Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 81


    వెంకన్న డబ్బుతీసుకుంటున్నతన్ని సమీపించి-"నేను సుందర్రావుకోసం వచ్చాను. మీరే కదూ!" అన్నాడు.
    "ఊఁ" అని-"ఒక్క నిమిషం మీరు లోపల కూర్చోండి-" అన్నాడు సుందర్రావు.
    వెంకన్న పాకలోకి వెళ్ళాడు.
    అక్కడ ఒక బల్ల బల్ల వెనుక ఒక కొయ్య కుర్చీ బల్లముందు రెండు ఇనుపకుర్చీలు బల్లమీద గల్లాపెట్టి
    వెంకన్న ఓ ఇనుప కుర్చీలో కూర్చున్నాడు.
    కాసేపటికి సుందర్రావు వచ్చి కొయ్య కుర్చీలో కూర్చుని తాళం చెవితో గల్లాపెట్టి తెరచి డబ్బు అందులో వేశాడు. మళ్ళీ గల్లాపెట్టి మూసి తాళం వేసి-తాళం చెవి చొక్కా జేబులో వేసుకున్నాడు.
    ఆ కాసేపట్లో వెంకన్న గల్లాపెట్టినీ, సుందర్రావునూ పరీక్షించేశాడు.
    గల్లాపెట్టిలో మడతపెట్టిన కాగితాలు కొన్ని వున్నాయి డబ్బేమో-కొన్ని పది అయిదు, రెండు రూపాయలనోట్లు-కొంత చిల్లరా వున్నాయి.
    సుందర్రావు ఖద్దరు పంచెమీద ఖద్దరు జుబ్బా వేసుకొని బాగా పూర్వకాలం మనిషిలా వున్నాడు.
    "మిమ్మల్ని రాజు పంపించేడా?" అన్నాడు సుందర్రావు.
    "ఎలా ఊహించేరు?" అన్నాడు వెంకన్న ఆశ్చర్యంగా.
    "మీరు డిటెక్టివ్ వెంకన్న అని నాకు తెలుసు....."
    వెంకన్న మాట్లాడకుండా అతడివంకే నిశితంగా చూశాడు.
    సుందర్రావు బయటకు చూస్తూ-"ఒరేయ్ వెంకన్నా రెండు టీలు తీసుకురా-" అన్నాడు.
    వెంకన్న ఉలిక్కిపడి అటు చూశాడు.
    అప్పుడు కాటాదగ్గర ఒకే మనిషి వున్నాడు.
    మాసిన పంచి కట్టుకున్నాడు వాడు. వాడి పంచెకీ, వంటికీ బొగ్గులమసి వుంది. సుందర్రావు మాటలు విని వాడక్కన్నించి కదిలాడు.
    సుందర్రావు వెంకన్నవైపు తిరిగి-"క్షమించాలి నా పనివాడి పేరు వెంకన్న-" అన్నాడు.
    "మీ పనివాడి పేరు వెంకన్నైతే నేను క్షమించడమెందుకు?"
    సుందర్రావు మాట్లాడలేదు.
    "రోజూ మా యింటికొచ్చే అడుక్కునే వాడి పేరు సుందర్రావు. అందుకు నేను మీ క్షమాభిక్ష కోరలేను కదా!" అన్నాడు వెంకన్న.
    సుందర్రావు నవ్వి-"మీరు మాటకు మాట చెప్పాలని అంటున్నారు కానీ - అడుక్కునేవాడికి సుందర్రావు లాంటి మంచి పేర్లుండవు కదా!" అన్నాడు.
    "పేరెంత మంచిదైనా వెంకన్నముందు అంతా అడుక్కోవలసిన వాళ్ళేకదా!" అన్నాడు.
    "పేరెంత మంచిదైనా వెంకన్న ముందు అంతా అడుక్కోవలసిన వాళ్ళేకదా!" అన్నాడు వెంకన్న.
    సుందర్రావు ముఖం ఎర్రబడింది-"అంటే? మీరంత గొప్పవారా?"
    "నేనంటున్నది తిరుపతి వెంకన్న గురించి....."
    సుందర్రావేమీ అనలేక-"రాజు మీకు నేను కరీం సాహెబునని చెప్పి పంపివుంటాడు. ఇదీ నా జీవితం. చూశారుగా!" అన్నాడు.
    "రాజు మీరు చెప్పిన మాటలే నాకు చెప్పాడు...."
    సుందర్రావు నవ్వి-"రాజు ఊహాజీవి-" అన్నాడు.
    "నేనూ ఊహాజీవినే!" అన్నాడు వెంకన్న-"ఉదాహరణకు నేను మీ ఖద్దరు జుబ్బాలో బంగారపు దారాలు చూడగలను. గల్లాపెట్టెలో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలకు దర్శించగలను..."
    "ఊఁ" అన్నాడు సుందర్రావు నవ్వుతూ.
    "మీ కట్టెల్లో మాదకద్రవ్యాలు, బొగ్గుల్లో వజ్రాలు కనిపెట్టగలను...."
    "యూ ఆర్ వెల్ కం....."
    "ఇంకా చెప్పడం అవలేదు....."
    సుందర్రావు కుతూహలంగా వెంకన్న వంక చూశాడు.
    "మీ పనివాడి పేరు వెంకన్నకాదు. నన్ను చిన్న బుచ్చాలని వాడినలా పిలిచారు....." అన్నాడు వెంకన్న.
    సుందర్రావు ముఖం అదోలాగైపోయింది-"మీ తెలివిని నేను తక్కువ అంచనా వేశాను. మన్నించండి. మా పనివాడి పేరు సుబ్బన్న. నేను వాడినే పేరుతో పిలిచినా పలుకుతాడు...."
    వెంకన్న యేదో అనబోయేసరికి సుబ్బన్న టీలు తీసుకొని వచ్చాడు.
    ఇద్దరూ టీలు తాగారు.
    "మనం మా యింటికి వెడదాం. ఇక్కడేమీ మాట్లాడుకోవద్దు....." అన్నాడు సుందర్రావు.
    వెంకన్న తలాడించాడు.
    సుబ్బన్న రిక్షాపిల్చుకుని వచ్చాడు.
    ఇద్దరూ రిక్షాలో సుందర్రావింటికి వెళ్ళారు.
    సుందర్రావుది పెంకుటిల్లు లోపల నీటుగా వుంది.
    అతడికి భార్య-ఇద్దరబ్బాయిలు.
    ఇద్దరూ వీధిగదిలో కూర్చున్నారు.
    "నేను కరీం సాహెబ్ ను కాను అది రాజు భ్రమ" అన్నాడు సుందర్రావు.
    "అతడి కాభ్రమ నెవరు కలిగించారు?"
    సుందర్రావు మాట్లాడలేదు.
    "ఈ ఊళ్ళో మీకు ముగ్గురు స్నేహితులున్నారు. ఒకడికి మూడు హోటల్సున్నాయి. రెండో అతడికి ఆయిల్ మిల్లుంది. మూడో అతడికి రెండు బట్టలకొట్లు, ఒక ఫ్యాన్సీ దుకాణం వున్నాయి....." అన్నాడు వెంకన్న.
    "అయితే"
    "వాళ్ళు మీ స్నేహితులు కాదనీ-అనుచరులనీ నేను ఋజువుచేయగలను...."
    సుందర్రావులిక్కిపడి-"ఎలా?" అన్నాడు.
    "నా పద్ధతులు నాకుంటాయి....."
    "ఇంకా మీరేమీ ఋజువు చేయగలరు?"
    "మీ ముగ్గురు స్నేహితులూ మూడు తీగలు, ఆ తీగల్ని కదిపితే మూడు కాదు-ముఫ్ఫై డొంకలు కదుల్తాయి.." అన్నాడు వెంకన్న.
    "నిజమే-తీగ కదిపితే డొంక కదిలిందన్న సామెత వుంది....."
    "సామెతలు తెలుసుకుని లాభంలేదు. అర్ధం చేసుకోవాలి...."
    సుందర్రావు నవ్వి-"అర్ధం చేసుకోవలసింది మీరు" అన్నాడు.
    "అర్ధం చేసుకున్నాను....."
    "అర్ధం చేసుకుంటే భయపడతారు...."
    "భయం నా వృత్తికి విరుద్ధం...."
    "ఆటంబాంబు పేల్తూంటే అక్కడే నిలబడడం ధైర్యం అనిపించుకోదు-" అన్నాడు సుందర్రావు.
    "మీరేం చెప్పదల్చుకున్నదీ సూటిగా చెప్పండి....."
    "నా స్నేహితులు ముగ్గురూ మూడు తీగెలన్నది నిజం వాళ్ళను కదిపితే ముఫ్ఫైడొంకలు కదుల్తాయన్నదే నిజం. కానీ ఆ డొంకలూ, తీగలూ నా దరిదాపుల క్కూడా రావు నేనప్పటిలాగే కట్టెల అడితి నడుపు కుంటూంటాను....."
    "అయితేనేం -నీకు చేతులూ, కాళ్ళూ విరిగి పోతాయి...."
    "మల్లె అంటుని దూసిపారేస్తే-అది కొత్త చిగుళ్ళు వేసి-మరింతగా పరిమళించే మల్లెల్ని పూస్తుంది-" అన్నాడు సుందర్రావు.
    "అంటే?"
    "మీరు తీగెల్నీ డొంకల్నీ పట్టుకుని లాభంలేదు. నావంటి వాళ్ళను నాశనం చేయాలి. అప్పుడే అనుకున్న పని సాధించగల్గుతారు. కానీ నావంటివాళ్ళను నాశనం చేయడం మీకు సాధ్యంకాదు....."
    "ఎందుకని?"
    "మీ రుజువులు మీకే పనికొస్తాయి. పదిమంది ముందూ వుంచడానికి పనికిరావు....."
    "ఏమిటి మీ ధైర్యం?"
    "నా ధైర్యం నా చుట్టూ వున్న ప్రజలు, నేను నాశనంకావాలంటే వాళ్ళు మారాలి. వాళ్ళు మారరని నాకు తెలుసు."
    "మీ ధైర్యం మిమ్మల్ని కాపాడదు...." అన్నాడు వెంకన్న.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS