సాయంత్రం చల్లగాలి వీస్తున్నది. రాజా, ఎంతసేపు వెదికినా , ముందు రోజు సగం చదువుతూ బల్ల మీద పెట్టిన 'జెన్ ఐరే' నవల కన్పించలేదు. ఏమయింది? మేడ మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న అన్నా, వదినల ని , పుస్తకం కోసం డిస్టర్బ్ చేయడానికి మనస్కరించ లేదు. పోనీ, తనే వోపిగ్గా వెతుక్కుందాం అనుకోని, యిల్లంతా వెతికాడు. ఎక్కడా కన్పడ లేదు. బహుశా సంధ్య తీసి వుంటుంది. అడుగుదామని సంధ్య గది వరకూ వెళ్ళిన రాజా ఆగిపోయాడు. 'సంధ్య యిందాకే రాణీ వాళ్ళింటి కెళ్ళిందని గుర్తొచ్చింది.' ఏం చెయ్యాలో తోచలేదు. గుమ్మం దగ్గర నిల్చొని చూశాడు. టేబుల్ మీద పుస్తకం కన్పడటం తో ప్రాణం లేచి వచ్చింది. లోపలికి వెళ్లి పుస్తకం తీసుకుంటున్న రాజా దృష్టి ని , ప్రక్కనే ఉన్న రెండు పెయింటింగ్స్ ఆకర్షించాయి. అడుగున సంధ్య సంతకం ఉంది. సంధ్య యింత మంచి అర్టిస్ట ని తనకు తెలియదే! ఆశ్చర్యంగా రెండింటి నీ చేతిలోకి తీసుకొని చూశాడు. మొదటి చిత్రం పేరు 'విష వలయం.' ఒక స్త్రీ మూర్తి ఆకృతి కన్పిస్తోంది. చుట్టూ వలయాలు, ఒకదాని చుట్టూ మరొకటి, చాలా వలయాలు గీసి ఉన్నాయి. ఆ స్త్రీ ముఖంలో , బాధ, ఆ వలయాల్ని చేదించు కోవాలనే ప్రయత్నంలో ఆరాటం , స్పష్టంగా కన్పిస్తున్నాయి. వలయాని కాపల ఒక పురుషుడి ఆకృతి గీసి ఉంది. అతడి మొహం లో భావం స్పష్టంగా తెలియడల్లేదు. చాలా గమ్మత్తుగా ఉందే! దీని భావం ఏమయి వుంటుంది? రెండో పెయింటింగ్ వైపు చూశాడు. 'ఆకర్షణ జ్వాలలు.' 'అరె! బాప్! ఏం పేర్లు!' నవ్వుకుంటూ పరిశీలనగా చూశాడు. ఎర్రటి మంటలు, ఒక యువతిని చుడుతున్నాయి. ఆ యువతి భయంగా చేతులు చాపి, అక్రోశిస్తున్నట్లు, ఆ జ్వాలల నుండి తప్పించుకొని పాతిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లూ కన్పిస్తోంది. 'కలర్ కాంబినేషన్ ని, సజీవంగా ఉన్నట్లున్న ఆ బొమ్మల్ని' మనసులోనే ప్రశంసిస్తున్న రాజా ఉలిక్కి పడ్డాడు. జ్వాలల్లో, ఎవరి ముఖమో చిత్రించి ఉంది. క్రూరంగా నవ్వుతున్నట్లుంది. ప్రక్కనే అతి చిన్న అక్షరాలతో 'రాజా' అని, యువతి బొమ్మ క్రింద సంధ్య అని వుంది. నివ్వెరపోతూ 'విషవలయం' తీసి చూశాడు. పేర్లు లేవు కాని, రెండిటి లోని బొమ్మల్లో పోలికలు ఒకటే! చేతిలోని పెయింటింగ్స్ , రాజాకీ తెలియకుండానే టేబుల్ మీదకి జారిపోయాయి. నివ్వెరపాటు తో అలాగే శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు. ఆ చిత్రాలు అతడి సందేహాన్ని మబ్బు తెరల్లా విడగోట్టాయి. ఇదా సంధ్య ప్రవర్తన కి అర్ధం! ఆ అమ్మాయి మనసులో తనలాంటి ముద్ర వేశాడా!? నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఎప్పుడు వచ్చిందో! సంధ్య కళ్ళని పెద్దవి చేసుకొని రాజా కేసి చూస్తూ నిలబడింది. ఆ కళ్ళల్లో భావం అస్పష్టంగా ఉంది. ఫాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని సంధ్య కళ్ళ కేసి సూటిగా చూశాడు. గోడ కానుకొని నిల్చున్న సంధ్య ధైర్యంగా రాజా చూపుల్నేదుర్కోంది.

'నువ్వింత మంచి పెయింటరు వని నాకు తెలీనే తెలీదు సుమా!' తుఫాను రాబోయే ముందు ఉండే ప్రశాంతతతో అన్నాడు.
"నా పర్మిషన్ లేకుండా నా పెయింటింగ్స్ ఎందుకు తీశారు?' తీవ్రంగా బెదిరిస్తున్నట్లడిగింది.
రాజా నిర్లక్ష్యంగా తలెగరేశాడు.
'నా పుస్తకం నిన్నెవరు తీసుకో మన్నారు?' ఒక్క క్షణం ఏం మాట్లాడలేక పోయింది. అవమానంతో కళ్ళ నీళ్ల పర్యంతం కాగా విసురుగా అనేసింది.
'మీ సభ్యతా , సంస్కారం ఎలాంటివో యిప్పుడు తెలిసింది.'
'ఏం? నా సభ్యత, సంస్కారం మీద నాకంతు లేని నమ్మకం' ఆత్మవిశ్వాసంతో గర్వంగా అన్నాడు. సంధ్య కి ఒళ్ళు మండి పోయింది.
'తెలుస్తూనే ఉంది. నా గదిలోకి నేను రానప్పుడు రావడం, సభ్యతన్పించుకొదు. పైగా మంజుల విషయంలో మీ సంస్కారం ఎంత బాగా రుజువయిందో నాకు తెలీదనుకోకండి!' ఉక్రోషంగా నోరు జారినా మరుక్షణమే తనన్న మాటలు తలచుకొని బేదిరి పోయింది. రాజా ఒక్క నిమిషం స్తబ్దంగా నిలబడిపోయాడు. క్రోధంతో రక్తమంతా ముఖంలోకి పొంగి ఎర్ర్రగా కంద గడ్డలా తయారయింది.
"సంధ్యా! ' గర్జిస్తూ ఒక్కడుగు ముందుకు వేశాడు. 'నిజం తెలుసుకోకుండా ఇతర్ల వ్యక్తిగత విషయాల్ని , వాళ్ళేదురు గానే ఎత్తి చూసే హక్కు నీకు లేదు ఈ మాటలన్నది నువ్వు కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకళ్ళ యి ఉంటేనా......' మాట పూర్తీ చేయకుండానే రివ్వుమంటూ బయటికి దూసుకు పోయాడు . సంధ్య మునిపంటితో పెదవి రక్తం చిందుతుందేమో అన్నంత గట్టిగా నొక్కిపట్టి అలాగే నిలబడి పోయింది.
మేడమేట్లు దిగుతున్న సుమిత్ర, సారధి, రాజా విసురుగా బయటికి వెళ్ళడం చూసి, విస్తుపోయారు. 'చెప్పా పెట్టకుండా రాజా అంత విసురుగా ఎక్కడికి వెళ్తున్నట్లు?!' సంధ్య గది తలుపులు బిగించి ఉన్నాయి. లోపల్నుండి బలవంతంగా ఏడుపు అపుకుంటున్న ధ్వని స్పష్టంగా విన్పిస్తుంది.
"ఏం జరిగింది? రాజా, సంధ్య ఏమన్నా ఘర్షణ పడ్డారా?' ఇద్దరి మనస్సులో, ఒకే సారి అదే అనుమానం మెదిలింది. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
'సంధ్యా!' సుమిత్ర రెండుసార్లు తట్టినా లోపల్నుంచి జవాబు రాలేదు కాని, ఏడుస్తున్న ధ్వని మాత్రం ఆగిపోయింది. సారధి, సుమిత్రను సైగ చేసి, అవతలికి పిలిచాడు.
