
ఇద్దరూ బయలుదేరారు. రైల్వే స్టేషన్ చేరుకున్నారు. మొదట్లో బొంబాయి వెడదామనుకున్నారు. కాని తరవాత ఆ ఉద్దేశం మార్చుకొని హుబ్లీ వెళ్ళారు.
హుబ్లీ లో ఒక హోటల్లో గది తీసుకున్నారు. త్యాగరాజు దిగులు పడసాగాడు. ఇక ఏం చెయ్యాలి? ఎలా జీవితం సాగించాలి?
ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. రోజులేమో గడిచి పోతున్నాయి. నగలు ఒక్కొక్కటిగా హరించి పోతున్నాయి. నిజంగానే దిగులు పట్టుకుంది త్యాగరాజు కి. అతను చదివింది ఎస్.ఎస్.ఎల్.సి. వరకే. ఉద్యోగం కోసం ప్రయత్నించాడు . కాని ఫలితం శూన్యం.
ఒకరోజు.
భానూ, త్యాగరాజు బయటికి వెళ్లి వచ్చారు. హోటల్ మేడ మీది వెనక బాల్కనీ లో వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుతూ నిలబడ్డారు. అనుకోకుండా అతని దృష్టి కింద ఉన్న మైదానం మీద పడింది. ఉలికి పడ్డాడు.
కింద ఉన్న ఒక వ్యక్తీ వాళ్ళను ఆశ్చర్యంగా చూడసాగాడు. అతనెవరో త్యాగరాజు చూడసాగాడు. అతను భాను వాళ్ళ గ్రామానికి చెందిన వాడు. హుబ్లీ లో అతను రైల్వే లో పని చేస్తున్నట్టు త్యాగరాజు కి తెలుసు.
"భానూ, భానూ! లోపలికి రా" అంటూ ఆమెను లోపలికి తీసుకు వెళ్లాడు త్యాగరాజు.
"ఎందుకు?"
"కింద మీ ఊరి కేశవులు నుంచున్నాడు.
"అయ్యో! మనల్ని చూశాడా?'
"చూశాడు."
"కొంప మునిగింది! అతను మా నాన్నకు బాగా తెలుసు. ఊరికి జాబు వ్రాస్తాడెమో."
త్యాగరాజు ఆలోచిస్తూ నిలబడ్డాడు. చివరికి "వ్రాయని" అన్నాడు.
ఆనాడు శుక్రవారం. ఉద్యోగం కోసం త్యాగరాజు బయటికి వెళ్లాడు. చాలా చోట్లకి వెళ్లి , చాలామందిని కలుసుకుని, అలిసిపోయి గదికి తిరుగు ముఖం పట్టాడు. తన పరిస్థితి ఇలా తయారయినదే అని ఒక మూల దుఃఖం, బ్రతుకు తెరువు కనిపించలేదే అని మరోమూల కోపం అతనిలో బయలు దేరాయి. విరక్తి భావంతో హోటల్ గదిని చేరుకున్నాడు.
గదిలో మాటలు వినిపించటం తో అతను భయపడ్డాడు. ఆ గొంతు రాములుది! "ఇక్కడికి వచ్చాడా!" అనుకున్నాడు త్యాగరాజు. ఇది ఆ కేశవులు పనే అని ఊహించాడు.
లోపల రాములు భాణుని తిడుతున్నాడు. ఆ తిట్లను వినలేక పోయాడు. మెల్లగా లోపలికి వెళ్లాడు త్యాగరాజు.
రాములు తల పైకెత్తి త్యాగరాజుని చూశాడు.
"రండి, బావగారూ" అన్నాడు హేళనగా.
"వచ్చాను, బావమరిదీ!" అని బదులిచ్చాడు హేళనగా.
"ధనికుల ఇంటి పిల్లరా భానూ! దాన్ని లేవదీసుకు వచ్చేందుకు నీకెన్ని గుండెలున్నాయిరా?" అన్నాడు రాములు.
"ఆమె నా భార్య. నాతో కాక మరెవరితో వస్తుంది."
"భార్యా! ఎవ్వర్రా చెప్పింది, భార్య అని? వీదులూడ్చే దేవత్తయినా ఉంటె, దాన్ని పెళ్లి చేసుకో. నీ అంతస్తు కి అదే తగింది....భార్యట భార్య!" అరిచాడు రాములు.
ఈ కేకలు వినేసరికి భాను వెలవెలపోతూ అలాగే నిలబడింది.
"భానూ" అన్నాడు త్యాగరాజు. "తొందరగా వెళ్లి స్నానం చేసి రా. గది ఖాళీ చేసి, మనం బొంబాయి వెళ్లి పోవాలి. మ్....తొందరగా."
భాను ఆశ్చర్యపోయింది.
"వెళ్ళు. భానూ, తొందరగా" అన్నాడు త్యాగరాజు.
భాను గుడ్డలు తీసుకుంది. "అన్నయ్యా! నిన్ను బతిమాలు కుంటున్నాను. ఆయన్ని తిట్టకు. నేను అయన భార్యని. నేను నీ చేల్లెలన్న సంగతిని మరిచి పో" అని గదికి కొంచెం ఎడంగా ఉన్న స్నానం గదికి వెళ్ళింది భాను.
రాముల్ని లెక్క చెయ్యకుండా పెట్టె బేడా సర్దుకోవడం మొదలు పెట్టాడు త్యాగరాజు.
"ఎక్కడికి వెడతారండీ?' రాములు మళ్లీ హేళన చేస్తూ అడిగాడు.
"బొంబాయి కి."
"వెళ్ళగలవా? ఇక్కడికి పోలీసుల్ని పిలుచుకుని వచ్చి, నిన్ను అరెస్టు చేయిస్తాను."
"నాకేం భయం లేదు."
"మొట్టమొదట ఆ పెట్టేనీ, పడక చుట్ట నీ కింద పెట్టు, నిన్ను బయటికి పోనివ్వను" అన్నాడు రాములు.
"ఏమిట్రా మహా బెదిరిస్తున్నావు" అన్నాడు త్యాగరాజు. అతని జీవితంలో అదే మొదటిసారి రాముల్ని ఎదిరించి మాట్లాడటం.
"నువ్వీ గది విడిచి వెళ్ళడానికి వీల్లెడురా. నిన్ను పోలీసులకు హాండోవర్ చేస్తాను."
"చేసుకో. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు." అన్నాడు త్యాగరాజు.
రాములు లేచాడు. త్యాగరాజు చేతిలో ఉన్న గుడ్డల్ని లాగి దూరంగా విసిరి వేశాడు.
"రేయ్ , రాములూ!" అరిచాడు త్యాగరాజు.
"నాకు చెడ్డ కోపం , వస్తుంది."
"రానీ" అంటూ త్యాగరాజు పెట్టె లో సర్ది పెట్టిన గుడ్డల్ని బయటికి విసిరి వేశాడు రాములు.
ఆ మరుక్షణమే వాళ్ళిద్దరి చేతులూ కలిశాయి. రాములు ముప్పయ్యేళ్ళ వాడు. త్యాగరాజు కంటే బలవంతుడు. త్యాగరాజు ని కింద పడేసి కొట్టాడు.
త్యాగరాజు కి ఎక్కడ లేని కోపం వచ్చింది. రాములు బూట్సు కాళ్ళ ను పక్కకు నెట్టి లేచాడు. సంచీ లో ఉన్న చాకు తీసుకుని రాములు మీద పడ్డాడు.
కొన్ని నిమిషాలు గడిచాయి. రోజూతూ రొప్పుతూ త్యాగరాజు తన చుట్టూ చూశాడు. దేహాని కిరు వైపులా కత్తి గాయాలతో రాములు కింద పడి ఉన్నాడు. షాక్ తినడం వల్లనూ , నెత్తురూ కారిపోవడం వల్లనూ అతను మరణించాడు.
త్యాగరాజు కి గుండె గతుక్కుమంది. ఏమి తోచలేదు. నిలబడడమే కష్టమని పించింది. మనస్సు ఆగిపోయినట్లయింది. రాములు నాడి తాకి చూశాడు. నిశ్చలంగా ఉంది.
భయమా, దుఖమూ త్యాగరాజుని ఆవహించాయి. గోడకు అనుకుని నిలబడ్డాడు. తరవాత ఏదో ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా కనిపించాడు. రాములు మృత దేహాన్ని లాగి మంచం కిందికి తోశాడు. త్వరత్వరగా పెట్టె, పడక చుట్ట మొదలైనవి తీసుకున్నాడు. గది ఖాళీ చేసి వరండాలోకి వచ్చాడు. గదికి తాళం వేశాడు.
ఆ లోపల భాను స్నానం చేసి, గుడ్డలు మార్చుకుని అక్కడికి రావడానికి సరిపోయింది. త్యాగరాజు గది ఖాళీ చేసి, తాళం వేస్తూ ఉండడం చూసి, "మా అన్నయ్య ఎక్కడ?" అని అడిగింది.
"బయటికి వెళ్లాడు" అన్నాడు త్యాగరాజు.
తరవాత వాళ్ళిద్దరూ పట్టణం లోని మరొక హోటల్ కి వెళ్లారు.
రాత్రి అయింది. త్యాగరాజు భోజనం చెయ్యలేదు. అతని పరిస్థితి ని చూసి భాను ఆందోళన చెందింది. ఆమె కేమీ తోచలేదు.
త్యాగరాజు మధన పడసాగాడు. 'హత్య జరిగింది. ఇప్పుడెం చెయ్యను?పోలీసులు వచ్చేస్తారు. నాకు ఉరిశిక్ష్' అనుకున్నాడు. ఒళ్ళు వణికి పోయింది. ముఖం న్నిప్పంటు కున్నట్టుగా మంట పుట్టింది. రాత్రి గడుస్తుంది.
త్యాగరాజు కునుకు పట్టలేదు. అసలు పడుకోలేక పోయాడు.
'ఇప్పుడెక్కడికి వెళ్ళడం ?' అని ఆలోచించాడు.
'బర్మాకు పారిపోదామా, లేక పాకిస్తాను కి వెళ్ళిపోతే?' ఈ దేశంలో అతనెక్కడికి వెళ్ళినా, పోలీసు లతన్ని పట్టుకుంటారు. వాళ్ళ నుంచి తప్పించు కోవడం వీలు కాదు. విదేశానికి వెడితే, భాను ని పిలుచుకుని పోవడానికి వీలవుతుందా? ఆమె ఏం చెయ్యడం?
రాత్రంతా ఇవే ఆలోచనలు త్యాగరాజు కి తెల్లవారింది.
గడియారం ఆరు కొట్టింది. బయటికి వచ్చాడు. సరాసరి పోస్టాఫీసు కి వెళ్లి భాను తండ్రికి ఒక టెలిగ్రాం పంపించాడు. 'మీ అమ్మాయి ఇక్కడే ఉంది. వచ్చి పిలుచుకుని వెళ్ళండి.'
టెలిగ్రాం ఇచ్చిన తరువాత త్యాగరాజు గదికి వెళ్ళలేక పోయాడు. ఒళ్ళు కంపించింది. కాళ్ళు తేలిపోయాయి. నిజాయితీగా జీవిస్తున్న అతనికి తాను చేసిన తప్పు పెద్ద కొండలా కనిపించింది. గుండెను అణిచి వేసింది. అడుగులు తడబడ గా అలాగే సరాసరి పోలీసు స్టేషన్ కి వెళ్లాడు. వాళ్లకు లోబడి పోయాడు త్యాగరాజు.
పోలీసులు కేసుని తీవ్రంగా విచారించారు. హత్యా నేరంలో భానుని కూడా ఇరికించాలని వాళ్ళామెను బెదిరించి చూశారు. కాని, త్యాగరాజు తప్పంతా తనదేనని జరిగిన విషయాలను దాపరికం లేకుండా తెలియజేశాడు.
కోర్టు ముందుకి వచ్చింది కేసు. త్యాగరాజు కి యావజ్జీవ శిక్ష విధించడమయింది.
పాతికేళ్ళు నిండిన త్యాగరాజు ని నేను జైలు లో చూసినప్పుడు, అతని మీద నాకు జాలి కలిగింది. తాను చేసినదంతా సహజమైన ధోరణి లోనాకు వివరించాడు. తన ప్రేమ వ్యవహారాన్ని నవ్వుతూ చెప్పాడు.
హత్యను గురించి చెప్పేటప్పుడు అతనికే విచారం కలిగింది. "మరణం సంభవిస్తుందని నేననుకోలేదు. అతన్ని గాయపరుద్దామనే నా ఉద్దేశ్యం" అన్నాడు. చివరికి దుర్విది తన నీ గతికి తీసుకు వచ్చిందని త్యాగరాజు అన్నప్పుడు అతని కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
భాను ని గురించి నేనడిగిన ప్రతి ప్రశ్నకూ అతను భావోద్వేగంతో బదులు చెప్పాడు. చెప్పినప్పుడల్లా అతని కళ్ళు చెమ్మ గిల్లెవి. భాను ని తలుచుకుని అతను విచారిస్తున్నాడని నేను గ్రహించ గలిగాను.
త్యాగరాజు జైలులో ఏడు సంవత్సరాలు గడిపాడు. ఇప్పుడు అతని కుటుంబం, భాను వాళ్ళ కుటుంబం మధ్య స్నేహం ఏర్పడిందట. భాను ఆ రెండిళ్ళ లోనూ ఉంటున్నది. తరుచుగా త్యాగరాజు కి ఉత్తరాలు వ్రాస్తుంది. రెండు కుటుంబాల వారు అతని విడుదల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆమె వ్రాసింది. ఆమె కూడా ఎంతో ఆశతో వేచి ఉన్నట్టు తెలిపింది.
ఈ విధంగానైనా దూరపు బంధుత్వం గల రెండు కుటుంబాలు-- పేద కుటుంబం ఒకటి, ధనిక కుటుంబం ఒకటి -- ఒకటిగా కలిసినందుకు సంతృప్తి చెందాడు త్యాగరాజు, అయితే, జైలు తలుపులు అతని కోసం ఎన్నడు తెరుచు కుంటాయో మరి!
* * *
