లై డిటెక్టర్లో ఆకుపచ్చ చుక్కలు వెలిగాయి. కానీ వినీల్ పరికరం వంకకాక విల్సన్ వంక చూస్తూ-"ఆ విషయం నాకూ తెలుసు. అతడి మాటలు నమ్ముతున్నా నన్నభ్రమ అతడిక్కలిగించి నిన్ను రప్పించానిక్కడికి. అతడు నీ గురించి అబద్ధం చెప్పాడు. అందుకు శిక్ష నీవే అతడికివ్వాలి. ఈ డబ్బా మూత తెరు-" అన్నాడు.
కిల్లర్ తడబడ్డాడు.
వినీల్ తన మాటలు నమ్మలేదా? ఇప్పుడు తనకు ప్రాణాపాయం తప్పదా?
అతడాలోచిస్తూండగానే విల్సన్ ప్లాస్టిక్ డబ్బా మూత తీశాడు. ఆ వెనువెంటనే బుస్సుమంటూ తాచుపాము విల్సన్ని కాటేసింది.
విల్సన్ గొంతులోంచి కేక కూడా రాలేదు.
చూస్తూండగా అతడి శరీరం నల్లగా మాడిపోయింది. అతడు నేలకూలాడు.
"డియర్ మిస్టర్ కిల్లర్! ఇది నా అనుచరులను శిక్షించే పద్ధతి నీవు నా అనుచరుడివి కాకపోయినా, నన్ను మోస గించకపోయినా రేపు నిన్నూ ఇదే పద్ధతిలో శిక్షించబోతున్నాను. నా స్థావరంలో పరాయివాళ్ళకు చోటు లేదు. రేపటి దాకా నీ కెందుకవకాశమిస్తున్నానంటే-నా పెంపుడు పాము రోజుకొక్కడిని మాత్రమే కాటేస్తుంది మరి!" అంటూ వినీల్ ప్లాస్టిక్ డబ్బామీద మూతపెట్టేసి చప్పట్లు కొట్టాడు.
ఆరడుగుల నల్లటివాడు వచ్చి వినీల్ ఆదేశం ప్రకారం విల్సన్ శవాన్నీడ్చుకొని వెళ్ళిపోయాడు.
"నువ్విక బుద్దిగావెళ్ళి నీ గదిలో పడుకో-" అన్నాడు వినీల్.
"నీకు బుద్దిచెప్పిగానీ నేను పడుకోను-" అంటూ కిల్లర్ మెరుపు వేగంతో లేచాడు.
వినీల్ చటుక్కున చప్పట్లు కొట్టాడు. అయితే ఆరడుగుల నల్లనివాడొచ్చేలోగా-అతడు కదలలేని స్థితిలోకి మారిపోయాడు.
కిల్లర్ అతణ్ణికూడా క్షణాలమీద పడగొట్టాడు.
తర్వాత ఇల్లంతా కలియదిరిగాడు.
ఆ యింట్లో ఇంకెవ్వరూలేరు. ఓ పక్కగదిలో విల్సన్ శవముంది.
కిల్లర్ ఆ ఇద్దర్నీ బంధించడానికి తాడుకోసం వెతికి సంపాదించాడు. దాంతో ఆ యిద్దర్నీ ఒకరికొకర్ని కలిపి కట్టేసి ఎదురుగా కూర్చున్నాడు.
"ఇంత సులభంగా నన్నూ, నా అనుచరున్నీ పడగొట్టగల వాడీ భూప్రపంచంలో లేడని నమ్మాను-" అన్నాడు వినీల్ వాపోతూ.
"అయామే కిల్లరాఫ్ సచ్ ఒపినియన్స్!" అన్నాడు కిల్లర్.
తానున్న ఊరికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న ఆ యింటి వివరాలు కిల్లర్ పోలీసులకు చెప్పడానికెంతో వ్యవధి అవసరంలేకపోయింది.
6
కిల్లర్ కంతా ఆశ్చర్యంగా వుంది.
ఒక్క లైడిటెక్టర్ కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్డాయి.
లై డిటెక్టరుంటే ఎన్ని ప్రాణాలైనా నిలబెట్టవచ్చు. నేరస్థుల ఆచూకీ తెలుసుకోవచ్చు. ప్రపంచంలో నేరాలనే రూపుమాపవచ్చు.
తనకది కావాలని అతడు పోలీసు డిపార్టు మెంటుని కోరాడు. కానీ అది ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు పరీక్షకు వెళ్ళింది.
కిల్లర్ నిరుత్సాహపడ్డాడు.
ఆ నిరుత్సాహంతోనే అతడొకరోజు సాయంత్రం బజార్లో తిరుగుతూండగా ఓ వ్యక్తి యెదురై పలకరించాడతన్ని.
"నువ్వెవరో నాకు తెలియదు...." అన్నాడు కిల్లర్.
"గోడలకు చెవులుంటాయి. గోడల్లేని చోటుకు వెళ్ళి మాట్లాడుకుందాం-" అన్నాడతడు.
ఇద్దరూ ఓ పార్కుకి వెళ్ళారు.
చుట్టుపక్కల జనంలేదు.
"హేట్సాఫ్ టూ యూ-డిటెక్టివ్ కిల్లర్! ప్రభుత్వం యెన్నోవిధాల ప్రయత్నించి పట్టుకోలేకపోతున్న అంతర్జాతీయ ముఠా వ్యక్తుల్ని పోలీసుల కప్పగించావు...." అన్నాడతడు.
"నువ్వెవరు?"
"ఆ ముఠాకోసం యెన్నో పథకాలు వేస్తున్న ప్రభుత్వోద్యోగిని అయితే వారి మనుషులు మా సంస్థలో కూడా కొందరు చేరినందువల్ల మా పథకాలు ముందే వారికి తెలిసిపోతున్నాయి. నాకు సుజాత గురించి కొన్ని వివరాలు తెలిసి ఆమె యింటి పనివాడుగాచేరి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాను. ఆమె నన్ననుమానించకుండా జాగ్రత్త తీసుకున్నాను. కానీ నాకు తెలిసిన రహస్యం ఎవరికీ చెప్పాలో తెలియదు. అందుకే మా డిపార్టుమెంటుకి చెందని నిన్నెన్నుకున్నాను. నువ్వు నా ఎన్నిక సరైనదని ఋజువుచేశావు...." అన్నాడతడు.
కిల్లర్ ఆశ్చర్యంగా-"నువ్వు నన్నెన్నుకున్నావా? ఎలా?" అన్నాడు.
అతడొక కవర్ని కిల్లర్ కందించి-"ఇందులో యాభైవేలున్నాయి. ప్రభుత్వం తరఫున నీకు నేనందజేస్తున్న ఫీజిది. జరిగిందంతా పూర్తిగా మర్చిపో ప్రభుత్వానికందిన తాళపత్రగ్రంతాలవల్ల చాలా గొప్ప విశేషాలు తెలుస్తున్నాయి. అదంతా రహస్యంగా ఉండాలి...." అన్నాడు.
"ఇంతకీ నువ్వే విల్సన్ని బుట్టలో వేసుకున్నావా?" అన్నాడు కిల్లర్.
"లేదు ఒకరోజు ముందు నేనే విల్సన్ గా వచ్చి నిన్ను కలుసుకున్నాను. సుజాతను చంపి తాళపత్ర గ్రంథాలు సాధించాను. నిన్ను నరరూప రాక్షసులకు వదిలిపెట్టి-ఆ దుర్మార్గుల దృష్టి నాపై పడకుండా కాపాడుకున్నాను. మరి నాకు సెలవు. ఇంకేమీ అడక్కు" అంటూ అతడు లేచి వెళ్ళిపోయాడు.
కిల్లర్ మ్రాన్పడిపోయాడు.
అంటే-విల్సన్ వినీల్ ని మోసంచేయలేదు.
లై డిటెక్టర్ని తనవారిపై ప్రయోగించకూడదన్న వినీల్ సిద్ధాంతం అతణ్ణి మోసగించింది.
కళ్ళతో చూసేదంతా నిజంకాదు.
లై డిటెక్టర్ తను నిజం చెబుతున్నాడో లేదో తెలుసుకోగలదు తప్ప-అసలు నిజాన్ని తెలుసుకోలేదు.
కిల్లర్ కప్పుడు లై డిటెక్టర్ గురించిన బెంగపోయింది.
ఓ అంతర్జాతీయ ముఠా ఆటపట్టించే అవకాశాన్ని తనకిచ్చిన ఆ ప్రభుత్వోద్యోగిని మనసులో అభినందించుకుంటూ అతడు రామేశ్వరమూర్తి ఇంటికి బయల్దేరాడు.
-:అయిపోయింది:-