సంధ్య డిందు లో తల దూర్చి, నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చసాగింది. దుఃఖపు వేగం తగ్గాక మనసులో కొంచెం బరువు తీరినట్లన్పించింది. అలాగే పడుకొని ఆలోచించ సాగింది. 'రాజా తన గదిలోకి వచ్చి పెయింటింగ్స్ చూస్తాడనే అనుకోలేదు. రాజా వచ్చిన క్రొత్తలో , అదుపు తప్పుతున్న మనసుని స్వాధీనం లో వుంచు కోవడానికి అతడి మీద తనకు ద్వేషం తప్పిస్తే మరొకటి లేదని, తన్ను తాను తృప్తి పరచు కోవడానికి , ఆ పెయింటింగ్స్ వేసింది. పైగా, బుద్ది లేకుండా పేర్లు కూడా వ్రాసింది. మొదట్లో , రాజా వాటిని చూడాలని, చిత్రాల్లోని భావం, తన కన్వయిస్తుందని , పేర్లు చదివి తెలుసుకున్నాక, అతడి ముఖం లో మారే రంగుల్ని చూడాలని, అంతర్గతంగా తను ఆశించిన మాట నిజమే. ఎన్నో సార్లు, వాటినీ బల్ల మీదే పదేసి ఉంచింది. పొరపాటు గా నైనా రాజా చూడక పో తాడా అనే ఆశతో ....కాని తర్వాత , రాజా పట్ల తన మనసు మారిన తర్వాత, ఆ పెయింటింగ్స్ , తనకే భయంకరంగా కన్పించాయి. అసలు యివాళ చించి పడేద్దామనే బయటికి తీసి పెట్టింది. ఏదో పన్లో పడి మర్చిపోయింది. వేటినైతే ఇహ రాజా చూడకూడదను కుందో అవే రాజా కంట పడ్డాయి. తనను గురించి అతనేమను కుంటాడు? అతని వ్యక్తిగత విషయాల్ని ఎత్తడానికి తనకే మదికార ముంది? మంజుల విషయం తనకు స్వయంగా ఏం తెలుసనీ అలా నోరు జారింది....? ఒకవేళ శాంతి కి మంజుల అబద్దం చెప్పి ఉంటె.....' ఈ అనుమానంతో సంధ్య కంపించింది. 'రాజా తనను క్షమించగలడా! భగవాన్! ఏది నిజం? నేనిప్పుడెం చేయాలి...' సంధ్య మనసు ఆక్రోశించింది.
రాజా పిచ్చిపట్టిన వాడిలా రోడ్లన్నీ తిరిగాడు. అవమానంతో, క్రోధంతో , మనసు ఉడికి పోతున్నది. 'ఎంత ధైర్యం! మంజుల విషయం తనకేం తెలుసనీ....? ఆ పెయింటింగ్స్ వెయ్యడం లో తన ఉద్దేశం ఏమై వుంటుంది? పైగా పేర్లు కూడా స్పష్టంగా రాసింది, చూసేవాళ్ళు ఎక్కడ గుర్తు పట్టలేరో, అని భయ పడే దానిలా......ఒకవేళ తను చూడాలని , కావాలనే అలా పెట్టిందా...' అదే నిజమై ఉంటుందనే అనుమానం దృడ పడింది. 'తను అలాంటి వాడా!' అభిమానం దెబ్బతిన్నట్లయి, విలవిల్లాడి పోయాడు.
'పది దాటింది. ఇంకా రాజా రాలేదే!' ఆందోళన పడుతూ, సారధి, సుమిత్ర ముందు గదిలోనే కూర్చున్నారు. నెమ్మదిగా, లోపలికి వచ్చాడు.
రాజా, ఎర్రబడ్డ కళ్ళు, దుమ్ము కొట్టుకున్న బట్టలు, చెదిరిపోయిన జుట్టు.....పిచ్చివాడిలా ఉన్న తమ్ముడి వాలకం చూసి దిగ్భ్రమ చెందాడు సారధి.
'రాజా! ఏవిటి బాబూ నీ ధోరణి! ఇన్నాళ్ళ కి , వదిన మనసు కష్టపెట్టాలనే కోరిక కల్గిందా నీకు!' కళ్ళనీళ్ళు నింపుకుంటూ గద్గద స్వరంతో అడుగుతున్న సుమిత్ర కేసి తలెత్తి చూడలేకపోయాడు. రాజా గొంతులో ఏదో అడ్డుపదినట్లన్పించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. తనకే అర్ధం కాకుండా ఏదో స్పష్టంగా గొణిగాడు.
'రాజా! ముందు తొందరగా ముఖం కడుక్కొని, బట్టలు మార్చుకో. వదిన, నీకోసం భోజనం చెయ్యకుండా ఎదురు చూస్తున్నది.' సారధి నెమ్మదిగా అన్నాడు.
లోపల సంధ్య ఊపిరి బిగపట్టి వింటున్నది. రాజా కంఠం విన్పించలేదు. రాజా ముఖం ఎలా వుండి వుంటుంది? ఊహించుకోవడానికి సంధ్యకి భయం వేసింది. భోజనాలన్నీ పూర్తయి అందరూ పడుకునే వరకూ వోపిగ్గా ఎదురు చూసింది. గడియారం పదకొండు గంటలు చూపిస్తోంది. చించి, ముక్కలుగా పడేసిన పెయింటిగ్స్ వంక వోసారి చూసి, నెమ్మదిగా తడబడే అడుగులతో రాజా గది వైపు కి వెళ్ళింది సంధ్య.
డైరీ వ్రాయడం పూర్తీ చేసి, ఇహ పడుకుందామని రాజా లేచి చూసేప్పటికి ఎదురుగా సంధ్య తలవంచుకొని నిల్చోనుంది. విస్మయంగా చూశాడు.
'సాయంత్రం నా ప్రవర్తనకి మనస్పూర్తిగా క్షమాపణలు కోరురున్నాను.' మృదువుగా అంది సంధ్య తలవంచుకునే. మొదట తను విన్నది నిజమేనా అనే అనుమానం వచ్చింది రాజాకి. ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. సంధ్య కొంచెం తలెత్తి చూసింది. విగ్రహం లా, భావరహితంగా వుంది రాజా వదనం.
'పెయింటింగ్స్ చించేసాను. మీరు అపార్ధం చేసుకోకండి' జాలిగా అంది.
అప్పటికి తేరుకొన్న రాజా ఏడిపిస్తున్నట్లన్నాడు.
'అదేం! ఏదన్నా ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పెడితే ప్రైజెస్ అన్నా వచ్చేవిగా!'
సంధ్య చటుక్కున తలెత్తింది. నీలి సరస్సుల్లా ఉన్న సంధ్య కళ్ళ నుంచి ముత్యాల్లాంటి బిందువులు జారుతున్నాయి. మరుక్షణం లో మెరుపులా అక్కడ్నుంచి మాయమయింది. రాజా విభ్రమంగా నిలబడి పోయాడు. 'సంధ్య ఏడుస్తోంది. తన క్షమాపణ కోసం వచ్చిన సంధ్య ను తన మాటలతో నొప్పించాడు.' అయోమయంగా మంచం మీద వాలాడు.
సంధ్య కి తన మీద బొత్తిగా అభిమానం లేకపోతె తనన్న మాటలకి ఎదురు జవాబిచ్చి వుండేది. తనే సంధ్య ని తప్పుగా అంచనా వేసుకున్నాడెమో! మరి ఆ పెయింటింగ్స్ .....అపార్ధం చేసుకో వద్దంది. అంతా అయోమయంగా వుంది. అసలు సంధ్య కి తనమీద యెలాంటి అభిప్రాయం వుందో సంధ్యనే వీలున్నప్పుడు అడిగేయ్యాలి. తను మాత్రం సంధ్య ని హృదయ పూర్వకంగా క్షమించే శాడు. మంజుల ఒక్క మాటన్నా, సహించలేని తను, సంధ్య వల్ల మానసికంగా అంత పెద్ద దెబ్బ తిని, తనను ఎలా క్షమించి అభిమానించగల్గు తున్నాడు? అప్పటి కన్నా యిపుడు వయసు పెరిగినందు వల్లా? అంత మాత్రాన స్వభావంతో మార్పు వస్తుందా? ఆలోచనలలో ఎప్పుడో అర్హరాత్రి దాటుతుండగా నిద్రపోయాడు.
* * * *
ఆఫీస్ టైమవుతున్నా, రాజా యింకా నిద్రన్నా లేవలేదే! సారధి ఆశ్చర్యంగా, వచ్చి చూశాడు. కదలకుండా మత్తుగా స్పృహ లేనట్లు పడుకొన్న రాజాని చూడగానే ఆదుర్దాగా వచ్చి నుదురు మీద చెయ్యి వేసి చూశాడు. వేడికి నెయ్యి చురుక్కు మన్నట్లయింది. మీద ఎండ పడకుండా కిటికీ తలుపులు మూసి సుమిత్ర దగ్గరకు వెళ్లాడు.
'సుమీ! రాజాకి జ్వరం వచ్చింది. లేపకు. మధ్యాహ్నం వరకు చూసి తగ్గకపోతే డాక్టరు కి ఫోను చెయ్యి.' ఆఫీసు టైం దాటి పోతుందని ఖంగారు గా చెప్పేసి వెళ్ళిపోయాడు సారధి. సుమిత్ర రాజాకి దుప్పటి సరిగ్గా కప్పి, సంధ్య దగ్గరకు వచ్చింది. సుమిత్రను చూస్తూనే అపరాధి లా తల వంచుకోంది సంధ్య. నిన్న రాత్రే , సంధ్య సుమిత్ర కి అసలు విషయం , జరిగిన గొడవ చెప్పేయడం, సుమిత్ర మందలించడం జరిగి పోయింది?
