అది మా ముఠా హోటలన్న విషయం నీకు తెలియదు. విల్సన్ సర్వర్ కి చెప్పి నీకిచ్చే మంచినీళ్ళలో మత్తుమందు కలిపించాడు. నా అనుచరులిద్దరూ నిన్నిక్కడికి తీసుకుని వచ్చారు. మొదట నేను నిన్ను పోలీసుల మనిషని అనుమానించాను. తీరా చూస్తే నీది మారువేషమని తేలింది. సుజాత హత్య గురించిన ఆరా ఈలోగా కొంత తెలిసింది. నువ్వే ఆ హంతకుడివని తెలియగానే నా అదృష్టాన్ని నేనే అభినందించుకున్నాను-...."
మొత్తం జరిగినదంతా కిల్లర్ కర్ధమయింది.
"ఇప్పుడు నాకంతా తెలిసింది విల్సన్ నిన్ను మోసగించాడు....." అన్నాడు కిల్లర్.
"విల్సన్ నాకు నమ్మకమైన మనిషి అతడు నన్ను మోసగించడు...."
"నమ్మినవాళ్ళనే యెవరైనా మోసగించగలరు. ఆ తాళపత్రగ్రంథాలవల్ల నీకు డెబ్బైలక్షలు వస్తాయంటున్నావు. అందులో విల్సన్ భాగమెంత?" అన్నాడు కిల్లర్.
"యాభై వేలు....."
"చాలాకాలంగా ఈ వ్యవహారాలు తెలిసిన విల్సన్ యే అయిదులక్షలకో ఆ తాళపత్రగ్రంథాల నమ్మేస్తే?"
వినీల్ ముఖంలో రవంత కలవరం కనపడింది-"నువ్వు నాలో అనుమానబీజాలు నాటలని చూస్తున్నావు. నిజానిజాలు తెలుసుకోగల లైడిటెక్టర్ నా దగ్గరుంది-" అన్నాడతడు.
"అయితే యింకేం? నీ లైడిటెక్టర్ తో విల్సన్ ని పరీక్షించుకో-"
"నావాళ్ళని నేను పరీక్షించను. నువ్వు చెప్పేది నిజమో కాదో నా డిటెక్టర్ తేలుస్తుంది. నువ్వు నిజమే చెబితే విల్సన్ మోసం చేసినట్లు.....లేకుంటే...." అని ఆగాడు వినీల్.
"లేకుంటే?" అన్నాడు కిల్లర్.
"నా విషసర్పం నిన్ను కాటేస్తుంది...." అన్నాడు వినీల్.
కిల్లర్ వళ్ళు జలదరించింది.
వినీల్ మళ్ళీ చప్పట్లు కొట్టాడు.
నల్లటి ఆరడుగుల మనిషి వచ్చి వినీల్ అడిగిన ఓ చిన్న సాధనం తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు.
పాకెట్ టేపురికార్డరంత సాధనం అది.
దానిపై పియానో టైపు మీటలు నాలుగున్నాయి.
వినీల్ ఒకమీట నొక్కగానే-దానిపై స్టీరియో కాసెట్టే డెక్స్ లో వెలిగినట్లు ఒక పచ్చ చుక్క, ఒక ఎర్రచుక్క వెలిగాయి.
వినీల్ కిల్లర్ తో-"నువ్వు మాట్లాడ్డం ప్రారంభించు" అన్నాడు.
"ఏం మాట్లాడాలి?" అన్నాడు కిల్లర్.
అప్పుడే వినీల్ రెండవ మీటను నొక్కాడు-"ఇప్పుడది నీ గొంతుకు అనుకూలమయింది. నువ్వేం మాట్లాడినా ఈ పరికరం వింటుంది. నువ్వు చెప్పేది నిజమైతే నీ స్వరానికి అనుగుణంగా వరుసగా ఆకుపచ్చ చుక్కలు మెరుస్తాయి. అబద్ధం చెబితే ఎర్రచుక్కలు మెరుస్తాయి. హరిహరాదులెదురొచ్సినా ఈ పరికరం అబద్దమాడదు. తప్పు చేయదు. ఇప్పుడు నీ వివరాలు చెప్పు....."
కిల్లర్ ఆశ్చర్యంగా ఆ యంత్రంవంక చూశాడు. ఒక్కక్షణమాగి-"నా పేరు వెంకన్న, నేనొక ప్రయివేటు డిటెక్టివ్ ను....." అన్నాడు.
అతడు వెంకన్న అనగానే పరికరంలో వరుసగా యేడు ఎర్రచుక్కలు వెలిగాయి. ప్రయివేటు డిటెక్టివు ననగానే వరుసగా ఏడు ఆకుపచ్చ చుక్కలు వెలిగాయి.
"పరికరాన్ని పరీక్షించినట్లున్నావు. అలాంటి పనులు చేయడంవల్ల నీకే ప్రమాదం. ముందు విల్సన్ గురించి చెప్పు నువ్వు మాట్లాడేటప్పుడు ఎర్రదీపం వెలిగిందా-నా పెంపుడు పాము కాటందుకుంటుంది-" అంటూ పరికరానికి విల్సన్ మరో మీట నొక్కేడు.
"అంతే!
టీపాయ్ మీద ఆడుతున్న తాచుపామిప్పుడు కిల్లర్ వైపు తిరిగింది.
అది అతడినే గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుంది.
కిల్లర్ దృష్టి ఇప్పుడు టీపాయ్ మీదనే వుంది.
లైడిటెక్టర్, తాచుపాము-ఒక దానికొకటి పక్కన వున్నాయి.
మనిషి అబద్ధం చెప్పేటప్పుడతడికా విశేషం తెలుస్తుంది. తను అబద్ధం చెబుతున్నానన్న భావం అతడిని తడబడేలాచేస్తుంది. అప్పుడతడి నరాల కంపన వేరే విధంగా వుంటుంది. స్వరగతులు మారతాయి అది మామూలు మనుషులు కనిపెట్టే తేడాకాదు లై డిటెక్టర్సు ఈ మాత్రం ఆధారంగా పనిచేస్తాయి. తన యెదుట నున్న లైడిటెక్టర్ స్వరగతులనుబట్టి అబద్దాలను తెలుసుకుంటుందన్న మాట!
కిల్లర్ కు అవసరపడినప్పుడబద్ధాలు చెప్పడంలో తానగ్రగణ్యుడినని నమ్మకం తడబడకుండా అబద్ధాలు చెప్పగలననుకున్న అతఃది నమ్మకాన్నీ పరికరం అబద్ధం చేసింది. చాలా సునిశితమైన యంత్రమయుండాలది.
ఇప్పుడబద్ధం చెబితే తన ప్రాణాలకే ప్రమాదమని కిల్లర్ కి తెలుసు.
అతడు గొంతు సవరించుకొని గత దినం విల్సన్ తో తనకు జరిగిన అనుభవం చెప్పసాగాడు.
కిల్లర్ మాట్లాడుతూంటే లైడిటెక్టర్లో వరుసగా ఆకుపచ్చ చుక్కలు వెలిగి ఆరుతున్నాయి. ఆ చుక్కలతడి మాటలకనుగుణంగా నాట్యం చేస్తున్నట్లుంది. ఆ పక్కనే చుక్కల కనుగుణంగా తాచుపాము ఆడుతోంది.
కిల్లర్ జరిగింది జరిగినట్లు చెప్పడమయ్యేసరికి వినీల్ లో పెద్ద మార్పు వచ్చింది.
అతడు చప్పట్లు కొట్టాడు.
ఆరడుగుల నల్లనివాడు వచ్చాడు. వినీల్ అతడికేదో చెప్పాడు. అతడు వెళ్ళిపోగానే లైడిటెక్టర్ని ఆఫ్ చేశాడు.
కిల్లర్ తృప్తిగా నిట్టూర్చాడు.
"చూశావా-నేను నిజమే చెప్పాను. అనవసరంగా నన్ననుమానించావు...." అన్నాడతడు.
"నువ్వు మాట్లాడకు...." అన్నాడు వినీల్ అతడు ప్లాస్టిక్ డబ్బామీద మూతపెట్టాడు.
కిల్లర్ మరింత తేలికగా నిట్టూర్చాడు.
"విల్సన్ చేసిన పొరపాటువల్ల అనవసరంగా నీవంటి వాడికి మా స్థావరం తెలిసిపోయింది. ఈ కేసుతో నీ సంబంధమూలేదు. అయినా విల్సన్ స్వార్ధంతో మమ్మల్ని మోసగించి-ఆ మోసం నీవల్ల జరిగినట్లు భ్రమలో వుంచాలనుకున్నాడు నన్ను అందుకు ఫలితమనుభవిస్తాడు...." అన్నాడు వినీల్.
"నా అమాయకత్వాన్ని గ్రహించావు. అదే నాకు సంతోషం-" అన్నాడు కిల్లర్.
"నువ్వు మాట్లాడకు...." అన్నాడు వినీల్ తీవ్రంగా.
ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు.
సుమారు గంట గడిచేక ఆ హాల్లోకి విల్సన్ ప్రవేశించాడు.
"రా-విల్సన్-ఇలా వచ్చి కూర్చో-" అన్నాడు వినీల్. అతడు చూపిన ప్రకారం కిల్లర్ పక్కనే కూర్చున్నాడు విల్సన్.
"ఇతడి వివరాలు తెలుసుకున్నారా?" అన్నది విల్సన్ మొదటి ప్రశ్న.
"అతడు చెప్పేది ఆసక్తికరంగా వుంది. నువ్వుకూడా విను..." అన్నాడు వినీల్.
విల్సన్ కోసం కిల్లర్ మళ్ళీ తన కథ చెప్పాడు.
కథ పూర్తికాగానే విల్సన్ నవ్వి-"లై డిటెక్టర్లో ఇతడి కధలోని నిజానిజాలు తేల్చలేకపోయారా?" అన్నాడు.
"ఇతడి కథపై నీ అభిప్రాయమేమిటి?" అంటూ లై డిటెక్టర్ ఆన్ చేశాడు వినీల్ విల్సన్ మాట్లాడ్డం ప్రారంభించగానే మరో రెండు మీటలు నొక్కాడు.
"అంతా శుద్ధ అబద్ధం-" అన్నాడు విల్సన్.
