'నిన్న నువ్వన్న మాటలకి, రాజా మెంటల్ గా ఎఫెక్ట యి , జ్వరం తెచ్చుకున్నాడని నా అనుమానం సంధ్యా! నువ్వు రాజాతో స్నేహంగా లేకపోతె యిబ్బంది లేదు కానీ విరోధం వున్నట్లు ప్రవర్తించడం మాత్రం నాకు నచ్చలేదు. నిన్న నువ్వతన్ని అవమానించిన దానికి అసలు క్షమాపణ చెప్పుకోవాలి.' కొంచెం కోపంగానే అంది. సంధ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 'తనకు రాజాతో విరోధమా! అక్క తనని సరిగ్గా అర్ధం చేసుకోలేక పోతున్నది. రాజా అంటే నా కిష్టం అని అక్కతో ఎలా చెప్పడం?'
* * * *
వారం తిరిగేప్పటికి రాజా జ్వరం తగ్గింది కాని, చాలా నీరసించి పోయాడు. ఏమాత్రం వోపిక లేనట్లు, అస్తమానం కళ్ళు మూసుకొని పడుకునుండే రాజాని చూసినప్పుడల్లా సంధ్య మనసు కేలికినట్లన్పించింది. తన మనసులో వచ్చిన మార్పు సంధ్య కి స్పష్టంగా తెలుస్తూనే వుంది. ఐతే, ఇదివరకులా తన స్వాధీనం లో ఉంచుకోవాలని పెనుగులాడట ల్లేదు . అంతకన్నా ఆరాట పడటల్లేదు. పైపెచ్చు స్వేచ్చ పొందిన మనసు కవ్వించే భావాలు సంధ్య కి ఆహ్లాద కరంగా ఉన్నాయి.
ఆదివారం, మధ్యాహ్నం రెండు గంటలయి వుంటుంది. ఆరోజే రాజా కొంచెం అన్నం తిని పడుకున్నాడు. నీరసం వల్లనేమో గాడ నిద్ర పట్టేసింది పడుకున్న వెంటనే. సారధి, సుమిత్ర గదిలో నెమ్మదిగా ఏదో మాట్లాడు కుంటున్నారు. మంచినీళ్ళు తాగడానికి వంటింట్లో కి వెళ్ళబోతున్న సంధ్య కి, తన పేరు విన్పించడంతో ఒక్క క్షణం ఆగింది.
'సంధ్య ని, మన రాజా కిచ్చి చేస్తే బావుంటుంది కదూ!' సారధి సుమిత్రని నెమ్మదిగా అడుగుతున్నాడు. సారధి ప్రశ్నలోని భావాన్ని అతడే కన్వయించు కోనేప్పటికి సంధ్య గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. శరీరం సన్నగా కంపించింది. ఒక్క క్షణం నిశ్శబ్దం! సంధ్య ప్రాణానికి అదే యుగంగా తోచింది.
'సంధ్య కి , వివాహం పట్ల చాలా సున్నిత మైన భావాలున్నాయి. తనను మనస్పూర్తిగా ప్రేమించ గల్గిన వాళ్ళనే తను తిరిగి అలా చూడగల్గుతుంది. మరి రాజా తనను......' అసంపూర్ణం గానే వదిలేసింది సుమిత్ర.
'అంటే!' రాజా సంధ్య ను అంత ప్రేమగా చూడడనా నీ ఉద్దేశం?' స్వరం రెట్టిస్తున్నట్లుంది. సంధ్య వంటగది లోకి వెళ్లి మంచి నీళ్ళు తాగి తన గదికి వచ్చేసింది.
'సంధ్యా! ఒకసారి ఇటు రామ్మా!' సారధి పిలుపుకి సంధ్య ఉలిక్కిపడింది. బావగారి పిలుపులోని అంతరార్ధం లీలగా ఊహిస్తూ , గుండె నిబ్బరం చేసుకుంటూ వెళ్ళింది. సారధి తీరిగ్గా పడకుర్చీ లో పడుకోనున్నాడు. ప్రక్కనే కుర్చీ లో సుమిత్ర. 'కూర్చో సంధ్యా' అన్నాడు సారధి.
సంధ్య కుర్చీ ని సుమిత్ర కుర్చీ ప్రక్కకు జరిపి కూర్చుంది. ఎదురుగా ఉంటె ముఖంలో మెదిలే భావాల్ని సారధి యిట్టే కనిపెట్టేస్తాడని సంధ్య బాధ. సంధ్య భయాన్ని గ్రహించి , నవ్వుకున్నాడు సారధి.
'సుమీ! కొంచెం మంచినీళ్ళి చ్చి, ఆ వక్క పొడి డబ్బా, సిగరెట్ పాకెట్ అందుకో!' సెలవు రోజులు వచ్చాయంటే పై మూడు , సారధి పక్కన ఉండాల్సిందే! వో ప్రక్క వక్క పొడి తింటూ , సిగరెట్ పొగలు వదులుతూ , మరీ దాహం అన్పించి నపుడు మంచి నీళ్ళు తాగుతూ , అలా ఏ పేపరో, నవలో చదవడం లో ఎంత మజా మరి!
'స్వర్గానికి వెళ్ళినా, సవతి పోరు తప్పదని, యిప్పుడు కూడా వీటి గొడవేనా!' సుమిత్ర విసుక్కుంటూనే లేచింది.
'ఇలాంటప్పుడే వీటి అవసరం ఎక్కువ సుమిత్రా దేవి!' సారధి కవ్వించాడు.
ఈ వాలకం అంతా చూస్తున్న సంధ్య 'బావగారు ఏదో పెద్ద ఉపన్యాసమే యివ్వబోతున్నారే!' మనసులోనే అనుకుంది. నిజానికి , సారధి కి ఉపన్యాస లివ్వడం కన్నా, ప్రియమైన విషయం యింకోటి లేదు. అందులో , తనకన్నా చిన్న వాళ్ళని , ఎదురుగా కూర్చో బెట్టుకొని, వాళ్ళు సమస్యలనుకునే వాటి మీద, వాళ్ళ అభిప్రాయాల్ని, బలవంతంగా నైనా సరే వాగించి, తను వాటిని ఎనలైజ్ చేసి, తన అమూల్యాభి ప్రాయాల్ని యివ్వడ మంటే, సారధి కి చాలా సరదా! పాపం! తరచూ , సంధ్య , సారధి కి టార్గెట్ అవడంతో , అప్పటికి , బోలెడు అనుభవం వచ్చేసింది సంధ్యకి. కాని ప్రతిసారి వాదన లో వోడి పోయి , "మీరసలు రచయితగానో, రాజకీయ నాయకుడు గానో రాణించాల్సింది ' అని ఉక్రోషంగా అనేది. 'అది నిజమే కాని, మనకంత తీరిక, వోపిక లేవు' అనేవాడు సారధి సీరియస్ గా.
