ఆమె ప్రయత్నాలు రాజును భయపెట్టాయి.
తల్లితో ఆమె తనకు నచ్చలేదని అతడు చెప్పాడు.
లక్ష్మి అతణ్ణి బలవంతపెట్టలేదు.
సునీత, రాజును కలుసుకొనడం బాగా తగ్గిపోయింది.
సునీత అన్న ఆమెకోసం సంబంధాలు చూస్తున్నాడు.
అతడికి పన్నెండేళ్ళ వయసులో పుట్టింది సునీత. ఆమెనతడు అపురూపంగా యెత్తుకుని మోశాడు. కన్న కూతురిమీదుండే టంత అభిమానమూ ఆమెకతడిపై వుంది.
చెల్లికోసం చచ్చు సంబంధాన్నతడు తేలేడు.
అలాగని భార్య మాటలు కాదనలేడు.
ఈలోగా లక్ష్మి చచ్చిపోయింది.
ఇప్పుడు సునీత మరోసారి రాజును కలుసుకుని-"నేను నిన్ను ప్రేమిస్తున్నాను-" అంది.
రాజాశ్చర్యపడి-"ఎందుకు?" అన్నాడు.
"ఏమో-అది నాకు తెలియదు లక్ష్మి అత్తపోయిందనగానే నాకు నీ మీద జాలిపుట్టుకొస్తోంది. నిన్నోదార్చాలనిపిస్తోంది ఇలా ఇంకెవరి విషయంలోనూ అనిపించలేదు. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నమాట!"
"మరి నీ ఆశలు, ఆశయాలు వేరు...." అన్నాడు రాజు.
"అదంతా నా భ్రమ నాకిప్పుడే ఆశలూ, ఆశయాలూ లేవు నువ్వు నాకు నచ్చావు. మనం పెళ్ళిచేసుకుందాం-" అంది సునీత.
"వద్దు-సునీతా! నామీద జాలితో ఇప్పుడీ నిర్ణయం తీసుకుంటున్నావు తప్ప నువ్వు నన్ను ప్రేమించడంలేదు. పుట్టుకతో వచ్చిన ఆశలు మధ్యలో పోవు. నాతో జీవితం కలకాలం ఇలాగే ఉంటుంది. వైభవంగా జీవించే వాళ్ళను చూసినప్పుడల్లా నీ మనసు చలిస్తూంటుంది. మన మధ్య కలతలురేగుతాయి....."
"రేగవు-....." అంది సునీత.
అతడెన్ని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు.
"నీ కర్ధకావడంలేదు. మన పెళ్ళి మనకు సుఖాన్నివ్వదు-" అన్నాడతడు చివరికి.
"నాకిప్పుడర్దమయింది. నువ్వు నన్ను ప్రేమించడం లేదు....." అంది సునీత ఏడుపు గొంతుతో.
"నీవంటి అందగత్తెను ప్రేమించలేని మగాడుండడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నేనే నిన్ను శంకించాలి....."
"ఎందుకని?"
"నీ ప్రేమకు నేను తగను....."
"అది నా కనిపించాలి. నువ్వెలా చెప్పగలవు? నేను నిజం చెబుతున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను-"అంది సునీత.
"అయితే ఒక పరీక్ష పెడతాను....." అన్నాడు రాజు.
సునీత ఒప్పుకుంది.
రాజామెకు పల్చటి చీర కొనిచ్చి-అది కట్టుకుని తను చెప్పిన హోటలు గదికి రమ్మన్నాడు.
ఆమె వస్తుందని అతడనుకోలేదు. ఆమె నిజంగా వచ్చింది.
"సునీతా-నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?" అన్నాడతడు.
"నిజం సంగతి నాకు తెలియదు. ప్రేమ సంగతి తెలుసు-" అందామె.
"నేనిక్కడ నిన్నేమైనా చేస్తే?"
"నా ప్రేమ నిన్ను నమ్ముతుంది-"
"నేను నిన్ను మోసం చేస్తే?"
"నా ప్రేమ నువ్వు నన్ను మోసం చేయలేవంటోంది."
"అయినా చేస్తే?"
"చెయ్యి చూద్దాం-"సవాలు విసిరినట్లుంది సునీత.
రాజు మంచంమీంచి లేచి నిలబడి ఆమెను సమీపించాడు.
మేలిమి బంగారు ఛాయ.
ఆ ఛాయ స్పష్టంగా కనబడేటంత పల్చని చీర.
ఆమె శరీరాన్ని పురుష దృష్టికి అతీతంగా వుంచడంలో చీర విఫలమవుతుందని ముందే తెలిసి ముందు జాగ్రత్తగా కాపాడ్డానికి వచ్చిన వీరసైనికుల్లా వున్నాయి పెట్టీకోటు, జాకెట్టు.....
రాజామెకు బాగా దగ్గరగా వెళ్ళాడు.
ఆమె ముఖంలో భయంలేదు.
మనిషిలో తడబాటులేదు.
అతణ్ణి సవాలు చేస్తున్నట్లున్నాయామె చూపులు.
ఆ చూపుల్లో వేశ్య చిలిపితనంలేదు.
పతివ్రత పవిత్రత వుంది.
రాజు నిట్టూర్చి వెనక్కు వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు.
"నీ గురించి నాకు తెలిసినంతగా నీక్కూడా తెలియదు....." అంది సునీత విజయగర్వంతో.
రాజామె వంకనే చూస్తూ-"ఏ మనిషి గురించైనా అతడికంటే ఇతరులకే ఎక్కువ తెలుస్తుంది-" అన్నాడు.
"కాబట్టి మనం పెళ్ళి చేసుకుందాం-" అంది సునీత.
"సునీతా! నీ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు....."
"అంటే?"
"నీ మనసునిండా డబ్బంటే ప్రేమ వుంది. నువ్వు నన్ను ప్రేమిస్తే అది తాత్కాలికం మాత్రమే!"
"అబద్ధం!"
"నిజమని ఋజువు చేయగలను....."
"ఎలా?"
"సునీతా-నా గురించి నీకు తెలియని విశేషాలు కొన్ని వున్నాయి....."
"ఏమిటవి?"
"నాకు డబ్బూ, వైభవం రెండూ వున్నాయి. అవంటే యిష్టంలేక నేనిలా వచ్చేశాను....."
సునీత తెల్లబోయింది.
"ఆ డబ్బంటే నాకిష్టంలేదు. దాన్నెలా వదుల్చుకోవాలా అని చూస్తున్నాను. అదంతా నీకిచ్చేస్తాను. నువ్వు నన్ను మర్చిపో...."
"ఎంతంటుందేమిటా డబ్బు?"
"ఓ పెద్ద బంగళా ప్రస్తుతం దానిమీద నెలకు నాలుగు వేల రూపాయల అద్దెవస్తోంది. బ్యాంకులో డిపాజిట్ల రూపంలో అయిదులక్షలున్నాయి....."
సునీత తెల్లబోయి-"ఇది నిజమా?" అంది.
"నిజం ఇప్పుడు నీకేమనిపిస్తోంది?"
"నీపై ప్రేమపుట్టడం నా అదృష్టమని!"
"ఏం చేసుకుంటావా డబ్బంతా?"
"నన్నీసడించిన నా వదినకంటే వైభవంగా జీవిస్తాను...."
"ఆ డబ్బు నీది, నీకిష్టమైన వారిని పెళ్ళిచేసుకో....."
"రాజూ-నువ్వు నన్ను నమ్మడంలేదు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నాకా డబ్బవసరం లేదు. నువ్వే కావాలి......"
"కొన్నాళ్ళపాటు ఆ వైభవం అనుభవించి అప్పుడు చెప్పు......"
"నాకా వైభవమే వద్దు....."
"వద్దంటే లాభంలేదు. కనీసం నీ ప్రేమను ఋజువు చేసుకునేందుకైనా ఇందుకు నువ్వంగీకరించాలి....."
చివరకు సునీత అంగీకరించింది.
"నీ అన్నయ్య నీకు చాలా పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు. వాటిలో నీకు నచ్చినదుంటే కట్నంగా ఎంత కావాలంటే అంతా తీసుకో ఎందుకంటే ఈ ఆస్తిని నేను వచ్చేనెల పదమూడవతేదీ మధ్యాహ్నం ఒంటి గంటవరకే నీ పరంచేస్తున్నాను. ఆ తర్వాత నీకది దక్కదు....."
"అంటే?"
రాజామెకు ఓ కాగితం రాసిచ్చాడు. ఆ ప్రకారం అతడు చెప్పిన సమయం వరకూ ఆమె అతడి ఆస్తి వ్యవహారాలు చూసుకుంటుంది.
అతడామెకు బ్లాంక్ చెక్స్ మీద సంతకాలు పెట్టిచ్చాడు.
"నేను మొత్తం డబ్బంతా తీసుకుని వెళ్ళిపోతే?"


