సారధి దీర్ఘోపన్యాసం అతి శ్రద్దగా న్యాయనిర్ణేత తుది తీర్పుని విన్నట్లు విన్నది సంధ్య. అనుమానపు మేఘాలు దూది పింజల్లా తేలిపోగా, నిర్మలా కాశం లా హాయి గొల్పింది సంధ్య హృదయం.
చటుక్కున లేచి నిల్చొని సారధి వైపు సూటిగా చూసింది. 'మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను.' మాటలు పెదాలు దాటినంత వేగంగా నూ, సంధ్య ఆ గది దాటి వెళ్ళిపోయింది. సుమిత్ర కళ్ళప్ప చెప్పి కూర్చుండి పోయింది. సారధి ముఖంలో విజయ రేఖలు పరచు కొన్నాయి.
* * * *
సంధ్య కి ఆ రాత్రి ఆలోచనలతో నిద్ర పట్టలేదు. గోర్కీ వాక్యం గుర్తుకి వచ్చింది. 'నీ హృదయం ఎలా చెప్తే అలా నడుచుకో! ఎవరి మాటా వినకు. మనుషుల కేమీ తెలీదు. వాళ్ళేన్నడూ , నీకు నిజం చెప్పలేరు. వాళ్ళ నెన్నడూ లెక్క చేయకు.' తన హృదయం రాజా మంచి వాడనే చెప్పింది. కాని తను యీ మనుషుల మాటల్ని నిజమని నమ్మింది. తన భావనకి, తనకి నవ్వు వచ్చింది సంధ్యకి.
'బావగారు నిజంగా ఎంత అద్భుతంగా ఏ విషయాన్నైనా ఎనలైజు చేస్తారు! అంతకుముందు తన వూహల కందని , నిజాలు , ఆ ఎనాలిసిస్ లో కన్పిస్తాయి. అదే తనని చకితురాల్ని చేసేది. బావగారు, అన్ని యాంగిల్స్ లో చూడగలరు. అప్లయి చేయాల్సిన విధంగా, ఆయా వ్యక్తుల మనస్తత్వాలని బట్టి చెయ్యగలరు. రాజా తత్త్వం తెలుసు కాబట్టి, అక్క, తనూ, తీవ్రంగా తీసుకున్న దాన్ని ఎనలైజు చేసి, జస్టిఫయి చేసారు.' ఈ నూతన కోణం లో రాజాని గురించి ఆలోచిస్తుంటే సంధ్య గుండెల్లో ఆహ్లాదకరమైన అనుభూతులు పరిమళించాయి. అంతకుముందు తారాడిన నీలినీడలు తొలిగిపోయి, అవ్యక్తా నురాగంతో హృదయం స్పందించింది. 'రాజాని తను ప్రేమిస్తున్నది.' తలచుకుంటేనే ఆ అనుభూతి క్రొత్తగా మధురంగా తోచి, మనసు ఊహల ఊయల్లో ఊగింది.
'తను యిన్ని రోజులుగా, యిన్ని రకాలుగా అలోచించి, మధనపడి, అతడి ఆకర్షణ నుంచి విముక్తు రాలవాలని తీవ్రంగా పెనగు లాడి, చివరికి , ప్రశాంత మైన మనస్సుతో, అతడి గురించి అత్యంత ప్రియంగా తలచుకుంటుందే! మరి రాజాకి అసలు తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందొ?' ఈ అనుమానం రాగానే సంధ్య మనసు కృంగి పోయింది. 'అవును, అతడికి, తనతో సన్నిహితంగా మేలిగేందుకు, మంచి అభిప్రాయం ఏర్పరచు కునేందుకు ఎక్కడ అస్కారమిచ్చింది?' గుండెల్లో బాధ అలలుగా ఎగసి పడింది. 'తన మీద రాజాకి ఎలాంటి అభిప్రాయం ఉందొ ఎలా తెలుసుకోవడం? పోనీ తనే వెళ్లి డైరెక్టు గా 'మీరంటే నాకిష్టం ' అని చెప్తే? ఈ పిల్లకి మతి చలించింద నుకుంటాడెమో! పోనీ రాజా డైరీ చూస్తె, తన మీద ఎలాంటి అభిప్రాయం వుందో తెలుస్తుంది. డైరీ చూడటం, అసభ్యతన్పించుకొదూ! ఇలా ఎందుకు చూస్తారో అని తనే చాలాసార్లు విమర్శించింది. కాని తనేన్ను కొన్న జీవన మార్గం లో నడవటానికి, తగిన అర్హత , హక్కు ఉందొ లేదో తెలుసుకోవడానికి చేసే చిన్న ప్రయత్నమే యీ డైరీ చూడటం ' నచ్చ చెప్పుకోంది మనసు కి సంధ్య. గడియారం పన్నెండు గంటలు కొట్టింది. అందరూ మంచి నిద్రలో వున్నారు. నెమ్మదిగా తడబడే అడుగులతో లేచి, రాజా గది వైపు కి నడిచింది. ప్రశాంతంగా నిద్రపోతున్న రాజాని చూస్తుంటే, అతడి చెదరిన జుట్టు ను సరి చెయ్యాలని, ప్రేమగా , అతడి చెంపలు తాకాలని, అన్పించింది సంధ్యకి. బెడ్ లాంప్ వెల్గు లో ప్రక్కనే బ్లూ కవర్ డైరీ కన్పించింది వణికే చేతుల్తో అందుకొని తన గదిలోకి వచ్చేసింది.
మంచం మీద వాలి తన పేరు కోసం పేజీ లన్నీ ఆత్రంగా తిరగేసింది.
* * * *
వదిన దగ్గరకు వచ్చేసాను. హాయిగా, తృప్తిగా వుంది. వదిన చెప్పిన సంధ్య కూడా ఇక్కడే వుంది. తన కళ్ళల్లో చక్కటి మెరుపూ, కాంతి వున్నాయి. అందమైన అమ్మాయిల్ని చాలా మందిని చూసినా ఎలాంటి అనుభూతి కల్గలేదు. కాని సంధ్య ముఖం లో కన్పించే ముగ్ఘత్వం , సౌజన్యం ఆకర్షించాయి.
* * * *
సంధ్య ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా వుంది. స్నేహంగా ఉండబోతే దులపరించి నట్లు, నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది. తన ప్రవర్తన మనసు నెంత నొప్పిస్తున్నా, సంధ్య అంటే అభిమానం తగ్గలేదు. కాని, నా ప్రవర్తన లో ఏం లోపం ఉందని తనలా ఉంటున్నది?
* * * *
మనసు ఎంత వద్దనుకున్నా పదేపదే సంధ్య సాన్నిధ్యం కోరుతున్నది. ఇటువంటి చిత్రమైన మధురానుభూతి మంజులతో తిరిగినపుడు కూడా అన్పించలేదు, మంజుల అనవసరంగా, ఒక మాటన్నా సహించని నేను, సంధ్య అంత లేక్కలేనట్లు ప్రవర్తిస్తున్నా ఎందుకు కోపగించుకోలేక పోతున్నాను?......
* * * *
ఆ విశాల వినీల నయనాల్లో నారూపాన్ని చూసుకోవాలని, అతి సున్నితంగా ఉండే తనని, నా గుండెల్లో దాచేసుకోవాలని ఏవో పిచ్చి కోర్కెలు ఇలా అన్పిస్తుంది సంధ్యా అంటే ఏమంటుంది? లాగి చెంప దెబ్బ కొడుతుందేమో!
* * * *
రామకృష్ణ యింటికి వచ్చాడు. చాలా మర్యాద చేసింది సంధ్య. ఆశ్చర్యంగా ఉంది. పొరపాటున మంజుల సంగతి ఎత్తి ఆపేశాడు. చటుక్కున సంధ్య నాకేసి చూసింది. అంటే సంధ్య కి మంజుల సంగతి తెలుసా?....ఏం తెలుసు? నా గురించి ఏమనుకుంటోంది?
* * * *
సంధ్య కి ఎంత ధైర్యం? మంజుల గురించి తనకు సరిగ్గా తెలియకుండా నే అలా అనేసిందంటే బాధగా ఉంది. ఆ పెయింటింగ్స్ లో ఎంత భయంకరమైన భావం!
డైరీ వ్రాసి మూసేస్తుంటే సంధ్య వచ్చింది. క్షమాపణ లు కోరింది. నేను మాట్లాడక పొతే కళ్ళనీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయింది. సంధ్య క్షమించమని అడగగానే, క్రోధంతో, మండిపోతున్న మనసు మీద పన్నీరు జల్లు, కురిసినట్లు చల్లని పిల్ల తెమ్మెర స్పర్శించిన అనుభూతి కల్గింది. సంధ్య కి నేనంటే అభిమానం అని సంధ్య కళ్ళల్లో తిరిగిన నీళ్ళే సాక్ధ్యం.
* * * *
జ్వరం వచ్చిన తర్వాత సంధ్య తరహా మారింది. మెత్తగా మృదువుగా అడిగి కావాల్సిన వన్ని శ్రద్దగా అందిస్తున్నది. సంధ్యా స్మరణమాత్రాన హృదయం ఎలా గింతులు వేస్తుందో, మనసులో పరిమళం, మల్లెల సౌరభం లా, ఎలా వ్యాపిస్తుందో, సంధ్య కేనాటి కైనా అర్ధమవుతుందా?
* * * *
ఈరోజు జ్వరం పూర్తిగా తగ్గింది. కాని చాలా నీరసంగా ఉంది. పడుకునుంటే అన్నయ్య వచ్చి సంధ్య ని చేసుకోవడం యిష్టమేనా అని అడిగాడు. ఆశ్చర్యం, ఆనందం, విభ్రమం అన్నీ కలిగాయి. అలభ్యము, అపురూపమను కొన్న పెన్నిధి, అయాచితంగా దొరికితే ఎలాంటి అనుభూతి కల్గుతుంది! సంధ్య ని నా జీవిత సహచరిణి గా ఊహించు కుంటేనే మనసుకి చల్లగా , జీవితంలో యింకేం అక్కర లేనట్లు అన్పిస్తూన్నది. సంధ్య ఒప్పుకుంటుందా? అన్నయ్య అడుగుతానన్నాడు రేపు తనని. ఏమని జవాబు చెప్తుందో? సంధ్య కాదంటే తను తట్టుకోగలడా! ముందు మంజుల విషయం లో తన అనుమానం తీర్చాలి.
* * * *
సంధ్య డైరీ పెట్టేసి వచ్చి పడుకుంది. విభ్రమం, సంతోషం, సందేహం తీరిన తృప్తి కలగా పులగమై , చివరకు మనసు ప్రశాంత మైంది. కనులు మూసుకొని కలల లోకంలోకి జారిపోయింది.
* * * *
'సంధ్యా! నువ్వు మనస్పూర్తిగా నే ఒప్పుకున్నావా? లేక బావగారి మాట కాదన్లేక ఒప్పు కుంటున్నావా?' సుమిత్ర అపనమ్మకంగా అడిగింది. సంధ్య తలెత్తి చూసింది. సంధ్య కళ్ళు అపూర్వ కాంతితో మెరిసాయి. 'రాజా అంటే నాకు చాలా యిష్టం అక్కా!' చిన్న పిల్లలా చెప్పేసి పరిగెత్తింది. మొదట చాకితురాలైన సుమిత్ర, తర్వాత నిండుగా నవ్వి సారధి వైపు చూసింది. సారధి పెదాల మీద చిరునవ్వు లీలగా కదిలింది.
తనగదిలో కిటికీ దగ్గిర నిల్చొని తదేకంగా పూల వంక చూస్తున్న సంధ్య అడుగుల చప్పుడి కి వెనక్కి తిరిగింది. రాజా! అతడి కళ్ళల్లో, ఆశ్చర్యం, అంతకు మించిన అపూర్వమైన ఆనందంతో మనోహరమైన భావం మెరుస్తున్నది.
'అన్నయ్య చెప్పింది నిజమేనా సంధ్యా!' సంధ్య చేతుల్నీ, తన చేతుల్లో కి ధైర్యంగా తీసుకుంటూ, అడిగాడు రాజా! సంధ్య తల వూపి , అతడి కళ్ళల్లో కి , తన్మయంగా చూస్తూ మెత్తగా నవ్వింది.
సంధ్య సుందర వదనాన్ని తన రెండు హస్తాల్లో బంధించి, ఆ విశాల వినీల నయనాల్లో తన రూపుని తృప్తిగా చూసుకున్నాడు రాజా!
(అయిపొయింది)
