Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 72


    ఆ విధంగా కిల్లర్ ఓ సందులోకి మలుపు తిప్పాడు.
    మోటారు సైకిళ్ళు మలుపు తిరగడానికి కొద్దిక్షణాల వ్యవధి వుంది.
    కిల్లర్ డ్రైవింగ్ సీటులోంచి రబ్బరు బంతిలా పక్కకు దూకాడు.
    పక్కన చిన్న ఇల్లుంది. ఇంటి తలుపులు దగ్గరగా వేసి వున్నాయి.
    ఒక్కక్షణంలో కిల్లర్ తలుపు తీసుకుని ఆ యింట్లో ప్రవేశించాడు.
    లోపల అతడికెవ్వరూ కనబడలేదు.
    కిల్లర్ తలుపులు దగ్గరగా వేసి సందులోంచీ బయటకు చూశాడు.
    రెండు మోటారుసైకిళ్ళు వీధిలోంచీ దూసుకుని పోయాయి.
    కిల్లర్ తృప్తిగా నిట్టూర్చి తలుపుకు గడియవేశాడు.
    ఏం జరుగుతుందో అతడికి తెలుసు.
    డ్రైవరు లేకుండా నే జీపు తిన్నగా పోతోంది.
    వీధి చాలా పొడుగైంది.
    వీధి చివర జీపు గోడకు గుద్దుకుంటుంది.
    అప్పుడు పోలీసులకసలు విషయం తెలుస్తుంది.
    ఏం జరిగిందీ అని ఆలోచిస్తారు-ఏం జరిగిందో స్ఫురించకపోదు.
    తాము చూస్తూండగా జీపులోంచెవరూ బయటకు దూకలేదు.
    ఏ యింటినుంచి జీపు తమ దృష్టిలో వున్నదీ వారు అంచనా వేస్తారు.
    సోదా ప్రారంభిస్తారు.
    ఈలోగా.....
    "ఎవరు నువ్వు?" అన్నదో గొంతు.
    కిల్ల వెనక్కు తిరిగాడు.
    అందమైన యువతి మనిషి పొడుగ్గా వుంది.
    అప్పుడే స్నానం చేసి వస్తోందేమో-వంటికి టర్కిష్ టవలు చుట్టుకుని వుంది.
    కనబడుతున్న వంటిమీద నీటిబిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.
    ఆమె పొడవైన మనిషికావడంవల్ల-తువ్వాలు శరీరంలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే దాచగలిగింది.
    అందువల్ల ఆమె చాలా ఆకర్షణీయంగా వుంది.
    "ఇంటి తలుపులు వేసుకోకుండా స్నానానికి వెళ్ళావు. నీ గురించి తెలుసుకోవాలని వచ్చాను-" అన్నాడు కిల్లర్.
    ఆమె ముఖం అదోలాగై పోయింది.
    "ఇక్కడ మావారు కూర్చుని వుండాలి...." అందామె.
    "మీవారా?" అన్నాడతడు-"నేను వచ్చేసరికి యెవరూ లేరు....."
    ఆమె ముఖంలో భయం కనబడింది-"ఎందుకో బయటకు వెళ్ళి వుంటారు. ఇప్పుడు నన్నూ నిన్నూ ఇలా చూస్తే పెద్ద గొడవవుతుంది-"అందామె.
    కిల్లర్ యేదో అనేలోగా యెవరో తలుపు తట్టారు.
    కిల్లర్ ఆ యువతిని సమీపించి-"నా వల్ల నీకేమీ ప్రమాదముండదు. నన్ను పోలీసులు తరుముతున్నారు. లోపల నేను దాక్కుంటాను. వచ్చింది పోలీసులే అయుంటారు. నా గురించి వాళ్ళడుగుతారు. ఏమీ తెలియదని చెప్పు అప్పుడు నేను నీ భర్తకు తెలియకుండా ఈ యింట్లోంచి వెళ్ళిపోతాను.....లేదూ....." అని అర్దోక్తిలో ఆగి ఆమె బదులుకోసం యెదురుచూడకుండా లోపలకు వెళ్ళాడు.
    తలుపు మళ్ళీ యెవరో తట్టారు.
    "ఎవరూ?" అందామె.
    నేను-రమా!" అన్నదవతలగొంతు.    
    "మీతో ఇంకెవరైనా వున్నారా?"
    "లేరు....."
    రమ చప్పుడుకాకుండా గడియతీసి, బాగా వెనక్కు వెళ్ళి-"తలుపు తీశాను...." అంది గట్టిగా.
    బయట్నించి ఓ పొడుగాటి వ్యక్తి లోపలకు వచ్చాడు.
    ఏదో అనబోయి రమను చూసి ఆగిపోయాడు.
    "అలా చూడకండి. ముందు వీధి తలుపులు వేయండి" అంది రమ.
