రాజశేఖరం లేచి పచార్లు చేస్తూ "రాధమ్మ సుభద్రమ్మ పిన్ని కూతురు. పిల్ల చాలా తెలివైనది చురుకైనది కూడా. అలా స్టేషను వైపుగా షికారుకు వెళ్దాం పద అన్నాడు.
ఇద్దరూ కలిసి స్టేషను ప్లాటు ఫారం మీద కూర్చున్నారు. అప్పుడు వచ్చే బండీ లేదు కాబోలు ఫ్లాటు ఫారం నిర్మానుష్యంగా ఉంది. గాలి ఆడటం లేదు చెట్ల కొమ్మలు నిశ్చలంగా ఉన్నాయి.
"వాళ్ళు కూర్చున్న సిమెంటు బెంచి చల్లగా జివ్వుమంటోంది.
"వాళ్ళు వచ్చి వారం దాటింది. ఇందుకోసరమే ఉన్నారు. మీ వదిన ఎక్కువ పట్టుదలతో ఉంది. వాళ్ళు అయిన వాళ్ళు ఈ సంబంధం అయితే అన్ని విధాలా మనకి యోగ్యంగా ఉంటుంది. అని వాళ్ళు అనుకుంటున్నారు. నీ అభిప్రాయం చెబుతే.....' అంటూ చల్లగా మనసులో ఉన్నది వదిలాడు రాజశేఖరం.
దీపం వెలుతురు వాళ్ళు కూర్చొన్న చోటు తప్ప చుట్టూ పడుతుంది కొమ్మ నీడలో కూర్చున్న అన్నదమ్ములు వీధిలో నడిచే వాళ్ళకి కనపడటం లేదు.
'ఆయనగారు బాగా సంపాదిస్తున్నాడా?"
"ఏదో రెక్కాడితే దోక్కాడే సంసారాలు. ఏం సంపాయిస్తారు? నేనేం సంపాదిస్తాను" అతనూ అంతే....
"మరి కట్నం ఏపాటి ఇస్తారు?"
"రెండువేలన్నా ఇవ్వక పోరు"
"మరి మన సంగతంతా తెలుసుగా. పిల్ల మనం చెప్పినట్లల్లా విన్నా ఎప్పుడైనా కోపం వచ్చి రెండు దెబ్బలు వేసినా పడి వుండాలి. ఏవీ అనకూడదు. నా గురించి ఎలాంటి గొడవ చెయ్యకూడదు. నా యిష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను. అందులో అభ్యంతరం పెట్టగూడదు. తన మాటే చెల్లుబడి కావాలని పంతాలాడకూడదు.
రాజశేఖరం తల పక్కకు తిప్పుకోని నవ్వు ఆపుకున్నాడు. "అది చాలా మంచి పిల్లని చెప్పానుగా. గుట్టుగా సంసారం చేసుకునేదే గాని రట్టు చేసుకునే పిల్ల కాదు. చాలా తెలివైంది కూడాను. నీ సంసారం బాగు చేస్తుంది. స్కూలు ఫైనలు వరకు చదువుకుంది కూడాను. చదవనూ రాయనూ వచ్చు" అన్నాడు.
చలపతికి పౌరుషం వచ్చింది. "అ చదువు మనకెందుకు లెద్దూ. చదువుకున్న వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు? నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా?' అన్నాడు.
"ఇంతకీ నీ సంపాదన ఎంతుంటుంది?"
"నాకేం? నెలకి ఆరు వందల కూడా రాబడి ఉంటుంది."
"అది నీకు చాలుతుందా?"
అదే చాలుతుంది చాలకేం. చేస్తుంది?"
"పోనీ ఏదైనా ఉద్యోగం చెయ్యరాదు......"
"ఉద్యోగం నాకు సరి పడదు. అయినా ఉద్యోగం చేస్తే ఏమి వస్తుంది? నా రాబడి లో సగం రాదు.
"చిన్నప్పుడు ఎప్పుడో నీ మానాన నిన్ను వదిలేశాను. ఇన్నాళ్ళ కి నీ బాధ్యత గురించి చెప్పాల్సి వచ్చిందంటే నాకు ముఖం చెల్లటం లేదు. అయినా ఇందులో నా స్వార్ధం ఏం లేదు. నాకా మొగ సంతానం కలిగే ఆస్కారం లేదు గదా ఉన్న వాళ్ళిద్దరూ ఆడపిల్లలే. నువ్వయినా పెళ్ళి చేసుకుంటే పిల్లలు కలిగితే వంశం నిలుస్తుంది. అంతా ఆ మాటే అంటున్నారు. నేను ఆపరేషన్ చేయించక పొతే దానికి ప్రాణం మీదికి వచ్చెట్టుగా ఉంది. అందువల్ల సంతాన నిరోధం తప్పలేదు. నువ్వు ఇలా పెళ్ళీ పెటాకులూ లేకుండా ఉంటె ఎవరైనా ఏమైనా అనుకుంటారు? అందుకని నా మాట విని ఈ సంబంధానికి అంగీకరించు" అన్నాడు రాజశేఖరం.
ఊరంతా పూర్తిగా మాటు మణిగింది ఒకరో ఇద్దరో వీధిలో తిరుగుతున్నారు. ప్లాటు ఫారం మీదకు ప్రయాణికులు నెమ్మదిగా చేరుకుంటున్నారు.
"సరే, అలాగే." అన్నాడు చలపతి.
* * * *
సుభద్రమ్మ ఎంత బ్రతిమాలాడినా వినిపించుకోకుండా చలపతి మర్నాడు ప్రయాణం అయినాడు. రాజశేఖరం స్టేషను వరకూ వెళ్ళి దిగవిడిచి వచ్చాడు. ఆఖరికి బండి కదిలే ముందు కూడా అతని దగ్గర మాట తీసుకున్నాడు.
5
బండి దిగిన చలపతికి అడుగులోనే రాఘవులు హాజరయ్యాడు. "టంచనుగా అనుకున్న వేళకే దిగారే" అంటూ చేతిలోని సంచి అందుకున్నాడు రాఘవులు.
"మనదంతా గడియారం జీవితంరా రాఘవులు" అన్నాడు చలపతి.
"వెళ్ళిన పని పండా కాయా?"
"మనం వెళ్ళిన పని కాకుండా ఉండదు."
"అయితే పని అయినట్టే."
చలపతి లిల్లమ్మ ఏమైనా అందా రాఘవులూ" అన్నాడు రహస్యంగా.
రాఘవులు కాస్త తటపటాయించి "చలపతయ్య గారు లిల్లమ్మ లాంటి మనిషిని నేనెక్కడా చూడలేదంటే నమ్మండి. అంత ఖచ్చితమైన మనిషి. ఎక్కడ పుడితేనేం నమ్మదగిన మనిషి. మంచి పెద్ద కుటుంబంలో పుట్టాల్సిన మనిషండి" అన్నాడు.
"ఏం అంతగా పోగుడుతున్నావు. నీకేమైనా లంచం ఇచ్చిందా?"
"భలేవారండీ. మీరంటే మరీ ప్రాణం ఆమెకు అలా బయటపడే మనిషి కాదండీ ఒకరు బాగుపడుతున్నారన్నా , సుఖ పడుతున్నార'న్నా చూసి ఓర్వలేని మనిషి కాదండి. మీకు పెళ్లవుతుందని మీ ఆవిడ వస్తారని తెగ సంబర పడుతుందండి."
"అదంతా నాటకంరా రాఘవులు. లిల్లమ్మ మంచిదే అనుకో నన్నుత్తి గాలి మనిషి కింద జమకట్టి నోటి కొచ్చినట్టల్లా వాగిందిరా."
రాఘవులు నమ్మకం లేని స్వరంతో "అంత తేలిగ్గా అనే రకం కాదె...."
"నోటికొచ్చినట్టల్లా అంది నేను పెళ్ళి చేసుకుందుకు పనికి రానట. సంసారం చేయటం చేత కాదుట. నన్ను పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి నానా కష్టాలు పడుతుందిట. నా సంపాదన నా చెడు తిరుగుళ్ళ కి చాలదుట. నేను పూర్తిగా చెడి పోతానుట ఇలా నోటి కొచ్చినట్టల్లా వాగేసింది. ఎంత ఎగతాళి గా మాట్లాడిందనుకున్నావు. ప్రాణం చచ్చిపోయిందనుకో."
రాఘవులు 'అంతమాట మిమ్మల్ని అందా? మీరు చెడిపోయారు అంటే నేను ఒప్పను. చలపతయ్య ఆ నోటి దురుసు మాటే అన్నాడు.
"అసలు దానికి ఏడుపులే అన్నాడు చలపతి .
రాఘవులికి ఈ మాట రుచించలేదు. అయినా మాట మారుస్తూ మరి మీరు భోగ వసంతరాయల గారని వారికి తెలుసునా" అన్నాడు నోటికి చేతులు అడ్డం పెట్టుకుని.
చలపతి రాఘవులు వీపు మీద గట్టిగా నాలుగు చరుపులు చరిచాడు.
"ప్రస్తుతం బస ఎక్కడ? సినిమా హాల్లోనా, లిల్లమ్మ ఇంట్లోనా?' అన్నాడు.
"సినిమా హలుకే పోదాం"
చలపతి సినిమా హలో సంచి పడేసి ఊరంతా ఓసారి చాంద్రాయణం తిరిగాడు. కాని లిల్లమ్మ ఇంటికి వెళ్ళాలని అతనికి అనిపించలేదు. ఇప్పుడతనికి ఆమె మీద అంత మోజు కూడా లేదు. రాఘవులు ఈ మార్పు గమనించాడు. అతను అడిగాడు కూడా లిల్లమ్మ గారింటికి వెళ్ళరా? అని.
"ఇప్పుడెందుకు?" అన్నాడు చలపతి.
రాఘవులు "ఓసారి చూసి రాపోయేరా? ఇన్నాళ్ళ స్నేహం ఒక్కసారి తుంపేస్తారా? పాపం చాలా మంచి మనిషి"అన్నాడు.
"ఎవరి మంచి వారికుంది."
"ఒక్కసారి కనబడమని నాతొ చెప్పింది వెళ్ళి రండి."
"తర్వాత మరెప్పుడయినా చూద్దాం లెద్దూ" అని చలపతి మాట మార్చేశాడు.
రాఘవులకి కష్టం అనిపించింది. చలపతి లో ఈ మార్పు శుభసూచనగా అనిపించినా అటు వైపు నుంచి ఆలోచిస్తే లిల్లమ్మ ను తల్చుకుంటే అతనికి జాలి వేసింది. ఆమె చలపతి కోసరం అనేక సందర్భాలలో డబ్బుకి డబ్బూ చాలా ఇచ్చింది. అనేక సందర్భాలలో తన్ని ఆదుకుంది. కట్టుకున్న ఇల్లాలి కంటే ఎక్కువగా సేవ చేసింది. ఎంతో ఆప్యాయత కనబర్చింది. ఇది ఒకటి రెండు రోజుల అనుబంధం కాదు. దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాల అనుబంధం! ఎవరు ఎవరి వల్ల ఎటువంటి ప్రయోజనం పొందారనేది అసలు ప్రశ్న కాదు. ఆమె అవసరం కొద్దీ చలపతయ్య ను దగ్గరకు తియ్యవచ్చు. కాని ఆమె మనస్పూర్తిగా చలపతిని ప్రేమించింది. సేవ చేసింది. చలపతి తన మీద ఆమె ఆధారపడిన అవసరాన్నే గుర్తించాడు గాని ఆమె చూపిన అభిమానమూ ప్రేమా ఆశయాలను గుర్తించలేక పోయాడు. ఆమె మనస్సు తెలుసుకోలేక పోయాడు. ఇప్పుడతనికి ఆమెతో పరిచయం కాని సాంగత్యం కాని నీచంగా నూ, హీనంగానూ కనిపిస్తున్నాయి.
రాఘవులు "మొగాళ్ళం మనం ఏం చేసినా చెల్లుతుంది." అన్నాడు.
చలపతి ఈ ధోరణి కి తలెత్తి "ఇప్పుడెం జరిగింది రాఘవులూ" నువ్వంతగా బాధపడతావు" అన్నాడు.
రాఘవులు మొహంలో అంతవరకూ వ్యక్తం అయిన సంతోష చాయలు మాయమయాయి. అతను కొంచెం కోపంగా ఉన్నాడు.
"ఏమైనా జరిగితేనేగా మనిషి అవసరం?" అన్నాడు రాఘవులు.
"నీకు నామీద లిల్లమ్మ బాగా నూరి పోసినట్టుంది. దాని మాటలలోని బాగా పడ్డావు" అన్నాడు చలపతి.
"ఆమె అలాంటి మనిషి కాదు చలపతయ్య గారూ. ఆ సంగతి తెలుసుకో లేకపొతున్నారు."
"ఓరి పిచ్చివాడా! ఇది ప్రపంచం రాఘవులూ. మనిషితో అవసరం ఉన్నంత వరకే మనిషిలో ప్రేమలూ, అభిమానాలూనూ. అందుకోసం రకరకాల ఎత్తుగడలు, వేస్తారు. నాటకాలు అడతారు. అదంతా ప్రేమ అనుకుంటారు నీలాంటి అమాయకులు" అన్నాడు చలపతి.
రాఘవులకి ఈ ధోరణి మరీ దుస్సహమైంది. "ఆమె సంసారి కాదు. ఓసారి మోసగించబడిన మనిషే" అన్నాడు.
"అదే నేనూ అంటున్నాను."
"అక్కడే మీరు పొరబడుతున్నారు . ఆవిడే కావాలనుకుంటే వందమందిని తన చుట్టూ తిప్పుకోగలదు. కాని మిమ్మల్నే నమ్ముకున్నదంటే మీరు అర్ధం చేసుకోలేక పోయారు."
'అది నన్నే నమ్ముకున్నదని ఏమిటి ఆధారం రాఘవులూ. తెల్లని వన్నీ పాలనీ, నల్లని వన్నీ నీళ్ళని అనుకోకు. ఎప్పటి కైనా చెడిపోయిన మనిషి సంసారి కాలేదు. అదేదో పత్తిత్తని నువ్వనుకుంటే అది భ్రాంతి. దాని అవసరం కొద్ది అది నన్ను చేరదీసింది. అదేమైనా పూస్తే కట్టిన పెళ్ళామా దాన్నే నమ్ముకుని ఉండటానికి." అన్నాడు చలపతి.
రాఘవులు ఈ సంభాషణ ఇంకా పొడిగించి ఆమెను ఇంకా అవమానాల పాలు చెయ్యడం ఇష్టం లేక "పోనీలెండి చలపతయ్యా ఎవరెవరు ఎలాంటి వారో కాలమే తెలుస్తుంది. మంచి చెడులు పాలూ నీళ్ళూ కలిసినట్టుంటాయి. అని చెప్పడం ఒక్కొక్కప్పుడు పెద్ద పెద్దోళ్ళకే చేతకాదు. మనలాంటి వారికేం తెలుస్తుంది."
