ఒకరోజున కరీంసాహెబ్ అతడివద్దకు వచ్చి-"అమ్మ నా గురించిన విశేషాలు డైరీలో రాసుకుంది. నేను చెప్పేవి, చెప్పినవి జరగడం వగైరాలన్నీ అమ్మ డైరీల్లో వుంటాయి. ఆ డైరీలన్నీ నాకు కావాలి....." అన్నాడు.
రాజు ఇవ్వనన్నాడు.
కరీం సాహెబ్ ఇల్లంతా వెతికాడు. దొరకలేదు.
"నిప్పుతో చెలగాటమాడకు. నాకాడైరీలు కావాలి. ఇవ్వకపోతే నీ ప్రాణాలు తీస్తాను-" అన్నాడు కరీంసాహెబ్.
అతడు రాజుకు వారంరోజులు టైమిచ్చాడు.
తల్లి డైరీ రాస్తుందనికూడా రాజుకు తెలియదు. ఇంట్లో యెంత వెదికినా ఆ డైరీలు దొరకలేదు. ఎక్కడుంటాయో అతడికి తెలియలేదు. ఆ డైరీలుంటే కరీంసాహెబ్ బ్రతుకు బయటపెట్టడం సులభమవుతుందని అతడి ఆశ.
వారం రోజుల గడువూ అయిపోయింది.
రాజు కరీంసాహెబ్ కు డైరీలు దొరకలేదని చెప్పాడు.
"నువ్వు నిజం చెబుతున్నావో, అబద్ధం చెబుతున్నావో నాకెలా తెలుస్తుంది? ఇందుకొక్కటే మార్గం. ఈ రోజు నీకు నాలుగు నేరాలు చెవితాను. అవి నా కారణంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతాయి. వాటి గురించి సమాచారం పోలీసులకందక పోతే-నేను నిన్ను నమ్ముతాను...." అన్నాడు కరీం సాహెబ్.
"అందితే?" అన్నాడు రాజు.
"డైరీలడుగుతాను....."
రాజు సమాచారం పోలీసులకందించాడు. పోలీసులా నాలుగు నేరాలూ జరక్కుండా ఆపారు.
కరీంసాహెబ్ మండిపడుతూ వచ్చి రాజును డైరీ లడిగాడు.
"డైరీల సంగతి నాకు తెలియదు తెలిస్తే ఈపాటికి వాటిని పోలీసుల పరం చేసేవాణ్ణి-" అన్నాడు రాజు.
"నువ్వు నాకు మిత్రుడివి కాదు శత్రువ్వి-" అన్నాడు కరీంసాహెబ్.
"నీకు నువ్వే శత్రువ్వి-" అన్నాడు రాజు.
"నువ్వెలాగనుకున్నాసరే-ఇకమీదట నీ దృష్టిలో నా పేరు కరీంసాహెబ్ కాదు శత్రువు...." అన్నాడు కరీంసాహెబ్.
ఆ తర్వాత ఈ ఉత్తరం వచ్చింది.
ఆ యువకుడు కథ చెప్పడం పూర్తయింది.
"నీ కథ చాలా రసవత్తరంగా వుంది. నీకు కరీంసాహెబ్ మనిషికూడా తెలిసినపుడు పోలీసుల కతడి గురించి ఎందుకు చెప్పవు?" అన్నాడు వెంకన్న.
"కరీంసాహెబ్ కు కాకినాడలో కర్రల అడితివుంది. అతడెంతో నిజాయితీపరుడు, మంచివాడుగా ఆ చుట్టుపక్కల పేరుపొందాడు. అతడికి సంబంధించి అంతకు మించి ఋజువు చేయడం కష్టం-" అన్నాడు రాజు.
"అది పోలీసులు చూసుకుంటారు...." అన్నాడు వెంకన్న.
"తన గురించి అంతకుమించి తెలుసుకోవడం పోలీసుల వల్ల కాదని అతడన్నాడు. తనను నడిపించే శక్తివేరే ఉన్నదనీ-ఆ విషయంలో తను అసహాయుడిననీ కూడా అతడన్నాడు."
"ఇప్పుడు నీవు ప్రాణాల గురించి భయపడుతున్నావా?"
"లేదు కరీంసాహెబ్ ను బైటపెట్టాలని నాకోరిక. అందుకు నేనేమైపోయినా ఫరవాలేదు. నేను నా ప్రాణాల గురించి భయపడడంలేదు. కానీ అవి వృధాగా పోకూడదని నా అభిలాష. నేనొక్కడినీ కరీంసాహెబ్ నెదిరిస్తే ప్రాణాలు పోవడం మినహా మరే ప్రయోజనమూ వుండదు....." అన్నాడు రాజు.
"నేనిప్పుడేం చేయాలి?"
"కరీం సాహెబ్ ను బైట పెట్టండి....."
"బైటపెడితే?"
"నేను వాడిని ఆస్తి నా పేరున వుంది. అందులోంచి మీరు కోరిన ఫీజివ్వగలను....." అన్నాడు రాజు.
"పాతిక వేల రూపాయలివ్వగలవా?"
"ఇవ్వగలను......" దృఢంగా అన్నాడు రాజు.
"అయితే సరే-కరీం సాహెబ్ వివరాలు నాక్కావాలి. నేనతన్ని స్వయంగా కలుసుకుని మాట్లాడుతాను" అన్నాడు వెంకన్న.
"వెంకన్నగారూ-మీ గురించి చాలా విన్నాను. ఈ విషయంలో మీరే నాకు సాయపడగలరు. కరీం సాహెబ్ నా జీవితానికింక ఇరవై ఎనిమిదిరోజులు గడువు మాత్రమే యిచ్చాడని మీరు గుర్తుంచుకోవాలి-" అన్నాడు రాజు.
"నేనేం గుర్తుంచుకోవాలో నాకు తెలుసు. నాక్కావలసిన వివరాలు చెప్పు-" అన్నాడు వెంకన్న.
అతడు చెప్పే వివరాలు శ్రద్దగా నోట్ చేస్తున్నారు రాజమ్మ సీతమ్మ.
తర్వాత రాజు వెళ్ళిపోయాడు.
"కథ చాలా ఆసక్తికరంగా వుందికదూ!" అన్నాడు వెంకన్న.
"అవును..."
"మరొక్కసారి ఆ కధ వింటాను....." అన్నాడు వెంకన్న.
సీతమ్మ, రాజమ్మ ఒక్కసారే మొదలుపెట్టారు.
"అలాకాదు ఒక్కొక్కరు పదేసి వాక్యాల చొప్పున చదువుతూ వెళ్ళండి. ఒకరి తర్వాత ఒకరు....."
అసిస్టెంట్సిద్దరూ చదవడం ప్రారంభించారు.
ముందు సీతమ్మ, తర్వాత రాజమ్మ......
వాళ్ళు కధ చదవుతూంటే ఒకే సీరియల్ ను ఇద్దరు సమర్ధవంతురాలైన రచయితలు ఒకరి తర్వాత ఒకరు కొనసాగిస్తున్నట్లుంది.
"ఏ మనిషీ సంఘంకోసం స్వార్ధాన్ని త్యాగం చేయలేడు. ఒకవిధంగా నేను సంఘద్రోహిని. మరో విధంగా నువ్వూనూ....." అన్నాడు కరీంసాహెబ్ తల్లితో.....
సీతమ్మ చదువుకుపోతూంటే-"ఆగు!" అన్నాడు వెంకన్న.
సీతమ్మ ఆగిపోయి అతడివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"రాజమ్మా! అదేవిషయం నువ్వేం రాశావో చదువు" అన్నాడతడు.
ఆమెకూడా అక్షరాలా అదేరాసింది.
"ఊఁ" అంటూ వెంకన్న ఆలోచనలోపడ్డాడు.
"బాస్-ఏమిటాలోచిస్తున్నారు?" అంది సీతమ్మ.
"మన కేసు ఈ మాటల ఆధారంగానే ప్రొసీడవాలని నాకనిపిస్తోంది" అన్నాడు వెంకన్న.
"అదెలా బాస్?" అంది రాజమ్మ కుతూహలంగా.
"ఇంతకుమించి అడిగితే నా భార్యకే చెప్పను....." అన్నాడు వెంకన్న.
ఆ వెనువెంటనే బల్లమీద ఫోన్ మ్రోగింది. వెంకన్న పరధ్యానంగా ఫోన్ తీసి-"హలో!" అన్నాడు.
"నేను.....పద్మావతిని వంటింట్లోంచి మాట్లాడుతున్నాను ఒకసారి లోపలకు రండి-"
"ఎందుకు?"
"నాక్కూడా చెప్పనన్న ఆ విశేషమేమిటో చెప్పడానికి....."
వెంకన్న ఫోన్ పెట్టేసి లేచి నిలబడ్డాడు.
"గుడ్ లాక్ బాస్!" అంటూ అసిస్టెంట్సిద్దరూ నవ్వారు.
తన ఫోన్ వాళ్ళూ విన్నారని ముఖం చూసి తెలుసుకున్నాడు వెంకన్న.
2
కాకినాడ సూర్యారావు పేటలో ఉందా కర్రల అడితి.
ఓ పెద్ద పాక.....పాకలో కట్టెలు బారులుగా పేర్చి వున్నాయి. ఓ మూలగా బొగ్గుల బస్తాలున్నాయి.
పాకముందు ఓ పెద్ద కొయ్య తక్కెడ వ్రేలాడుతోంది.
వెంకన్న అక్కడకు చేరుకునేసరికి-నలుగురు మనుషులు తక్కెడ చుట్టూ వున్నారు.
వారిలో ఒకడు కూలివాడు. ఒకడు కట్టెలు తూస్తున్నాడు.
మిగిలిన ఇద్దరిలో ఒకడు డబ్బిస్తున్నాడు. ఇంకొకడు తీసుకుంటున్నాడు.
