"ఇది బహుశా మీకు తెలియని వయస్సులో జరిగిందేమో?"
"అంతేనేమో? నా ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు."
"చెప్పమంటారా?"
"అవశ్యం!"
"ఒకటి, నేను మీ అంతస్తుకు తగను!"
"బస్! మరి వాళ్ళందరూ?"
"అది తెలియనివాళ్ళు. మీరు చెప్పండి, మీకు, మాకు ఎక్కడైనా పోలికలు ఉన్నాయా?"
"నాకేం కనిపించినట్లు లేదు."
"నిదర్శనం చెప్పాలా?"
"చెప్పు!"
"మీరు మాకు జీవనాధారం కల్పిస్తున్నారు. లోకం దృష్టిలో మా యజమానులు."
"అంతేనా?"
"మీకూ, మీ నాన్నగారికీ కుదుపులకు తట్టుకుంటూ మెత్తగా సాగిపోగల కారు. పన్నెండుమందిమి మేము. అందరికి కలిపి దడదడలాడే డొక్కు వాను. మీ కారు కొత్తది. వాను క్రీస్తుకు పూర్వపు రోజుల్లో పుట్టినట్లుంది. మీకు కావాలంటే తెల్లని యూనిఫారమ్ తో స్పెషల్ డ్రైవర్. వాన్ లో కూడా ఆయిల్ లో మునిగి తేలుతున్నట్లు నల్లని మురికి గుడ్డలతో, స్పెషల్ డ్రైవర్ ఉన్నాడు. కాని, తేడా అల్లా మీది అందమైన కారు. మాకు డొక్కువాను. మేము మీ నౌకర్లం, మీరు..."
"ఏమిటో ఈ నవరసాల కావ్యం? అర్ధం, పర్ధం లేదు."
"మీ పశ్నకు ఆ నవరసాల కావ్యం తప్ప మరొకటి జవాబివ్వదు. ఇంకా కావాలంటే మా డజనుమంది రక్తం మీకోసం, మీ నాన్న కోసం, మీ కుటుంబం కోసం చెమటగా మరి ఆవిరై పోతూంది. మాలో సగం మందికి ఇచ్చే జీతం మీరు వేసుకున్న సూటు ఖరీదు చెయ్యదు. అటువంటప్పుడు - మీ ఎదుటికి వచ్చి పూలదండలు, పుష్పగుచ్చాలు సమర్పించే అర్హత ఉందంటారా? అది తెలుసుకునే వానులో కూర్చున్నాను నేను."
"సునీత ఇంత గంభీరమైన భావాల పుట్టా?' "చాలా విషయాలు తెలుసుకున్నావులా ఉంది!"
వ్యంగ్యోక్తి అది. సునీతకు తెలుసు. "తెలియని విషయాలు తెలుసుకునేందుకు మరొకచోటికి వెళ్ళడానికి నేను మీలా లక్షాధికారి బిడ్డను కాదు, వేణూ."
అది వేణుకే తగిలింది. వ్యాపారానుభవం కోసం వేణు బొంబాయి వెళ్ళాడని సునీత అర్ధం.
వేణు అన్నాడు: "నిన్ను మాటల్లో ఓడించలేను. నీనుండి నేను చాలా తెలుసుకోవలసి ఉంది. నిజం, సునీతా!"
"నేను కూడా మీనుండి నేర్చుకోవలసింది ఉంది. మీ అనుమానాలన్నీ తీరి ఉండవచ్చు!"
ఆమెతోపాటు వేణు లేచి నిల్చున్నాడు.
సునీత ముందు అడుగు వేసింది. అతన్ని చూసి అల్లరిగా నవ్వి, "నమస్తే!" అంది.
"నమస్తే....నమస్తే!"
మెయిన్ గేటు దాటి సునీత బస్సు కోసం ఆగకుండానే వెళుతూంది. కారులో లిఫ్ట్ ఇద్దామంటే ఆమె వద్దనవచ్చు. మాట లనే అస్త్రాల్ని వదలవచ్చు. వేణు స్టీరింగ్ వీల్ మీద 'నీతా!' అని వ్రాసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
* * *
అటు ఆర్తి సుఖసంతోషాలకు దూరమైంది. మరొకవైపు చేసిన పాపం మనస్సును దహించి వేస్తున్నది. తన బరువు బాధ్యతలన్నీ వేణుకు అప్పజెప్పి తను దేశాటనం చెయ్యాలి. ఈ దేశాటనంలో సారధి ఎక్కడైనా తటస్థపడవచ్చు. తాను పుణ్య క్షేత్రాలు దర్శించవచ్చు. ఏ గంగలో మునిగినా తన పాపం ప్రక్షాళనం కాదు. కాని మనశ్శాంతి దొరక వచ్చు. సారధిని వెతికి ఆర్తి జీవితం, మళ్ళీ పుష్పింప చెయ్యవచ్చు.
అందుకే వేణు వచ్చిన దగ్గిరనించీ తమ కంపెనీ ఆదాయ వ్యయాలను, వ్యాపార రహస్యాలను నూరి పోస్తున్నాడు గోవిందరావు. బాంకు ఎకౌంటు అంతా వేణుపేర ట్రాన్స్ఫర్ చేయించాడు.
వేసవి ప్రారంభంలో హైదరాబాదునుండి బయలు దేరాలనుకుంటున్నాడు గోవిందరావు.
వేణు అభ్యంతరం చెప్పలేదు. తండ్రి చెప్పినవన్నీ ఆకళింపు చేసుకున్నాడు. బొంబాయిలో పనిచేసిన అనుభవం బాగా పనికివస్తూంది.
వేసవి వచ్చింది.
గోవిందరావు తన ప్రయాణం సంగతి ఆర్తికి చెప్పాడు, వెళ్ళేనాడు.
"ఈ ప్రయాణంలో సారధిని వెతకటం గూడా చేస్తానమ్మా!"
ఆర్తి మాట్లాడలేదు.
"అత్తయ్యను ఎలాంటి చిత్రవధకు గురి చేశానో నీకు తెలుసు. ఆమె మరణం నీకు గుర్తుండే ఉంటుంది..." స్వరం బాధను వ్యక్తపరిచింది.
"ఈ యాత్రల్లో నేను పునీతున్ని కాలేక పోయినా..." మాటలు పెగల్లేదు.
కొంతసేపు అయ్యాక ఆర్తి అంది: "ఆయన కలిస్తే ఏమీ అనవద్దు. మళ్ళీ రావటానికి ఇష్టపడక పోతే, బలవంతంగా తీసుకురావద్దు. కాని......కాని......ఆర్తి బతికే ఉందని, ఒక్క ఉత్తరం అయినా రాయమని చెప్పు.....చాలు, నాన్నా...." ఆమె మరి చెప్పలేక పోయింది.
"సరేనమ్మా! మంచి మాటలతో మనసు మార్చ ప్రయత్నిస్తాను. నువ్వు బెంగపడకు. వేణును గమనిస్తూ ఉండు. సునీతను కూడా! అత్తయ్యను గురించిన రహస్యం నేను తిరిగి వచ్చేవరకూ చెప్పవద్దు. వేణుకుగానీ, సునీతకుగానీ తెలీదు."
"ఊఁ!" హాస్పిటలుకు వేళ కావటంవల్ల ఆమె వెళ్ళింది. గోవిందరావు ఇంటికి వచ్చేశాడు.
మధ్యాహ్నం వేణును వద్దని, తనే వెళ్ళాడు ఆఫీసుకు. వెళుతూనే ఆమెను పిలిపించాడు. తండ్రి వెళ్ళే సంగతి వేణు, సునీతకు చెప్పాడు. మళ్ళీ తను చెప్పాడు గోవిందరావు. ఆమె- ఎప్పటిలా అన్నీ విన్నది.
"నువ్వు సక్రమంగా ఆఫీసుకు వచ్చి పోతూ ఉండు. నువ్వు పని చేసినా చెయ్యకపోయినా జీతం తీసుకో. నీకెప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే, వేణునుగానీ, ఆర్తినిగానీ అడుగు. ఇన్ని రోజులనుంచి ఇక్కడ పని చేశావు. నీకు తెలీని రహస్యమంటూ లేదు. వ్యవహారాలన్నీ నీకు తెలుసు. బాబు మొన్నటిదాకా బాధ్యతారహితంగా తిరిగాడు. ఏదైనా అడిగితే చెప్పు. అన్నీ తెలిసినదానివి. నీకు నేను వేరే చెప్పనవసరం లేదమ్మా..."
ఆయన జేబులో నుంచి పర్సు తీశాడు. దాన్ని సునీత ముందు ఉంచి, "ఇందులో రెండువేల రూపాయలు ఉన్నాయి. నీకు కావాలంటే ఇంకా ఇస్తాను. కావలసినంత తీసుకో!" అన్నాడు.
సునీత చకిత అయింది. గోవిందరావువైపూ, పర్సు వైపూ చూసింది.
"ఈ డబ్బు నేనేం చేసుకోను?"
"ఏమైనా చేసుకో. ఖర్చు పెట్టుకో!"
సునీత పర్సు అందుకున్నది. జిప్ లాగి దాన్ని తెరిచింది. అన్నీ వందరూపాయల నోట్లు. మడతలు మడత లుగా కనిపిస్తున్నాయి. అవికాక మరికొంత చిల్లరకూడా ఉంది.
సునీత అందులోనుంచి తీసుకుంది, ఒక్క నయా పైస.
"ఎంతోమంది ఈ చిన్న నయాపైస కోసం ప్రతివాడినీ దీనంగా ప్రార్ధిస్తుంటారు. ఇవన్నీ కలిస్తే నే ఒక రూపాయి. డబ్బు అనే అతి విలవైన పదార్ధానికి మూలం ఈ నయాపైస. నా దృష్టిలో దీనికున్న విలవ రూపాయలకు ఉండదు. నేను అడగకపోయినా ఇస్తున్నారు. మీ దయకు కృతజ్ఞురాల్ని. కాని నేను అయాచితమైన దాన్ని దేన్నీ కోరను."
వచ్చేసింది సునీత.
గోవిందరావు సంగతి సరేసరి!
వద్దు, వద్దు అనుకుంటూనే స్టేషనుకు వెళ్ళింది సునీత. వేణుకూడా వచ్చాడు. గోవిందరావు మనసులోనే సునీతను దీవించాడు.
ట్రెయిను కదిలే ముందు వేణును పక్కకు పిలిచి, "నువ్వు అహర్నిశలూ అక్కయ్యను కనిపెట్టుకుని ఉండాలి. ఆమెను సంతోష పెట్టటానికి ప్రయత్నించు. అక్కయ్య ఇంట్లోనే ఉండు. తరవాత, సునీత ఎడ సున్నితంగా మసులుకో" అంటూ చెప్పవలసినవన్నీ చెప్పాడు.
బండి కేక పెట్టింది.
వాళ్ళు ఒంటరిగా మాట్లాడుకుంటూండటంవల్ల సునీత దూరంగా నిల్చుంది. ఆమెను దగ్గిరికి పిలిచాడు. వేణువైపు చూస్తూ, "నేను తిరిగి వచ్చేవరకూ మీ ఇద్దరి మీదా కంపెనీ బరువు వదులుతున్నాను. అప్పటివరకు బాబు చేసే లోపాలను నువ్వు సవరిస్తూండు. అంతవరకూ మీరిద్ధరూ స్నేహితులు" అన్నాడు సునీతవైపు తిరుగుతూ.
బండి కదిలింది. సునీత కరుణామయ దృక్కులతో ఆయనను చూసింది. గోవిందరావు దుఃఖంతో 'నా తల్లి....దేవకి....నన్ను.....నేను ......పాపినమ్మా...' అనుకుంటూ మొహం లోపలికి తీసుకున్నాడు.
ఎక్స్ ప్రెస్ చాలా దూరం వెళ్ళింది.
* * *
సాయంత్రమయింది. డ్రాఫ్ట్ లన్నీ టైప్ చెయ్యటానికిచ్చి, బైటికి వచ్చాడు వేణు. టైమ్ చూస్తే నాలుగున్నర అయింది. కారులో కూర్చుని స్టార్టు చెయ్యబోతూ ఉంటే, ఎవరో పరిచితుడైన వ్యక్తి- ఆ నడక అదీ అలాగే ఉంది -అటే వస్తున్నాడు. దగ్గిరికి వస్తున్నకొద్దీ అతని ముఖం, అతనెవరో పూర్తిగా చెప్పేసింది.
వేణు ముఖం వికసించింది. తల బైటికి పెట్టి, "విశ్వం! రేయ్.....విశ్శూ!" అని పిలిచాడు.
అది విని ఎవరికోసమో లోపలికి వెళ్ళబోతున్న అతను ఆగి కారువైపు చూశాడు. ఆ పిలుపు అతనికి సుపరిచితమయింది. అయిన దగ్గిరికి వచ్చి సందేహాస్పదంగా, "మీరు.....మీరెవరు?" అన్నాడు.
వేణు కారు దిగాడు. హాట్, కళ్ళజోడు తీసి నిల్చుని, "నేన్రా!" అన్నాడు.
విశ్వం సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయినాడు. "రె! రె! మై ప్రెటీ బోయ్. యూ...." అంటూ అమాంతం వాటేసుకున్నాడు. చిరకాలం తరవాత కలుసుకున్నారేమో? ఒక్క క్షణంపాటు వాళ్ళకు మాటలుకూడా దొరకలేదు.
"ఎప్పుడొచ్చావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? నా ఉత్తరాలన్నీ తిరిగే వచ్చాయి, కారణం?..." వేణు ప్రశ్నలు కురిపించేస్తున్నాడు.
"ఆగాగు! పూర్వంలా వంద ప్రశ్న లడిగించుకుని, వరసగా జవాబిచ్చే శతావధాన శక్తి తగ్గిపోయిందిరా!"
"ఏం? బ్రహ్మచర్యాశ్రమంలో లేవూ?"
"ఫుల్ స్టాప్! నీకెన్ని డజన్ల సంతానం?"
"ఏదీ, మెడకొక డోలు పడందే?"
"అదీ! నువ్వు శతమర్కటానివి కనక, నన్నూ అదే అనుకుంటున్నావు."
"సర్లే, ముందు కార్లో కూర్చో!"
"ఎందుకట?"
వేణు డోర్ తెరిచి విశ్వాన్ని లోపలికి నెట్టాడు. విశ్వం అవతలికి జరిగాడు. వేణు డ్రైవింగ్ సీటులో కూర్చుని ఇగ్నిషన్ కీ తిప్పాడు. కారు స్టార్టయింది.
"ఊఁ! బ్రహ్మచారినన్నావు కదూ! లవ్వేమయినా రీసెర్చిలో ఉంచావా?"
"నీ సంగతి చెప్పు, విశ్వేశా!"
"మందేముంది? చాల సింపిల్! అనగా ఓ బాల విశ్వనాధుడు......"
"వెరీ గుడ్! కాని విచ్రం ఏమంటే నువ్వు గాంధర్వ వివాహం- ఐ మీన్ రిజిస్టర్ మేరేజ్- చేసుకుని ఉంటావు."
"ఛ! ఛ! పక్కా ఆంధ్రుడిలా జరిగింది. నా ఇష్టం-ప్లస్, అమ్మాయి ఇష్టం- ప్లస్, పెద్దల సమ్మతి, ఈజ్ ఈక్వల్ టూ మై వెడ్డింగ్."
"నేను నమ్మను! ఆకాశమంత పందిరి వగైరాలతో రంగరంగ వైభవంగా చేసుకుని ఉండవు. నిజమేనా?"
"అంత కాదుగానీ, సగం అయ్యుంటుంది."
"శుభలేఖలు వేయించటానికి మీ ఊరిలో ప్రెస్సు లేదు కదూ?"
