Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 78


                               రెండు చట్టాలు!
                                                                 ---వసుంధర


    డిటెక్టివ్ వెంకన్న మరోసారి ఆ ఉత్తరాన్ని శ్రద్దగా చదివాడు.
    "డియర్ రాజా!
    సరిగ్గా నెలరోజులు గడువిస్తున్నాను. అంతే నీ జీవితం. వచ్చే నెల పదమూడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు నీ పోరణలు పోతాయి. అంతవరకూ నిన్నేమీ చేయను. అప్పుడు నిన్ను వదిలిపెట్టను. ముందుగానే చెబుతున్నాను కాబట్టి నీ ప్రాణాలు దక్కించుకునేందుకు వృధాప్రయత్నాలు చేసుకో ఇది నా సవాలు+హెచ్చరిక!
                                                                                                    నీ
                                                                                                   శత్రువు."
    వెంకన్న తలెత్తి ఎదురుగా వున్న వ్యక్తిని చూశాడు. అతడిది పాతికేళ్ళ వయసు ఆడపిల్ల అందమున్న ఆ ముఖంలో లేత మీసాలు తమాషాగా వున్నాయి.
    అతడి ముఖంలో భయంకూడా వుంది.
    "ఎవరు నీ శత్రువు?" అన్నాడు వెంకన్న.
    "నాకు తెలిసి నా శత్రువొక్కడే.....అతడి పేరు కరీం సాహెబ్-" అన్నాడా యువకుడు.
    "కారీం సాహెబ్ అంటే?"
    "మీకు తెలిసిన కరీం సాహెబే!"
    వెంకన్న ఉలిక్కిపడ్డాడు.
    స్మగ్లర్ కింగ్ కరీంసాహెబ్.
    అనుకున్న పని అనుకున్న సమయానికి చేయడం కరీంసాహెబ్ ప్రత్యేకత.
    "నీ వతడి అనుచరుడివా?"
    "అనుచరుడినైతే శత్రువు నెందుకౌతాను?"
    "కరీంసాహెబ్ వంటివారికి పోలీసుల్లో మిత్రులుంటారు. అనుచరులే శత్రువులౌతారు...."
    ఆ యువకుడు క్షణం తటపటాయించి-"కాకినాడలో పదిలక్షల విలువచేసే బంగారం బిస్కట్లు పోలీసులు పట్టుకున్నారు. మీకు తెలుసుగదా!" అన్నాడు.
    "ఊఁ."
    "మండ పేటలో నలుగు కేజీల మారకద్రవ్యాలు పోలీసులు స్వాధీనపర్చుకున్నారు....."
    "తెలుసు...."
    "కాజీపేటలో నిర్భంధించబడ్డ నలుగురు యువతుల్ని పోలీసులు విడిపించారు...."
    "ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు? శ్రీకాకుళంలో చేతులు మారుతున్న దొంగనోట్లనుకూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని నాకు తెలుసు...."
    ఆ యువకుడాశ్చర్యంగా-"దేశంలో ఇంకా చాలా నేరాలు జరుగుతూంటే మీరీ శ్రీకాకుళం విషయమే యెందుకు చెప్పారు?" అన్నాడు.
    "అది నీ కనవసరం-" అన్నాడు వెంకన్న.
    "ఈ నాలుగు నేరాలూ కరీంసాహెబ్ కు సంబంధించినవి. అందుకే నేనాశ్చర్యపడ్డాను....." అన్నాడా యువకుడు.
    వెంకన్న నవ్వి-"ఈ నాలుగూ కరీంసాహెబ్ కు సంబంధించినవి నాకూ తెలుసు....." అన్నాడు.
    "యూ ఆరే జీనియస్....ఎలా తెలుసుకున్నారు?"
    "నాలుగు నేరాలూ వివిధ ప్రాంతాలలో జరిగినా నిముషాలతో సహా ఒకే సమయంలో జరిగాయి. అది కరీం సాహెబ్ పద్ధతి ఒకేసారి నాలుగైదు నేరాలు ప్లాన్ చేస్తాడు. అన్నీ ఒక పద్ధతిలో జరుగుతాయి...."
    ఆ యువకుడాశ్చర్యంగా-"మీరు చెప్పింది రైటు" అన్నాడు.
    "ఎలా తెలుసు నీకు?"
    "నాకు కరీంసాహెబ్ తెలుసు!"
    "అందుకే నీ వతడి అనుచరుడివా అనడిగాను...."
    "కరీం షాహెబ్ యెవరో అతడి అనుచరులక్కూడా తెలియదు...."
    వెంకన్న ఆశ్చర్యంగా-"మరి నీకెలా తెలుసు?" అన్నాడు.
    "చిన్నతనంలో కరీంసాహెబ్ అనాధగా వున్నప్పుడు అమ్మ చేరదీసింది. అల్లరిచిల్లరిగా తిరుగుతూంటే అమ్మ తిట్టి కొట్టి మందలించేది. ఓసారి కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోయాడు. అమ్మ పేపర్లో ఫోటో వేయించింది. ఎవరో కరీంసాహెబ్ ను తెచ్చి మా అమ్మ కప్పగించారు. అమ్మ అతణ్ణి దగ్గరగా తీసుకొని-నువ్వెప్పుడూ నన్ను వదిలిపోవు కదూ - అనడిగింది. కరీంసాహెబ్ ఒప్పుకున్నాడు...."
    "నువ్వు చెబుతున్నది చాలా ఆశ్చర్యంగా వుంది. ఒక్క నిమిషం...." అని వెంకన్న తన అసిస్టెంట్సు వంక చూసి-"నోట్ చేసుకుంటున్నారా?" అన్నాడు.
    సీతమ్మ, రాజమ్మ తలలూపారు.
    "ఊఁ" అన్నాడు వెంకన్న.
    ఆ యువకుడు కొనసాగించాడు.
    ఆ యువకుడి తల్లి పేరు లక్ష్మి ఆమెకు పిల్లలులేరు. కరీం సాహెబ్ ను ఆమె కన్నబిడ్డకుమించి ప్రేమించింది. అప్పట్లో అతడి పేరు సుందర్రావు.
    కరీంసాహెబ్ కు పన్నెండేళ్ళ వయస్సప్పుడు లక్ష్మి భర్త పోయాడు. అప్పుడామె గర్భవతి. బంధువులు వచ్చి ఓదార్చారు. ఆఫీసునుండి రావలసిన డబ్బు విషయంలో మోసగించి వెళ్ళిపోయారు. లక్ష్మి చాలాయిబ్బంది పడింది.
    ఆమెకు మగబిడ్డ పుట్టాడు. రాజు అని పేరు పెట్టుకుందామె. ముఫ్ఫైఅయిదేళ్ళ వయసులో పుట్టిన ఆ బిడ్డ ఆమెకు ప్రాణంకంటే ఎక్కువ, కానీ వాడినెలా పెంచుతుంది? సుందర్రావు తల్లికో పెద్ద అబద్ధం చెప్పాడు. తననో దయామయుడాదుకున్నాడనీ అతడి దగ్గర తీరిక సమయంలో పనిచేస్తున్నానని చెప్పి తజ్ల్లి కతడు డబ్బు తెచ్చిచ్చేవాడు. లక్ష్మి అవన్నీ నమ్మింది. సుందరరావు నేరాలు చేసేవాడు. నేరాలు చాలా తెలివిగా ఎవరికీ పట్టుబడకుండా చేసేవాడు. అలాగే ఎలాగో మెట్రిక్ కూడా ప్యాసయ్యాడు. తర్వాత తనకుద్యోగం దొరికిందని అబద్ధంచెప్పి చదువు మానేశాడు.
    నిప్పునూ నేరాన్నీ కలకాలం దాచడం కష్టం.
    లక్ష్మికి సుందర్రావు మీద అనుమానం వచ్చి ఒకరోజు నిలదీసి అడిగింది. ఒట్టు వేయమనేసరికి సుందర్రావు నిజం ఒప్పుకున్నాడు.
    లక్ష్మి అతణ్ణి నేరాలు మానేయమంది. అప్పుడు రాజుకు ఆరేళ్ళు.
    లక్ష్మినీ రాజునీ గొప్పవాళ్ళను చేయడానికి తను నేరాలు కొనసాగిస్తానన్నాడు సుందర్రావు. లక్ష్మి అతణ్ణింట్లోంచీ పొమ్మంది.
    సుందర్రావు వెళ్ళిపోయాడు. నాలుగేళ్ళెలాగో గడిచాయి.
    లక్ష్మి బరువుగా జీవితం వెళ్ళబుచ్చుతోంది. కష్టపడి పనిచేసి కొడుకును గొప్పవాణ్ణి చేయాలనుకుంటోంది. కానీ అది సాధ్యపడేలా కనబడ్డంలేదు.
    అలాంటి సమయంలో ఒక దూరపు బంధువు లక్ష్మి దగ్గరకు వచ్చాడు. ఆయనకు అయినవాళ్ళెవరూ లేరు. బాగా డబ్బుంది. ఆశ్రయంకోసం వచ్చాడు.
    లక్ష్మి జాతకం మారిపోయింది. రాజు అదృష్టం తిరిగింది.
    దూరపు బంధువు ఆస్తిని రాజు పేరుమీద రాసి లక్ష్మిని సంరక్షకురాలిగా నియమించాడు. ఆయన లక్ష్మి ని తరచు సుందర్రావు గురించి అడుగుతూండేవాడు. అతడి గురించి మంచిగా చెబుతూ ఆమె మనసును మార్చడానికి ప్రయత్నిస్తూండేవాడు. లక్ష్మి అంగీకరించేది. ఒకరోజున ఆమె "వాడికి నేనంటే అభిమానముందనుకోను. లేకుంటే నన్ను వదిలి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు నా వైభవంలో వాడూ పాలుపంచుకుంటే యెంతో సంతోషించేదాన్ని. వాడు తన మార్గాన్ని వదలలేక నన్నే వదలాలను కున్నాడు-" అంది దూరపు బంధువుతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS