Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 7


    పావుగంట ఆగి సునీతను పిలిపించాడు.
    "కూర్చో, నీతా!" ఆమె వచ్చాక కుర్చీ చూపించాడు.
    "నా పేరు నీతా కాదు!"
    "చూడండి..."
    "అండీలకు నేను అర్హురాలిని కాదు."
    "ఓ, నిన్నొక మాట అడుగుదామని పిలిచాను."
    "ఆఫీసు విషయమైన అడగండి!"
    "కాదు. ఇది వేరే."
    "క్షమించండి! ఇది ఇల్లు కాదు. మరెప్పుడైనా కలుసుకుందాం."
    "పోనీ, సాయంత్రం ఓ మాటు పబ్లిక్ గార్డెనులో కలవగలవా?"
    "ఎందుకు?"
    "పనుంది."
    "చెప్పందే వీలుపడదు."
    "చెప్పటానికిది ఇల్లు కాదని నువ్వే అన్నావుగా?" ఆమె మాట ఆమెకే ఒప్పగించాడు.
    ఒక క్షణం శబ్దరహితం. "కాని, అక్కడ మాత్రం ఎంతో మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుంది." విసురుగా వెళ్ళింది.
    "మై గాడ్!" కూజాలో నీరు గ్లాసులో ఒంపుకుని గడగడ తాగేశాడు.
    సాయంత్రం వేణు వెళ్ళేసరికి సునీత వచ్చే ఉంది. కొలను గట్టుమీద కూర్చుని నీళ్ళలో ప్రతి బింబాన్ని చూసుకుంటూంది. నీళ్ళలో వేణు నీడ చూసి ఇటు తిరిగింది.
    "ఆలస్యంగా వస్తావనుకున్నా. ముందే వచ్చావు!"
    "ఊఁ! నిలుచునే ఉన్నారు. కూర్చోండి."
    చాలాసేపు ఇరువురి మధ్య మౌనం. సునీత ఇంటికి వెళ్ళి అన్నం పండుకోవలిసి ఉందన్న వంక పెడుతూ అంది: "టైమ్ అవుతూంది. ఇంటికి వెళ్ళాలి. త్వరగా చెప్పండి."
    "నువ్వేమీ అనుకోవద్దు."
    "ఊఁహుఁ!"
    వేణు కోటు జేబులో చెయ్యి పెట్టి కవ రొకటి తీశాడు. దాని రంగు తీరు అది పాతదని చెబుతూంది. దాన్ని సునీతకు అందించబోయాడు.
    "ఏమిటది?" తీసుకోకుండానే అనుమానపడింది.
    "నువ్వు కాలేజీ విడిచే ముందు విశ్వానికి ఒక శిక్ష విధించావు..."
    సునీత అది వినటం ఇష్టం లేనట్లు తల తిప్పేసుకుంది. మళ్ళీ కూపీ తీస్తున్నట్లు వేణు కళ్ళలోకి చూస్తూ, "అయితే ఈ కవ రెందుకు?" అన్నది.
    వేణు తికమక పడ్డాడు. 'అలా చూస్తుందేం?'
    "నిజం! ఒట్టు! ఇది ప్రేమలేఖ కాదు, సునీతా!"
    "ఇది నేను చూడటం అవసరమా?"
    "అవసరమే!"
    అంటించి ఉన్నదాన్ని కొస దగ్గిర చింపింది. వేణు అంటున్నాడు: "బొంబాయి వెళ్ళాకనే ఇది పంపుదామనుకున్నా. కానీ, నువ్వు కలుస్తావని ఊహించక పోవటంవల్ల ఇది ఇంటి దగ్గిరే ఉండిపోయింది. ఉత్తరాలు వ్రాద్దామనుకున్నా గానీ, ఎందుకో వ్రాయలేక పోయాను."
    సునీత వింటున్నదో లేదో కాని ఉత్తరం చదువు తున్నది.
    "సునీతకు -
    లోకం ఎన్ని అనుకున్నా మనం దోషులం కానంతవరకు ఒకరికి భయపడ వలసిన అవసరం లేదు. నేను నీకు సహాయపడటంలో, ఏ నీచత్వం తలపెట్టక పోయినా అపార్ధం చేసుకున్నావు. అది నీ తప్పు కాదు. అందుకు నిన్ను నేను నిందించను.
    కసికొద్దీ కల్పిస్తారు కొందరు. ఏ పనీలేక కల్పిస్తారు కొందరు. ఏం జరుగుతుందో చూద్దామని కల్పిస్తారు కొందరు. అయితే ఆ కల్పన లెంత దుష్పరిణామాలకు దారి తీస్తాయో వాళ్ళు ఊహించరు. దానివల్ల తాత్కాలికంగా వాళ్ళ సరదా తీరినా ఇతరులెంత వేదనను అనుభవిస్తారో తెలుసుకోలేరు.
    నేను చెయ్యని నేరానికి నా దగ్గిర క్షమాపణ తీసుకున్నావన్న బాధ లేదు. దానికన్న ఉజ్జ్వలం కాబోయే నీ భవిష్యత్తుకు కంటకంలా అడ్డు పడ్డామనే విచారమే ఉంది. నువ్వీ పరిస్థితుల దృష్ట్యానే చదువు మానేసి ఉన్నట్లయితే నన్ను మన్నిస్తావు కదూ? ఈ సంఘటన నా జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది.
    మనస్సాక్షి! నేను ఎప్పుడూ నీ ఎడ నిష్కల్మషంగానే మెలిగాను. ఇకముందూ ఈ దృష్టి మారదు. సోదరి లాంటి నీవు నా స్నేహితురాలివైనందుకు గర్విస్తున్నాను.
    చదువు అయిపోయింది. ఇంటికి వెళుతున్నాను. ఈ కాలేజీ జీవితం, స్నేహితులూ మళ్ళీ కావాలన్నా రావు నిన్ను కూడా చూస్తానో, లేదో నమ్మకం లేదు. మా ఇద్ధరిలో ఎవరిని కలిసినా (నీకు) మిగతావాళ్ళను కలిసినట్లే.
    అసలు ఆ కవరు, దానిలో కార్టూన్లు, పేర్లు వ్రాసి పంపింది వేణు. ఈ లేఖను నా చేత వ్రాయించుకున్నాడు. సరదాకు చేసిన పని ఇంత గొడవ చేస్తుందనుకోలేదు. ఈ మాటే నాతో చెప్పి పశ్చాత్తాప పడ్డాడు. ఏం చేసినా-దేవుడు నాకు ప్రసాదించిన వరాల్లో వేణు స్నేహం మొదటిది. వాడు నా ప్రియ మిత్రుడు కనక నేనేమీ అనలేను. కాని, నీ విషయంలో నాకే అధికారమూ లేదు. అదంతా నీ ఇష్టా నిష్టాలకే వదులుతున్నాను.
    ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నీ శ్రేయోభిలాషిని.
                                                                                       -విశ్వం."
    వేడి నిశ్వాస వదిలింది సునీత. ఆమె వెయ్యబోయే చివాట్లను గుణించుకుంటూ, తన బూట్లను తానే చూసుకుంటున్నాడు, వేణు.
    "కృతజ్ఞురాలిని!" సునీత కంఠంలో ఎక్కడా తీక్షణత ఉన్నట్లు లేదు. మళ్ళీ అన్నది: "మీవల్ల నా చదువు ఏమీ పాడవలేదు. అదె రోజు మరొక అనుకోని స్మఘటన జరిగింది. నా జీవితానికి అంతవరకూ తోడునీడగా ఉన్న ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాను. నే నానాడు విశ్వాన్ని అపార్ధం చేసుకున్న మాట నిజం. నే నసలు పట్టించుకునేదాన్ని కాదు. కాని, వెనక తోటి ఆడపిల్లలు నవ్వటం వినిపించి రెచ్చిపోయాను."
    "కొద్దిగా ఆలోచించవలసింది."
    "తొందర పడ్డాను. నేను విశ్వాన్ని క్షమార్పణ కోరానని చెప్పండి, కలిస్తే."
    "సునీతా! నన్ను క్షమించవూ?"
    "మిమ్మల్నా? ఏమో.....ఏమో....నాకు తెలీదు. నేనది అప్పుడే మరిచాను!"
    "థాంక్స్!"
    సునీత వెళ్ళటానికన్నట్లు నిల్చుంది. వేణు కూర్చునే ఉన్నాడు. "ఇంకొక్క మాట! అప్పుడే వెళ్ళకు, సునీతా!"
    "ఇంటి దగ్గిర బాబాయి ఎదురు చూస్తూంటాడు."
    "ప్లీజ్! పది నిమిషాలే."
    "త్వరగా కానివ్వండి!" కూర్చున్నది.
    ఒక్క క్షణం మాగి, "నేను వచ్చిన రోజు నా రాక ఇష్టం లేనట్లు ఎందుకు ప్రవర్తించావు, సునీతా?" అన్నాడు వేణు.
    "నా ఇష్ట మేముంది? నేనలా ఉన్నానని మీరు రావటం మానుకున్నారా?"
    "అయితే వాన్ లో ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు?"
    "అదంతా నా ఇష్టం. మీ రెవరు అడిగేందుకు?"
    "నీ ఇష్టాన్ని అడ్డుకునే అధికారం లేదు. కానీ, తెలుసుకోవాలనుకుంటున్నా!"
    గడ్డి పరకలు లాగుతూ అంది: "మీకు తెలీదు, వేణూ! ఇప్పటికే మీ నాన్నగారు నా కీ ఉద్యోగం ఇచ్చినందుకు ఎన్నో అపోహలు కల్పించబడ్డాయి."    
    "కానీ, నాన్నకు...."
    "ఏ దురుద్దేశ్యమూ లేదు. నిజమే! అన్నచెల్లెల్లు వెళుతూంటే ఏవో అనుకుంటూ వెనకాల కిచకిచలాడే కోతులెన్ని? ఒకవేళ నా కీ ఉద్యోగంలో అనుకోని పరిసరాలు ఎదురై ఉంటే, నే నీపాటికి రాజీనామా చేసి ఉండేదాన్ని. బహుశా మీ నాన్నగారు, మీ అక్కయ్య కూడా న రూపంలో ఎవరొ మరుగునపడిన వ్యక్తులను ఊహించి ఉంటారు."
    "కావచ్చు! బొంబాయిలో ఉండగా నాన్న ఒకసారి వ్రాశారు, నీ రూపం ఏవో పాత స్మృతులను కెలికిందని."
    "మీకు తెలీదా, వేణూ?"
    "లేదు. నే నెన్నడూ మా కుటుంబంలో నిన్ను పోలిన వ్యక్తులను చూసి ఉండలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS