కిల్లర్ కి దాహంగా వుంది.
మండుటెండలో నడిచి వచ్చాడు.
ఓరకంట విల్సన్ ని గమనిస్తూనే అతడు మంచినీళ్ళ గ్లాసందుకున్నాడు. ఒక గుక్కెడు నీళ్ళు తాగాడు. గొంతులో హాయిగా అనిపించింది.
వేసవిలో చల్లని నీరు అమృతప్రాయం.
గ్లాసుడు నీళ్ళూ తాగేశాడు కిల్లర్.
అతడి యెదుట కూర్చున్నవారిద్దరూ మళ్ళీ కిల్లర్నే శ్రద్దగా గమనించసాగారు.
కిల్లర్ కుర్చీలో వెనక్కు జారగిలబడ్డాడు. ఓరకంట విల్సన్ని గమనిస్తూ కళ్ళు మూసుకున్నాడు.
కొద్దిక్షణాల్లో అతడి తల పక్కకు వాలిపోయింది.
అప్పుడతడి ముందున్న వ్యక్తులిద్దరూ లేచి నిలబడ్డారు. కిల్లర్ని సమీపించారు.
కిల్లర్ కుర్చీలో నిద్రపోతున్నవాడిలా వున్నాడు.
వారతన్ని కుదిపారు.
కిల్లర్ లేవలేదు.
ఇంతలో సర్వర్ అక్కడికి వచ్చాడు-"ఏం జరిగింది?" అన్నాడు.
"మా స్నేహితుడి ఆరోగ్యం బాగోలేదు. వద్దంటూంటే హోటలుకు వచ్చాడు. ఎందుకో కళ్ళు తిరిగాయి. అర్జంటుగా హాస్పిటలుకు తీసుకువెళ్ళాలి. దోసెల ఆర్డరు కాన్సిల్!" అన్నాడు వారిలో ఒకడు.
"అయ్యో! ముందతన్ని అర్జంటుగా హాస్పిటలుకు తీసుకొని వెళ్ళండి-" అన్నాడు సర్వర్.
ఈ సంభాషణ అక్కడ చాలామంది విన్నారు.
ఏమిటేమిటంటూ వారిచుట్టూ మూగారు.
ఆ యిద్దరూ జనాలకు విషయం చెప్పుకుంటూ కిల్లర్ని బయటకు తీసుకొని వెళ్ళారు. ఇద్దరు మనుషులకు కిల్లర్ భారంగానే వుండడం వల్ల సర్వర్ కూడా ఓ చేయి వేశాడు.
కిల్లర్ నడవడం లేదు.
అందుకని వాళ్ళతన్ని ఇంచుమించు ఈడ్చుకుంటూ వెళ్ళారు.
విల్సన్ అటువైపు కూడా చూడలేదు. ఏం జరిగిందీ పట్టించుకోలేదు.
అతడికి ఊతప్పం వచ్చింది. అది తింటున్నాడు.
హోటల్లోని కొందరు జనం బయటకు వెళ్ళారు.
కిల్లర్ ఓ టాక్సీలోకి తరలించబడ్డాడు. జనంవైపుకు ఆ యిద్దరిలో ఒకడు తిరిగాడు-"మీ సహాయానికి చాలా థాంక్స్!" అన్నాడు.
"మేమేం చేశాం-" అన్నాడు జనంలో ఒకడు.
"జరిగిందాలా చూశారు. అందుకు!" అన్నాడా యిద్దరిలో ఒకడు.
"అయితే?"
"అనవసరపు ప్రశ్నలతో విసిగించలేదు. చూసి ఊరు కున్నారు...." అంటూ అతడు టాక్సీ యెక్కాడు.
టాక్సీ రివ్వున దూసుకుని పోయింది.
విల్సన్ తాపీగా ఊతప్పం తింటూ ఓసారి తనలో తను నవ్వుకున్నాడు.
5
ఉన్నట్లుండి మెలకువవచ్చి చటుక్కున లేచి కూర్చున్నాడు కిల్లర్.
గదిలో ప్లాస్టిక్ నవారు స్టీలు మంచంమీదున్నాడు తను.
పైన ఫ్యాను తిరుగుతోంది.
కిల్లర్ ఓసారి కళ్ళు మూసుకొని ఏం జరిగిందో గుర్తుచేసుకుందుకు ప్రయత్నించాడు.
అంతా గుర్తొచ్చింది.
హోటల్లో మసాలాదోశ ఆర్దరిచ్చాడు తాను తిన్న గుర్తులేదు.
ఇక్కడికెలా వచ్చాడు?
కిల్లర్ లేచి గదంతా కలయతిరిగాడు.
మొజాయిక్ ఫ్లోరింగ్ నున్నగా వుంది. అతడి బూట్లు నేలపై జారిపోతున్నాయి.
కిల్లర్ గది గుమ్మందాకా వెళ్ళాడు. తలుపు తీయబోయాడు.
రాలేదు.
అప్పుడతడు తలుపులు దబదబా బాదాడు.
కొద్దిక్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి.
గుమ్మం అవతల ఓ వ్యక్తి నిలబడి వున్నాడు.
అయిదడుగుల మూడంగుళాల పొడవు....
పొడవుకు తగ్గ సన్నం.....
మనిషికి ముఫ్ఫైయేళ్ళపైనుండొచ్చు. కానీ ముఖంలో కుర్రతనం కనపడుతోంది.
చూపుల్ల్లో మాత్రం పరిణతి వుంది.
అతడు కిల్లర్ని చూసి నవ్వాడు.
ఆ నవ్వు అంతర్జాతీయ స్మగ్లర్స్ కే సాధ్యపడుతుంది.
కోల్డు బ్లడెడ్ స్మైల్ అది!
"మెలకువొచ్చిందా?" అన్నాడతడు.
"ఎవర్నువ్వు?" అన్నాడు కిల్లర్.
"చూపులకు చిన్నవాణ్ణి చేతలకు పెద్దవాణ్ణి నా పేరు ప్రస్తుతానికి వినీల్ అనుకో-" అన్నాడతడు నవ్వుతూ.
నవ్వకపోతే అతడు పసిబాలుడిలా వున్నాడు.
నవ్వినప్పుడు అంతర్థాతీయ స్మగ్లర్లా వున్నాడు.
"మిస్టర్ వినీల్-నాతో నీకేం పని?" అన్నాడు కిల్లర్.
"నిజానికి నీతో నాకేపనీ లేదు. కానీ నువ్వే పని కల్పించావు...."
"నేను కల్పించానా?" అన్నాడు కిల్లర్ ఆశ్చర్యపోతూ.
"నువ్వాశ్చర్యపోతే నువ్వు చాలా మంచి నటుడివని నేననుకుంటాను.....బయటకురా-నీతోప్ చాలా మాట్లాడాలి!" అన్నాడు వినీల్.
కిల్లర్ బయటకు వచ్చాడు.
అదొక చిన్న హాలు.
నెలంతా కార్పెట్ పరచివుంది.
మధ్యలో సోఫా!
గోడలకు ఖరీదైన పెయింటింగ్స్.....
ఇద్దరూ సోఫాల్లో యెదురెదురుగా కూర్చున్నారు.
ఇద్దరికీ మధ్య టీపాయ్ వుంది.
టీపాయ్ మీద చిన్న ప్లాస్టిక్ డబ్బా వుంది.
వినీల్ సోఫాలో వెనక్కు జారగిలబడి-"నేను నిన్నో ప్రశ్న అడుగుతాను. సూటిగా జవాబు చెప్పాలి" అన్నాడు.
"అడుగు-" అన్నాడు కిల్లర్.
"ఎవర్నువ్వు?" అన్నాడు వినీల్.
అంతవరకూ అతడి గొంతు ఒక విధంగా వుంది. అప్పుడు మరోలా ధ్వనించింది. కోల్డు బ్లడెడ్ వాయిస్ అది!
"నేనెవరో తెలియకుండానే ఇక్కడికి రప్పించావా?" అన్నాడు కిల్లర్.
"తెలుసుకుందుకే ఇక్కడికి రప్పించాను" అన్నాడు వినీల్.
"నాగురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకేముంది?" అన్నాడు కిల్లర్.
"నా ప్రశ్నలకు జవాబు చెప్పడం నీ బాధ్యత-ముందు నువ్వెవరో చెప్పు. చెప్పకపోతే....?" అని ఆగాడు వినీల్.
"చెప్పకపోతే?" కుతూహలంగా అడిగాడు కిల్లర్.
వినీల్ ముందుకు వంగి ప్లాస్టిక్ డబ్బా మూతతీశాడు.
కిల్లర్ ఉలిక్కిపడ్డాడు.
టీపాయ్ మీదున్న ప్లాస్టిక్ డబ్బాలోంచీ బస్సుమంటూ నల్లటి తాచుపాము పడగఎత్తి ఆడుతోంది.
తాచుపాము అటూ ఇటూ కదుల్తోంది. డబ్బాలోంచి బయటకు రావడంలేదు.
"ఏమిటిది?" అన్నాడు కిల్లర్.
"ఈ పాము కాటేస్తే సెకన్లో వెయ్యోవంతులో మనిషి ప్రాణం పోతుంది-...."
కిల్లర్ తేలిగ్గా నవ్వి-"ఇంతవరకూ ఇది నిన్ను కాటేయలేదా?" అన్నాడు.
"ఇది నా పెంపుడు పాము నన్ను తప్ప ఎవరినైనా కాటేస్తుంది....."
కిల్లర్ తాచుపాము వంకే చూస్తున్నాడు. అది తమాషాగా ఆడుతోంది.....