    అతడప్రయత్నంగా తలుపులు వేశాడు-"చాలా బాగున్నావు-" అన్నాడు.
    "మీరు చేసిన పనేమీ బాగోలేదు...." అంది రమ.
    "సారీ రమా! అనుకోకుండా సందులోకి వెళ్ళాను" అన్నాడతడు.
    "ఎందుకు?" అందామె.
    "నీకు తెలుసు!" అన్నాడతడు.
    రెండ్రోజుల క్రితం రెండవ ఆట సినిమాకు వెళ్ళి భార్యాభర్తలిద్దరూ తిరిగివస్తూండగా రమకు దొరికింది ఒక గాజు.
    అది బంగారపు గాజు కనీసం రెండు కాసుల బరువుంటుంది.
    ఆ గాజెవరిదో కూడా రమ వెంటనే గుర్తుపట్టింది.
    ఆ వీధిలోనే వుండే కామాక్షమ్మ దా గాజు.
    కామాక్షమ్మకు వంటినిండా బంగారం వీధిలో చాలా మంది ఆమెను చూసి అసూయపడుతూంటారు. వారిలో రమ కూడా ఒకతె!
    "కామాక్షమ్మ గట్టిది గాజెలా పారేసుకుందో!" అంది రమ.
    "పారేసుకుని వుండదు. దొంగలు పడివుంటారు. బహుశా ఇది దొంగాడు పారేసుకుని వుంటాడు-" అన్నాడు రమ భర్త.
    అది నిజమేనని మర్నాడు తెలిసింది.
    దొంగలు కామాక్షమ్మింట్లో ప్రవేశించి-అందరికీ మత్తుమందుతో స్పృహ పోగొట్టి నిలువు దోపిడీ చేసి పోయారు.
    ముందు రమ గాజును వెనక్కిచ్చేయాలనుకుంది. కానీ అందువల్ల లేనిపోని యిబ్బందులొస్తాయని భర్త భయపడ్డాడు. ఆ గాజును వారు తాత్కాలికంగా ఇంటి పక్క సందులో దాచారు-ఒక రాత్రిపూట.
    ఆ సందులోకి జనం వెళ్ళడం అరుదు. అయినా రమ భర్త అప్పుడప్పుడా గాజును చూసుకుని వస్తూంటాడు. ఇంట్లో దాచాలంటే భయం.
    భార్య స్నానానికి వెళ్ళినప్పుడతడు గాజు చూడ్డానికి వెళ్ళాడు.
    "దేనికైనా సమయముంటుంది. నేనేమో బాత్రూంలో ఉన్నాను. అలాంటి సమయంలో ఇంట్లో యెవరైనా చొరబడితే-....." అంది రమ.
    "నా యింట్లో నేను లేకుండా యెవరూ చొరబడరు. నిన్ను మాత్రం ఇలా చూస్తూంటే చాలా బాగున్నావు" అంటూ భర్త రమను సమీపించాడు.
    భర్త చొరవతీసుకుంటాడని రమ ఊహించింది. అయితే ఇంట్లో వేరే మనిషి వున్న విషయం భర్తకు తెలియదు. చెప్పలేదు.
    "నేను పక్కగదిలోకి వెడతాను. నా బట్టలు తెచ్చిపెట్టండి-" అందామె.
    "ఏం బెడ్రూంకి వెళ్ళి కట్టుకోవచ్చుగా-" అన్నాడు భర్త.
    బెడ్రూంలోనే కిల్లర్ వున్నాడు. రమ ఏం చెప్పాలో ఆలోచిస్తూండగా యెవరో వీధి తలుపు తట్టారు.
    రమ చటుక్కున బెడ్రూంలోకి వెళ్ళింది.
    అక్కడ ఆమెకు కిల్లర్ కనబడలేదు.
    ఏ బీరువా వెనకో, మంచంకిందో-ఆ గదిలోనే ఉండివుంటాడు కిల్లర్.
    అందుకే రమ బట్టలు మార్చుకోలేహ్డు. టర్కిష్ టవల్ ను వంటిచుట్టూ మరింత గట్టిగా బిగించుకుంది.
    ఆమె అలా నిలబడి వుండగానే యెంత వారిస్తున్నా వినిపించుకోకుండా-ఇన్ స్పెక్టరూ, సబ్ ఇన్ స్పెక్టరూ లోపలకు వచ్చారు.
    రమను తువ్వాలు ధరించి వుండగా చూసి తెల్లబోయి "సారీ!" అన్నారిద్దరూ యేక కంఠంతో.
    ఆ తర్వాత పోలీసులిద్దరూ ఇల్లు వెదకకుండానే వెళ్ళి పోయారు.
    పోలీసులు వెళ్ళగానే రమ భర్త లోపలకు వచ్చి-"ఎప్పటికీ బట్టలు మార్చుకోవేం? వళ్ళు కావరంగా వుందా?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS