"మీరు నన్నేమీ చేయలేరు. నేను మళ్ళీ మళ్ళీ నా కార్యక్రమాలు కొనసాగించగలను. పునరుద్ధరించగలను."
వెంకన్న ఆలోచించసాగాడు.
"వెంకన్నగారూ! నేనూ ఈ సంఘంలో ముఖ్యభాగాన్ని నన్ను కదిపితే సంఘం పునాదులు కదుల్తాయి....."
"మీలాంటి పునాదులను కదిపి-కొత్త పునాదులు వేయడంతోనే సంఘానికి ప్రగతి వుంది-" అన్నాడు వెంకన్న.
"అది మీవల్లకాదు. ఎందుకంటే మీకు నాతో తల పడడంతోనే జీవితకాలం వృధా అవుతుంది. ఒకవేళ నన్ను మీరంతం చేశారనుకుందాం. అంతమాత్రాన కరీంసాహెబ్ అంతంకాదు. నేను కరీంసాహెబ్ ను కాను. అతడి ముఖ్యానుచరున్ని....."
"అంటే?"
"రాజకీయపరంగా ఈ దేశానికో ప్రధానమంత్రి, దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ఓ ముఖ్యమంత్రి వున్నారు. ఇంకా రాష్ట్రంలో జిల్లాలు, తాలూకాలు ఉన్నాయి. ఇదేవిధంగా కరీంసాహెబ్ కూడా ఒక సామ్రాజ్యాన్నేలుతున్నాడు. అతఃడు ప్రధానమంత్రి అయితే నేనొక మామూలు సర్పంచిని. అంతే! తన సామ్రాజ్యం బాగోగులు చూసుకుంటూ అతడు యెన్నో ప్రణాళికలు వేస్తాడు. అంతర్జాతీయ పర్యటనలు చేస్తాడు. అదలాగుంచండి ఒక మామూలు సర్పంచినే ఎదుర్కోలేనిమీరు- ప్రధానమంత్రి జోలికి వెళ్ళగలరా?"
వెంకన్న నవ్వి-"ఒకసారి రంగంలోకి దిగేక నేను వెనక్కి తగ్గను, మిమ్మల్ని అంతంచేస్తే సంఘం పునాదులు కదిలినట్లే నేను రంగంలోకి డిగితే సామ్రాజ్యాల పునాదులే కదలవచ్చునేమో! ఎవరు చూడొచ్చారు.....?" అన్నాడు.
"ఆలోచించండి. మీరు రంగంలోకి దిగిన దెందుకు? రాజును రక్షించాలని. అతణ్ణి రక్షించడానికి ప్రయత్నించండి....."
"రాజును రక్షించాలంటే మీతో తలపడాలిగా?"
సుందర్రావు బదులివ్వలేదు. అదోలా నవ్వాడు.
"రాజును వదిలిపెడతానని మాటివ్వండి. నేనూ రంగంలోంచి తప్పుకుంటాను. నా క్లయింట్ ను నేను రక్షించుకోవాలిగా!"
"రాజునేలా వదిలిపెడతాను? అతడు నాకు ప్రమాద కారి. అమ్మరాసిన డైరీలను నాకు స్వాధీనం చేయడం లేదు....."
"అవి స్వాధీనంచేస్తే అతణ్ణి వదిలిపెడతారా?"
"అతణ్ణి వదిలిపెడితే కరీంసాహెబ్ నాన్ని క్షమిస్తాడా అన్నదికూడా నేను చూసుకోవాలి....."
"అందుకు నేనేం చేయాలి?"
"నేనేమీ సలహా యివ్వలేను. ఆలోచించి మీ తెలివికి తోచినట్లు చేయండి......రాజు రక్షించబడితే నాకూ యిష్టమే! అతడు నా తమ్ముడు....."
"నీ తమ్ముడికోసం నాతోపాటు నువ్వూ ఆలోచించలేవా?"
"మీ సామ్రాజ్యానికీ మా సామ్రాజ్యానికీ తేడా ఉంది. కరీంసాహెబ్ సామ్రాజ్యంలో చట్టం బలమైంది. వ్యక్తినిమించినది మా సామ్రాజ్యం. స్వార్ధంకోసం ద్రోహంచేయం. కరీంసాహెబ్ రాజు విషయం స్వయంగా చూసుకుంటున్నాడు. ఆ ఉత్తరం అతడే రాశాడు. ఒకసారి అతడు రంగంలోకి దిగేక-నేను రాజు గురించి ఆలోచించనుకూడా ఆలోచించను. అది శిలా శాసనం.." అన్నాడు సుందర్రావు.
"అంటే నాకోసం, రాజుకోసం మీరేమీ చేయలేరు...."
"నాతో మాట్లాడడంవల్ల మీ సమయం వృధా, అప్పుడే రాజుమీద విషప్రయోగం ప్రారంభమైందని నా అభిప్రాయం...." అన్నాడు సుందర్రావు.
"విషప్రయోగమంటే?"
"వచ్చేనెల పదమూడవ తారీఖు మధ్యాహ్నం ఒంటిగంటకు రాజు ప్రాణాలు పోవాలి. అంటే కరీంషాహెబ్ అప్పటికప్పుడు వెళ్ళి అతణ్ణి చంపుతాడనుకోను. ఇప్పట్నించీ విషప్రయోగం ప్రారంభమవుతుంది. సరిగ్గా ఆ సమయానికి ప్రాణంపోతుంది...."
వెంకన్న తెల్లబోయి లేచి నిలబడి-"వస్తాను....." అన్నాడు.
"మంచిది మీకు శుభమూ, జయమూ కోరుకుంటున్నాను....." అన్నాడు సుందర్రావు నవ్వుతూ.
3
మేలిమి బంగారు ఛాయ.
ఆ ఛాయ స్పష్టంగా కనబడేటంత పల్చని చీర.
ఆమె శరీరాన్ని పురుష దృష్టికి అతీతంగా వుంచడంలో చీర విఫలమవుతుందని ముందే తెలిసి ముందు జాగ్రత్తగా కాపాడ్డానికి వచ్చిన వీరసైనికుల్లా వున్నాయి పెట్టీకోటు, జాకెట్టు.....
ఆమె క్లబ్బు డ్యాన్సర్లా లేదు. కాల్ గర్ల్ లా లేదు.
ఆమె పేరు సునీత.
సామాన్య మధ్యతరగతి యువతి ఆమె.
ఆమె ఎదురుగా రాజు వున్నాడు.
అది రాజు ఇల్లు కాదు.
ఒక హోటలు గది......
రాజామెనక్కడకు రమ్మన్నాడు. ఆమె వచ్చింది.
అతడు మంచంమీద కూర్చున్నాడు.
ఆమె ఎదురుగా నిలబడింది.
ఆమె ముఖంలో చిరునవ్వు......అతడి ముఖంలో కుతూహలం.....
"సునీతా-నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?" అన్నాడతడు.
"నిజం సంగతి నాకు తెలియదు. ప్రేమ సంగతి తెలుసు-" అందామె.
సునీతకు తల్లిదండ్రులు లేరు. అన్నగారివద్ద వుంటోంది.
అన్నకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. పెద్దవాడికి మూడేళ్ళు రెండోవాడికి పదినెలలు.
సునీత అన్న మంచి ఉద్యోగంలో వున్నాడు. అందువల్ల అతడి జీవితం మధ్యతరగతి ఓ మెట్టుపైనే వుంది.
సునీతకు మంచి సంబంధం చేయాలని అన్న అభిలాష.
సంబంధం చవకలో కుదరాలని వదిన పట్టుదల.
రెండింటికీ పొంతన కుదరడంలేదు.
వదినకు సునీతంటే ద్వేషంలేదు. భయముంది.
అలాగని ఆమె సునీతకు భయపడదు. సునీత పెళ్ళి భర్త సంపాదనను దోచేస్తుందేమోనని ఆమె భయం. అందుకే.....
ఆమె తను ఖరీదైన చీరలు కొనుక్కుని సునీతకు సాదా బట్టలు కొంటుంది. ఇంటిపని, పిల్లల పని అంతా సునీతచేతే చేయిస్తుంది.
"ఈ అట్టహాసం, ఈ వైభవం నావేకానీ నీవికావు. ఆ విషయం నీకు వంటబట్టాలి. లేకుంటే నువ్వెక్కడా అడ్జస్టు కాలేవని నా భయం నీ భావి జీవితానికిది శిక్షణ-" అనేది వదిన సునీతతో.
తన భావి జీవితానికది సూచనగా కనబడి సునీత భయపడేది. ఆమె మనసులో తను వదినకు మించి వైభవంగా జీవించాలని ఆశించేది.
ఈలోగా వారికి లక్ష్మి పరిచయమయింది.
రాజు సునీత వదినకు నచ్చాడు.
లక్ష్మికి సునీత నచ్చింది.
రాజు సునీతకు నచ్చాడు. కానీ అతడి ఆర్ధికస్థితి నచ్చలేదు.
లక్ష్మి రాజును సునీతతో తిరగడానికి ప్రోత్సహించింది.
అవగాహన పేరిట యిద్ధరూ కలిసి నదీతీరాల కబుర్లు చెప్పుకున్నారు.
రాజుకు సునీత అందం నచ్చింది. కానీ ఆమె ఆశయాలతన్ని భయపెట్టేవి.
తానెలాంటి జీవితాన్ని కోరుకుంటున్నదీ సునీత అతడికి చెప్పింది.
అలాంటి వైభవాన్నతడు కలిగుండీ వదులుకున్నాడు.
సునీత రాజును తఃనకు విముఖుణ్ణి చేసుకోవాలని ఈ విషయం చెప్పలేదు. తల్చుకుంటే యే మగాడైనా డబ్బు సంపాదించగలడని ఆమె నమ్మకం తన ప్రోత్సాహంతో అతడిలోని సంపాదనా శక్తిని వెలికితీయాలని ఆమె ప్రయత్నం.
