Previous Page Next Page 
వసుంధర కధలు -3 పేజి 7


    "డిటెక్టివ్ కిల్లర్ పేరు వినలేదా?" అంది రాధ.
    "విన్నాను కానీ ఈ కేసులో డిటెక్టివ్ వెంకన్నను పిలవాల్సింది...." అన్నాను సంకోచిస్తూనే.
    "ఎందుకని?"
    "ఆయన ఆచూకీలన్నీ రహస్యంగా వుంటాయి. నేరస్థుల రహస్యాలను దాచడంలో ఆయనకాయనే సాటి!"
    రాధ నవ్వి-"మీ గురించిన పూర్తి రహస్యాలు తెలుసుకోవాలన్నది నా కోరిక. అందుకే కిల్లర్ని పిలిచాను-" అంది. నా ముఖం అదోలాగైపోవడంచూసి "మీరు హత్యచేయనప్పుడు కిల్లర్ తప్ప యింకెవ్వరూ మిమ్మల్ని రక్షించలేరు. మీ గురించి ఎటువంటి నిజం బైటపడినా నేను భరించగలను. ఇంకా మీ కెందుకు భయం?" అందామె మళ్ళీ.
    తప్పుచేసినవాడు భయపడక తప్పదు గదా.....
    కిల్లర్ బైటపెడితే తప్ప నా తప్పులన్నీ రాధ ముందు ఒప్పుకోదల్చుకోలేదు.

                                     6

    "అయాం కిల్లర్. కిల్ల రాఫ్ లైస్. కిల్లరాఫ్ ఫాల్స్ హుడ్. కిల్ల రాఫ్ క్రిమినల్స్..." అంటూ చేయి చాచాడతడు.
    నేను భయం భయంగా చేయి జాపి-'అయాం నాటే క్రిమినల్ నమ్ముతారా?" అన్నాను.
    "నమ్మను-" అన్నాడు కిల్లర్ - "ఈ ప్రపంచంలో నేరస్థుడు కానివాడంటూ వుండడుకాబట్టి-"
    "అయితే అందర్నీ చంపేస్తారా?"
    "నా బ్రతుకు తెరువుకు అవసరమైనంతమందిని, నా జీవన పరిమితి వీలిచ్చినంతమందిని...." అని నవ్వాడు కిల్లర్.
    అతణ్ణి మంచిచేసుకోవడం మంచిదనిపించింది-"మీ తెలుగు చాలా గొప్పగా వుంది. అదే మీ మాతృభాషా?" అన్నాను.
    "నా తల్లి భారతమాత. ఆమె భాషలన్నీ నా మాతృభాషలే...."
    ఏమనాలో తెలియలేదు.
    కిల్లర్ నన్ను పరీక్షగా చూడ్డం మొదలుపెట్టాడు. అతడి చూపులు నన్ను గుచ్చుతున్నాయి. నాకిబ్బందిగా అనిపించి తలవంచుకున్నాను.
    "మీ కథనం ప్రకారం హత్యజరిగిన గదిలో మీకంటే ముందెవరో మసిలారు. పోలీసులకలాంటి ఆధారాలు ముందు దొరకలేదు. నేను రంగంలో దిగగానే గదంతా శోధించి కొన్ని కొత్త వ్రేలిముద్రలు సంపాదించాను..." అన్నాడు కిల్లర్.
    కిల్లర్ నిజంగా చురుకైనవాడు.
    పడకగది నానుకునే బాత్రూముంది. బాత్రూములో కాస్త పైనుంచి వెంటిలేటరుంది. వెంటిలేటరుకు ఇనపచువ్వలున్నాయి. ఆ విషయం పైదాకా వెడితే కానీ తెలియదు. నాకంటే ముందెవరైనా ఆ గదిలో చిక్కుపడివుంటే తప్పించుకుందుకక్కడ ప్రయత్నం చేస్తాడు.
    అక్కడ రెండు జతల వేలిముద్రలు దొరికాయి. ఒకటి నాని.
    "అంటే అవే హంతకుడివయుండాలి...." అన్నాను.
    కిల్లర్ తల అడ్డంగా ఊపి-"హంతకుడెవరో ఇంకా తెలియలేదు. అప్పుడే ఏమీ చెప్పలేము. గదిలో మీరు కాక యింకో వ్యక్తి అక్కణ్ణించి బయటపడాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరన్నది తెలుసుకోవాలి...." అన్నాను.
    "ఎలా తెలుస్తుంది?" భయంగానూ ఆత్రుతగానూ అడిగాను.
    "అది తర్వాత తెలుసుకుందురుగాని. హత్య సుమారు ఏడుగంటల ప్రాంతాల జరిగింది. మీరు తొమ్మిది గంటలకు అక్కడికి వెళ్ళానంటున్నారు. నిజానిజాలు తెలుసుకుందుకు గురుబక్ష్ సింగ్ సాయపడాలి. కానీ గురుబక్ష్ సింగ్ పరారీలో వున్నాడు. అతడి గురించిన ఆచూకీ తెలిస్తే తప్ప మీ ఎలిబీకి అర్ధంలేదు-" అన్నాడు కిల్లర్.
    పోలీసులు అరెస్టు చేయగానే నేను తొమ్మిదిదాకా గురుబక్ష్ సింగ్ తో వున్నానని చెప్పాను. పోలీసులు వుడ్ లాండ్స్ హోటలుకు ఫోన్ చేశారు. గురుబక్ష్ సింగ్ వున్నాడు. నా మాటలు నిజమేనని చెప్పి-పోలీసులు వస్తానంటే రమ్మన్నాడు.
    పోలీసులు వెళ్ళేసరికి అతడు లేడు. అతడు బయటకు వెళ్ళడం యెవరూ చూడలేదు. అంటే తెలివిగా పారిపోయేడన్నమాట! గదిలో అతడి సూట్ కేసుంది. అందులో అతడి బట్టలు మాత్రం వున్నాయి. అతడు తిరిగివస్తాడని పోలీసులు రెండుమూడు రోజులు యెదురుచూశారు రాలేదు.
    గురుబక్ష్ సింగ్ ఎందుకు పరారీ అయ్యాడు? ఈ ప్రశ్న ఒక్కటే చాలు-నన్ను నేరస్థుడిగా నిరూపించడానికి!
    అసలు నిజం చెబితే రోజా జీవితం నాశనమవుతుంది. చెప్పకపోతే నాకు జీవితమే వుండదు. ఇంతవరకూ గురుబక్ష్ సింగ్ గురించి నేను సరైన సమాచార మివ్వలేదు. మా కంపెనీకి సంబంధించిన వ్యవహారం మీద రహస్యంగా మాట్లాడాలని వచ్చాడని చెప్పాను.
    నేను చెప్పిన అబద్దాలు పోలీసులు నమ్మారు. గురు బక్ష్ సింగ్ పోలీసుల కళ్ళబడడానికిష్టపడడం లేదంటే అతడివద్ద దొంగసరుకేదో ఉండివుండాలి. ఏమిటా దొంగ సరుకు? అది హోటల్నించి ఎలా తప్పించాడు?
    పోలీసుల ఆలోచన లీ దారిలో నడుస్తున్నాయి.
    కిల్లర్ వచ్చి రెండ్రోజులయింది.  నన్ను మాత్రం అతడీ రోజువరకూ కలుసుకోలేదు కానీ పోలీసుల నుంచి మొత్తం సమాచారమంతా రాబట్టి పరిశోధనలో వున్నాడు.
    "గురుబక్ష్ సింగ్ గురించి నేనేం చెప్పగలను?" అన్నాను.
    "గురుబక్ష్ సింగ్ వదిలిన వెళ్ళిన సూట్ కేసులో అతడి బట్టలున్నాయి. వాటిని పరీక్షించి చూశాను. అతడు చాలా నాజూకైన మనిషనిపించింది. సర్దార్జీలలో అంతనాజూకైనవారు అరుదు. అందులోనూ అతడు ఆయిదడుగులమీద ఒక అంగుళం మించి పొడవుండడని హోటల్లో వారందరూ అంటున్నారు..." అని ఆగాడు కిల్లర్.
    నేను తడబడ్డాను. అతడిదంతా నాకెందుకు చెబుతున్నట్లు?
    కిల్లర్ యింకా వివరించాడు.
    గదిలో బాగా చనువుగా మసిలిన వారిద్దరే యిద్దరు. ఇద్దరిలో ఒకరు నేనేనని వేలిముద్రలు తెలియబరుస్తున్నాయి. రెండో వ్యక్తి గురుబక్ష్ సింగు అయుండాలి.
    "అది సహజమేకదా-" అన్నాను.
    "సహజం కాని విశేషమొకటుంది-" అన్నాడు కిల్లర్.
    "ఏమిటది?" కుతూహలంగా అడిగాను.
    "గురుబక్ష్ సింగ్ సూట్ కేసులో మంచి పరిమళం. అదే పరిమళం స్నానాల గదిలో, మంచంమీద కూడా వుంది. దీని అర్ధం అతడు బాగా పెర్ ఫ్యూమ్స్ వాడతాడని. అవి అతడికి ప్రాణమై వుండాలి. వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళాడు....."
    "ఇందులో అసహజమేముంది?"
    "అసహజమేమిటంటే ఆ పెర్ ఫ్యూమ్స్ పురుషులు వాడేవికాదు...."
    నేనులిక్కిపడి-"పెర్ ఫ్యూమ్స్ కు ఆడా మగా వుంటుందా?" అన్నాను.
    "మగాళ్ళలోనూ బొట్టు, కాటుక పెట్టుకునే వారుండవచ్చు. కానీ అవి ఆడవారి సొత్తుగానే భావించడం జరుగుతుంది...." అని కిల్లర్ ఒక్క నిమిషమాగి-"మంచంమీద మీవి, గురుబక్ష్ సింగ్ వి-వేలిముద్రలు ఎన్నోచోట్ల కలగాపులగంగా వున్నాయి. మీరు, అతడు కలిసి స్త్రీ పురుషుల్లా మసిలారనడాని కక్కడ అవేసాక్ష్యం. ఎటొచ్చీ గురుబక్ష్ సింగ్ స్త్రీయా, పురుషుడా అన్నది మీరు చెప్పాలి-" అన్నాడు.
    "వెధవ వేలిముద్రలు.....ఎంత పనిచేశాయి?" అనుకున్నాను. నాకు నాలుక తడారిపోయినట్లయింది.
    "ఆ గదిలో మూడో వ్యక్తి మసలలేదు. ఒక స్త్రీ ఆ గదిలో అడుగుపెట్టిందనడానికి సాక్షులెవరూ లేరు. గురుబక్ష్ సింగ్ ఆడదేనా అయుండాలి. లేదా మీరిద్దరూ సెక్స్ పెర్వర్ట్సు అయుండాలి. రెండింట్లో ఏది నిజం?" అన్నాడు కిల్లర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS