Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 10

                             
    రోజూ అతనికి హోటల్ నుంచి కారియర్ వస్తుంది. ఏదైనా చదువుతూనో, యోచిస్తూనో గంటపైగా తింటాడు. కూరలు, పచ్చడి, పెరుగు- ఏది కలుపుకుంటాడో అతనికే తెలీదు. ఒకోసారి పెరుగు వదిలేస్తాడు. అదె ముందు కలుపుకుంటాడు. లేకపోతే అన్నీ కలిపేసు కుని తింటాడు. ఇదేదీ గాకపోతే నట్టి అన్నం తిన్నా తింటాడు.
    సునీతకు ఇదంతా సరదా అనిపించినా, రానురాను జాలి వేసేది. మున్ముందు ఎలా జీవిస్తాడో అనుకుంటుంది. అందుకని అప్పుడప్పుడు చూడటం తటస్థిస్తే, "అది కాదు - ఇలా చేయాలి" అంటూ హెచ్చరించేది. అయిదారు సార్లు అల హెచ్చరించటం చూసి సునీతను, "పెద్దమ్మా" అని పిలవటం మొదలెట్టాడు. యాదగిరి తాతయ్య అయ్యాడు.
    మొదటిసారి అది విని రాజు, సునీత కడుపుబ్బ నవ్వుతూంటే, నీలకంఠ గుడ్లు పెద్దవి చేసి, "రె! నవ్వుతా రెందుకని?" అన్నాడు.
    "లేకపోతే ఏమిటండీ! నన్ను అప్పుడే పెద్దమ్మను చేశారు. నేను మీకన్నా ఎంతో చిన్నదాన్ని."
    నీలకంఠం మెడ తడుముకున్నాడు. "మా అమ్మ కూడా మీలాగే అదికాదు. ఇది చెయ్యమని, ఇలా కాదు అలా చెయ్యాలని చెబుతూ ఉంటుండేది. అందుకే అలా అన్నాను. మీకు బావులేకపోతే చిన్నమ్మా అని పిలుస్తాను. మరి అంతకన్నా మంచిగా ఎలా పిలవాలో నాకు తోచటం లేదు. మీరే చెప్పండి."
    సునీత నవ్వుతూనే అంది: "మీ ఇష్టం! అలాగే పిలవండి. నాకూ అంతకన్నా మంచిది తోచటంలేదు."
    ఆ రోజు ఆదివారం. ఉదయం ఈ సంఘటన జరిగాక, ఓ గంట ఆగి, ఎన్నడూ లేనిది, అద్దం ముందు తీరికగా కూర్చుని తయారవుతున్నాడు ఎక్కడికో! సునీత బయటికి వెళుతూ అతన్ని చూసింది. ఒకవేళ కాలేజీ ఉందనుకున్నాడో ఏమో, మరి?
    "ఎక్కడికో వెళుతున్నారు? కాలేజీకా?"
    వెనక్కు తిరిగాడు. "అబ్బే! ఇవ్వాళ ఆదివారం కదూ? సెలవేగా? మీరు మరిచిపోయారా ఏం?" మళ్ళీ అటు తిరిగితల దువ్వుకుంటూ "లోపలికి రండి!" అన్నాడు.
    "మరెక్కడికో వెళుతున్నారే?"
    "అలా పోస్టాఫీసుకు వెళ్ళి నాన్నకు డబ్బు పంపుదామని నిన్ననే జీతం వచ్చింది లెండి." దువ్వెన అద్దం ముందు పడేశాడు.
    సునీత నవ్వు రాకుండా పెదవి నొక్కి పట్టింది. ఇవ్వాళ తనకు ఆదివారమని జ్ఞాపకం చేసి, అప్పుడే మరిచాడు. అతనేకాదు. చాలామంది అంతే. ఆఫీసుకు సెలవని తెలిసి, పోస్టాఫీసుదాకా వెళ్ళటం, తీరా అక్కడి దాకా వెళ్ళి నాలిక కరుచుకోవటం.
    "ఇవ్వాళ పోస్టాఫీసులో మనిఆర్డరు తీసుకుంటారా? ఆదివారం కదూ?"
    "రె! నిజమే. ఇవ్వాళ పనిచేయడు కదూ?"
    "పోనీ, అలా బజారుకు వెళదాం. వస్తారా, మరి?"
    "ఆఁ! ఇవ్వాళ బజారుకుకూడా సెలవు లేదుగదా?"    
    "మీరు పెట్టాలి." ఇద్దరూ వెలపలికి వచ్చారు.
    నీలకంఠం 'పెద్దమ్మా' అని పిలిచినప్పుడల్లా, ఆమె మస్తిష్కంలో ఏవో కరుణామయభావాలు కల బోసుకునేవి. అమాయకంగా నవ్వుతూ చూసే అతని కళ్ళు, ఆ పిలుపు, వదనంలోనూ ఎంతో ప్రశాంతత ఉండేది. అందుకే సునీత అతనలా పిలుస్తానన్నపుడు అభ్యంతరం పెట్టలేదు. సునీత కనిపించగానే అతనే ముందు, "నమస్తే, పెద్దమ్మా!" అంటాడు.
    అబిడ్స్ లో విశ్వం కనిపించాడు. సునీత ఇద్దరినీ పరిచయం చేసింది.
    "పెద్ధమ్మకు బోయ్ ఫ్రెండ్సు కూడా ఉన్నారన్నా మాట!"
    విశ్వం తెల్లబోయాడు. ఇరవై ఏళ్లయినా నిండని పెద్దమ్మ? ఈ మాతృమూర్తికీ, ఆ బుజ్జి పాపాయికీ స్నేహం బాగానే కుదిరింది. విశ్వం అన్నాడు: "సునీతను అప్పుడే వృద్ధ జంబుకాన్ని చేశారే?"
    "వృద్ద జంబుకమా? ఛ! ఛ!"    
    "ఆమెను మరొక విధంగా పిలవాలని నీకు తోచలేదా?"
    "ఎందుకు తోచాలి? పెద్దమ్మలందరూ ముసలి వాళ్ళేనా?"
    "అని కాదు....."
    "అలాంటప్పుడు ఎలా పిలిస్తే ఏం?"
    "విశ్వం! వారసలే పిహెచ్. డి. మన ఇంటర్ లూ, బి.ఎ.లూ గాలిలో ఊదేస్తారు." సునీత అంది.
    "అది కాదు. పి హెచ్.డి. కానివాళ్ళంతా తెలివిలేని వాళ్ళు కాదు. నేను మిమ్మల్ని కించపరచటం లేదు....."
    "పోనివ్వండి! వాదనెందుకు? మీ పెద్దమ్మ మంచిదేగాని, మొట్టికాయలు మాత్రం జాస్తి." అంతటితో ఆ సంభాషణ మార్చాడు విశ్వం.
    నీలంకంఠం హోటల్ కు వెళదామన్నాడు. సునీత వద్దన్నది. విశ్వం దేనికైనా సిద్దమే అన్నాడు. సునీత వద్దంది కనక, నీలకంఠం ఆమెతో ఏకీభవించాడు. విశ్వం వాళ్ళిద్దరినీ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. నీలకంఠం సునీత ముఖంవైపు చూసి, "మరి పెద్దమ్మ ఏమంటుందో ?" అన్నాడు.
    "ఆమె రానంటే?"
    "నేనూ రాను."
    "బావుంది......"
    సునీతకూ వెళ్ళాలని లేదు. అంతకు ముందు విశ్వం భార్యను ఎన్నడూ చూడలేదు. ఆమె ఎలాంటి మనిషో? తాము వెళ్ళటం అంత మంచిది కాకపోవచ్చు!
    "పోనీ మీరు మా ఇంటికి రాకూడదూ?" నీలకంఠం అంటున్నాడు.
    "మీరు ఒంటరివాళ్ళు కదండీ?నాకు ఆతిథ్యం ఏమిస్తారు?"
    "పెద్దమ్మా, తాతయ్యగారూ, రాజూ ఉన్నారుగా?"
    సునీతకూడా నీలకంఠంలను బలపరిచింది. "మా బాబాయిని చెప్పానే ఆయన్ని గూడా పరిచయంచేస్తాను. రా విశ్వం."
    "మొత్తంమీద ఇద్దరూ కలిసి నా మాటలన్నీ గాలికి ఊదేశారు" అంటూ విశ్వం వాళ్ళను అనుసరించాడు.
    
                                   8

    వేణు ఇంటికి వస్తూనే ఆర్తి ఏదో ఉత్తరం నడవటం చూశాడు. ఆమె కెదురంగా మరొక సోఫాలో కూర్చుని, "ఎక్కడినుంచి?నాన్న రాశాడా, అక్కా?" అన్నాడు.
    "కాదు. పెద్దక్కయ్య దగ్గిరనుంచి."
    "ఏమని రాసింది? నాన్న వెళుతూ రాసిన ఉత్తరం అందిందటనా?"
    "ఆఁ! ఈ సంక్రాంతికి నాన్న ఎలాగూ లేడు కనక అక్కడికే రమ్మన్నది.....నువ్వే చదువు." అని వేణుకు ఇచ్చింది. వేణు దాన్ని తీసుకుని అంతా చదివాడు.
    "వెళదామా?" వేణు కాగితం మడిచి కవర్లోనే పెట్టాడు.
    "చూడ్డం. ఇంకా వారం పైగా ఉంది గదా? అయినా ఎక్కడికీ వెళ్ళాలని లేదు, వేణూ! ఈ హాస్పిటలూ, పేషెంట్లూ, ఒక్క రోజు నేను లేకపోతే..."
    "ఎప్పుడూ ఇవి ఉన్నవే గదా? అట్లా అనుకుంటే అన్నీ ఉంటాయి. ఒక నాలుగైదు రోజులు వెళ్ళి వద్దాం. రిలీఫ్ గా ఉంటుంది."
    వేణుకు కూడా తీరని పనులు ఉన్నాయి. కాని ఆర్తిని కొంతవరకైనా ఏదో విధంగా సంతోషంగా ఉండేట్లు చెయ్యాలి. తండ్రి వెళ్ళేటప్పుడూ అదే చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఉన్నా, అయిదారు రోజులైనా ఇది మరిపింప జేయవచ్చు. ఆమె ఒంటరిగా కూచుంటే సారధి తప్ప మరొకరు ఆమె ఆలోచనల్లో మెదలరు.
    "ఏం, అక్కా?"
    "ఏమో? చూద్దామన్నానా?"
    "చూద్దాం కాదు! నాలుగైదు రోజులు. అంత కన్నా ఎక్కువ వద్దు. అంతవరకు నీ అసిస్టెంట్ భాగేశ్వరి ఉన్నదిగా? ఆమెను చూసుకోమంటే సరి. నే నడుగుతాలే!"
    ఆర్తి మాట్లాడలేదు. అంటే ఆమె ఊఁ అనవచ్చు.

                                *    *    *

    సంక్రాంతి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఎల్లుండే!
    పండుగ రోజులు కనక ఊరంతా హడావిడిగా ఉన్నది. అందులో పల్లెటూరు కావటంచేత, పండుగ శోభ మరింత వెల్లివిరుస్తూంది. పోటీలు పడి, పక్కవాళ్ళ ఇంటికన్నా తమ ఇంటి ముందువాకిలి అందంగా ఉందా అని మురిసి పోతున్నారు. నిన్న పెట్టిన రంగురంగుల ముగ్గులు ఇంకా చెరిగి పోలేదు. గొబ్బెమ్మలతో సహా ఇంకా అలాగే ఉన్నాయి. సూర్యభగవానుడు ఇంకా పూర్తిగా దర్శనమివ్వటం లేదు. ఆయన రాకకు స్వాగత మిస్తున్నట్లుగా, పైన ఎగిరిపోతున్న పక్షులు ఏవో ఆలాపన చేస్తూ ఆహారాన్వేషణ కోసం ముందుకు సాగిపోతున్నాయి. పలచగా రవసెల్లా తెరలు పట్టిన తుషారాన్ని చీల్చటానికి వస్తున్నామన్నట్లు సూర్యకిరణాలు ఉషాదేవిని ముందుకు నెట్టాయి. -
    మన దేశానికి ఆయువుపట్టు అయిన గ్రామాలే, పండుగలు వేడుకలను బాగా జరుపుకుంటాయి. సంక్రాంతి ఆంధ్రుల పండుగ. ముఖ్యంగా రైతులకు మరీను! సంక్రాంతి శోభను ఆంధ్ర గ్రామాల్లోనే తనివిదీరా చూడవచ్చు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS