అప్పుడు దూరపు బంధువామెతో-"సుందర్రావుకు నువ్వంటే అబిమానముంది తన మార్గం నచ్చదని నీ దగ్గరకు రావడంలేదు. నిన్ను సుఖంగా వుంచాలనే అతడు నాకీ ఆస్తిని కట్టబెట్టిన నీ దగ్గరకు పంపాడు-" అంటూ అసలు సంగతి చెప్పాడు.
లక్ష్మి తెల్లబోయింది. ఆవేశంలో ఆ ఆస్తిని నిరసించాలనుకుంది. కొడుకు భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని ఆ పని చేయలేకపోయింది.
"నిజంగా నీకు వాడి వివరాలు తెలిస్తే నాకొకసారి కనిపించమను-" అందామె దూరపు బంధువుతో.
ఆ మర్నాడే సుందర్రావు లక్ష్మికి కనబడ్డాడు.
లక్ష్మి అతణ్ణి నానామాటలూ అంది.
"అమ్మా! నాకు అడ్వెంచరస్ లైఫంటే యిష్టం. అనుక్షణం ప్రాణాలతో చెలగాటమాడుతూ బ్రతక డంలోనే నాకు థ్రిల్ వుంది. నా దారి గురించి నువ్వు పట్టించుకోకు. నేను నీకు దూరంగానే వుంటాను-" అన్నాడతడు.
"ఏం చేస్తున్నావు నువ్వు?" అంది లక్ష్మి.
సుందర్రావు చెప్పలేదు.
లక్ష్మి రెట్టించి అడిగింది.
"అవన్నీ నీకెందుకమ్మా?" అన్నాడతడు.
"ఎందుకంటే నువ్వు నరహంతకుడివి కాలేదని నాకు తెలియాలి-"
సుందర్రావు నవ్వి-"నరహంతకులంటే నీకెందుకంత ఆవేశం? మనదేశాన్నేలే చాలామంది నరహంతకులే! వాళ్ళను నీలాంటివాళ్ళే ఓట్లేసి ఎన్నుకుంటున్నారు!" అన్నాడు.
"నాకు నీ సంగతే కావాలి......" అంది లక్ష్మి.
"హత్య చేసినవాణ్ణి ఉరితీస్తే అది హత్య అవుతుందా?"
"కాదు-" అంది లక్ష్మి.
"అయితే ఉరితీయబడ్డవాడు హంతకుడు కాకపోతే?"
లక్ష్మి సాలోచనగా-"ఏం చేస్తాం-చట్టానికి కళ్ళు లేవు....."
సుందర్రావదోలా నవ్వి-"కళ్ళులేని ఈ చట్టాన్ని మీరంతా యెందుకు గౌరవిస్తారో తెలియదు నాకు నేను మాత్రం ఈ చట్టాన్ని నమ్మను. గౌరవించను. నా చట్టం వేరే వుంది. ఆ చట్టానికి కళ్ళున్నాయి....." అన్నాడు.
"అంటే?" అంది లక్ష్మి.
"నేను నరహంతకుడినా అని అడిగావు. నేరస్థుల ప్రాణాలుతీస్తే అది హత్య కాదని కూడా నువ్వే అన్నావు. నేను సామాన్యుల జోలికి వెళ్ళను. ఆత్మరక్షణకో, నేరాన్ని తొలగించడానికో శిక్షలు విదిస్తూంటాను. నా చట్టం వేరు....."
లక్ష్మి ఆశ్చర్యంగా-"ఏం చేస్తున్నావు నువ్వు?" అంది.
"నేను నీకు అన్నీ నిజాలు చెబుతాను ఎందుకంటే కొడుకుగా నేను నిన్ను నమ్మాలి. నీవంటే నా కెంత గౌరవమో నీకు తెలియాలి. ఇది ఎవరికీ తెలియని గొప్ప రహస్యం. ఇప్పుడు నా పేరు కరీంసాహెబ్...." అన్నాడు సుందర్రావు.
తెల్లబోయింది లక్ష్మి.
"అబద్ధం......" అందామె.