చలపతి లో ఈ మార్పు అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. లిల్లమ్మ అంటే ఒకప్పుడు ఎంతో అభిమానంగా చూసుకునేవాడు. అదంతా మోసం అని తన అవసరాల కొద్దీ ఆమెను చేరదీశాడని చలపతయ్య ఆమె అనుకున్నంత అభిమానించడం లేదని ఇప్పటికీ ఆమె తెలుసుకోలే పోయింది. ఇంకా అతను తన్ని మామూలు గానే చూస్తాడని ఆమె నమ్ముతోంది. చలపతయ్య గురించి వివరాలు చెప్పమని ఆమె ఇంకా అతడిని గురించి ఆత్రం పడుతుంది. అయితే ఇప్పుడు చలపతి ఆమె దగ్గరకు రావటానికి కూడా ఆమెతో మామూలు సంబంధం కలిగి వుండటానికి గాని ఇష్టపడటం లేదని ఆమె తెలుసుకోలేదు.
"ఈళ్ళెమైన కట్నం కానుల లిస్తున్నారా" అన్నాడు రాఘవులు.
"అదంతా అన్నయ్య కు వదిలేశాను."
"ఏందయ్యా ఆశ్చర్యం , అన్నయ్యంటే ఎగిరి పడేవారు ఇంతలో అన్నయ్య మంచి వాడయి పోయాడా."
చలపతి ముక్కు ఊడిపోయేలా చీదేశాడు.
రాఘవులు కాండ్రించి ఉమ్మేశాడు.
చలపతికి కోపం బాగా వచ్చేసింది. "ఓరే రాఘవులు. తన్నుకుంటాం, కొట్టు కుంటాం . అన్నీ అనుకున్న నెల్లూరు సంబంధం లా అదెవరు తెంపగలరు" అన్నాడు.
"అది తెంపాలని ఎవరు అనుకుంటారు లెండి. పదిహేనేళ్ళప్పుడు ఒకడు లిల్లమ్మ ను వదిలేశాడు గదా. ఆ తర్వాత ఉన్నామో తిన్నామో కూడా అజ కనుగొనని వాడు ఇంతలో అంత మంచోడు ఎలా అయాడా అని. దానికి బలమైన కారణం ఏమయి వుంటుందాఅని ఆలోచిస్తున్నా. అది నెల్లూరు సంబంధం అంటే నే వొప్పను. అంతకంటే గట్టి కారణం ఇంకేదో ఉండి ఉండాలి."
"అదేదో కాస్త వినిపించు" అన్నాడు చలపతి.
రాఘవులు అలోచించి "ఆళ్ళు చాలా డబ్బు గలళ్ళయి వుండాలి" ఇంటి మనిషిని ఓ మాటిలా నొక్కినప్పుడల్లా వాళ్ళ వాళ్ళే వచ్చి డబ్బు ఇస్తారని మీ ఎత్తు! నాకు తెలుసు" అన్నాడు.
"వాళ్ళు కాస్తో కూస్తో ఉన్నవాళ్ళే కావచ్చు గాని నా ఉద్దేశం మాత్రం అది కాదు" అన్నాడు.
రాఘవులు "ఆ అమ్మాయి చాలా అందం చందం ఉన్న అమ్మాయి అయి వుంటుంది" అన్నాడు.
"అది కారణం కాదు. ఆమె పెద్ద అందం గలది కాదు."
'అయితే లిల్లమ్మ మీద కోపం కదూ?"
"అలా అన్నావు -- బాగుంది. దాని సవాలు కి తగిన సమాధానం చెప్పాలని" అన్నాడు చలపతి.
"అయితే పోయి ఓసారి చూసి రండి."
"పౌరుషం ఉన్నవాడేవడికైనా మళ్ళీ దాని ముఖం చూడాలని ఉండదు. చూడాల్సిన సమయం ముందు ఉంది. అప్పుడు చూస్తాను" అన్నాడు చలపతి.
* * * *
