అత్తయ్యా! నన్ను బతకనివ్వు

పార్వతి అత్తయ్య సాధించడం మొదలు పెట్టింది. రాధా మణి కి విసుగు పుట్టింది.
ఎందుకీ ఊరు వచ్చానా అనుకుంది రాధ. ఆమె అనుకున్నట్టు జరగలేదు.
రాధ ఒక మిడ్ వైఫ్ ప్రసూతి చికిత్స ను క్రమబద్దంగా అభ్యసించి పరీక్ష పాసయింది. స్వతంత్రంగా వృత్తి సాగిడ్డామనే కోరికతో ఈ ఊరు వచ్చింది. చాలినంత సంపాదించ వచ్చునని అనుకుంది. కాని, ఇక్కడికి వచ్చిన తరవాతే తెలుసుకుంది, సగం కడుపు కూడా నిండడం కష్టమని. ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు తక్కువ. కనక ప్రసూతి చికిత్స కోసం ఆమెను వెతుక్కుంటూ వచ్చేవాళ్లు కూడా తక్కువే. ఒకవేళ ఎవరైనా వచ్చినా, ఆమెకు తగినంత ప్రతిఫలం ముట్ట జెప్పేవాళ్ళు కారు.
ఈ పరిస్థితిల్లో రోజులు గడవడమే కష్టమని పించింది. అర్ధాకలి తోనే కాలం గడప వలసి వచ్చేది. కనిపించిన వారి దగ్గ్రరల్లా అప్పు చేసింది. చాలా అవస్థ పడ సాగింది.
ఇలా రాధ అవస్థ పడుతూ వుంటే, పార్వతి ఆమెను సాధించడం మొదలు పెట్టింది. పార్వతి ఆమె సొంత మామయ్య భార్య. అత్తయ్యా అని పిలిచేది. ఆమెను నమ్మి రాధ ఈ ఊరికి వచ్చింది. ఆమె ఇంట్లోనే ఒక చిన్న భాగం అద్దెకు తీసుకుంది. మొదట్లో రాధ అంటే పార్వతి గౌరవంగా చూచేది. రాను రాను పరిస్థితి మారిపోయింది. పైగా బాధించడం మొదలు పెట్టింది. ఇది చూసి రాధ ఆశ్చర్యపోయింది.
పొద్దున్నే రాధను ఉద్దేశించి ఒక దండకం చదివింది పార్వతి. "ఏమిటనుకున్నావే నువ్వు? ఒక నెల అద్దె బాకీ. రెండు పళ్ళ బియ్యం బాకీ. కట్టే పుల్లలు తీసుకున్నావ్. మళ్లీ ఇవ్వలేదు. ఏమనుకున్నావో ఏమిటో" అని మండి పడింది.
అత్తయ్య ఇంతవరకూ ఇలా మాట్లాడలేదు. అందువల్ల ఆమె మాటలు రాధకు చురుక్కు మనిపించాయి. పల్లెత్తు మాట కూడా పడే స్వభావం కాదు అమెది. ఈవేళ అత్తయ్య దండం చదివి వెళ్ళినప్పటి నుంచీ అలాగే కూర్చుండి పోయింది. తన జీవితం ముగిసినట్టుగా తోచిందామెకు. మధ్యాహ్నమంతా ఏడుస్తూనే ఉంది.
సాయంకాలం ఊళ్ళో కి బయలు దేరింది. అంతకు మునుపు ఒక నగరం లోని పెద్ద ఆసుపత్రి లో పని చేయడం వల్ల, ఆ అనుభవంతో ఆమె వైద్యం కూడా చేసేది. ఇంజెక్షన్లు చేసి, మందులు వ్రాసి ఇచ్చేది. ఈ విధంగా కూడా ఆమె నాలుగు డబ్బులు కళ్ళ చూసేది.
ఆమె వద్ద వైద్యం చేయించుకున్న నలుగురైదుగురు దగ్గర డబ్బు వసూలు చేయడానికి రాధ బయలుదేరింది. చాలా చోట్లు తిరిగింది. పద్దెనిమిది రూపాయలు చేతికి వచ్చాయి. ఆ డబ్బుతో ఆమె ఇంటి దారి పట్టింది.
సంతను దాటుతూ ఉండగా "ఏమమ్మా" అనే పిలుపు వినవచ్చింది. ఆమె వెనక్కి తిరిగింది. నూనూగు మీసాల యువకుడో కడు లాల్చీ జేబులో చెయ్యి దూర్చుకుని కనిపించాడు. ఆమెను చూడడంతోనే పెద్దగా నవ్వాడు. రాదా మణి కిదంతా ఆశ్చర్యంగా తోచింది. కోపం కూడా వచ్చింది. "ఎవరు నువ్వు?' అని అడిగింది.
"ఇంట్లో అత్తయ్య ఉందా?"
"ఉంది."
"గోపాలు వస్తున్నాడని చెప్పు. రెండు గంటల్లో వచ్చేస్తాను." అన్నాడు.
బదులు చెప్పకుండా రాధ నడక సాగించింది. ఇల్లు చేరుకోగానే "అత్తయ్యా" అనిపిలుస్తూ లోపలికి వెళ్ళింది. అత్తయ్య అప్పుడు గదిలో ఉంది. అక్కడికి వెళ్ళింది రాధ.
గది లోపలి నుంచి ఘుమ ఘుమ లాడుతూ వాసన వచ్చింది. అత్తయ్య ముఖానికి పౌడరు రాసుకుంటుంది. నిలువు టద్దం ముందు నిలబడి ఉంది.
ఆ గదిని చూడడం రాధ కదే మొదటిసారి. అంతకు ముందెప్పుడూ చూడలేదు. మంచం, సిల్కు పరుపు, టేబిలు మొదలైన వాటితో గది అలంకరించ బడింది.
"రావే, రా " అంది అత్తయ్య.
"ఈ పద్దెనిమిది రూపాయలు ఉంచుకోండి. అత్తయ్యా. మిగిలిన డబ్బు తొందర్లోనే ఇచ్చేస్తాను" అంది రాధా మణి.
"ఉమ్' అంటూ ఆ డబ్బు తీసుకుంది అత్తయ్య. "నువ్వెలా ఇస్తావో తెలీదు. మిగిలిన డబ్బు కూడా తొందర్లో ఇవ్వాలి తెలిసిందా!" కొంచెం గట్టిగానే చెప్పింది.
రాధా మణి తల ఆడించింది.
"తల బాగానే అడిస్తావ్! కాని, నువ్విస్తావని మాత్రం నాకు నమ్మకం లేదు."
"లే దత్తయ్యా . తప్పకుండా ఇస్తాను."
"అవునవును" అంది అత్తయ్య. సంపాయించి ఇచ్చేట్టు మాట్టాడు తున్నావ్! పోవే, నీకు బతకడం తెలీదు. వయస్సులో ఉన్నావ్, లక్షణంగా ఉన్నావ్. కాని ఏం లాభం?"
"ఏం చెయ్య నత్తయ్యా! నాకు తెలిసినంత లో కష్ట పడుతున్నాను. డబ్బేమో అట్టే రావడం లేదు" అంది రాధా మణి.
"అట్టే రావడం లేదూ?" కోపంగా చూచింది అత్తయ్య. "నువ్వు తలుచుకుంటే బోలెడు సంపాయించ వచ్చు. ఇంతకూ నీకు బతకడం తెలీదు" అంటూ అడ్డం వైపు వెళ్ళింది.
రాధ తానున్న భాగానికి వచ్చేసింది. ఆలోచనలో మునిగి పోయింది. అత్తయ్య మాటలు ఆమెకు వింతగా కనిపించాయి. 'నువ్వు తలుచుకుంటే బోలెడు సంపాయించ వచ్చు' అంది. నేను మాత్రం అనుకోడం లేదు! కాని సంపాదించ లేకపోతున్నా ననుకుంది రాధా మణి.
అత్తయ్య ను గురించి ఇప్పుడామె కు చాలా విషయాలు గుర్తుకి వచ్చాయి. అత్తయ్య ఆ ఊళ్ళో ఒక బడిలో టీచర్ గా పని చేస్తుంది. జీతం తక్కువే. ఈ ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. అయినా ఆమె ఇన్ని సౌకర్యాలతో ఎలా జీవించ గలుగుతుంది?చక్కగా డ్రెస్ చేసుకుంటుంది. మంచి మంచి చీరలు కట్టుకుంటుంది. తిండిలో ఏమీ లోటు చెయ్యదు. అప్పుడప్పుడు సినిమా లకి వెడుతుంది. ఇవన్నీ ఎలా వీలవుతున్నాయి?
అత్తయ్య ను గురించి చిన్న సందేహాలు కూడా ఆమెకు కలిగాయి. భర్త సహాయం లేకుండా ఇక్కడ అత్తయ్య ఒంటరిగా జీవుస్తుంది. భర్తను విడిచి పెట్టిందనే చెప్పవచ్చు. మహారాణి లా కాలక్షేపం చేస్తుంది. ఆమె కిది ఎలా వీలయింది?
రెండు రోజులు గడిచాయి. మూడో నాడు సాయంకాలం రాధను వెతుక్కుంటూ వచ్చింది అత్తయ్య. "ఏమే , రెండు రోజు లయ్యాయి. డబ్బు మాత్రం ఇవ్వలేదు " అంది.
"కొంచెం ఓపిక పట్టు, అత్తయ్యా." బదులు చెప్పింది రాధ.
"ఎన్నాళ్ళ ని ఓపిక పట్టడం? ఊరికే ఉండవచ్చు నని అనుకుంటూ న్నావేమో ఇంట్లో? నేను ఖచ్చితం మనిషిని. ఇష్టమైతే ఉండు. లేకపోతె మరో ఇల్లు చూసుకో."
అత్తయ్య మండి పడింది. రాధ కైతే ఏడుపు వచ్చింది. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది.
"అత్తయ్యా, ఇలా అనకు. నేను దిక్కు లేనిదాన్ని. నేనెక్కడికి వెళ్ళను? నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చాను."
"నన్ను నమ్మి ఎందుకు రావాలే నువ్వు?"
అత్తయ్య ఏమిటో మాట్లాడుతూనే ఉంది. రాధామణి వెక్కి వెక్కి ఏడవసాగింది. దొడ్లో పని చేసుకుంటూ కూడా రాధను తిట్టి పోయడం మానలేదు అత్తయ్య.
దీపాలు పెట్టి గంట సేపయింది.
వీధి తలుపు నెవరో తట్టినట్టువినిపించింది. దొడ్లో అత్తయ్య ఉండడం వల్ల , రాధే తలుపు తెరిచింది. ఆ నూనూగు మీసాల వాడు వాకిట్లో నిలబడి ఉన్నాడు. ఆమెను చూడగానే నవ్వాడు.
"పార్వతి ఉందా?"
"ఉంది."
"ఉమ్' అనుకుంటూ ఆమెను తోసుకుని వెళ్ళినట్టుగా లోపలికి వెళ్లాడు. అతని వంక కోపంగా చూసింది రాధ. ఆ దృశ్యం చూస్తూ లోపలికి వచ్చింది అత్తయ్య.
"ఇదుగోనే , రాధా" అంది.
"ఈ ఇంటిని వెతుక్కుంటూ ఎవరు వచ్చినా వాళ్ళని సంతోషంగా ఆహ్వానించాలి. వచ్చేవాళ్లు సంతోషంగా ఉంటేనే మనమూ సంతోషంగా ఉండవచ్చు" అని చెప్పింది.
రాధ తల వంచుకుని తన గదికి వెళ్ళిపోయింది. ఆమెకు రకరకాల ఆలోచనలు వచ్చాయి. "ఎవరీ గోపాలు! అతను తరచుగా ఎందుకు వస్తున్నాడిక్కడికి ? ఈ ఇంటిని అంత సొంతంగా ఎండుకతను భావిస్తున్నాడు?' ఇలా ఆలోచించ సాగింది.
గంట సేపయింది.
అత్తయ్య తిరిగి వచ్చింది. రాధ నేల మీద పడుకుని ఉంది.
"ఏమే, రాదా" అంది అత్తయ్య. రాధ లేచింది.
"ఇలా రా."
రాధ ఆమె వెనకాలే నడిచింది.
అత్తయ్య తన గది వైపుకి నడిచింది. గడప దగ్గర నుంచుని "ఉమ్...లోపల అతనున్నాడు. వాడితో మాట్లాడుతూ ఉండు. నేనిప్పుడే వచ్చేస్తాను." అంది.
గడపలోనే జంకుతూ నిలబడిన రాధను లోపలికి మెల్లగా తోసింది. ఆ తోపుకి రాధ లోపలికి వెళ్ళింది. మంచం మీద ఆ మీసాల వాడు కూర్చుని ఉండడం చూసి ఆమె నిర్ఘాంత పోయింది. వెంటనే రివ్వుమని బయటికి వచ్చేసింది రాధ.
"ఏమిటత్తయ్యా ఇది?" అంటూ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది.
"అవునే. నీకు తెలీదు." రాగం తీస్తూ చెప్పింది అత్తయ్య.
రాధకు ఏడుపు వచ్చింది.
"వద్దత్తయ్యా! అటువంటిదేం వద్దు. గౌరవంగా సంపాదించేది చాలు."
"ఛీ! బుద్ది లేనిదానా!" అంటూ కోపం కొద్ది ఆమె చేతులు పట్టుకుని లాగి లోపలికి తోసింది అత్తయ్య.
"అయ్యో!" అని అరుస్తూ మళ్లీ బయటికి వచ్చింది రాధ. "అత్తయ్యా! దేవుడి మీద ఒట్టు! ఇలాంటి విషయాలోకి మాత్రం నన్ను దించకు. నిన్ను వేడుకుంటున్నాను." ఏడుస్తూ చెప్పింది రాధ.
ఆరోజు అత్తయ్య పెట్టిన శాపనార్ధాలకు అంతు లేదు.
ఇప్పుడు రాధా మణి కి అంతా తెలిసింది. అత్తయ్య జీవితం కళ్ళకు కట్టినట్ట యింది. 'వచ్చి వచ్చి ఇక్క డ చిక్కుకున్నానా' అనుకుంది. ఆమె బాధ పడింది.
ఆ తరవాత చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. రాధను వెతుక్కుంటూ అత్తయ్య తరచుగా వచ్చేది. అద్దె బాకీని గురించి దండకం చదివి, తరవాత రాధకు హితోపదేశం చేసేది.
పోను పోను రాధను ఒక భీతి ఆవహించింది. డబ్బు సంపాదించేందుకు అత్తయ్య తనను ఒక సాధనంగా చేసుకో దలిచిందా! అని అనుకుంది. ఆ రోజు కారోజు అత్తయ్య సాధింపు ఎక్కువవుతూ వచ్చింది.
ఒకరోజు రాధా మణి వంటింట్లో పొయ్యి మీద ఎసరు పెడుతూ ఉంది. అది పగటి వేళ. టైం 11 గంటలయి ఉంటుంది. గదిలో నీడ కదులుతున్నట్టు చూసి వెనక్కి తిరిగింది. ఇద్దరు మనుషులు ఆమె వెనకాల నిలబడి ఉన్నారు. నిర్ఘాంత పోతూ ఆమె లేచింది.
"ఎవరు మీరు? ఎందు కొచ్చారిక్కడికి?"
ఇద్దరూ మూర్కుల మాదిరి నవ్వారు.
"ఎందుకొచ్చారు లోపలికి? బయటికి నడవండి." అరిచింది రాధ.
వచ్చిన వాళ్ళు కదల్లేదు. రాధ కైతే ఎక్కడ లేని కోపం వచ్చింది. "వెదతారా, లేదా?' అంటూ మండుతున్న కట్టే నొకటి తీసుకుంది చేతిలోకి.
ఆ ఇద్దరూ పరిగెత్తు కుంటూ సావిట్లో కి వెళ్లి కూర్చున్నారు. అత్తయ్య అక్కడికి గబగబా వచ్చింది.
"ఏమే, రాధా! వాళ్ళను పంపించింది నేనే" అంటూ కోపంగా చూసింది.
"అత్తయ్యా" అని బిగ్గరగా అరిచింది రాధ. "నువ్వు చెప్పినట్టల్లా నేను వినను" అంది.