"ఋజువులున్నాయి నేను చేయబోయే ముఖ్యమైన నేరాలు కాస్త ముందుగా నీకు చెబుతూంటాను. నువ్వు విని ఊరుకోవాలంతే....." అన్నాడు సుందర్రావు.
లక్ష్మికి అతడు కొన్ని నేరాలు చెప్పాడు.
అన్నీ అతడు చెప్పినట్లే జరిగాయి.
లక్ష్మి అతడంటే భయపడింది. అతడి నేరాన్ని బయటపెడతానంది.
"ఎందుకు?" అన్నాడతడు.
"నువ్వు సంఘద్రోహివి-" అందామె.
"సంఘ ద్రోహులను పట్టుకోవడానికి పోలీసులున్నారు. అది నీ పనికాదు-" అన్నాడతడు.
"పోలీసులకు సాయపడడం నా బాధ్యత-" అందామె.
"నీ కొడుకును కాపాడుకోవడం నీ బాధ్యత కాదా?" అన్నాడతడు.
"ఎందుకు కాదు?"
"అయితే నువ్వే నీ కొడుకును కాపాడుకోవాలి. పోలీసులు రాజును కాపాడలేరు-" అన్నాడతడు.
లక్ష్మికి అర్ధమయింది. సుందర్రావుకు తనంటే గౌరవం. కానీ తన్ను తాను రక్షించుకోవడంకోసం రాజుని చంపడానికతడు సిద్ధం.
కొడుకుకోసం ఆమె కరీం సాహెబ్ రహస్యం దాచింది.
"ఏ మనిషీ సంఘంకోసం స్వార్ధాన్ని త్యాగం చేయలేడు. ఒకవిధంగా నేను సంఘ ద్రోహిని, మరోవిధంగా నువ్వూనూ....." అన్నాడతడు తల్లితో.
లక్ష్మి తను సంఘ ద్రోహి అయినందుకు బాధపడింది కానీ కొడుకు ప్రాణాల విషయంలో రిస్కు తీసుకోలేదు.
కరీం సాహెబ్ అప్పుడప్పుడు వచ్చి లక్ష్మిని కలుసుకునేవాడు. అతడి కారణంగా ఆనే, రాజు వైభవంగా జీవిస్తున్నారు. కరీం సాహెబ్ తన నేరాలను ముందుగానే ఆమెకు చెప్పి-తన గౌరవాన్ని వ్యక్తపరిచేవాడు. ఈలోగా ఆమె దూరపు బంధువు కాలంచేశాడు.
రాజు పెద్దవాడై బియ్యే ప్యాసయ్యాడు. తల్లి అతడి కుద్యోగం చేయమంది. రాజు ఇష్టపడలేదు.
కరీం సాహెబ్ కు ఇది తెలిసింది.
"వాడికుద్యోగం చేయాల్సిన కర్మ పట్టలేదు-" అన్నాడతడు.
"ఇంతకాలం నేను వాడిని వాడి కాళ్ళమీద నిలబెట్టాలని చూస్తున్నాను-" అంది లక్ష్మి.
"ఎందుకు?" అన్నాడు కరీం సాహెబ్.
"నేను నమ్మే చట్టం సమ్మతించిన పద్ధతిలో వాడు డబ్బు సంపాదిస్తే-ఆ డబ్బుతోనే బ్రతకాలన్నది నా కోరిక....." అంది లక్ష్మి.
"మరి ఈ డబ్బేం చేస్తావు?"
"నీకే వదిలిపెడతాను....."
"నేను వద్దంటే!"
"అనాధశరణాలయానికి విరాళంగా యిచ్చేస్తాను."
కరీం సాహెబ్ ఆలోచించి-"అంతపని చేయకు.." అన్నాడు.
"చేస్తాను-" అంది లక్ష్మి.
"దీనికి నేనో ఉపాయం చెబుతాను-" అన్నాడు కరీంసాహెబ్.
ఆ ప్రకారం కరీంసాహెబ్ సాయంతో మరో ఊళ్ళో రాజుకుద్యోగం దొరికింది. లక్ష్మి అతడివద్ధకే వెళ్ళింది. ప్రస్తుతముంటున్న ఇంటిని అద్దెకివ్వడం జరిగింది.
రాజు జీతం నెలకు ఎనిమిదివందల రూపాయలు. అందులో ఇంటద్దె రెండువందలరూపాయలు. మిగిలిన ఆరువందలతోటీ అతడూ తల్లీ బ్రతకాలి.
అంతకాలం వైభవంగా బ్రతికిన రాజు కీ జీవితం నచ్చలేదు.
"మనకు బోలెడు ఆస్తి వుంటే దాన్ననుభవించకుండా ఈ రకం జీవిత మెందుకు?" అన్నాడతడు తల్లితో.
"ఇది స్వయంకృషి-" అంది తల్లి.
"అమ్మా సుఖంగా బ్రతుకుధం. దేవుడిచ్చిన ఆస్తి వుండగా వేరే స్వయంకృషి ఎందుకు?" అన్నాడు రాజు.
"అది దేవుడిచ్చిన ఆస్తికాదు. దెయ్యమిచ్చింది-" అంది లక్ష్మి.
"అంటే?" అన్నాడు రాజు.
లక్ష్మి అతడికి కరీంసాహెబ్ వివరాలన్నీ చెప్పింది. తన ఆశయాలు చెప్పింది. రాజు తల్లికి నమస్కరించి-"నేనుద్యోగంలో కొనసాగుతాను. దెయ్యమిచ్చిన ఆస్థిలో ఇక పైసాకూడా ముట్టను-" అన్నాడు.
లక్ష్మి సంతోషించింది.
కొన్నాళ్ళకు కరీంసాహెబ్ ఆమెను కలుసుకుని-"ఏమంటున్నాడు నా తమ్ముడు? నచ్చిందీ జీవితమంటే సరే-లేదా హాయిగా నేనిచ్చే ఆస్తిననుభవించండి-" అన్నాడు.
"రాజుకీ జీవితం నచ్చింది....." అంది లక్ష్మి తను రాజుకు కరీం సాహెబ్ గురించి చెప్పినట్లు కూడా ఆమె చెప్పింది.
అతడు కంగారుపడి-"ఈ విషయం నీకూ నాకూ తప్ప మూడోవాడికి తెలియకూడదనుకున్నాను....." అన్నాడు.
లక్ష్మి, రాజు, కరీంసాహెబ్-ముగ్గురూ మాట్లాడుకున్నారు.
రాజు కరీంసాహెబ్ బ్రతుకు బయటపెడతానన్నాడు.
లక్ష్మి రాజుతో-"నేను బ్రతికుండగా నువ్వాపని చేయడానికి వీల్లేదు-" అంది ఆ ప్రకారం ఆమె ఆజు చేత ఒట్టేయించుకుంది.
తల్లి ద్వారా కరీం సాహెబ్ ఘోరాలు రాజుకు తెలుస్తూండేవి. అతడి రక్తం ఉడికిపోతూండేది.
ఇలా వుండగా ఒకరోజున రాజు తల్లి మరణించింది.
కరీంసాహెబ్ రాజుకంటే ఎక్కువగా ఏడ్చాడా రోజు. లక్ష్మి అంత్యక్రియలు వైభవంగా జరిగాయి.
"నువ్వీ జీవితం మానేసేయ్ హాయిగా బ్రతుకు-" అన్నాడు కరీం సాహెబ్ రాజుతో.
"అమ్మ చచ్చిపోయింది. ఇంక నీ బ్రతుకు బయట పెడతాను-" అన్నాడు రాజు కరీంసాహెబ్ తో.
"అమ్మ చచ్చిపోయింది కాబట్టి నేనూ నిన్ను వదలను. నా జోలికి వచ్చేవా - నువ్వుండవు...." అన్నాడు కరీంసాహెబ్.
రాజు వెంటనే సాహసించలేదు. కరీంసాహెబ్ బ్రతుకెలా బైటపెట్టాలా అని ఆలోచిస్తూన్నాడతడు.