ఇప్పుడివ్వ బోయే ఉపన్యాసం తాలూకు ఛాయలు ఎలాంటివో ఊహిస్తూ కూర్చుంది సంధ్య. మంచినీళ్ళు త్రాగి, వక్క పొడి వేసుకొని, సిగరెట్ పొగ వదులుతూ , తన్మయంగా ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు సారధి. 'ఖర్మ! మీ తన్మయత్వం నుంచి బయట పడదలచుకోలేదా ఏమిటీ' సిగరెట్ మీద తన మంట నంతా కంఠం లో చూపించింది సుమిత్ర. సారధి కళ్ళు తెరిచి, సంధ్య కేసి వోసారి పరిశీలనగా చూశాడు. తర్వాత సరిగ్గా లేచి కూర్చుంటూ , 'సుమీ! ఇహ నువ్వు చెప్పదలచు కున్న దేమిటో చెప్పు. అన్నాడు. సుమిత్ర సందేహిస్తున్నట్లు ఒక్క క్షణం సంధ్య వేపు చూసింది. తర్వాత ఏదో నిశ్చయించు కొన్న దానిలా అంది. 'నేను చెప్పేది ఆవేషపడకుండా , అపార్ధం చేసుకోకుండా సరిగ్గా వినండి. రాజా మీద నాకెంత అభిమానం, ఆత్మీయత ఉన్నాయో మీకు నేను చెప్పక్కర్లేదు . నాకు తమ్ముడంటూ ఉన్నా, ఇంతకన్నా ఎక్కువగా చూసి వుండే దాన్ని కాదు. రాజా మంచితనం, సంస్కారం పట్ల నాకు సందేహం లేదు. కాని సంధ్య విషయం కాబట్టి, కొంచెం కష్టంగా తోచినా, రాజాని గురించి ఒక విషయంలో మాత్రం నా అభిప్రాయం చెప్పదలుచు కున్నాను. ఇతరత్రా రాజా చాలా మంచివాడే! కాని అందమైన ఆడపిల్లల విషయంలో అతడి బలహీనతను నేను సమర్ధించ లేను. ముఖ్యంగా మంజుల విషయంలో.....రూమర్స్ చాలా వున్నా నేను నమ్మలేదు కాని, స్యయంగా చూశాక......' అంతకన్నా ఎక్కువ చెప్పడం ఇష్టం లేనట్లు ఆగిపోయింది సుమిత్ర. సుమిత్ర వెల్లడించిన అభిప్రాయం నిజంగా సారధి మనసు ని బాగా నొప్పించింది. కాని, తమాయించు కొని సంధ్య వైపు చూశాడు. సుమిత్ర పెదవులు వెల్లడించిన అభిప్రాయమే, సంధ్య కళ్ళల్లో స్పష్టంగా మేడుల్తున్నది. వాస్తవిక పరిస్థితిని విపులీకరించడం లోని ఆవశ్యకత వెంటనే బోధపడింది సారధి కి. సిగరెట్ ని యాష్ ట్రేలో పడేస్తూ తాపీగా అన్నాడు.
'ఎలాగైనా మీ ఆడవాళ్ళ కు కొంచం బుర్ర తక్కువ సుమా!' సుమిత్ర కళ్ళల్లో కోపం తొంగి చూసింది.
'నిజాన్ని ఎవరైనా ఎలా తెలుసుకోగలరంటావు సుమీ?' ప్రశ్న తమాషాగా ఉన్నా కంఠం చాలా సీరియస్ గా ధ్వనించింది. సంధ్య ఆధారాల మీదకి తొంగి చూడబోయిన నవ్వు, సారధి ముఖంలోని గంభీరానికి జంకి పెదాల వెనకే దాక్కుంది. సుమిత్ర వింతగా చూసింది. మళ్లీ తనే అన్నాడు సారధి.
'ఏదన్నా సంఘటన జరుగుతుండను కో దాన్ని మనుషులు రకరకాల వ్యాఖ్యానాలు చేసి, ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్ళు వేలిబుచ్చుతారు. సంఘటన మంచిదా-- చేడుదా? ఎలాంటిది? అని ఆలోచించే దాని కన్నా, ఆ సంఘటనను సృష్టించిన వ్యక్తుల మనస్తత్వం సాధారణ పరిస్థితుల్లో ఎలాంటిది -- ఆ ప్రత్యెక సంఘటన లో, వాళ్ళు తమ స్వభావానుగుణ్యం గానే నడచు కున్నారా లేక. ఏదైనా ప్రభావానికి కాని, ఒత్తిడి కి కాని లోనై , తమ తత్వానికి విరుద్దంగా నడచు కొన్నారా-- అనేది గమనించడం చాలా ముఖ్యం. ఏ విషయం మంచి, చేడులన్నా మనం చూసే కోణాన్ని బట్టి ఆధారపడి వుంటాయి. మన దృక్పధాన్ని అనుసరించి మన అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి.
'మీరు దేన్నీ గురించి చెప్తున్నారో నా కర్ధం కావడం లేదు.' అసహనంగా , సారధి మాటల కడ్దోస్తూ అంది సుమిత్ర.
'నేననే దేమిటంటే , మన కోణం లోనే చూసి, అదే నూటికి నూరు పాళ్ళు నిజం అని గుడ్డిగా తేల్చి పారేయకుండా, ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని కనుగుణ్యమైన యాంగిల్ లో పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ఎందుకు చూడాకూడదూ అని? ఒకడు తాగాడను కో, అది నిజంగా జరిగింది. మన నైతిక విలువల ప్రకారం చాలా తప్పు. నీలాంటి వాళ్ళు, సంధ్య బోటి వాళ్లు 'తాగుడ్ని' చాలా చెడ్డ గుణంగా, నైతిక పతనంగా అసభ్యంగా భావిస్తారు కాబట్టి, అలాంటి దానికి లొంగి పోయిన వాడి మీద కూడా, తదను గుణ్యం గానే, మీ అభిప్రాయాన్ని మలచు కుంటారు. కాని నా విషయమే తీసుకో, 'వాడు తాగాడంట' అని చెప్తే 'ఆహా' అనుకుంటాను, నాకు సంబంధించని వాళ్ళయితే. అదే నాకు తెలిసిన వాళ్ళయితే, 'ఎందుకు తాగి వుంటాడు? ఫ్రెండ్స్ ప్రోత్సాహం వల్ల నా, మానసికంగా బాధల్ని మర్చి పోవడానికా, పరిస్థితుల ప్రభావమా? అని ఆలోచిస్తాను కాని, దాన్నొక తప్పు క్రింద ఎప్పుడూ పరిగణించను. అలవాటు క్రింద మారితే క్షంతవ్యం కాదు కాని, ఒకటి రెండు సార్లు అలాంటివి చేసిన తర్వాత తప్పు తెలుసుకుంటే సంతోషిస్తాను. అనుభవం పొంది పాఠం నేర్పిందనుకుంటాను. నన్నడిగితే ప్రతి విషయం లో అలాంటి అనుభవాలు జరిగితే మంచిదంటాను. అప్పుడే మనిషికి 'తనే లాంటి వాడు, తన స్టాండర్డ్ ఎలాంటిది?' అనేది తెలిసి వచ్చి, పనికి మాలిన అహంకారం తగ్గి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, భవిష్యత్తు లో జాగ్రత్తగా మసలు కుంటాడు.
రాజా విషయమే తీసుకో. వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదు సంధ్యా! వాడు నా తమ్ముడు అనుకుంటేనే, నా శరీరంలో భాత్రుప్రేమతో సారధి వదనం ఉజ్వల మైంది. 'రాజా సంస్కారం పట్ల , సహృదయం పట్ల నాకంతు లేని ఆత్మవిశ్వాసం ఉంది. ఈకాలంలో అలాంటి వాళ్ళు చాలా అరుదు. వాడికి నాకు ఆరు సంవత్సరాలు తేడా. కాని మానసిక సాన్నిహిత్యం మా యిద్దరి మధ్య చాలా వుంది. తనకి నేను అన్నయ్య గా గైడెన్స్ యివ్వడమే కాదు, స్నేహితుడిగా వాడి సమస్యల్ని అర్ధం చేసుకున్నాను. అవసరమను కున్నప్పుడు సలహా లిచ్చాను. నేనూ స్టూడెంట్ లైఫ్ లో ఆడపిల్లల్ని బాగా టీజు చేసేవాణ్ణి, కాని రాజాని నువ్వు సరిగా అర్ధం చేసుకోలేదు సుమీ! ఒకప్పుడు వాడు పరాయి ఆడపిల్లల్ని కళ్ళెత్తి కూడా చూసేవాడు కాదు, స్త్రీలంటే పూజ్య భావం, పెళ్ళయిన ఆడవాళ్ళంటే అమ్మతో సమానమనే పవిత్ర హృదయం తనది. మన సంప్రదాయాలన్నా, సంస్కృతన్న ప్రాణం. బి.ఎ. చదువుతుండగా వాడికి పద్దెనిమిదేళ్ళు. ఆకతాయి తనంగా, చిలిపిగా నిర్విచారంగా తిరిగే వయసు. ఆ వయసులో నిగ్రహించుకునే శక్తి కొద్ది మందికే ఉంటుంది. సహజంగానే వాడిలో ఫ్రెండ్స్ మూలాన కొంచెం మార్పు వచ్చింది. అందాన్ని రాజా అభిమానిస్తాడు. నిజమే! కాని నువ్వు దానిని అందమైన ఆడపిల్లల పట్ల బలహీనత క్రింద పోరపడ్డావు. ఒక్క మంజులతో తప్పిస్తే, రాజా ఏ ఆడపిల్లలతో క్లోజుగా తిరగడం నీకు తెలుసు సుమీ! సహజంగానే తను నవ్వుతూ యితర్ల ని నవ్విస్తాడు. వాడిలోని ఈ స్నిగ్ధ స్వభావానికి ఆకర్షించ బడి వాడి చుట్టూ ఆడపిల్లలు తిరిగితే అది వాడి తప్పు కాదె! మంజుల కావాలని కోరి పరిచయం చేసుకొని, అలాంటి వాణ్ణి కవ్వించి, కొంచెం రొమాంటిక్ సెన్స్ ని రైజు చేసింది. సహజంగానే మిగతా వాళ్ళకి ఈర్ష్య కలిగి రూమర్స్, లేవదీశారు. తను చెయ్యబోయే దాని పరిణామాలేలా వుంటాయి. తానున్న స్థితి ఎలాంటిది, తన ప్రస్తుత బాధ్యత ఏమిటి, అనే విషయాలు గ్రహించకుండా , అమాయకంగా నొ, అజ్ఞానం లోనో, మంజులతో పరిచయాన్ని అంగీకరించి, రెస్పాన్స్ యివ్వడమే రాజా చేసిన మొదటి తప్పు, చివరి తప్పు. ఆ వయసు అలాంటిది. ఏది మంచి, ఏది చెడు అనేది అనుభవంమీద కాని తెలిసి రాదు. ఇందాక నేను చెప్పిన సంఘటన లాంటిదే అనుకో. రాజా-- మంజుల ల పరిచయం. మామూలుగా రాజా మంచివాడే. మంజుల సంగతి మనకు తెలీదు. కాని యిద్దరూ వయసు ప్రభావానికి లొంగి పోయారు. ఆకతాయితనంగా కలిసి అప్పుడప్పుడూ తిరిగినందు కూ, అందరూ, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వ్యాఖ్యానించు కున్నారు. మంజుల తప్పు ఏం లేదు కాని, కాలేజీ లో వీళ్ళ గురించి గొడవ రేగగానే తప్పంతా వీడి మీదకు త్రోసి , తనను మోసం చేశాడని నిందించిందంట. పాపం! ఆడపిల్ల తెలియక చేసిన పొరపాటు కి నింద మీద పడకుండా తప్పించుకోవడానికి అలా చేసిందనుకోవచ్చు. అదలా వదిలేయండి. అసలు సంగతి, రాజా ఎంత మంచి వాడైనా, ఒక్క మంజుల పరిచయం తో, మీ దృష్టి లో అనుమానాస్పద డయ్యాడు. అప్పటి కన్నా యిపుడు, వయసూ, మనసు రెండూ పరిపక్వం చెందాయి. అపుడు తగిలిన ఎదురు దెబ్బతో కొంచెం గట్టిపడి, జీవితం పట్ల స్థిరమైన అభిప్రాయాల్ని ఏర్పరచు కో గల్గాడు. ' ఊపిరి పీల్చుకున్నాడు సారధి. ఒక్క క్షణం ఆగి, 'నేను చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే రాజా క్షంతవ్యుడు కాదంటావా సంధ్యా?' నవ్వుతూనే అడిగాడు. సుమిత్ర దిగ్భ్రమ తో సారధి కేసి చూస్తుండి పోయింది. 'బ్రహ్మిని తిమ్మిని చ, తిమ్మిని బ్రహ్మిని చెయ్యగల సమర్ధులు.' అని మనసులో మాత్రం అనుకోకుందా ఉండలేక పోయింది.
