ఫయి రూపాయలకు ఖరారు చేసుకుని ఒక నెల అద్దెకూడా అడ్వాన్సుగా ఇచ్చాడు. హోటల్లో సూట్ కేసూ, బెడ్డింగూ ఉన్నాయి, తెచ్చుకుంటానని వెళ్ళాడు.
    అన్నట్లు అతను రాలేదు. దారిలోనే అతనికి కాలేజీ జ్ఞాపకం వచ్చింది. టైమ్ చూస్తే నాలుగైంది. ఈ పాటికి కాలేజీ వదిలే ఉంటారు. అరెరే! తను ఇవ్వాళ అది అసలు మరిచేపోయాడు. కనీసం సెలవైనా పంపలేదు. వెధవది వచ్చిన మూడోరోజే హంసపాదు! మధ్యాహ్నం అన్నంకూడా తినలేదు. ఆ మాట అనుకో గానే అతనికి ఆకాలవటం మొదలెట్టింది. గదికే అన్నం తెప్పించుకుని తిన్నాడు. అన్నం తినగానే నిద్ర వచ్చి నట్లుంది. రేపు కొత్త ఇంటికి వెళ్ళాలని కాగితంమీద వ్రాసుకుని, టేబుల్ మీద పెట్టుకుని, దానిమీద టూత్ బ్రష్, పేస్ట్ ట్యూబ్ పెట్టుకున్నాడు. అలా చేస్తే పొద్దున వాటికోసం వెళ్ళినప్పుడు తనది చూస్తానని. అందువల్ల మరిచిపోవటానికి ఆస్కారం ఉండదని అతని నమ్మిక.
    ఆ పడుకోవటం ఉదయం తొమ్మిది గంటలకు లేచాడు. బ్రష్ కోసం వెళ్ళగానే చీటీ కర్తవ్యం చెప్పింది. గబగబా ఒక అర్ధగంటలో కాలకృత్యాలన్నీ ముగించుకుని, సామాను రిక్షాలో వేసుకుని అక్కడికి వెళ్ళాడు. అప్పటికే సునీత వెళ్ళింది. ఇల్లంతా నిన్ననే కడిగి ముగ్గులు పెట్టి ఉంది. అది చూసి నీలకంఠం భుజాలెగరేశాడు.
    "బావుంది! ఆ పనిమనిషెవరో రోజూ వచ్చి ఇలాగే చెయ్యమనండి. డబ్బులిస్తాను."
    యాదగిరి హాసించాడు. "నిన్ననే వస్తానన్నారు?" అన్నాడు.
    "ఆఁ! వద్దామనే అనుకున్నా! ఏదీ? తీరిక దొరక లేదు." బెడ్డింగు, సూట్ కేసు తీసుకుని లోపలికి వెళ్ళాడు. కొంచెం సేపటికి అతను యాదగిరితో చెప్పి కాలేజీకి వెళ్ళాడు.
    సాయంత్రం ఏడు గంటలకు సునీత వచ్చేసరికి లైటు వెలుగుతున్నది. రాజు నడిగింది, ఆయనెవరో పరధ్యానం మనిషని, నిన్ననే వచ్చి ముఫ్ఫయి రూపాయ లకు అద్దె మాట్లాడుకుని వెళ్ళాడని వివరాలు చెప్పి, "నాలుగు గంటలకు ఓ అయిదారు పుస్తకాలు తెచ్చుకుని కూర్చున్నారు. ఇంతవరకు తలయినా ఎత్తలేదు" అన్నాడు.
    రాత్రి పదకొండు గంటలకు అతను మేలుకునే ఉన్నాడు. మధ్య మధ్య పేజీలు  తిరగేస్తున్న చప్పుడు వినపడేది. అన్నంకూడా తిన్నాడో, లేదో మరి?
    'చిత్రమైన మనిషి!' అనుకుంది సునీత.
    ఉదయం ఆమె లేచేసరికి అప్పటికే అతను లేచాడు. గిరితో ఏదో చర్చిస్తూ, టీ తాగుతున్నాడు. అప్పుడు చూసింది. నీలకంఠం ఆరడుగుల మనిషి. తల దువ్వితే బావుండేది, కానీ అతనికి ఆ సంగతేమీ పట్టినట్లు లేదు. కళ్ళు ఎంతో నిర్మలంగా చూస్తున్నాయి. వదనంలో ఏ భావమూ లేదు. నవ్వినప్పుడల్లా భుజా లెగరెయ్యటం అతని అలవాటులా ఉంది.
    యాదగిరి ముందు నీలకంఠంను సునీతకు పరిచయం చేశాడు. తరవాత సునీత ఎవరో, చెప్పా డతనికి.
    "ఆఁయ్! ఆమె మీ అమ్మాయి కాదా?"
    "కాదు! కానీ ప్రస్తుతం నా బిడ్డే!"
    "గుడ్! బావుంది" అని సునీత వైపు తిరిగాడు. "మీరే కాలేజీలో చదువుతున్నారు? మీకు పుస్తకాలు చదవటం ఇష్టమేనా?"
    "ఇష్టమే! కాని నేను చదివేది కాలేజీలో కాదు. ఆఫీసులో టైప్ చెయ్యవలసిన ఉత్తరాలు."
    "ఓ! జాబ్ చేస్తున్నారన్నమాట. మీకు నా అభి నందనలు."
    "థాంక్స్!" సునీత అతనితో ఆఫీసుకు వెళ్ళేవరకూ మాట్లాడుతూనే ఉంది. అతను పరధ్యానంలో తప్పులు మాట్లాడుతున్నాడని గూడా ఆమె తెలుసుకున్నది.
    సునీత ఆఫీసుకు తొమ్మిదిన్నరకే వెళుతుంది. నీలంకంఠం పదకొండు గంటలకు గానీ వెళ్ళడు. సునీత వెళుతున్నానని చెప్పినపుడు "విష్ యూ గుడ్ లక్!" అన్నాడు.
    "ఇప్పుడు గుడ్ లక్ ఏమిటి? కొత్తగా చేరావా?"
    "పాతవారైతే చెప్పగూడదా?"
    "కాదనుకోండి!"
    నీలకంఠం మాట్లాడేటప్పుడు గొంతుచించుకుని అరవడు గానీ, ఎదటివాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూంటాడు. వాళ్ళెటు చూసినా అతనలాగే చూస్తూంటాడు. అందువల్ల చాలా మంది గాభరాపడటం, అపార్ధం చేసుకోవటం జరుగుతాయి
    సునీత మొదట అతని చూపులు చూసి కంగారు పడింది. పిచ్చివేషాలు వేస్తే, తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధపడింది. కాని అతనలాంటి పనులేమీ చెయ్యలేదు. యాదగిరినీ అలాగే చూస్తాడు. రెండు మూడు రోజులు బాగా పరిశీలించి అది అతని అలవాటని తెలుసుకుంది.
    అతను ఏది మాట్లాడినా చిన్న పిల్లవాడిలా ఉంటుంది. డొంక తిరుగుడు, వ్యంగ్యం అతనికి తెలియనట్లే ఉన్నాయి. జోక్స్ విసరక పోయినా మాటలు, చేతులు తిప్పటం తమాషాగా ఉండి నవ్వు చెప్పించేవి. సునీత మాత్రం ఎదురుగుండానే నవ్వేస్తుంది. ఎందుకలా నవ్వుతారని అడిగితే ఏదో చెప్పి తప్పించుకునేది.    


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS