Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 75


    "నా పేరు కిల్లర్. నేనొక ప్రయివేటు డిటెక్టివుని" అన్నాడు కిల్లర్.
    "వెరీగుడ్.....ఇంకా చెప్పు...."
    "నన్ను చంపాలనుకుంటే మనుషుల్నే లెక్కచేయను. ఇంతవరకూ నన్ను చంపాలనుకున్న వారందరూ చచ్చారు. ఆ విషయం నీ పెంపుడు పాముకు అర్ధమయేలా చెప్పు...."
    "నా పెంపుడు పాముకు చావులేదు-" అన్నాడు వినీల్.
    "పుట్టిన ప్రతి జీవికీ చావుంటుంది......"
    "జీవికి చావుంటుంది. కనీ యంత్రానికి కాదు....."
    "అంటే?"
    వినీల్ వివరించాడు. ఎదురుగా ప్లాస్టిక్ డబ్బాలో వున్న పెంపుడు పాముకు ప్రాణంలేదు. కానీ తుపాకీ గుళ్ళకూ ప్రేలుడు పదర్ధలకూ లొంగని ప్రత్యేకమైన పోలిమర్సుతో తయారుచేయబడిందది. తనలో జీవం లేక పోయినా జీవమున్న వారి జీవాలు హరించగల విషం దానిలో వుంటుంది.
    ఆ పాము ఎదుట వుండగా వినీల్ ని తనేమీ చేయలేడని కిల్లర్ గ్రహించాడు.
    "వెరీగుడ్! హేట్సాఫ్ టూ యువర్ డిస్కవరీ!" అన్నాడు కిల్లర్.
    "పొగడ్తలతో నిన్ను నీవు రక్షించుకోలేవు-...." అన్నాడు వినీల్.
    "పోనీ-ఎలా రక్షించుకోగలనో చెప్పు-...." అన్నాడు కిల్లర్.
    "తాళపత్ర గ్రంథాలు నాకిచ్చేస్తే నీ ప్రాణాలు రక్షించబడతాయి....."
    "తాళపత్ర గ్రంథాలేమిటి?" అన్నాడు కిల్లర్.
    "సుజాత ఇంట్లోంచి నువ్వు తీసుకున్నవి....."
    కిల్లర్ ఆశ్చర్యపోయి-"సుజాత నీకు తెలుసా?" అన్నాడు.
    "ఊఁ! సుజాత నా మనిషి!" అన్నాడు వినీల్.
    "పాపం - ఆమె చచ్చిపోయింది....." అన్నాడు కిల్లర్.
    "నువ్వే ఆమెను చంపేశావ్!" అన్నాడు వినీల్.
    "ఎవరు చెప్పారు నీకు?"
    వినీల్ చప్పట్లు కొట్టాడు.
    అప్పుడు దూరాన్నుంచి ఓ నల్లటి మనిషి వచ్చాడు.
    అతడు ఆరడుగుల ఎత్తులో కండలు తిరిగి బలిష్టంగా వున్నాడు.
    అతడి చూపుల్లో క్రూరత్వం తప్ప మరో భావంలేదు.
    ఆ వ్యక్తి వినీల్ ని సమీపించి దగ్గరగా వంగాడు.
    వినీల్ అతడి చెవిలో ఏదో చెప్పాడు. ఆ మనిషి వెళ్ళిపోయాడు.
    "ఎవరతడు?" అన్నాడు కిల్లర్.
    "ఈ యింటి కాపలావాడు. ఇంట్లోంచి నన్ను తప్పయెవర్నీ నా అనుమతి లేకుండా బయటకు వెళ్ళనివ్వడు."
    "నేను వెడతానంటే ఏం చేస్తాడు?"
    "వద్దంటాడు....."
    "వినకపోతే?"
    "వారిస్తాడు....."
    "లెక్క చేయకపోతే?"
    "చంపేస్తాడు...." చాలా తాపీగా అన్నాడు వినీల్.
    "చంపలేకపోతే?"
    "నాకు తెలియదు....."
    "తెలుసుకోవడం మంచిది...." అన్నాడు కిల్లర్.
    "తెలుసుకోవాలని నాకూ వుంది. కానీ నాకా అవకాశం రావాలి గదా! ఇంతవరకూ ఈ యింటినుంచి పారిపోవాలని ప్రయత్నించినవారు ముగ్గురు. ముగ్గురికి ముగ్గురూ చచ్చారు....."
    కిల్లర్ యేదో అనాలనుకున్నాడు. ఈలోగా అతడు వచ్చాడు. అతడి చేతిలో పేపరుంది.
    వినీల్ పేపరు తీసుకుని అతణ్ణి వెళ్ళిపొమ్మని సైగ చేశాడు.
    అతడు వెళ్ళిపోయాడు.
    వినీల్ పేపర్ని కిల్లర్ కిచ్చాడు.
    టీపాయ్ మీది తాచుపాము ముందు వినీల్ వైపుకి వంగింది. అతడి చేతిలోని పేపరు చేతులు మారుతూంటే తనూ పేపరుతో పాటు కిల్లర్ వైపు వంగింది.
    కిల్లర్ దాన్ని గమనిస్తూనే ఉన్నాడు.
    సెకండ్లో వెయ్యోవంతు చాలు-ప్రాణం పోవడానికి!    
    అతడు పేపరు చూశాడు.
    మొదటి పేజీలో అతడి బొమ్మ బొమ్మకింద వివరాలను బట్టి అతడు పారిపోయిన హంతకుడు.
    "సుజాత మా మనిషి మాదొక అంతర్జాతీయ ముఠా. ఆమె మాక్కావలసిన కీలకమైన రహస్యాలు తెలుసుకుని వాటిని తాళపత్రగ్రంథాల రూపంలో పొందుపరుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా వుండడంకోసం ఆమెవద్ద పురాతన తాళపత్ర గ్రంధాలు కూడా కొన్ని వున్నాయి. ఇటీవల ఆమె కొన్ని ముఖ్య రహస్యాలు తెలుసుకుంది. వాటిని విల్సన్ అనబడే మరో మా మనిషికందజేయాలి. ఆమె అందజేసే తాళపత్రగ్రంథాల విలువ నలభైకోట్ల రూపాయలు. అంతర్జాతీయంగా అందరూ పంచుకోగా నా ఒక్కడికే డెబ్బై లక్షల రూపాయలు వస్తుంది. అంతవిలువైన వాటిని నువ్వు-విల్సన్ కంటే ఒకరోజు ముందే దక్కించుకున్నావు....." అన్నాడు వినీల్.
    "ఇప్పుడు నాకు కొంత కధ అర్ధమవుతోంది-" అన్నాడు కిల్లర్.
    తాచుపాము టీపాయ్ మీద ఆడుతోంది.
    "వెరీగుడ్-నీకర్ధమయిందేమిటో చెప్పు-" అన్నాడు వినీల్.
    "విల్సన్ సుజాత నేందుకు చంపాడా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడసలు కథ తెలిసింది."
    "స్టాప్ నాన్సెన్స్!" కోపంగా అరిచాడు వినీల్.
    టీపాయ్ మీద తాచుపాము బుస్సుమంది.
    "నేను నిజమే చెబుతున్నాను. పూర్తిగా విను....." అన్నాడు కిల్లర్.
    వినీల్ కోపాన్ని నిగ్రహించుకొని-"ఊఁ చెప్పు-" అన్నాడు.
    కిల్లర్ విల్సన్ తన్ను కలుసుకొని ఎలా ట్రాప్ చేసిందీ చెప్పాడు.
    "ఇంపాజిబుల్!" అన్నాడు వినీల్.
    "జరిగింది చెప్పాను. అసాధ్యమైతే నేనేం చేయను?"
    "జరిగింది నేను చెబుతాను. శ్రద్దగా విను-" అన్నాడు వినీల్.
    "ఊఁ" అన్నాడు కిల్లర్.
    "ఈరోజు విల్సన్ సుజాతను కలుసుకొని తాళపత్రగ్రంథాలు సేకరించాలి. కానీ ఈ విషయం నీకెలాగో తెలిసింది. నిన్ననే వెళ్ళావు సుజాతను హత్యచేశావు. తాళపత్రగ్రంథాలకోసం వెతకడంలో ఆలస్యం జరిగింది. పోలీసులు వచ్చారు. తప్పించుకొని పారిపోవాలనుకున్నావు పారిపోయావు......"
    "పోనీ అదే నిజమనుకున్నా-తాళపత్రగ్రంథాలు నాకు చిక్కలేదు....."
    "చిక్కకపోతే నేనాశ్చర్యపోను. కానీ ఆ విషయం ధృవపడడానికి నాకు వ్యవధి కావాలి. సుజాతింటికి ప్రస్తుతం పోలీసు కాపలా వుంది. అంతవరకూ నిన్ను నా బందీగా వుంచుకోక తప్పదు....." అని నవవాడు వినీల్-"ఈలోగా తప్పించుకోవాలనుకుంటే ఒకే ఒక్క ఉపాయం, తాళపత్రగ్రంథాలెక్కడ దాచిందీ నాకు చెప్పు....."
    "ఆ విషయం నాకంటే విల్సన్ కే బాగా తెలుస్తుంది. ఇంతకీ నేను నీకెలా దొరికాను?"
    "నీ ప్రవర్తనే నిన్ను పట్టిచ్సింది-" అన్నాడు వినీల్-"సుజాత హత్య గురించి మాకెవ్వరికీ తెలియదు. విల్సన్ మామూలుగా నిర్ణీత సమయానికి సుజాత ఇంటికి వెళ్ళాడు. అక్కడ సెంట్రీని చూసి ఆశ్చర్యపడ్డాడు. విషయం తెలిసేక అక్కణ్ణించి బయటపడ్డాడు. అప్పుడు నువ్వతన్ని అనుసరించడం మొదలుపెట్టావు. అయితే మాది అంతర్జాతీయ ముఠా విల్సన్ ఊళ్ళో అడుగుపెట్టగానే అతడికే ప్రమాదమూ రాకుండా రక్షించడానికి నలుగురు అంగరక్షకులు కూడా బయల్దేరారు. వారు నిన్ను కనిపెట్టారు. విల్సన్ కూడా నీ వ్యవహారం గమనించాడు. అందుకే హోటల్లోకి అడుగుపెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS