Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 73


    రమ మాట్లాడకుండా స్టాండుమీద బట్టలు తీసుకుని పక్క గదిలోకి వెళ్ళింది.
    "ఏమయింది నీకీ రోజు?" అంటూ భర్తామె ననుసరించాడు.
    "నాకు మరీ దగ్గరగా రాకండి రాకుండా వుండలేననుకుంటే స్నానం చేసి రండి-" అంది రమ.
    అతను వెంటనే స్నానానికి వెళ్ళాడు.
    తప్పించుకునేందుకు కిల్లర్ కాసమయం చాలు.
    అతడికా సమయమివ్వాలనే రమకూడా అనుకుంది.
    కిల్లర్ తన బట్టలు విప్పి మంచం కిందకు తోశాడు.
    స్టాండుమీద రమ భర్త లుంగీ ఒకటి వేసుకున్నాడు.    పైన లాల్చీ ధరించి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు.
    ముందుగా అతడు మొబైల్ వ్యాన్ దగ్గరకు వెళ్ళాడు. లోపల పూర్తిగా వేషం మార్చుకుని-బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు.
    పోలీసులవద్ధ తన ఫోటో వుంది. ఆ ఫోటోకి ప్రచారం లభిస్తే తన మొబైల్ వ్యాన్ మీద అందరి దృష్టీపడుతుంది.
    ఈలోగా తను దారి వెతుక్కోవాలి.
    కిల్లర్ మొబైల్ వ్యాన్ లో రామేశ్వరమూర్తి ఇంటికి వెళ్ళాడు.
    రామేశ్వరమూర్తి కిల్లర్ వలన ప్రయోజనం పొందిన భాగ్యవంతుడు.
    ఆయన కిల్లర్ ద్వారా జరిగిందంతా విన్నాడు.
    "మీ వ్యాన్-నా గ్యారేజీలో రహస్యంగా దాచబడుతుంది. మీరు నిశ్చింతగా వుండండి-" అన్నాడు రామేశ్వరమూర్తి.
    కిల్లర్ నిట్టూర్చి ఆయనవద్ద సెలవు తీసుకున్నాడు.
    
                                   4

    విశాల ప్రపంచంలో యేకాకిగా తిరుగుతున్నట్లుంది కిల్లర్ కి.
    ఇలాంటి పరిస్థితి అతడికెప్పుడూ ఏర్పడలేదు.
    చట్టం దృష్టిలో తాను హంతకుడు.
    హతురాలు సుజాత.
    ఆమె యెవరో అతడికి తెలియదు.
    తానిపుడు విల్సన్ ని పట్టుకొని సాధించాలి.
    విల్సన్ యెవరో ఎక్కడుంటాడో అతడికి తెలియదు.
    ఎలా వుంటాడో మాత్రం తెలుసు.
    విల్సన్ గురించి తెలుసుకోవాలంటే సుజాత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. అందుకు తన మారువేషం బాగా సహకారిస్తుంది.
    ఎందుకైనా మంచిదని ఆ రోజు అతడు సుజాత వుండే వీధికి వెళ్ళలేదు.
    మర్నాడు మధ్యాహ్నం మండుటెండలో అతడా వీధిలోకి వెళ్ళాడు.
    మళ్ళీ ఆ వీధి నిర్మానుష్యంగానే వుంది.
    ఎవరింటికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ కిల్లర్ నడుస్తూండగా సుజాత ఇంటిముందు మాటలు వినిపించాయి.
    చటుక్కున పక్కకు తిరిగాడతడు.
    సుజాత ఇంటికి తాళం వేసివుంది. గుమ్మం దగ్గర కూర్చుని వున్నాడు సెంట్రీ.
    ఒక వ్యక్తి సెంట్రీని సుజాత గురించి అడుగుతున్నాడు.
    సెంట్రీ అతడికి ఆమె హత్య గురించి చెప్పి-"మీకామెతో ఏమిపని?" అన్నాడు.
    అతడు జేబులోంచి పాతికరూపాయలుతీసి-"ఇవి నేనామెకు బాకీ వున్నాను. మంచి అవసరంలో ఈ డబ్బిచ్చి నన్నాదుకుందామె. పుణ్యాత్మురాలు. ఇలా యెంతోమందిని ఆదుకుంది. డబ్బు తిరిగివ్వాలని వచ్చాను. ఈ డబ్బు ఆమె పేరు చెప్పి నువ్వే వుంచుకో.....ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది-" అని వెనక్కు తిరిగాడతడు.
    అతడెవరో సుజాతకు బందువయుండాలి. ఆమె హత్య గురించి ఆ బంధువుకి తెలిసి వుండదు. రాగానే సెంట్రీ ద్వారా విషయం తెలుసుకున్నాడు. హత్య కేసులో సాక్షిగా ఇరుక్కోవాలని  భయపడ్డాడు. ఏదో వంకన సెంట్రీకి పాతిక రూపాయలిచ్చి తప్పించుకావాలనుకుంటున్నాడు. పాతిక రూపాయలు సెంట్రీకి తక్కువ మొత్తంకాదు.
    తనావ్యక్తి ననుసరించాలనుకున్నాడు కిల్లర్.
    అయితే వెనక్కు తిరిగిన ఆ వ్యక్తిని చూసి తెల్లబోయాడతడు.
    అతడు విల్సన్!
    విల్సన్ సుజాతను హత్యచేశాడు. మళ్ళీ యెందుకొచ్చాడు?
    ఇంటికి పోలీసు కాపలా వుంటుందని అతడూహించలేడా?
    కిల్లర్ తను కూడా సుజాత ఇంటివైపు నడిచి సెంట్రీని పలకరించి-"రామాలయం వీధి అంటే ఇదేనా?" అనడిగాడు.
    "ఊరికి కొత్తలాగున్నావు. రామాలయం వీధి ఊరికి ఆ చివరుంది. నువ్వీ చివర్లో వున్నావు-" అని నవ్వాడు సెంట్రీ.
    కిల్లర్ కంగారుపడ్డవాడిలా వెనక్కు తిరిగాడు.
    ఆ తర్వాత నుంచి విల్సన్ ని అనుసరించసాగాడు.
    విల్సన్ వెనక్కు తిరక్కుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు.
    కిల్లర్ మెదడులో రకరకాల ఆలోచనలు.....
    విల్సన్ తన్ను చూశాడా? గుర్తుపట్టాడా?
    అసలతడు మళ్ళీ సుజాతింటికెందుకు వచ్చాడు?
    కిల్లర్ ఆలోచనల్లో ప్రశ్నలేకాని జవాబులు లేవు.
    విల్సన్ కాలినడకనే ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు.
    అలా యిద్దరూ చాలాదూరం వెళ్ళారు.
    మండుటెండ కిల్లర్నీ రోజూ బాధించడంలేదు.
    అతడి ఆలోచనలనిండా విల్సన్.....
    కిల్లర్ చూస్తూండగా విల్సన్ ఓ హోటల్లోకి దూరాడు.
    కిల్లర్ కూడా ఆ హోటల్లోకి వెళ్ళాడు.
    విల్సన్ ఓ సీట్లో కూర్చున్నాడు.
    కిల్లర్ తనకు విల్సన్ కనబడేలా ఓ సీట్లో కూర్చున్నాడు.
    సర్వర్ విల్సన్ దగ్గరకు వెళ్ళాడు.
    కిల్లర్ జరుగుతున్నది చూస్తున్నాడు.
    ఏదో రహస్యం వింటున్న వాడిలా సర్వర్ విల్సన్ వైపు వంగాడు.
    విల్సన్ అతడి చెవిలో యేదో చెప్పాడు.
    సర్వర్ తలాడించి లోపలకు వెళ్ళిపోయాడు.
    కిల్లర్ కీ చాలా ఆశ్చర్యమయింది.
    విల్సన్ సర్వర్ చెవిలో ఏం చెప్పాడు?
    అతడు తన్ను గమనించాడా? లేక సర్వర్ అతడికి తెలుసా?
    ఎందుకో అంతవరకూ తనను విల్సన్ గమనించి వుండడంటే కిల్లర్ కి నమ్మకం కుదరడంలేదు.
    "ఏం కావాలి సార్!" అన్న గొంతు వినబడి ఈ లోకానికి వచ్చాడు కిల్లర్.
    ఎదురుగా సర్వర్!
    సర్వర్ చేతిలో ట్రే వుంది. ట్రేలో మంచినీళ్ళ గ్లాసులు మొత్తం మూడున్నాయి.
    సర్వర్ మూడు గ్లాసులూ టేబిల్ మీద పెట్టాడు.
    అప్పుడు చూశాడు కిల్లర్.
    అతడికెదురుగా మరో ఇద్దరు వ్యక్తులు కూర్చుని వున్నారు.
    వాళ్లతడివంకే పరీక్షగా చూస్తున్నారు.
    వాళ్ళ చూపులు కిల్లర్ కి మామూలుగా అనిపించలేదు. అయినప్పటికీ చూపులు కలవడంవల్ల పలకరింపుగా నవ్వాడు.
    వాళ్ళిద్దరూ ఇబ్బందిగా నవ్వి చూపులు మరల్చుకున్నారు.
    "ఏం కావాలి సార్?" సర్వర్ మళ్ళీ అడిగాడు.
    "మసాలాదోశ!"
    వాళ్ళిద్దరూ కూడా సర్వర్ కి మసాలాదోశలే ఆర్దరిచ్చారు.
    తన మాటలే ప్రతిధ్వనించినట్లు ఫీలయ్యాడు కిల్లర్.
    కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడతడివంక చూడ్డంలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS